48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్‌లు గుర్తింపు
వాతావరణ మార్పుల కారణంగా వేల ఏళ్ల నాటి వైరస్‌లు కూడా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందా? మానవ మనుగడకు ఇవి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. రష్యా, ఫ్రాన్స్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు సైబీరియాలో ఓ మంచు సరస్సులో అట్టడుగున పొరల్లో నిక్షిప్తమై, నిద్రాణంగా ఉన్న సుమారు 48,500 ఏళ్ల నాటి వైరస్‌ను కనుగొన్నారు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉండటం విశేషం. ఇందులో 13 రకాల వ్యాధికారక సూక్ష్మజీవులను గుర్తించారు. వీటిని జాంబీ వైరస్‌లుగా పేర్కొన్నారు. ఘనీభవించిన మంచులో అన్ని వేల సంవత్సరాలు ఉన్నా ఈ వైరస్‌లు మరో జీవికి సోకే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. అయితే అంత ప్రమాదకరమైనవి కావని పేర్కొన్నారు. ఇలా నిద్రాణమైన వైరస్‌లు సజీవంగా ఉండటం మాత్రం మానవాళికి హెచ్చరికేనని వారు అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల పురాతన మంచు పొరలు కరిగి వేల ఏళ్ల నాటి మరిన్ని వైరస్‌లు వెలుగులోకి రావొచ్చని తెలిపారు. ఈ శాస్త్రవేత్తల బృందం 2014లోనూ మంచుపొరల్లో దాగున్న 30 వేల ఏళ్ల నాటి వైరస్‌ను గుర్తించింది.
రంగులు మార్చే రాశిగుట్ట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల సరిహద్దులోని రాశిగుట్టకు ఓ ప్రత్యేకత ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఈ గుట్టపైకి చేరుకోగానే శరీరం రంగులు మారుతుందని స్థానికులు నమ్ముతారు. ఈ గుట్టపై ఆంజనేయస్వామి ఆలయం సైతం ఉంది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ గుట్టపైకి చేరుకోగానే శరీరంలో రంగుల మార్పుపై పరిశోధించారు. ఆ వివరాలను వెల్లడించారు. రాశిగుట్ట పై భాగాన లేటరైట్ శిలలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం కారణంగా లేటరైట్ క్యాపింగ్ ఏర్పడుతుంది. వర్షాలకు పైనుంచి కొట్టుకు వచ్చిన చిన్నచిన్న లేటరైట్ శిలల కారణంగా నిటారుగా ఉన్న పర్వతాన్ని చెప్పులతో ఎక్కేందుకు వీలుపడదు. ఈ రాళ్లు.. నీరు, గాలి, వాతావరణానికి ఆక్సీకరణం చెంది మెత్తగా మారడంతో పాటు జాజు, పసుపు, నారింజ రంగులను సంతరించుకుంటాయి. గుట్టపైకి ఎక్కే వారిపై ఈ రంగులోని ధూళి పడటంతో చేతులు, కాళ్లు మాత్రమే పసుపు రంగులో కనిపిస్తాయి. శరీర వర్ణంలో ఎలాంటి మార్పు ఉండదని వివరించారు.
నర్మెట్టలో కొత్తరాతియుగపు అమ్మదేవత మట్టి శిల్పం గుర్తింపు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు కొత్త తెలంగాణ బృందం తెలిపింది. బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ దీన్ని గుర్తించారని కొత్త తెలంగాణ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు పరిశోధకుడు, చరిత్రకారుడు కర్ణాటకలోని రవి కొరిసెట్టర్ వీటి ఫొటోలు పరిశీలించి, పాకిస్థాన్‌లోని ‘మెహర్ ఘర్’ తవ్వకాల్లో లభించిన కొత్త రాతియుగానికి చెందిన ‘మదర్ ఆఫ్ పెర్ల్’ని పోలి ఉందని తెలిపారు. చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి సైతం ఈ మట్టి బొమ్మ కొత్తరాతియుగం (క్రీ.పూ.6,500 - క్రీ.పూ.1800 వరకు)కు చెందిందేనని చెప్పారు. తెలంగాణ వారసత్వ శాఖ గతంలో నర్మెట్టలో మెగాలిథిక్ సమాధుల తవ్వకాలు చేపట్టినప్పుడు ఎన్నో పురాతన వస్తువులు లభించాయి. అక్కడి సమాధిలో వెలుగుచూసిన ఎముకల నగలు విశేషమైనవని హరగోపాల్ వివరించారు.
బ్రహ్మంగారి పాద ముద్రలు గుర్తింపు
వైయస్‌ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలమను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. కొండపైన ఉన్న పాదముద్రలను ఆయన పరిశీలించారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి గుర్రంపై బయల్దేరగా మార్గమధ్యంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కొండపేటును తగులుకుని గుర్రం బోర్లపడిందని, ఆ సమయంలో పాదముద్రలు పడిన ఆనవాళ్లున్నాయని ఆయన తెలిపారు. మైదుకూరు మండలం చెర్లోపల్లెకు చెందిన చింతకుంట బాలవీరయ్య బ్రహ్మంగారి పాదాలకు గుడి నిర్మించాలని సంకల్పించినట్లుగా స్థానికులు తెలిపారని ఆయన వివరించారు.
నల్లమల అడవుల్లో కొత్త మొక్క గుర్తింపు
నల్లమల అడవుల్లో ఇటీవల కొత్త మొక్కను కనుగొన్నారు. జడ్చర్ల పట్టణంలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు డా.బి.సదాశివయ్య, ఏపీ జీవ వైవిధ్య మండలి సభ్యుడు డా.ప్రసాద్, ఓయూ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన నిర్మల బాబూరావు, పరిశోధక విద్యార్థులు దీనిని గుర్తించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో గడ్డిజాతులపై చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ఈ మొక్కను గుర్తించినట్లు సదాశివయ్య తెలిపారు. యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కకు యుఫోర్బియా తెలంగాణెన్సిస్‌గా నామకరణం చేశామని తెలిపారు. ఇది సుమారు 30 సెం.మీ. పొడవు పెరిగి, పాలవంటి లేటెక్స్ (జిగురు లాంటి పదార్థం) కలిగి ఉంటుందన్నారు. మొక్కలో ఔషధ గుణాలుండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ మొక్క గురించి ఫైటోటాక్సా అనే జర్నల్‌లోనూ సవివరంగా ప్రచురితమైందని వివరించారు.
39 ఏళ్లుగా రాజ్‌సమధియాలలో ఎన్నికల ప్రచారం నిషిద్ధం!
అభివృద్ధిలో ముందంజ వేసి, దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ఓ ఊరు ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తోంది. ఏ పార్టీనీ ప్రచారానికి అనుమతించడం లేదు. ఆ ఊరు గుజరాత్‌లో ఉంది. ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు పోటెత్తుతారు. ప్రచారం పేరుతో ధ్వని కాలుష్యం, పోస్టర్లు, బ్యానర్లు, ఇలా అన్ని రకాల గోల కనిపించేదే. రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్‌సమధియాలలో మాత్రం అలాంటివేమీ కనిపించవు. ఎలాంటి హడావుడీ ఉండదు. కారణం రాజకీయ ప్రచారాన్ని ఆ ఊరు నిషేధించటమే. 1983 నుంచీ ఇదే పద్ధతిని పాటిస్తోందీ గ్రామం. రాజకీయ ప్రచారాలతో ఊర్లో వాతావరణం కలుషితమవుతుందన్నది గ్రామస్థుల భావన. అందుకే 1983లో అప్పటి సర్పంచి తీసుకున్న ప్రచార నిషేధ నిర్ణయానికి ఇప్పటికీ గ్రామస్థులు కట్టుబడి ఉంటున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం ఈ ఊర్లో తప్పనిసరి. ఎవరైనా ఓటు వేయకుంటే రూ.51 జరిమానా విధిస్తారు.
‣ ఈ గ్రామంలో లేని సదుపాయం లేదు. వైఫై ఇంటర్నెట్, సీసీటీవీ కెమెరాలు, ఆర్వో ప్లాంటు, జిల్లాలోనే అత్యుత్తమ క్రికెట్ గ్రౌండ్, ఇలా అన్ని వసతులు ఉన్నాయి. ఈ ఊర్లో అత్యధిక వివాదాలను లోక్‌అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకుంటారు. పౌర బాధ్యతల విషయంలోనూ ప్రజలంతా ఎంతో సహకరించటం ఇక్కడి ప్రత్యేకత. రోడ్లపై ఉమ్మడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, యువకులు ఖాళీగా కూర్చోవటం వంటి వాటిని ఇక్కడ అంగీకరించరు. ప్లాస్టిక్‌ను అస్సలు వాడరు. ఈ విషయంలో దేశంలోనే ఆదర్శ గ్రామంగా అవార్డులను, రాష్ట్రపతి నుంచి సన్మానాన్ని అందుకుందీ గ్రామం.
సోమనాథ్‌గుట్టపై సీతారాముల విగ్రహం గుర్తింపు
గనుల తవ్వకాలలో అనూహ్యంగా సీతా సమేతుడైన శ్రీరాముడి విగ్రహం బయటపడింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట మండల పరిధి వెల్చాల్ గ్రామ సమీప చెరువు ప్రాంతంలో సోమనాథ్‌గుట్ట ఉంది. దీనిపై ఓ గుహ ఉంది. ఏళ్ల క్రితమే పరిసర ప్రాంతాల్లో మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది గుహ వెనుక తవ్వకాలు చేపట్టగా శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ, వానర చిత్రాలు చెక్కిన పురాతన రాతి విగ్రహాన్ని గుర్తించారు. గుట్టపై గుహ ఉందని అందుకే ఈ ప్రాంతాన్ని సోమనాథ్ గుట్ట అని పిలుస్తుంటారని గ్రామస్థులు తెలిపారు.
ఇజ్రాయెల్‌లో 3,700 ఏళ్ల కిందటి దంతపు దువ్వెన గుర్తింపు
ఇజ్రాయెల్‌లోని టెల్ లాహీష్‌లో 3,700 సంవత్సరాల క్రితం నాటి దంతపు దువ్వెనను పరిశోధకులు గుర్తించారు. పేలు బాధ నుంచి విముక్తి కోసం ఉపయోగించాలంటూ దీనిపై కేననైట్ భాషలో వాక్యం ఉందని ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు. ‘ఈ దంతం కేశాలు, గడ్డంలోని పేలను వేరు చేస్తుంది’ అన్నది 17 అక్షరాలతో కూడిన ఆ వాక్యం సారాంశమని వెల్లడించారు. మానవ జాతి ప్రారంభ కాలం నాటి తొలి వర్ణమాల, ఆ అక్షరాలను రాయగల సామర్థ్యాలను అంచనా వేయడానికి కొత్త మార్గాలను ఈ దంతపు దువ్వెన సమకూర్చుతుందని వారు పేర్కొన్నారు.
ముంబయి ఆసుపత్రి ప్రాంగణంలో బ్రిటిష్ కాలం నాటి సొరంగం గుర్తింపు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని జేజే ఆసుపత్రి ప్రాంగణంలో 132 ఏళ్ల క్రితం నాటి ఓ సొరంగం తాజాగా బయటపడింది. దాని పొడవు 200 మీటర్లు. భారత్‌లో బ్రిటిష్ పాలన కొనసాగుతుండగా 1890లో శంకుస్థాపన చేసి ఆ సొరంగాన్ని నిర్మించినట్లు వెల్లడైంది. జేజే ఆసుపత్రి ప్రాంగణంలోని నర్సింగ్ కళాశాల భవనంలో 1890 నాటి శంకుస్థాపన రాయి బయటపడటంతో విస్తృతంగా పరిశీలన చేపట్టి సొరంగాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు.
యూఏఈలో ఇస్లాంకు ముందు నాటి క్రైస్తవ మఠం గుర్తింపు
అరేబియా ద్వీపకల్పంలో ఇస్లాం మతం వ్యాపించడానికి ముందు నిర్మించిన క్రైస్తవ మఠం ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీరంలోని సినియా ద్వీపంలో బయటపడింది. దీన్ని 1400 ఏళ్ల క్రితం 534-656 మధ్య కాలంలో నిర్మించి ఉంటారని పురాతత్వవేత్తలు తెలిపారు. సినియా ద్వీపంలో స్థిరాస్తి వ్యాపారానికి పునాదుల తవ్వకాలు జరుపుతుండగా క్రైస్తవ మఠాన్ని గుర్తించారు.