నియామకాలు

త్రిదళాధిపతిగా అనిల్‌ చౌహాన్‌ బాధ్యతల స్వీకరణ

భారత నూతన త్రిదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ - సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన తొమ్మిది నెలల తరవాత నియమితులైన అనిల్‌ చౌహాన్, ఇక నుంచి భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా కొనసాగనున్నారు. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ ఆయన విధులు నిర్వర్తించనున్నారు.

ఐఏఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఇస్రో శాస్త్రవేత్త అనిల్‌ కుమార్‌

ఇస్రో శాస్త్రవేత్త ఎ.కె.అనిల్‌ కుమార్‌ అంతర్జాతీయ వ్యోమగామ సమాఖ్య (ఐఏఎఫ్‌) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) అసిస్టెంట్‌ డైరెక్టరుగా పని చేస్తున్నారు. 1951లో స్థాపించిన ఐఏఎఫ్‌లో 72 దేశాలకు చెందిన 433 మంది సభ్యులున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల మధ్య సమన్వయం, సాంకేతిక వినిమయానికి ఐఏఎఫ్‌ కృషి చేస్తుందని ఇస్రో ప్రకటించింది.

త్రిదళాధిపతిగా అనిల్‌ చౌహాన్‌

భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (61) నియమితులయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన పదవిలో కొనసాగుతారని తెలిపింది. సీడీఎస్‌ హోదాలో దేశ మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ ఆయన విధులు నిర్వర్తించనున్నారు. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2021 డిసెంబరులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించినప్పటి నుంచి త్రిదళాధిపతి పదవి ఖాళీగా ఉన్న సంగతి గమనార్హం. ‣ విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అపార అనుభవశాలి. దాదాపు 4 దశాబ్దాల తన కెరీర్‌లో అనేక హోదాల్లో పనిచేశారు. ఆయన ఉత్తరాఖండ్‌లో 1961 మే 18న జన్మించారు. మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలో గల జాతీయ డిఫెన్స్‌ అకాడమీ, దేహ్రాదూన్‌లోని భారత మిలిటరీ అకాడమీల్లో చదువుకున్నారు. 1981లో సైన్యంలోని 11 గోర్ఖా రైఫిల్స్‌లో చేరడంతో సర్వీసు ప్రారంభమైంది. 2021 మేలో ఈస్టర్న్‌ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నప్పుడు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ నేతృత్వంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్‌ఎస్‌సీఎస్‌)లో సైనిక సలహాదారుడిగా చౌహాన్‌ ఉన్నారు. పదవీ విరమణ పొందిన ఓ త్రీస్టార్‌ అధికారి, ఫోర్‌స్టార్‌ హోదా (సీడీఎస్‌గా)లో క్రియాశీల సర్వీసులో తిరిగి చేరడం ఇదే తొలిసారి కానుంది. ‘ఆఫ్టర్‌మాథ్‌ ఆఫ్‌ ఎ న్యూక్లియర్‌ అటాక్‌’ పేరుతో చౌహాన్‌ రాసిన పుస్తకం 2010లో ప్రచురితమైంది. 11 గోర్ఖా రైఫిల్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ చరిత్ర కూడా ఆయన రాశారు. ఈస్టర్న్‌ కమాండ్‌లో దీర్ఘకాలం పాటు సేవలందించిన అనిల్‌ చౌహాన్‌కు చైనా వ్యవహారాల నిపుణుడిగా పేరుంది.

అటార్నీ జనరల్‌గా ఆర్‌.వెంకటరమణి

అటార్నీ జనరల్‌ (ఏజీఐ)గా సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అటార్నీ జనరల్‌గా ఉన్న కే.కే.వేణుగోపాల్‌ పదవీ కాలం సెప్టెంబరు 30వ తేదీతో ముగుస్తుండడంతో ఆయన స్థానంలో వెంకటరమణిని నియమించారు. ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. తమిళనాడుకు చెందిన వెంకటరమణి 2010లో లా కమిషన్‌ సభ్యునిగా సేవలందించారు. గత 12 ఏళ్లుగా ఆయన సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక సీనియర్‌ న్యాయవాదిగా, కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సీనియర్‌ న్యాయవాదిగా పని చేస్తున్నారు.

గువాహటి బయోటెక్‌ పార్క్‌ సలహాదారుగా బీపీ ఆచార్య

అస్సాంలోని గువాహటిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బయోటెక్‌ పార్కుకు సలహాదారుగా తెలంగాణ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య నియమితులయ్యారు. ఈ మేరకు అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఛైర్మన్‌గా సి.ఎస్‌.రాజన్‌

రుణ పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డులో మార్పు చేర్పులను ప్రభుత్వం చేపట్టింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడిగా ఉన్న సి.ఎస్‌.రాజన్‌కు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదా కల్పించారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నంద్‌ కిశోర్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. పలు ఆర్థిక అవకతవకలు వెలుగు చూడటంతో 2018 అక్టోబరులో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అప్పటి బోర్డును కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ రద్దు చేసి, బోర్డులో కొత్త సభ్యులను నియమించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో 347 సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 246 సంస్థలు దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. సుమారు నాలుగేళ్లుగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డుకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్‌ కోటక్‌ పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగిసింది. అప్పటి నుంచి ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరుగా రాజన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన హోదాను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మార్పు చేసింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చి, 2023 మార్చి వరకు వర్తిస్తాయి. ప్రస్తుతం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డులో ఐదుగురు సభ్యులు రాజన్, కిశోర్, జి.సి.చతుర్వేది, మాలిని శంకర్, ఎన్‌.శ్రీనివాసన్‌ ఉన్నారు. వీరిలో చతుర్వేది పదవీ కాలం సెప్టెంబరు 30న ముగియనుంది.

ఐ4సీ సీఈఓగా ఐజీ రాజేశ్‌కుమార్‌

సైబర్‌ నేరాలపై పోరులో తెలంగాణ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి రాజేశ్‌కుమార్‌కు కీలక స్థానం దక్కింది. కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో పనిచేసే ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) సీఈఓగా నియమితులయ్యారు. కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆయన నియామకాన్ని ఆమోదించడంతో ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. డిప్యుటేషన్‌పై మూడేళ్లు అక్కడ పనిచేయనున్నారు. తెలంగాణ కేడర్‌లో సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న (టెక్‌సావీ) అధికారిగా రాజేశ్‌కుమార్‌కు గుర్తింపు ఉంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆయన ఖరగ్‌పూర్‌ ఐఐటీ (1992 - 96)లో బీటెక్‌ పూర్తిచేశారు. 2002 బ్యాచ్‌ ఐపీఎస్‌గా తెలంగాణ కేడర్‌కు ఎంపికయ్యారు. వరంగల్, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో ఎస్పీగా, హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీగా పనిచేశారు. 2016లో డీఐజీగా పదోన్నతి పొంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించే కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐసెల్‌) బాధ్యతలు స్వీకరించారు. 2020లో ఐజీగా పదోన్నతి పొందారు.

ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రాజీవ్‌ బహల్‌

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిగా డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ తెలిపింది. బహల్‌ చిన్న పిల్లల వైద్య నిపుణులు. ప్రజారోగ్య విభాగంలో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థలో శిశు, కౌమారదశ పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. మాతాశిశు ఆరోగ్యంపై పరిశోధనలను పర్యవేక్షిస్తున్నారు.

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా కె.రాజప్రసాద్‌ రెడ్డి

ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా కె.రాజప్రసాద్‌ రెడ్డి (సాక్షి) ఎన్నికయ్యారు. హిందీ పత్రిక ‘ఆజ్‌ సమాజ్‌’లో పనిచేస్తున్న రాకేశ్‌శర్మ డిప్యూటీ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపడతారు. ‘మాతృభూమి’ ఆరోగ్య పత్రికకు చెందిన ఎం.వి.శ్రేయమ్స్‌ కుమార్‌ వైస్‌ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. సొసైటీ 83వ వార్షిక సమావేశంలో ఈ ఎన్నికలు జరిగినట్లు ఐఎన్‌ఎస్‌ తెలిపింది. తన్మయ్‌ మహేశ్వరి (అమర్‌ ఉజాలా) కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీడియో కాన్ఫరెన్సు, ఇతర మాధ్యమాల ద్వారా ఈ వార్షిక సమావేశం జరిగింది. 41 మందితో కూడిన ఐఎన్‌ఎస్‌ కార్యనిర్వాహక సంఘంలో మోహిత్‌ జైన్‌ (ది ఎకనమిక్‌ టైమ్స్‌), వివేక్‌ గోయెంకా (ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌), జయంత్‌ మమ్మేన్‌ మాథ్యూ (మలయాళ మనోరమ), అతిదేబ్‌ సర్కార్‌ (ది టెలిగ్రాఫ్‌), కె.ఎన్‌.తిలక్‌కుమార్‌ (డెక్కన్‌ హెరాల్డ్‌ అండ్‌ ప్రజావాణి) సభ్యులుగా ఉన్నారు.

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా సంధ్యా పురేచా

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా సంధ్యా పురేచా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈమె అయిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. మహారాష్ట్రకు చెందిన ఈమె సుప్రసిద్ధ నృత్య కళాకారిణి. 35 ఏళ్ల పాటు ముంబయిలోని కళాపరిచయ ఇన్‌స్టిట్యూట్‌లో నాట్య శాస్త్రంలో బోధించారు. ఈమె వద్ద సుమారు 5 వేల మంది నాట్య కళాభ్యాసం చేశారు.

పీఎం కేర్స్‌ ఫండ్‌ ట్రస్టీగా రతన్‌ టాటా, కె.టి.థామస్, కరియా ముండాలకూ చోటు

టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాను పీఎం-కేర్స్‌ ఫండ్‌ ట్రస్టీగా నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె.టి.థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కరియా ముండాలను కూడా ట్రస్టీలుగా నామినేట్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల మీటింగ్‌ జరిగింది. కొత్తగా నియమించిన సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే పీఎం కేర్స్‌లో హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్రస్టీలుగా ఉన్నారు. మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మహర్షి, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి, టెక్‌ ఫర్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు ఆనంద్‌షాను పీఎం కేర్స్‌ సలహా బోర్డులోకి ఎంపిక చేశారు. 2020లో కొవిడ్‌ వ్యాప్తి మొదలైన సమయంలో పీఎం కేర్స్‌ను ప్రారంభించారు.

ఏబీసీ ఛైర్మన్‌గా ప్రతాప్‌ పవార్‌

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) ఛైర్మన్‌గా 2022 - 23 కాలానికి ప్రతాప్‌ పవార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక సకల్‌ను ప్రచురించే సకల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా పవార్‌ వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు పుణెలో ది మహరట్టా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీస్‌ అండ్‌ అగ్రికల్చర్‌ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల బోర్డుల్లో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఏబీసీ డిప్యూటీ ఛైర్మన్‌గా ఆర్‌కే స్వామి ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్, ఎండీ శ్రీనివాసన్‌ కె స్వామి ఎన్నికయ్యారు. బ్యూరో కౌన్సిల్‌లో సభ్యులుగా రియాద్‌ మాథ్యూ (మలయాళ మనోరమ), హార్‌ముస్జీ ఎన్‌.కమా (ది బాంబే సమాచార్‌), శైలేశ్‌ గుప్తా (జాగరణ్‌ ప్రకాశన్‌), ప్రవీణ్‌ సోమేశ్వర్‌ (హెచ్‌టీ మీడియా), మోహిత్‌ జైన్‌ (బెనెట్, కోల్‌మన్‌), ధ్రుబా ముఖర్జీ (ఏబీపీ), కరణ్‌ దర్దా (లోక్‌మత్‌ మీడియా) వ్యవహరిస్తారు. ‣ ప్రకటనల ఏజెన్సీ ప్రతినిధులుగా శ్రీనివాసన్‌ కె స్వామి (డిప్యూటీ ఛైర్మన్‌), విక్రమ్‌ సఖూజా, గౌరవ కోశాధికారి (మాడిసన్‌ కమ్యూనికేషన్స్‌), శశిధర్‌ సిన్హా (ఐపీజీ మీడియా బ్రాండ్స్‌), ప్రశాంత్‌ కుమార్‌ (గ్రూప్‌ ఎం మీడియా ఇండియా) ఉంటారు. ‣ ప్రకటనదారుల ప్రతినిధులుగా దేబబ్రాత ముఖర్జీ (యునైటెడ్‌ బ్రూవరీస్‌), కరుణేశ్‌ బజాజ్‌ (ఐటీసీ), అనిరుద్ధ హల్దార్‌ (టీవీఎస్‌ మోటార్‌), శశాంక్‌ శ్రీవాస్తవ (మారుతీ సుజుకీ), సెక్రటరీ జనరల్‌గా హర్‌ముజ్‌ మసానీ వ్యవహరించనున్నారు.

సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు సభ్యునిగా రఘునందన్‌రావు

సెంట్రల్‌ సిల్క్‌బోర్డు సభ్యుడిగా తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌ రావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ సిఫార్సు మేరకు ఆయనను నియమించినట్లు పేర్కొంది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు అధికారులనూ ఇందులో సభ్యులుగా నియమించారు.

ఐఆర్‌డీఏఐ సభ్యుడిగా దేవాశియా

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ సభ్యుడి (జీవితేతర సంస్థల తరఫున)గా థామస్‌ ఎం దేవాశియాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన కోచిలో మార్ష్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ ఇండియాలో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన వార్షిక ప్యాకేజీగా రూ.4 లక్షలు చెల్లించనుంది.

కాన్సుల్‌ జనరల్‌గా జెన్నిఫర్‌ లార్సన్‌

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో కాన్సుల్‌ జనరల్‌గా జెన్నిఫర్‌ లార్సన్‌ బాధ్యతలు చేపట్టారు. జోయెల్‌ రీఫ్మాన్‌ పదవీ విరమణతో ఆయన స్థానంలో అమెరికా ప్రభుత్వం జెన్నిఫర్‌ను నియమించింది. ఆమె హైదరాబాద్‌ చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. రాయబార వ్యవహారాల్లో సుమారు 19 సంవత్సరాల అనుభవమున్న జెన్నిఫర్‌ 2016 నుంచి 2020 వరకు ముంబయిలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో డిప్యూటీ ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌గా విధుల్లో ఉన్నారు. హైదరాబాద్‌కు రావటానికి ముందు వరకు వాషింగ్టన్‌లో భారతీయ వ్యవహారాల యాక్టింగ్‌ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అమెరికా - ఇండియా విధాన రూపకల్పన, అమలులోనూ కీలక భూమిక పోషించారు. గతంలో అమె వాషింగ్టన్‌లో తూర్పు ఆఫ్రికా వ్యవహారాల బ్యూరోకు అధికార ప్రతినిధిగా పనిచేశారు. అంతకుముందు లిబియా, పాకిస్థాన్, ఫ్రాన్స్, సుడాన్, జెరూసలేం, లెబనాన్‌లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. కాంపెటిటివ్‌ లిటరేచర్‌ (అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్‌), మధ్య ప్రాచ్య వ్యవహారాలపై యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి పట్టా పొందారు. అమెరికా విదేశీ వ్యవహారాల్లో చేరటానికి ముందు అమెరికాలోని నేషనల్‌ పబ్లిక్‌ రేడియోలో టాక్‌ షో ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.

ఓగిల్వీ గ్లోబల్‌ సీఈఓగా దేవికా బుల్‌చందానీ

ప్రకటనలు, మార్కెటింగ్, ప్రజా సంబంధాల దిగ్గజ సంస్థ ఓగిల్వీ తమ గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా దేవికా బుల్‌చందానీని నియమించుకుంది. ఫలితంగా బహుళ జాతి కంపెనీలను నడిపిస్తున్న భారత సంతతి వ్యక్తుల సరసన ఆమె చేరారు. ఇప్పటివరకు ఓగిల్వీ ఉత్తర అమెరికా గ్లోబల్‌ ప్రెసిడెంట్, సీఈఓగా దేవికా వ్యవహరించారు. ప్రస్తుత గ్లోబల్‌ సీఈఓ యాండీ మెయిన్‌ స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది చివరి వరకు యాండీ మెయిన్‌ సీనియర్‌ సలహాదారుగా సేవలందిస్తారని కంపెనీ తెలిపింది. 93 దేశాల్లో 131 కార్యాలయాల్లో అన్ని సృజనాత్మక నెట్‌వర్క్‌ వ్యాపారాలకు సంబంధించిన అంశాలకు దేవికా బాధ్యత వహించనున్నారు. అంతర్జాతీయ ప్రకటనల, కమ్యూనికేషన్ల గ్రూప్‌ డబ్ల్యూపీపీలో ఓగిల్వీ భాగంగా ఉంది. డబ్ల్యూపీపీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో కూడా దేవికా చేరనున్నారు.

నల్సా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీజేఐ తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించడం సంప్రదాయంగా వస్తోంది. ఆగస్టు 26 వరకు ఈ స్థానంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఉన్నారు. ఆయన సీజేఐగా ప్రమాణం చేయడంతో ఇప్పుడు ఆ బాధ్యతలను జస్టిస్‌ చంద్రచూడ్‌కు అప్పగించారు. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నవంబరు 9న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2024 నవంబరు 10 వరకు కొనసాగుతారు. ఆయన తండ్రి యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జులై 11 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. అత్యంత సుదీర్ఘ కాలం పని చేసిన సీజేఐగా ఆయన పేరిట ఉన్న రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌గా విన్‌ ఓవెన్‌

బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌గా గారెత్‌ విన్‌ ఓవెన్‌ హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని ఆయన కార్యాలయం పేర్కొంది. ఈయన గతంలో రష్యా, ఆర్మేనియా, ఇరాన్, అజర్‌బైజాన్‌లలోని ఫారిన్, కామన్‌వెల్త్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అనిల్‌కుమార్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధిపతిగా బి.అనిల్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆర్‌.శ్రావణ్‌.ఎస్‌.రావు పదవీ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. కేరళకు చెందిన అనిల్‌కుమార్‌ ఆ సంస్థ రిటైల్‌ సేల్స్‌ విభాగం ఈడీగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారు.

నాబార్డ్‌ సీజీఎంగా సుశీల చింతల

తెలంగాణ రాష్ట్ర నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజరు (సీజీఎం)గా సుశీల చింతల గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి సీజీఎంగా విధులు నిర్వహించిన వై.కె.రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సుశీల చింతలను నియమించారు.