ఆర్ధిక రంగం

భారత్‌ వృద్ధి రేటు 7.3%: ఎస్‌ అండ్‌ పీ

ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2023 - 24లో 6.5 శాతం భారత్‌ వృద్ధి రేటు ఉంటుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2022 ఆఖరు వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ఠ లక్ష్యమైన 6 శాతం కంటే ఎగువనే ఉంటుందని తెలిపింది. కరోనా పరిణామాల నుంచి కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక వినియోగం దన్నుగా నిలుస్తోందని పేర్కొంది. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందొచ్చు. ఆర్‌బీఐ అంచనా 7.2% కంటే ఇది తక్కువ.

డిజిటల్‌ విధానంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు

బ్యాంకింగ్‌ సేవలను పూర్తిగా డిజిటల్‌లో అందించే లక్ష్యంతో ప్రారంభించిన ‘సంభవ్‌’లో భాగంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేస్తున్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇందువల్ల బ్యాంకు శాఖకు వెళ్లి భూమి యాజమాన్యం, ఇతర పత్రాలను రైతు సమర్పించాల్సిన అవసరం ఉండదు. మొబైల్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చని, పత్రాల పరిశీలన కూడా ఆన్‌లైన్‌లో చేస్తామని యూబీఐ ఎండీ-సీఈఓ ఎ.మణిమేఖలై తెలిపారు. అన్నీ సరిగ్గా ఉంటే, కేవలం 2 గంటల్లోనే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు మంజూరవుతుందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌) సహకారంతో, మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి బ్యాంక్‌ ప్రారంభించింది. ఫెడరల్‌ బ్యాంకు ఇదే తరహాలో డిజిటల్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డును చెన్నైలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. ఇ-కేవైసీ, ఇ-సైన్, ఏపీఐ ఉపయోగించి, ఈ కార్డును అందిస్తున్నట్లు బ్యాంకు ఎండీ-సీఈఓ శ్యాం శ్రీనివాసన్‌ తెలిపారు.

అంబుజా, ఏసీసీ ఛైర్మన్‌గా కరణ్‌ అదానీ

గౌతమ్‌ అదానీ పెద్ద కుమారుడు కరణ్‌ అదానీకి, గ్రూప్‌లోని సిమెంట్‌ కంపెనీల బాధ్యతను అప్పజెప్పారు. స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ నుంచి అంబుజా సిమెంట్స్, ఏసీసీలను 6.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.52,000 కోట్ల)తో కొనుగోలు చేసే ప్రక్రియను పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. తద్వారా దేశంలోనే సిమెంటు ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరింది. ఈ రెండు కంపెనీలకు అధిపతిగా గౌతమ్‌ అదానీ (60) ఉంటారు. ప్రస్తుతం పోర్టు వ్యాపారాలకు అధిపతిగా ఉన్న పెద్ద కుమారుడు కరణ్‌ను ఈ రెండు కంపెనీల్లో డైరెక్టర్‌గా నియమించారు. ఏసీసీకి ఛైర్మన్‌గానూ కరణ్‌ను ప్రకటించారు. అంబుజా సీఈఓగా అజయ్‌ కుమార్‌; ఏసీసీ సీఈఓగా శ్రీధర్‌ బాలకృష్ణన్‌ను ప్రకటించారు. అదానీ చిన్న కుమారుడు జీత్, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో చదివి, ప్రస్తుతం అదానీ గ్రూప్‌ ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

కాఫీ బోర్డు సభ్యుడిగా చల్లా శ్రీశాంత్‌

సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఎండీ చల్లా శ్రీశాంత్, కాఫీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయన 2024 - 25 వరకు పనిచేస్తారు. ఇన్‌స్టెంట్‌ కాఫీ ఉత్పత్తిదార్ల ప్రతినిధిగా ఆయన్ను కాఫీ బోర్డుకు ఎంపిక చేసినట్లు సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ వెల్లడించింది. సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ వ్యవస్థాపకుడైన చల్లా రాజేంద్ర ప్రసాద్, 1990 - 99, 2009 - 12, 2014 - 17 సంవత్సరాల్లో కాఫీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వృద్ధి రేటు అంచనా 7%: ఫిచ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి సవరిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. ద్రవ్యోల్బణం అధిక స్థాయుల్లో కొనసాగుతుండటం, వడ్డీ రేట్లు పెరగడం, అంతర్జాతీయ ప్రతికూలతలు ఇందుకు కారణాలుగా పేర్కొంది. 2022 - 23లో భారత వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావచ్చని జూన్‌లో ఫిచ్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023 - 24కు కూడా వృద్ధి రేటు అంచనాను 7.4 శాతం నుంచి 6.7 శాతానికి ఫిచ్‌ తగ్గించింది. ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి 18.5 శాతంగా నమోదు కావచ్చని తాము అంచనా వేయగా, 13.5 శాతానికి పరిమితమైందని గుర్తు చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్ల పెంపును కొనసాగించ వచ్చని ఫిచ్‌ అభిప్రాయపడింది. రెపో రేటు ప్రస్తుత 5.4 శాతం నుంచి ఏడాది చివరకు 5.9 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది.

అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌

బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (854.7 బిలియన్‌ డాలర్లు)గా తాజాగా అవతరించిన భారత్‌ 2029 నాటికల్లా మూడో స్థానానికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ విభాగం అంచనా వేసింది. 2027లో జర్మనీని, 2029లో జపాన్‌ను అధిగమించే సూచనలు ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది. ‣ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం. ఇక ఇపుడు అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్‌ ముందున్నాయని ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఏడేళ్లలో జపాన్, జర్మనీలనూ అధిగమించి మూడో స్థానానికి భారత్‌ వెళ్లవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దం కిందట.. సరిగ్గా పదేళ్ల కిందట అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 11వ ర్యాంకులో ఉంది. ఆ సమయంలో బ్రిటన్‌ది అయిదో స్థానం. ఐఎమ్‌ఎఫ్‌ గణాంకాలు, చారిత్రాత్మక ఎక్స్ఛేంజీ రేట్ల ఆధారంగా బ్లూమ్‌బర్గ్‌ వేసిన లెక్కల ప్రకారం ఇపుడు బ్రిటన్‌ను అధిగమించి అయిదో స్థానంలో భారత్‌ చేరింది. జనవరి - మార్చిలో భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 816 బి.డాలర్లుగా తేలిందని బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది.

యూబీఐ ‘ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌’ ఏర్పాటు

హైదరాబాద్‌లోని సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (సీసీఓఈ) లో ‘ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌’ ను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఏర్పాటు చేసింది. బ్యాంకులోని సమాచారం, డిజిటల్‌ ఆస్తులు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలను సైబర్‌ మోసాల నుంచి కాపాడేందుకు అనువైన సైబర్‌ రక్షణ వ్యవస్థను రూపొందించడం ఈ ల్యాబ్‌ ఏర్పాటు లోని ప్రధాన లక్ష్యం. యూబీఐ ఎండీ - సీఈఓ ఎ.మణిమేఖలై ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే యత్నాల్లో ఉన్నట్లు మణిమేఖలై వివరించారు. సమాచారాన్ని తస్కరించకుండా ‘ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆర్‌ఈసీకి మహారత్న హోదా

విద్యుత్తు రంగానికి ఆర్థిక చేయూతనందించేందుకు 1969లో ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థ ఆర్‌ఈసీకి మహారత్న హోదా దక్కింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా పొందిన 12వ సంస్థగా ఆర్‌ఈసీ నిలిచింది. ఈ హోదా వల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకునే విషయంలో సంస్థ పాలక మండలికి విస్తృత అధికారాలు లభించనున్నాయి. దేశం లోపల, బయట సంయుక్త సంస్థలు, సంపూర్ణ యాజమాన్య హక్కులున్న అనుబంధ సంస్థలు, విలీనాలు, ఇతర సంస్థల స్వాధీనతకు ఈ సంస్థ పాలక మండలికి అధికారాలు లభిస్తాయి. ఒక్కో ప్రాజెక్టులో గరిష్ఠంగా రూ.5000 కోట్లు గానీ, లేదంటే తన నెట్‌వర్త్‌లో 15% మొత్తాన్ని కానీ పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. సిబ్బంది, మానవ వనరుల నిర్వహణ, శిక్షణ వ్యవహారాలకు ప్రత్యేక విధానాన్ని అమలు చేసుకునే అవకాశం లభిస్తుందని ఆర్‌ఈసీ సీఎండీ వివేక్‌ దేవాంగన్‌ పేర్కొన్నారు.

వృద్ధి 7 శాతమే: ఏడీబీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) భారత వృద్ధి రేటు అంచనాలను ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తగ్గించింది. తొలి అంచనా ఏప్రిల్‌లో 7.5 శాతం, జులై సవరణలో 7.2 శాతం వృద్ధి రేటు లభిస్తుందని అంచనా వేసిన సంస్థ, ఇప్పుడు మరింత తగ్గించి 7 శాతంగా పేర్కొంది. చమురు అధిక ధరలు, అధిక ద్రవ్యోల్బణంతో దేశీయ వినిమయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటం, అంతర్జాతీయ గిరాకీలో స్తబ్దత వల్ల నికర ఎగుమతులు తగ్గొచ్చనే అంశాలు ఇందుకు నేపథ్యమని పేర్కొంది. సేవల్లో బలమైన వృద్ధి కారణంగానే 2022 - 23 తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 13.5 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఏడీఓ - 2022 (ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌)కి సంబంధించి రెండో అనుబంధ నివేదికలో ఏడీబీ వెల్లడించింది. ద్రవ్యోల్బణం 2022 ఏప్రిల్‌ - జూన్‌లో సగటున 7.3 శాతంగా నమోదైందని పేర్కొంది.

మార్కెట్‌ విలువలో దేశంలోనే అగ్రగామి గ్రూపుగా అదానీ

మార్కెట్‌ విలువపరంగా దేశంలోనే అగ్రగామి గ్రూపుగా అదానీ అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న టాటాలను వెనక్కి నెట్టింది. ట్రేడింగ్‌ ముగిసేనాటికి అదానీ గ్రూపునకు చెందిన (తాజాగా కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ఏసీసీతో కలిపి) నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.22.25 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో టాటా గ్రూపు నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.20.81 లక్షల కోట్లుగా ఉంది.

బ్రాండ్‌ విలువలో టీసీఎస్‌ టాప్‌

దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అవతరించింది. అంతర్జాతీయ మార్కెటింగ్‌ డేటా, అనలిటిక్స్‌ దిగ్గజ కంపెనీ అయిన కంటార్‌ బ్రాండ్జ్‌ ఇండియా ర్యాంకులను ప్రారంభించిన 2014 నుంచీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఈ ఏడాది టీసీఎస్‌ తొలి స్థానాన్ని అధిరోహించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ‘కంటార్‌ బ్రాండ్జ్‌ టాప్‌ 75 మోస్ట్‌ వాల్యుబుల్‌ ఇండియన్‌ బ్రాండ్స్‌ - 2022’ పేరిట నివేదికను విడుదల చేసింది. ఆసియా పసిఫిక్‌లో రెండో స్థానం 2020తో పోలిస్తే 2022లో టీసీఎస్‌ తన బ్రాండ్‌ విలువను 212 శాతం పెంచుకుని 45,519 మిలియన్‌ డాలర్లకు చేర్చుకోవడం ద్వారా, దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 46వ స్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్‌ కంపెనీల్లో శాంసంగ్‌ మాత్రమే దీని ముందు ఉంది.

సియామ్‌ అధ్యక్షుడిగా వినోద్‌ అగర్వాల్‌

సియామ్‌ అధ్యక్షుడిగా 2022 - 23 కాలానికి వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ ఎండీ వినోద్‌ అగర్వాల్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేశ్‌ చంద్ర, కోశాధికారిగా దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ ఎండీ సత్యకమ్‌ ఆర్యను ఎన్నుకున్నారు. ఇంటర్నెట్‌తో అనుసంధానత, విద్యుత్తు వాహనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం సహా అధునాతన భద్రతా సదుపాయాలను అందిపుచ్చుకోవడంలో వాహన రంగం నిమగ్నమై ఉందని ఈ సందర్భంగా వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఎస్‌బీఐ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.5 లక్షల కోట్లుగా నమోదు

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. బ్యాంకింగ్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల తరవాత రూ.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ అందుకున్న సంస్థగా ఎస్‌బీఐ నిలిచింది. ఇంట్రాడేలో బ్యాంక్‌ షేరు 3 శాతం పెరిగి రూ.574.75 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.39 శాతం లాభంతో రూ.571.60 వద్ద ముగిసింది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.5.10 లక్షల కోట్లుగా నమోదైంది. ఫలితంగా మార్కెట్‌ విలువ పరంగా దేశీయ అగ్రగామి 10 సంస్థల్లో 7వ స్థానంలోకి ఎస్‌బీఐ వచ్చింది. ఇదిలా ఉంటే ఎస్‌బీఐ తన బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ను 0.7 శాతం పెంచి 13.45 శాతానికి చేరుస్తున్నట్లు ప్రకటించింది.

ఇండిగో సీఈఓగా పీటర్‌ ఎల్బర్స్‌

విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా పీటర్‌ ఎల్బర్స్‌ బాధ్యతలను స్వీకరించారు. రోనోజాయ్‌ దత్తా స్థానంలో ఈయన చేరారు. 2024 జనవరి 23 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ, ఈ సెప్టెంబరు 30న పదవీ విమరణ చేయాలని దత్తా నిర్ణయించుకున్న నేపథ్యంలో కొత్త సీఈఓగా ఎల్బర్స్‌ను నియమించినట్లు కంపెనీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దత్తాకు ముందు ఈ కంపెనీకి బ్రూస్‌ యాస్బీ (2005 - 2008), ఆదిత్య ఘోష్‌ (2008 - 2018)లు సీఈఓగా పనిచేశారు.

2022కు భారత వృద్ధి అంచనాలు 7.7 శాతమే!

భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, దేశమంతటా ఒకేలా కురవని వర్షాలు, మందగమనం పాలవుతున్న అంతర్జాతీయ వృద్ధి, ఇవన్నీ కలిసి రాబోయే త్రైమాసికాల్లో ప్రభావం చూపుతాయని అంటోంది. 2022కు 8.8 శాతం వృద్ధి రేటు లభించవచ్చని మేలో పేర్కొన్న సంస్థ, తాజాగా 1.1 శాతం తగ్గించి 7.7 శాతానికి పరిమితం చేసింది.