వార్తల్లో ప్రాంతాలు

దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎం.శ్రీనివాస్, దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి ఎదిగిన మూడో ప్రముఖుడిగా నిలిచారు. ఈయన నియామకానికి కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న రణ్‌దీప్‌ గులేరియా పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కేంద్రం కొత్త డైరెక్టర్‌ను నియమించింది. శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ‣ ఆయన తర్వాత ఆ సంస్థ 16వ డైరెక్టర్‌గా డాక్టర్‌ శ్రీనివాస్‌ బాధ్యతలు చేపడతారు. ఇది వరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉలిమిరి రామలింగస్వామి, రాజమహేంద్రవరానికి చెందిన పనంగిపల్లి వేణుగోపాల్‌ తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌లుగా సేవలందించారు.

ఆశా పరేఖ్‌కు ‘దాదాసాహెబ్‌’ అత్యున్నత పురస్కారం

1960 - 70 దశకాల్లో హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక ఆశా పరేఖ్‌. అలనాటి ఈ సౌందర్యరాశికి సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును 2020 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1942లో జన్మించిన ఆశా 1952లో ‘ఆస్మాన్‌’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కథానాయికగా నటించిన తొలిచిత్రం ‘దిల్‌ దేకే దేఖో’ (1959) ఘన విజయం సాధించడంతో నటిగా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై’, ‘ఫిర్‌ వహీ దిల్‌ లాయాహూ’, ‘లవ్‌ ఇన్‌ టోక్యో’, ‘దో బదన్‌’, ‘ఆయే దిన్‌ బహార్‌ కే’, ‘ఆయా సావన్‌ ఝూమ్‌కే’, ‘కటీ పతంగ్‌’ లాంటి చిత్రాలతో స్టార్‌ కథానాయికగా ఎదిగారు. రాజేశ్‌ఖన్నాతో కలిసి నటించిన ‘ఆన్‌ మిలో సజనా’ చిత్రంలోని ‘అచ్ఛాతో హమ్‌ చల్తేహై’ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్‌. ఆశా నటించిన దాదాపు వంద సినిమాల్లో అత్యధికం వాణిజ్యపరంగా విజయవంతమైనవే. ఇందులో ఇరవైకి పైగా చిత్రాలు సిల్వర్, గోల్డెన్‌జూబ్లీలు ఆడటంతో ఆమెను ‘జూబ్లీ గర్ల్‌’ అని పిలిచేవారు. కేంద్ర ప్రభుత్వం 1992లో ఆశాను పద్మ శ్రీ పురస్కారంతో గౌరవించింది. సెన్సార్‌ బోర్డుకు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన తొలి మహిళగా ఈమె నిలిచారు. అలనాటి యువత మనసులు దోచిన ఆశా పరేఖ్‌ అవివాహితగానే మిగిలిపోయారు. సెప్టెంబరు 30న జరిగే 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈమెకు అవార్డు అందజేస్తారు.

టైమ్స్‌ 100 వర్థమాన నాయకుల జాబితాలో ఆకాశ్‌ అంబానీ

అమెరికా న్యూస్‌ మ్యాగజీన్‌ టైమ్స్, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది వర్థమాన నాయకులతో రూపొందించిన జాబితాలో రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. ‘టైమ్‌ 100 నెక్ట్స్‌’ జాబితాలో స్థానం పొందిన భారతీయుడు ఆయన ఒక్కడే. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్, సమాజ సేవలో ఉన్న 100 మంది వర్థమాన నాయకులను టైమ్స్‌ ఈ జాబితాలో చేర్చింది. భారత సంతతికి చెందిన అమెరికన్‌ ఓన్లీఫ్యాన్స్‌ అధిపతి ఆమ్రపాలి గన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ ఇండియా కుబేరుల జాబితాలో ఎకొలైట్‌ వ్యవస్థాపకుడు లీలాకుమార్‌

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎకొలైట్‌ డిజిటల్‌ అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన లీలాకుమార్‌ కాజ, తెలుగు రాష్ట్రాల నుంచి ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా కుబేరుల జాబితా - 2022’ లో తొలిసారిగా స్థానం సంపాదించారు. రూ.3,600 కోట్ల సంపదతో ఆయన ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొదటి సారిగా ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారిలో’ రెండో స్థానంలో నిలిచారు. 2007లో ఏర్పాటైన ఎకొలైట్‌ డిజిటల్‌లో 3,000 మందికి పైగా ఐటీ నిపుణులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు మనదేశంలో హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైలలో ఈ సంస్థ కేంద్రాలున్నాయి.

38 కోట్ల ఏళ్ల నాటి గుండె శిలాజం లభ్యం

కోట్ల సంవత్సరాల కిందట సాగరాల్లో నివసించిన ప్లాసోడెర్మ్‌ అనే జలచరానికి సంబంధించిన గుండె శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అవయవం 38 కోట్ల ఏళ్ల నాటిదని వారు పేర్కొన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలో సున్నపురాయి గనిలో ఇది కనిపించింది. వెన్నెముక జీవులకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన శిలాజమని శాస్త్రవేత్తలు తెలిపారు. డెవోనియన్‌ కాలం (41.9 నుంచి 35.9 కోట్ల ఏళ్ల కిందట)లో సముద్రాలు, నదులు, సరస్సుల్లో ప్లాసోడెర్మ్‌లు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఆ తర్వాత అవి అంతరించిపోయాయి. జంతువుల్లో మొదట దవడ, పళ్లు, జంట కపాల ఎముకలు ఎప్పుడు ఆవిర్భవించాయన్నది ప్లాసోడెర్మ్‌లే వెలుగులోకి తెచ్చాయి. తాజాగా గుర్తించిన గుండె శిలాజంతో వెన్నెముక జంతువుల పరిణామక్రమం గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

వరంగల్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

అంతర్జాతీయ వేదికపై ఖ్యాతిని సంపాదిస్తూ వరంగల్‌ నగరం మెరిసింది. ఈ మేరకు యునెస్కో ‘గ్లోబల్‌ నెట్వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ (జీఎన్‌ఎల్‌సీ)’కు ఎంపికైంది. తాజాగా 44 దేశాల నుంచి 77 నగరాలకు ఈ గుర్తింపునివ్వగా ఇందులో మన దేశం నుంచి 3 మాత్రమే ఉన్నాయి. వరంగల్‌తో పాటు కేరళలోని త్రిశూర్, నీలాంబుర్‌ నగరాలు ఈ ఘనత సాధించాయి. యునెస్కో అనుబంధ సంస్థల్లో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌’ ఒకటి. ఈ సంస్థ ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా 294 నగరాలను ‘జీఎన్‌ఎల్‌సీ’లోకి గుర్తించి అక్కడ విద్యాభివృద్ధికి చేయూతనిస్తోంది. ఇలా గుర్తింపునిచ్చిన నగరాల్లో ఆన్‌లైన్‌ శిక్షణ, కార్యశాలలు, వయోజన విద్యా కార్యక్రమాలు, వెబినార్లను నిర్వహిస్తోంది. అక్షరాస్యత, విద్య నిరంతర అధ్యయనానికీ కృషి చేస్తోంది. ‣ యునెస్కో జీఎన్‌ఎల్‌సీకి 2021 ఆగస్టులో దరఖాస్తులను ఆహ్వానించగా వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఈ పోటీలో నిలిచింది. ఈ మేరకు దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేయగా.. కేంద్రం యునెస్కో పోటీకి పంపింది. జీఎన్‌ఎల్‌సీకి ఎంపిక కావడానికి అనేక అంశాలను పరిశీలిస్తారు. వారసత్వ నగరమైన వరంగల్‌కు ఏటా 30 లక్షల మంది వరకు పర్యాటకులు వస్తున్నారు. దేశంలోనే గొప్ప సందర్శనీయ స్థలాల్లో ఒకటిగా నిలుస్తోంది. పచ్చని వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు ఓపెన్‌ జిమ్‌ల వంటివి ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మహా నగరపాలక సంస్థ పిల్లలు, మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రాన్స్‌జెండర్లకూ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారు గౌరవప్రదంగా జీవనం సాగించేందుకు సౌకర్యాలను కల్పిస్తోంది. ఆకర్షణీయ నగరం పథకంలో భాగంగా అద్భుతమైన గ్రంథాలయాలు నిర్మించి ఇక్కడి విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ వరంగల్‌ నగరాన్ని జీఎన్‌ఎల్‌సీకి ఎంపిక చేశారు.

కేసారంలో మానవ రూప శిలల గుర్తింపు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేసారంలో పెదరాతి యుగం నాటి మానవ రూప స్మారక శిలలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. చాలా అరుదుగా కనిపించే క్రీ.పూ.1,800 సంవత్సరాల క్రితం శిలలను బృందం సభ్యుడు కుండె గణేశ్‌ గుర్తించారు. ఈ స్మారక శిలలు ఆరడుగుల ఎత్తు, 4.4 అడుగుల వెడల్పుతో, గుండ్రటి తల, దీర్ఘచతురస్రాకారపు ఛాతీ భాగం, భుజాలు, కిందికి నడుము భాగం పోల్చుకునేలా ఉన్నాయి. సమాధులు, స్మారక శిలలను నిలిపే ఆచారాలు గోండులు, గదబలు, కురుంబలు, నాగులు, సవరలు వంటి గిరిజన సమూహాల్లో ఉంది. కర్ణాటకలోని బళ్లారిలో, తమిళనాడులోని ఉత్తర ఆర్కాటులో ఇలాంటి స్మారకశిలలు లభించాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ హరగోపాల్‌ వివరించారు.