వార్తల్లో వ్యక్తులు

కుషియారా జలాలపై ఒప్పందం

→భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య ఏడు కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్‌లోని సిల్హేట్‌ ప్రాంతాలకు ప్రయోజనకరమని భావిస్తున్న కుషియారా నదీ జలాల పంపకం కూడా ఉంది.
→అలాగే బంగ్లాదేశ్‌ రైల్వే సిబ్బందికి శిక్షణ, అక్కడి ప్రయాణికుల టికెట్, రవాణా వ్యవస్థ కంప్యూటరీకరణకు భారతీయ రైల్వే సహకరించే ఒప్పందంపైనా సంతకాలు జరిగాయి.
→మన దేశంలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌హసీనా హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
→అనంతరం భారత్‌ - బంగ్లా సంబంధాలు రానున్న కాలంలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తాయని పేర్కొంటూ మోదీ, షేక్‌ హసీనా సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
→ఈ సందర్భంగా వారిరువురి సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఏడు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు.

తొలి కేంద్ర - రాష్ట్ర సైన్స్‌ సదస్సులో ప్రధాని మోదీ

→శాస్త్రవేత్తల విషయంలో భారతదేశం దృష్టికోణం మారాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
→తమ శాస్త్రవేత్తల ఘనతలను పశ్చిమ దేశాలు ఘనంగా కీర్తిస్తాయని, ఈ విషయంలో మన సమాజం వెనుకబడి ఉందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
→అహ్మదాబాద్‌లో ప్రారంభమైన తొలి కేంద్ర - రాష్ట్ర సైన్స్‌ సదస్సును ఉద్దేశించి వీడియో లింక్‌ ద్వారా మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మన సంస్కృతిలో సైన్స్‌ భాగం కావాలని పేర్కొన్నారు.
→విజయాలు సాధించిన కళాకారులు, క్రీడాకారులకు ఎలాంటి గుర్తింపునిస్తున్నామో, శాస్త్రవేత్తల ఘనతలకూ అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు.
→అప్పుడే సైన్స్‌ విషయంలో సమాజంలో పేరుకుపోయిన ఉదాసీనత తొలిగిపోతుందని ప్రధాని తెలిపారు.

నిర్ణయాల్లో పారదర్శకత అవసరం

పాకిస్థాన్‌ కేంద్రంగా చెలరేగిపోతున్న ఉగ్రవాదులను నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చి, వారిపై ఆంక్షలు విధించాలన్న తమ ప్రతిపాదనను కొన్ని దేశాలు అకారణంగా పదేపదే అడ్డుకుంటున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆక్షేపించారు. నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు పారదర్శకత అవసరమనీ, ఎలాంటి కారణాలు చూపకుండా ఒక ప్రయత్నాన్ని అడ్డుకోవడం తగదని చెప్పారు. ఉగ్రవాదులపై చర్యల విషయంలో భారత్‌ ప్రయత్నాలకు ఎదురవుతున్న అవరోధాలపై అటు సదస్సులో, ఇటు బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీలో ప్రధానంగా లేవనెత్తినట్లు ఆయన చెప్పారు. సదస్సులో జైశంకర్‌ మాట్లాడుతూ.. రుణాలు, ఆహార సరఫరా, ఇంధన భద్రత వంటి అంశాల్లో జి-20 దేశాలతో కలిసి భారతదేశం పనిచేస్తుందని చెప్పారు. భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రస్తుత ప్రపంచంలో భారత్‌ పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ప్రపంచం భారత్‌ను తృతీయ ప్రపంచ దేశాల గళంగా పరిగణిస్తోందని తెలిపారు. భారత్‌ ఒక వారధి, ఒక గళం, ఒక దృక్కోణం, ఒక దారి అని పేర్కొన్నారు.
ఐరాస భద్రతామండలిలో భారత్, బ్రెజిల్‌లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు రష్యా మద్దతు ప్రకటించింది. ఈ రెండు దేశాలు అంతర్జాతీయంగా కీలకమైనవని పేర్కొంది. సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా మండలిలో మార్పులు జరగాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌ అన్నారు. ఆయనతో జైశంకర్‌ జరిపిన చర్చల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ద్వైపాక్షిక సహకారం, ఉక్రెయిన్‌ యుద్ధం, ఐరాస సంస్కరణలు వంటివి దీనిలో ఉన్నాయి. వివిధ రంగాల్లో ప్రధాన భాగస్వామిగా రష్యా నిలుస్తుందని జైశంకర్‌ చెప్పారు.


ప్రపంచ ఆహార భద్రతకు రూ.23,184 కోట్ల అమెరికా సాయం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సుమారు రూ.23,184 కోట్ల (2.9 బిలియన్‌ డాలర్ల) మానవతా సాయం ప్రకటించారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.

‣ చైనా, భారత్‌లు తమ ప్రయోజనాలను కాంక్షించి పరస్పరం సర్దుబాటు చేసుకునేందుకు అనువైన మార్గాన్ని అన్వేషించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. అలా జరగని పక్షంలో ఈ రెండు ఆర్థిక వ్యవస్థలతో కూడిన ఆసియా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ ప్రధాని డెనిస్‌ ష్మేహాల్‌తో ఆయన భేటీ అయ్యారు. ఉక్రెయిన్, రష్యాలు హింసను విడనాడి దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత వైఖరిని ఆయనకు వివరించారు.

సౌత్‌ ఫస్ట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఆధ్వర్యంలో ‘దక్షిణ్‌ డైలాగ్స్‌ - 2022’ సదస్సు

దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేదని, అధ్యక్ష తరహా పాలన సాగుతోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సౌత్‌ ఫస్ట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఆధ్వర్యంలో దక్షిణ్‌ డైలాగ్స్‌ - 2022 పేరిట హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో భాగంగా సమాఖ్య నిర్మాణంలో న్యాయ వ్యవస్థ పాత్ర, పౌర సమాజ ఉద్యమాల ద్వారా సమాఖ్య వ్యవస్థ బలోపేతం, భారత్‌ సమాఖ్య స్ఫూర్తిని కోల్పోతోందా? అనే అంశాలపై చర్చ సాగింది. రాష్ట్రాలు సమష్టిగా పోరాడాలని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సంధానకర్తగా సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ యామినీ అయ్యర్‌ వ్యవహరించారు.
దక్షిణ్‌ డైలాగ్స్‌ - 2022 చర్చ ముగింపు సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పార్టీలు వేరు కావొచ్చు, సిద్ధాంతాల్లో వైరుధ్యాలు ఉండొచ్చు, అయినా కలిసి జీవించడాన్ని మరిచిపోరాదని, ఇది రాజకీయ నేతలకు తన విన్నపమన్నారు.


షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు

→ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
→ పరస్పరం విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగుదామంటూ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

→ కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ సంక్షోభాల వల్ల అంతర్జాతీయంగా సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.

సంక్షోభ పరిష్కారానికి చిరుధాన్యాలు

→పౌరులకు ఆహార భద్రత కల్పించడమన్నది ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. చిరు ధాన్యాల సాగు, వినియోగం ద్వారా దాన్ని అధిగమించొచ్చు. వాటిలో అద్భుత పోషక విలువలుంటాయి. ఎస్‌సీవో సభ్య దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాటిని వేల ఏళ్లుగా పండిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మెరుగైన ప్రత్యామ్నాయాలవని పేర్కొన్నారు. చిరుధాన్యాల ఆహారోత్సవాన్ని నిర్వహించే అవకాశాన్ని ఎస్‌సీవో పరిశీలించాలని సూచించారు.

→ప్రత్యేక కార్య బృందాల ఏర్పాటుకు సిద్ధం
ప్రస్తుతం మా దేశంలో 70 వేలకుపైగా అంకుర పరిశ్రమలున్నాయి. వాటిలో 100కుపైగా సంస్థలు ఇప్పటికే వంద కోట్ల డాలర్ల మార్కును అందుకున్నాయి. ఈ రంగంలో మా అనుభవాలను ఎస్‌సీవో సభ్య దేశాలతో పంచుకునేందుకు అంకుర పరిశ్రమలు, నవకల్పనలపై ప్రత్యేక కార్య బృందాన్ని ఏర్పాటు చేసేందుకు మేం సిద్ధమని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించండి

ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని ఆయనకు సూచించారు. సదస్సులో అక్కడే పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమయ్యాక వారిద్దరూ నేరుగా సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు సమాలోచనలు జరిపారు.

మోదీతో భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌ సమావేశం

→భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

→ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, వాటి బలోపేతంపై వారిద్దరూ చర్చించారు. భూటాన్‌ రాజుతో సుహృద్భావ సమావేశం జరిగింది.

→భారత్‌ - భూటాన్‌ల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు వివిధ అంశాలపై చర్చించామని మోదీ తన ట్వీట్‌లో వెల్లడించారు.


జపాన్‌ ప్రధానితో జైశంకర్, రాజ్‌నాథ్‌ సమావేశం

→భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదతో సమావేశమయ్యారు.

→ప్రాంతీయ శాంతి, స్థిరత్వాల కోసం రెండు దేశాల నడుమ విధాన, ప్రయోజనాలపరంగా సన్నిహిత సంబంధాల ఆవశ్యకతపై వీరు చర్చించారు.

→ఇండియా, జపాన్‌ దేశాల మధ్య పటిష్ఠమైన భాగస్వామ్యం ఏర్పడటం రెండు దేశాలకూ ప్రయోజనకరమని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు.

→ఇండో - పసిఫిక్‌ రీజియన్‌తో పాటు ప్రపంచ కోణంలోనూ ఇది మంచి పరిణామమని తెలిపారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి 2 + 2 ద్వైపాక్షిక చర్చలకు ఆయన హాజరయ్యారు.

→జపాన్‌ వైపు నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హయాషి యోషిమాస, రక్షణ మంత్రి హమద యసుకాజు వీరితో భేటీ అయ్యారు. వివిధ కోణాల్లో దైపాక్షిక సహకార ప్రగతిని సమీక్షించాం.

→సమకాలీన ప్రాంతీయ, భౌగోళిక అంశాలపై చర్చించాం. ఈ చర్చలను మరింత విస్తృతపరచాలన్న అవగాహనకు వచ్చాం. మా చర్చలు వ్యూహాత్మకంగా సాగాయి’ అని వెల్లడించారు.