వార్తల్లో వ్యక్తులు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యురాలిగా నసీమా ఖాతూన్‌

బిహార్‌ ముజఫర్‌పుర్‌లోని వేశ్యావాటికలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి, ఇప్పుడు ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సలహా బృందంలో సభ్యురాలిగా చోటు దక్కించుకున్నారు. ఆమె పేరు నసీమా ఖాతూన్‌. స్వస్థలం, ముజఫర్‌పుర్‌లోని చతుర్భుజ్‌ స్థాన్‌ అనే రెడ్‌లైట్‌ ఏరియా. నిజానికి ఆమె తండ్రిని చతుర్భుజ్‌ స్థాన్‌కు చెందిన ఓ వేశ్య దత్తత తీసుకుంది. నసీమా అక్కడే పుట్టి పెరిగారు. అయితే వేశ్యా వృత్తిలో మాత్రం అడుగుపెట్టలేదు. 1995లో ఆమె జీవితం కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్‌ అధికారిణి రాజ్‌బాల వర్మ వేశ్యలు, వారి కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపించారు. దీంతో నసీమా కుట్లు - అల్లికలు నేర్చుకున్నారు. ప్రారంభంలో నెలకు రూ.500 సంపాదిస్తూ ఉపాధి పొందారు. ఆపై క్రమంగా మానవ హక్కుల కార్యకర్తగా ఎదిగారు. పర్చమ్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ సలహా బృందంలో సభ్యురాలిగా అవకాశం దక్కించుకున్నారు.

సెక్సియెస్ట్‌ మ్యాన్‌ అలైవ్‌గా క్రిస్‌ ఎవాన్స్‌ ఎంపిక

అమెరికా సినీ నటుడు క్రిస్‌ ఎవాన్స్‌ (41)కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ‘సెక్సియెస్ట్‌ మ్యాన్‌ అలైవ్‌’గా ఆయనను ఎంపిక చేసినట్లు పీపుల్‌ మేగజీన్‌ ప్రకటించింది. స్టీఫెన్‌ కోల్బెర్ట్స్‌ లేట్‌ నైట్‌ షోలో తొలుత ఈ నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని మేగజీన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేశారు.

మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్‌ (58) మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కావడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు పలువురు భారతీయ అమెరికన్లు ఆయా రాష్ట్రాల చట్ట సభల్లోనూ ఉనికి చాటుకున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అరుణ ఇది వరకు ‘మేరీలాండ్‌ హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌’ సభ్యురాలిగా ఉన్నారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్లకు మంచి పట్టున్న మేరీలాండ్‌లో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అరుణ విజయకేతనం ఎగరవేయడంతో భారతీయ అమెరికన్లలో ఆనందం నెలకొంది. డెమొక్రాట్ల తరఫున గవర్నర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెస్‌ మూర్‌ కూడా గెలుపొందారు. వెస్‌ మూర్, అరుణ మిల్లర్‌ తరఫున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిసన్‌ విస్తృతంగా ప్రచారం చేశారు.

మోదీ ట్విటర్‌ హ్యాండిల్‌కు ‘అధికారిక’ గుర్తింపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, కీలక ప్రతిపక్ష నాయకులకు చెందిన హ్యాండిళ్లకు ట్విటర్‌ సంస్థ తాజాగా ‘అధికారిక’ అనే గుర్తింపును జత చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ సహా మరికొందరు మంత్రులు, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తదితరులు కూడా ఈ లేబుల్‌ను దక్కించుకున్నవారి జాబితాలో ఉన్నారు.

మిసెస్‌ ఆసియాగా అల్లూరి సరోజ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నవంబరు 19న జరిగిన పోటీల్లో మిసెస్‌ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అల్లూరి సరోజ తండ్రి రాంబాబు, తల్లి పార్వతి స్వగ్రామం సఖినేటిపల్లి. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సరోజ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు.

మహారాష్ట్ర గ్రామానికి 26/11 దాడిలో అమరుడైన రాహుల్‌ శిందే పేరు

పద్నాలుగేళ్ల కిందట జరిగిన ముంబయి ఉగ్ర దాడి (26/11)లో అమరుడైన జవాను రాహుల్‌ శిందే పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా సుల్తాన్‌పూర్‌లో 600 ఇళ్లు ఉంటాయి. అమర జవాను పుట్టి పెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్‌ నగర్‌గా మార్పు చేశారు. ప్రభుత్వ లాంఛనాలు పూర్తి కావాల్సి ఉంది. స్టేట్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్సు (ఎస్‌ఆర్‌పీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ అయిన రాహుల్‌ తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌లోకి ముందుగా ప్రవేశించగా, ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. పొట్టలోకి తూటా దూసుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

ఆసియా కుబేరుల జాబితాలో సునాక్, అక్షతా మూర్తి

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యూకేకు చెందిన ‘ఏషియన్‌ రిచ్‌ లిస్ట్‌ 2022’లో చోటు చేసుకున్నారు. 790 మిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.7,700 కోట్ల) సంపదతో సునాక్, అక్షత ఈ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది జాబితాలోని వారి మొత్తం సంపద 113.2 బిలియన్‌ పౌండ్లుగా నమోదైంది. 2021తో పోలిస్తే ఇది 13.5 బి. పౌండ్లు అధికం. వరుసగా ఎనిమిదో ఏడాదీ హిందుజా కుటుంబం 30.5 బిలియన్‌ పౌండ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2021తో పోలిస్తే 3 బిలియన్‌ పౌండ్లను అదనంగా హిందూజా కుటుంబం జత చేసుకుంది. ఇక్కడ జరిగిన 24వ వార్షిక ఏషియన్‌ బిజినెస్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో హిందుజా గ్రూప్‌ సహ ఛైర్మన్, గోపీచంద్‌ హిందుజా కుమార్తె రితు చాబ్రియాకు లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ ఈ ‘ఏషియన్‌ రిచ్‌ లిస్ట్‌ 2022’ ప్రతిని అందజేశారు. బ్రిటన్‌లో ఆసియా సంతతి ఏటా వృద్ధి చెందుతోందనడానికి ఈ జాబితా నిదర్శనమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. జాబితాలో లక్ష్మీ మిత్తల్, ఆయన కుమారుడు ఆదిత్య (12.8 బి.పౌండ్లు); నిర్మలా సేథియా (6.5 బి.డాలర్లు), తదితరులు ఉన్నారు.

గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలాలో ‘మేఘా’ సుధారెడ్డి

మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్‌లో జరిగిన ది గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలా ఎడిషన్‌లో ఆమె భారత్‌ తరఫున పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా స్టెమ్‌ సూపర్‌స్టార్స్‌గా ప్రవాస భారతీయ మహిళా శాస్త్రవేత్తలు

ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక సూపర్‌స్టార్స్‌ ఆఫ్‌ ‘స్టెమ్‌’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ అండ్‌ మ్యాథమేటిక్స్‌) అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన 60 మంది శాస్త్రవేత్తల్లో భారతీయ మూలాలున్న నీలిమా కడియాల, డాక్టర్‌ అనా బాబూరమణి, డాక్టర్‌ ఇంద్రాణి ముఖర్జీ చోటు సాధించారు. శాస్త్రవేత్తల గురించి సమాజంలో ఉన్న లింగ ఆధారిత అంచనాలను తుడిచిపెట్టడమే కాకుండా మహిళలు, హిజ్రాలకు మరింత అభివృద్ధి అవకాశాలను కల్పించడమే ఈ అవార్డుల లక్ష్యం. లక్షకు పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ప్రతినిధులుగా ఉన్న ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆస్ట్రేలియా’ (ఎస్‌టీఏ) ఏటా ఇలా 60 మంది ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తోంది. ‣ 2003లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వెళ్లిన నీలిమా కడియాల ఛాలెంజర్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఐటీ ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్‌ అనా బాబూరమణి డిఫెన్స్‌ - సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. మెల్‌బోర్న్‌లోని మొనాష్‌ విశ్వవిద్యాలయం నుంచి ఈమె పీహెచ్‌డీ చేశారు. డాక్టర్‌ ఇంద్రాణి ముఖర్జీ టాస్మేనియా విశ్వవిద్యాలయంలో జియాలజిస్ట్‌గా పనిచేస్తూ జీవ పరివర్తన పరిశోధనలపై దృష్టి సారించారు.

తక్కువ సమయంలో సైకిల్‌పై ప్రయాణించిన తొలి మహిళగా ప్రీతి రికార్డు

గుజరాత్‌ నుంచి సైకిల్‌పై బయల్దేరి అరుణాచల్‌ప్రదేశ్‌ చేరుకున్న పుణెకు చెందిన ప్రీతి మాస్కే (45). పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులోని కోటేశ్వర్‌ ఆలయం నుంచి నవంబరు 1న సైకిల్‌ యాత్రను ఆరంభించింది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల మీదుగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న కిబితుకు చేరుకొంది. 13 రోజుల 19 గంటల 12 నిమిషాల వ్యవధిలో మొత్తం 3,995 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేసింది. ఈ మేరకు ప్రీతి తక్కువ సమయంలోనే దేశంలోని పశ్చిమ భూభాగం నుంచి తూర్పు భూభాగం వరకూ సైకిల్‌పై ప్రయాణించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. వరల్డ్‌ ఆల్ట్రా సైకిలింగ్‌ అసోసియేషన్, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులు వివరించారు.

అష్టవక్రాసనంతో మహిళా డాక్టర్‌ ప్రపంచ రికార్డు

ఉత్తరాఖండ్‌లో ఓ మహిళా డాక్టర్‌ యోగాసనం ద్వారా గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు. హరిద్వార్‌లో ప్రియా అహుజా అనే వైద్యురాలు ఎనిమిది భంగిమలతో కూడిన అష్టవక్రాసనాన్ని 3 నిమిషాల 29 సెకన్ల పాటు వేసి ప్రపంచ రికార్డును సాధించారు. గతంలో ఈ ఆసనంలో 2 నిమిషాల 6 సెకన్ల పాటు ఉన్న గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ను ఆమె అధిగమించారు. గిన్నిస్‌ బుక్‌ అధికారులు ఆమెకు సర్టిఫికేట్‌ను అందించారు.

70 ఏళ్ల వయసులో పారాజంప్‌ చేసి గిరిజా శంకర్‌ సరికొత్త రికార్డు

ఏడు పదుల వయసులో 1,600 అడుగుల ఎత్తు నుంచి పారా జంపింగ్‌ చేసి రిటైర్డ్‌ కర్నల్‌ గిరిజా శంకర్‌ ముంగలి సరికొత్త రికార్డు సృష్టించారు. నైనితాల్‌కు చెందిన ఆయన ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని పుణెలో నివసిస్తున్నారు. ఆగ్రాలో అక్టోబరు 15న నిర్వహించిన పారాజంప్‌లో గిరిజా ముంగలి పాల్గొని 1,600 అడుగుల పైనుంచి కిందికి దూకి రికార్డు సృష్టించారు. 35 మంది సభ్యులు కలిగిన గ్రూప్‌లో సభ్యునిగా ఈ పారాజంప్‌లో పాల్గొన్నారు. ఈ గ్రూప్‌లో అధిక సంఖ్యలో వృద్ధులే ఉండటం గమనార్హం.

‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో డాక్టర్‌ కృష్ణకు చోటు

ఏడు పదుల వయసులో వైద్యుడు ఎద్దుల కృష్ణ 9 కిలోమీటర్ల నడకను 83 నిమిషాల్లో పూర్తిచేశారు. 90 నిమిషాల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నప్పటికీ అంతకంటే ముందే గమ్యాన్ని చేరారు. జీవీఆర్‌ కరాటే అకాడమీ డైరెక్టర్‌ డా.జి.ఎస్‌.గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘సైదాబాద్‌లోని వివేక్‌ హాస్పిటల్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న వివేకానంద విగ్రహం వరకు 9 కిలోమీటర్ల నడకను 83 నిమిషాల్లో ఆయన పూర్తి చేశారు. అనంతరం నారాయణగూడలోని జీవీఆర్‌ కరాటే అకాడమీలో జరిగిన సభలో ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, తదితర సంస్థలు ఆయనకు గుర్తింపు పత్రాలు అందజేశాయి.

78 పబ్‌లు చుట్టేసి హెన్రిక్‌ డివిలియర్స్‌ గిన్నిస్‌ రికార్డు

గిన్నిస్‌ రికార్డుల్లో ఎక్కేందుకు ఒక్కొక్కరిది ఒక్కో ప్రయత్నం. ఇలాగే, ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో పబ్‌లను సందర్శించి రికార్డు నెలకొల్పాడో ఆస్ట్రేలియా యువకుడు. 24 గంటల వ్యవధిలోనే అతను వేర్వేరు ప్రదేశాల్లోని 78 పబ్‌లను చుట్టేయడం విశేషం. మెల్‌బోర్న్‌లో నివసిస్తోన్న హెన్రిక్‌ డివిలియర్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 10-11వ తేదీల్లో తాను ఉంటున్న నగరంలోనే ఈ రికార్డు సాధించినట్లు గిన్నిస్‌ సంస్థ తాజాగా తెలిపింది. ఇది వరకు ఈ రికార్డు, ఇంగ్లండ్‌కు చెందిన నాథన్‌ క్రింప్‌ పేరుమీద ఉంది. అతను 67 పబ్‌లను సందర్శించాడు. తన ఇద్దరు స్నేహితులు వెంటరాగా 23 ఏళ్ల హెన్రిక్‌ తాజాగా దీన్ని బద్దలు కొట్టాడు. కొవిడ్‌ సమయంలో తీవ్రంగా ప్రభావితమైన పబ్‌లు, బార్‌లపై మరోసారి ప్రజల దృష్టి పడేలా చేయడంతో పాటు మెల్‌బోర్న్‌లో అంతగా వెలుగులోకి రాని ప్రాంతాలను జనాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తాను ఈ సవాల్‌ను స్వీకరించినట్లు హెన్రిక్‌ వెల్లడించాడు.

నిమిషం వ్యవధిలో ఎక్కువ ఫుట్‌బాల్‌ క్రాసొవర్స్‌తో బెన్‌ నట్టాల్‌ గిన్నిస్‌ రికార్డు

ఫుట్‌బాల్‌తో నిమిషం వ్యవధిలో ఎక్కువ క్రాసొవర్స్‌ చేసి బెన్‌ నట్టాల్‌ రికార్డు సృష్టించాడు. కాలిపై ఫుట్‌బాల్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ లండన్‌లో బెన్‌ తన ప్రతిభను ప్రదర్శించగా గిన్నిస్‌ సంస్థ ప్రతినిధులు రికార్డు ధ్రువీకరణ పత్రం బహూకరించారు.

చనుబాలు దానం చేసి సింధు మోనిక ‘ఆసియా అండ్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’

తమిళనాడుకు చెందిన ఓ మహిళ గత పది నెలల్లో 55 లీటర్ల చనుబాలను సేకరించి, అనంతరం దానం చేసి ‘ఆసియా అండ్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు సంపాదించారు. కోయంబత్తూరు జిల్లా కారుమతంబట్టి సమీపంలోని కన్యూర్‌ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్‌ మహేశ్వర్, సింధు మోనికకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి వెంబా అనే ఏడాదిన్నర కుమార్తె ఉంది. చనుబాలు దానం చేయడం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా సింధు మోనిక తెలుసుకున్నారు. తను కూడా ఇదే విధంగా దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుపూర్‌ జిల్లా అవినాసి ప్రాంతంలో తల్లి పాల నిల్వ కోసం పనిచేస్తున్న ‘అమృతం థాయ్‌ పల్‌ దానం’ అనే సంస్థను సంప్రదించారు. తల్లి పాలను ఎలా నిల్వ చేయాలి, ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి అనే దానిపై సంస్థకు చెందిన రూపా అనే ప్రతినిధి మోనికకు వివరించారు. ఈ నిబంధనలను పాటించిన సింధు మోనిక గత 10 నెలల్లో 55 లీటర్ల పాలను సేకరించి కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ఆసియా, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ప్రతినిధులు ధ్రువపత్రాన్ని అందించారు. గతేడాది తమ సంస్థ నుంచి 1,143 లీటర్ల రొమ్ము పాలను సేకరించగా ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 1,500 లీటర్లు సేకరించి దానం చేసినట్లు ‘అమృతం థాయ్‌ పల్‌ దానం’ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

59 నిమిషాల్లో 23 ‘బంగీజంప్స్‌’ చేసి లిండా ప్రపంచ రికార్డు

ఇంగ్లండ్‌కు చెందిన లిండా పాట్గియేటర్‌ అనే యాభై ఏళ్ల మహిళ 59 నిమిషాల్లో 23 ‘బంగీజంప్స్‌’ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 19 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా మహిళ వెరోనికా పేరిట ఉన్న రికార్డు (గంటలో 19 బంగీజంప్స్‌)ను తిరగరాశారు. దక్షిణాఫ్రికాలోని బ్లౌక్రన్స్‌ వంతెన ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది. బ్లౌక్రన్‌ నదిపై 216 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు.