జాతీయం

దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ జలప్రవేశం

భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభమైంది. దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ లాంఛనంగా జలప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డులో నిర్వహించిన వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాన్ని ప్రారంభించారు. భారత నైపుణ్యాలు, ప్రతిభకు ఈ యుద్ధనౌక సాక్ష్యంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

‣ వలస పాలన ఆనవాళ్లను చెరిపేస్తూ ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నౌకాదళానికి కొత్త పతాకాన్ని మోదీ ఆవిష్కరించారు.

‣ మన నౌకాదళ చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌక ఇదే. విక్రాంత్‌ జలప్రవేశంతో విమానవాహక నౌకలను సొంతంగా నిర్మించుకోగల సామర్థ్యమున్న అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ వంటి అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ చేరినట్లయింది.

విక్రాంత్‌లోని విశేషాలు:-
‣ క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా నౌకపై 16 పడకలతో చిన్న ఆసుపత్రిని నిర్మించారు. రెండు ఆపరేషన్‌ థియేటర్లు, ప్రయోగశాలలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌ యంత్రం అందులో ఉన్నాయి.

‣ ఎంఎఫ్‌-స్టార్‌ (నావల్‌ రాడార్‌ సిస్టమ్‌), టకాన్‌ (టాక్టికల్‌ ఎయిర్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌), రేజిస్టర్‌-ఇ ఏవియేషన్‌ కాంప్లెక్స్, శక్తి ఈడబ్ల్యూ స్వీట్, డ్రైవర్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ వంటి అత్యాధునిక వ్యవస్థలు విక్రాంత్‌పై ఉన్నాయి.

‣ ఈ నౌకపై విమానాల ల్యాండింగ్‌ ట్రయళ్లు ఈ ఏడాది నవంబరులో ప్రారంభమమై, 2023 మధ్యకల్లా ముగుస్తాయి. తొలుత కొన్నేళ్లపాటు మిగ్‌-29కె యుద్ధ విమానాలనే ఈ యుద్ధనౌకపై మోహరించనున్నారు.

‣ భారత దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో పాటు 100కు పైగా దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి అందిన పరికరాలు, సామగ్రిని విక్రాంత్‌ నిర్మాణంలో ఉపయోగించారు.

‣ ఇండో - పసిఫిక్‌తో పాటు హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరతలను పరిరక్షించడంలో ఈ విమానవాహక నౌక కీలక పాత్ర పోషించనుంది.

నిర్మాణ వ్యయం: రూ.20 వేల కోట్లు
విస్తీర్ణం: రెండు ఫుట్‌బాల్‌ మైదానాలతో సమానం. దీనిలో 18 అంతస్థులున్నాయి. ఒక్క రోజులో 16 వేల చపాతీలు, 6 వేల ఇడ్లీలను సిద్ధం చేయగల సామర్థ్యమున్న కిచెన్‌ ఈ యుద్ధనౌకలో ఉంది.
పొడవు: 262.5 మీటర్లు
వెడల్పు: 62.5 మీటర్లు
బరువు: 42,800 టన్నులు
గరిష్ఠ వేగం: 28 నాట్‌లు
కంపార్ట్‌మెంట్లు: 2,200
ఎంతమంది సిబ్బంది ఉండొచ్చు?: 1,600
ఎన్ని విమానాలు, హెలికాప్టర్లను మోహరించొచ్చు?: 30

నౌకాదళం కోసం సరికొత్త పతాకావిష్కరణ శివాజీకి అంకితం

నౌకాదళానికి సరికొత్త పతాకాన్ని మోదీ ఆవిష్కరించారు. ఇన్నాళ్లూ నౌకాదళం జెండాలో బానిసత్వపు ఆనవాళ్లుండేవి. ఇకపై ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో మన సముద్రజలాల్లో, ఆకాశంలో కొత్త పతాకం సగర్వంగా ఎగురుతుంది. ఈ పతాకాన్ని శివాజీకి అంకితమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

నూతన జెండా విశేషాలివీ..
‣ కొత్త పతాకంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో భారత జాతీయ జెండాను ఉంచారు. కుడి వైపున నీలం, బంగారు వర్ణంలో మెరిసిపోయే అష్టభుజాకారం ఉంది.

‣ అష్టభుజాకారంలో 2 బంగారు వర్ణ బార్డర్లున్నాయి.వాటి లోపల నీలం రంగు మధ్యలో నౌక లంగరు ఆకృతిపై నిల్చున్నట్లుగా జాతీయ చిహ్నం ఉంది. వాటి కింద నౌకాదళ నినాదమైన ‘సమ్‌ నో వరుణః’ అని దేవనాగరి లిపిలో ఉంది. ‘వరుణదేవా.. మాకు శుభం కలిగించు’ అని దాని అర్థం.

‣ అష్టభుజాకారం.. నౌకాదళ బహుళ దిశల పరిధి, కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. లంగరు చిహ్నాన్ని స్థిరత్వానికి గుర్తు. నీలం రంగు నౌకాదళ సముద్ర సామర్థ్యానికి ప్రతీక.

‣ అష్టభుజాకారం చుట్టూ ఉన్న బంగారు రంగు బార్డర్లను శివాజీ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. పతాకంలోని తెలుపురంగు నౌకాదళంలోని నౌకలు, నిర్మాణాలు, ఇతర సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది.


యునెస్కో గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో వరంగల్‌కు చోటు

యునెస్కో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ జాబితాలో వరంగల్‌ చేరినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం హోదా దక్కిన ఏడాదిలోపే ఇప్పుడు వరంగల్‌కు రెండో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.

వందే భారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

మరో పాతికేళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు నగరాలే దోహదం చేస్తాయి. దేశ గమ్యాన్ని ఇవి రూపొందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అహ్మదాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు. గాంధీనగర్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును జెండా ఊపి ప్రారంభించిన మోదీ, అదే రైలెక్కి అహ్మదాబాద్‌ దాకా (దాదాపు 30 కి.మీ.) ప్రయాణించారు. అహ్మదాబాద్‌ నగరంలోని కాలుపుర్‌ రైల్వేస్టేషనులో దిగిన ప్రధాని థల్‌తేజ్‌ - వస్త్రల్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. ఆ తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి థల్‌తేజ్‌ స్టేషను దాకా మెట్రో రైలులోనూ ప్రధాని ప్రయాణించారు.

దేశంలో మూడో వందే భారత్‌ రైలు

గుజరాత్, మహారాష్ట్ర రాజధాని నగరాల మధ్య నడిచే ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దేశంలో మూడవది. గతంలో న్యూదిల్లీ - వారణాసి మార్గంలో తొలి రైలును, న్యూదిల్లీ - శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా మార్గంలో రెండో వందేభారత్‌ రైలును ప్రారంభించారు.

తొలి, మలి సీడీఎస్‌లు ఉత్తరాఖండ్‌ వారే!

నూతన త్రివిధ దళాధిపతి (సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) అనిల్‌ చౌహాన్‌ నియమితులు కావడంతో ఉత్తరాఖండ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇదే రాష్ట్రానికి చెందిన వారు కాగా అనిల్‌ చౌహాన్‌ది కూడా ఉత్తరాఖండ్‌ కావడం. అంతేకాకుండా వారిద్దరిది ఒకే జిల్లా (పౌరి) అవడం విశేషం. రావత్, ఆయన భార్య గతేడాది డిసెంబరులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. కాగా నూతన సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.

దేశ చరిత్రలో తొలిసారిగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణ ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలో తొలిసారిగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. తొలిరోజు సుమారు 7.74 లక్షల మంది విచారణ ప్రక్రియలను వీక్షించారు. ఈ ఏడాది ఆగస్టు 26న అప్పటి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (ఆయన పదవీ విరమణ రోజు) నేతృత్వంలోని కోర్టు కార్యక్రమాలను తొలిసారి లాంఛనంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆపై నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. తాజాగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేశారు. కోర్టు నంబర్‌-1లో సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం, ఈడబ్ల్యూఎస్‌ కోటాపై విచారణ నిర్వహించింది. దాన్ని సుమారు 2.72 లక్షల మంది వీక్షించారు. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నాయకత్వంలోని ధర్మాసనం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, జాతీయ రాజధాని ప్రాంతంలో దిల్లీ ప్రభుత్వం అందించే సేవలపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకున్న శాసన - కార్యనిర్వాహక అధికారాల గురించి విచారణ నిర్వహించింది. ఆ దృశ్యాలను దాదాపు 4 లక్షల మంది తిలకించారు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించగా లక్ష మందికిపైగా చూశారు. మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు ప్రస్తుతమున్న మూడు రాజ్యాంగ ధర్మాసనాలకు తోడు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ ఆధ్వర్యంలో నాలుగో రాజ్యాంగ ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ తాజాగా ఏర్పాటు చేశారు. పెద్దనోట్ల రద్దు, ప్రభుత్వ అధికారులకున్న భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్‌ 194(2) కింద అసెంబ్లీ సభ్యులకున్న మినహాయింపులపై ఈ ధర్మాసనం విచారణ జరపనుంది. అన్ని కోర్టుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఇప్పటివరకు ఏర్పాటైన నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల్లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు స్థానం కల్పించారు.

ముగిసిన ‘జిమెక్స్‌ - 2022’ విన్యాసాలు

విశాఖపట్నం తీరంలో నిర్వహించిన భారత్‌ - జపాన్‌ దేశాల ఆరో విడత మారిటైం విన్యాసాలు - 2022 (జిమెక్స్‌) ముగిసినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ముగింపు వేడుకల్లో భారత నేవీ బృందానికి రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా సారథ్యం వహించగా, జపాన్‌ తరఫున రియర్‌ అడ్మిరల్‌ హిరాత్‌ టొషియుకి కమాండర్‌గా కొనసాగారని వెల్లడించాయి. ఇరు దేశాల నౌకలు నిర్వహించిన వివిధ విన్యాసాలు బహుళ ప్రయోజనకారిగా నిలుస్తాయని తెలిపాయి. ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి.

కర్ణాటకలో మతమార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం

కర్ణాటకలో గత మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా చట్టబద్ధత కల్పించిన మతమార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్తులో ఆమోదం లభించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బలవంతపు మతమార్పిడిని నిషేధించటం, మతాన్ని మార్చుకున్న తర్వాత కూడా పూర్వపు మతంలోని రిజర్వేషన్‌ సదుపాయాన్ని పొందేవారిని నియంత్రించటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని శాసనసభ వ్యవహారాల మంత్రి మాధుస్వామి వివరణ ఇచ్చారు. గత డిసెంబరులో నిర్వహించిన సమావేశాల్లో ఈ బిల్లు విధాన సభలో ఆమోదం పొందినా అధికార పక్షానికి విధాన పరిషత్తు (మండలి)లో తగిన సంఖ్యా బలం లేక ప్రవేశ పెట్టలేకపోయింది. ఉప ఎన్నికల తర్వాత మండలిలోనూ అధికార పక్షానికి తగిన మెజారిటీ ఉండటంతో గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ప్రస్తావనార్హం.

అస్సాం గిరిజన తీవ్రవాద సంస్థలతో శాంతి ఒప్పందం

అస్సాంలోని కొన్ని కల్లోల ప్రాంతాల్లో సుస్థిర శాంతి దిశగా కీలక ముందడుగు పడింది. ఆ రాష్ట్రానికి చెందిన పలు గిరిజన తీవ్రవాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వమూ భాగస్వామ్యమైన ఈ త్రైపాక్షిక ఒప్పందంపై ఆల్‌ ఆదివాసీ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ, ఆదివాసీ కోబ్రా మిలిటెంట్‌ ఆఫ్‌ అస్సాం, బిర్సా కమాండో ఫోర్స్, సంతాల్‌ టైగర్‌ ఫోర్స్, ఆదివాసీ పీపుల్స్‌ ఆర్మీ సంస్థలకు చెందిన ప్రతినిధులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరుల సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సంస్థలన్నీ 2012 నుంచి కాల్పుల విరమణను పాటిస్తూ ప్రత్యేక క్యాంపుల్లో కొనసాగుతున్నాయి. అయితే పరేష్‌ బారుహ్‌ నేతృత్వంలోని నిషేధిత ఉల్ఫా, కామటపుర్‌ లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ సంస్థలు శాంతి ఒప్పందంలో భాగస్వామ్యలు కాలేదు.

భాజపాలో గోవా సీఎల్‌పీ విలీనానికి స్పీకర్‌ ఆమోదం

గోవా రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్‌పీ) అధికార భాజపాలో విలీనానికి ఆమోదం తెలిపినట్లు శాసనసభ స్పీకర్‌ రమేష్‌ తావడ్కర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులు తనకు రాసిన లేఖ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది సీఎల్‌పీని భాజపాలో కలిపేందుకు తీర్మానానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

90వ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీకి చిహ్నంగా కోణార్క్‌ ఆలయ రథ చక్రం

భారత్‌లో అక్టోబరులో జరగనున్న 90వ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీకి చిహ్నం (లోగో)గా కోణార్క్‌ ఆలయ రథ చక్రాన్ని ఎంపిక చేశారు. చక్రానికి చుట్టూ భారత జాతీయ పతాకంలోని మూడు రంగులను వృత్తంలా ఏర్పాటు చేసి రూపొందించిన లోగోను జనరల్‌ అసెంబ్లీని నిర్వహిస్తున్న సీబీఐ ఇటీవల ఆవిష్కరించింది. కోణార్క్‌ ఆలయాన్ని సూర్యుడి రథం ఆకారంలో తొలిచిన విషయం తెలిసిందే. ఈ రథానికి 24 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రంలో 16 ఆకులు ఉంటాయి. వారంలో ఏడు రోజులు 24 గంటలూ ఇంటర్‌పోల్‌ విధుల నిర్వహణకు చిహ్నంగా ఈ లోగోను ఎంపిక చేసినట్లు ఓ అధికారి తెలిపారు. 195 దేశాల నుంచి అధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్య దేశంలో ఈ అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. 1997లో మన దేశంలో ఈ అసెంబ్లీ జరిగింది. భారత దేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీని నిర్వహించాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విజ్ఞప్తి మేరకు అక్టోబరు 18 నుంచి మూడు రోజుల పాటు మన దేశంలో దీనిని నిర్వహించనున్నారు.

కునో జాతీయ పార్కులో చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ

ఏడు దశాబ్దాల క్రితం దేశంలో చీతాలు అంతరించాయని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగానే ‘ప్రాజెక్టు చీతా’ ప్రారంభమైందని తెలిపారు. నమీబియా నుంచి చేరుకున్న 8 చీతాలను ప్రధాని తన 72వ పుట్టిన రోజు సందర్భంగా కునో నేషనల్‌ పార్కు క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. నమీబియాలోని విండ్‌హోక్‌ నుంచి చీతాలతో బయల్దేరిన ప్రత్యేక విమానం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వైమానిక స్థావరానికి చేరుకుంది. అనంతరం వీటిని భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు. అక్కడ చీతా (చిరుతల్లో ఒక రకం)లను ప్రధాని ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు.

దక్షిణ మధ్య రైల్వేకు గ్రీన్‌ కో రేటింగ్‌ పత్రాలు

జోన్‌ పరిధిలోని నాలుగు సంస్థలతో పాటు హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు నాలుగు గ్రీన్‌కో రేటింగ్‌ పత్రాలు లభించినట్లు దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే తెలిపింది. రైల్వే సంస్థలను, స్టేషన్‌ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దినందుకు ఈ గుర్తింపు లభించిందని, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) నుంచి ఈ పత్రాలను అందుకున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ గ్రీన్‌ కో ప్లాటినం రేటింగ్, తిరుపతి క్యారేజ్‌ రిపేర్‌ షాప్‌ గ్రీన్‌ కో గోల్డ్, మౌలాలి డీజిల్‌ లోకోషెడ్‌ గ్రీన్‌ కో గోల్డ్, కాజీపేట ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ గ్రీన్‌ కో సిల్వర్‌ రేటింగ్‌ సాధించినట్లు ద.మ.రైల్వే వివరించింది.

74 ఏళ్లకు మళ్లీ భారత్‌లోకి చీతాలు

దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించబోతున్నాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి రాబోతున్నాయి. ‣ సెప్టెంబరు 17న దేశంలోకి అడుగు పెట్టబోతున్నాయి. వీటి తరలింపు కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విమానం బి747 జంబోజెట్‌ అయిదు ఆడ, మూడు మగ చీతాలతో నమీబియాలోని విండ్‌హోక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి జైపుర్‌లో దిగనుంది. అక్కడి నుంచి హెలీక్యాప్టర్లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తరలిస్తారు. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కునో పార్కులోకి విడిచిపెడతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,500 చీతాలు ఉన్నట్లు అంచనా. ‣ అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని ప్రయోగాత్మకంగా భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ చీతాకు సుప్రీంకోర్టు 2020 జనవరిలో ఆమోదముద్ర వేసింది. భారతీయ వన్యప్రాణి సంరక్షకులు తొలిసారిగా 2009లో భారత్‌కు చీతాలను రప్పించే ప్రతిపాదనను చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌కు చెందిన ప్రతినిధుల ముందుంచారు. దరిమిలా భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు డాక్టర్‌ మార్కర్‌ గత 12 ఏళ్లలో పలుమార్లు భారత్‌ను సందర్శించి చీతాలను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ప్రాంతాన్ని, ముసాయిదా ప్రణాళికలను పరిశీలించారు. చీతాల సంరక్షణ అంశంపై ఈ ఏడాది జులై 20న నమీబియా, భారత్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ మేరకు 8 చీతాలను భారత్‌కు అందించడానికి ఆ ఒప్పందం ద్వారా మార్గం సుగమం అయింది.

అస్తిత్వంలో లేని 86 రాజకీయ పార్టీల రద్దు

అస్తిత్వంలో లేని 86 గుర్తింపు లేని పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది. అలాగే క్రియాశీలకంగా లేని కారణంగా మరో 253 రాజకీయ పక్షాలకు పార్టీ పరంగా లభించే ప్రయోజనాలపై నిషేధం విధించింది. ఈ రెండు జాబితాల్లో కలిపి ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 16 పార్టీలున్నాయి. ఎన్నికల చిహ్నాల ఉత్తర్వు - 1968 కింద ఈ చర్యలు తీసుకుంది. తాజాగా రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా నుంచి తొలగించిన పార్టీల్లో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 పార్టీలున్నాయి. పార్టీపరమైన ప్రయోజనాలను పొందకుండా నిషేధం విధించిన పార్టీల్లో తెలంగాణ నుంచి 14 ఉన్నాయి. ఈ ఏడాది మే 25 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపులేని రాజకీయ పార్టీల కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు మొత్తం 537 పార్టీలపై చర్యలు తీసుకున్నట్లయింది.

స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి జలప్రవేశం

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి జలప్రవేశం చేసింది. ‘ప్రాజెక్ట్‌ 17ఏ’ శ్రేణిలో ఇది మూడో యుద్ధనౌక. ముంబయిలోని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) దీన్ని నిర్మించింది. తారాగిరిని సమీకృత నిర్మాణ విధానాన్ని ఉపయోగించి నిర్మించారు. ఇందులో వివిధ ప్రదేశాల్లో హల్‌ బ్లాక్‌లను నిర్మించి, ఎండీఎల్‌లో అనుసంధానించారు. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మరణం కారణంగా భారత్‌లో సంతాప దినంగా ప్రకటించినందు వల్ల ఈ యుద్ధనౌకను సాంకేతికంగా మాత్రమే జలప్రవేశం చేశారు. ఫ్రిగేట్‌ తరగతికి చెందిన ఈ యుద్ధనౌక నిర్మాణం 2020 సెప్టెంబరు 10న ప్రారంభమైంది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక ఇది 2025 ఆగస్టులో నౌకాదళం చేతికి అందే అవకాశం ఉంది. నేవీకి చెందిన బ్యూరో ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ దీనికి రూపకల్పన చేసింది. రూ.25,700 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ 17ఏ తరగతి యుద్ధనౌకల నిర్మాణం జరుగుతోంది. ఇందులో మొదటిదైన నీలగిరిని 2019 సెప్టెంబరు 28న జలప్రవేశం చేయించారు. 2024 ప్రథమార్ధంలో ఇది సముద్ర పరీక్షలకు వెళ్లే అవకాశం ఉంది. రెండోదైన ఉదయగిరిని ఈ ఏడాది మే 17న జలప్రవేశం చేయించగా 2024 ద్వితీయార్ధంలో సాగర పరీక్షలకు వెళ్లనుంది. నాలుగో యుద్ధనౌక నిర్మాణం కొనసాగుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.12 కోట్ల సీసాల నానో యూరియా సరకు విక్రయం

నానో యూరియాకు ఆదరణ పెరుగుతోంది. అమ్మకాలు గణనీయంగా జరుగుతున్నాయి. యూరియాను గుళికల రూపంలో నుంచి ద్రవరూపంలోకి మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై జరిగిన కసరత్తు తర్వాత అందుబాటులోకి వచ్చింది నానో యూరియా. ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ (ఇఫ్‌కో) సంస్థ నానో టెక్నాలజీ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా దేశంలో నానో యూరియా తయారీని ప్రారంభించింది. అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని ఆగస్టు 2021 నుంచి మార్కెటింగ్‌ చేస్తోంది. అర లీటరు (500ఎంఎల్‌) బాటిళ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీని ధర రూ.240. ఇది 45 కిలోల యూరియా బస్తాకు సమానం. 45 కిలోల బస్తా తయారీకి రూ.1000లుపైగా ఖర్చవుతుండగా రూ.266.50కు రైతులకు విక్రయించి మిగిలిన మొత్తాన్ని కేంద్రం రాయితీగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో యూరియా తయారీలో స్వయం సమృద్ధి సాధించేందుకు నానో యూరియాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రోజూ 2 లక్షల బాటిళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో గుజరాత్‌లోని కల్లోల్‌ యూనిట్‌లో తయారీ మొదలవగా అయ్‌నోలా, పుల్పూర్, బెంగళూరు, పారాదీప్, కాండ్లా, దేవ్‌ఘర్, గువహటిలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నానో యూరియాకు రైతుల ఆదరణ ఇలాగే ఉంటే 2025 చివరి నాటికి విదేశీ యూరియా అవసరం ఉండదని కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయా ప్రకటించారు.

రాజ్యసభ సభ్యునిగా జమ్మూ-కశ్మీర్‌ నేత గులాం అలీ

జమ్మూ-కశ్మీర్‌కి చెందిర గుర్జర్‌ ముస్లిం నేత గులాం అలీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నామినేట్‌ సభ్యుల కోటాలో రాజ్యసభకు ఎంపిక చేశారు. రాజ్యాంగ అధికరణం 80 (1) (ఏ) కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేపట్టినట్లు కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒక నామినేటెడ్‌ సభ్యుడు పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన స్థానాన్ని గులాం అలీతో భర్తీ చేసినట్లు తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల వాతావరణం అలుముకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడ కీలక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని ఎగువ సభకు పంపింది. సరిహద్దులో సైనిక స్థావరానికి బిపిన్‌ రావత్‌ పేరు కిబితు (అరుణాచల్‌ ప్రదేశ్‌): చైనా సరిహద్దులోని ఒక సైనిక స్థావరంతో పాటు కీలక రహదారికి దేశ తొలి త్రిదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు పెట్టారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట లోహిత్‌ లోయలోని కిబితు సైనిక స్థావరానికి ‘రావత్‌ మిలిటరీ గారిసన్‌’గా, వాలోంగ్‌ నుంచి కిబితుకు వచ్చే 22 కిలోమీటర్ల రహదారికి రావత్‌ మార్గ్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా రావత్‌ నిలువెత్తు చిత్తరువునూ ఆవిష్కరించారు.

కర్తవ్యపథ్, బోస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దారిలో నడిచి ఉంటే ఈ రోజు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిగమించేవాళ్లం. దురదృష్టవశాత్తు ఆ మహానాయకుడిని మరిచిపోయాం. ఆయన ఆలోచనలను విస్మరించాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియాగేట్‌ వరకు ఉన్న రాజ్‌పథ్‌ పేరును కర్తవ్యపథ్‌గా మార్చడంతో పాటు, ఆధునికీకరించిన సెంట్రల్‌ విస్టా అవెన్యూను ఆయన ప్రారంభించారు. ఇండియా గేట్‌ వెనుక 28 అడుగుల ఎత్తున నెలకొల్పిన నేతాజీ శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

దేశంలో తొలిసారిగా తెలంగాణలో వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజి ఏర్పాటు

దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజి (ఏడీఈఎక్స్‌) ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ప్రకటించింది. ఇండియా అర్బన్‌ డేటా ఎక్స్ఛేంజి (ఐయూడీఎక్స్‌)ని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖతో కలిసి ఇప్పటికే ఐఐఎస్‌సీ ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే రీతిలో ఏడీఈఎక్స్‌ను రైతులకు అనేక సేవలందించే వేదికలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. విత్తనాల లభ్యత, పంటల సాగుకు సలహాలు, సూచనలు, బీమా తదితర సేవలు దీనిద్వారా అందించాలనేది ప్రణాళిక. ప్రయోగాత్మక ప్రాజెక్టుగా 2023లో నిర్దేశిత సేవలను దీని ద్వారా అందిస్తామని వెల్లడించింది.

ముక్కు ద్వారా తీసుకునే ‘ఇన్‌కొవ్యాక్‌’ను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌

కొవిడ్‌ నివారణకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) ఇన్‌కొవ్యాక్‌ (బీబీవీ154)కు మన దేశంలో అత్యవసర వినియోగ అనుమతి లభించింది. దీన్ని ముక్కు ద్వారా ఇస్తారు. ఈ తరహా కొవిడ్‌-19 టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం విశేషం. భారత్‌ బయోటెక్‌ తాజా ఆవిష్కరణతో ఈ అరుదైన ఘనత మన దేశానికి దక్కింది. ‘ఇన్‌కొవ్యాక్‌’ను 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. దీనిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో 3,100 మంది వాలంటీర్లపై నిర్వహించారు. భారత్‌ బయోటెక్‌ తాజా ఆవిష్కరణతో ఈ అరుదైన ఘనత మనదేశానికి దక్కింది. ‘ఇన్‌కొవ్యాక్‌’ను 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. దీనిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో 3,100 మంది వాలంటీర్లపై నిర్వహించారు. చుక్కల మందు టీకా కాబట్టి దీని నిల్వ, రవాణాతో పాటు ముక్కు ద్వారా ఇవ్వడమూ ఎంతో సులువు.

కర్ణాటకలో పలు ప్రాజెక్టుల ప్రారంభం

కర్ణాటకలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌)లో రూ.1,830 కోట్లతో చేపట్టిన బీఎస్‌-6 ఇంధన ఉన్నతీకరణ ప్రాజెక్టు, రూ.680 కోట్లతో పూర్తి చేసిన సముద్రనీటి డీసాలినేషన్‌ ప్లాంట్, రూ.280 కోట్లతో ఏర్పాటు చేసిన ఎన్‌ఎంపీఏ కార్గో కంటైనర్‌ మెకానిజం ఆఫ్‌ బెర్త్‌-14లను ఆయన ప్రారంభించారు. రూ.వెయ్యి కోట్లతో చేపట్టనున్న ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ‘భారత్‌లో తయారీ’ని మరింత విస్తృతం చేస్తేనే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని మంగళూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పేర్కొన్నారు.

సెర్వైకల్‌ క్యాన్సర్‌కు తొలి దేశీయ టీకా

మహిళలకు అధికంగా సోకే గర్భాశయ ముఖద్వార (సెర్వైకల్‌) క్యాన్సర్‌ నివారణకు దేశీయంగా రూపొందించిన టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాధికి మన దేశంలో అభివృద్ధిపరిచిన మొదటి టీకా ఇదే. క్వాడ్రివాలెంట్‌ హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెపీవీ) టీకాను 2022 చివరకు విడుదల చేసే అవకాశం ఉందని సీరమ్‌ సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు. టీకా ధర రూ.200 నుంచి రూ.400 మధ్య ఉండవచ్చన్నారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.43 లక్షల కోట్లు

ఆగస్టులో జీఎస్‌టీ కింద ఖజానాకు రూ.1,43,612 కోట్లు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో సీజీఎస్‌టీ కింద రూ.24,710 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ.30,951 కోట్లు, ఐజీఎస్‌టీ కింద రూ.77,782 కోట్లు, సెస్‌ కింద రూ.10,168 కోట్లు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్‌టీలో రూ.29,524 కోట్లను సీజీఎస్‌టీ కింద, రూ.25,119 కోట్లను ఎస్‌జీఎస్‌టీ కింద పంపిణీ చేసింది. వీటన్నింటి అనంతరం ఆగస్టులో కేంద్రానికి రూ.54,234 కోట్లు, రాష్ట్రాలకు రూ.56,070 కోట్ల ఆదాయం దక్కింది. గత ఏడాది ఆగస్టులో వసూలైన రూ.1,12,020 కోట్లతో పోలిస్తే ఈసారి 28% ఎక్కువ ఆదాయం వచ్చింది. దిగుమతి వస్తువులపై 57%, దేశీయ లావాదేవీలపై 19% అధిక ఆదాయం ఈసారి వసూలైంది. నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల స్థాయిని మించడం వరుసగా ఇది ఆరో సారి. ‣ ఆగస్టు నెలలో జీఎస్‌టీ వసూళ్లు ఏపీలో 22%, తెలంగాణలో 10% మేర పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది ఇదే నెలలో రూ.2,591 కోట్లు వసూలు కాగా, ఈసారి అది రూ.3,173 కోట్లకు పెరిగింది. తెలంగాణ వసూళ్లు రూ.3,526 కోట్ల నుంచి రూ.3,871 కోట్లకు చేరాయి. జాతీయంగా వివిధ రాష్ట్రాల వసూళ్లు సగటున 19% పెరిగాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా

సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి పేరు ఇదే. ఆయన ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. 1965 ఫిబ్రవరి 9న బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఈయన తండ్రి సలిల్‌ కుమార్‌ దత్తా కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. ఈయన బావ జస్టిస్‌ అమితవ రాయ్‌ 2015 నుంచి 2018 వరకు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు.

దేశ భద్రతలో ఇస్రో, హెచ్‌ఏఎల్‌ కీలకం: రాష్ట్రపతి ముర్ము

దేశానికి భద్రత కల్పించడంలో ఇస్రో, హెచ్‌ఏఎల్‌ పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆమె బెంగళూరులో హెచ్‌ఏఎల్‌లో రూ.208 కోట్లతో ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్‌ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ కేంద్రం (ఐసీఎంఎఫ్‌), ఐసీఎంఆర్‌ ప్రాంతీయ వైరాలజీ సంస్థ (జోనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ - ఎన్‌ఐవీ)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. హెచ్‌ఏఎల్, ఇస్రో భరోసా కలయిక దేశ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసింది. క్రయోజెనిక్‌ యంత్రాల తయారీ సామర్థ్యంతో ప్రపంచంలో ఎంపిక చేసిన ఆరు దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటికే మొదలైన క్రయోజెనిక్‌ యంత్రాల కమిషనింగ్‌ ప్రక్రియ ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాల వాహక నౌకలకు సమర్థమంతమైన క్రయోజెనిక్‌ యంత్రాలను హెచ్‌ఏఎల్‌ తయారు చేయనుంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ క్రయోజెనిక్‌ యంత్ర తయారీ ఫెసిలిటీ కేంద్రం (ఐసీఎంఎఫ్‌)లో ఇప్పటికే క్రయోజెనిక్‌ యంత్రాల కమిషనింగ్‌ ప్రక్రియ మొదలైంది. 2013లో ఇస్రో - హెచ్‌ఏఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా హెచ్‌ఏఎల్‌ ఏరోస్పేస్‌ డివిజనల్‌లో 2016 నుంచి ఐసీఎంఎఫ్‌ వ్యవస్థలను ప్రారంభించారు. ఈ కేంద్రంలో భారతీయ వాహక నౌకల క్రయోజెనిక్‌ (సీఈ20), సెమి క్రయోజెనిక్‌ (ఎస్‌ఈ-2000)ల తయారీకి అవసరమైన 70 హైటెక్‌ పరికరాలు, టెస్టింగ్‌ ఫెసిలిటీ వ్యవస్థలున్నాయి. రూ.208 కోట్లతో నిర్మించిన ఐసీఎంఎఫ్‌లో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ-2, 3 యంత్రాలకు అవసరమైన లిక్విడ్‌ ప్రొపెల్లెంట్‌ ట్యాంకులను తయారు చేస్తారు. ఇంజిన్లలో వాడే లిక్విడ్, ఆక్సిడైజర్, గ్యాసు ట్యాంకర్ల స్థానంలో తక్కువ పరిమాణం కలిగిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఓఎక్స్‌), లిక్విడ్‌ హైడ్రోజెన్‌ (ఎల్‌హెచ్‌2)లను తక్కువ ఉష్ణోగ్రత్తల వద్ద మండించే క్రయోజెనిక్‌ యంత్రాలను తయారు చేస్తారు. 2014లో జీఎస్‌ఎల్‌వీ-డీ5, గగన్‌యాన్‌ కోసం ప్రయోగాత్మక క్రయోజనిక్‌ యంత్రాల పరీక్ష ప్రక్రియ ముగించిన ఇస్రో భవిష్యత్తు రాకెట్లలో వీటినే వినియోగించనుంది.

జమ్మూకశ్మీర్‌లో ఆజాద్‌ కొత్త పార్టీ

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుబంధాన్ని ఆగస్టులో తెంచుకున్న సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ (డీఏపీ)’గా దానికి నామకరణం చేశారు. ఈ మేరకు పార్టీకి సంబంధించిన వివరాలు, లక్ష్యాలను వెల్లడించారు. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ, సమష్టి ఆలోచనలకు ప్రతీకగా తమ పార్టీ నిలుస్తుందన్నారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో ముందుకెళ్తుందని వివరించారు. నీలం, తెలుపు, పసుపు రంగులు నిలువునా ఉన్న జెండాను డీఏపీ పతాకంగా ఆజాద్‌ ప్రకటించారు.

10 యూట్యూబ్‌ ఛానళ్లు, 45 వీడియోలపై నిషేధం

దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడంతో పాటు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని పేర్కొంటూ పది యూట్యూబ్‌ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం నిషేధం విధించింది. ప్రభుత్వం వేటు వేసిన ఈ వీడియోల మొత్తం వీక్షకుల సంఖ్య 1.3 కోట్లు అని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇవి కొన్ని సమూహాల మతపరమైన హక్కులను ప్రభుత్వం హరించివేసిందంటూ దుష్ప్రచారం చేశాయని, అగ్నిపథ్‌ పథకం, భారత్‌ సైన్యం, కశ్మీర్‌ తదితర అంశాలకు సంబంధించి నకిలీ వార్తలను ప్రసారం చేశాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

దేశంలోనే తొలిసారిగా కేరళ పోలీసులకు యాంటీ డ్రోన్‌ వాహనం

యాంటీడ్రోన్‌ వాహనాన్ని సమకూర్చుకుని దేశంలోనే తొలిసారిగా ఈ సదుపాయాన్ని పొందిన వారుగా కేరళ పోలీసులు వినుతికెక్కారు. అంతేకాదు ఈగల్‌ ఐ గా వ్యవహరిస్తున్న ఈ వాహనాన్ని ఆ శాఖకే చెందిన డ్రోన్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.80 లక్షలతో అభివృద్ధి చేయడం విశేషం. దీని సాయంతో అనుమతి లేకుండా ఎగిరే, దాడికి పాల్పడే డ్రోన్లను కూల్చివేస్తారు. విమానాశ్రయాలు, ప్రముఖులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈ వాహనాన్ని మోహరిస్తారు. ఇందులోని యాంటీ డ్రోన్‌ వ్యవస్థ అయిదు కిలోమీటర్ల పరిధిలో అనుమతుల్లేకుండా వినియోగించే డ్రోన్లను గుర్తించడంతో పాటు వాటిని కూల్చివేస్తుంది.

పెట్రోబ్రాస్‌తో బీపీసీఎల్‌ ఒప్పంతం (ఎంఓయూ)

ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), లాటిన్‌ అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు బ్రెజిల్‌కు చెందిన జాతీయ చమురు సంస్థ పెట్రోబ్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కంపెనీ అవసరాలకు తగ్గట్లు వివిధ దేశాల నుంచి ముడి చమురు దిగుమతుల్ని వైవిధ్యీకరించే ప్రణాళికలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. పెద్ద పరిమాణంలో దిగుమతి చేసుకున్న ముడి చమురును పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనంగా మారుస్తోంది. ముంబయి (మహారాష్ట్ర), బినా (మధ్యప్రదేశ్‌), కోచి (కేరళ)లో ఉన్న 3 చమురు రిఫైనరీ యూనిట్లలో చమురును శుద్ధి చేస్తోంది. ‣ పశ్చిమాసియా దేశాలైన ఇరాక్, సౌదీ అరేబియాల నుంచే అధిక భాగం ముడి చమురు ఇప్పటి వరకు బీపీసీఎల్‌కు సరఫరా అవుతోంది. ఇతర దేశాల నుంచీ చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా పోర్ట్‌ఫోలియోను వైవిధ్యీకరించినట్లు అవుతుందని, ఏ దేశమైనా సరఫరా తగ్గించినా ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చని బీపీసీఎల్‌ వెల్లడించింది. అవగాహనా ఒప్పంద (ఎంఓయూ) పత్రాలపై సీఎండీ అరుణ్‌ కుమార్‌ సింగ్‌తో పాటు పెట్రోబ్రాస్‌ సీఈఓ కయో పేస్‌ డి ఆండ్రేడ్‌ సంతకాలు చేశారు.

నిస్తార్, నిపుణ్‌ రెండు డి.ఎస్‌.వి.ల జలప్రవేశం

వంద శాతం స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను నిర్మించుకోవాలన్నదే తమ లక్ష్యమని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో తయారైన నిస్తార్, నిపుణ్‌ డి.ఎస్‌.వి. (డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌)లను జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ మాట్లాడుతూ.. జలాంతర్గాముల్లో విధులు నిర్వర్తించేవారి రక్షణలో డి.ఎస్‌.వి.లు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేక యుద్ధనౌకలు తయారు చేయగలిగే అగ్రదేశాల సరసన మన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలిగామని తెలిపారు. ప్రస్తుతం 43 యుద్ధనౌకలు, జలాంతర్గాములు మన దేశంలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు. ఒకేసారి రెండు యుద్ధ నౌకలను జలప్రవేశం చేయించడం భారత షిప్‌యార్డ్‌ల చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. ‣ రాయల్‌ ఆస్ట్రేలియా నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కకడు-22’ బహుళపక్ష సాగర విన్యాసాల్లో భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ సాత్పురా నౌక పాల్గొందని నేవీ వర్గాలు తెలిపాయి. సీఫేజ్‌ విన్యాసాల్లో భాగంగా లక్ష్య సాధన సామర్థ్యం రుజువు చేసేందుకు చేపట్టిన ఫైరింగ్‌ విన్యాసాల్లో సాత్పురా సత్తా చాటిందని వెల్లడించాయి.

కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ ఆరంభం

కశ్మీర్‌ లోయలో తొలిసారిగా నిర్మించిన ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. గత మూడేళ్లుగా జమ్మూ - కశ్మీర్‌లో సామాజిక, ఆర్థిక విప్లవం చోటు చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని సోనావార్‌లో నిర్మించిన ఈ థియేటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా, అమీర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాను ప్రదర్శించారు. సెప్టెంబరు 30 నుంచి నిత్యం ప్రదర్శనలు ఉంటాయని మల్టీప్లెక్స్‌ యాజమాన్య సంస్థ తెలిపింది.