జాతీయం

నూతన సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో లాంఛనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ 2024 నవంబరు 10వ తేదీ వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.

- జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి దేశంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆధునిక స్వేచ్ఛాభావాలున్న న్యాయమూర్తిగా పేరున్న ఆయన పలు ప్రగతిశీల తీర్పులతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ న్యాయమూర్తులందరి కంటే ఎక్కువ తీర్పులు రాసిన వ్యక్తిగా ఖ్యాతి పొందారు. పెళ్లికాని మహిళలకూ 24 వారాలలోపు ఆబార్షన్‌ కోరుకొనే హక్కు ఉంటుందన్న తీర్పు ద్వారా మహిళల హక్కులకు మరింత బలం చేకూర్చారు.

జీ-20 లోగోను విడుదల చేసిన మోదీ

జీ-20 కూటమికి భారత్‌ నేతృత్వానికి సంబంధించి లోగోను, ఇతివృత్తాన్ని, వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో ఆవిష్కరించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రాధాన్యత గల అంశాలతో కూడిన ఎజెండా రూపకల్పనకు, జీ-20 సమావేశానికి నేతృత్వం భారత్‌కు ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. జీ-20 లోగో, ఇతివృత్తం, వెబ్‌సైట్‌ భారతదేశ సందేశం, ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తాయని పేర్కొంది. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 పాలనా పగ్గాలను డిసెంబరు 1న ఇండోనేసియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. ఈ కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, ఐరోపా సమాజం (యూరోపియన్‌ యూనియన్‌) సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జీ-20 శిఖరాగ్ర సమావేశం నవంబరు 15-16 తేదీల్లో ఇండోనేసియాలోని బాలిలో జరగనుంది. దీనికి భారత్‌ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 2023లో సమావేశాన్ని భారత్‌లో నిర్వహించనున్నారు.

ఆర్‌ఏఎఫ్‌కు తొలిసారి మహిళా ఐజీ అధికారులు

సీఆర్‌పీఎఫ్‌ చరిత్రలో తొలిసారి బిహార్‌లోని తన ఆర్‌ఏఎఫ్‌ (అల్లర్ల నిరోధక దళం) విభాగానికి ఇన్‌స్పెక్టర్స్‌ జనరల్‌ (ఐజీ)గా ఇద్దరు మహిళా అధికారులను నియమించింది. 3.25 లక్షల మందితో అతిపెద్ద పారామిలటరీ దళంగా పేరుగాంచిన సీఆర్‌పీఎఫ్‌లో మహిళలకు తొలిసారి 1987లో ప్రవేశం కల్పించిన 35 ఏళ్ల తరువాత వారు ఐజీలుగా ఉన్నత స్థానంలో నియమితులవ్వడం విశేషం. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ విభాగాలకు మహిళా ఐపీఎస్‌ అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. అలాంటి వారు కనీసం ముగ్గురున్నారు.

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్‌

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా డాక్టర్‌ సీవీ ఆనంద బోస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా మణిపుర్‌ గవర్నర్‌గా ఉన్న లా గణేషన్‌కు అప్పగించారు. జులై 18వ తేదీ నుంచి ఆయన ఉభయ రాష్ట్రాల గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌కు పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించింది. ఈయన కేరళకు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం మేఘాలయ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.

అత్యవసర మందుల జాబితాలో కరొనరీ స్టెంట్‌

హృద్రోగుల కోసం వాడే కరొనరీ స్టెంట్‌ను కేంద్ర ప్రభుత్వం జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నియమించిన స్టాండింగ్‌ నేషనల్‌ కమిటీ ఆన్‌ మెడిసిన్స్‌ చేసిన సిఫార్సుల మేరకు స్టెంట్‌ను ‘నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ - 2022’ జాబితాలో చేర్చారు. తీవ్రత ఎక్కువగా ఉన్న రుగ్మతలకు సంబంధించిన మందులను అందుబాటు ధరల్లో ఉంచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను రూపొందించి విడుదల చేస్తుంది. ధర, సురక్షితం, సామర్థ్యం ఆధారంగా వీటిని నిర్ధరిస్తారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేసిన అత్యవసర మందుల జాబితాలో 27 కేటగిరీలకు చెందిన 384 మందులను చేర్చారు. 2015 నాటి జాబితాలో ఉన్న 26 మందులను జాబితా నుంచి తొలగించి, కొత్తగా 34 మందులకు స్థానం కల్పించారు. వాటికి అదనంగా ఇప్పుడు కరొనరీ స్టెంట్‌ను కూడా చేర్చారు.

ఐఐటీ మద్రాస్‌తో బీఈఎల్‌ ఒప్పందం

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - మద్రాస్‌ (ఐఐటీ-ఎం)తో ఒక ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. క్వాంటమ్‌ సైన్స్, టెక్నాలజీకి సంబంధించి పరిశోధనలు నిర్వహించేందుకు ఇది తోడ్పడనుంది. ఐఐటీఎం చేస్తున్న పరిశోధనల వల్ల తమకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా బెంగళూరు కేంద్రంగా ఉన్న బీఈఎల్‌ వెల్లడించింది.

పంజాబ్‌లో పాత పింఛను పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదముద్ర

పంజాబ్‌లో ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ సీఎం భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2004లో నిలిపివేసిన పాత పింఛను పథకాన్ని (ఓపీఎస్‌) రాష్ట్రంలో మళ్లీ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 1.75 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని అందులో పేర్కొన్నారు. ఓపీఎస్‌ పథకం మూలనిధికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున అందజేస్తుందని, క్రమంగా దాన్ని పెంచుతూ వెళ్తుందని తెలిపారు.

కచ్‌ చిత్రాలు తీసిన ఓషన్‌శాట్‌-3

తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి నవంబరు 26న పీఎస్‌ఎల్‌వీ-సి54 రాకెట్‌ ద్వారా నింగిలోకి వెళ్లిన ఓషన్‌శాట్‌-3 (ఈవోఎస్‌-06), భూటాన్‌ శాట్‌ ఉపగ్రహాలు శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్లు పని చేస్తున్నాయి. వాటికి సంబంధించిన తొలి డేటా శాస్త్రవేత్తలకు చేరింది. ఓషన్‌శాట్‌ ఉపగ్రహం గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంతో పాటు అరేబియా సముద్రం, హిమాలయాలను చిత్రీకరించింది. వాటిని తెలంగాణ షాద్‌నగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ నుంచి స్వీకరించారు. ఓషన్‌ కలర్‌ మానిటర్‌ (ఓసీఎం), సీ సర్ఫేస్‌ టెంపరేచర్‌ మానిటర్‌ (ఎస్‌ఎస్‌టీఎం) సెన్సార్ల ద్వారా వాటిని అభివృద్ధి చేసి బెంగళూరులోని కేంద్ర కార్యాలయానికి నివేదించారు.

యూపీఎస్సీ సభ్యురాలిగా ప్రీతి సూదన్‌ బాధ్యతలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సభ్యురాలిగా 1983 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రీతి సూదన్‌ బాధ్యతలు చేపట్టారు. ఆమెతో యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోని ప్రమాణం చేయించారు. కరోనా సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పని చేసిన ప్రీతి 2020 జులైలో పదవీ విరమణ చేశారు. అంతకుముందు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాలు, మహిళా, శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచ బ్యాంకు సలహాదారుగానూ వ్యవహరించారు.

దేశంలోనే మొదటి జాతీయ జీవ సమాచార భాండాగారం ప్రారంభం

ప్రభుత్వ సాయంతో జరిగిన పరిశోధనల ద్వారా సేకరించిన జీవ సంబంధ సమాచారాన్ని భద్రపరచడానికి దేశంలోనే మొదటి జాతీయ భాండాగారాన్ని ఇక్కడి ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రంలో ప్రారంభించారు. దీనిలో 4 పెటా బైట్ల సమాచార నిధి ఏర్పాటుకు వసతులు ఉన్నాయి. బ్రహ్మ సూపర్‌ కంప్యూటర్‌ కూడా ఉంది. ఇక్కడ కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రారంభించిన ఈ భాండాగారాన్ని ‘భారతీయ జీవసంబంధ సమాచార నిక్షిప్త కేంద్రం’ (ఐబీడీసీ)గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు ఇలాంటివి ఐరోపా, అమెరికాలలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనదేశంలోనూ ఏర్పాటైంది.

వందేళ్ల తర్వాత బ్రిటిష్‌ సైన్యంలో సిక్కుల ప్రార్థనా పుస్తకాలు

వందేళ్ల తర్వాత తొలిసారి బ్రిటిష్‌ సైన్యంలో పనిచేస్తున్న సిక్కులకు ప్రార్థనా పుస్తకాలు జారీ చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఇది సిక్కుల మత విశ్వాసాలకు తాము ఇస్తున్న మద్దతు అని పేర్కొంది. ఈ పుస్తకం మూడు భాషల్లో ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌

త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ తొడుపునూరి అమర్‌నాథ్‌ గౌడ్‌ నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ సికింద్రాబాద్‌కు చెందినవారు.

శ్రీహరికోటలో తొలి ప్రైవేటు ప్రయోగ వేదిక

భారతీయ అంతరిక్ష రంగం మరో కీలక అడుగు వేసింది. ఇస్రో ఉపగ్రహాల ప్రయోగ క్షేత్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఎస్‌డీఎస్‌సీ - శ్రీహరికోట) ప్రాంగణంలో చెన్నైకి చెందిన అంతరిక్ష అంకుర సంస్థ అగ్నికుల్‌ కాస్మోస్, అగ్నికుల్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ నవంబరు 25న ఈ కేంద్రాలను ఆవిష్కరించినట్లు అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ వెల్లడించింది. ఇకపై భారతీయ ఉపగ్రహాలు మరో ప్రయోగ కేంద్రం ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణం చేయొచ్చని ఇస్రో ప్రకటించింది. దేశంలో తొలి ప్రైవేటు లాంచ్‌ప్యాడ్‌ ఏర్పాటుపై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. ఇస్రో ఆపరేషన్‌ బృందాల నుంచి లిక్విడ్‌ స్టేజ్‌ నియంత్రిత వ్యవస్థలు, ఉపగ్రహాల పర్యవేక్షణ, భద్రత, ఇస్రో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి డేటా సేకరించే వెసులుబాటు ఈ కేంద్రానికి ఉందన్నారు. ఐటీ మద్రాస్‌ ఉద్దీపనతో అగ్నికుల్‌ సంస్థ ఏర్పాటైంది. ఈ కేంద్రం నుంచి తొలి ప్రయోగంగా 100 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లే రెండు దశల వాహకనౌక అగ్నిబాన్‌ను ప్రయోగిస్తామని అగ్నికుల్‌ ప్రకటించింది.

సీసీఆర్‌ఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా మీనాకుమారి

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిద్ధ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ ఆర్‌.మీనాకుమారి, సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చి ఇన్‌ సిద్ధ (సీసీఆర్‌ఎస్‌)కు డైరెక్టర్‌ జనరల్‌ అయ్యారు. ఆ కేంద్రం అత్యున్నత కమిటీ ఆమె నియామకాన్ని ఖరారు చేసింది. దీంతో ఆమె రెండు హోదాల్లోనూ కొనసాగుతున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. సీసీఆర్‌ఎస్‌ ఉన్నతస్థాయి విద్యను అందించడంతో పాటు వైద్య విధానంలో మార్పులు తీసుకొచ్చే అత్యున్నత సంస్థ.

సీఐపీఎం సభ్యుడిగా వేణుగోపాల్‌ ఆచంట

ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ కమిటీ ఫర్‌ వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌ (సీఐపీఎం) సభ్యుడిగా దిల్లీ సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఫిజిక్స్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌ ఆచంట ఎన్నికయ్యారు. ఇటీవల పారిస్‌లో జరిగిన 27వ సదస్సులో ఆయన్ని ఎన్నుకున్నారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ తెలిపింది. ఇది సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌పీల్‌కు గుర్తింపు తేవడమే కాకుండా, దేశంలో మెట్రాలజీ అభివృద్ధి దిశలో ఒక ముందడుగు అని పేర్కొంది. వివిధ దేశాల నుంచి ఎన్నికైన 18 మందిలో ఆచంట ఒకరని తెలిపింది. ఈ పదవికి ఎంపికైన ఏడో భారతీయుడని పేర్కొంది. - ఇంటర్నేషనల్‌ కమిటీ ఫర్‌ వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌ అన్నది అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ. 1875 మే 20న ప్యారిస్‌లో జరిగిన మీటర్‌ కన్వెన్షన్‌లో జరిగిన దౌత్య ఒప్పందం ప్రకారం ఈ సంస్థ ఏర్పడింది. 64 దేశాలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ప్రతి నాలుగేళ్లకోసారి పారిస్‌లో సమావేశవుతుంది. కొలతలకు సంబంధించిన ప్రాథమిక యూనిట్లపై తీర్మానాలు ఆమోదించి సిఫార్సులు చేస్తుంటుంది. ఈ కమిటీలో 18 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యులు అంతర్జాతీయంగా తూనికలు, కొలతల యూనిట్లను ప్రామాణీకరిస్తారు. యేటా సమావేశమై 18 కన్సల్టేటివ్‌ కమిటీలు పంపిన నివేదికలను పరిశీలిస్తారు. ఇందులోని ప్రతి సభ్యుడూ ఒక సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు వహిస్తారు. ‣ వేణుగోపాల్‌ ఆచంట 2022లో దిల్లీ కేంద్రంగా పనిచేసే సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌పీఎల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన మెట్రాలజీ (కొలతల శాస్త్రం) విషయంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు పొందారు. సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌పీఎల్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ కేఎస్‌ కృష్ణన్‌ సీఐపీఎంలో తొలి భారతీయ సభ్యుడిగా ఎంపిక కాగా, చివరగా 1991 - 97 మధ్యకాలంలో ఇదే సంస్థ డైరెక్టర్‌గా పనిచేసిన ఈఎస్‌ఆర్‌ గోపాల్‌ ఆ అవకాశాన్ని అందుకున్నారు.

వందేళ్ల నాటి 110 మీటర్ల చిమ్నీ కూల్చివేత

ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌ టాటా స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న వందేళ్ల నాటి 110 మీటర్ల పొడవైన చిమ్నీని కూల్చివేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ సహకారంతో కూల్చివేత కార్యక్రమం చేపట్టినట్లు టాటా స్టీల్‌ ప్లాంటు వర్గాలు తెలిపాయి. 11 సెకన్లలో కూల్చివేత పూర్తయినట్లు పేర్కొన్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాంట్‌లో కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, ఇందులో భాగంగానే చిమ్నీని కూల్చివేసినట్లు టాటా స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధులు వివరించారు.

గిన్నిస్‌ బుక్‌లోకి 26 ఏళ్ల పిల్లి

అత్యధిక కాలం (26 ఏళ్లు) బతికి ఉన్న పిల్లిగా ఆగ్నేయ లండన్‌కు చెందిన ఫ్లోసీ ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ఈ మేరకు బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. 1995లో జన్మించిన ప్లోసీని మొదట ఓ మహిళ 10 ఏళ్ల పాటు పెంచుకుంది. ఆమె మరణానంతరం ఆమె సోదరి సంరక్షణలో ఆ పిల్లి 14 ఏళ్ల పాటు ఉంది. ఆమె తదనంతరం ఆమె కుమారుడి వద్ద ఉంది. ఆయన వ్యక్తిగత కారణాలతో దానిని పిల్లుల సంరక్షణాలయానికి అప్పగించారు. అక్కడ నుంచి వికి గ్రీన్‌ అనే ఓ మహిళ ఫ్లోసీని చేరదీసి సాకుతున్నారు. ఈ పిల్లికి వినికిడి శక్తి లోపించిందని, కంటి చూపు మందగిస్తోందని, అయినా అది ఎంతో ఆప్యాయంగా, సరదాగా ఉంటుందని ఆమె తెలిపారు.

సంప్రదాయ పశు వైద్యంతో సురక్షితమైన పాల ఉత్పత్తి: సీఎస్‌ఈ

పాడి పరిశ్రమలో యాంటీబయోటిక్స్‌ను ఇష్టమొచ్చినట్టు, మోతాదుకి మించి వినియోగిస్తున్న కారణంగా యాంటీబయోటిక్స్‌ను తప్పించుకునే సామర్థ్యాన్ని బ్యాక్టీరియా సంతరించుకుందని, ఈ పరిస్థితిని అధిగమించి, సురక్షితమైన పాలను ఉత్పత్తి చేసేందుకు సంప్రదాయ పశువైద్యం (ఎథ్నోవెటర్నరీ మెడిసిన్‌) దోహదపడుతుందని దిల్లీలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నిపుణులు తెలిపారు. ‘వరల్డ్‌ యాంటీమైక్రోబియల్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో వారు మాట్లాడారు. యాంటీబయోటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా సంప్రదాయ, మూలికలతో పశువులకు ఔషధాలను అందించాలని సీఎస్‌ఈ డీజీ సునీత నారాయణ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎన్‌డీడీబీ 2014లో ప్రారంభించిన ‘మాస్టిటిస్‌ కంట్రోల్‌ పాపులరైజేషన్‌ ప్రోగ్రాం’ను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, యూపీల్లోని 16 పాల సంఘాలు, పాల ఉత్పత్తి సంస్థలు పాటిస్తున్నాయి.

సముద్ర భద్రతకు ఉమ్మడి కమ్యూనికేషన్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం

తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒక ఉమ్మడి కమ్యూనికేషన్‌ ప్రణాళికను తీసుకురావాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. దీనివల్ల సముద్ర ప్రాంత రక్షణను పర్యవేక్షించే యంత్రాంగాలన్నీ ఒకే నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయని నౌకాదళ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వివిధ వ్యవస్థల మధ్య మెరుగైన సమన్వయానికి ఇది వీలు కల్పిస్తుందని, కీలక సమాచార మార్పిడి నిరంతరాయంగా జరుగుతుందని వివరించారు. ఈ ఉమ్మడి కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ప్రత్యేక స్పెక్ట్రమ్, ఉమ్మడి బ్యాండ్‌ ద్వారా పనిచేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు చేపల వేట సాగించే పడవల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత ట్రాన్స్‌పాండర్లు విజయవంతమయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. అక్రమ పడవలను గుర్తించి, వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం తీర ప్రాంత భద్రతలో కీలకమని పేర్కొన్నాయి. భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో పెద్ద సంఖ్యలో పడవలు సంచరిస్తుంటాయని వివరించాయి. ఈ ఇబ్బందిని అధిగమించడంలో ఇస్రో సాయపడుతుందని తెలిపాయి.

మూలవాసుల బిల్లుకు ఝార్ఖండ్‌ ఆమోదం

ఝార్ఖండ్‌ మూలవాసులెవరో గుర్తించడానికి 1932 నాటి భూమి రికార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్దేశిస్తున్న బిల్లును రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం ఆమోదించింది. ఈడీ కేసుల వల్ల శాసన సభ్యత్వాన్నీ, ముఖ్యమంత్రి పదవినీ కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న హేమంత్‌ సోరెన్‌ ఈ బిల్లు సాయంతో రాష్ట్ర గిరిజనుల్లో మద్దతును సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటివరకు స్థానికులను గుర్తించడానికి ‘1985’ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్నారు. దీని బదులు బ్రిటిష్‌ కాలంలో అంటే 1932లో జరిగిన భూ సర్వే రికార్డుల ఆధారంగా మూలవాసులను గుర్తించాలని గిరిజన సంఘాలు చాలాకాలం నుంచి కోరుతున్నాయి.

రిజర్వేషన్లు 77%కి పెంచుతూ ఝార్ఖండ్‌ శాసనసభలో బిల్లు ఆమోదం

ఝార్ఖండ్‌లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60 శాతం నుంచి 77 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది. ఝార్ఖండ్‌ ఉద్యోగాలు, సర్వీసులలో రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన 2001 నాటి బిల్లుకు ఈ మేరకు సవరణ చేసింది. రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ), ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తాజా బిల్లు వల్ల 77 శాతానికి పెరుగుతాయి. దీనికి చట్టబద్ధత అందించడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో తగు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కొత్త బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. బిల్లు వల్ల ఇకపై స్థానిక షెడ్యూల్డ్‌ కులాలకు 12 శాతం కోటా, షెడ్యూల్డ్‌ తెగలకు 28 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) 15 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 12 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం కోటాలు లభిస్తాయి. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో షెడ్యూల్డ్‌ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 26 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయి.

ఈడబ్ల్యూఎస్‌ కోటాను 3-2తో సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లపై సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన 103వ రాజ్యాంగ సవరణకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3-2తో ఆమోదముద్ర వేసింది. ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలు, ఈడబ్ల్యూఎస్‌ను ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించడం సహేతుకమైన వర్గీకరణగా పేర్కొన్నారు. ఈ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగావకాశాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో కేంద్రం 103వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. దీనికి పార్లమెంటు ఉభయసభలు అదే ఏడాది జనవరిలో ఆమోదం తెలిపాయి. ఈ సవరణను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 40 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం మూడు కీలక అంశాలను లోతుగా పరిశీలించింది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన 103వ సవరణ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా? ఈడబ్ల్యూఎస్‌ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన పేదలను విస్మరించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించినట్లా? ఈ సవరణ వల్ల 50% కోటా పరిమితిని దాటినట్లవుతుందా? అన్న ప్రశ్నలపై దృష్టి సారించింది. మెజార్టీ తీర్పునిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు తమ తీర్పులో వీటికి సమాధానమిచ్చారు.

6 రకాల బయోఫోర్టిఫైడ్‌ వంగడాలను విడుదల చేసిన భారత వరి పరిశోధన సంస్థ

వరి అన్నం తింటే కడుపు నిండటమే కాదు. దాని ద్వారా శరీరానికి పోషకాలు ఎంత మేర అందుతున్నాయనేది ముఖ్యం. దేశంలోని అన్ని వ్యవసాయ పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) తాజాగా చేసిన సూచన ఇది. ఇక కొత్త వంగడాలపై పరిశోధనల సమయంలో వాటిలో జింకు, ప్రోటీన్లు, ఇనుము, మాంగనీస్‌ తదితర పోషకాలను పెంచడంపై దృష్టి సారించాలని అది స్పష్టీకరించింది. ఇలా పోషకాలుండే బియ్యం (బయోఫోర్టిఫైడ్‌ రైస్‌)కు దేశంలో ప్రస్తుతం కొరత తీవ్రంగా ఉంది. సాధారణ బియ్యం తినే ప్రజలకు పోషకాలు సరిగా అందడం లేదని పరిశోధనల్లో గుర్తించారు.
నల్ల బియ్యంపై పరిశోధనలు
సాధారణ బియ్యానికే పోషకాలను జోడించి పీఎం - పోషణ్‌ కింద ఇవ్వడంతో పాటు సమాంతరంగా పోషకాలున్న 6 కొత్త వరివంగడాల సాగును ప్రోత్సహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు తాజాగా సూచించింది. రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్‌) వివిధ రాష్ట్రాల్లో సాగుకు అనువైన ‘బయోఫోర్టిఫైడ్‌’ (బీఎఫ్‌ఎఫ్‌) వరి వంగడాలు ఐదింటిని విడుదల చేసింది. మున్ముందు ఎక్కువగా బయోఫోర్టిఫైడ్‌ రకాల వంగడాలే వస్తాయని, ప్రజల ఆరోగ్యానికి అవి ఎంతో అవసరమని కేంద్రం సూచించినట్లు ఐఐఆర్‌ఆర్‌ ప్రధాన శాస్త్రవేత్త ఎల్‌.వి.సుబ్బారావు చెప్పారు. ప్రజలు నిత్యం వాడుతున్న సాధారణ సోనామసూరి సన్నరకం బియ్యంలో కిలోకి 16 నుంచి 17 మిల్లీగ్రాములే జింకు ఉంటుంది. కానీ, అంతకన్నా చాలా ఎక్కువగా ఉండే కొన్ని రకాలను ఐఐఆర్‌ఆర్‌ విడుదల చేసింది.
‣ డీఆర్‌ఆర్‌ ధన్‌-45 అనే వరి వంగడం తెలంగాణ, ఏపీలతో పాటు కర్ణాటక, తమిళనాడులలోని మాగాణి భూముల్లో సాగుచేయవచ్చు. ఇలా పండిన ధాన్యాన్ని పాలిష్‌ పట్టించినా కిలో బియ్యంలో 22 మిల్లీగ్రాముల జింకు ఉంటుంది. గర్భిణులు ఈ అన్నం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఐఐఆర్‌ఆర్‌ తెలిపింది.
‣ డీఆర్‌ఆర్‌ ధన్‌-48 అనే వంగడం కూడా తెలంగాణ, ఏపీలతో పాటు పలు రాష్ట్రాల్లో సాగుకు అనుకూలం. ఇందులో కిలో బియ్యంలో జింకు 22 మి.గ్రా. ఉంటుంది. గ్లైసిమిక్స్‌ సూచిక 51.1 శాతమే ఉన్నందున మధుమేహులు ఈ బియ్యంతో వండిన అన్నం హాయిగా తినవచ్చని ఈ సంస్థ తెలిపింది.
‣ డీఆర్‌ఆర్‌ ధన్‌-49 రకం వంగడంతో పండించిన బియ్యంలో కిలోకు జింకు గరిష్ఠంగా 25.2 మి.గ్రా. ఉండటం సరికొత్త రికార్డు.
‣ డీఆర్‌ఆర్‌ ధన్‌-67 రకం వరి వంగడంతో పండించిన పొడవైన సన్నరకం బియ్యంలో కిలోకు జింకు 27.6 మి.గ్రా.తో పాటు ప్రోటీన్లు 8.3శాతం, అమైలోజ్‌ పదార్థం 25.5 శాతం ఉంటాయి.ఈ అన్నం తింటే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
‣ డీఆర్‌ఆర్‌ ధన్‌-63 రకంలో జింక్‌ 24.2 మి.గ్రా, డీఆర్‌ఆర్‌ ధన్‌-69 రకం వంగడంలో జింక్‌ 25.7 మి.గ్రా, ప్రోటీన్లు 7.8 శాతం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

‘జాతీయ వ్యవసాయ పరిశోధనా, నిర్వహణ సంస్థ’ (నార్మ్‌) ఎ-ఐడియాతో 3 సంస్థల ఒప్పందం

అంకుర సంస్థ (స్టార్టప్‌)లకు మార్గదర్శకత్వం ఇచ్చి అభివృద్ధికి ప్రోత్సహించేందుకు 3 సంస్థలతో ఒకేసారి ఒప్పందం చేసుకున్నట్లు రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ వ్యవసాయ పరిశోధనా, నిర్వహణ సంస్థ’ (నార్మ్‌) తెలిపింది. దేశవ్యాప్తంగా కొత్త ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించి అంకుర సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థలో ‘అసోసియేషన్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ (ఎ-ఐడియా) పేరుతో ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో ‘టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌’ (టీబీఐ)ని సైతం నార్మ్‌ ఏర్పాటు చేసింది. ‣ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్‌కు చెందిన చెరకు పెంపకం సంస్థ, పుణెలోని జాతీయ ద్రాక్ష పంటల పరిశోధనా కేంద్రంతో విడివిడిగా ఒప్పందాలపై ఆయా సంస్థల అధికారులు సంతకాలు చేశారు. అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం చేయడం, నెట్‌వర్కింగ్, సలహాలతో మద్దతు ఇవ్వడం ద్వారా వ్యవసాయ - వ్యాపారాలుగా అభివృద్ధి చేయాలని ఈ ఒప్పందాలను చేసుకున్నట్లు నార్మ్‌ సంయుక్త సంచాలకుడు వెంకటేశ్వర్లు చెప్పారు.

నిఘా అవగాహన వారోత్సవాలు

అవినీతిపరులు ఎంతటి శక్తిమంతులైనా వారిని వదిలిపెట్టొద్దని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. స్వార్థ ప్రయోజనాలున్న కొంత మంది వ్యక్తులు నానా యాగీ చేసి, బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారనీ, అలాంటి వారిని పట్టించుకోవద్దని చెప్పారు. కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) దిల్లీలో ఏర్పాటు చేసిన నిఘా అవగాహన వారోత్సవాల్లో ఆయన ప్రసంగించారు. లంచగొండులకు రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి ఆశ్రయం లభించకుండా చూడాల్సిన బాధ్యత సీవీసీ వంటి సంస్థలపై ఉందని ప్రధాని చెప్పారు. నగదు బదిలీ వంటి సంస్కరణలు, పారదర్శకతల ద్వారా తమ ప్రభుత్వం అవినీతిని అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. అవినీతి నివారణ చర్యల ఆధారంగా ప్రభుత్వ శాఖలకు ర్యాంకింగ్‌ ఇవ్వాలనీ, అధికారులపై అవినీతి కేసుల్ని నిర్ణీత గడువులో యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులపై చర్యల గురించి ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో తెలిపేందుకు ఉద్దేశించిన ‘ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ’ను ప్రధాని ప్రారంభించారు.

జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌గా సజ్జాద్‌

జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపక నేత అబ్దుల్‌ గనీ లోన్‌ కుమారుడైన సజ్జాద్‌ గనీ లోన్‌ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అధ్యక్ష స్థానం ఎన్నికకు ఈ పార్టీ షెడ్యూలు ప్రకటించగా అనంతనాగ్, పూంఛ్, జమ్ము తదితర ప్రాంతాల నుంచి సజ్జాద్‌కు మద్దతుగా 8 నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీ లేకపోవడంతో నవంబరు 6న జరగాల్సిన ఎన్నికకు ముందే ఫలితం ప్రకటించారు. 10వ తేదీన సజ్జాద్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో 11%, ఏపీలో 24% వృద్ధి

అక్టోబరు నెల జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 24%, తెలంగాణలో 11% వృద్ధి నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో ఏపీకి రూ.2,879 కోట్లు రాగా ఈసారి అది రూ.3,579 కోట్లకు చేరింది. తెలంగాణ ఆదాయం రూ.3,854 కోట్ల నుంచి రూ.4,284 కోట్లకు పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధి రేటు వరుసగా పుదుచ్చేరి (34%), కర్ణాటక (33%), కేరళ (29%), తమిళనాడు (25%), ఆంధ్రప్రదేశ్‌ (24%), తెలంగాణ (11%)ల్లో నమోదైంది.

భారత్‌లో అబ్బాయిల్లోనే ఎక్కువగా క్యాన్సర్‌ గుర్తింపు

భారతదేశంలో క్యాన్సర్‌ వ్యాధిని అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా గుర్తిస్తున్నారని, బహుశా సమాజంలోని లింగవివక్షే ఇందుకు కారణం కావొచ్చని ‘ద లాన్సెట్‌ ఆంకాలజీ’ పత్రికలో ప్రచురితమైన పరిశోధన కథనం తెలిపింది. 0 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసుండి, క్యాన్సర్‌ బారిన పడిన వారి సమాచారాన్ని పరిశోధకులు సేకరించారు. భారతదేశంలోని మూడు ప్రధాన క్యాన్సర్‌ ఆసుపత్రుల నుంచి 2005 జనవరి 1 - 2019 డిసెంబరు 31 మధ్య రికార్డులను వారు పరిశీలించారు. దాంతో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతమందనే విషయం తెలిసింది. పీబీసీఆర్‌లలో నమోదైన సుమారు 11వేల మంది రోగుల్లో అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని, మూడు ఆసుపత్రుల్లోని 22 వేల మంది పిల్లల్లోనూ ఎక్కువ మంది బాలురేనని దిల్లీ ఎయిమ్స్‌లోని మెడికల్‌ ఆంకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సమీర్‌ బక్షి తెలిపారు. పిల్లలను వ్యాధి నిర్ధారణకు తీసుకురావడంలో కొంత లింగవివక్ష ఉండొచ్చని, కానీ ఒకసారి తీసుకొచ్చి, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఈ వివక్ష ఉండట్లేదని ఆయన వివరించారు. దక్షిణ భారతంతో పోలిస్తే ఉత్తర భారతంలో అమ్మాయిలు ఆసుపత్రుల్లో చికిత్సకు తక్కువగా వస్తున్నట్లు పరిశోధకులు గమనించారు.