నియామకాలు

ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ బాధ్యతల స్వీకరణ

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పంజాబ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండేలతో కూడిన కమిషన్‌లో మూడో స్థానాన్ని ఆయన భర్తీ చేసినట్టయింది. ఈ ఏడాది డిసెంబరు 31తో గోయల్‌ పదవీ కాలం ముగుస్తుంది.

ప్రసారభారతి సీఈవోగా గౌరవ్‌ ద్వివేది

ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గౌరవ్‌ ద్వివేది ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా నియమితులయ్యారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన లోగడ పౌర వేదిక ‘మై గవర్నమెంట్‌ ఇండియా’ సీఈవోగా సేవలందించారు. శశిశేఖర్‌ వెంపటి 2017 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ప్రసారభారతి సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న దూరదర్శన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో గౌరవ్‌ ద్వివేది నియమితులయ్యారు.

నీతి ఆయోగ్‌ సభ్యుడిగా అర్వింద్‌ విర్‌మాని

నీతి ఆయోగ్‌ పూర్తిస్థాయి సభ్యుడిగా ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ అండ్‌ వెల్ఫేర్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్వింద్‌ విర్‌మాని నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్‌ సెక్రటేరియట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో సభ్యులుగా వీకే సారస్వత్, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్, వీకే పాల్‌ ఉన్నారు. విర్‌మాని నియామకంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ఈయన 2009లో ఐఎంఎఫ్‌లో భారత ప్రతినిధిగా నియమితులయ్యారు. 2012 చివరి వరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో డాక్టరేట్‌ చేశారు.

కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓగా కలిదిండి సత్యనారాయణ రాజు

కెనరా బ్యాంకు నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా కలిదిండి సత్యనారాయణ రాజు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో సత్యనారాయణ రాజు నియామకాన్ని ఖరారు చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి మూడేళ్లు లేదా ఆయనకు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం కెనరా బ్యాంకులోనే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సత్యనారాయణ రాజు ఉన్నారు. కెనరా బ్యాంకు ప్రస్తుత ఎండీ, సీఈఓ ఎల్‌.వి.ప్రభాకర్‌ వచ్చే నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో కె.సత్యనారాయణ రాజు బాధ్యతలు చేపడతారు. కెనరా బ్యాంకు కంటే ముందు ఆయన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం)గా పనిచేశారు. ఆయన తన బ్యాంకింగ్‌ కెరీర్‌ను విజయా బ్యాంకుతో మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగారు. బ్రాంచి బ్యాంకింగ్, క్రెడిట్, కాంప్లియన్స్‌ విభాగాల్లో సుదీర్ఘ అనుభవాన్ని గడించారు.

ద.మ.రైల్వే జీఎంగా అరుణ్‌కుమార్‌ జైన్‌

కేంద్ర ప్రభుత్వం దక్షిణ మధ్య (ద.మ.) రైల్వేకు పూర్తిస్థాయి జనరల్‌ మేనేజరు (జీఎం)ను నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌ (ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ) 1986 బ్యాచ్‌కు చెందిన జైన్‌ ఏప్రిల్‌ 1 నుంచి ద.మ.రైల్వే జోన్‌ ఇంఛార్జి జీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జైన్‌ జీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

రాజ్యసభ హౌస్‌ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రమేశ్‌

రాజ్యసభ సభ్యులకు ఇళ్లు కేటాయించడానికి ఉద్దేశించిన హౌస్‌ కమిటీ ఛైర్మన్‌గా ఏపీకి చెందిన భాజపా సభ్యుడు సీఎం రమేశ్‌ నియమితులయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా వైకాపా, తెరాస సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ నియమితులయ్యారు. పలు కమిటీలను పునర్‌వ్యవస్థీకరించారు. రాజ్యసభ బీఏసీ కమిటీ సభ్యులుగా తెరాస, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, వి.విజయసాయిరెడ్డిలను నియమించారు. తెరాస ఎంపీలు, రూల్స్‌ కమిటీలో బి.పార్థసారథిరెడ్డి, సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీలో కేఆర్‌ సురేష్‌రెడ్డి, ఎథిక్స్‌ కమిటీలో కె.కేశవరావు సభ్యులుగా నియమితులయ్యారు.

కేంద్ర రక్షణ కార్యదర్శిగా గిరిధర్‌ అరమణే

ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అరమణే కేంద్ర రక్షణ శాఖ నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన అజయ్‌కుమార్‌ స్థానంలో గిరిధర్‌ విధులు నిర్వహించనున్నారు. 1988వ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇప్పటి వరకూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు.

ఏఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్‌ కుమార్‌

అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్‌ ఎం మీడియా (ఇండియా) సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో 2022 - 23 సంవత్సరానికి పాలకవర్గ ఎన్నిక జరిగింది. సంస్థ ఉపాధ్యక్షుడిగా హవాస్‌ గ్రూప్‌ ఇండియా సీఈఓ రాణా బారువ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్డులోకి హైదరాబాద్‌కు చెందిన శ్లోకా అడ్వర్‌టైజింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ కె.శ్రీనివాస్‌తో పాటు విశాందాస్, కునాల్‌ లాలని, రోహన్‌ మెహతా, చంద్రమౌళి ముత్తు, శ్రీధర్‌ రామసుబ్రమణియన్, శశిధర్‌ సిన్హా, వివేక్‌ శ్రీవాస్తవలను ఎన్నుకున్నారు.

ఏఐసీటీఈ ఛైర్మన్‌గా టీజీ సీతారామ్‌ నియామకం

ఐఐటీ - గువాహటి డైరెక్టర్‌ టి.జి.సీతారామ్‌ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించింది. ప్రస్తుతం ఏఐసీటీఈ తాత్కాలిక ఇన్‌ఛార్జిగా యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ఉన్నారు. టి.జి.సీతారామ్‌ గతంలో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగ ప్రొఫెసర్‌గా సేవలందించారు.

ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌గా డాక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌

జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) డైరెక్టర్‌గా డాక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పనిచేసిన వి.ఎం.తివారీ పదవీ కాలం ఆరేళ్ల గడువుతో పాటు పొడిగించిన మూడు నెలల అదనపు గడువు కూడా ముగియడంతో ఆ స్థానంలో నూతన డైరెక్టర్‌ను నియమించారు. చీఫ్‌ సైంటిస్ట్‌ అయిన డాక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ భూకంపాలపై పలు కీలక పరిశోధనలు చేశారు. ధన్‌బాద్‌లోని ఐఐటీ - ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ నుంచి అప్లైడ్‌ జియోఫిజిక్స్‌ చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలకు ఆయన యువ శాస్త్రవేత్త, జాతీయ జియోసైన్స్‌ అవార్డుతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. ఎన్‌జీఆర్‌ఐలో అతిపెద్ద పరిశోధన బృందాల్లో ఒకటైన ‘భూకంపాలు, గ్యాస్‌ హైడ్రేట్‌ డివిజన్‌’కు నాయకత్వం వహించారు. ఇది మన దేశ ఇంధన భద్రత వ్యూహాత్మక ప్రణాళికలో మైలురాయిగా నిలిచింది.

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా 1985 బ్యాచ్‌ పంజాబ్‌ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముగ్గురు సభ్యులు ఉండాల్సిన ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, మరో కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండేలు మాత్రమే ఉన్నారు. అరుణ్‌ గోయల్‌ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. ముఖ్యంగా ఆర్థిక, విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఎక్కువగా పనిచేశారు. 2003 - 04 మధ్య దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిగా, 2006 నుంచి 2010 వరకూ కేంద్ర ఆర్థికశాఖలోని ఆర్థిక నిఘా విభాగం అధిపతిగా పనిచేశారు.

ఏఆర్‌సీఐ డైరెక్టర్‌గా నరసింగరావు

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) డైరెక్టర్‌గా డాక్టర్‌ తాతా నరసింగరావు నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడే అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సీటీఆర్‌ఐ డైరెక్టరుగా శేషుమాధవ్‌

తెలంగాణ రాష్ట్ర శాస్త్రవేత్తను కేంద్రం జాతీయ సంస్థకు అధిపతిగా నియమించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్‌)లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ మాగంటి శేషుమాధవ్‌ ఏపీలో రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్‌ఐ) డైరెక్టరుగా నియమితులయ్యారు. ఈ మేరకు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రాజమహేంద్రవరంలోని సీటీఆర్‌ఐలో బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో జన్మించిన శేషుమాధవ్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెద్దాపూర్‌లోని గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు, హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ (అగ్రి), దిల్లీలోని వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేశారు. సుమారు 25 సంవత్సరాల క్రితం పొగాకు పరిశోధన సంస్థలోనే వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తిరిగి అదే సంస్థకు అధిపతిగా నియమితులవడం గమనార్హం. డా.శేషుమాధవ్‌ దాదాపు 22 ఏళ్లు ఐఐఆర్‌ఆర్‌లోని వరి పరిశోధనల్లో పాలుపంచుకున్నారు.

లా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా రీతూ రాజ్‌ అవస్థి బాధ్యతల స్వీకరణ

లా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా కర్ణాటక హైకోర్టు రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్థి బాధ్యతలు చేపట్టారు. హిజాబ్‌పై ఇటీవల తీర్పు వెలువరించిన బెంచ్‌కు రీతూ రాజ్‌ అవస్థి నేతృత్వం వహించారు. ప్రస్తుత లా కమిషన్‌ను 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన ఏర్పాటు చేశారు. జస్టిస్‌ కె.టి.శంకరన్, ప్రొఫెసర్‌ ఆనంద్‌ పలీవాల్, ప్రొఫెసర్‌ డి.పి.వర్మ, ప్రొఫెసర్‌ రాకా ఆర్య, ఎం.కరుణానిధిలు ఇందులో సభ్యులు.

లా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నియామకం

కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌లో నియామకాలు చేపట్టింది. కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థిని ఈ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. జస్టిస్‌ కేటీ శంకరన్, ప్రొఫెసర్‌ ఆనంద్‌ పలివాల్, ప్రొఫెసర్‌ డీపీ వర్మ, ప్రొఫెసర్‌ రాకా ఆర్య, ఎం.కరుణానిధిలు కమిషన్‌ సభ్యులుగా నియమితులైనట్లు ఆయన తెలిపారు.

యూబీఐ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసన్‌ వరదరాజన్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసన్‌ వరదరాజన్‌ను మూడేళ్ల కాలానికి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వచ్చేలా నవంబరు 7వ తేదీతో ఒక నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. తాత్కాలిక అనధికార డైరెక్టర్‌గానూ ఆయన బాధ్యతలు చేపడతారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో వరదరాజన్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2019లో సొంతంగా సలహా సేవలను ప్రారంభించడానికి ముందు ఆయన యాక్సిస్‌ బ్యాంక్‌ డిప్యూటీ ఎండీగా పనిచేశారు. ఐఐఎమ్‌ కలకత్తా నుంచి పీజీ డిప్లొమో పొందిన ఆయన వివిధ ఆర్‌బీఐ కమిటీల్లోనూ సేవలందించారు.

బీపీసీఎల్‌ తాత్కాలిక సీఎండీగా రామకృష్ణ గుప్తా

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) తాత్కాలిక ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా రామకృష్ణ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఆయన ఉన్నారు. అక్టోబరు 31న అరుణ్‌ కుమార్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో, బీపీసీఎల్‌ సీఎండీ పదవి ఖాళీ అయ్యింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా గుప్తా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఓఎన్‌జీసీకి కూడా తాత్కాలిక సీఎండీనే ఉండటం గమనార్హం. కంపెనీ బోర్డులో సీనియర్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న గుప్తా 2031 జూన్‌లో పదవీ విరమణ పొందుతారు.