వార్తల్లో వ్యక్తులు

దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎం.శ్రీనివాస్, దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి ఎదిగిన మూడో ప్రముఖుడిగా నిలిచారు. ఈయన నియామకానికి కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న రణ్‌దీప్‌ గులేరియా పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కేంద్రం కొత్త డైరెక్టర్‌ను నియమించింది. శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ‣ ఆయన తర్వాత ఆ సంస్థ 16వ డైరెక్టర్‌గా డాక్టర్‌ శ్రీనివాస్‌ బాధ్యతలు చేపడతారు. ఇది వరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉలిమిరి రామలింగస్వామి, రాజమహేంద్రవరానికి చెందిన పనంగిపల్లి వేణుగోపాల్‌ తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌లుగా సేవలందించారు.

ఆశా పరేఖ్‌కు ‘దాదాసాహెబ్‌’ అత్యున్నత పురస్కారం

1960 - 70 దశకాల్లో హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక ఆశా పరేఖ్‌. అలనాటి ఈ సౌందర్యరాశికి సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును 2020 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1942లో జన్మించిన ఆశా 1952లో ‘ఆస్మాన్‌’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కథానాయికగా నటించిన తొలిచిత్రం ‘దిల్‌ దేకే దేఖో’ (1959) ఘన విజయం సాధించడంతో నటిగా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై’, ‘ఫిర్‌ వహీ దిల్‌ లాయాహూ’, ‘లవ్‌ ఇన్‌ టోక్యో’, ‘దో బదన్‌’, ‘ఆయే దిన్‌ బహార్‌ కే’, ‘ఆయా సావన్‌ ఝూమ్‌కే’, ‘కటీ పతంగ్‌’ లాంటి చిత్రాలతో స్టార్‌ కథానాయికగా ఎదిగారు. రాజేశ్‌ఖన్నాతో కలిసి నటించిన ‘ఆన్‌ మిలో సజనా’ చిత్రంలోని ‘అచ్ఛాతో హమ్‌ చల్తేహై’ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్‌. ఆశా నటించిన దాదాపు వంద సినిమాల్లో అత్యధికం వాణిజ్యపరంగా విజయవంతమైనవే. ఇందులో ఇరవైకి పైగా చిత్రాలు సిల్వర్, గోల్డెన్‌జూబ్లీలు ఆడటంతో ఆమెను ‘జూబ్లీ గర్ల్‌’ అని పిలిచేవారు. కేంద్ర ప్రభుత్వం 1992లో ఆశాను పద్మ శ్రీ పురస్కారంతో గౌరవించింది. సెన్సార్‌ బోర్డుకు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన తొలి మహిళగా ఈమె నిలిచారు. అలనాటి యువత మనసులు దోచిన ఆశా పరేఖ్‌ అవివాహితగానే మిగిలిపోయారు. సెప్టెంబరు 30న జరిగే 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈమెకు అవార్డు అందజేస్తారు.

టైమ్స్‌ 100 వర్థమాన నాయకుల జాబితాలో ఆకాశ్‌ అంబానీ

అమెరికా న్యూస్‌ మ్యాగజీన్‌ టైమ్స్, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది వర్థమాన నాయకులతో రూపొందించిన జాబితాలో రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. ‘టైమ్‌ 100 నెక్ట్స్‌’ జాబితాలో స్థానం పొందిన భారతీయుడు ఆయన ఒక్కడే. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్, సమాజ సేవలో ఉన్న 100 మంది వర్థమాన నాయకులను టైమ్స్‌ ఈ జాబితాలో చేర్చింది. భారత సంతతికి చెందిన అమెరికన్‌ ఓన్లీఫ్యాన్స్‌ అధిపతి ఆమ్రపాలి గన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ ఇండియా కుబేరుల జాబితాలో ఎకొలైట్‌ వ్యవస్థాపకుడు లీలాకుమార్‌

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎకొలైట్‌ డిజిటల్‌ అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన లీలాకుమార్‌ కాజ, తెలుగు రాష్ట్రాల నుంచి ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా కుబేరుల జాబితా - 2022’ లో తొలిసారిగా స్థానం సంపాదించారు. రూ.3,600 కోట్ల సంపదతో ఆయన ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొదటి సారిగా ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారిలో’ రెండో స్థానంలో నిలిచారు. 2007లో ఏర్పాటైన ఎకొలైట్‌ డిజిటల్‌లో 3,000 మందికి పైగా ఐటీ నిపుణులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు మనదేశంలో హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైలలో ఈ సంస్థ కేంద్రాలున్నాయి.

40 ఏళ్లలోపు కుబేరుల్లో జెరోధా నిఖిల్‌ కామత్‌కు అగ్రస్థానం

నాలుగు పదుల వయసులోపే, స్వయంకృషితో కుబేరులుగా ఎదిగిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్, హురున్‌ ఇండియా రూపొందించాయి. ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 40 అండ్‌ అండర్‌ సెల్ఫ్‌ మేడ్‌ రిచ్‌ లిస్ట్‌ 2022’ పేరిట ఈ జాబితాను విడుదల చేశాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడైన నిఖిల్‌ కామత్‌ రూ.17,500 కోట్ల నికర సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఓలా వ్యవస్థాపకుడు భవిశ్‌ అగర్వాల్‌ (రూ.11,700 కోట్లు), మీడియా.నెట్‌కు చెందిన దివ్యాంక్‌ తురాఖియా (రూ.11,200) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. 40 ఏళ్ల లోపు వయసు, రూ.1000 కోట్ల సంపద కలిగిన వారితో ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది కొత్తగా 15 మంది చోటు దక్కించుకోగా, అందరూ అంకుర సంస్థల వ్యవస్థాపకులే. ముఖ్యాంశాలు.. ‣ జాబితాలో పిన్న వయస్కుడిగా ఇన్‌స్టంట్‌ గ్రోసరీ యాప్‌ జెప్టో సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్ర నిలిచారు. ఆయన వయసు 19 ఏళ్లు మాత్రమే. ‣ పిన్న వయస్కురాలిగా కాన్‌ఫ్లుయెంట్‌ సహవ్యవస్థాపకురాలు నేహా నర్ఖెడె (37)ఉన్నారు. రూ.4,700 కోట్ల సంపదతో ఆమె 10వ స్థానం దక్కించుకున్నారు. ‣ ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు అలఖ్‌ పాండే, ప్రతీక్‌ మహేశ్వరి తొలిసారి జాబితాలో చోటు పొందారు. 11వ స్థానంలో ఉన్న వీరికి తలో రూ.4000 కోట్ల వ్యక్తిగత సంపద ఉంది. ‣ యువ కుబేరుల్లో 14 మంది బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు. దిల్లీ, ముంబయి నుంచి చెరో 8 మంది స్థానం పొందారు.

కౌన్‌ బనేగా కరోడ్‌పతి-14 రూ.కోటి గెల్చుకున్న కవితా చావ్లా

టీవీ గేమ్‌షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి-14లో మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందిన కవితా చావ్లా అనే గృహిణి రూ.కోటి గెల్చుకున్నారు. 12 తరగతి మాత్రమే చదివిన ఆమె ఈ ఘనత సాధించారు. కుమారుడి తరగతి పుస్తకాలను చదవడం తనకు ఉపయోగపడిందని ఆమె చెప్పారు. తన ప్రైజ్‌మనీని కుమారుడి చదువు కోసం వెచ్చిస్తానని తెలిపారు.

450 టైప్‌రైటర్లతో మ్యూజియం

కరోనా మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌. 110 ఏళ్ల క్రితం ఇదే పేరుతో వచ్చిన ఓ టైప్‌రైటరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తేలికపాటి కరోనా టైప్‌రైటర్‌ను కొనేందుకు ఎంతో మంది ఆసక్తి చూపేవారు. ముఖ్యంగా పోలీసు అధికారులు వీటిని ఎక్కువగా వాడేవారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇందోర్‌లోని మ్యూజియంకు వెళ్లాల్సిందే. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 450 టైప్‌రైటర్లు సేకరించి రాజేశ్‌శర్మ ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. భారత్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, చైనాల్లో తయారైన టైపింగ్‌ యంత్రాలను ఈ ప్రదర్శనశాలలో చూడొచ్చని రాజేశ్‌శర్మ తెలిపారు.