సైన్స్ అండ్ టెక్నాలజీ

దేశ చరిత్రలో తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విజయవంతం

దేశ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో నవ శకం ప్రారంభమైంది. మొదటిసారిగా ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ని గుర్తుచేస్తూ అభివృద్ధి చేసిన విక్రమ్‌- సబ్‌ ఆర్బిటల్‌ (వీకే-ఎస్‌) రాకెట్‌ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మొత్తం మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేసి దేశంలో కొత్త పంథా ప్రారంభమైందని సూచించింది. ‣ తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి విక్రమ్‌-ఎస్‌ ప్రయోగాన్ని చేపట్టారు. లక్ష్యం 80 కి.మీ. నిర్దేశించగా 89.5 కి.మీ. గరిష్ఠ ఎత్తుకు చేరి, ప్రయోగించిన 5 నిమిషాల తర్వాత బంగాళాఖాతంలో పడిపోయింది. ఒక దశ ఘన ఇంధనంతో కూడిన సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ను కార్బస్‌ కాంపోజిట్‌ స్ట్రక్చర్‌లు, 3డీ ముద్రిత భాగాలతో రెండేళ్లలో అభివృద్ధి చేశారు. 80 కిలోల బరువున్న మూడు పేలోడ్లు కలిగిన రాకెట్, స్థూలంగా 545 కిలోల బరువుతో నింగిలోకి దూసుకెళ్లింది. పేలోడ్లను విద్యార్థులే తయారు చేశారు. ఇందులో ఉపకరణాలు విమాన పారామీటర్ల ధ్రువీకరణ, పేలోడ్‌ ఇంటిగ్రేషన్‌ ప్రక్రియలను మ్యాప్‌ చేస్తాయి. తొలి ప్రైవేటు స్పేస్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్, దేశంలో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు స్పేస్‌ స్టార్టప్‌ సంస్థ. మచిలీపట్నం వాసి పవన్‌కుమార్‌ చందన, ఒంగోలుకు చెందిన నాగభరత్‌ డాకా రూ.526 కోట్లతో 2018 జూన్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా దీన్ని స్థాపించారు. వీరి సారథ్యంలోనే విక్రమ్‌-ఎస్‌ను అభివృద్ధి చేశారు. ఈ సంస్థ ఇప్పటికే రెండు జాతీయ అవార్డులు అందుకుంది. దేశంలో అంతరిక్ష రంగ పరిశోధనలకు ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలకు తలుపులు తెరిచిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగ, పరీక్ష సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు ఈ సంస్థ తొలి ఒప్పందం చేసుకుంది. విక్రమ్‌-1తో కక్ష్యలోకి ఉపగ్రహాలు ‘విక్రమ్‌-ఎస్‌తో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కక్ష్యలోకి ఉపగ్రహాలను మోసుకెళ్లేలా విక్రమ్‌-1 రాకెట్‌ను వచ్చే ఏడాది అభివృద్ధి చేస్తాం’ అని ప్రయోగం విజయవంతం అనంతరం స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకులు పవన్‌కుమార్, నాగ భరత్‌ డాకా తెలిపారు.

తొలినాటి గెలాక్సీలను గుర్తించిన వెబ్‌ టెలిస్కోపు ఇప్పటివరకూ పరిశోధకుల కంటపడని తొలినాటి గెలాక్సీలను అమెరికాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు గుర్తించింది. వీటిలో ఒకటి విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌ బ్యాంగ్‌ పరిణామం అనంతరం 35 కోట్ల ఏళ్ల తర్వాత ఏర్పడింది. అంతరిక్ష ప్రమాణాల్లో చెప్పాలంటే ఇది చాలా తొలినాటి గెలాక్సీ. మునుపటి హబుల్‌ టెలిస్కోపునకు అది దొరకలేదు. ఇప్పటివరకూ కనుగొన్నవాటిలో ఇదే అత్యంత సుదూర నక్షత్ర మండలంగా నిలిచింది. హబుల్‌ గుర్తించిన సుదూర గెలాక్సీ బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం 45 కోట్ల ఏళ్ల తర్వాత ఏర్పడింది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు నుంచి అందుతున్న డేటాను బట్టి గతంలో ఊహించినదాని కన్నా చాలా త్వరగానే తొలినాటి నక్షత్రాలు ఏర్పడ్డాయని స్పష్టమవుతోంది. బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం కొన్ని లక్షల సంవత్సరాలకే అవి పుట్టుకొచ్చి ఉంటాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు అందించిన డేటాను విశ్లేషించిన హార్వర్డ్‌ స్మిత్సోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. ఈ పరిశోధన బృందానికి రోహన్‌ నాయుడు నేతృత్వం వహించారు.

నౌకాదళ అమ్ములపొదిలోకి రెండో విధ్వంసక నౌక

‘ప్రాజెక్టు 15బి’లో భాగంగా మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ నిర్మించిన రెండో విధ్వంసక నౌక భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి చేరింది. దీని పేరు వై 12705 (మొర్ముగావ్‌). ఈ నౌకలో బ్రహ్మోస్‌ క్షిపణులు, దేశీయ టార్పెడో ట్యూబ్‌ లాంఛర్లు, యాంటీ సబ్‌ మెరైన్‌ రాకెట్‌ లాంఛర్లు మోహరిస్తారు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా రహస్యంగా పనిచేసే సామర్థ్యం ఈ నౌకకు ఉంది. దీని పొడవు 153 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు. బరువు 7,400 టన్నులు. 2011లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో భాగంగా మజ్‌గావ్‌ డాక్‌షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ నాలుగు నౌకలను తయారు చేస్తోంది. తొలినౌక గత ఏడాది విశాఖపట్నంలో భారత నౌకాదళంలో చేరింది.

ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సి54 విజయవంతం

అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయి. ఒకే రాకెట్‌ ద్వారా బహుళ కక్ష్యలోకి 9 ఉపగ్రహాలను ప్రవేశపెట్టి ఇస్రో శాస్త్రవేత్తలు సత్తా చాటారు. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ - షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి54 ప్రయోగం చేపట్టారు. రాకెట్‌ బయలుదేరిన 17.17 నిమిషాల తర్వాత భూ పరిశీలనకు సంబంధించి ఓషన్‌శాట్‌ ఉపగ్రహాన్ని (ఈవోఎస్‌-06) 742 కి.మీల సోలార్‌ సింక్రోనస్‌ ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. అనంతరం 2.05 గంటల్లో 8 ఉపగ్రహాలను సోలార్‌ సింక్రోనస్‌ కక్ష్యల్లో ఉంచారు. ఓషన్‌శాట్‌ శ్రేణిలో ఇది మూడోతరం ఉపగ్రహం. దీన్ని ఓషన్‌శాట్‌-2 స్థానంలో పంపారు. ఇందులో మెరుగైన పేలోడ్లు ఉన్నాయి. 8 నానో ఉపగ్రహాల్లో భూటాన్‌ (ఐఎన్‌ఎస్‌-2బి), ఆనంద్, ఆస్ట్రోకాస్ట్‌ (నాలుగు), రెండు థైబోల్ట్‌ ఉపగ్రహాలున్నాయి. ఓషన్‌శాట్‌ ఉపగ్రహ ప్రయోజనాలివీ.. ఓషన్‌శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణ పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. బెంగళూరుకు చెందిన హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు, పంటలకు వచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. ఆనంద్‌ అని పేరుపెట్టిన దీనిబరువు 15 కిలోలు. మత్స్య సంపద గుర్తింపు.. విపత్తుల నుంచి రక్షణ ఇస్రో తాజాగా ప్రయోగించిన ఈవోఎస్‌-06 ఉపగ్రహం సాయంతో సముద్రాల స్థితిగతులు, వాటిలోని మత్స్య సంపదను మరింత కచ్చితత్వంతో గుర్తించవచ్చని, ఇది మత్స్యకారులకు గణనీయమైన మేలు చేస్తుందని హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం) తెలిపింది. ‘ఈవోఎస్‌-06కు ఓషన్‌ కలర్‌ మానిటర్‌ (ఓసీఎం-3), సీ సర్ఫేస్‌ టెంపరేచర్‌ మానిటర్‌ (ఎస్‌ఎస్‌టీఎం), కు-బాండ్‌ స్కట్టెరొమీటర్‌ (ఎస్‌సీఏటీ-3) అనే మూడు రకాల సెన్సర్లను అమర్చాం. చేపలకు ఆహారమైన క్లోరోఫిల్‌ అనే నాచును గుర్తించడానికి ఓసీఎం-3 సెన్సర్‌ ఉపయోగపడుతుంది. ఎస్‌ఎస్‌టీఎం సెన్సర్‌తో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను, ఎస్‌సీఏటీ-3 సాయంతో సముద్ర ఉపరితలంపై గాలి వేగం, దిశను తెలుసుకోవచ్చు. మూడు సెన్సర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా చేపల ఉనికి, అక్కడ వాటికి అనుకూల వాతావరణం ఉందా అనే అంశాలను ఇన్‌కాయిస్‌ బేరీజు వేస్తుంది. చేపలుండే ప్రాంతాలను గుర్తించి.. హిందూ మహా సముద్ర తీర ప్రాంత మత్స్యకారులకు చేరవేస్తాం. మహా సముద్రంలో ప్రయాణించే నౌకలు, మత్స్యకారుల పడవలకు విపత్తుల నుంచి రక్షణ కల్పించే సరికొత్త ఆర్గోస్‌ సెన్సర్‌ సైతం ఈవోఎస్‌-06తో పయనమైంది’ అని ఇన్‌కాయిస్‌ శాస్త్రవేత్తలు వివరించారు.

బల్బుల కాంతి నుంచి విద్యుత్తు తయారీ

ఇళ్లలో సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ బల్బుల కాంతి నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే సరికొత్త పరికరాన్ని ఐఐటీ - మండీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరికరాలు ప్రస్తుతం బ్యాటరీల ఆధారంగానే పనిచేస్తున్నాయి. జీవితకాలం ముగిసిన బ్యాటరీలతో పర్యావరణానికి హాని కలుగుతుండటంపై ఐఐటీ పరిశోధకులు దృష్టి సారించారు. బల్బులు వంటి కృత్రిమ వనరుల నుంచి కాంతిని గ్రహించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ‘థిన్‌-ఫిల్మ్‌ ఎఫీషియంట్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌’ను రూపొందించారు. వీటితో సెన్సర్లు, వైఫై రూటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ రీడర్లు వంటి ఐవోటీ పరికరాలు సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ, యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్, గౌతమ్‌ బుద్ధ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

కంటి పరీక్షతో హృద్రోగ ముప్పు తెలుసుకోవచ్చు!

కృత్రిమ మేధ సాంకేతికత ఆవిష్కరణల్లో మరో అద్భుతం. చిన్నపాటి కంటి పరీక్షతో కేవలం ఒక్క నిమిషంలోనే హృద్రోగం, పక్షవాతం ముప్పును ఇక కచ్చితంగా అంచనా వేయొచ్చు. ఇందుకు అవసరమైన సాధనాన్ని కింగ్‌స్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. గుండె జబ్బు కారణంగా మరణముప్పు ఏమైనా పొంచి ఉందా? అన్నది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇదొక ప్రత్యేక పరిశోధన అని, రక్తపోటు, రక్త పరీక్షలతో సంబంధం లేకుండానే కార్డియోవాస్కులర్‌ స్క్రీనింగ్‌ చేయడం దీని విశేషమని బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆప్తాల్మాలజీ వ్యాఖ్యానించింది. ‣ పరిశోధకులు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - ఏఐ) సాంకేతికత సాయంతో క్వార్ట్జ్‌ అనే టూల్‌ను రూపొందించారు. దీని సాయంతో రెటీనాను అత్యంత నిశితంగా పరీక్షించి, కంటిలోని ధమనులు, సిరలను విశ్లేషించారు. కృత్రిమ మేధ సాంకేతికత ఆధారంగా, పూర్తిస్థాయి ఆటోమేషన్‌తో ‘క్వార్ట్జ్‌’ పనిచేస్తుంది. దీని ద్వారా రెటినల్‌ వాస్కులర్‌ ఇమేజింగ్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. హ్రృద్రోగ నిపుణులు, నేత్ర వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కంటిని పరీక్షించి.. ఒక్క నిమిషంలోనే రోగి హృదయ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. సమస్యలు ఉన్నవారు స్టాటిన్‌ వంటి ఔషధాలను వాడటం ద్వారా మరణ ముప్పును తప్పించుకోవచ్చు. యూకే బయోబ్యాంక్‌లో భాగస్వామ్యమైన 88,052 మందికి ఈ టూల్‌తో విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని పరిశోధనకర్త ప్రొఫెసర్‌ అలిజా రుడ్నికా వివరించారు.

ముగ్గురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిన చైనా ప్రయోగం విజయవంతం

నిర్మాణంలో ఉన్న తమ అంతరిక్ష కేంద్రం వద్దకు చైనా తాజాగా ముగ్గురు వ్యోమగాములను పంపించింది. వాయవ్య చైనాలోని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్‌-2ఎఫ్‌ వై15 వాహక రాకెట్‌ ద్వారా షెంఝౌ-15 వ్యోమనౌకలో వారు నింగిలోకి దూసుకెళ్లారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే షెంఝౌ-14లో వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం వద్ద ఉన్నారు. తాజాగా వెళ్లిన ముగ్గురితో కలిపితే అక్కడ ఆరుగురు వ్యోమగాములు ఒకేసారి ఉండటం ఇదే తొలిసారవుతుంది. షెంఝౌ-15లో వెళ్లిన వారు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రం వద్ద విధులు నిర్వర్తించనున్నారు.

హృద్రోగ చికిత్సకు సరికొత్త ఔషధం

హృద్రోగ చికిత్సకు జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి. రక్తనాళాలు పూడుకుపోయే పరిస్థితిని అడ్డుకొనే కొత్త ఔషధ తయారీకి బాటలు పడ్డాయి. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు చేరడం ఆరంభమైతే ఆ రక్తనాళాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే కండర కణాల పరిమాణం, సంఖ్య పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు పూడుకుపోయి, బాధితులకు స్టంట్లు వేయడం, బైపాస్‌ సర్జరీ చేయడం అనివార్యమవుతుంది. ఈ సమస్యపై జార్జియా మెడికల్‌ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. రక్తనాళాల్లో ఉండే ‘ఎండోథెలియాల్‌’ కణాలు, ఆ నాళాల మృదు కండరాలకు నిత్యం సంకేతాలు పంపుతాయి. నాళాల్లో కొవ్వు చేరికతో ఆ సంకేతాలు దెబ్బతిని, మృదు కండర కణజాలం పెరుగుతోంది. ‘ఏటీఐసీ జన్యువు’ను లక్ష్యంగా చేసుకుని ఔషధాన్ని రూపొందిస్తే మృదు కండర కణజాలం పెరుగుదలకు కారణమవుతున్న ప్యూరిన్‌’ను అడ్డుకోవచ్చు. తద్వారా హృద్రోగ సమస్యను నివారించవచ్చని పరిశోధకులు వివరించారు.

సౌరశక్తిని అధికంగా గ్రహించే సరికొత్త కిరణ జన్య సంయోగ వ్యవస్థ

సూర్యుడి నుంచి శక్తిని గ్రహించేందుకు మొక్కల్లో జరిగే కిరణ జన్య సంయోగ క్రియను అనుకరించడం ద్వారా కాంతిని సమర్థంగా గ్రహించే కృత్రిమ వ్యవస్థను ఐఐఎస్‌ఈఆర్‌ (తిరువనంతపురం), ఐఐటీ (ఇందోర్‌) పరిశోధకులు రూపొందించారు. ఈ వివరాలను ప్రతిష్ఠాత్మక రాయల్‌ కెమికల్‌ సొసైటీ - కెమికల్‌ సైన్స్‌ పత్రిక ప్రచురించింది. ఎండ తగిలే మొక్క భాగాల్లోని క్రోమోఫోర్‌లు, సూర్యకాంతి నుంచి శక్తిని గ్రహించి, పక్కనున్న ఇతర క్రోమోఫోర్‌లకు దాన్ని అందిస్తాయి. అలా అన్ని క్రోమోఫోర్‌లకూ ఈ శక్తి సరఫరా అవుతుంది. ఇదే పద్ధతిని అనుసరించి, వీలైనంతగా కాంతిని గ్రహించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాలిమెరిక్‌ నిర్మాణాలు, డిటర్జెంట్‌ రకం అణువులు, వెసికిల్స్, జెల్, జీవ పదార్థాలను వినియోగిస్తున్నారు. కానీ, ఇవన్నీ కలగలిసిపోవడం వల్ల కాంతిని గ్రహించడం, దాన్ని విద్యుత్తుగా మార్చుకోవడం ఆశించినంత స్థాయిలో లేదు. ఈ సమస్యపై దృష్టి సారించిన ఐఐఎస్‌ఈఆర్, ఐఐటీ శాస్త్రవేత్తలు పరమాణు నానో క్లస్టర్లను ఉపయోగించడం ద్వారా సూర్యరశ్మిని అధిక స్థాయిలో గ్రహించడమే కాకుండా, 93% సామర్థ్యంతో శక్తిని బదిలీ చేయగలిగాం. ఈ విధానంలో సౌర విద్యుత్తును హెచ్చుస్థాయిలో ఉత్పత్తి చేసే అవకాశముందని తెలిపారు. 2070 నాటికి ఉద్గారాలకు తావులేని విద్యుత్తు సరఫరా చేపట్టాలని భారత్‌ సంకల్పించింది. ఈ క్రమంలో ఈ పరిశోధన ప్రాధాన్యం సంతరించుకొంది.

అ..ఆ..లతో మెదడులో మార్పులు

మనిషి మెదడుపై అక్షరాస్యత ప్రభావం చూపగలదా? వయోజనుల్లోనూ ఉచ్చారణలో మార్పు తెస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) పరిశోధకులు. చదవడం, రాయడం నేర్చుకున్నప్పుడు మనిషి మెదడులో ఏయే మార్పులు చోటు చేసుకుంటున్నాయనే అంశంపై వర్సిటీ ఆచార్యులు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 91 మంది హిందీ మాట్లాడేవారిని ఎంచుకున్నారు. వీరిలో 22 మంది నిరక్షరాస్యులను ఎంపిక చేసి, ఆరు నెలల పాటు హిందీ చదవడం, రాయడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం మెదడు స్పందన తీరులోనే కాదు ఉచ్చారణలో, ఏకాగ్రతలోనూ కీలక మార్పులు వచ్చినట్లు గుర్తించారు. వయోజనులు మాట్లాడే భాషపై అక్షరాస్యత ఎలాంటి ప్రభావం చూపదని ఈ అంశంపై ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. హెచ్‌సీయూ పరిశోధనలో దీనికి విరుద్ధమైన ఫలితాలొచ్చాయి. అయితే ఈ ప్రభావం లిపిని బట్టి మారవచ్చని హెచ్‌సీయూలోని సెంటర్‌ ఫర్‌ న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌ అధిపతి రమేశ్‌కుమార్‌ మిశ్ర తెలిపారు. ఆంగ్ల వర్ణమాలను పరిగణనలోకి తీసుకుంటే అక్షరాస్యత ప్రభావం పెద్దగా కనిపించడం లేదని.. దేవనాగరి లిపి వంటి వాటి విషయంలో కనిపిస్తోందని పేర్కొన్నారు. అధ్యయనంలో పాల్గొన్నది వీరే.. హెచ్‌సీయూలోని సెంటర్‌ ఫర్‌ న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌ అధిపతి రమేశ్‌కుమార్‌ మిశ్ర, నెదర్లాండ్స్‌లోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైకోలింగ్విస్టిక్స్‌ ఆచార్యుడు అలెక్సిస్‌ హెర్వాయిస్‌ అడెల్‌మాన్, లఖ్‌నవూలోని సెంటర్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఉత్తమ్‌కుమార్, అనుపమ్‌ గలేరియా, అలహాబాద్‌ యూనివర్సిటీలోని సెంటర్‌ ఆఫ్‌ బిహేవియరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌ ఆచార్యులు వివేక్‌ ఎ.త్రిపాఠి, జై పీ సింగ్, నెదర్లాండ్స్‌లోని రాబౌడ్‌ వర్సిటీలోని భాష అధ్యయన శాస్త్రాల కేంద్రం ఆచార్యుడు ఫాల్క్‌ హ్యుటిగ్‌ సంయుక్తంగా అధ్యయనం చేశారు. వీరి పరిశోధన పత్రం జర్నల్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైంది.

ఫ్లూ వైరస్‌లను అడ్డుకునే ఎంఆర్‌ఎన్‌ఏ టీకా రూపకల్పన

అన్ని రకాల ఫ్లూ వైరస్‌లను అడ్డుకునే శక్తిమంతమైన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను అమెరికా, కెనడా శాస్త్రవేత్తలు రూపొందించారు. జంతువుల్లో ఈ టీకా విజయవంతమైంది. ఎలుకలకు దీన్ని ఎక్కించిన నాలుగు నెలల తరవాత కూడా యాంటీబాడీలు చురుగ్గా ఉండి వైరస్‌ను ఎదుర్కొంటున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా ఏ, బీ వైరస్‌లలో మొత్తం 20 ఉపజాతులు ఉన్నాయి. వాటన్నింటిలో ఉమ్మడిగా కనిపించే యాంటిజెన్లపై పనిచేసే టీకాను రూపొందించడం సంప్రదాయ పద్ధతి. అలా కాకుండా ఒక్కో ఇన్‌ఫ్లుయెంజా ఉపజాతికి ప్రత్యేకమైన యాంటిజెన్‌ను తీసుకుని, మొత్తం 20 యాంటిజెన్లను కలిపి, అన్నింటిపై పనిచేసే సార్వత్రిక ‘ఎంఆర్‌ఎన్‌ఏ లిపిడ్‌ నానోపార్టికిల్‌’ టీకాను రూపొందించారు.

స్పైక్‌ ప్రొటీన్లలో ‘టైలర్‌ మేడ్‌ పాకెట్‌’ గుర్తింపు

ప్రమాదకర కరోనా వైరస్‌ల స్పైక్‌ ప్రొటీన్‌లో ‘టైలర్‌ మేడ్‌ పాకెట్‌’ ఉంటున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టోల్‌ నేతృత్వాన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దీన్ని చేపట్టింది. మనిషి శరీరంలోని జీవకణాలకు వైరస్‌ అతుక్కోవడానికి, అనంతరం తీవ్రస్థాయి అనారోగ్యం తలెత్తడానికి ఈ పాకెట్‌ కారణమవుతున్నట్టు గుర్తించారు. అన్ని రకాల కరోనా వైరస్‌ల ఉపరితలంపై స్పైక్‌ గ్లైకో ప్రొటీన్‌ ఉంటుంది. అయితే మెర్స్, ఒమిక్రాన్‌ వంటి ప్రమాదకర వైరస్‌ల స్పైక్‌ ప్రొటీన్లలో మాత్రం ప్రత్యేకంగా ‘టైలర్‌ మేడ్‌ పాకెట్‌’లు ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. స్వల్ప లక్షణాలకు కారణమయ్యే కరోనా వైరస్‌ల స్పైక్‌ ప్రొటీన్లలో ఈ పాకెట్లు కనిపించలేదు. వీటిని లక్ష్యంగా చేసుకుని చికిత్స రూపొందిస్తే 2002 నాటి సార్స్‌-కొవ్‌ మొదలు ఇటీవలి ఒమిక్రాన్‌ తదితర అన్నిరకాల ప్రమాదకర కరోనా వైరస్‌లనూ సమర్థంగా అడ్డుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సైన్స్‌ అడ్వాన్సెస్‌ పత్రిక ఈ వివరాలు అందించింది.

వారం పాటు చంద్రుడి కక్ష్యలో ఒరాయన్‌

జాబిల్లిని చేరుకునేందుకు నాసా చేస్తున్న మలి ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది. నాసా పంపిన మానవ రహిత ఒరాయన్‌ క్యాప్సూల్‌ చంద్రుడి చుట్టూ వేల మైళ్ల దూరంలో విస్తరించిన కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో లక్ష్యాన్ని ఇది సగం మేర పూర్తిచేసినట్టయింది. ఒరాయన్‌ వారం పాటు ఈ కక్ష్యలో ఉంటుంది. ఇంజిన్‌ను మండించే నాటికి ఈ క్యాప్సూల్‌ భూమికి 3.80 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందని, కొద్ది రోజుల్లోనే 4.32 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి మునుపటి దూరాన్ని అధిగమించి రికార్డును సృష్టిస్తుందని పరిశోధకులు తెలిపారు. 52 ఏళ్ల క్రితం అపోలో-13 వ్యోమనౌక భూమి నుంచి 4,00,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. కాగా కొద్దిరోజుల కిందట హ్యూస్టన్‌లోని మిషన్‌ కంట్రోల్‌ ఒరాయన్‌తో గంటపాటు సంబంధాలు తెగిపోయాయి. కంట్రోలర్లు ఎట్టకేలకు ఈ క్యాప్సూల్‌కు, డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌కు మధ్య సంబంధాన్ని పునరుద్ధరించారు.

అరుదైన మెదడు వ్యాధిని ఇక కచ్చితంగా గుర్తించొచ్చు!

అరుదైన మెదడు వ్యాధి ‘కార్టికోబాసల్‌ డీజెనరేషన్‌ (సీబీడీ)’ను అత్యంత కచ్చితంగా గుర్తించేందుకు దోహదపడే బయోమార్కర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన సాగించింది. సీబీడీని గుర్తించేందుకు ఇప్పటివరకూ వినియోగిస్తున్న విధానాలు కేవలం 25% నుంచి 50% కచ్చితత్వం మాత్రమే కనబరుస్తున్నాయి. అయితే తాజాగా గుర్తించిన బయోమార్కర్‌ ద్వారా 89% కచ్చితత్వంతో ఈ వ్యాధిని నిర్ధారించవచ్చని పరిశోధకులు ధ్రువీకరించారు. సీబీడీ అనేది మెదడు సంకేతాలను నిలుపుదల చేస్తుంది. ఫలితంగా బాధితులు సరిగా కదల్లేరు. విషయాలను గుర్తుంచుకోవడం, మాట్లాడటం, చివరికి ఆహారం మింగడం కూడా కష్టమవుతుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రన రోగి కేవలం సీబీడీతోనే బాధపడుతున్నాడని చెప్పలేం! అల్జీమర్స్, ప్రోగ్రసివ్‌ సూపర్‌న్యూక్లియర్‌ పాల్సీ వంటి 24 రకాల మెదడు సమస్యలతో బాధపడేవారిలోనూ ఈ లక్షణాలు కొంతవరకూ ఉంటాయి. దీంతో సీబీడీని కచ్చితంగా నిర్ధారించుకోవడం ఇప్పటివరకూ సంక్లిష్టంగానే మిగిలిపోయింది. ఆ పదార్థం ఇదే.. పరిశోధకులు తాజాగా గుర్తించిన బయోమార్కర్‌ పేరు ‘టౌ’ ప్రొటీన్‌. మెదడులోని నాడీ కణాల స్థిరీకరణకు దోహదపడుతుంది. ఇది అసాధారణ స్థాయుల్లో ఉండటం వల్ల పలు రకాల న్యూరోడీజెనరేటివ్‌ రుగ్మతలు తలెత్తుతాయి. అయితే, సీబీడీ బాధితుల మెదళ్లలో మైక్రోటూబ్యూల్‌ బైండింగ్‌ రీజియన్‌ (ఎంటీబీఆర్‌)-275, 282 అనే రెండు రకాల టౌ ప్రొటీన్లు అధికంగా ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు.

ఆస్తమా బాధితులకు పక్షవాతం ముప్పు

దీర్ఘకాలం ఆస్తమాతో బాధపడే పెద్దలకు హృద్రోగ, పక్షవాతం ముప్పు అధికంగా ఉండొచ్చని తాజా పరిశోధన పేర్కొంది. వీరి మెదడుకు అనుసంధానమయ్యే ప్రధాన ధమనులు మందంగా, పెళుసుగా మారుతున్నట్టు వెల్లడించింది. కొవ్వు పదార్థాలు, కణ వ్యర్థాలు, కాల్షియం, ఫిబ్రిన్‌లతో కూడిన ‘ప్లేక్‌’ వారి ధమనుల్లో పేరుకుంటుండటమే ఇందుకు కారణమని తేల్చింది. ఇతరులతో పోల్చితే, ఆస్తమా బాధితుల్లో అంతర్గత వాపులు ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ నిపుణులు ఈ పరిశోధన సాగించారు. 5,029 మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. తరచూ ఆస్తమాతో బాధపడే 67% మంది, అడపదడపా ఆ బాధను అనుభవించే 49.5% మంది ధమనుల్లో ప్లేక్‌ పేరుకుంటోంది. ఆస్తమాలేని 50.5% మంది ధమనుల్లోనూ ఈ పదార్థం ఉన్నా ఆస్తమాతో బాధపడేవారిలో దాని పరిమాణం రెండింతలు ఉంటోందని పరిశోధనకర్త మాథ్యూ టటార్సల్‌ పేర్కొన్నారు.

వాయు కాలుష్యం వల్లే వృద్ధుల రోగనిరోధక వ్యవస్థ బలహీనం

వృద్ధుల్లో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటానికి వయోభారమే కారణమని అనుకుంటాం. అయితే, కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. దశాబ్దాల తరబడి వాయు కాలుష్యాన్ని పీల్చడం, వారి రోగనిరోధక వ్యవస్థ క్రమంగా బలహీనపడటానికి ముఖ్య కారణమని అంటున్నారు. వాతావరణంలోని కాలుష్య కారకాలు ఏళ్ల తరబడి శ్వాసక్రియ ద్వారా మనిషి శరీరంలోకి చేరుతున్నాయి. తర్వాత ఇవి ఊపిరితిత్తులకు సంబంధించిన లింఫ్‌ గ్రంథులు, రోగనిరోధక కణాల అంతర్భాగాల్లో తిష్ట వేసి రోగనిరోధక వ్యసస్థ సమర్థంగా పనిచేయకుండా అడ్డుకుంటున్నాయని పరిశోధనకర్త డొన్నా ఫార్బెర్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌-19 వంటి శ్వాసవ్యవస్థ సంబంధ వ్యాధుల విషయంలో యువత కంటే 75 ఏళ్లు దాటిన వృద్ధుకు మరణ ముప్పు 80 రెట్లు ఎక్కువగా ఉండటానికి ఈ పరిస్థితే కారణమని విశ్లేషించారు.

పేగు నుంచి ఊపిరితిత్తులకు ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా

యాంటీబయోటిక్‌ ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా పేగు నుంచి ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలకు చేరి, అక్కడ తీవ్రస్థాయి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. యాంటీబయోటిక్స్‌ను తట్టుకునే పరిస్థితి (ఏఎంఆర్‌)కి దారితీసే ‘సూడోమోనాస్‌ ఎరిగినోసా’ బ్యాక్టీరియాకు గురైన ఓ వ్యక్తిపై శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌గా భావించి మెరోపెనెం చికిత్సను అందించారు. అయినప్పటికీ, అతడి పేగులోని సూడోమోనాస్, దాని ఉత్పరివర్తనాలు వృద్ధి చెందాయి. చికిత్స కొనసాగుతుండగానే అవి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరి, తీవ్రస్థాయి నిమోనియాకు కారణమయ్యాయి! దీన్ని పసిగట్టి చికిత్స చేయడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ స్పందించడంతో బాధితుడు కోలుకున్నట్టు పరిశోధకులు తెలిపారు. పేగుల్లో ఉండే ఏఎంఆర్‌ కారక బ్యాక్టీరియాను ముందుగానే గుర్తించి, సంహరించగలిగితే ప్రమాదకర అనారోగ్యం దరిచేరకుండా రోగులను కాపాడవచ్చని వారు సూచించారు.

పిల్లలను కనే కళ్లు లేని ఈల్‌ చేపలు గుర్తింపు

హిందూ మహాసముద్రంలోని లోతు జలాల్లో పాన్‌కేక్‌ సీ అర్చిన్లు, కళ్లు లేని ఈల్‌ ఫిష్, గబ్బిలాల ఆకారంలో ఉండే చేపలు లాంటి పలు వింత జలచరాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మ్యూజియమ్స్‌ విక్టోరియా పరిశోధన సంస్థకు చెందిన కొంత మంది శాస్త్రవేత్తల బృందం ఆస్ట్రేలియాలోని కొకోస్‌ దీవి మెరైన్‌ పార్కులోని సముద్రపు అట్టడుగు భాగంలో వీటి గురించి వివరంగా పరిశోధించారు. హిందూ మహాసముద్రంలో ఇంతకుముందు ఎప్పుడూ గమనించని సముద్రపు లోతుల్లో ఉండే జీవజాలం గురించి కూడా తాము పరిశోధించినట్లు ఆస్ట్రేలియా పరిశోధక నౌక ‘ఇన్వెస్టిగేటర్‌’ వర్గాలు తెలిపాయి. సముద్రపు ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల లోతున చాలా వైవిధ్యమైన చేప జాతులు ఉన్నట్లు నీటి అడుగున వీడియోలు తీశారు. వీటిలో కళ్లు లేని ఈల్‌ చేపలు ప్రత్యేకం. మిగిలిన చేపల్లా గుడ్లు పెట్టడానికి బదులు ఇవి పిల్లలను కంటున్నాయి. ‣ గబ్బిలం ఆకారంలో ఉండే మరో రకం చేప చేతుల్లా ఉన్న రెక్కల సాయంతో తిరుగాడుతుంది. ముక్కుపై ఉన్న కండను ఎరగా చూపి ఇది వేటాడుతుంది. దిగువ భాగంలో నమ్మశక్యం కాని పొడవైన రెక్కల్లాంటివి ఉండే ట్రిబ్యూట్‌ స్పైడర్‌ ఫిష్‌ (సాలీడు చేప)లనూ అక్కడ గుర్తించారు. ఈ రెక్కల సాయంతో ఇది ప్రవాహం దిగువన నిలదొక్కుకొని చిన్నపాటి రొయ్యలను తింటుంది. పెలికాన్‌ ఈల్, బల్లి లాంటి చేప, వైపర్‌ ఫిష్, స్లెండర్‌ స్నైప్‌ ఈల్‌ లాంటి వేర్వేరు జీవాలూ ఉన్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన చీఫ్‌ సైంటిస్ట్‌ టిమ్‌ ఓ హరా తెలిపారు.

యాంటీ ఆక్సిడెంట్‌ ఫ్లేవనాల్స్‌ తింటే జ్ఞాపకశక్తి పదిలం

పండ్లు, కాయగూరలు, టీ, వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ ఫ్లేవనాల్స్‌ జ్ఞాపకశక్తి క్షీణతను అడ్డుకుంటున్నట్లు రష్‌ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఫ్లేవనాల్స్‌ అనేవి మొక్కల్లో రంగులకు కారణమయ్యే పదార్థాల్లోని ఆరోగ్యదాయక ఫ్లేవనాయిడ్‌ కోవకు చెందినవే. లింగ భేదం, వయసు పెరగడం, పొగ తాగడం వంటి కారణాల రీత్యా మనుషుల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. ఇతరులతో పోల్చితే, ఫ్లేవనాల్స్‌ అధికంగా ఉండే పండ్లు, కాయగూరలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల చాలా నెమ్మదిగా ఉంటున్నట్టు పరిశోధనకర్త థామస్‌ హోలండ్‌ వెల్లడించారు. ఫ్లేవనాల్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే ఇందుకు కారణంగా నిర్ధారణకు వచ్చినట్టు ఆయన వివరించారు.

పీఎస్‌ఎల్‌వీ-సి54 సన్నాహక ప్రయోగం విజయవంతం

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ - షార్‌లో పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 ప్రయోగానికి నిర్వహించిన సన్నాహక ప్రయోగంలో రాకెట్‌లోని అన్ని దశలు సక్రమంగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ప్రయోగానికి ఇబ్బందుల్లేవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 26వ తేదీన రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించారు.

నొప్పి నివారణ మందులతో ఆర్థరైటిస్‌ తీవ్రం

కీళ్లవాతం నుంచి ఉపశమనం కోసం కొన్ని రకాల నొప్పి నివారణ మందులను తీసుకుంటుంటారు. వీటివల్ల కొంతకాలానికి మోకాళ్లలో వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) తీవ్రం కావొచ్చని ఓ అధ్యయనం సూచిస్తోంది. ఆర్థరైటిస్‌ రుగ్మతల్లో సర్వసాధారణంగా కనిపించేది ఆస్టియో ఆర్థరైటిస్‌. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది దీనివల్ల ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యకు సాధారణంగా ఎన్‌ఎస్‌ఏఐడీ ఔషధాలను సూచిస్తుంటారు. అయితే వ్యాధి తీరుతెన్నులపై ఈ మందులు చూపే దీర్ఘకాల ప్రభావాల గురించి పరిశోధకులకు పెద్దగా అవగాహన లేదు. ముఖ్యంగా కీళ్ల పొర లైనింగ్‌లోని ఇన్‌ఫ్లమేషన్‌ (సైనోవైటిస్‌)పై ఇది జరిపే చర్యలను పూర్తిస్థాయిలో ఎన్నడూ విశ్లేషించలేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఏఐడీ చికిత్స సైనోవైటిస్‌ తీవ్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది పరిశీలించారు. ఇందుకోసం 270 మంది ఆస్టియోఆర్థరైటిస్‌ బాధితులపై అధ్యయనం చేశారు. నాలుగేళ్ల తర్వాత వారిని మళ్లీ పరిశీలించారు. ఎన్‌ఎస్‌ఏఐడీలు తీసుకుంటున్న వారిలో కీళ్లలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగిందని, కార్టిలేజ్‌ నాణ్యత బాగా క్షీణించిందని వెల్లడైంది.

ఊబకాయాన్ని తగ్గించే బాదం

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది తీవ్రస్థాయిలో శ్రమిస్తుంటారు. ఇలాంటి వారికి బాదం పప్పుతో ప్రయోజనం ఉంటుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నిత్యం 30-50 గ్రాముల మేర ఈ నట్స్‌ను తింటే.. అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం తప్పుతుందని వెల్లడైంది. అదే స్థాయి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు తీసుకున్న వారిని బాదం పప్పును తిన్నవారితో పోల్చి చూశారు. ఈ నట్స్‌ను భుజించిన వారు తదుపరి భోజనంలో 300 కిలోజౌల్స్‌తో సమానమైన శక్తినిచ్చే తిండిని నివారించగలిగారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బాదం పప్పును తిన్నవారిలో ఆకలిని నియంత్రించే హార్మోన్ల స్థాయిలో మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ పప్పులో ప్రొటీన్లు, ఫైబర్, అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్లే వాటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుందని వివరించారు.

సొంతంగా శుభ్రం చేసుకునే పైపూత

సౌర విద్యుత్తు ఫలకాలు తమంతట తామే ఉపరితలాలను శుభ్రం చేసుకునేలా చూసే సరికొత్త పూతను జోధ్‌పుర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సౌర ఫలకాలపై పేరుకుపోయే ధూళిని ఇది తగ్గిస్తుంది. చాలా తక్కువ పరిమాణంలో నీటితో అది తనను తాను శుభ్రం చేసుకుంటుంది. ధూళి, ఇసుక పేరుకుపోవడం వల్ల సౌర ఫలకాల సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రాంతాన్ని బట్టి వాటి సమర్థతలో 10 నుంచి 40 శాతం మేర కోత పడుతుంది. వాటిని శుభ్రం చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానాలు చాలా ఖరీదైనవి. పైగా వాటిని తరచూ ప్రయోగించడం వల్ల సౌర ఫలకాలకు శాశ్వత నష్టం కలుగుతుంది. తాము రూపొందించిన సూపర్‌ హైడ్రోఫోబిక్‌ పూతతో ఈ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

అత్యంత వేగంగా ఈతకొట్టే బటర్‌ఫ్లై రోబో రూపకల్పన

మాంతా రే అనే సముద్ర జీవి నుంచి స్ఫూర్తి పొందిన అమెరికా శాస్త్రవేత్తలు నీటిలో అత్యంత వేగంగా ఈదే ఒక సాఫ్ట్‌ రోబోను తయారు చేశారు. ఇది చాలా పొదుపుగా శక్తిని వాడుకుంటుంది. ఈదే సామర్థ్యమున్న ఇతర సాఫ్ట్‌ రోబోల కన్నా ఇది ఏకంగా నాలుగు రెట్లు వడివడిగా కదులుతుంది. దీనికి ‘బటర్‌ఫ్లై బోట్‌’ అని పేరు పెట్టారు. ప్రస్తుత సాఫ్ట్‌ రోబోలు సెకనుకు తమ శరీర పొడవు మేర మాత్రమే ముందుకు కదులుతున్నాయి. మాంతా రే వంటి సముద్ర జీవులు చాలా వేగంగా, మరింత సమర్థంగా ఈదగలవు. ఈ నేపథ్యంలో 2 రకాల బటర్‌ఫ్లై బోట్‌లను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇందులో ఒకదాన్ని వేగం కోసం అభివృద్ధి చేశారు. ఇది తన శరీర పొడవుతో పోలిస్తే సెకనుకు 3.74 రెట్లు ఎక్కువ దూరం ఈదగలిగింది. రెండో యంత్రాన్ని సులువుగా ఎటుపడితే అటు కదిలేలా రూపొందించారు. ఇది తన శరీర పొడవుతో పోలిస్తే సెకనుకు 1.7 రెట్లు ఎక్కువ దూరం ఈదగలిగింది.

కృత్రిమ మేధతో కాలేయ క్యాన్సర్‌ గుర్తింపు

కాలేయ క్యాన్సర్‌ను సులువుగా కనిపెట్టే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రయోగ పరీక్షల్లో ఇది 80 శాతం కేసులను గుర్తించగలిగింది. వాస్తవానికి ఈ పరిజ్ఞానాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించడానికి అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ కిమెల్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కాలేయ క్యాన్సర్లనూ పసిగట్టగలదని తాజా పరిశోధన తేల్చింది. డెల్ఫి అనే ఈ పరీక్ష రక్త ప్రవాహంలో కలిసే క్యాన్సర్‌ కణాల వల్ల డీఎన్‌ఏలో వచ్చే ఫ్రాగ్మెంటేషన్‌ మార్పులను గుర్తించగలదు. వీటిని కణరహిత డీఎన్‌ఏ అంటారు. తాజాగా ఈ విధానాన్ని అమెరికాలో 724 మందిపై విజయవంతంగా పరీక్షించి చూశారు. కాలేయ క్యాన్సర్‌ను గుర్తించడంలో దీని కచ్చితత్వం 98 శాతంగా ఉందని తేల్చారు. దీన్ని చాలా సమర్థ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సాధనంగా వాడొచ్చని వారు పేర్కొన్నారు.

చర్మ స్పర్శతో రక్తపరీక్ష

రక్తపరీక్ష చేయాలంటే శరీరంలోకి సూదిని చొప్పించాల్సి ఉంటుంది. రక్తాన్ని సేకరించడానికి సుశిక్షితులైన ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది సైతం అవసరం. ఈ ఇబ్బందులను దూరం చేసేందుకు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇది ఒక వ్యక్తి స్పర్శతో రక్తాన్ని పరీక్షిస్తుంది. ఈ విధానం కోసం హైడ్రోజెల్‌ పూత కలిగిన రసాయన బయోసెన్సర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోగి.. దీని మీటను ఒకసారి తాకితే చాలు. రోగి చర్మం గుండా విడుదలయ్యే చెమటలోని అణువులను సేకరించి, ఇది విశ్లేషిస్తుంది. ఆ నమూనాలోని హార్మోన్లు, పోషకాలు, మందులు, మెటబోలైట్లను గుర్తిస్తుంది. గుండె స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయినీ తెలియజేస్తుంది. అంతేకాదు వ్యక్తిగత ఆరోగ్య వివరాలు బయటకు పొక్కకుండా చూసేందుకు పరీక్ష ఫలితాలను ఎన్‌క్రిప్ట్‌ చేస్తుంది. సంబంధిత వ్యక్తి వేలిముద్ర ద్వారానే దాన్ని అన్‌లాక్‌ చేయడం సాధ్యమవుతుంది. ఈ సాధనం సాయంతో ఒక వ్యక్తిలో ఔషధాల స్థాయి, రక్తంలో చక్కెర పరిమాణం వంటివీ తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. తాళాలు అవసరంలేని ‘కీ లెస్‌’ వాహనాల స్టీరింగ్‌పైనా ఈ బయోసెన్సర్లను అమర్చవచ్చని వివరించారు.

అల్జీమర్స్‌ తాకిడికి ఈ జన్యువే కారణం

అల్జీమర్స్‌ రుగ్మత వచ్చినప్పుడు మెదడులో నిర్దిష్ట భాగాలు ఎందుకు దెబ్బతింటాయన్నది పరిశోధకులు గుర్తించారు. ఇది ఏపీవోఈ అనే జన్యువు చర్యల ఫలితమేనని వారు తేల్చారు. ఈ వ్యాధికి అతిపెద్ద జన్యుకారకం ఇదేనని గుర్తించారు. ఇది ఎక్కువగా ఉండే భాగాల్లోనే నష్టం తీవ్రంగా జరుగుతోందని వివరించారు. ఏపీవోఈ జన్యువుకు సంబంధించిన ఏదో ఒక వెర్షన్‌ను ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. అయితే ఏపీవోఈ4 రకం కలిగినవారికి అల్జీమర్స్‌ వచ్చే ముప్పు 12 రెట్లు అధికమని శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న వయసులోనే వారు ఆ రుగ్మతను ఎదుర్కొనే అవకాశం ఎక్కువని తేల్చారు. ఈ వ్యాధి లక్షణాలు కొన్నిసార్లు భిన్నంగా ఉండటాన్ని బట్టి అంతుచిక్కని జీవ ప్రక్రియలకు ఈ వ్యాధితో ప్రమేయం ఉండొచ్చని స్పష్టమవుతోందన్నారు. మెదడు కణజాలాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, గందరగోళానికి గురికావడం, ఆలోచన ప్రక్రియలో ఇబ్బందిపడటం వంటి లక్షణాలు తొలుత బయటపడుతుంటాయి. విషతుల్యమైన ప్రొటీన్ల సమూహం, జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రాంతాల్లో కేంద్రీకృతమవుతుంది. ఆ తర్వాత మెదడులో ఆలోచన, ప్రణాళికకు సంబంధించిన భాగాలకు వ్యాపిస్తుంది. కొన్ని అరుదైన కేసుల్లో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కాకుండా మాటలు లేదా దృష్టితో ముడిపడిన ఇబ్బందులు తొలుత ఆరంభమవుతున్నట్లు గుర్తించారు.

10 నిమిషాల్లోపు భూసార పరీక్ష చేసే యంత్రం ఆవిష్కరణ

ప్రస్తుతం భూసార పరీక్షా కేంద్రాల ద్వారా ఫలితాలు రావడానికి మూడు నెలల సమయం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం, నోవా అగ్రి గ్రూప్, అగ్రో నెక్ట్స్‌ సంస్థల సంయుక్తాధ్వర్యంలో భూ పరిక్షక్‌ పేరిట యంత్రాన్ని రూపొందించారు. దీని ద్వారా అయిదు నుంచి 10 నిమిషాల్లోపు, రూ.20-30 ఖర్చుతో రైతులు సులభంగా యంత్రాన్ని పొలానికి తీసుకెళ్లి భూసారాన్ని పరీక్షించుకోవచ్చు. సదరు యంత్రం ద్వారా రోజుకు 200-250 వరకు పరీక్షలు చేసే వీలుంది. పరీక్ష తర్వాత ఎలాంటి పోషకాలు అవసరమో నివేదిక కూడా ఇస్తుంది. దీన్ని ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు. దీని ఆధారంగా ఏ ఎరువులు వాడాలన్నది సులభంగా తెలుసుకోవచ్చు. ఈ భూసార పరికరాన్ని సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ నీరజ ప్రభాకర్, రిజిస్ట్రార్‌ భగవాన్, శాస్త్రవేత్త కిరణ్‌కుమార్, నోవా అగ్రి ఎండీ ఏటుకూరి కిరణ్‌కుమార్, అగ్రో నెక్ట్స్‌ సంస్థ ఎండీ రజిత్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.

ఏసీలను గాలిశుద్ధి యంత్రాలుగా మార్చే సాంకేతికత

ఏసీలను కేవలం రూ.2 వేల ఖర్చుతోనే ఎయిర్‌ ప్యూరిఫయర్లుగా మార్చే సాంకేతికÛతను ఐఐటీ - కాన్పుర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) - బెంగళూరు పరిశోధకులు అభివృద్ధి చేశారు. వారు రూపొందించిన పరికరాన్ని ‘క్లీన్‌ ఎయిర్‌ మాడ్యుల్‌’గా పిలుస్తున్నారు. ఇది సాధారణ ఏసీల్లో ఉండే పది ఫిల్టర్లకు సమానమైన పనితీరును కనబరుస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ‘‘యాంటీ మైక్రోబియల్‌ ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి చేతిలో పట్టేంత పరికరాన్ని తయారు చేశాం. దీన్ని ఏసీలకు అమర్చుకుని, ఫ్యాన్‌ మోడ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. గాలిలో ఉండే ధూళి కణాలు, బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలతో పాటు కరోనా డెల్టా వేరియంట్‌నూ ఈ పరికరం 99.24% సామర్థ్యంతో నిర్వీర్యం చేస్తుంది’’ అని ప్రొఫెసర్‌ అంకుశ్‌ శర్మ తెలిపారు.

కొలెస్ట్రాల్‌ కట్టడికి కొత్త మందు

కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేందుకు నోటి ద్వారా తీసుకునే ఒక ఔషధాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది చెడు కొవ్వును 70% మేర తగ్గిస్తుందని వెల్లడైంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి స్టాటిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. పీఎస్‌ఎస్‌కే9 ఇన్హిబిటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వు యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు నోటి ద్వారా తీసుకునే కొత్త ఔషధాన్ని తయారు చేశారు. అది పీసీఎస్‌కే9 స్థాయిని, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తోంది. ఈ మందు తయారీకి నైట్రిక్‌ ఆసిడ్‌ను ఉపయోగించారు. పీసీఎస్‌కే9ను లక్ష్యంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నయం చేయడానికి ఇచ్చే ఇమ్యూనోథెరపీల సమర్థత కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

హ్రస్వదృష్టికి ప్రత్యేక పరికరాన్ని రూపొందించిన ఎల్వీ ప్రసాద్‌ వైద్యులు

ప్రస్తుతం పిల్లల్లో హ్రస్వదృష్టి (మయోపియా) తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ ఒక పరికరాన్ని రూపొందించింది. షర్ట్‌ కాలర్‌ లేదా చేతి వాచీ మాదిరిగా దీన్ని పెట్టుకోవడం వల్ల ఈ ముప్పును ముందే పసిగట్టవచ్చు. ఇప్పటికే దీంతో బాధపడుతున్న వారు, ఆ ముప్పు ముంగిట ఉన్నవారు సైతం ఈ డివైజ్‌ ద్వారా బయట పడొచ్చని ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి ఇన్ఫోర్‌ మయోపియా విభాగాధిపతి డాక్టర్‌ పవన్‌ వెంకిచెర్ల చెప్పారు. సాధారణంగా నేత్రాలకు వేయి లక్స్‌ కంటే ఎక్కువ కాంతి అవసరం. అప్పుడే కళ్లు బాగా పనిచేస్తాయి. అంతకంటే తక్కువ కాంతిలో చదవడం, టీవీలకు అతుక్కుపోవడం మయోపియాకు దారితీస్తుంది. ఈ డివైజ్‌ ధారణ వల్ల ఎంతసేపు తక్కువ కాంతిలో గడిపారో తెలుస్తుంది. అలారం మోగి హెచ్చరిస్తుంది. ఫలితంగా టీవీలు, కంప్యూటర్‌ ముందు గడిపే సమయాన్ని వారికి వారే తగ్గించుకుంటారని పవన్‌ వివరించారు.

స్వచ్ఛమైన తేనెతో మధుమేహ నియంత్రణ

రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచేందుకు స్వచ్ఛమైన తేనె దోహదపడుతుందని కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకవేళ మనం తీసుకునే తేనె, ఒకే రకమైన పూల నుంచి వచ్చినదైతే ఆ ప్రయోజనాలు మరింత అధికంగా ఉంటాయని నిర్ధారించారు. తేనెలో ఉండే అరుదైన షుగర్లు, ప్రొటీన్లు, కర్బన ఆమ్లాల వంటి సమ్మేళనాలతో ఆరోగ్యానికి చాలా ఉపయోగాలుంటాయని పరిశోధకుల్లో ఒకరైన తౌసీఫ్‌ ఖాన్‌ పేర్కొన్నారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను తగ్గిస్తూనే మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయులను పెంచేందుకు అవి ఉపకరిస్తాయని తమ అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. 8 వారాల పాటు రోజుకు 40 గ్రాముల చొప్పున తేనెను తీసుకున్న వారిలో ఈ ఫలితాలను గుర్తించామని వివరించారు.

వృద్ధాప్యంలో ఆరోగ్యంపై యవ్వనంలోనే చెప్పేయొచ్చు!

వృద్ధాప్యం అందరికీ ఒకేలా ఉండదు. కొందరేమో మధుమేహం, హృదయం - రక్తనాళాల సంబంధిత వ్యాధులు, మతిమరుపు వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందిపడుతుంటే, మరికొందరు ఆరోగ్యంగానే జీవనం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వయసు మీద పడ్డాక అనారోగ్యానికి గురయ్యే ముప్పును ముందుగానే పసిగట్టి, అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకునేందుకు వీలు కల్పించే కీలక అంశాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. యవ్వనంలో వ్యక్తుల రక్తంలో ‘ఇన్సులిన్‌ లైక్‌ పెప్టైడ్‌-3 (ఐఎన్‌ఎస్‌ఎల్‌-3)’ అనే ప్రత్యేక హార్మోన్‌ స్థాయులను బట్టి దీర్ఘకాలంలో వారి ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతోందో ముందుగానే అంచనా వేయొచ్చని వారు నిర్ధారించారు. ఐఎన్‌ఎస్‌ఎల్‌-3 ఎక్కువగా ఉన్నవారు వయసు మీద పడ్డాక అనారోగ్యంతో సతమతమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా పురుషుల్లో ఈ అంచనా నిజమయ్యే అవకాశాలు పుష్కలమని తెలిపారు.

క్యాన్సర్‌పై పోరేందుకు వినుత్న ఇమ్యునోథెరపీ అభివృద్ధి

క్యాన్సర్‌పై సమర్థంగా పోరాడే వినూత్న ఇమ్యునోథెరపీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వైద్య కళాశాల పరిశోధకులు రూపొందిస్తున్న కొత్త చికిత్సా విధానంలో నేచురల్‌ కిల్లర్‌ (ఎన్‌.కె.) కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతవరకూ క్యాన్సర్‌పై పోరుకు ఉపయోగిస్తున్న టి కణాల కంటే ఈ ఎన్‌.కె. కణాలే శక్తిమంతమైనవని శాస్త్రవేత్తలు తేల్చారు. క్యాన్సర్‌ కణాల్లోని పీవీఆర్‌ అనే ప్రోటీన్, టీ, ఎన్‌.కె. కణాలు క్యాన్సర్‌ను నిర్మూలించకుండా అడ్డుపడుతోంది. ఎన్‌.కె. కణాల్లోని కేఐఆర్‌2డీఎల్‌5 అనే పదార్థానికి పీవీఆర్‌ అతుక్కోవడంతో ఆ కణాలు నిర్వీర్యమవుతున్నాయి. దీంతో కేఐఆర్‌2డీఎల్‌5, పీవీఆర్‌ల బంధాన్ని ఛేదించే మోనోక్లోనల్‌ యాంటీబాడీని పరిశోధకులు కనిపెట్టారు. ఈ బంధం తెగిపోయాక ఎన్‌.కె కణాలు శక్తిమంతంగా పనిచేసి క్యాన్సర్‌ కణుతులను క్షీణింపజేస్తున్నట్టు గుర్తించారు.

కుష్ఠుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో కాలేయ పునరుద్ధరణ

కుష్ఠు వ్యాధికి కారణమయ్యే మైక్రోబ్యాక్టీరియమ్‌ లెప్రే, దాని పరాన్న జీవులు కాలేయ పునరుద్ధరణకు దోహదపడగలవని తేలింది. కణాల్లో జరిగే సహజ ప్రక్రియలపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపి, అవయవాల పునర్నిర్మాణానికి కారణమవుతున్నట్టు గుర్తించారు. కాలేయ వ్యాధిగ్రస్థులకు ఈ బ్యాక్టీరియాతో చికిత్స అందించడం ద్వారా అవయవమార్పిడి అవసరాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం పరిశోధకులు 57 ఆర్మడిల్లో జంతువులకు లెప్రే, పరాన్న జీవులను ఎక్కించారు. తర్వాత వాటి కాలేయాల పరిమాణం పెరగడమే కాకుండా, అవి ఆరోగ్యకరంగా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. కాలేయంలోని హెపటోసైట్లుగా పిలిచే కణాలు ఈ బ్యాక్టీరియా కారణంగా పునరుజ్జీవం పొందుతున్నట్టు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.

వీర్య పుష్టిలో గణనీయ క్షీణత

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన అధ్యయనం మేరకు గత కొన్నేళ్లుగా వీర్య పుష్టి (స్పెర్మ్‌ కౌంట్‌) గణనీయంగా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది. ఈ దేశాల్లో భారత్‌ కూడా ఉన్నట్లు తెలిపారు. వీర్య పుష్టిలో క్షీణతను మానవ పునరుత్పాదక లోపంగానే కాకుండా, పురుషుల ఆరోగ్య కోణంలోనూ చూడాల్సి ఉంటుందని చెప్పారు. వీర్య పుష్టి తగ్గితే, దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్, జీవితకాలంలో తగ్గుదల వంటి ప్రమాదాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్షీణతను ఆధునిక పర్యావరణ పరిస్థితులు, జీవనశైలుల పరంగా ప్రపంచ సంక్షోభంగా పరిశోధకులు అభివర్ణించారు. మానవ జాతుల మనుగడపై దీని విస్తృత ప్రభావం ఉంటుందని తెలిపారు. 53 దేశాల నుంచి సేకరించిన ఈ అధ్యయనం వివరాలు ‘‘హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ అప్‌డేట్‌’’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘భారతదేశంలోనూ బలమైన, స్థిరమైన క్షీణత ఉందని మా నిశ్చితాభిప్రాయం. మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది’ అని ఇజ్రాయెల్‌లోని జెరూసలేంకు చెందిన హీబ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హగాయ్‌ లెవిన్‌ తెలిపారు. ‘మొత్తానికి గత 46 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 50 శాతం వీర్య పుష్టి తగ్గింది. ఇటీవలి సంవత్సరాల్లో ఈ తగ్గుదల వేగం మరింత పెరిగింది’ అని ఆయన వివరించారు. క్షీణతకు కారణాలు ఏమిటన్న దానిపై మాత్రం ఈ అధ్యయనం దృష్టి పెట్టలేదు. ‘జీవనశైలి ఎంపికలు, పర్యావరణంలో రసాయనాల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి’ అని లెవిన్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు ఈ సమస్యపై తక్షణం స్పందించాలని తాము కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఆటోమేటిక్‌ బ్రేకులు

వాహనాలు పరస్పరం ఢీ కొట్టుకోవడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను సగం మేర తగ్గించే ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థను అమెరికాలో రూపొందించారు. పికప్‌ ట్రక్కులు పాదచారులను, కార్లను ఢీకొనే ప్రమాదాన్ని ఈ స్వయంచాలిత బ్రేకింగ్‌ వ్యవస్థ 43 శాతం వరకు తగ్గిస్తుందని రెండు అధ్యయనాల్లో తేలింది. ఆటోమేటిక్‌ బ్రేకులతో పాటు ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొనే ప్రమాదాన్ని ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థను అమర్చినప్పుడు ప్రమాదాలు 49 శాతం వరకు తగ్గిపోయాయి. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా 95 శాతం వాహనాల్లో కొత్త స్వయంచాలిత బ్రేకింగ్‌ వ్యవస్థను అమర్చుతామని 20 కార్ల కంపెనీలు వాగ్దానం చేశాయి. ఇప్పటికే 90 శాతం వాహనాల్లో ఆటోమేటిక్‌ ఎమర్జన్సీ బ్రేకింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేశామని మిత్సుబిషి, ఫోర్డ్, మెర్సిడెస్‌ బెంజ్, హోండా, ఫోక్స్‌ వ్యాగన్‌ వంటి కంపెనీలు అమెరికా సర్కారుకు తెలిపాయి. బీఎండబ్ల్యూ, టెస్లా, హ్యుందాయ్, టొయోటా, వోల్వో తదితర కంపెనీలు గత ఏడాదే ఆ ఏర్పాట్లు పూర్తిచేశాయి. జనరల్‌ మోటార్స్‌ కూడా అదే దారిలో ఉంది.

వినియోగ వస్తువుల్లోని రసాయనాలతో గర్భాశయాల్లో కణితులు

రోజూ మనం ఉపయోగించే వస్తువుల్లో ఉండే ఫలేట్స్‌ అనే విషపూరిత రసాయనాల వల్ల మహిళలకు గర్భాశయాల్లో కణితులు (ఫైబ్రాయిడ్లు) ఏర్పడే ప్రమాదం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ఎన్విరాన్‌మెంటల్‌ ఫలేట్లను పలు రకాల పారిశ్రామిక, వినియోగ వస్తువుల్లో ఉపయోగిస్తారు. ఇవి కొన్ని రకాల మందులు, ఆహారంలోనూ ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆహార పదార్థాల ప్యాకింగ్, కేశాలంకరణ పదార్థాలు ఇలా అన్నింటిలోనూ ఇవి ఉంటున్నాయని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్‌ వర్సిటీ ఫీన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకుడు సెర్డర్‌ బులన్‌ తెలిపారు. ఫైబ్రాయిడ్లు అనేవి మహిళల గర్భాశయ గోడలపై పెరిగే కణితులు. చాలా సందర్భాల్లో ఇవి కేన్సర్‌ దాకా వెళ్లకపోవచ్చు. మహిళల్లో 80% మందికి వారి జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఫైబ్రాయిడ[్లు వస్తాయని బులన్‌ చెప్పారు.

ఆనకట్టలకు వాతావరణ మార్పుల ముప్పు!

వాతావరణ మార్పుల ప్రభావంతో కలిగే దుష్పరిణామాల్లో ఓ కొత్త కోణాన్ని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వాతావరణ మార్పులతో ఆనకట్టలకు వరద ముప్పు పెరిగే ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పెద్దపెద్ద డ్యాంలు, అణువిద్యుత్‌ కేంద్రాల డిజైన్‌ విషయంలో ఇంజినీర్లు వినియోగిస్తున్న వర్షపాత విధానాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియాలో జరిపిన అధ్యయనం పేర్కొంది. గాలిలో పెరుగుతున్న తేమ ప్రభావంతో ఆస్ట్రేలియాలోని 546 భారీ ఆనకట్టలకు 14 నుంచి 38 శాతం అధిక వర్షపాతం ముప్పు పొంచిఉందని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌వేల్స్, మెల్‌బోర్న్‌ వర్సిటీలకు చెందిన అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ అవపాత విధానం (పీఎంపీ) 20 ఏళ్లుగా కొనసాగుతోందని, తక్షణం ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

జన్యు ఎడిటింగ్‌తో క్యాన్సర్‌ చికిత్స

క్యాన్సర్‌ కణాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసేలా రోగ నిరోధక కణాలను తీర్చిదిద్దే విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందుకోసం క్రిస్పర్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంబంధిత జన్యువులను ఆ కణాల్లోకి ప్రవేశపెట్టారు. ఫలితంగా సాధారణ కణాలకు ఇబ్బంది కలగలేదు. అంతిమంగా ఇది క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే ఇమ్యునోథెరపీ సమర్థతను పెంచింది. క్రిస్పర్‌ జీన్‌ ఎడిటింగ్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మానవుల్లో నిర్దిష్ట జన్యువులను తొలగించి, క్యాన్సర్‌పై సమర్థంగా పనిచేసేలా రోగ నిరోధక వ్యవస్థపై ఇప్పటికే ప్రయోగాలు చేశారు. తాజాగా కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికత సాయంతో కొన్ని జన్యువులను తొలగించడమే కాకుండా కొత్త వాటినీ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఆయా రోగుల తీరుతెన్నులకు అనుగుణంగా వ్యక్తిగత చికిత్స అందుబాటులోకి వస్తుంది.

తొలిసారి కాక్లియా దాకా సురక్షితంగా శస్త్రచికిత్స

మానవుల అంతర చెవిలో బోలుగా ఉండే సర్పిలాకార ఎముక ‘కాక్లియా’ వరకు అంతర్జాతీయ పరిశోధకుల బృందం తొలిసారి శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా చేరుకోగలిగింది. వినికిడి శక్తికి కాక్లియా చాలా కీలకం. ఇన్నాళ్లూ వైద్య నిపుణులు, పరిశోధకులు శస్త్రచికిత్స ద్వారా ఆ భాగం వరకు వెళ్లలేకపోయారు. ఫలితంగా చెవిటి వారిలో వినికిడి సామర్థ్యాన్ని పునరుద్ధరించగలిగే కొన్ని రకాల చికిత్సలు చేసేందుకు వీలు లేకుండాపోయింది. ఈ సమస్యపై దృష్టి సారించిన అంతర్జాతీయ పరిశోధక బృందం, తాజాగా శస్త్రచికిత్స ద్వారా కాక్లియా వరకూ సురక్షితంగా చేరుకోగల విధానాన్ని కనుగొంది. దీంతో జంతువుల్లో ఇప్పటికే విజయవంతమవుతున్న కొన్ని అధునాతన చికిత్సలను ఇకపై మానవులకూ అందించేందుకు మార్గం సుగమమైనట్లేనని చెబుతున్నారు.

బీర్లలో వాడే పూలతో అల్జీమర్స్‌ నుంచి రక్షణ

బీర్లకు ప్రత్యేకమైన రుచిని తీసుకొచ్చేందుకు వినియోగించే హాప్‌లు (హ్యుములస్‌ లుపులస్‌ అనే మొక్కకు చెందిన పూలు) అల్జీమర్స్‌ వ్యాధి బారిన పడకుండా రక్షణ కల్పించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా వయసు మీద పడే కొద్దీ వ్యక్తుల నాడీకణాల్లో అమైలాయిడ్‌ బీటా ప్రొటీన్లు పోగుపడుతుంటాయి. వాటి నిల్వలు ఎక్కువైతే.. తీవ్ర మతిపరుపునకు కారణమయ్యే అల్జీమర్స్‌ వస్తుంది. హాప్‌లలో ఉండే ప్రత్యేక సమ్మేళనాలు దానికి విరుగుడుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా టెట్నాంగ్‌ అనే రకం హాప్‌లోని సమ్మేళనాలు, నాడీకణాల్లో అమైలాయిడ్‌ బీటా ప్రొటీన్లు పోగుపడకుండా సమర్థంగా అడ్డుకుంటున్నాయని వెల్లడించారు. ఈ సమ్మేళనాలకు యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. బీర్లు తాగడం వల్ల అల్జీమర్స్‌ను నివారించొచ్చన్నది తమ అభిప్రాయం కాదని వాటిలో ఉపయోగించే హాప్‌లతో సరికొత్త ఔషధాలు తయారు చేయొచ్చని మాత్రమే చెప్పాలనుకుంటున్నామని వివరించారు.

వాయు కాలుష్యంతో తీవ్రస్థాయి గుండె వ్యాధుల ముప్పు

వాయు కాలుష్యం వల్ల వ్యక్తుల్లో హృదయం - రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పు అధికమవుతుందని ఇటలీ పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో గుర్తించారు. అప్పటికే గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఈ కాలుష్యం మరింత దెబ్బతీస్తుందని నిర్ధారించారు. ప్రధానంగా నాన్‌ అబ్‌స్ట్రక్టివ్‌ కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (ఎన్‌వోసీఏడీ)తో బాధపడుతున్న వారిపై (వారందరి సగటు వయసు 62 ఏళ్లు) పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పీఎం 2.5, పీఎం 10 కాలుష్య కణాలు వారిపై చూపుతున్న ప్రతికూల ప్రభావాన్ని పరిశీలించారు. ఆ కాలుష్యం కారణంగా వ్యక్తుల్లో గుండె, రక్తనాళాల సంబంధిత తీవ్రస్థాయి వ్యాధుల ముప్పు పెరుగుతున్నట్లు తేల్చారు.

ఐఎండీ హెచ్చరికల్లో మరింత కచ్చితత్వం!

భారత వాతావరణ అంచనాల్లో కచ్చితత్వం పెరగబోతోంది. విమాన ఆధారిత వాతావరణ డేటా ప్రసార (ఏఎండీఏఆర్‌) వ్యవస్థ రూపంలో త్వరలో అదనపు సేవలు అందుబాటులోకి రానుండటమే ఇందుకు కారణం. తీవ్రస్థాయి ప్రకృతి విపత్తులు పెరుగుతున్న తరుణంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థలకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ఏఎండీఏఆర్‌ సేవలు కీలకం కానున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. విమానాల్లోని సెన్సర్లు గాలి ఉష్ణోగ్రత, వేగం, దిశ, పీడనం, నీటి ఆవిరి వంటి అంశాలకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తుంటాయి. వాటిని భూకేంద్రాలకు చేరవేస్తుంటాయి. అవి ఎయిర్‌పోర్టుల నుంచి టేకాఫ్‌ అయ్యే, ల్యాండ్‌ అయ్యే విమానాలకు అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాఖలకూ ఈ వివరాలను చేరవేస్తుంటారు. అక్కడ సాగరాల్లో ఏర్పాటు చేసిన సాధనాల ద్వారా సేకరించే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, బెలూన్లు, వాతావరణ కేంద్రాలు అందించే డేటాతో పాటు ఈ సమాచారాన్ని జోడించడం ద్వారా వర్షాలు వంటి వాటిపై అంచనాలకు వస్తుంటారు. 24 గంటల ముందు చేసే వాతావరణ హెచ్చరికల్లో లోపాలను తగ్గించడంలో ఏఎండీఏఆర్‌ డేటా కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏఎండీఏఆర్‌ వివరాలను భారత్‌లోని వాతావరణ కార్యాలయాలకు డేటాను చేరవేయడానికి అవసరమైన ట్రాన్స్‌-రిసీవర్ల కొనుగోలుకు విమానాశ్రయాల ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టిందన్నారు.

తొలిసారిగా ప్రయోగశాలల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి

రక్త కణ సంబంధిత అరుదైన వ్యాధులతో బాధపడే వ్యక్తులకు అందించే చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా బ్రిటన్‌ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో తయారు చేసిన ఎర్ర రక్త కణాలను క్లినికల్‌ ట్రయల్‌ల కోసం ఇద్దరు వాలంటీర్లకు ఎక్కించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులతో కూడిన బృందం దాతల నుంచి సేకరించిన మూల కణాల ద్వారా వాటిని ఉత్పత్తి చేసింది. సాధారణ వ్యక్తుల నుంచి సేకరించే రక్తకణాలతో పోలిస్తే ప్రయోగశాలల్లో తయారైనవి గ్రహీతల్లో ఎక్కువ కాలం మనగలుగుతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దాతల నుంచి తీసుకునే రక్తంలో వయసు మీద పడిన కణాలూ ఉంటాయని వారు గుర్తుచేశారు. అరుదైన వ్యాధులతో బాధపడుతూ తరచూ రక్తమార్పిడి చేయించుకోవాల్సి వచ్చే వారికి కృత్రిమ కణాలు అత్యంత ప్రయోజనకరంగా మారుతాయని పేర్కొంటున్నారు.

వేధించే వ్యాధి క్రోన్స్‌పై ఏఐజీ పరిశోధనలో ముందడుగు

క్రోన్స్, ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైంది కాకపోయినా తీవ్రంగా వేధించే వ్యాధి. దీని బారినపడిన వారు ఉన్నట్టుండి అత్యవసరంగా మరుగుదొడ్డికి వెళ్లాల్సి వస్తుంటుంది. నియంత్రించుకోలేని స్థితి ఎదురవుతుంటుంది. రోగుల్లో ఈ వ్యాధి ఏ దశలో ఉందో, ఎలాంటి చికిత్సను అందిస్తే సరిగ్గా నయమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఇంతవరకు ఉంది. తాజాగా ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు దీనిపై పరిశోధనలు నిర్వహించారు. సాధారణంగా క్యాన్సర్‌ తీవ్రతను గుర్తించడానికి వ్యాధి దశను నిర్ధరించి, తదనుగుణంగా ఎలాగైతే చికిత్సను అందజేస్తారో క్రోన్స్‌ వ్యాధికీ అదే విధానాన్ని అమలు చేయడం వల్ల సత్ఫలితాలుంటాయని గుర్తించారు. పరిశోధనలో వెల్లడైన అంశాలతో తాజాగా పత్రాన్ని రూపొందించారు. ఈ మేరకు వ్యాధి శరీరంలో ఏ భాగానికి సోకిందనే దాన్నిబట్టి శస్త్రచికిత్స ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐజీ చీఫ్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ జీవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం ఈ పరిశోధనలు జరిపింది. ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ మనూటాండన్, డాక్టర్‌ పార్థపాల్, డాక్టర్‌ అనూరాధ శేఖరన్, డాక్టర్‌ ప్రదీప్‌ రెబలా తదితరులు పాల్గొన్నారు. పరిశోధన పత్రం తాజాగా ‘ఇంటెస్టైనల్‌ రీసెర్చీ’ అంతర్జాతీయ వైద్యపత్రికలో ప్రచురితమైంది. పరిశోధనలోని అంశాలను డాక్టర్‌ జీవీ రావు వివరించారు. ఏమిటీ వ్యాధి? ఇది ‘పేగు పూత వ్యాధుల (ఐబీడీ)’ కోవకు చెందింది. నోటి నుంచి మలద్వారం వరకూ ఎక్కడైనా పుండ్లు రావచ్చు. ఇవి ఎక్కువగా చిన్నపేగుల్లో కనిపిస్తుంటాయి. ఈ వ్యాధి క్షయను పోలి ఉండటంతో చాలా సందర్భాల్లో వైద్యులు ఆ చికిత్స చేస్తుంటారు. ఎంతకీ తగ్గకపోవడంతో మరింత లోతుగా పరీక్షలు జరిపి ‘క్రోన్స్‌’గా గుర్తిస్తారు. ఈ బాధితులకు జీవితంలో కనీసం ఒకటి రెండుసార్లైనా శస్త్రచికిత్స అవసరమవుతుందని ‘నేషనల్‌ కోఆపరేటివ్‌ క్రోన్స్‌ డిసీజ్‌’ అధ్యయనం వెల్లడించింది.

గుండె నిర్మాణంపై కాడ్మియం ప్రభావాన్ని గుర్తించే కొత్త విధానం

పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు సహజ లోహం ‘కాడ్మియం’ ఎలా కారణమవుతుందో తెలుసుకునేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎన్‌ఐఈహెచ్‌ఎస్‌) శాస్త్రవేత్తలు త్రిమితీయ నమూనాను రూపొందించారు. ఒక్క అమెరికాలోనే ఏటా 40 వేల మంది శిశువులు ఈ రుగ్మతతో పుడుతున్నారు. హృదయ నిర్మాణంలో లోపాలకు కాడ్మియం కారణమవుతున్నట్టు మునుపటి పరిశోధనల్లో తేలినందున ఎన్‌ఐఈహెచ్‌ఎస్‌ పరిశోధకులు మానవ కణాలు, కండరాలకు సంబంధించిన బిట్రో మోడళ్లను ఉపయోగించి ‘త్రీడీ కార్డియాక్‌ ఆర్గానాయిడ్‌ నమూనా’ను రూపొందించారు. గర్భస్థ శిశువులో గుండె నిర్మాణం జరిగేటప్పుడు కాడ్మియం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది తెలుసుకునేందుకు ఈ నమూనా దోహదపడుతుందని పరిశోధనకర్త ఎరిక్‌ టోకర్‌ చెప్పారు. పిండం తొలి దశలోనే గుండె కండారాల్లో ఉండే కార్డియోమయోసైట్లపై కాడ్మియం ప్రభావం చూపుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు.

వృద్ధాప్య కణాలతో క్యాన్సర్‌కు టీకా

క్యాన్సర్‌ పరిశోధనల్లో మేలి మలుపు. ఈ ప్రాణాంతక రుగ్మత నుంచి కాపాడే వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థ ‘ఐఆర్‌సీ బార్సిలోనా’ ముందడుగు వేసింది. క్యాన్సర్‌ కణాలు అభివృద్ధి చెందినప్పుడు సహజంగానే బాధితుల రోగనిరోధక వ్యవస్థ వాటిపై దాడి చేస్తుంది. అయితే, ట్యూమర్‌ దరిచేరకుండా ఈ కణాలు బలంగా అడ్డుకుంటున్నాయి. దీంతో వ్యాధి ముదిరి రోగుల ఆరోగ్యం క్షీణిస్తోంది. దీనిపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు టీకా తయారీలో కొత్త పంథాను అనుసరించారు. వృద్ధాప్యంతో బలహీనపడిన క్యాన్సర్‌ కణాలతో (సెనెసెంట్‌ సెల్స్‌తో) ప్రయోగాలు చేపట్టారు. ‣ మొదట వీటిని కొన్ని ఆరోగ్యవంతమైన ఎలుకలకు ఎక్కించారు. కొద్ది రోజుల అనంతరం ట్యూమర్‌ కారక కణాలను చొప్పించినా, వాటిలో క్యాన్సర్‌ అభివృద్ధి కాలేదు. ఇక రెండో దశలో, ఇప్పటికే కణతులతో బాధపడుతున్న కొన్ని జీవులకు సెనెసెంట్‌ సెల్స్‌ను ఇచ్చారు. వీటిలో ఫలితాలు అద్భుతంగా లేనప్పటికీ, రోగనిరోధక వ్యవస్థ బలపడి, జీవుల ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగైందని పరిశోధనకర్త, సెల్యులార్‌ ప్లాస్టిసిటీ అండ్‌ డిసీజ్‌ విభాగం అధినేత డా.సెరానో వివరించారు.

వంతెన భద్రతను అప్రమత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన

లాంగ్‌ డ్రైవ్‌కూ, పర్యాటక ప్రాంతాలకూ వెళ్లేటప్పుడు దారిలో ఎక్కడో ఒక చోట వంతెనలు ఎదురవుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు కట్టినవో, ఇప్పుడు వాటి నాణ్యత, సామర్థ్యం ఎలా ఉన్నాయో, వాహనాలపై వాటిపై ప్రయాణించడం సురక్షితమో కాదో తెలియకుండానే మనం ముందుకు సాగిపోతుంటాం. ఆ వంతెనలపై ప్రయాణించేటప్పుడే వాటి భద్రత, నాణ్యత గురించి తెలిస్తే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే అంశంపై పరిశోధన సాగించారు మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు. ఇందుకు వారు ప్రత్యేకంగా మొబైల్‌ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ‣ ఈ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఫోన్‌ను వాహనాలకు అమర్చినప్పుడు వంతెన నుంచి వచ్చే కంపనాలను యాక్సిలరోమీటర్‌ ద్వారా లెక్కగడుతుంది. తద్వారా దాని నిర్మాణ సామర్థ్యం, భద్రతను అంచనా వేసి, మొబైల్‌ ఫోన్‌కు సందేశం పంపుతుంది. రహదారి వంతెనల విషయంలోతమ అప్లికేషన్‌ ఆయా నిర్మాణాల తీరును బట్టి వాటి జీవితకాలాన్ని ముందుగా నిర్ధారించిన దాని కంటే 15-30% ఎక్కువగా అంచనా వేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి తదితర వంతెనలపై ఇప్పటికే విజయవంతంగా పరీక్షించి చూశారు. ‘క్రౌడ్‌సోర్సింగ్‌ బ్రిడ్జ్‌ వైటల్‌ సైన్స్‌ విత్‌ స్మార్ట్‌ఫోన్‌ వెహికిల్‌ ట్రిప్స్‌’ పేరుతో రూపొందించిన ఈ పరిశోధన నివేదికను నేచర్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ పత్రిక అందించింది.

ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీహెచ్‌

తక్కువ ధరతో ఎక్కువ నాణ్యత ఉండే ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ను ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి స్థానికంగా లభించే సిమెంట్, ఫ్లైయాష్, ఇసుక, మైక్రోసిలికా, నీరు, స్టీల్‌ ఫైబర్, పాలీప్రొఫిలీన్‌ తదితర పదార్థాలను వినియోగించారు. వీటిని తగిన పాళ్లలో కలిపి కాంక్రీట్‌ తయారు చేసినట్లు ఐఐటీహెచ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య సూర్యప్రకాశ్‌ వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉండే కాంక్రీట్‌ కంటే దీని ధర రెండు రెట్లు తక్కువగా ఉంటుందని బీమ్స్‌తో పాటు వంతెనల నిర్మాణాల్లో దీని పనితీరును పరీక్షించామని వెల్లడించారు. ఎక్కువ కాలం మన్నే వంతెనలు, ఇతరత్రా నిర్మాణాలు దేశాభివృద్ధికి అవసరమని ఐఐటీ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌ మూర్తి తెలిపారు. ఈ మేరకు ఐఐటీహెచ్‌ వివరాలను వెల్లడించింది.

స్పానిష్‌ మహిళ జన్యువుల్లో కనీవినీ ఎరుగని మార్పుల గుర్తింపు

స్పెయిన్‌కు చెందిన ఒక మహిళ ఉదంతం వైద్య శాస్త్రాన్ని నివ్వెరపరచింది. జీవితమంతా ఆమెపై కణితులు దాడి చేస్తూనే ఉన్నాయి. 36 ఏళ్లు వచ్చేసరికి 12 రకాల ట్యూమర్లను ఎదుర్కొంది. ఆమె జన్యువులను తరచి చూసిన పరిశోధకులకు మానవుల్లో ఎన్నడూ చూడని మార్పులు కనిపించాయి. ఆమె ఇప్పటికీ ఎలా జీవించి ఉందన్నది వారికి అంతుబట్టడంలేదు. ‣ రెండేళ్ల వయసులో ఆమె తొలిసారి క్యాన్సర్‌ బారినపడింది. ‣ 15 ఏళ్లు వచ్చేసరికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తలెత్తింది. ‣ మరో ఐదేళ్లకు లాలాజల గ్రంథిలో కణితి వచ్చింది. దీంతో ఆ అవయవాన్ని వైద్యులు తొలగించారు. ‣ 21 ఏళ్ల ప్రాయంలో డాక్టర్లు మరో శస్త్రచికిత్స చేసి ఆమెలో ‘లో గ్రేడ్‌ సార్కోమా’ను తీసివేశారు. ‣ తర్వాత కూడా భిన్న రకాల కణితులను ఆమె ఎదుర్కొంది. మొత్తం మీద 12 రకాల ట్యూమర్లు విరుచుకుపడ్డాయి. వీటిలో ఐదు క్యాన్సర్‌ కణితులు ఉన్నాయి. శోధిస్తే.. బాధితురాలిలో ఇన్ని రకాల ట్యూమర్లు రావడంపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు దానికి మూలాలను గుర్తించాలని నిర్ణయించారు. ఈ బృందానికి స్పెయిన్‌కు చెందిన నేషనల్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు. ‣ బాధితురాలి నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశీలించారు. ఆమె కణాల్లోని ఎంఏడీ1ఎల్‌1 అనే జన్యువులో రెండు ప్రతుల్లోనూ ఉత్పరివర్తన కనిపించింది. ‣ ఒక కణం విభజనకు లోనుకావడానికి ముందు అందులోని క్రోమోజోములను క్రమపద్ధతిలో ఉంచడంలో సాయపడే యంత్రాంగ నిర్వహణ బాధ్యతను ఎంఏడీ1ఎల్‌1 చూస్తుంటుంది. కణితులను అణచివేయడంలో దాని పాత్ర ఉండొచ్చని గతంలో భావించారు. ‣ బాధితురాలిలో రెండు ప్రతుల్లోనూ వైరుధ్యం కనిపించింది. మానవుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారి. దీనివల్ల బాధితురాలిలో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు తేల్చారు. ‣ మానవ కణాల్లోని న్యూక్లియస్‌లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఇందులో ఒక జత తండ్రి నుంచి, రెండోది తల్లి నుంచి వస్తాయి. ‣ జంట ఉత్పరివర్తనాల వల్ల బాధితురాలిలో కణ ప్రతుల తయారీ ప్రక్రియ దెబ్బతింటోంది. ఫలితంగా భిన్న సంఖ్యల్లో క్రోమోజోములు కలిగిన కణాలు ఉత్పత్తవుతున్నాయి. ఆమె రక్తంలోని 30-40% కణాల్లో అసాధారణ సంఖ్యలో క్రోమోజోములు ఉన్నాయి.

భూ వాతావరణంలోకి రీశాట్‌: ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2009లో ప్రయోగించిన రీశాట్‌ ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించింది. జకార్తా సమీపంలో హిందూ మహాసముద్రం ఎగువ భాగంలో ఆ ప్రక్రియ చోటు చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. దాని శకలాలు మహాసముద్రంలో పడిపోవడానికి ముందే భస్మమయి ఉండొచ్చని పేర్కొంది. రీశాట్‌ బరువు దాదాపు 300 కిలోలు.

బాలిస్టిక్‌ క్షిపణి విధ్వంసక వ్యవస్థ పరీక్ష విజయవంతం

వివిధ రకాల లక్ష్యాలను ఛేదించగల రెండో దశ బాలిస్టిక్‌ క్షిపణి విధ్వంసక వ్యవస్థ తొలి పరీక్షను భారత దేశం విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపంలో డీఆర్‌డీవో నేతృత్వంలో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ (బీఎండీ) ఆయుధ వ్యవస్థలూ ఈ క్రతువులో పాలుపంచుకున్నాయని వెల్లడించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విశిష్టమైన ఈ తరహా క్షిపణి విధ్వంసక వ్యవస్థలు ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

సౌర కుటుంబం కన్నా పెద్ద నక్షత్ర అవశేషం గుర్తింపు

ఇంధనం నిండుకోవడంతో పేలిపోయిన ఒక నక్షత్రానికి సంబంధించిన అవశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని విస్తృతి సౌర కుటుంబం కన్నా 600 రెట్లు పెద్దగా ఉందని వారు పేర్కొన్నారు. 11 వేల సంవత్సరాల కిందట ఆ నక్షత్రం పేలిపోయింది. చిలీలో ఉన్న వీఎల్‌టీ సర్వే టెలిస్కోపు సాయంతో దీన్ని కనుగొన్నారు. విస్ఫోటం వల్ల ఆ తార వెలుపలి పొరలు గులాబీ, నారింజ రంగు మేఘాలుగా విశ్వంలో వ్యాపించాయి. పేలుడు కారణంగా బలమైన ప్రకంపనలు ఉత్పన్నమయ్యాయి. దాని మధ్య భాగం అధిక సాంద్రత కలిగిన న్యూట్రాన్‌ తారగా రూపాంతరం చెందింది. పేలిపోవడానికి ముందు ఈ నక్షత్రానికి సూర్యుడి కన్నా 8 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అది పాలపుంత గెలాక్సీలో భూమికి 800 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెప్పారు.

అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించే ఎంసీఈడీ పరీక్ష

శరీరమంతటా వ్యాపించడానికి ముందే క్యాన్సర్‌ను గుర్తిస్తే బాధితుల ప్రాణాలను వైద్యులు సులువుగా కాపాడగలుగుతారు. అందువల్ల ఈ వ్యాధికి సంబంధించి తరచూ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తుంటారు. ఒక్కో క్యాన్సర్‌కు ఒక్కోరకం పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొలనోస్కొపీ ద్వారా పేగు క్యాన్సర్‌ను, మామోగ్రామ్‌లతో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించొచ్చు. అయితే ఈ పరీక్షలన్నింటినీ చేయించుకోవడం రోగులకు చాలా సవాళ్లు, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఇది వారికి అసౌకర్యంగానూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక రకాల క్యాన్సర్లను ఆరంభంలోనే గుర్తించే పరీక్షల (మల్టీ క్యాన్సర్‌ ఎర్లీ డిటెక్షన్‌ టెస్ట్స్‌ - ఎంసీఈడీ)తో ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ‘క్యాన్సర్‌ మూన్‌షాట్‌’ కార్యక్రమంలో ఈ పరీక్షా విధానాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. సమీప భవిష్యత్‌లో ఎంసీఈడీ పరీక్షలు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ తీరుతెన్నులను మార్చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమిటీ ఎంసీఈడీ? కణితి కణాలు సహా శరీరంలోని కణాలన్నీ తాము చనిపోయేటప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థలోకి డీఎన్‌ఏను విడుదల చేస్తాయి. వాటిలో చాలా స్వల్ప మొత్తంలో ఉండే కణితి డీఎన్‌ఏ కోసం ఎంసీఈడీ పరీక్షలు శోధిస్తాయి. ఈ డీఎన్‌ఏను విశ్లేషించడం ద్వారా.. అది ఎలాంటి కణజాలం నుంచి వచ్చింది? అవి సాధారణ కణాలా? లేదా క్యాన్సర్‌ కణాలా? అన్నది తెలుసుకోవచ్చు.