అవార్డులు

ఉక్రెయిన్‌ ఉద్యమకారిణికి రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు

నోబెల్‌ బహుమతికి ప్రత్యామ్నాయంగా భావించే ‘ది రైట్‌ లైవ్లీహుడ్‌’ అవార్డు ఉక్రెయిన్‌ మానవహక్కుల కార్యకర్త వొలెక్సాండ్రా మాట్విచుక్‌ను వరించింది. ఈమెతోపాటు మరో రెండు సంస్థలకు ఈ అవార్డును ప్రకటించారు. ‘ఇది మా పోరాటానికి గుర్తింపు’ అని ఈ సందర్భంగా మాట్విచుక్‌ వ్యాఖ్యానించారు. అవార్డు కింద రూ.72 లక్షల నగదు (88,300 డాలర్లు) అందజేస్తారు. నవంబరు 30న స్టాక్‌హోంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.

మిషన్‌ భగీరథకు జల్‌జీవన్‌ పురస్కారం

తెలంగాణలో ఇంటింటికీ మంచి నీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్‌ మిషన్‌ పురస్కారం లభించింది. ఈ పథకం, నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని గ్రామాలలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. ‣ ఈ మేరకు అక్టోబరు 2న దిల్లీలో పురస్కారం అందుకోవాలని ఆహ్వానించింది. ఇప్పటికే 13 స్వచ్ఛ అవార్డులు సొంతం చేసుకున్న రాష్ట్రానికి ఈ అవార్డుతో కలిపి 14 రానున్నాయి. మిషన్‌ భగీరథ అమలుపై ఇటీవల కేంద్రం అధ్యయనం చేసింది. 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరించింది. ఈ పథకం ద్వారా రోజూ ఇంటింటికీ నాణ్యమైన తాగునీరు అందుతున్నట్టు గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది.

మూడు పట్టణాలకు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ అవార్డులు

మెరుగైన పారిశుద్ధ్యం పాటిస్తున్న పట్టణాలు/నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ అవార్డులను అందజేసింది. తెలంగాణలో చెత్తరహిత నగరాలుగా (గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌) పీర్జాదీగూడ నగర పాలక సంస్థ, కోరుట్ల, అలంపూర్‌ పురపాలక సంఘాలు ఎంపికయ్యాయి. దిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కేంద్ర గృహ,పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, పీర్జాదీగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ రామకృష్ణ, కోరుట్ల పురపాలక కమిషనర్‌ అయాజ్, అలంపూర్‌ పురపాలక కమిషనర్‌ నిత్యానంద్‌ అవార్డులు స్వీకరించారు. 15 వేలలోపు జనాభా పట్టణాల కేటగిరీలో అలంపూర్, 25 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో పీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి.

ఏపీకి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు

పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు ఏపీ రాష్ట్రానికి దక్కింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అమర్‌నాథ్‌ ఈ అవార్డును అందుకున్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని మంత్రి వివరించారు.

మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ

దేశంలో మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ అవార్డు సాధించింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ అవార్డును అందుకున్నారు. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, విభాగాలకు 2018 - 19 సంవత్సరానికి సంబంధించిన అవార్డులు అందజేశారు. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తరాఖండ్‌ ప్రథమ స్థానం పొందగా, మహారాష్ట్ర ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఉత్తమ పర్యాటక మిత్ర రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. ఈ అవార్డును కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అజయ్‌భట్‌ల చేతుల మీదుగా సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ ఎ.కె.గుప్తా, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ జోగేష్‌ కుమార్‌ అందుకున్నారు. అట్లాగే ఉత్తమ పర్యాటక మిత్ర గోల్ఫ్‌ కోర్సుగా హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సు, ఉత్తమ వైద్య పర్యాటక వసతుల కేంద్రంగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రి నిలిచి అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అజయ్‌ భట్‌లు పురస్కారాలను అందజేశారు.

పర్యాటక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు

ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా (హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ విభాగం) ఆంధ్రప్రదేశ్‌ అవార్డు సాధించింది. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, విభాగాలకు 2018 - 19 సంవత్సరానికి సంబంధించిన అవార్డులు అందజేశారు. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధిలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు మధ్య పోటీ(హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌)లో ఆంధప్రదేశ్‌ తొలి స్థానంలో నిలవగా, కేరళ, గోవా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సముద్ర తీర పర్యాటకానికి సంబంధించి బీచ్‌ల చిత్రాలు, సమాచారంతో ఏపీ పర్యాటక శాఖ రూపొందించిన కాఫీ టేబుల్‌ బుక్, రష్యన్, స్పానిష్, జర్మన్‌ భాషల్లో ఏపీ పర్యాటక శాఖ రూపొందించిన కాఫీ టేబుల్‌ బుక్‌లకు ఉత్తమ సమాచార విభాగంలో అవార్డులు దక్కాయి. ఉత్తమ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ విభాగంలో విజయవాడ గేట్‌ వే హోటల్‌కు ద్వితీయ పురస్కారం దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రి అజయ్‌ భట్‌ చేతుల మీదుగా అవార్డులను రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, విజయవాడ గేట్‌ వే హోటల్‌ ప్రతినిధులు అందుకున్నారు.

తెలంగాణకు 3 స్వచ్ఛ పురస్కారాలు

రాష్ట్రంలోని మరో మూడు పురపాలికలు స్వచ్ఛ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా అలంపూర్, పీర్జాదీగూడ, కోరుట్ల పురపాలికలు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమాచారం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల కింద 1850 పట్టణాలు ఈ పోటీలో పాల్గొనగా తెలంగాణ నుంచి మూడు ఎంపికైనట్లు పురపాలక శాఖ తెలిపింది. 15 వేల లోపు జనాభా విభాగంలో అలంపూర్, 25 వేల నుంచి 50 వేల జనాభా విభాగంలో పీర్జాదీగూడ, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా విభాగంలో కోరుట్ల పట్టణానికి పురస్కారాలు దక్కాయి. సెప్టెంబరు 30న దిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు.

డిజిటల్‌ ఆరోగ్య సేవలకు 6 జాతీయ అవార్డులు

జాతీయ స్థాయిలో చేపట్టిన డిజిటల్‌ ఆరోగ్య సేవల్లో రాష్ట్రానికి ఆరు జాతీయ అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో వీటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాండవీయా నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ స్వీకరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో అత్యధిక హెల్త్‌ రికార్డుల అనుసంధానం, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, హెల్త్‌ రికార్డుల సమీకృతం చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు, డిజిటలైజేషన్‌లో ముందంజలో ఉన్నందుకు బాపట్ల, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు వచ్చాయని వివరించారు.

‘షీ-భరోసా సైబర్‌ ల్యాబ్‌’కు ఫిక్కీ పురస్కారం

బాలల సంరక్షణ విభాగంలో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ‘షీ-భరోసా సైబర్‌ ల్యాబ్‌’కు ఫిక్కీ స్మార్ట్‌ పోలీసింగ్‌ స్పెషల్‌ జ్యూరీ - 2022 పురస్కారం దక్కింది. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

తెలంగాణ అంకురాలకు అంతర్జాతీయ పురస్కారాలు

తెలంగాణ కృత్రిమ మేధ మిషన్‌కు చెందిన రెండు అంకుర సంస్థలు ఇండోనేసియాలోని బాలిలో జరుగుతున్న జీ20 ఆవిష్కరణల నెట్‌వర్క్‌ అంతర్జాతీయ సదస్సులో పురస్కారాలకు ఎంపికయ్యాయి. విద్య సాంకేతిక విభాగంలో ఎడ్యూబక్‌ అంకుర సంస్థకు జ్యూరీ పురస్కారం, పంపిణీ గొలుసు (సప్లై చైన్‌) విభాగంలో యూనిమార్ట్‌ అంకుర సంస్థకు ప్రేక్షకుల (ఆడియెన్స్‌) పురస్కారం లభించాయి. భారత్‌ నుంచి మొత్తం అయిదు అంకుర సంస్థలు ఈ సదస్సుకు హాజరు కాగా అందులో నాలుగు తెలంగాణ కృత్రిమ మేధ మిషన్‌కు చెందినవే.

తెలంగాణ సెర్ప్‌నకు కేంద్ర పురస్కారం

ఆత్మనిర్భర్‌ ప్రాజెక్టులో భాగంగా ‘10కే ఎఫ్‌పీవో’ పథకంలో తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)కు పురస్కారం లభించింది. ఈ మేరకు దిల్లీలో జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ సెర్ప్‌ సీవోవో ఎన్‌.రజిత అవార్డు అందుకున్నారు. రాష్ట్రంలో 35 రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలను కంపెనీ చట్టం ప్రకారం నమోదు చేయించినందుకు పురస్కారం లభించింది.

భారత సైన్యాధిపతికి నేపాల్‌ ఆర్మీ గౌరవ జనరల్‌ హోదా ప్రదానం

నేపాల్‌ అధ్యక్షురాలు బైద్య దేవీ భండారి తమ దేశ గౌరవ జనరల్‌ హోదాను భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండేకు ప్రదానం చేశారు. కాఠ్మాండులోని అధ్యక్షురాలి అధికారిక నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఖడ్గం, ప్రశంసా పత్రాన్ని కూడా జనరల్‌ మనోజ్‌ పాండేకు ఆమె అందించారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు చిహ్నంగా గత ఏడు దశాబ్దాలుగా ఈ సంప్రదాయంగా కొనసాగుతోంది. నేపాల్‌ సైన్యాధిపతికి భారత్‌ కూడా గౌరవ జనరల్‌ హోదాను ప్రదానం చేస్తోంది.

‘సైకాప్స్‌’లో తెలంగాణకు మొదటి స్థానం

జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) నిర్వహించిన ‘సీసీటీఎన్‌ఎస్‌ హ్యాకథాన్‌ అండ్‌ సైబర్‌ ఛాలెంజ్‌ - 2022’లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. నిఘా విభాగంలోని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) రూపొందించిన ‘సైకాప్స్‌’ సాఫ్ట్‌వేర్‌ టూల్‌కు ఈ ఘనత దక్కింది. ఈ మేరకు దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి స్వగత్‌దాస్, తెలంగాణ సీఐ సెల్‌ ఎస్పీ దేవేందర్‌సింగ్‌కు బహుమతి అందించారు. దేవేందర్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని ఉద్యోగుల బృందం ఈ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పాగా వేసిన సైబర్‌ నేరాలు, నేరగాళ్ల జాడలు పసిగట్టి వారి మూలాలు గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇప్పటికే నేరగాళ్ల మధ్య ఉన్న సంబంధాలపై 43 వేల లింకులు గుర్తించగా 238 కేసులలో 650 మందిని అరెస్టు చేశారు. అలాగే 24 రాష్ట్రాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాయి. నేరాలను అదుపు చేయడంలో తీసుకుంటున్న సాంకేతిక చర్యలకు సంబంధించి సైకాప్స్‌ను అత్యుత్తమమైనదిగా గుర్తించారు.

తెలంగాణలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

తెలంగాణలోని పుర, నగరపాలికలకు పురస్కారాల పంట పండింది. రాష్ట్రంలోని 16 పుర, నగరపాలికలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022 అవార్డులు దక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణకు స్టార్‌ రేటింగ్‌ ఇచ్చి వీటిని ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, చెత్త రహిత వాణిజ్య ప్రాంతాలు, ప్రజా మరుగుదొడ్లు, సామాజిక సౌచాలయాల నిర్వహణ, ప్రజల అవగాహన, భాగస్వామ్యం, ఆవిష్కరణలు వంటి 90 అంశాలపై అధ్యయనం అనంతరం ఉత్తమ పట్టణ స్థానిక సంస్థలను ఎంపిక చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఓడీఎఫ్‌ ప్లస్‌గా 70, ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌గా 40 సంస్థలను, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్‌ ప్లస్‌గా, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలు (ఓడీఎఫ్‌)గా ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబరు 1న దిల్లీలో స్వచ్ఛ మహోత్సవ్‌ అవార్డులను ప్రదానం చేస్తారు. పురస్కారానికి ఎంపికైన పట్టణ సంస్థలు బడంగ్‌పేట, ఆదిభట్ల, భూత్పూర్, చండూరు, చిట్యాల, గజ్వేల్, ఘట్కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజల్, వేములవాడ.

ఇద్దరికి జాతీయ సేవా పథకం పురస్కారాలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ సేవా పథకం అవార్డులు అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కేటగిరీలో వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ సుంకరి జ్యోతి జాతీయ స్థాయిలో రెండో బహుమతి స్వీకరించారు. ఈ అవార్డు కింద ఆమెకు రూ.3 లక్షల నగదు, వెండి పతకం బహూకరించారు. వాలంటీర్‌ కేటగిరీలో హైదరాబాద్‌ శ్రేయాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన మైసూరారెడ్డి అవార్డు స్వీకరించారు. రూ.లక్ష నగదు, వెండి పతకం అందుకున్నారు. అన్ని కేటగిరీల్లో 42 అవార్డులు ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు 5 దక్కాయి.

ఏపీకి ఆరు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

కేంద్రం ఏటా ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులకు ఏపీలోని ఆరు పుర, నగరపాలక సంస్థలు ఎంపికయ్యాయి. జాతీయ స్థాయిలో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డు దక్కించుకుంది. నగరపాలక సంస్థల విభాగంలో విజయవాడ, మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ), పురపాలక సంఘాల విభాగంలో సాలూరు, పుంగనూరు, పులివెందులకు అవార్డులు దక్కాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ నుంచి స్వచ్ఛాంధ్ర సంస్థకు సమాచారం అందింది. వివరాలను ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది. అక్టోబరు 1న దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందిస్తారు. జాతీయస్థాయిలో ఎంపికైన తిరుపతి నగరపాలక సంస్థకు అవార్డును ప్రధాని అందజేయనున్నారు.

దలైలామాకు స్పెండ్‌లవ్‌ పురస్కారం

టిబెట్‌ ఆధ్యాత్మికవేత్త దలైలామాను అలైస్‌ అండ్‌ క్లిఫర్డ్‌ స్పెండ్‌లవ్‌ పురస్కారం వరించింది. సామాజిక న్యాయం, దౌత్యం, సహన విభాగాల్లో ఈ పురస్కారం ప్రకటించినట్లు దలైలామా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మెసెడ్‌ నగరానికి చెందిన షెర్రీ స్పెండ్‌లవ్‌ 2005లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఈ అవార్డును స్థాపించారు. ఈ పురస్కారం కింద రూ.12,14,902 (15,000 డాలర్లు) అందజేస్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ఈ అవార్డు అందుకొన్నారు.

‘స్వచ్ఛ’ తెలంగాణకు 13 పురస్కారాలు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో రాష్ట్రానికి పురస్కారాల పంట పండింది. ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఏకంగా 13 అవార్డులు దక్కించుకోవడం ద్వారా ఘనత చాటుకుంది. జాతీయ స్థాయిలో ఆరు విభాగాల్లో మొదటి ర్యాంకు, నాలుగు విభాగాల్లో రెండో ర్యాంకు, మూడు విభాగాల్లో మూడో ర్యాంకును తెలంగాణ కైవసం చేసుకుంది. అక్టోబరు 2న స్వచ్ఛభారత్‌ దివస్‌ సందర్భంగా దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛ కార్యక్రమాల్లో తెలంగాణ మంచి పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు. ‣ సర్వేక్షణ్‌ గ్రామీణ (ఎస్‌ఎస్‌జీ - గ్రామీణ) అవార్డుల కేటగిరీలో పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డు లభించింది. ఎస్‌ఎస్‌జీ టాప్‌ జిల్లా కేటగిరీలో జగిత్యాల రెండో స్థానం, నిజామాబాద్‌ మూడో స్థానంలో నిలిచాయి. ‣ దక్షిణాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ టాప్‌ జిల్లా జోన్ల కేటగిరీలో నిజామాబాద్‌ రెండో స్థానం, భద్రాద్రి కొత్తగూడెం మూడో స్థానంలో నిలిచాయి. ‣ ‘సుజలాం 1.0 క్యాంపయిన్‌’లో తెలంగాణ మూడో స్థానంలో నిలవగా, ‘సుజలాం 2.0 క్యాంపయిన్‌’లో రెండో స్థానం సాధించింది. ‣ గ్రామ పంచాయతీల జాతీయ ఫిల్మ్‌ పోటీల్లో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామానికి రెండో ర్యాంకు వచ్చింది. ‣ దక్షిణ జోన్‌ విభాగంలో బయో వ్యర్థాల నిర్వహణ, గోబర్‌దాన్, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, గ్రేవాటర్‌ నిర్వహణ, మలవ్యర్థాల నిర్వహణ ఓడీఎఫ్‌ వాల్‌ పెయింటింగ్‌లో రాష్ట్రం మొదటి ర్యాంకులు సాధించింది.

ద.మ.రైల్వేకు ఇంధన అవార్డులు

దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే జాతీయ స్థాయిలో మూడు ఇంధన అవార్డులు పొందింది. హైదరాబాద్‌ భవన్‌ (డీఆర్‌ఎం కార్యాలయం-హైదరాబాద్‌), కాచిగూడ స్టేషన్‌ భవనం, లింగంపల్లి రైల్వే స్టేషన్‌ (సికింద్రాబాద్‌ డివిజన్‌) భవనాల రంగంలో ఇంధన సామర్థ్య యూనిట్లుగా అవార్డులు సాధించాయి. ఇంధన నిర్వహణపై సీఐఐ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) దిల్లీలో జాతీయ అవార్డులను ప్రదానం చేసింది. ఇంధన సామర్థ్యంలో అత్యున్నత ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’గా ఈ ఏడాది కాచిగూడ స్టేషన్‌ను ప్రకటించారు. దీంతో ఈ రైల్వేస్టేషన్‌ వరుసగా మూడో సంవత్సరం విశిష్ట ఇంధన సామర్థ్య యూనిట్‌ అవార్డును దక్కించుకున్నట్లయింది. కాచిగూడ స్టేషన్‌కు వచ్చిన అవార్డును హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) శరత్‌ చంద్రయాన్, మిగిలిన స్టేషన్ల అవార్డులను ఇతర అధికారులు అందుకున్నారు. ఎల్‌ఈడీ లైటింగ్‌ వాడకం, నీళ్లను వేడిచేసేందుకు, విద్యుత్తు అవసరాలకు సౌరశక్తిని వినియోగించడం, రైళ్లు నడవని సమయంలో ఫ్యాన్లు 70 శాతం ఆగిపోయేలా ప్రత్యేక సర్క్యూట్ల ఏర్పాటు వంటి ఇంధన పరిరక్షణ చర్యలు చేపడుతుండటంతో ఈ పురస్కారాలు లభించినట్లు ద.మ. రైల్వే తెలిపింది.

రక్తపోటు నియంత్రణలో భారత్‌కు ఐరాస అవార్డు

రక్తపోటు నియంత్రణ, నివారణకు చేస్తున్న విశేష కృషికిగాను భారత్‌ ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక అవార్డును గెల్చుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద చేపట్టిన ‘భారత రక్తపోటు నియంత్రణ కార్యక్రమం (ఐహెచ్‌సీఐ)’ ద్వారా ప్రాథమిక ఆరోగ్య సేవల వ్యవస్థలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘2022 ఐరాస ఇంటర్‌ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్, ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక కార్యక్రమం’ అనే అవార్డు దక్కినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

డాక్టర్‌ రాధిక బాత్రాకు ‘గ్లోబల్‌ గోల్స్‌’ అవార్డు

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల’ (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌/ఎస్‌డీజీ) సాధనకుగాను అసాధారణ పనితీరు చూపించిన నలుగురు ప్రతిభావంతులను బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ అవార్డులతో సత్కరించింది. ‘గోల్‌కీపర్స్‌ గ్లోబల్‌ గోల్స్‌’ పేరిట ఇచ్చిన ఈ అవార్డులకు ఎంపికైన వారిలో భారత్‌ నుంచి డాక్టర్‌ రాధికా బాత్రా ఉన్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన జహ్రా జోయా (జర్నలిస్టు), ఉగాండాకు చెందిన వెనెస్సా నకాటే (పర్యావరణ కార్యకర్త), యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూయార్క్‌లోని లింకన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో ఈ అవార్డులు ప్రదానం చేశారు. ‘ఎవెరీ ఇన్‌ఫ్యాంట్‌ మ్యాటర్స్‌’ (ప్రతి శిశువూ ముఖ్యమే) స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకురాలైన రాధికా బాత్రా దిల్లీ మురికివాడల పిల్లలకు ఆరోగ్య సేవలు అందించడంలో కృషి చేశారు.

ముగ్గురికి జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలు

జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కింద 2020 - 21 సంవత్సరానికి ప్రోగ్రాం అధికారి జితేంద్ర గౌడ్, వాలంటీర్లు చుక్కల పార్థసారథిÅ, దేవనపల్లి సిరికి జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలు లభించినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి అశోక్‌రెడ్డి తెలిపారు. జేఎన్‌టీయూ అనంతపురంలో పని చేస్తున్న జితేంద్ర గౌడ్‌కు జాతీయ ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన పార్థసారథి, అనంతపురం ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలకు చెందిన దేవనపల్లి సిరికి ఉత్త వాలంటీర్ల అవార్డులు లభించాయి. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సెప్టెంబరు 24న నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డులను అందించనున్నారు.

స్వాతి పిరమాల్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం

ప్రముఖ భారత శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరమాల్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. వాణిజ్యం, పరిశ్రమలు, సైన్స్, ఔషధ రంగాల్లో సేవలు, భారత్‌ - ఫ్రాన్స్‌ సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న పిరమాల్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా స్వాతి పిరమాల్‌ (66) వ్యవహరిస్తున్నారు. ఈ వారంలో ఫ్రాన్స్‌ విదేశీ వ్యవహారాల మంత్రి క్యాధరిన్‌ కోలోనా భారత పర్యటనలో స్వాతి పిరమాల్‌కు ‘ది చెవాలియర్‌ డి లా లీజియన్‌ డిహానర్‌ ఆర్‌ నైట్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ హానర్‌’ పురస్కారాన్ని అందించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మ్యాక్రన్‌ తరఫున ఆమె ఈ అవార్డును బహూకరించారు. ఇంతకు ముందు 2016లో ఫ్రాన్స్‌ రెండో అత్యున్నత పురస్కారం చెవాలియర్‌ డీ ఎల్‌ఆర్డ్రే నేషనల్‌ డు మెరిట్‌ను స్వాతి పిరమాల్‌ పొందారు.

విశాఖ ఉక్కుకు జాతీయ పురస్కారాలు

హిందీ అమలుకు సంబంధించి విశాఖ ఉక్కు పరిశ్రమకు జాతీయ స్థాయిలో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో గుజరాత్‌లోని సూరత్‌లో జాతీయ హిందీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ భాష అమలు విభాగంలో విశాఖ ఉక్కు రాజభాష కీర్తి పురస్కారానికి ఎంపికైంది. హిందీ ఇన్‌ హౌస్‌ మ్యాగజీన్‌ విభాగంలో విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహిస్తున్న హిందీ మ్యాగజీన్‌ ‘సుగంధ్‌’ రాజభాష కీర్తి పురస్కారానికి ఎంపికైంది. ఆయా పురస్కారాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ చేతుల మీదుగా విశాఖ ఉక్కు సీఎండీ అతుల్‌ భట్‌ అందుకున్నారు.

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు అంతర్జాతీయ పురస్కారం

జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు, నిపుణుల్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)కు ఆసియా, పసిఫిక్‌ సమీకృత గ్రామీణాభివృద్ధి కేంద్రం (సీఐఆర్‌డీఏపీ) అజీజ్‌-ఉల్‌-హక్‌ గ్రామీణాభివృద్ధి పురస్కారం లభించింది. బ్యాంకాక్‌లో జరిగిన సీఐఆర్‌డీఏపీ సాంకేతిక సమావేశంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డిప్యూటీ డీజీ శశి భూషణ్, సీఆర్‌టీసీటీఎన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎన్‌వీ మాధురి ఈ అవార్డును అందుకున్నారు.

సింగీతం శ్రీనివాసరావుకు జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానం

కొప్పరపు కవుల కళాపీఠం ఆధ్వర్యంలో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను జ్ఞాపికతో సత్కరించారు. తొలుత 2020, 2021, 2022 సంవత్సరాలకు అవధాన కళా పురస్కారాలను పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జీఎం రామశర్మ, వద్దిపర్తి పద్మాకర్‌లకు అందజేశారు. అనంతరం ధూళిపాళ మహాదేవమణిని అవధాన విద్యా వికాస విశేష కృషి పురస్కారంతో సన్మానించారు.

తెలుగు వ్యక్తికి మడగాస్కర్‌ ప్రభుత్వ పురస్కారం

తెలుగు వ్యక్తి, ప్రముఖ వ్యాపారవేత్త మానవేంద్రరావు వేములపల్లికి మడగాస్కర్‌ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘నైట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఆర్డర్‌’ లభించింది. బాపట్ల జిల్ల్లా భట్టిప్రోలు మండలం తూర్పు పాలేనికి చెందిన ఆయన 1986లో మడగాస్కర్‌ వెళ్లి పలు బహుళజాతి సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. అనంతరం అక్కడే వ్యాపార రంగంలో ఉంటూ తన సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. మానవేంద్రరావు సేవలను గుర్తిస్తూ మడగాస్కర్‌ ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.

శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం

‘కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడి అన్యాయాలు, అణిచివేతలను ఎదిరిస్తూ వ్యవస్థపై అక్షరతూటాలు పేల్చిన విప్లవకవి’ అని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీర్తించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కాళోజీ నారాయణరావు’ పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు, శాలువా, జ్ఞాపికతో కవి, పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్‌ను సత్కరించారు.

శిల్పగురు అవార్డుకు శ్రీనివాసులరెడ్డి ఎంపిక

కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో హస్తకళల జాతీయ స్థాయి పురస్కారానికి శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుడు ఎంపికయ్యారు. కేంద్రం విడుదల చేసిన జాబితాలో శ్రీకాళహస్తి బి.పి.అగ్రహారానికి చెందిన వేలాయుధం శ్రీనివాసులరెడ్డి పేరు ఉంది. కలంకారీలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే కళాకారులను శిల్పగురు అవార్డుతో కేంద్రం సత్కరిస్తోంది. జాతీయ స్థాయిలో పది మందిని ఎంపిక చేస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి శ్రీనివాసులరెడ్డి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు.

తెలంగాణ జైళ్ల శాఖకు 6 బంగారు పతకాలు

అఖిల భారత ఆరో ‘ప్రిజన్‌ డ్యూటీమీట్‌ - 2022’లో తెలంగాణ జైళ్ల శాఖ సత్తా చాటింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సెప్టెంబరు 4 నుంచి 6 వరకు జరిగిన పోటీల్లో 6 బంగారు పతకాలతో తొలి స్థానంలో నిలిచింది. ఒక వెండి, రెండు కాంస్య పతకాలతో పాటు 4 ట్రోఫీలను సైతం సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో 19 రాష్ట్రాల నుంచి 960 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ జైళ్లశాఖ తరఫున 11 మంది అధికారులు, 64 మంది సిబ్బంది హాజరయ్యారు. వీరికి వరంగల్‌ కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి సంపత్‌ నేతృత్వం వహించారు. ఈ ముగింపు ఉత్సవంలో విజేతలకు గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవదత్‌ పురస్కారాల్ని అందజేశారు. బంగారు పతక విజేతలు.. ‣ బిజినెస్‌ ప్రిజన్‌ మోడల్‌: సూపరింటెండెంట్‌ సంపత్‌ ‣ ఫస్ట్‌ఎయిడ్‌: రాజ్‌కుమార్‌ (డిప్యూటీ జైలర్‌) ‣ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌: శ్రీమాన్‌రెడ్డి (జైలర్‌), భరత్‌ (డిప్యూటీ సూపరింటెండెంట్‌) ‣ కరాటే (వ్యక్తిగతం): కూర్మారావు, పరాశరన్‌ ‣ క్రావ్‌ మగా (బృందం): రత్నం (జైలర్‌), మోహన్‌ (వార్డర్‌Â), కాశీశ్వరబాబు (వార్డర్‌) ‣ కరాటే (బృందం): రత్నం (జైలర్‌), కాశీశ్వరబాబు (వార్డర్‌), మోహన్‌ (వార్డర్‌)

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం

ఈ రోజున్న విజ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి శాస్త్రం, పరిశోధన, నవకల్పనలే ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆమె ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 45 మంది టీచర్లకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించారు.