సదస్సులు-సమావేశాలు

సమర్థత, సాధికారతే పంచాయతీలకు ప్రాణం

అట్టడుగు స్థాయిలో ప్రజలకు చేరువలో ఉన్న స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలే ప్రజాపాలనలో అత్యంత కీలక విభాగాలని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు, ఆర్థికవేత్త అశోక్‌ లాహిరి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో ప్రారంభమైన రాష్ట్ర ఆర్థిక సంఘాల జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశోక్‌ మాట్లాడుతూ.. పంచాయతీలకు ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు చేసిందన్నారు. వాటికి నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇదే పంథాను ఉత్తరాదిలోనూ అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటులో ఉదాసీనత ఎంతమాత్రం సరికాదన్నారు. ఇప్పటి వరకు కేవలం తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే వాటిని ఏర్పాటు చేశాయని వెల్లడించారు.

రక్షణ ఉత్పత్తుల్లో మేటి తెలంగాణ

రక్షణ రంగ ఉత్పత్తుల్లో తెలంగాణ, దేశంలో అగ్రస్థానంలో ఉందని, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు పొందిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ తదితర దేశాలకు చెందిన బోయింగ్, లాక్‌హీడ్‌ మార్టిన్, జీఈ, సాఫ్రాన్‌ వంటి దిగ్గజ వైమానిక, రక్షణ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన రాష్ట్రం తెలంగాణ కావడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారతీయ రక్షణ రంగ ఉత్పత్తిదారుల సొసైటీల ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ నుంచి దృశ్య మాధ్యమంలో ప్రసంగించారు.

9వ గ్లోబల్‌ ఫోరం ఆఫ్‌ ది అలియన్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్స్‌ సదస్సు

లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ఉద్యమకర్త ఎల్సా మేరీ డిసిల్వా కృషిపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ ప్రశంసలు కురిపించారు. మొరాకోలోని ఫెజ్‌ నగరంలో ప్రారంభమైన 9వ గ్లోబల్‌ ఫోరం ఆఫ్‌ ది అలియన్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్స్‌ సదస్సులో గుటెరస్‌ మాట్లాడారు. నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది యువతను కదిలించడానికి ఆమె ప్రయత్నాలు ఉపకరించాయని డిసిల్వాను అభినందించారు. ‘రెడ్‌ డాట్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకురాలైన ఈమె ఈ సంస్థ ద్వారా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ

తెలంగాణలో ఉత్పత్తవుతున్న విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలకే కాక, పలు దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదుగుతోందన్నారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రంలో నవంబరు 25 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్షల సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. వ్యవసాయంలో విత్తన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, తెలంగాణను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి సదస్సును ఇక్కడ నిర్వహించడం గర్వకారణమన్నారు. భారత విత్తన పరిశ్రమకు సేవలందించడానికి అనువుగా అత్యాధునిక సాంకేతికతతో ఈ పరీక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.
‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ మూడో మినిస్టీరియల్‌ కాన్ఫరెన్స్‌ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించేవరకు విశ్రమించకూడదని అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ఉగ్రవాదుల ఆర్థికమూలాలను ఎదుర్కోవడంపై జరిగిన ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ మూడో మినిస్టీరియల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల విదేశాంగ విధానంలో ఉగ్రవాదం భాగంగా ఉందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ లాంటి ఉగ్రసంస్థలకు చెందిన తీవ్రవాదులపై చర్యలు తీసుకోవాలని గత రెండు దశాబ్దాలుగా భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ తీర్మానాలను చైనా తన వీటో అధికారంతో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు కొన్ని దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా మద్దతివ్వడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి దేశాలను వదిలి పెట్టకూడదని, మద్దతు ఇచ్చినందుకు అవి మూల్యం చెల్లించుకొనేలా చూడాలని అన్నారు. ఉగ్రవాదులకు సానుభూతి వ్యక్తం చేసే వ్యక్తులను, సంస్థలను ఒంటరి చేయాలని సూచించారు. 75 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సుకు పాక్, అఫ్గానిస్థాన్‌ను ఆహ్వానించలేదు.

ధనిక దేశాలు చేసిన చేటును మరవలేం

ఈజిప్ట్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్‌-27)లో భారత్‌ తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించింది. సమావేశ సందేశంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాలను ‘మేజర్‌ ఎమిటర్స్‌’, ‘టాప్‌ ఎమిటర్స్‌’గా విభజించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఇది అంగీకారయోగ్యం కాదని భారత ప్రతినిధి బృందం సభ్యుడొకరు వెల్లడించారు. ఈజిప్ట్‌ సదస్సు సందర్భంగా రూపొందిస్తున్న సందేశంలో తమ చారిత్రక చేటు ఎక్కడా ప్రస్తావనకు రాకుండా ధనిక దేశాలు జాగ్రత్త పడుతున్నాయి. భారత్, చైనా సహా ‘టాప్‌ ఎమిటర్‌’ దేశాలన్నీ భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తీర్మానంపై చర్చ సాగింది. ‣ సదస్సు సందర్భంగా వాతావరణ ఒప్పందానికి సంబంధించి 8,400 పదాలు, 20 పేజీలతో రూపొందించిన తొలి ముసాయిదా ప్రతిని ఐరాస అనధికారికంగా విడుదల చేసింది. అఫ్గాన్‌లో నిజమైన, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అఫ్గానిస్థాన్‌లో ‘నిజమైన, సమ్మిళిత ప్రభుత్వం’ ఏర్పాటుకు ‘మాస్కో ఫార్మాట్‌ కన్సల్టేషన్స్‌ ఆన్‌ అఫ్గానిస్థాన్‌’ సమావేశంలో భారత్‌ తదితర దేశాలు పిలుపునిచ్చాయి. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్‌ చేశాయి. రష్యా రాజధాని మాస్కోలో సమావేశానికి ఈ వేదికలో భాగమైన భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాన్, తదితర దేశాల నుంచి ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. అమెరికా స్తంభింపజేసిన అఫ్గానిస్థాన్‌ ఆస్తులను పూర్తిగా విడుదల చేయాలనీ, అమెరికా, నాటో దళాలు రెండు దశాబ్దాల పాటు అఫ్గానిస్థాన్‌లో ఉండి అక్కడ జరిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలని సభ్య దేశాలు తీర్మానించినట్టు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.

జి-20 అధ్యక్ష బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తాం: మోదీ

శక్తిమంతమైన జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్‌ సమ్మిళిత భావనతో నిర్వర్తిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్‌ పరివర్తన తాలూకు ఫలాలు వచ్చే పదేళ్లలో ప్రతిఒక్కరికీ చేరేలా కృషి చేసేందుకు ప్రతిన పూనుదామంటూ సహచర నేతలకు పిలుపునిచ్చారు. బాలి వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు ఇండోనేసియా అప్పగించింది. సునాక్‌తో మోదీ సమావేశం బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో మోదీ బాలిలో సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ, భద్రత తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై వారిద్దరూ చర్చించారు. బ్రిటన్‌తో బలమైన సంబంధాలకు భారత్‌ ప్రాధాన్యమిస్తుందని భేటీ అనంతరం మోదీ పేర్కొన్నారు. ప్రధాని ద్వైపాక్షిక చర్చలు బాలిలో ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సియన్‌ లాంగ్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సమాలోచనలు జరిపారు. రక్షణ, ఇంధన, విద్య, సాంస్కృతిక, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించారు.

కాప్‌-27లో ‘విపత్తు నిధి’ ఏర్పాటుకు ఆమోదం

ఐరాస ఆధ్వర్యాన ఈజిప్ట్‌లో జరుగుతున్న వాతావరణ సదస్సు (కాప్‌-27)లో ప్రపంచ దేశాలు ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చాయి. పుడమి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల నష్టపోతున్న పేద దేశాలకు పరిహారం ఇచ్చేందుకు ఎట్టకేలకు ప్రపంచ దేశాలు తొలిసారిగా అంగీకరించాయి. తుది చర్చల సమయంలో తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఒప్పందానికి ఓకే చెప్పాయి. కాలుష్య ఉద్గారాలతో కలిగిస్తున్న హానికిగానూ ఇలాంటి ఏర్పాటు చేయాలనీ, ఒక ‘పరిహార నిధి’ సమకూర్చుకోవాలని వివిధ దేశాలు కొన్ని దశాబ్దాల నుంచి డిమాండ్‌ చేస్తున్నాయి. ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌లో ఆదివారం ముగిసిన కాప్‌27 సదస్సులో దీనిపై ఒప్పందం కుదిరింది. కరవు, వరదలు, వడగాల్పులు, తుపానులు వంటి వైపరీత్యాలతో సతమతం అవుతున్న పేద దేశాలు దానికి తగ్గ పరిహారం పొందడంలో మొత్తానికి విజయం సాధించినట్లయింది. ఉద్గారాల్లో తమ వాటా స్వల్పమే అయినా ప్రపంచంలో ఇతర దేశాలు చేసినదానికి పర్యవసానాలను తాము అనుభవించాల్సి వస్తోందని పలు దేశాలు వాదిస్తున్నాయి. దానికి అనుకూలంగా వెలువడిన నిర్ణయంపై అవి హర్షం వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలు, మరికొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు వనరుల ద్వారా డబ్బు సమీకరించి, నిధిలో జమ చేస్తారు. వాతావరణ నిధి కోసం ఏటా 10,000 కోట్ల డాలర్లు సమకూరుస్తామన్న వాగ్దానాన్నే అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా నెరవేర్చలేదనీ, ఈ పరిస్థితుల్లో పరిహార నిధికి డబ్బు జమ అవుతుందా అనే అనుమానాలనూ కొన్ని దేశాలు వెలిబుచ్చాయి. న్యాయం దిశగా ఈ సదస్సు ముఖ్యమైన అడుగు వేసిందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు.

శిలాజ ఇంధనాలకు దశలవారీగా వీడ్కోలు: కాప్‌27 సదస్సు

ప్రపంచ దేశాలు అన్ని రకాల శిలాజ ఇంధనాల వాడకాన్ని దశలవారీగా తగ్గించేయాలనీ, వాతావరణ రక్షణ కార్యాచరణ ఏ ఒక్క రంగానికో, ఏ ఒక్క ఇంధన వనరుకో పరిమితం కారాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పిలుపు ఇచ్చారు. ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి ‘వాతావరణ శిఖరాగ్ర సదస్సు’ (కాప్‌ 27)లో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో అయిదో అతిపెద్ద కర్బన ఉద్గార దేశమైన ఇండోనేసియా బొగ్గు నుంచి పునరుత్పాదక ఇంధనాలకు మారడానికి 2000 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని జీ 20 శిఖరాగ్ర సదస్సులో సంపన్న దేశాలు వాగ్దానం చేశాయి. ఇతర వర్థమాన దేశాలకూ ఇలాంటి ఇతోధిక సహాయం అందాలి. ఆహార, ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు భంగం కలగకుండా క్రమంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటూ పునరుత్పాదక ఇంధనాలకు మారాలని భారత్‌ లక్షిస్తోందని యాదవ్‌ చెప్పారు. భారత్‌ పిలుపును ఐరోపా సమాఖ్య (ఈయూ) సమర్థించింది. భారతదేశంలో స్థాపిత విద్యుదుత్పాదన సామర్థ్యంలో 50 శాతం వాటా, బొగ్గుతో నడిచే థర్మల్‌ విద్యుత్కేంద్రాలదే. దేశ ఆర్థిక అవసరాల రీత్యా మరి కొన్నేళ్ల పాటు బొగ్గు మీద ఆధారపడక తప్పదని భారత్‌ పేర్కొంటోంది.

ఇంధన సరఫరాపై ఆంక్షలొద్దు

రష్యా నుంచి భారత్‌ సహా కొన్ని దేశాలు తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తుండటంపై పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నవేళ జి-20 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరాపై ఆంక్షలు విధించడం ఎంతమాత్రమూ సరికాదని సూటిగా చెప్పారు. మార్కెట్‌లో స్థిరత్వ సాధనకు కృషి చేయాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి భారత్‌లో చమురు భద్రత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండోనేసియాలోని బాలి వేదికగా జరుగుతున్న జి-20 సదస్సులో మోదీ ఈ మేరకు ప్రసంగించారు. ‣ ఆహార, ఇంధన భద్రత అంశంపై జరిగిన చర్చలో మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర సరకుల సంక్షోభం నెలకొంది. ఇంధన సరఫరాపై మనం ఆంక్షలేవీ విధించకూడదు. మార్కెట్‌లో స్థిరత్వం సాధించే దిశగా పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా సహా పశ్చిమ దేశాలు కొన్ని నెలలుగా పిలుపునిస్తున్నాయి. అయితే భారత్‌ రాయితీ ధరలకు ఆ దేశం నుంచి ముడి చమురును కొంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తదితర నేతల సమక్షంలో.. జి-20 వేదికగా మోదీ చమురు సరఫరాపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. సునాక్, మెక్రాన్, గీతా గోపీనాథ్‌లతో చర్చలు జి-20 సదస్సు సందర్భంగా బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సహా పలువురు ప్రపంచ స్థాయి నేతలతో సమావేశమయ్యారు. పలు అంతర్జాతీయ అంశాలపై వారితో చర్చించారు. సునాక్‌ ప్రధాని పీఠమెక్కాక మోదీతో ముఖాముఖి మాట్లాడటం ఇదే తొలిసారి. సెనగల్‌ అధ్యక్షుడు - ఆఫ్రికా సంఘం ఛైర్మన్‌ మాకీ సాల్, నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుట్‌ తదితరులూ భారత ప్రధానితో మాట్లాడిన వారిలో ఉన్నారు. ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జీవా, ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ - భారత సంతతి ప్రముఖురాలు గీతా గోపీనాథ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్‌ తదితరులతో మోదీ బాలిలో చర్చలు జరిపారు. భారత్‌ - అమెరికా సంబంధాలపై బైడెన్‌తో చర్చలు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బాలిలో భేటీ అయ్యారు. కృత్రిమ మేధ, సంక్లిష్ట సాంకేతికతలు, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ సహా పలు కీలక రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, దాని ప్రభావాలపై కూడా చర్చించారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, బైడెన్‌ తమ సమావేశంలో సమాలోచనలు జరిపారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్నందుకుగాను బైడెన్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. భారత్‌ జి-20 అధ్యక్ష పీఠమెక్కాక ఇరు దేశాలు సన్నిహిత సమన్వయంతో ముందుకు సాగుతాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

రెండేళ్లలో రూ.61 వేల కోట్లకు జియోస్పేషియల్‌ మార్కెట్‌

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతికత, అంకుర పరిశ్రమలతో జియోస్పేషియల్‌ మార్కెట్‌ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. 2025 నాటికి ఇది రూ.61 వేల కోట్ల మార్కెట్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన 3 రోజుల జియోస్మార్ట్‌ ఇండియా - 2022 సదస్సు, ఉత్పత్తుల ప్రదర్శనశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 250 జియోస్పేషియల్‌ అంకురాలు ఉన్నట్లు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, అటవీ, జలవనరుల నిర్వహణ, పట్టణ ప్రణాళికా రంగాల్లో జియోస్పేషియల్‌ పైలట్‌ ప్రాజెక్టులు అమలవుతున్నాయి. దేశంలో ఈ మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.41,600 కోట్లు ఉండగా 5.45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. సమగ్ర జాతీయ అభివృద్ధికి జియోస్పేషియల్‌ సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు చేతులు కలపాలి. జల వనరుల నిర్వహణకు సమర్థవంతమైన విధానాల కోసం కేంద్రం సాంకేతికతను వినియోగిస్తోంది. గతంలో నీటి అంశం తొమ్మిది మంత్రిత్వ శాఖల పరిధిలో ఉండేది. వాటన్నింటినీ కేంద్రం ఏకీకృతం చేసింది. నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టును చేపట్టింది. నీటి వనరుల వినియోగానికి అన్ని పరీవాహకాల్లో సౌండ్‌ హైడ్రాలాజికల్‌ డేటాబేస్‌ - ఇన్ఫర్మేషన్‌ విధానాన్ని కూడా అమలు చేస్తోంది. దీనివల్ల జల వనరుల పంపిణీలో పారదర్శకత నెలకొంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. ‣ ‘జియోస్పేషియల్‌ ఎకానమీ’, ‘స్ట్రాటజీ ఫర్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌’ అనే రెండు నివేదికలను ఈ సందర్భంగా మంత్రి విడుదల చేశారు. భారతీయ జియోస్పేషియల్‌ పరిశ్రమ ప్రగతిని ఈ నివేదికల్లో వివరించారు. ఈ సందర్భంగా పలువురికి కేంద్ర మంత్రి పురస్కారాలు అందజేశారు.

భూతాపానికి కారణం మేం కాదు

ఇప్పటికే పెరిగిపోయిన పుడమి ఉష్ణోగ్రతల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను, తమను ఒకే గాటన కట్టవద్దని భారత్‌ గట్టిగా గళం వినిపించింది. కార్బన్‌ డయాక్సైడ్‌ ఎక్కువగా వెలువరిస్తున్న తొలి 20 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. తమతో పాటు వీటన్నింటిపై దృష్టి సారించాలని ధనిక దేశాలు చేసిన ప్రయత్నాన్ని భారత్‌ అడ్డుకుంది. ఈ విషయంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌ వంటి భావసారూప్య దేశాలు మనకు బాసటగా నిలిచాయి. వాతావరణ మార్పులపై ఈజిప్టులో జరుగుతున్న కాప్‌27 చర్చల్లో ఈ దేశాలు తమ వాణి వినిపించాయి. ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంలో తమతోపాటు భారత్, చైనా వంటి దేశాలూ ముమ్మర చర్యలు చేపట్టాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుకుంటున్నాయి. ‣ ఆర్థిక, సాంకేతిక సాయాన్ని తమకు అందించకుండా లక్ష్యాలను సవరించుకోవాలంటే ఎలా అని వర్థమాన దేశాలు ప్రస్తుత సదస్సులో ప్రశ్నించాయి. మొత్తం కర్బన ఉద్గారాల్లో 20 శాతాన్ని వెలువరిస్తూ ప్రపంచంలో తొలి స్థానంలో అమెరికా ఉంది. చైనా రెండో స్థానంలో (11%), రష్యా మూడో స్థానంలో (7%), భారత్‌ ఏడో స్థానంలో (3.4%) ఉన్నాయి. ‣ వాతావరణ మార్పులతో ఏవైనా దేశాలు నష్టపోతే ఆర్థిక సాయం అందించే బీమా వ్యవస్థ ఉండాలని జి-7 దేశాలు ప్రతిపాదించాయి.

ఆసియాన్‌ - ఇండియా 19వ సదస్సు

ఆగ్నేయాసియాలో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛాయుత నౌకాయానం, భద్రత, సుసంపన్నత లక్ష్యంగా ఈ ప్రాంతంలోని దేశాలతో కలిసి పనిచేయాలని అమెరికా ఆకాంక్షిస్తోందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఇండో - పసిఫిక్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆసియాన్‌ కూటమిలోని 10 దేశాలు తమకు ఎంతో కీలకమైనవని వెల్లడించారు. కంబోడియా రాజధాని పినామ్‌పెన్‌లో యుఎస్‌ - ఆసియాన్‌ సదస్సులో బైడెన్‌ ప్రసంగించారు. ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనాను నిలువరించేంద]ుకు అమెరికా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ చైనా సముద్రం నుంచి మయన్మార్‌ వరకు ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని బైడెన్‌ పిలుపునిచ్చారు. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లోనూ కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందన్నారు. ఆసియాన్‌ కూటమిలో బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, థాయ్‌లాండ్‌ సభ్య దేశాలు. ఉగ్రవాదం అణచివేతకు ప్రతిన మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పరస్పరం సహకరించుకోవడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్, ఆసియాన్‌ దేశాలు ప్రతిన బూనాయి. అంతకుముందు ఆసియాన్‌ - ఇండియా 19వ సదస్సులో భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రసంగించారు. ఆసియాన్, భారత్‌ మధ్య స్నేహబంధానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. డిజిటల్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లోనూ సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నట్లు సదస్సు అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటన వెల్లడించింది.

అధిక ద్రవ్యోల్బణం ఇబ్బందే: నిర్మలా సీతారామన్‌

అంతర్జాతీయ పరిణామాల కారణంగా తలెత్తిన అధిక ద్రవ్యోల్బణం ఇబ్బందికరమేనని, భారత్, అమెరికాలకు ఇది సవాల్‌గా మారిందని ౖకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దిల్లీలో అమెరికా - ఇండియా వ్యాపారాలు, పెట్టుబడుల అవకాశాల సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ముఖ్యంగా ముడిచమురు దిగుమతుల బిల్లు రూపంలోనే ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు సవాళ్లమయంగా ఉన్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ తెలిపారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నాయని, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం వల్లే ఆహార, ఇంధన ధరలు పెరిగాయని అన్నారు.

ఆర్థిక చేయూతను పెంచాల్సిందే!

వాతావరణ మార్పులకు కళ్లెం వేయడంలో ఏటా 10,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.8,20,000 కోట్లు) ఆర్థిక సాయాన్ని అందించాలన్న లక్ష్యాన్ని గణనీయంగా పెంచాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. వాతావరణ మార్పులపై ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌లో జరుగుతున్న కాప్‌27 సదస్సులో ఈ మేరకు తన వాణి వినిపించింది. 2009లో కోపెన్‌హేగన్‌లో జరిగిన కాప్‌15 సదస్సులో చేసిన తీర్మానం ప్రకారం.. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కలిపి 2020 నాటికి ఏటా 10,000 కోట్ల డాలర్లను సమీకరించాల్సి ఉంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని వర్థమాన దేశాలు ఎదుర్కొనేందుకు ఈ మొత్తాన్ని సమకూర్చాల్సి ఉన్నా ఆ విషయంలో అవి విఫలమవుతున్నాయి. ప్రకృతి పరిరక్షణకయ్యే వ్యయం పెరుగుతున్న దృష్ట్యా విరాళాలు లక్షల కోట్ల డాలర్లకు పెరగాల్సి ఉందని వర్థమాన దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీనిపై తాజా సదస్సులో ఉన్నతస్థాయి చర్చలు చోటు చేసుకున్నాయి. వాతావరణంలో కార్బన్‌ నిల్వలు పెరిగిపోవడానికి ధనిక దేశాలే ప్రధాన కారకులనీ, వనరుల సమీకరణకు అవే చొరవ చూపించి ఆయా పనులకు నిధులు అందేలా చూడాలని భారత్‌ బృందం కోరింది. లక్ష్యాలను సాధించాలంటే 2030 నాటికి నిధుల సమీకరణ 11 లక్షల కోట్ల డాలర్లకు చేరాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయంలో ప్రైవేటు రంగం పాత్ర పరిమితమేనని, దానిపై మాత్రమే దృష్టి సారించడం తగదని అభిప్రాయపడింది.

భూతాపానికి మడ అడవుల పునరుద్ధరణే సరైన పరిష్కారం

వాతావరణ మార్పులతో ఎదురవుతున్న భూతాపానికి కళ్లెం వేయాలంటే మడ అడవుల పునరుద్ధరణే సరైన పరిష్కారమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చెప్పారు. గత ఐదు దశాబ్దాలుగా ఈ విషయంలో భారత్‌ విస్తృత అనుభవాన్ని సాధించిందనీ, దానిని ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌లో జరుగుతున్న ఐరాస వాతావరణ మార్పుల సదస్సు (కాప్‌27)లో ఆయన ప్రసంగించారు. ఉష్ణమండల దేశాలకు సహజసిద్ధ రక్షణ కవచంగా మడ అడవులు నిలుస్తాయని చెప్పారు. వాతావరణ మార్పులకు, తుపానులకు అడ్డుకట్ట వేసి, సముద్ర మట్టాలు పెరిగిపోకుండా ఇవి చూడగలవని వివరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకంతో కర్బన తటస్థత సాధ్యమవుతుందన్నారు. మామూలు అడవులతో పోలిస్తే ఇవి కర్బన ఉద్గారాలను నాలుగైదు రెట్లు ఎక్కువగా పీల్చుకుంటాయని అధ్యయనంలో వెల్లడైనట్లు చెప్పారు. శిలాజ ఇంధనాలపై పన్ను వేయాలి భూతాపాన్ని తగ్గించాలంటే శిలాజ ఇంధనాలపై పన్నులు విధించాలని సదస్సులో వివిధ దేశాలు ప్రతిపాదించాయి. భూగోళానికి చేస్తున్న నష్టానికి గానూ శిలాజ ఇంధన కంపెనీలు, అత్యంత కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాలు మూల్యం చెల్లించుకోవాలని అవి పేర్కొన్నాయి. ఉద్గారాల తగ్గింపు నిమిత్తం ప్రమాణాలు కఠినతరం చేయాలని నిపుణులు నివేదించారు.

భారత్‌ - రష్యా మంత్రుల ద్వైపాక్షిక అంశాలపై సమావేశం

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటిస్తోన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో మాస్కోలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చిస్తామని ఇరువురు నేతలు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై స్పందించిన జైశంకర్‌ తక్కువ ఆదాయ వనరులున్న భారత్‌ చౌక ధరలో లభ్యమయ్యే ఇంధన వనరుల వైపు చూడక తప్పదన్నారు. ఈ క్రమంలో భారత్‌ - రష్యాల బంధం తమకెంతో దోహదపడుతుందని.. దీన్ని మున్ముందు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించడంతో పాటు ముడి చమురు సేకరణను పెంచుతామని తెలిపారు.

ప్రకృతి పరిరక్షణలో సహకరించుకోకపోతే వినాశనమే!

పర్యావరణంలో ప్రతికూల మార్పులను నివారించేందుకు అన్ని దేశాలు తక్షణం ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. పరస్పర సహకారంతో ముందుకు సాగకపోతే వినాశనం తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం పర్యావరణపరమైన నరకం దిశగా ప్రపంచం పరుగులు పెడుతున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-27 సదస్సులో గుటెరస్‌ ప్రసంగించారు. కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా ధనిక, పేద దేశాల మధ్య కొత్త ఒప్పందం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. సంపన్న దేశాల్లో 2030 కల్లా, ఇతర దేశాల్లో 2040 కల్లా బొగ్గు వినియోగం నిలిచిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణంలో ప్రతికూల మార్పులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిధులు పెరగాలి: భారత్‌ పర్యావరణ పరిరక్షణకు కేటాయిస్తున్న నిధులు భారీగా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని భారత్‌ పేర్కొంది. కాప్‌-27 సదస్సులో భాగంగా ‘అందరికీ ముందస్తు హెచ్చరికలపై కార్యనిర్వాహక ప్రణాళిక’ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన దేశం తరఫున కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ప్రసంగించారు. ప్రకృతి విపత్తులపై ప్రతి ఒక్కరినీ ముందుగానే అప్రమత్తం చేసే వ్యవస్థలు అందుబాటులోకి రావాలన్న ఐరాస సెక్రటరీ జనరల్‌ ఎజెండాకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈజిప్టులో ప్రారంభమైన కాన్ఫెరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)-27 సదస్సు

మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతున్న వాతావరణ సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరపడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మక కాన్ఫెరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)-27 సదస్సు ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ పట్టణంలో లాంఛనంగా ప్రారంభమైంది. నవంబరు 7న జరగనున్న ‘ప్రపంచ నేతల సదస్సు’తో కాప్‌-27లో అసలు అంకం ప్రారంభమవుతుంది. అనేక దేశాల అధినేతలు ఇందులో పాల్గొని 5 నిమిషాల చొప్పున ప్రసంగిస్తారు. పర్యావరణంలో ప్రతికూల మార్పులపై తమ తమ ప్రభుత్వాలు చేస్తున్న పోరాటాల గురించి వారు వివరిస్తారు. తాజా సదస్సు నుంచి తామేం ఆశిస్తున్నదీ చెప్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్‌-27కు హాజరవడం లేదు. ‣ తాజా సదస్సులో భారత బృందానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షర్మ్‌ ఎల్‌ షేక్‌ చేరుకున్న ఆయన కాప్‌-27 వేదిక వద్ద మన దేశ పెవిలియన్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కృషి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (లైఫ్‌)’ పేరుతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ‘కాప్‌-27’ నవంబరు 18 వరకు కొనసాగుతుంది.

రష్యాపై ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తాం

ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, ఆ దేశానికి ఆర్థికంగా, సైనికంగా సంపూర్ణ సహకారాలను అందజేస్తామని జి-7 దేశాలు స్పష్టం చేశాయి. జర్మనీలోని మన్‌స్టర్‌లో రెండు రోజులుగా జరుగుతున్న జి-7 విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌కు చెందిన విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో రానున్న రోజుల్లో రష్యా ఇంధన ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. మాస్కోకు సహకరించిన దేశాలు, వ్యక్తులు, సంస్థలనూ వదిలిపెట్టబోమని ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తామని ప్రతిన బూనింది.

గాయాలకు నానో సిల్వర్‌తో పొడులు, బ్యాండేజ్‌లు

కాలిన గాయాలు, దెబ్బలతో పాటు శస్త్ర చికిత్సల సమయంలో వినియోగించే రసాయన కట్లకు (కెమికల్‌ బ్యాండేజ్‌) అత్యుత్తమ ప్రత్యామ్నాయం పట్టు పోషకాల్లో ఉందని చెబుతున్నారు బెంగళూరుకు చెందిన నిపుణులు. పట్టు గూడులోని పోషకాలు, నానో సిల్వర్‌తో రూపొందించిన పొడులు, బ్యాండేజ్‌లు గాయాలను వేగంగా నయం చేస్తాయని నగరంలోని యలహంకకు చెందిన ఫైబర్‌ హీల్‌ సంస్థ డైరెక్టర్‌ భరత్‌ టాండన్‌ చెప్పారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో (జిమ్‌) ఈ ఉత్పత్తులను ప్రదర్శించారు. పదేళ్లుగా పట్టు పోషకాలపై అధ్యయనం చేసి, లక్ష మంది రోగులపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించినట్లు భరత్‌ వివరించారు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎయిమ్స్‌లోనూ పట్టు ప్లాస్టర్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకతలివీ.. సాధారణ ప్లాస్టర్లలో కెలోజిన్, కిటోసిన్‌ వంటి రసాయనాలుంటాయి. పైగా ఈ ప్లాస్టర్లను గాయాలకు గట్టిగా కట్టాల్సి ఉండటంతో గాలి సోకదు. అందువల్ల మానేందుకు సమయం పడుతుంది. పట్టు గూడు సాయంతో తయారైన ప్లాస్టర్‌లో ఉన్న సెరిసిన్, ఫిబ్రాయిన్‌ వంటి పోషకాలకు గాయాల్ని వేగంగా మాన్పే గుణం ఉందని ఫైబర్‌ హీల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఎం.ఆర్‌.శక్తిప్రసాద్‌ చెప్పారు. ఈ పోషకాలకు నానో సిల్వర్‌ను కలిపి రూపొందించిన ప్లాస్టర్లలోని పీచు పదార్థం గాయాలకు గాలి సోకేందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం శస్త్ర చికిత్సల తర్వాతి గాయాలు, మధుమేహ గాయాలు, కాలిన గాయాలకు ఉపయోగపడేలా సూచర్‌ డ్రెస్, డి-ఫైబర్‌ హీల్, మైక్రోగాస్, వూండ్‌ ఎయిడ్, స్కేర్‌లైట్, డి-ఫైబర్‌ హీల్‌ ఏజీ ఫోం వంటి పది ఉత్పత్తులను నిపుణులు తయారు చేశారు. సైనిక సిబ్బందికి తగిలే తుపాకీ బుల్లెట్ల గాయాలను నయం చేసే ఉత్పత్తులనూ పట్టు పోషకాలతో తయారు చేస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది.

సేఫర్‌ ఫ్యాన్‌ వాడితే ఫ్యానుకు ఉరేసుకోలేరు!

తాము ఉత్పత్తి చేస్తున్న ఒక పరికరాన్ని వాడితే సీలింగ్‌ ఫ్యానుకు ఉరి తాడు బిగించి వేళ్లాడినా అది మరణానికి దారి తీయదని చెబుతోంది ఓ కంపెనీ. ప్రముఖ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ సేఫ్‌ హోలో తయారు చేసిన ఓ ఫ్యాన్‌ డివైజ్‌ను (పరికరం) వినియోగిస్తే ఆత్మహత్యలకు పాల్పడటం సాధ్యపడదు. ఈ వినూత్న ఉత్పత్తిని బెంగళూరులో నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సమావేశంలో ప్రదర్శించారు. సేఫర్‌ ఫ్యాన్‌ పేరిట రూపొందించిన ఈ డివైజ్‌లో అమర్చిన సేఫ్‌ క్లాంప్‌లో ఉన్న స్ప్రింగ్‌ 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువు వేలాడుతూ నిదానంగా జారిపోతుంది. పైగా ఇందులో అమర్చిన అలారం బరువైన వస్తువులు వేలాడితే పెద్దగా మోగుతుంది. పైకప్పునకు నేరుగా ఈ సేఫర్‌ క్లాంప్‌తో ఫ్యాన్‌ను బిగిస్తే చాలని సంస్థ టెక్నికల్‌ డైరెక్టర్‌ సుమంత్‌ తెలిపారు.

మన ఆర్థికం.. ప్రపంచానికే ఆదర్శం: ప్రధాని మోదీ

ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్నా కరోనాతో భౌగోళిక అనిశ్చితి నెలకొన్నా భారత్‌ ఆకర్షణీయమైన ఆర్థిక గమ్యస్థానంగా వెలుగొందినట్లు ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలు, నిపుణులు విశ్లేషించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెంగళూరులో ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం (జిమ్‌)లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగించారు. విపత్కర పరిస్థితుల్లోనూ మనదైన మౌలిక సిద్ధాంతాలను కొనసాగించటం వల్ల ఆర్థిక సుస్థిరతను సాధించినట్లు ప్రధాని గుర్తు చేశారు. ఈ విధానమే ప్రపంచ పెట్టుబడిదారులను సులువుగా ఆకట్టుకుంటోందన్నారు. ఈ కారణంగానే గతేడాది 84 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాబట్టినట్లు చెప్పారు. సాహసోపేత సంస్కరణలు, అత్యున్నత మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతిభను ప్రోత్సహించామన్నారు. వీటి ద్వారానే నవ భారత నిర్మాణం సాధ్యమని అభిప్రాయపడ్డారు. సంప్రదాయం, సాంకేతికత, ప్రతిభ, పర్యావరణ వ్యవస్థల గురించి ఆలోచించిన వెంటనే బ్రాండ్‌ బెంగళూరు గుర్తుకొస్తుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రాన్ని కొనియాడారు. అదానీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు అదానీ సంస్థ కర్ణాటకలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. పెట్టుబడుల సమావేశం (జిమ్‌)లో అదానీ కుమారులు, అదానీ పోర్ట్స్‌ సీఈఓ కరన్‌ గౌతమ్‌ ఈ వివరాలను వెల్లడిస్తూ రానున్న ఏడేళ్లలో రాష్ట్రంలోని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. పెట్టుబడిదారుల సమావేశంలో తొలి రోజున కర్ణాటక ప్రభుత్వం రూ.5.20 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో అత్యధికంగా గ్రీన్‌ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల రంగంలో రూ.2.9 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.

పెట్రోకెమికల్స్‌ పరిశ్రమల గమ్యస్థానంగా ఏపీ

సహజ వనరులు, అనుకూల వాతావరణంతో పెట్రో కెమికల్స్‌ పరిశ్రమల అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ఇండియా కెమ్‌ - 2022 సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. 2020 - 21 నాటికి రాష్ట్రంలో పెట్రో కెమికల్స్‌ ఉత్పత్తి దేశ ఉత్పత్తిలో ఎనిమిది శాతంగా ఉందన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రానికి రూ.46,280 కోట్లతో 107 మెగా పరిశ్రమలు వచ్చాయని 70,606 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. 35,181 చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో 2.11 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో భారతదేశ అతిపెద్ద హైడ్రోక్రాకర్‌ యూనిట్‌ ఈ ఏడాది చివరి నాటికి 15 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని ఆయన వివరించారు.

21వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌’ (బీఆర్‌ఐ)ను ఆమోదించడానికి భారత్‌ మరోసారి నిరాకరించింది. ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం సందర్భంగా మన దేశం తన వైఖరిని విస్పష్టం చేసింది. ఇటువంటి అనుసంధాన ప్రాజెక్టులు సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని తప్పనిసరిగా గౌరవించాల్సి ఉంటుందని పునరుద్ఘాటించింది. దీంతో భారత్‌ ప్రస్తావన లేకుండానే బీఆర్‌ఐని సమర్థించిన ఎస్సీవో సభ్య దేశాల సంయుక్త ప్రకటన వెలువడింది. ఎస్సీవో ప్రభుత్వాధినేతల, ప్రతినిధుల మండలి 21వ సమావేశం చైనా ప్రధాని లి కెకియాంగ్‌ అధ్యక్షతన వీడియో అనుసంధానం జరిగింది. గత ఎస్సీవో సమావేశాల్లో మాదిరిగానే బీఆర్‌ఐ ప్రాజెక్టును భారత్‌ తిరస్కరించింది. కజఖ్‌స్థాన్, కిర్గిజ్‌ రిపబ్లిక్, పాకిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ దేశాలు మాత్రం ఆ ప్రాజెక్టు పనులకు మద్దతు తెలిపాయి. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ భారత ప్రతినిధిగా సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ పరిణామాలపై చర్చ ప్రాంతీయంగా ప్రాధాన్యమున్న అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఎస్సీవో ప్రభుత్వాధినేతల, ప్రతినిధుల మండలి సమావేశంలో చర్చకు వచ్చాయి. వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక, మానవీయ సహకారాన్ని సభ్య దేశాలు బలోపేతం చేసుకోవడంపై అభిప్రాయాలను పంచుకున్నారు. 2025ను అంతర్జాతీయ హిమానీనదాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించాలన్న తజికిస్థాన్‌ ప్రతిపాదనను సమావేశం సమర్థించింది. ఎస్సీవో తదుపరి భేటీకి భారత్‌ అధ్యక్షత వహించనుంది.