రాష్ట్రీయం - ఆంధ్ర ప్రదేశ్

ఏపీఐఐసీ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్‌

పారిశ్రామికవాడల అభివృద్ధికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) నిరంతరం కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. ఏపీఐఐసీ 50వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవ లోగోను సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏడాదిలో నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ఏపీఐఐసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

శిక్షణ కార్యక్రమాలపై ఏపీ శాక్స్, ఎకో ఇండియా ఒప్పందం

శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని ఏపీ శాక్స్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ సమక్షంలో ఏపీడీ డాక్టర్‌ కామేశ్వర్‌ప్రసాద్, ఎకో ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సందీప్‌ భల్లాలు ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు.

ఎన్‌ఎస్‌ఐసీ - ఏపీమెడ్‌టెక్‌ మధ్య ఒప్పందం

వైద్య పరికరాల ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ), ఏపీ మెడ్‌టెక్‌ జోన్లు నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎంఓయూపై ఎన్‌ఎస్‌ఐసీ సీఎండీ గౌరంగ్‌ దీక్షిత్, ఏపీమెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ, సీఈఓ జితేంద్రశర్మలు సంతకాలు చేశారు.

ఏపీ శాసనసభలో 21 బిల్లులకు ఆమోదం

-ఏపీ శాసనసభ సమావేశాల్లో 21 బిల్లులను ప్రవేశపెట్టగా అన్నింటికి సభ ఆమోదం లభించిందని సభాపతి తమ్మినేని సీతారాం వెల్లడించారు. 5 రోజుల్లో 26.44 గంటల పాటు సమావేశాలు జరిగాయని, 50 ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇచ్చామని తెలిపారు. శాసనసభ్యుల్లో 36 మంది మాత్రమే సభలో ప్రసంగించారని, ఒక బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని వెల్లడించారు. నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయని తెలిపారు.

- రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పేద ప్రజలకైనా రాజధాని అమరావతిలో ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్‌ సీఆర్‌డీఏ, ఏపీఎంఆర్‌డీఏ (సవరణ) బిల్లు, విజయవాడలోని డా.ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చేందుకు వీలు కల్పించే చట్ట సవరణ బిల్లు సహా 9 బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ కార్మిక సంక్షేమ నిధి (రెండో సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ చట్టాల (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ వేతనాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్ట సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్స్‌ టూ పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ రేషనలైజేషన్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్యాటర్న్‌ అండ్‌ పే స్ట్రక్చర్‌) (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ అప్రాప్రియేషన్‌ బిల్లులు ఆమోదం పొందాయి.


ఏపీ శాసనసభలో 5 బిల్లులకు ఆమోదం

ఏపీ శాసనసభ 5 బిల్లులకు ఆమోదం తెలపగా, కొత్తగా రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. సహకార సంఘాల పాలకవర్గాల్లో మూడింట ఒకవంతు నిపుణులను నియమించేలా సవరణ బిల్లు, కౌలుదారీ చట్టం రద్దు (ఆంధ్ర ప్రాంత) బిల్లు, రీసర్వే చేస్తున్న నేపథ్యంలో సర్వే, సరిహద్దుల ఖరారుకు సవరణ బిల్లు, సర్వే వివరాలు పాసు పుస్తకాల్లో నమోదు చేసేలా సవరణ బిల్లు, ఏపీ వస్తు, సేవల పన్ను సవరణ బిల్లులకు ఆమోదం తెలిపారు. ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు, కార్మిక సంక్షేమ నిధి సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ 29 కార్మిక శాసనాలను, నాలుగు కోడ్స్‌లోకి మార్చింది. ఇందులోభాగంగా దుకాణాలు, సంస్థలకు గతంలో చిన్నపాటి అతిక్రమణలకు జైలు శిక్షలు ఉండగా, వాటిని మారుస్తూ చట్ట సవరణ తీసుకొచ్చారు. వాటి స్థానంలో జరిమానాలు విధిస్తారు. సులభతర వాణిజ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, కేంద్రం కార్మిక శాఖ తెచ్చిన నాలుగు కోడ్స్‌ అమలు చేస్తూ ఈ రెండు సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. 2022 - 23 సంవత్సర అనుబంధ అంచనాలను ఆర్థిక మంత్రి బుగ్గన బదులు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు.

‘రీ-సర్వే’పై నల్సార్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

భూముల రీ-సర్వేపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు, పరిశోధనల నిర్వహణకు హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం, ఆంధ్ర రాష్ట్ర సర్వే శాఖల మధ్య ఒప్పందం జరిగింది. హైదరాబాదులో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బాలకిష్టారెడ్డి, సర్వే శాఖ శిక్షణ సంస్థ వైస్‌ ప్రిన్సిపల్‌ కుమార్‌ అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా సర్వే శాఖ కమిషనర్‌ సిద్దార్థజైన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్‌ రీ-సర్వే నిర్వహణలో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయాన్ని భాగస్వామ్యం చేయాలని ఆదేశించిన మేరకు చర్యలు తీసుకున్నాం. రైతులకు రీ-సర్వేపై అవగాహన, చట్టపర హక్కులపై స్పష్టత కల్పించడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో క్రియాశీలకంగా ఉంటాయి. ఈ ఒప్పందం ద్వారా రీ-సర్వేలో పాల్గొనే భాగస్వాములకు విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ అందుతుంది. రీ-సర్వే నిర్వహణలో పార్టీలు పరస్పర అంగీకారం, ఇతర అంశాలపైనా విశ్వవిద్యాలయం తనవంతు సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన రీ-సర్వే 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

ఏపీ శాసనసభలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చట్ట సవరణ బిల్లు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మరో కొత్త వసూలు విధానానికి ఉపక్రమించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య జరిగే లీజు ఒప్పందాలకు సంబంధించి స్టాంపు డ్యూటీని విధించింది. ఈ సంస్థలు తమ ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలు, ఆహార పదార్థాలు విక్రయించుకోడానికి అనుమతించే ఒప్పందాలకు స్టాంపు డ్యూటీ నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భారత స్టాంపు చట్టం - 1899ని సవరిస్తూ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇలాంటి లీజులపై ఏడాదికి రూ.1,000, ఏడాదికి మించి పదేళ్లలోపు ప్రతి ఏడాదికి రూ.1,000, పదేళ్ల కాలానికి మించితే రూ.25,000 స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ట్రేడింగ్‌ కేటగిరిలోనూ, మేధో సంపత్తి బదలాయింపులోనూ ఇదే విధానంలో స్టాంపు డ్యూటీ చెల్లించాలి.

విశ్వవిద్యాలయాల ఉద్యోగ నియామకాల్లో ఏకీకృత ఎంపిక కమిటీ ఏర్పాటుకు విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణ చేస్తూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. కమిటీ ఏర్పాటులో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాలకు తప్పనిసరిగా పాటించాలని సవరణ బిల్లులో పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామక అధికారాన్ని ట్రిపుల్‌ఐటీల కార్యనిర్వాహక కౌన్సిళ్ల నుంచి వర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు అప్పగిస్తూ సవరణ బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు శాసనసభలో ప్రవేశపెట్టారు.


ఏపీ శాసనసభ ఆమోదానికి పలు బిల్లులు

ఏపీ శాసనసభలో మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం - 1994 సవరణకు సంబంధించిన బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ వ్యవసాయోత్పత్తి, జీవధనకు సంబంధించిన చట్టం - 1966 సవరణ బిల్లుతోపాటు ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (క్రమ శిక్షణ చర్యల ట్రైబ్యునల్‌ )చట్టం - 1960లో సవరణలకు సంబంధించిన బిల్లును కూడా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చట్టం - 1998 సవరణ బిల్లును రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సభలో ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ (క్రమశిక్షణ కార్య వ్యవహారాల ట్రైబ్యునల్‌) చట్టం - 1960ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ క్రమశిక్షణ కార్య వ్యవహారాల ట్రైబ్యునల్‌ పూర్తిగా రద్దవుతుంది. 2009 నుంచి ఇప్పటివరకూ ఆ ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న 719 కేసుల విచారణ బాధ్యత కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌కు అప్పగిస్తారు. ‘రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దీనికి ఛైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ట్రైబ్యునల్‌ పనిచేయట్లేదు. ఫలితంగా అక్కడ కేసులు పేరుకుపోయాయి. ఈ అంశంపై పలువురు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించగా మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆయా కేసుల విచారణను ముగించాలని లేకుంటే ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఛార్జీ మెమోలు రద్దవుతాయని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్‌ను రద్దు చేసి ఆ కేసులను కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌కు అప్పగిస్తున్నామని ప్రభుత్వం ఆ బిల్లులో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ (వ్యవసాయోత్పత్తి, జీవధన) మార్కెట్ల చట్టం - 1966ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ అంశంపై ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును మంత్రి కాకాణి ప్రవేశపెట్టారు. దాని ప్రకారం వరికి సంబంధించి వర్తక విలువపై మార్కెట్‌ రుసుము నుంచి 1 నుంచి 2 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇతర దేశాలకు ఎగుమతి చేసిన రొయ్యల వర్తక విలువపై మార్కెట్‌ రుసుమును 0.25 శాతం నుంచి 1 శాతానికి, దేశీయ మార్కెట్‌లో అమ్మిన రొయ్యలకు మార్కెట్‌ రుసుమును 0.50 శాతం నుంచి ఒక శాతానికి పెంచింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు అదనపు ఆదాయం కల్పించేందుకు మార్కెట్‌ ఫీజులను సవరించేలా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

జిల్లా పరిషత్తుల్లో (జడ్పీ) ప్రస్తుత పాలకవర్గాలు ఐదేళ్ల కాల వ్యవధి పూర్తయ్యే వరకు యథాతధంగా కొనసాగుతాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైనా జడ్పీల సంఖ్య ప్రస్తుతానికి పెరగదు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్‌ చట్టం - 2022 సవరణ బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టారు.

ఏపీ రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఆర్‌డీసీ)లో ఇప్పటి వరకు ఛైర్మన్‌తో పాటు మరో ఇద్దరు అధికార, అనధికార సభ్యులు ఉండేందుకు అవకాశం ఉండగా వీరి సంఖ్యను 16కు పెంచుతూ, రెండేళ్ల కాలానికి నియమించే చట్ట సవరణ బిల్లును ఆర్‌అండ్‌బీ మంత్రి దాడిశెట్టి రాజా శాసనసభలో ప్రవేశపెట్టారు.


ఏపీలో సంగం, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం

లక్షల ఎకరాలకు నీరందించే సంగం, నెల్లూరు బ్యారేజీల్ని దాదాపు 140 ఏళ్ల కిందట బ్రిటిష్‌ హయాంలో నిర్మించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై సంగం దగ్గర నిర్మించిన ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీకి గౌతమ్‌ పేరు పెట్టి సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ రెండింటి ద్వారా సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. ఈ బ్యారేజీలతో ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాలకు మేలు చేకూరుతుందని తెలిపారు.