మరణాలు

జాతీయ మహిళా కమిషన్‌ తొలి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్‌ మరణం

ఒడిశా కాంగ్రెస్‌ నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్‌ భార్య జయంతి పట్నాయక్‌ (90) మరణించారు. గంజాం జిల్లా అస్కా పట్టణంలో 1932 ఏప్రిల్‌ 7న జన్మించిన జయంతి 1953లో జె.బి.పట్నాయక్‌ను వివాహం చేసుకున్నారు. బ్రహ్మపుర, కటక్‌ల నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 1992లో ఏర్పాటైన జాతీయ మహిళా కమిషన్‌కు తొలి అధ్యక్షురాలిగా సేవలందించారు. జయంతి పలు ఒడియా మాస, పక్ష, వార పత్రికలకు సంపాదకురాలిగా పనిచేశారు. ప్రముఖ కవి కె.ఎం.మున్షీ సంస్కృతంలో రచించిన పౌరాణిక గ్రంథం ‘కృష్ణావతారం’ను ఒడియాలోకి అనువదించారు.

అమెరికా వెళ్లిన తొలితరం తెలుగు ప్రముఖుడు రత్తయ్య జాస్తి మరణం

అమెరికా వెళ్లిన తొలితరం తెలుగు ప్రముఖుడు రత్తయ్య జాస్తి (94) కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బోడపాడులో 1928లో రత్తయ్య జన్మించారు.అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అక్కడే స్థిరపడి కాలిఫోర్నియాలోని ‘లాక్‌హీడ్‌ మార్టీన్‌’ అనే సంస్థలో ఇంజినీర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. అప్పట్లో ఓడల్లో ప్రయాణించి అమెరికా వెళ్లిన స్థిరపడ్డ తొలి ప్రవాసాంధ్రుల్లో ఆయన ఒకరు. అనేక గుప్తదానాలు చేసిన ఆయన అప్పట్లోనే ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి రూ.కోటి విరాళంగా అందజేశారు.

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (82) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ‘నంది’ అందుకున్న తొలి ఉత్తమ నటుడు అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు కృష్ణంరాజు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు పొందారు. ‘నంది’ అందుకున్న తొలి ఉత్తమ నటుడు ఆయనే కావడం విశేషం. ఉత్తమ సహ నటుడిగా జైలర్‌గారబ్బాయి చిత్రానికీ నంది అందుకున్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం పొందారు. కృష్ణవేణి, భక్తకన్నప్ప, తాండ్రపాపారాయుడు, బిల్లాతో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రాధేశ్యామ్‌ వరకు పలు చిత్రాలు ఆయన సొంత సంస్థ గోపీకృష్ణ మూవీస్‌ నిర్మించినవే. పుస్తక పఠనంపై ఆసక్తి మెండుగా ఉన్న కృష్ణంరాజు దర్శకత్వం కూడా చేయాలని ‘ఒక్క అడుగు’ పేరుతో ఓ కథ సిద్ధం చేసుకున్నారు. భక్తకన్నప్ప సినిమాను ప్రభాస్‌ కథానాయకుడిగా తానే రీమేక్‌ చేయాలని ఉందని కూడా చెప్పేవారు.

తెలుగు వికీపీడియన్‌ ఎల్లంకి భాస్కరనాయుడి మరణం

పదేళ్లుగా తెలుగు వికీపీడియా రచయితగా, విక్షనరీ, వికీసోర్స్‌లలో విశేష సేవలందించిన ఎల్లంకి భాస్కరనాయుడు(75) వృద్ధాప్య సమస్యలతో వనస్థలిపురంలోని తన ఇంటి వద్ద మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఆయన 2011 నుంచి వికీపీడియాలో ఎన్నో రచనలు చేశారు. తెలుగు వికీపీడియాలో రెండు లక్షల పైచిలుకు సవరణలలో 2,500 కొత్త వ్యాసాలను రాయడంతో పాటు, తెలుగు విక్షనరీలో 70 వేలకుపైగా పదాలకు తెలుగు అర్థాలు, వికీకామన్స్‌లో వేలాది బొమ్మలు, వీడియోలు చేర్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. అనేక సదస్సుల్లో పాల్గొని, ఇతర భాషా రచయితలకు మార్గనిర్దేశం చేశారు. చరిత్ర ప్రసిద్ధ హంపి, విజయనగరాలకు సంబంధించిన ఓ ఫ్రెంచి రచనను తెలుగులోకి అనువదించారు. వికీ రచనల ద్వారా అనేక పురస్కారాలు అందుకున్న నాయుడు 2015లో తిరుపతిలో జరిగిన తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవానికి అధ్యక్షులుగా వ్యవహరించారు.

ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానంద మరణం

గుజరాత్‌లోని సుప్రసిద్ధ ద్వారకా పీఠం శంకరాచార్య స్వామీ స్వరూపానంద సరస్వతి (99) మరణించారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పుర్‌లో తన ఆశ్రమంలో గుండెపోటుతో ఆయన మరణించారు. మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లాలో జన్మించిన ఆయన తన తొమ్మిదేళ్ల వయసులోనే ఇంటిని విడిచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని రెండుసార్లు కారాగార శిక్ష కూడా అనుభవించారు. తద్వారా విప్లవాత్మక సాధువుగా పేరొందారు. 1981లో శంకరాచార్య అయ్యారు. గత ఏడాది కాలం నుంచి అస్వస్థతతో ఉన్నారు. శిర్డీ సాయిబాబాను హిందూ దైవంగా భావించరాదంటూ 2014లో స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. 370 రాజ్యాంగ అధికరణం రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలపైనా ఆయన నిర్మొహమాటంగా మాట్లాడేవారు.

పురావస్తుశాస్త్ర దిగ్గజం బి.బి.లాల్‌ మరణం

సీనియర్‌ పురావస్తు శాస్త్రవేత్త, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత బ్రజ్‌ బాసీ లాల్‌ 101 ఏళ్ల వయసులో మరణించారు. ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌గా ప్రసిద్ధుడైన ఈయన 1968 - 72 మధ్య కాలంలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. వృత్తిపరంగా తాను గడించిన అపారమైన అనుభవంతో పుస్తకాలు రాశారు. దేశంలో రామాయణ, మహాభారత ఇతిహాసాలతో ముడిపడి ఉన్న స్థలాలుగా భావిస్తున్న ప్రాంతాల్లో బి.బి.లాల్‌ బృందం జరిపిన తవ్వకాలు అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, కొన్నిసార్లు వివాదాలకు కూడా దారి తీశాయి. అయోధ్యలో ప్రస్తుతం రామాలయం నిర్మిస్తున్న చోట దాదాపు 50 ఏళ్ల కిందట బి.బి.లాల్‌ సారథ్యంలో జరిపిన తవ్వకాల్లోనే ఆలయ స్తంభాల వంటివి తొలుత గుర్తించారు. చారిత్రక స్థలాలైన హస్తినాపుర్, దిల్లీలోని పురానా ఖిలాల్లోనూ 1954 - 55 ప్రాంతంలో లాల్‌ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిగాయి.

బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2 మరణం

బ్రిటన్‌ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్‌-2 (96) స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో మరణించారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్ల పాటు మహారాణిగా వ్యవహరించారు. రాణి మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ నూతన రాజుగా, 14 కామన్వెల్త్‌ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. ‣ యావత్‌ ప్రపంచానికి, తరతరాలకూ సుపరిచితురాలు క్వీన్‌ ఎలిజబెత్‌-2. ఆమె పూర్తిపేరు ఎలిజబెత్‌ అలెగ్జాండ్రా మేరీ. డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌ అయిన ప్రిన్స్‌ ఆల్బర్ట్, ఆయన భార్య లేడీ ఎలిజబెత్‌ బోవెస్‌-లియాన్‌ల పెద్ద కుమార్తె. 1926, ఏప్రిల్‌ 21న లండన్‌లో జన్మించారు. తండ్రి మరణంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్, నార్తర్న్‌ ఐర్లండ్‌లకు 1952, ఫిబ్రవరి 6న మహారాణిగా లాంఛనప్రాయ బాధ్యతలు చేపట్టారు. ఏడు దశాబ్దాలకుపైగా పాలించారు. 21 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్‌ దేశాల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. విక్టోరియా రికార్డును బద్దలు కొట్టి... క్వీన్‌ విక్టోరియా పాలన (63 సంవత్సరాల 7 నెలల 2 రోజులు) రికార్డును బద్దలు కొడుతూ బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన రాణిగా 2015లోనే ఎలిజబెత్‌-2 రికార్డు సృష్టించారు. సెప్టెంబరు 8 నాటికి 70 ఏళ్ల 7 నెలల 3 రోజులు పాలించారు. తన హయాంలో 4 వేలకుపైగా చట్టాలకు ఆమె ఆమోదముద్ర వేశారు.

వ్యాపార దిగ్గజం సైరస్‌ మిస్త్రీ దుర్మరణం

వ్యాపార దిగ్గజం, టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. రెండు నెలల వ్యవధిలో వీరి కుటుంబంలో ఇది రెండో పెద్ద విషాదం. జూన్‌లో సైరస్‌ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ మరణించారు. ‣ దేశంలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ వారసుల్లో ఒకరైన సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ హఠాన్మరణం, ఈ గ్రూప్‌కే కాక వ్యాపార ప్రపంచానికే తీరనిలోటని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవిని స్వీకరించడంతోనే సైరస్‌ మిస్త్రీ దేశీయంగా సామాన్యుల్లో సైతం ప్రాచుర్యం పొందారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ ఎంపికే కాదు, ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించిన విధానం కూడా కార్పొరేట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2012 డిసెంబరు 28న రతన్‌ టాటా వారసుడిగా టాటా సన్స్‌ ఛైర్మన్‌గా 44 ఏళ్ల చిన్న వయస్సులోనే మిస్త్రీని ఎంపిక చేసినప్పుడు కార్పొరేట్‌ ప్రపంచం అచ్చెరువొందింది. 2016 అక్టోబరు 24న ఆ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికిన తీరూ పెను సంచలనమే. ‣ 1994లో షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను సైరస్‌ మిస్త్రీ స్వీకరించారు. 2001 సెప్టెంబరు 1న టాటాసన్స్‌ బోర్డులో చేరారు. 2011 నవంబరు కల్లా టాటా గ్రూప్‌లో 18.4 శాతంతో అతిపెద్ద వాటాదారుగా సైరస్‌ మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ మారారు. అప్పుడే టాటా గ్రూప్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ నియమితులవ్వడంతో, తమ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. టాటా గ్రూప్‌ సంస్థల నిర్వహణ తీరులో వినూత్న మార్పులు చేసే క్రమంలో, నాలుగేళ్లలోనే పరిస్థితులు మిస్త్రీకి వ్యతిరేకమయ్యాయి. ఫలితంగా టాటా గ్రూప్‌ తన ఛైర్మన్‌ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది. టాటా గ్రూప్‌ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్‌లో సైరస్‌ మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీకి గొప్ప పలుకుబడి ఉంది. ఆయన్ను అక్కడ ‘ఫాంటమ్‌ ఆఫ్‌ బాంబే హౌú’Ãగా వ్యవహరించేవారు.

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీవీ నారాయణన్‌ మరణం

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, పద్మ భూషణ్‌ అవార్డు గ్రహీత టీవీ శంకర నారాయణన్‌ (77) చెన్నైలో మరణించారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మణి అయ్యర్‌కు ఆయన మేనల్లుడు. మణి అయ్యర్‌తో పలు సంగీత కచేరీలలో పాల్గొన్న వేంబు అయ్యర్‌ కుమారుడే శంకర నారాయణన్‌.

సోవియట్‌ నేత గోర్బచెవ్‌ మరణం

శాంతి దూతగా పేరొందిన సోవియట్‌ యూనియన్‌ (యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌.) చివరి అధ్యక్షుడు గోర్బచెవ్‌ 91 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మాస్కోలోని సెంట్రల్‌ క్లినికల్‌ ఆసుపత్రి ప్రకటించింది. 1985లో సోవియట్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన గోర్బచెవ్‌ దాదాపు ఏడేళ్ల తన పదవీ కాలంలో పలు విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చారు. ఈ సంస్కరణలతో శాంతికాముకుడిగా ప్రపంచ దేశాలు ఆయనను కీర్తించినా, సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానికి అవే కారణమయ్యాయి. అధికార పీఠంపై చివరి దశలో ఆయన పతనం అవమానకరంగా సాగింది. 1991 ఆగస్టులో జరిగిన తిరుగుబాటు ప్రయత్నంతో గోర్బచెవ్‌ ప్రభ క్రమంగా తగ్గింది. సోవియట్‌ యూనియన్‌లోని ఒక్కో రిపబ్లిక్‌ స్వాతంత్య్రం ప్రకటించుకొని విడిపోతూ ఉండగా 1991 డిసెంబరు 25న తన పదవికి రాజీనామా చేసేదాకా మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉండాల్సి వచ్చింది. అగ్ర రాజ్యాల నడుమ ప్రచ్ఛన్నయుద్ధ నివారణకు చేసిన కృషికి గుర్తింపుగా 1990లో గోర్బచెవ్‌ను నోబెల్‌ శాంతి బహుమతి వరించింది.

రష్యా చమురు దిగ్గజం రావిల్‌ మరణం

రష్యాలో అతిపెద్ద ప్రైవేటు చమురు కంపెనీ ‘ల్యూక్‌ఆయిల్‌’ ఛైర్మన్‌ రావిల్‌ మాగనోవ్‌ మరణించారు. ఆయన ఒక ఆసుపత్రి కిటికీ నుంచి కింద పడి మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. తీవ్ర అనారోగ్యంతో రావిల్‌ మరణించారని కంపెనీ పేర్కొంది.