అంతర్జాతీయం

50 వేల జవాన్లతో రష్యా సైనిక విన్యాసాలు

భారీ ఎత్తున సైనిక విన్యాసాలను రష్యా ప్రారంభించింది. సెప్టెంబరు ఏడో తేదీ వరకు వొస్టాక్‌ 2022 పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో భారత్, చైనా, లావోస్, మంగోలియా, నికరాగువా, సిరియాతో పాటు మరికొన్ని మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో వెల్లడించింది. వొస్టాక్‌లో పాల్గొనే భారత సైన్యం రోజూవారీ కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలను రష్యా సైన్యం విడుదల చేసింది. ఆ దేశంలోని గుర్తు తెలియని ప్రాంతంలో భారత సైనికుల కవాతు, వంటావార్పు, పాటలు పాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. 50 వేల మంది జవాన్లు, 140 యుద్ధ విమానాలు, 60 యుద్ధ నౌకలు సహా అయిదు వేలకు పైబడి ఆయుధ యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని మాస్కో రక్షణ శాఖ ప్రకటించింది.

బ్రిటన్‌ నూతన ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ నూతన ప్రధాని ఎంపికలో వారాల తరబడి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో అంతర్గతంగా చేపట్టిన నాయకత్వ ఎన్నికలో విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ విజయం సాధించారు. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై సుమారు 21 వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో 47 ఏళ్ల లిజ్‌ ట్రస్‌ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనప్రాయమే కానుంది. ‣ జులై 12న ఆరంభమైన ఓటింగ్‌ ప్రక్రియ సెప్టెంబరు 4న ముగియగా, సెప్టెంబరు 5న లండన్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌ సమీపంలోని క్వీన్‌ ఎలిజబెత్‌-2 సెంటర్‌లో ఓట్లను లెక్కించారు. మొత్తం 1,72,437 మంది ‘టోరి’ సభ్యులకుగాను 1,42,379 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. లిజ్‌ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా, సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చినట్టు రిటర్నింగ్‌ అధికారి గ్రహమ్‌ బ్రాడీ ప్రకటించారు. మరో 654 ఓట్లు చెల్లలేదు. మార్గరేట్‌ థాచెర్, థెరెసా మేల తర్వాత బ్రిటన్‌ ప్రధాని పగ్గాలు చేపడుతున్న మూడో మహిళగా లిజ్‌ ట్రస్‌ చరిత్ర సృష్టించారు.

కాట్సా నుంచి భారత్‌కు మినహాయింపుపై బిల్లు

కాట్సా చట్టం ఆంక్షల నుంచి భారతదేశాన్ని మినహాయించాలంటూ అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ ప్రజా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్‌ సభ్యుడు రో ఖన్నా ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ఖన్నాతో పాటు మరో ఇద్దరు సభ్యులు ప్రతిపాదించిన ఈ బిల్లును సభ విదేశీ వ్యవహారాల కమిటీ ఆమోదం కోసం పంపారు. పాలక డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఖన్నా ఇటీవల ఇటువంటి సవరణనే అమెరికా జాతీయ రక్షణ ప్రాధికార చట్టం (ఎన్‌డీఏఏ)కీ ప్రతిపాదించారు. ఆ సవరణను సభలోని పాలక, ప్రతిపక్షాలు రెండూ ఆమోదించాయి. ఇప్పుడు కాట్సా చట్టానికీ ఇటువంటి సవరణనే ప్రతిపాదిస్తున్నానని ఖన్నా వివరించారు.

బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 బాధ్యతల స్వీకరణ

బ్రిటన్‌ కొత్త రాజుగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 పెద్ద కుమారుడు ఛార్లెస్‌ బాధ్యతలను స్వీకరించారు. ఈ చారిత్రక ఘట్టానికి లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌ వేదికగా నిలిచింది. ‘అక్సెషన్‌ కౌన్సిల్‌’ సమక్షాన ఆయన రాచరికపు అధికారాలను చేపట్టారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో రాణి అస్తమయంతో ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఫిలిప్‌ ఆర్థర్‌ జార్జ్‌ ఇప్పుడు కింగ్‌ ఛార్లెస్‌-3 అయ్యారని కౌన్సిల్‌ ప్రకటించింది.

సొంత చిత్తరువులను ఆవిష్కరించుకున్న ఒబామా దంపతులు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన భార్య మిషెల్‌ శ్వేతసౌధానికి వచ్చారు. సంప్రదాయం ప్రకారం అధ్యక్ష భవనంలో ఏర్పాటు చేసే తమ అధికారిక చిత్తరువులను వారు ఆవిష్కరించుకున్నారు. 2017లో పదవీ కాలం ముగిశాక మిషెల్‌తో కలిసి ఒబామా మళ్లీ శ్వేతసౌధంలోకి రావడం ఇదే తొలిసారి. నూతన అధ్యక్షుడు రాగానే మునుపటి అధ్యక్షుడి చిత్రపటాలను శ్వేతసౌధంలో, జాతీయ గ్యాలరీలో ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 2012 నుంచి ఇది నిలిచిపోయింది.

బైడెన్‌ కొలువులో భారత సంతతికి చెందిన 130 మంది

భారతీయ సంతతికి చెందిన 130 మంది అమెరికన్లు ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనా యంత్రాంగంలో కీలక బాధ్యతల్లో ఉన్నారని శ్వేతసౌధం సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా రాజధానిలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో శ్వేతసౌధం భద్రతా మండలికి సంబంధించిన గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ, బయో డిఫెన్స్‌ సీనియర్‌ అధికారిగా ఉన్న రాజ్‌ పంజాబీ ఆ అధికారుల పేర్లు చదువుతూ ఇది గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.

వెస్ట్‌ మినిస్టర్‌ హాల్‌లో కింగ్‌ ఛార్లెస్‌-3 ప్రతిన

రాజ్య పాలనలో తన తల్లి, దివంగత రాణి ఎలిజబెత్‌-2 బాటలోనే ప్రయాణిస్తానని బ్రిటన్‌ కొత్త రాజు ఛార్లెస్‌-3 ప్రతినబూనారు. తన తల్లి నిస్వార్థ కర్తవ్య పాలనకు ఉదాహరణగా నిలిచారన్నారు. బ్రిటన్‌ అధిపతిగా తొలిసారి ఆయన ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్, లార్డ్స్‌ సభ్యులు రాణి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ క్రతువైన జాతీయ సంతాప కార్యక్రమానికి హాజరైన సుమారు 900 మంది పార్లమెంటు సభ్యులు నూతన సార్వభౌమాధికారికి విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ లిండ్సే హొయెల్‌ సంతాప ప్రకటనను చదివారు. అనంతరం దానిని కొత్త రాజుకు అందించారు.

బ్రిటన్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కన్జర్వేటివ్‌ నేత లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌లో అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా పూర్తయింది. ఇన్నాళ్లూ ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్‌ జాన్సన్‌ స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌షైర్‌లో ఎలిజబెత్‌-2 రాణిని కలిసి తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆ వెంటనే కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ను ప్రధానిగా రాణి నియమించారు. అనంతరం స్కాట్లాండ్‌ నుంచి లండన్‌కు చేరుకున్న 47 ఏళ్ల ట్రస్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అందులో భారత సంతతి మహిళా నేత సుయెలా బ్రావెర్మన్‌ (42)కు కీలక పదవి దక్కింది. హోం మంత్రిగా ఆమె నియమితులయ్యారు. జాన్సన్‌ సర్కారు హయాంలో బ్రావెర్మన్‌ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఇన్నాళ్లూ జాన్సన్‌ ప్రభుత్వంలో హోం మంత్రిగా భారత సంతతి మహిళా నేత ప్రీతీ పటేల్‌ విధులు నిర్వర్తించడం గమనార్హం. ‣ ఎలిజబెత్‌-2 రాణి హయాంలో ప్రధాని పీఠమెక్కిన 15వ వ్యక్తి ట్రస్‌. అబెర్డీన్‌షైర్‌లోని వేసవి నివాసం బల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమెతో తొలుత జాన్సన్, తర్వాత ట్రస్‌ సమావేశమయ్యారు. తొలిసారిగా అక్కడి నుంచే ప్రధాని నియామక ప్రక్రియను రాణి పూర్తి చేశారు.

ఎస్‌సీవో తొలి పర్యాటక, సాంస్కృతిక రాజధానిగా వారణాసి

ఎస్‌సీవో తొలి పర్యాటక, సాంస్కృతిక రాజధానిగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర వారణాసి నగరాన్ని గుర్తించారు. 2022 - 23 కాలానికిగాను వారణాసి ఆ హోదాలో కొనసాగనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా వెల్లడించారు.

ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్‌ ఆర్కిటిక్‌ తోడేలు సృష్టి

ప్రపంచంలోనే తొలిసారి క్లోనింగ్‌ విధానంలో ఆర్కిటిక్‌ తోడేలును బీజింగ్‌కు చెందిన సినోజీన్‌ బయోటెక్నాలజీ కో సంస్థ సృష్టించింది. ఆర్కిటిక్‌ తోడేలును సాధారణంగా పోలార్‌ ఉల్ఫ్, లేదా వైట్‌ఉల్ఫ్‌ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా కెనడా పరిధిలోకి వచ్చే క్వీన్స్‌ ఎలిజెబెత్‌ ద్వీపంలో కనిపిస్తాయి. అంతరించిపోతున్న అరుదైన జీవ జాతులను క్లోనింగ్‌ ద్వారా కాపాడటంలో చైనా విజయం ఓ మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి క్లోనింగ్‌ విధానంలో జన్మించిన ఆర్కిటిక్‌ తోడేలు 100 రోజుల తర్వాత వీడియో ద్వారా బాహ్య ప్రపంచం ముందుకు వచ్చింది. అంతరించిపోతున్న అరుదైన జాతుల బ్రీడింగ్‌కు దీని పుట్టుకతో క్లోనింగ్‌ ద్వారా మార్గం ఏర్పడిందని గ్లోబల్‌ టైమ్స్‌ ట్వీట్‌ చేసింది. జూన్‌ 10న జన్మించిన ఈ తోడేలుకు ‘మాయా’ అని నామకరణం చేశారు. దీని పుట్టుకకు ఉపయోగించిన క్లోనింగ్‌ కణం ఓ ఆర్కిటిక్‌ తోడేలు చర్మం నుంచి సేకరించారు. మాయా సరోగేట్‌ తల్లి జీవిని బీగిల్‌ జాతి శునకంగా ఆ సంస్థ పేర్కొంది.

పాక్‌ ప్రధానిపై రాజద్రోహ తీర్మానం

నూతన సైనికాధ్యక్షుడి నియామకానికి సంబంధించి పరారీలో ఉన్న తన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ను సంప్రదించినందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను రాజద్రోహ అభియోగాల కింద విచారించాలంటూ పాకిస్థాన్‌లోని పంజాబ్‌ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సున్నితమైన ఇలాంటి అంశాలపై సంబంధంలేని వ్యక్తులతో చర్చించడమే కాకుండా సైన్యాన్ని అవమానించినట్లుగా ప్రధాని చర్య ఉందని ఆ తీర్మానం పేర్కొంది. పంజాబ్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బషరత్‌ రజా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎలిజబెత్‌-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన షెహబాజ్‌ లండన్‌లో తన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐ, దాని మిత్రపక్షం పీఎమ్‌ఎల్‌క్యూల పాలనలో ఉన్న పంజాబ్‌ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద విహార (క్రూజ్‌) నౌకగా ‘ది గ్లోబల్‌ డ్రీమ్‌ 2’

ప్రపంచంలోనే అతిపెద్ద విహార (క్రూజ్‌) నౌక అది. పేరు- ‘ది గ్లోబల్‌ డ్రీమ్‌ 2’. ఏకంగా 9 వేల మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. నిర్మాణ బడ్జెట్‌ రూ.11 వేలకోట్ల పైమాటే. కానీ ఇంతటి ఘనత వహించిన నౌక ఒక్క ప్రయాణమైనా చేయకముందే తుక్కుగా మారబోతోంది. నిర్మాణ సంస్థ దివాలా తీయడం, ఆ భారీ నౌకను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే అందుకు కారణం. వాటర్‌ పార్కు, సినిమా హాలు.. ‘ఎంవీ వెర్ఫ్‌టన్‌’ అనే జర్మన్‌ - హాంకాంగ్‌ కంపెనీ ది గ్లోబల్‌ డ్రీమ్‌-2ను నిర్మించింది. దాని పొడవు 342 మీటర్లు. బరువు 2.08 లక్షల టన్నులు. నౌకలో 20 అంతస్థులుంటాయి. ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం పరంగా చూస్తే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రూజ్‌ నౌక ఇదే. భారీ అవుట్‌డోర్‌ వాటర్‌ పార్కు, సినిమా హాలు వంటి అనేక సదుపాయాలను అందులో కల్పించారు. పరిమాణం పరంగా ప్రపంచంలో ఆరో అతిపెద్ద నౌక ఇది. ప్రస్తుతం జర్మనీలోని విస్మర్‌ షిప్‌యార్డులో దాన్ని ఉంచారు. విడి భాగాలుగా మార్చి.. కొన్ని నిర్మాణ పనులు ఇంకా మిగిలి ఉండటంతో రూ.8,270 కోట్లకు దాన్ని అమ్మాలని కంపెనీ భావిస్తోంది. నౌకను విడిభాగాలుగా చేస్తారు. ఇంజిన్లు, కొన్ని భాగాలను ప్రత్యేకంగా విక్రయిస్తారు. మిగిలిన మొత్తాన్ని తుక్కులా మార్చి వేలం వేస్తారు.

ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని

ఇటలీ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా నేత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని (45) ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో 26.37 శాతం ఓట్లు సాధించారు. తుది ఫలితాల్లో ఈమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయఢంకా మోగించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడే పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే అవుతుంది. వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్‌ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ముందుకు సాగారు. ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటలీ నౌకాదళం లిబియా సముద్రమార్గాన్ని మూసివేయాలని ఆమె కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు. మారియో డ్రాఘీ నేతృత్వంలోని కూటమిలో చేరడానికి నిరాకరించి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆమె కొనసాగారు. గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో మెలోని జన్మించారు.

స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం

అమెరికా భద్రతా విభాగం మాజీ కాంట్రాక్టర్‌ ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు అధ్యక్షుడు పుతిన్‌ రష్యా పౌరసత్వం మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన డిక్రీని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. అమెరికా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించినట్టు స్నోడెన్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ కేసులో విచారణను తప్పించుకునేందుకు 2013లోనే ఆయన రష్యాకు వలస వచ్చాడు.

అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)కు 75 ఏళ్లు

కరడుగట్టిన ఉగ్రముఠా అల్‌ఖైదా అధిపతి అల్‌ జవహరిని అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) ఎలా హతమార్చింది? జవహరి ఇంటి నమూనాను పక్కాగా తయారు చేసి, అధ్యక్షుడు బైడెన్‌కు ఎలా వివరించింది? ఇంతకీ ఆ ఇంటి నమూనా ఇప్పుడు ఎక్కడుంది? జవహరిని హతమార్చేందుకు వాడిన వస్తువులు ఎక్కడున్నాయి? సీఐఏ అత్యంత రహస్యంగా ఉపయోగించే ఆయుధాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ వాషింగ్టన్‌లోని ‘సీఐఏ మ్యూజియం’ సమాధానంగా నిలుస్తోంది. ఎలాంటి శబ్దం, మంట, పొగ లేకుండా, అదే ఇంట్లో నివసించే ఏ ఒక్కరికీ ఏ మాత్రం హాని కలగకుండా అల్‌ జవహరిని హతమార్చిన సీఐఏ, ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు తాము పన్నిన వ్యూహాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. జవహరి ఇంటి నమూనాతో సహా ఆ ఆపరేషన్‌లో వినియోగించిన వస్తువులను ప్రస్తుతం సీఐఏ మ్యూజియంలో భద్రపరిచారు. నాడు ఉపయోగించిన హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, మ్యాప్‌లు సహా ఎన్నో అరుదైన వస్తువులను ఈ మ్యూజియంలో ఉంచారు. ‣ ఈ ఒక్క ఆపరేషనే కాకుండా సీఐఏ చేపట్టిన అనేక ప్రతిష్ఠాత్మక ఆపరేషన్లు, వినియోగించిన రహస్య ఆయుధాలను కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు. దీన్ని సందర్శించేందుకు ప్రజలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. సీఐఏ ఉద్యోగులు, ప్రత్యేక అతిథులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు. అమెరికా చట్టసభ సభ్యులు, నిఘా సంస్థల అధికారులు, విదేశీ అతిథులకు ఇందుకు అనుమతి ఇస్తున్నారు. సీఐఏను స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన ఈ మ్యూజియంలోకి పాత్రికేయులకు అనుమతి ఇచ్చారు. సీఐఏ తన చరిత్రను ప్రజలతో పంచుకోవాలని భావిస్తోందని, దీనికి మరింత సమయం పడుతుందని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.

అఫ్గాన్‌కు నాటోయేతర మిత్ర దేశ హోదా రద్దు

అఫ్గానిస్థాన్‌కు నాటోయేతర మిత్ర దేశ హోదాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రద్దు చేశారు. తాలిబన్లు అధికారం హస్తగతం చేసుకున్న ఏడాది తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. 2012లో అఫ్గానిస్థాన్‌ను అమెరికా నాటోయేతర మిత్ర దేశంగా పేర్కొంది. దీనివల్ల రెండు దేశాలు రక్షణ, ఆర్థిక సంబంధాలను కొనసాగించగలిగాయి. పలు రాయితీలతో పాటు అనేక వసతులను అఫ్గాన్‌కు అగ్రరాజ్యం సమకూర్చింది. అమెరికా నాటోయేతర మిత్ర దేశ హోదా జాబితాలో పాకిస్థాన్, కువైట్, జపాన్‌ సహా 18 దేశాలున్నాయి.

బరాబర్, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపుకు యత్నాలు

బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో గల బరాబర్, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదించాలని భారత పురావస్తు శాఖ (ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా/ఏఎస్‌ఐ) నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ‣ మన దేశంలో మనుగడలో గల పురాతనమైన తొలచిన రాతి గుహలు ఇవి. వీటిని మౌర్యుల కాలం (321 బీసీ నుంచి 185 బీసీ మధ్య)లో రూపొందించారని పురావస్తు శాస్త్రవేత్త పేర్కొన్నారు. మఖ్దంపుర్‌ ప్రాంతంలో బరాబర్‌ కొండలు నాలుగు గుహల సముదాయాన్ని కలిగి ఉన్నాయి. వాటినే బరాబర్‌ లేదా లోమస్‌ రుషి, సుధామ, విశ్వకర్మ, కరణ్‌ చౌపర్‌ గుహలుగా పేర్కొంటారు. వీటికి రెండు కిలోమీటర్ల దూరంలో గల నాగార్జునుడి కొండల్లో మూడు చెక్కిన గుహలు ఉన్నాయి. వీటిని కూడా మౌర్యుల కాలం నాటివిగా గుర్తించారు. బాంధవ్‌గఢ్‌లో పురాతన దేవాలయాలు మరోపక్క మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్‌లో జరిపిన పరిశోధనల్లో పురాతన గుహలు, దేవాలయాలు, బౌద్ధ కట్టడాలు; మథుర, కౌశంబి వంటి ప్రాచీన నగరాల పేర్లతో కూడిన కుడ్య శాసనాలను ఏఎస్‌ఐ గుర్తించిందని అధికారులు ప్రకటించారు. 1938 తరువాత తొలిసారిగా బాంధవ్‌గఢ్‌ పులుల అభయారణ్యంలో 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏఎస్‌ఐ నెలకు పైగా తన పరిశోధన సాగించిందని తెలిపారు.

తెలంగాణ నుంచి హిమ్రూ నేత, సిద్దిపేట గొల్లభామ చీరలకు స్థానం: యునెస్కో

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలు ఉన్నట్లు యునెస్కో వెల్లడించింది. ‘21వ శతాబ్దం కోసం తయారుచేసిన చేనేత వస్త్రాలు - సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు దక్కింది.

గొల్లభామ చీరలు

సిద్దిపేట గొల్లభామ నూలుచీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. వీటికి విశిష్ట భౌగోళిక గుర్తింపు ఉంది. సిద్దిపేట కేంద్రంగా అదే పేరుతో 1960లో ఏర్పడిన హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ అనే సంస్థ ఈ చీరల మార్కెటింగ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఒకప్పుడు ఈ చీరలు నేసే నిపుణులు 2 వేల మంది దాకా ఉండేవారు. ఇప్పుడా సంఖ్య రెండు డజన్లకు పడిపోయింది. ఈ చీరలకు స్థానిక సంప్రదాయంలో కీలక భూమిక ఉంది. నేతకారులకు మద్దతిచ్చి, చేనేతకళను రక్షించడానికి సాయపడాలి. చీరలపై గొల్లభామ బొమ్మలు నేయడానికి అత్యంత నైపుణ్యం, ఓపికా ఉండాలి. దశాబ్దాలుగా ఈ కళ చేతులు మారుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం 25 మంది నిపుణులు మాత్రమే ఈ రంగంలో మిగిలారు. ‘హిమ్రూ’ ఎలా వచ్చిందంటే..:- ‘‘హిమ్రూ అనే పదం పర్షియన్‌ భాషలోని హమ్‌-రు అన్న పదం నుంచి వచ్చింది. అంటే ఒకేలా ఉండటం అని అర్థం. కిన్‌ఖ్వాబ్‌ సిల్క్‌ వస్త్రానికి ప్రత్యామ్నాయంగా అచ్చం దానిలా కనిపించేలా నూలు, ఊలుతో నేయడంవల్లే దీనికి హిమ్రూ నేత కళగా పేరొచ్చింది. మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ దీన్ని ఔరంగాబాద్‌కు తీసుకొచ్చారు. తర్వాత హైదరాబాద్‌ పాలకులు నిజాంల షేర్వానీలకు అవసరమైన వస్త్రాన్ని ఈ కళ ద్వారా తయారుచేయించుకున్నారు. నిజాం పాలన అంతమయ్యాక 60వ దశకం నుంచి క్రమంగా నేతకళకు గిరాకీ తగ్గుతూ వచ్చింది. దీనిపై ఆధారపడ్డ కళాకారులు ఇతర వృత్తుల్లోకి మళ్లారు. అందులో తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రధానంగా కనిపించే హిమ్రూ నేత, సిద్దిపేట గొల్లభామ నేత, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గొర్రెల ఊలుతో నేసే గొంగళ్లు స్థానం పొందాయి.

నల్లగొర్రెల గొంగడి

నల్లగొర్రెల ఊలుతో నేసే గొంగళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కురుమ సామాజికవర్గం వారసత్వ సంప్రదాయంగా, వారి జీవితంలో అంతర్భాగంగా మారాయి. ఈ ప్రాంతంలో లభించే స్వదేశీ గొర్రెల నుంచి మాత్రమే నల్ల ఊలు లభ్యమవుతుంది. మహిళలు ఈ ఊలును సంప్రదాయ పరికరాలతో దారంగా మారుస్తారు. పురుషులు గొంగళ్లు నేస్తారు. ప్రతి గొంగడికీ ప్రత్యేక అంచు (బార్డర్‌) ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా కొత్తగా ఎన్నో వాణిజ్యావసరాలు పుట్టుకురావడంతో కురుమలు వీటిని ఇప్పుడు పట్టణ వినియోగదారుల కోసం నేస్తున్నారు. యోగా మ్యాట్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు సంప్రదాయ గొర్రెల పెంపకం తగ్గించి మాంసం ఎక్కువ ఇచ్చే జాతులను పెంచుతుండటం వల్ల ఊలు తగ్గిపోయింది’’ అని యునెస్కో విశ్లేషించింది.

యూఎస్‌ మౌలిక వసతుల సలహామండలిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు

జాతీయ మౌలిక వసతుల సలహా మండలి సభ్యులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించనున్న 26 మంది నిపుణుల్లో ఇద్దరు భారతీయ అమెరికన్లూ ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. వారి పేర్లు మనూ ఆస్థానా, మధూ బెరివాల్‌. అమెరికా మౌలిక వసతులకు భౌతిక, సైబర్‌ ముప్పులను తగ్గించి, పటిష్ఠమైన భద్రత కల్పించడం గురించి ఈ మండలి సభ్యులు దేశాధ్యక్షుడికి సలహాలిస్తారు. పీజేఎం సంస్థ ప్రధాన కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) అయిన మనూ ఆస్థానా అమెరికా, కెనడా, మెక్సికోలలో అతిపెద్ద విద్యుత్‌ గ్రిడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. విద్యుదుత్పాదన, పంపిణీ రంగాల్లో ఆయన నిష్ణాతుడు. మధూ బెరివాల్‌ 1985లో ఇన్నోవేటివ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌కార్పోరేటెడ్‌ (ఐఈఎం)ను స్థాపించి తుపానులు, భూకంపాలు ఇతర విపత్తుల అనంతరం పునర్నిర్మాణ కార్యక్రమాలను సమర్థంగా చేపట్టడానికి తోడ్పడుతున్నారు. బాధితులకు ఫెడరల్‌ ప్రభుత్వం అందించే నిధులు, ఇతర సహాయాలను వేగంగా అందిస్తున్నారు. ఐఈఎం అమెరికాలో అతిపెద్ద దేశీయ భద్రత, అత్యవసర సహాయ నిర్వహణ సంస్థ.