ముఖ్యమైన దినోత్సవాలు

ఐసీఏఆర్‌ - నార్మ్‌ 47వ వ్యవస్థాపక దినోత్సవం

దేశంలో వ్యవసాయ రంగం గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఐసీఏఆర్‌ - నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌)లో జరిగిన 47వ వ్యవస్థాపక దినోత్సవంలో దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ రంగం, రైతులు, ప్రభుత్వ విధానాలపై లోతైన పరిశీలనతో పలు కథనాలు, వార్తలు ఇస్తున్న ఈనాడు సీనియర్‌ పాత్రికేయుడు మంగమూరి శ్రీనివాస్‌కు ఐసీఏఆర్‌ - నార్మ్‌ ఉత్తమ పాత్రికేయుడి పురస్కారం దక్కింది. నార్మ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చెరుకుమల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా పలువురు అభ్యుదయ రైతులు, అంకుర సంస్థల నిర్వాహకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేశారు.

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) 81వ వ్యవస్థాపక దినోత్సవం

తాను పరిశోధించి కరోనా వైరస్‌ను కనుగొన్న డాక్టర్‌ డోరతీ హమ్రే గురించి తెలుసుకోగలిగానని బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ ఆచార్యులు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ మాజీ డైరెక్టర్‌ బలరాం చెప్పారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) 81వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగిన కార్యక్రమంలో ‘కరోనా వైరస్‌ యుగంలో రసాయన, జీవశాస్త్రాలు’ అంశంపై ఆయన ప్రసంగించారు. వాస్తవానికి 1966 నాటికే కరోనా వైరస్‌పై హమ్రే మొదటి నివేదికను ప్రచురించారని తెలిపారు. దేశంలో ఫార్మారంగం అభివృద్ధికి సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌లు ఎనిమిది దశాబ్దాల్లో గణనీయమైన సహకారం అందించాయని ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ ఎస్‌.వెంకటమోహన్‌కు కలాం ఫెలోషిప్‌ ఎన్విరాన్‌మెంటల్‌ బయో ఇంజినీరింగ్‌లో తన పరిశోధనలకు ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌. వెంకటమోహన్‌ ప్రతిష్ఠాత్మకమైన అబ్దుల్‌ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్‌ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు, ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సంయుక్తంగా ఫెలోషిప్‌ను అందజేస్తున్నాయి.

ప్రాంతీయ భాషలకు హిందీ స్నేహితురాలు: అమిత్‌ షా

దేశంలోని ప్రాంతీయ భాషలకు హిందీ పోటీదారు కాదని స్నేహితురాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రాంతీయ భాషలు ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ అభివృద్ధి చెందుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన ‘అఖిల భారత అధికార భాషా సదస్సు’లో అమిత్‌ షా మాట్లాడారు. ఆంగ్లంలో ప్రసంగించే వారి కంటే ఎక్కువ గుర్తింపును సాధిస్తున్నారని అమిత్‌ షా చెప్పారు. యువత తమ ఆలోచనలను మాతృ భాషలో వ్యక్తీకరించనంత వరకూ సమాజం ముందు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేరని స్పష్టం చేశారు.