సినీ దిగ్గజం ఘట్టమనేని కృష్ణ మరణం
సినీ దిగ్గజం కృష్ణ (79) మరణించారు. గుండెపోటుతో హైదరాబాద్ నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ అస్తమించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో మే 31, 1943న ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. నాటకాల్లో సరదాగా వేషాలు వేస్తూ సినీరంగంలోకి ప్రవేశించారు. హీరోగా నటించిన తొలి సినిమా ‘తేనె మనసులు’తోనే హిట్ సాధించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’తో కౌబాయ్ హీరోగా ఖ్యాతి గడించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా సుమారు 360 చిత్రాల్లో నటించారు. అన్నిటికీ మించి తెలుగు చలనచిత్ర రంగానికి సాంకేతిక సొబగులద్దిన నిర్మాతగా ఆయన ఆ రంగంలో సాహసానికి మారుపేరయ్యారు. కృష్ణ చివరి చిత్రం శ్రీశ్రీ. అయిదు దశాబ్దాల కెరీర్‌లో నటశేఖరుడిని పలు పురస్కారాలు వరించాయి. 2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో ప్రేక్షకులను రోమాంఛితం చేసిన ఆయన నటనకు నంది పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించింది. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. కృష్ణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం. రైతు కుటుంబానికి చెందిన ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఐదుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు.
తెనాలిలో విద్యాభ్యాసం: కృష్ణ బుర్రిపాలెంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా ఉన్నత పాఠశాలలో 1956లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులయ్యారు. బుర్రిపాలెం నుంచి తెనాలికి రోజూ 4 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వచ్చి చదువుకున్నారు. కృష్ణను ఇంజినీరు చేయాలని తండ్రి వీర రాఘవయ్య భావించారు. అయితే గుంటూరులో ఇంటర్ ఎంపీసీలో సీటు దొరక్కపోవడంతో ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామానికి చెందిన సమీప బంధువు ఇందిరాదేవిని 1965 నవంబరు 1న వివాహం చేసుకున్నారు. సొంతూరు అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. గ్రామంలో తన తల్లి పేరిట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నిర్మాణానికి సహకారం అందించారు. తండ్రి స్ఫూర్తితో ఆయన తనయుడు మహేశ్‌బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
దేశ తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగీ మరణం
దేశ ప్రథమ ఓటరు శ్యామ్ శరణ్ నేగీ (106) హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో తన స్వగృహంలో మరణించారు. రాష్ట్రంలో నవంబరు 12న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 2వ తేదీన తన నివాసం నుంచే పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఆయన ఓటు వేశారు. జీవితకాలంలో ఆయన 34 సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారనీ, మరణించే ముందు కూడా ఓటు వేసి కర్తవ్యాన్ని నెరవేర్చారు.
‘భారత ఉక్కు మనిషి’ జెమ్‌షెడ్ జె ఇరానీ మరణం
ప్రముఖ వ్యాపారవేత్త జెమ్‌షెడ్ జె ఇరానీ (86) జెమ్‌షెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన ‘భారత ఉక్కు మనిషి’గా పేరొందారు. పద్మ భూషణ్ డాక్టర్ జెమ్‌షెడ్ జె ఇరానీ 43 ఏళ్ల పాటు టాటా స్టీల్‌లో పని చేసి, 2011 జూన్‌లో బోర్డు నుంచి పదవీ విమరణ చేశారు.
టయోటా కిర్లోస్కర్ వైస్ ఛైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ మరణం
భారత వాహన రంగ దిగ్గజం, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ ఛైర్మన్ విక్రమ్ ఎస్.కిర్లోస్కర్ (64) బెంగళూరులో మరణించారు. పైపులు, ఇంజిన్లు, కంప్రెసర్ అనుబంధ ఉత్పత్తులను తయారు చేసే కిర్లోస్కర్ సంస్థను కార్ల తయారీ దిగ్గజ సంస్థగా మార్చడంలో విక్రమ్ కిర్లోస్కర్ కీలకంగా వ్యవహరించారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన విక్రమ్ కిర్లోస్కర్ తండ్రి శ్రీకాంత్ కిర్లోస్కర్ నుంచి వ్యాపార బాధ్యతలు స్వీకరించి కిర్లోస్కర్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. జపాన్‌కు చెందిన టయోటాను భారత్‌కు రప్పించి, టయోటా కిర్లోస్కర్ మోటార్ పేరిట సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా దేశ వాహన రంగంపై తనదైన ముద్ర వేశారు. వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌కు ప్రెసిడెంట్ (2013 - 2015); భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు ప్రెసిడెంట్ (2019 - 20)గా బాధ్యతలు నిర్వర్తించారు.
రస్నా వ్యవస్థాపకుడు అరీజ్ ఖంబాటా మరణం
‘ఐ లవ్యూ రస్నా’ అంటూ చిన్న పిల్లల మనసు దోచుకున్న ‘రస్నా’కు వ్యవస్థాపక ఛైర్మన్ అయిన అరీజ్ పిరోజ్‌షా (85) ఖంబాటా గుండెపోటుతో అహ్మదాబాద్‌లో మరణించారు. అత్యధిక ధర ఉండే సాఫ్ట్ డ్రింక్‌లకు ప్రత్యామ్నాయంగా 1970లో రస్నాను అందుబాటులో ధరలో ఖంబాటా తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 లక్షల విక్రయ కేంద్రాల్లో దీనిని విక్రయిస్తున్నారు. 1980 - 90 దశాబ్దాల్లో ‘ఐ లవ్యూ రస్నా’ అంటూ చేసిన ప్రచారం, ప్రజలకు దీనిని దగ్గర చేసింది. రస్నాకు తొమ్మిది తయారీ ప్లాంట్లు, బలమైన నెట్‌వర్క్ ఉంది. కొన్నేళ్ల క్రితమే అరీజ్ ఖంబాటా ఈ వ్యాపారాన్ని తన కుమారుడు పిరుజ్ ఖంబాటాకు అప్పగించారు.
మహిళా హక్కుల నేత ఈలా భట్ మరణం
ప్రముఖ మహిళా హక్కుల నాయకురాలు, ‘సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ ఉమెన్స్ అసోసియేషన్’ (సేవా) వ్యవస్థాపకురాలైన పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈలా భట్ (89) మరణించారు. ఆమె అయిదు దశాబ్దాల క్రితం న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారతకు చేసిన కృషితో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 1933లో అహ్మదాబాద్‌లో పుట్టిన ఈలా భట్ మహాత్ముడి ఆశయాలతో స్ఫూర్తి పొందారు. అసంఘటిత రంగ మహిళల హక్కుల కోసం ఈమె స్థాపించిన ‘సేవా’ సంస్థలో ఇపుడు 20 లక్షల మంది సభ్యులు ఉన్నారు. స్థానిక ‘గుజరాత్ విద్యాపీఠ్’ విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్‌గా నెల రోజుల కిందటి దాకా పనిచేసి, అనారోగ్యం కారణంగా రాజీనామా చేశారు. రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలిగా నియమితులై ప్రణాళికా సంఘంలోనూ సేవలందించారు. రామన్ మెగసెసె, రైట్ లైవ్లీహుడ్, నివానో పీస్ ప్రైజ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకొన్నారు.
చైనా ఆర్థిక సంస్కర్త జియాంగ్ జెమిన్ మరణం
కమ్యూనిస్టు చైనాను ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) లుకేమియా, ఇతర ఆరోగ్య సమస్యలతో షాంఘైలో మరణించారు. ఈ విషయాన్ని అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడిస్తూ, కమ్యూనిస్టు పార్టీ, పార్లమెంటు, మంత్రివర్గం, సైన్యం జారీ చేసిన లేఖను కూడా ప్రచురించింది.
‣ జియాంగ్ జెమిన్ 1926 ఆగస్టు 17న జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన ఆయన ఆటోమొబైల్ కర్మాగారాల్లో పనిచేశారు. కళాశాలల్లో విద్యనభ్యసించే రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1985లో షాంఘై నగర మేయర్‌గా ఎన్నికైన తర్వాత అటు పార్టీలో ఇటు ప్రభుత్వ హోదాల పరంగానూ వేగంగా ఉన్నతిని సాధించారు. 1989లో తియానన్మెన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చైనా పరపతి దెబ్బతింది. తీవ్ర ఆర్థిక ఒడుదొడుకులకూ గురైంది. దానిని తిరిగి గాడిన పెట్టిన ఘనత జియాంగ్ జెమిన్‌కే దక్కుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించడం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవడం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా భాగస్వామి కావడం వంటి కీలక పరిణామాలు ఆయన చైనా అధ్యక్షుడిగా కొనసాగిన (1993 - 2003) కాలంలోనే జరిగాయి. 1989 నుంచి 2002 వరకు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2003లో అధ్యక్ష పదవీ కాలం ముగిసినప్పటికీ 2004 వరకు శక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ హోదాలోే ఉన్నారు.
‣ చైనా అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించిన తొలి వ్యక్తి జియాంగ్ జెమిన్. 1996లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట ఉద్రిక్తతలను తగ్గించుకునేలా భారత్, చైనాల మధ్య ఒప్పందం కుదరడం ఓ ముఖ్య పరిణామం. అధ్యక్షుడిగా ఆయన పదవీ విరమణ చేసే నాటికి చైనా దాదాపు సూపర్‌పవర్ హోదాను అందుకొంది. ఆ దేశ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా, దిగ్గజ వ్యాపారవేత్తగా మారటంలో జియాంగ్ జెమిన్ పాత్ర చాలా ఉంది.
‘ది టెర్మినల్ మ్యాన్’ మెహ్రాన్ కరీమీ నస్సేరి మరణం
కొన్ని సినిమాలను కల్పిత కథలతో రూపొందిస్తే, మరికొన్ని నిజ జీవితంలోని వ్యక్తులు, సంఘటనల ఆధారంగా తీస్తుంటారు. అలా వాస్తవ కథల స్ఫూర్తితో నిర్మించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తీసిన ‘ది టెర్మినల్’ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. దౌత్యపరమైన కారణాలతో 18 ఏళ్లుగా పారిస్‌లోని రోయిస్సీ ఛార్లెస్ డిగాల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయిన మెహ్రాన్ కరీమీ నస్సేరి అనే వ్యక్తి కథతో ఈ సినిమా తీశారు. గుండెపోటుతో మెహ్రాన్ మరణించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇరాన్ జాతీయుడైన మెహ్రాన్ 1988లో పారిస్ విమానాశ్రయానికి రాగా, దౌత్యపరమైన కారణాలతో ఆయన్ను పారిస్‌లోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన విమానాశ్రయంలోని టెర్మినల్‌లో ఉండిపోయారు. ఈ కథతో 2004లో స్పీల్‌బర్గ్ ‘ది టెర్మినల్’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మెహ్రాన్ పాత్రను ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ పోషించారు. దీంతో ది టెర్మినల్ మ్యాన్‌గా నస్సేరి గుర్తింపు తెచ్చుకున్నారు. నస్సేరి 1945లో ఇరాన్‌లో జన్మించారు. తన తల్లిని వెదుకుతూ బ్రిటన్ చేరుకున్న ఆయనకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించడంతో కొద్దిరోజులు విమానాశ్రయంలో గడిపి, పారిస్‌కు చేరుకున్నారు. అక్కడి అధికారులు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో ఎయిర్‌పోర్టులోని ఇంటర్నేషనల్ లాంజ్‌లో ఉండిపోయారు. తర్వాత ఆయన కథ సినిమాగా రావడంతో ‘ది టెర్మినల్ మ్యాన్’గా పేరు గాంచారు.
ప్రముఖ ఇన్‌స్ట్రుమెంటేషన్ శాస్త్రవేత్త రామకృష్ణారావు మరణం
ఇన్‌స్ట్రుమెంటేషన్ సాంకేతికతలో గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మల్లవరపు రామకృష్ణారావు (97) స్వల్ప అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రామకృష్ణారావు స్వస్థలం ఉమ్మడి కృష్ణాజిల్లా లింగాల గ్రామం. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్)లో శాస్త్రవేత్తగా చేరారు. వాక్యూమ్ టెక్నాలజీ, థిన్ ఫిల్మ్స్, లేజర్స్, సోలార్ ఎనర్జీ తదితర విభాగాల్లో ఇన్‌స్ట్రుమెంటేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. 1985లో పదవీ విరమణ చేశారు. సౌర విద్యుత్‌పై కేంద్ర ప్రభుత్వ జాతీయ సలహాదారుల కమిటీలో నిపుణులుగా, ఇస్రో, ఐఐటీల ఎంపిక కమిటీల్లో పనిచేశారు. ‘ఈనాడు’, అన్నదాత పత్రికల్లో వ్యాసాలు రాశారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పార్వతీ కుమార్ మరణం
విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, ద వరల్డ్ టీచô్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి పార్వతీ కుమాô్ (77) గుండె పోటుతో మరణించారు. మాస్టô్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు శిష్యుడైన పార్వతీ కుమాô్ చాలా ఏళ్లుగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన పలు స్వచ్ఛంద సంస్థలు దేశ, విదేశాల్లో పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. 134 దేశాలలో పార్వతీ కుమార్ ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ధ్యానం, యోగ తదితరాలపై 500 సెమినార్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి శనివారం ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్లో మెడిలైఫ్ శిక్షణ ఇస్తుంటారు. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులుతో 18 సంవత్సరాలు కలసి పని చేశారు.