ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిక: యూఎన్‌ఎఫ్‌పీఏ
భూమిపై ఇప్పుడు జనాభా 800 కోట్ల స్థాయికి చేరింది. పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్ల నడుమ మానవాళికి ఇది పెద్ద మైలురాయి. ‘‘ఇవి 8 వందల కోట్ల ఆకాంక్షలు.. కలలు.. అవకాశాలు. మన పుడమి ఇప్పుడు 800 కోట్ల ప్రజలకు ఆవాసం’’ అని ఐరాసకు చెందిన జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) పేర్కొంది. అందరూ కలిసి అభివృద్ధికి కృషి చేయాలని కోరింది. 800 కోట్ల స్థాయిని చేరడాన్ని అద్భుత మైలురాయిగా ఐరాస అభివర్ణించింది. ‘‘జనాభా పెరుగుదల, మానవాళి సాధించిన పురోగతికి, పేదరికం, స్త్రీ-పురుష అసమానతల తగ్గింపునకు, ఆరోగ్య పరిరక్షణ, విద్యలో సాధించిన అభివృద్ధికి నిదర్శనం. అభివృద్ధి కారణంగా ప్రసవాల సమయంలో మాతృమూర్తుల మరణాలు తగ్గాయి. పిల్లల్లోనూ అవి తగ్గుముఖం పట్టాయి. దశాబ్దాలు గడిచే కొద్దీ ఆరోగ్యకరమైన జీవనం మరింత మెరుగుపడింది’’ అని వివరించింది. వచ్చే ఏడాది భారత్, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం కాబోతోంది. దేశంలో సగటు వయసు 28.7 ఏళ్లు. ఈ విషయంలో చైనా (38.4 ఏళ్లు), జపాన్ (48.6 ఏళ్లు), అంతర్జాతీయ సగటు (30.3 ఏళ్లు) కన్నా మెరుగ్గా ఉంది. ఇది భారత్‌కు అనుకూలిస్తుందని నిపుణులు తెలిపారు.
ముఖ్యాంశాలు.:-
‣ భారత్‌లో 15-64 ఏళ్ల మధ్య ఉన్న జనాభా, 68 శాతం మంది. 65 ఏళ్లకు పైబడ్డవారు 7 శాతం. 27 శాతం మంది వయసు 15-29 ఏళ్లు. కౌమార వయస్కులు (10-19 ఏళ్ల మధ్య) 25.3 కోట్ల మంది ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
‣ భారత్‌లో సంతాన సాఫల్యత రేటు తగ్గుతోంది. దేశంలో సరాసరిన ఒక మహిళకు పుట్టే పిల్లల సంఖ్య 2కు తగ్గింది.
‣ మరోపక్క చైనాలో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2035 నాటికి దేశంలో 60 ఏళ్లు పైబడ్డవారి సంఖ్య 40 కోట్లకు చేరుతుంది. గత ఏడాది వీరి సంఖ్య 26.7 కోట్లుగా ఉంది.
‣ ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1 శాతం కన్నా తక్కువగా ఉంది. అందువల్ల 900 కోట్ల మార్కును తాకడానికి మరో 15 ఏళ్లు పడుతుంది.
‣ వచ్చే ఏడాది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకొని ‘వనరుల సృష్టికర్త’గా ఎదగాలని నిపుణులు పేర్కొన్నారు.
‘ఆర్టెమిస్-1’ ప్రయోగం విజయవంతం
నాసా ప్రయోగించిన మూన్ రాకెట్ ‘ఆర్టెమిస్-1’ ప్రయాణం విజయవంతంగా ఆరంభమైంది. ఫ్లొరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి గాల్లోకి ఎగిరింది. చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైనదిగా చెబుతున్న ఈ రాకెట్, వ్యోమగాములు లేని, ఖాళీ ఓరియన్ స్పేస్ క్యాప్సుల్‌తో బయల్దేరింది. జాబిలి కక్ష్యలోకి చేరే ఈ క్యాప్సుల్ మొత్తంగా 25 రోజుల పాటు 13 లక్షల మైళ్లు ప్రయాణిస్తుంది. అనంతరం భూ వాతావరణంలోకి ప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది. ఆర్టెమిస్-1ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించినా, ఈ చంద్రయాత్రను, ఓరియన్ గమనాన్ని మాత్రం ఇంగ్లండ్‌లోని గూన్‌హిల్లీ ఎర్త్ స్టేషన్ నుంచి ట్రాక్ చేస్తున్నారు. మెర్లిన్ పేరిట నిర్మించిన భారీ డిష్ యాంటెన్నాను ఇందుకు వినియోగిస్తున్నారు. 1969 నాటి చంద్రయాత్రలోనూ ఈ ఎర్త్‌స్టేషన్ కీలక పాత్ర పోషించింది.
మంకీపాక్స్ ఇక ఎంపాక్స్
మంకీపాక్స్ కొన్ని దశాబ్దాల నుంచి ఆఫ్రికాలో జనానికి సోకుతున్నప్పటికీ ఆ వ్యాధి పేరు విచక్షణారహితంగా, జాతి వివక్ష ధ్వనించేలా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇక నుంచి మంకీ పాక్స్ వ్యాధిని ఎంపాక్స్ అని వ్యవహరించాలని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా ఏళ్ల తరవాత ఒక వ్యాధి పేరును మార్చడం ఇదే మొదటిసారి. అనేక దేశాల్లో 80,000 మందిలో కనిపించిన ఈ వ్యాధి పేరును కొందరు వ్యక్తులు, దేశాల విజ్ఞప్తిపై మార్చుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
మలేసియా కొత్త ప్రధానిగా సంస్కరణవాది అన్వర్
మలేసియాలో జరిగిన ఎన్నికలు హంగ్ పార్లమెంటుకు దారితీసినా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా పలువురు పార్లమెంటు సభ్యులతో సంప్రదించి 75 ఏళ్ల అన్వర్ ఇబ్రహీంతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అన్వర్ పార్టీ అలయన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు సాధించింది. 222 సీట్లు గల మలేసియా పార్లమెంటులో మెజారిటీ కావాలంటే 112 సీట్లు రావాలి. అన్వర్ సంస్కరణవాది కాగా, మితవాది అయిన మాజీ ప్రధాని ముహియుద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ అలయన్స్‌కు 73 సీట్లు వచ్చాయి. 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్ పగ్గాలు చేపట్టడంతో దేశంలో ఆశాభావం వెల్లివిరుస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు, మలేసియా కరెన్సీ విలువ పెరిగాయి.
నేపాల్ ఎన్నికల్లో గెలిచిన ప్రధాని దేవ్‌బా
నేపాల్ పార్లమెంటు దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభకు ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా (77) భారీ మెజారిటీతో గెలిచారు. గడచిన ఏడు ఎన్నికల్లో దేవ్‌బా వరుసగా విజయాలు సాధించారు. ప్రస్తుతం అయిదోసారి ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తున్నారు. పార్లమెంటు దిగువ సభతో పాటు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పాలక నేపాలీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (సీపీఎన్) - మావోయిస్ట్, సీపీఎన్ - యునైటెడ్ సోషలిస్ట్, లోక్‌తాంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీలు 81 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. సీపీఎన్ - యూఎంఎల్, దాని మిత్రపక్షాలైన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనతా సమాజ్‌వాదీ పార్టీలు 55 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. 275 సీట్లు గల నేపాల్ పార్లమెంటులో 165 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మిగతా 110 సీట్లకు దామాషా పద్ధతిపై సభ్యుల ఎన్నిక జరుగుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం
రక్తానికి సంబంధించి ‘హిమోఫిలియా బి’ అనే ఆరోగ్య సమస్యకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. ఆస్ట్రేలియాలోని దీని తయారీ సంస్థ ‘సీఎస్‌ఎల్ లిమిటెడ్’ ఔషధ ధరను 35 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో రూ.28.6 కోట్లు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చికిత్సగా నిలిచింది. రక్తం గడ్డకట్టడంలో సమస్యలతో కూడిన అరుదైన లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇది. ప్రతి 40 వేల మందిలో ఒకరు ఇటువంటి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 అనే ప్రొటీన్ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం పలు సంస్థల నుంచి అందుబాటులో ఉన్న చికిత్సలతో పోలిస్తే సీఎస్‌ఎల్ అందుబాటులోకి తెచ్చిన చికిత్స దీర్ఘకాలం ప్రభావవంతంగా ఉంటుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్ ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థాన్ని లివర్‌లో ప్రవేశపెడుతుంది. అప్పుడు కాలేయం నుంచి ఫ్యాక్టర్-9 విడుదలవుతుంది.
ఈ ఏటి మేటి పదంపై ఓటింగ్
ఈ ఏడాదికి సంబంధించిన మేటి పదాన్ని ఎంపిక చేసేందుకు తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించాలని ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజస్ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు ఒక సుదీర్ఘ జాబితాపై కసరత్తు చేసి Metaverse, #IStandWith, Goblin Mode అనే మూడు పదాలను తుది పరిశీలన కోసం ఎంపిక చేశారు. వీటిలో ఈ ఏటి పదాన్ని ఎంపిక చేసేందుకు ఓటింగ్ ప్రారంభమైంది. డిసెంబరు 2న అది ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆక్స్‌ఫర్డ్ సంస్థ తెలిపింది. ఈ మూడు పదాలూ ఏదో ఒక రీతిలో ఈ ఏడాదితో ముడిపడ్డాయని పేర్కొంది. 2021లో Vax అనే పదాన్ని ఎంపిక చేశారు.
వ్యోమగాముల కోసం రూపొందించిన క్యాప్సూల్ తొలిసారిగా చంద్రుడి వద్దకు చేరిక
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన ఒరాయన్ క్యాప్సూల్ చంద్రుడికి చేరువగా వచ్చి వెళ్లింది. జాబిల్లి ఆవలి భాగాన్ని చుట్టేసింది. 50 ఏళ్ల కిందట చివరిసారిగా చందమామను సందర్శించాక మానవులను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక వ్యోమనౌక అక్కడికి వెళ్లడం ఇదే మొదటిసారి. చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపే ఉద్దేశంతో ఆర్టెమిస్ రాకెట్‌ను నాసా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అందులోని ఒరాయన్ క్యాప్సూల్‌లో వ్యోమగాములకు బదులు మూడు డమ్మీలను ఉంచారు. అది చంద్రుడి ఉపరితలానికి 130 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లింది. ఆ సమయంలో వ్యోమనౌక జాబిల్లి ఆవలివైపున ఉంది. జాబిల్లి ఆవలి భాగం నుంచి వచ్చాక క్యాప్సూల్‌లోని కెమెరా, భూమికి సంబంధించిన ఫొటోను పంపింది. ఆ సమయంలో ఈ వ్యోమనౌక వేగం గంటకు 8 వేల కిలోమీటర్ల మేర ఉంది. కొద్దిసేపటి తర్వాత అది చంద్రుడి ‘ట్రాంక్విలిటీ బేస్’కు ఎగువన ప్రయాణించింది. 1969 జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌లు ఈ ప్రాంతంపైనే కాలు మోపారు.
‣ చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించడానికి వీలుగా ఒరాయన్ ఇంజిన్‌ను నాసా అధికారులు మండించారు. ఈ ప్రక్రియ ఎలా సాగిందో తెలుసుకోవడానికి డేటాను విశ్లేషిస్తున్నారు. వ్యోమగాముల కోసం రూపొందించిన ఒక క్యాప్సూల్ అక్కడి వరకూ వెళ్లడం ఇదే మొదటిసారి.
స్పేస్‌ఎక్స్ తొలిసారిగా చేపట్టిన ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతం
అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ మూడేళ్ల తర్వాత తొలిసారిగా తన భారీ ‘ఫాల్కన్ హెవీ’ రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించింది. ఈ సందర్భంగా పలు సైనిక ఉపగ్రహాలను భూకక్ష్యలోకి పంపింది. కేప్ కెనావెరాల్‌లోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. రాకెట్ మొదటి దశలోని 27 ఇంజిన్ల గర్జన దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. ప్రయోగించిన రెండు నిమిషాల అనంతరం ఫాల్కన్ రాకెట్ నుంచి రెండు బూస్టర్లు విడిపోయాయి. అవి కేప్ కెనావెరాల్‌లో నిర్దేశిత ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి. వీటిని తదుపరి ప్రయోగాల్లో వినియోగిస్తారు. ఫాల్కన్ హెవీ రాకెట్‌ను తొలిసారి 2018లో ప్రయోగించారు. ఆ తర్వాత 2019లో రెండుసార్లు అది నింగిలోకి పయనమైంది.
908 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చిన అమెరికా వ్యోమనౌక
అమెరికాకు చెందిన ‘ది ఎక్స్-37బి’ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ (ఓటీవీ) తన ఆరో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుంది. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యోమనౌకను స్పేస్ ఫోర్స్ 2020 మేలో ప్రయోగించగా, 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో తాజాగా అది సురక్షితంగా ల్యాండ్ అయింది. గతంలో 780 రోజులు అంతరిక్షంలో ఉన్న ఘనత దీని పేరిటే ఉండేది. ప్రస్తుతం ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ది ఎక్స్-37బి మొత్తంగా 3,774 రోజులు అంతరిక్షంలో గడిపింది.
అంతరిక్ష కేంద్రానికి చైనా సరకు రవాణా వ్యోమనౌక
భూకక్ష్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి చైనా తియాంఝౌ-5 అనే సరకు రవాణా వ్యోమనౌకను పంపింది. లాంగ్ మార్చ్-7 వై6 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం సాగింది. హైనాన్ ప్రావిన్స్‌లోని వెంచాంగ్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. ప్రయోగం విజయవంతంగా సాగిందని అధికారులు తెలిపారు. తియాంగాంగ్ పేరిట నిర్మిస్తున్న చైనా రోదసి కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుంది. ఇటీవల మెంగ్టియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్‌ను డ్రాగన్ అక్కడికి పంపింది. ప్రస్తుతం ఆ కేంద్రంలో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. వారు అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్ తొలగింపు
కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్‌ను అమెరికా ఆర్థిక శాఖ తొలగించింది. ఈ జాబితా నుంచి ఇటలీ, మెక్సికో, థాయ్‌లాండ్, వియత్నాంలకూ మినహాయింపు లభించింది. అమెరికాతో వాణిజ్యం నిర్వహించే ప్రధాన దేశాలు తమ కరెన్సీ మారకపు విలువకు సంబంధించి అనుసరించే పద్ధతులు, స్థూల ఆర్థిక విధానాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాలో పేర్లు చేర్చడం, తొలగింపులు చేస్తుంటారు. గత రెండేళ్లుగా భారత్ ఈ జాబితాలో ఉంది. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ దిల్లీ పర్యటనలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరుపుతుండగానే, అమెరికా ఆర్థిక శాఖ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, కొరియా, జర్మనీ, మలేసియా, సింగపూర్, తైవాన్ మాత్రమే ఉన్నాయి.
అమెరికా - జపాన్ సైనిక విన్యాసాలు ప్రారంభం
ఒక వైపు చైనా దూకుడు, మరోవైపు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో దక్షిణ జపాన్‌లో అమెరికా - జపాన్‌లు భారీస్థాయిలో సంయుక్త సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ‘కీన్ స్వోర్డ్’ పేరుతో జరుగుతున్న ఈ విన్యాసాల్లో జపాన్‌కు చెందిన 26 వేల మంది, అమెరికాకు చెందిన 10 వేల మంది సైనికులతో పాటు 30 నౌకలు, 370 విమానాలు పాల్గొననున్నాయి. నవంబర్ 19 వరకు ఇవి జరుగుతాయి.
ఆరుగురిలో ఒకరు బయటి దేశం వారు
ఇంగ్లండ్, వేల్స్‌లలో నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు బయటి దేశంలో జన్మించిన వారేనని బ్రిటన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జనాభా లెక్కల ఆధారంగా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భారతీయులు 1.5 శాతంతో మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే ఆఫీసర్స్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్) ప్రకారం.. గత సంవత్సరం బ్రిటన్ వెలుపల జన్మించిన వారిలో భారతీయుల సంఖ్య 9 లక్షల 20 వేలు (1.5 శాతం)గా ఉండగా, ఆ తరువాత పోలండ్ 7లక్షల 43 వేలు (1.2శాతం), పాకిస్థాన్ 6 లక్షల 24 వేల (1 శాతం) మందితో తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఓఎన్‌ఎస్ పేర్కొంది. 2011లో బయటి దేశాల్లో పుట్టి బ్రిటన్‌లో నివసిస్తున్న వారి సంఖ్య 75 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య కోటికి చేరినట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమి విజయం
ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని మతతత్వ కూటమి ఘన విజయం సాధించింది. పార్లమెంటు (నెసెట్) లోని 120 స్థానాలకుగాను ఈ కూటమి 64 స్థానాలను సాధించి అధికారానికి అవసరమైన మెజారిటీ దక్కించుకుంది. కొన్నాళ్ల నుంచి రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న దేశంలో త్వరలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడనుంది. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 32 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ప్రధాని పీఠాన్ని కోల్పోనున్న యెయిర్ లాపిడ్ నేతృత్వంలోని యశ్ ఆటిడ్ పార్టీ 24 స్థానాలను సాధించింది. మతతత్వ జియోనిజం పార్టీ 14 స్థానాలను పొంది మూడో స్థానంలో నిలవడం విశేషం.
కెనడాలో హిందూ వారసత్వ మాసంగా నవంబరు
నవంబరు నెలను హిందు వారసత్వ మాసంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. బహుళ సంస్కృతుల దేశ పురోగతిలో హిందు వర్గం (8,30,000 మంది) పాత్ర ప్రాముఖ్యతను గుర్తిస్తు ఈ నిర్ణయం తీసుకుంది. నవంబరు నెలను హిందు వారసత్వ మాసంగా ప్రకటించాలంటూ అధికార లిబరల్ పార్టీకి చెందిన చంద్ర ఆర్య ప్రైవేటు మెంబరు మోషన్‌ను మే నెలలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. అది సెప్టెంబరు 29న ఏకగ్రీవంగా సభ ఆమోదం పొందింది.
డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ రాజీనామా
ఎన్నికల ఫలితాల్లో మిగిలిన వారి కంటే ముందున్నా సర్కారును ఏర్పాటు చేయరాదని డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ నిర్ణయించుకున్నారు. విస్తృతమైన సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు వీలుగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 179 స్థానాలున్న పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఒకే ఒక్క స్థానం ఆధిక్యాన్ని సాధించింది. 90 స్థానాలు సాధించినందు వల్ల మైనారిటీ సర్కారుకు అధినేతగా అధికారంలో ఆమె కొనసాగేందుకు వీలుంది. సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానంటూ ఆమె రాజీనామా చేశారు. ఆ మేరకు లేఖను డెన్మార్క్ రాణి మార్‌గ్రెతేకు అందజేశారు. కొత్త సర్కారు ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఫ్రెడరిక్సన్ కొనసాగుతారు.
పాక్ ఆర్మీ కొత్త చీఫ్ బాధ్యతల స్వీకరణ
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధిపతిగా గతంలో పనిచేసిన జనరల్ అసీం మునీర్ పాక్ ఆర్మీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వరుసగా రెండు విడతలు ఆరేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పదవీ విరమణ చేయడంతో పాక్ ఆర్మీకి 17వ కొత్త చీఫ్‌గా మునీర్‌ను ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నియమించారు.
స్వలింగ సంపర్కుల వివాహాలకు అమెరికా సెనెట్ ఆమోదం
అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలను రక్షించేందుకు ద్వైపాక్షిక చట్టానికి సెనెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఇలాంటి వివాహాలకు 2015లో చట్టబద్ధత కల్పించాక ఒక్కటైన వేల మందికి సెనెట్ నిర్ణయంతో ఊరట లభించింది. స్వలింగ, విజాతీయుల మధ్య పెళ్లిళ్లను ఫెడరల్ చట్టంలో పొందుపరిచేందుకు సంబంధించిన ఈ బిల్లుకు సెనెట్‌లో 61-36 ఓట్లతో మద్దతు లభించింది. 12 మంది రిపబ్లికన్లు కూడా సమర్థించారు. బిల్లు తుది ఆమోదానికి హౌస్‌కు వెళ్లనుంది.
ఇంగ్లండ్‌లో ముస్లింలు, హిందువుల పెరుగుదల
బ్రిటన్‌లోని ఇంగ్లండ్, వేల్స్‌లలో క్రిస్టియన్ల సంఖ్య మొదటిసారిగా జనాభాలో 50 శాతం కంటే తగ్గింది. మరోవైపు ముస్లింలు, హిందువుల సంఖ్యలో పెరుగుదల నమోదైనట్లు విడుదల చేసిన జనాభా లెక్కల వివరాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్) విడుదల చేసిన 2021 జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం.. 46 శాతం మాత్రమే క్రిస్టియన్లు ఉన్నట్లు తేలింది. 2011లో వీరు 59.3 శాతం ఉన్నారు. ఈ సర్వేలో 37.2 శాతం ప్రజలు ‘మాకు మతం లేదు’ అని చెప్పారు. 2011లో 25.2 శాతం ప్రజల నుంచి ఈ సమాధానం వినవచ్చింది. ‘ఇంగ్లాండ్, వేల్స్ జన గణనలో మొదటిసారి 50 శాతం కంటే తగ్గి 46.2% (2.75 కోట్లు) జనం తాము క్రిస్టియన్లమని చెప్పారు. పదేళ్లలో వీరు 13.1 శాతం తగ్గారు’ అని జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది.
‣ 2011లో ముస్లింలు 4.9 శాతం ఉండగా, ప్రస్తుతం 6.5 శాతం (39 లక్షలు) ఉన్నట్లు తేలింది. 2011లో హిందువులు 1.5 శాతం ఉండగా, ప్రస్తుతం 1.7 శాతం (10 లక్షలు) ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి. సిక్కుల సంఖ్యలోనూ స్వల్ప పెరుగుదల నమోదైంది. 2011లో వీరు 0.8 శాతం ఉండగా, ప్రస్తుతం 0.9 శాతం (5,24,000) ఉన్నారు. బుద్ధిస్టులు సైతం 2011లో 0.4 శాతం ఉండగా, ఇపుడు 0.5 శాతం (2,73,000) ఉన్నట్లు తేలింది. యూదుల సంఖ్యలో మార్పు లేదు. వీరు జనాభాలో 0.5 శాతంగా కొనసాగుతున్నారు.
‣ ఈ సర్వేలో మతంపై అడిగిన ప్రశ్నకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించే అవకాశం కల్పించారు. 2011లో ఈ ప్రశ్నకు 92.9% జవాబు చెప్పగా, ప్రస్తుతం 94% స్పందించారు. ఎప్పటిలా లండన్ భిన్న మతాల నిలయంగా నిలువగా హారో, లీసెస్టర్ నగరాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తూర్పు లండన్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉంటున్న విదేశీయుల్లో పొలండ్, రుమేనియాల తర్వాత భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. దక్షిణాసియా భాషల్లో 2011 గణాంకాల్లో కామన్ లాంగ్వేజి విభాగంలో రెండో స్థానంలో ఉన్న పంజాబీ ఇప్పుడు మూడో స్థానానికి దిగజారింది. ఉర్దూ నాలుగో స్థానంలో ఉంది.
రహదారి నిర్మాణానికి కొత్త సాంకేతికతను ఆవిష్కరించిన సిడ్నీ విశ్వవిద్యాలయం
రహదారి మన్నికకు మార్గం సుగమం అవుతోంది. రహదారి నిర్మాణ సమయంలో పొరల పటిష్ఠత ఏ స్థాయిలో ఉందన్నది నిర్ధారించేందుకు నూతన సాంకేతికత ఆవిష్కృతం అయింది. భవన నిర్మాణంలో పునాది పటిష్ఠత ఎంత కీలకమో రహదారి నిర్మాణంలో తొలి దశయిన మట్టిరోడ్డు స్థిరీకరణా అంతే ప్రధానం. ఈ దశను ఎంత పకడ్బందీగా నిర్మిస్తే రహదారి అంత మన్నికగా ఉంటుంది. ప్రస్తుతం భౌతికంగా సాగుతున్న పరీక్షలకు నూతన సాంకేతికత తోడైతే మరింత పటిష్ఠమైన రహదారుల నిర్మాణానికి మార్గం ఏర్పడుతుంది. సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలోని జియోటెక్నికల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం ఇటీవల నూతన విధానాన్ని ఆవిష్కరించింది. ఈ సాంకేతికతపై ఇంజినీరింగ్ స్ట్రక్చర్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. రోడ్డు రోలర్‌కు సెన్సర్లను అమర్చటం ద్వారా రహదారి స్థిరీకరణను నిర్ధారించడం ఈ సాంకేతికత ప్రత్యేకత.
ఐవోటీతో ప్రయోగం
రహదారి నిర్మాణంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇటీవల ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. నిర్మాణ సమయంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రోడ్డు రోలర్‌కు ఐఓటీ సాంకేతికతను అనుసంధానం చేస్తున్నారు. దాంతో అధికారులు తమ కార్యాలయాల నుంచే నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నిర్ధారిత ప్రమాణాల మేరకు రోడ్డు రోలర్ తిరుగుతోందా? లేదా? నిర్మాణం ఏ స్థాయిలో సాగుతోందని గమనిస్తున్నారు.
సిడ్నీ అధ్యయనంతో సరికొత్త శకం
రహదారిలోని అన్ని పొరల పటిష్ఠతను నిర్ధారించేందుకు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నూతన సాంకేతికతను ఆవిష్కరించింది. రోడ్డు రోలర్‌కు ప్రత్యేక సెన్సర్‌ను అమర్చడం ద్వారా రహదారిపై కదలికల సమయంలో నేల సాంద్రతను కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉపయోగించిన మట్టి, ఉపయోగించిన కంకర (చిప్స్) ఒకదానితో మరోకటి ఎంతమేరకు సర్దుకున్నాయో కూడా గుర్తించవచ్చు. ప్రతి పొర స్థిరీకరణను నిర్ధారిస్తుంది. రహదారిలో ఎక్కడైనా ఎత్తుపల్లాలున్నా కనిపెడుతుంది. రహదారి మన్నికనూ తెలుపుతుంది. రహదారి లోపాలను ముందస్తుగా గుర్తించేందుకు ఈ సాంకేతికత ఊతంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.
రహదారి నిర్మాణం ఇలా..
రహదారి నిర్మాణం మూడు దశల్లో సాగుతుంది. ప్రతి దశలోనూ నాణ్యత, ప్రమాణాల నిర్ధారణ తరవాతే మరో దశకు అనుమతి ఇవ్వాలన్నది నిబంధన. తొలుత మట్టితో రహదారి నిర్మిస్తారు. మట్టిని పూర్తిస్థాయిలో స్థిరీకరణ చేసేందుకు వైబ్రేటర్ రోలర్లను వినియోగిస్తారు. అయితే ఏ స్థాయిలో స్థిరీకరణ అయ్యిందన్నది ఆ రోలర్ల ద్వారా గుర్తించేందుకు అవకాశం లేదు. ఇక్కడే ప్రస్తుతం లోపం జరుగుతోందన్నది అధికారులు సైతం అంగీకరిస్తున్న అంశం. మట్టితో నిర్మించిన రహదారి పూర్తిస్థాయిలో గట్టిపడిందా? లేదా? అని పరీక్ష నిర్వహించి నిర్ధారించాలి. ఆ తరవాతే మరోదశకు వెళ్లాలి. చివరిగా రహదారిపై తారు వేయాల్సి ఉంటుంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) నిర్ధారించిన ప్రమాణాల మేరకు హాట్‌మిక్స్ ప్లాంటులో తారు, కంకరను కలిపి వేయాలి.
భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ అనుమతి
భారత్ - ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇరుదేశాలు అంగీకరించిన తేదీ నుంచి స్వేచ్ఛా వాణిజ్యం అమల్లోకి వస్తుంది. ‘భారత్‌తో మా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పార్లమెంట్ ఆమోదం పొందింద’ని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ట్వీట్ చేశారు. ఇండియా - ఆస్ట్రేలియా ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఏఐ-ఈసీటీఏ) అమలు కావడానికి ముందు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. భారత్‌లో ఇలాంటి ఒప్పందాలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదిస్తుంది. రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పందం జరిగింది.
‣ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రస్తుతం 27.5 బి.డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య విలువ వచ్చే 5 ఏళ్లలో 45-50 బి.డాలర్లకు చేరే అవకాశం ఉందని గోయెల్ వెల్లడించారు
‣ ఈ ఒప్పందం 2023 జనవరి నుంచి అమల్లోకి రానుంది.
మెరుగైన బంధానికి బాటలు పరుద్దాం
ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతున్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అమెరికా, చైనా తాజాగా తీర్మానించుకున్నాయి. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతల కోసం కలిసికట్టుగా కృషి చేయాలని సంకల్పించుకున్నాయి. జి-20 సదస్సు కోసం ఇండోనేసియాలోని బాలికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సోమవారం ద్వైపాక్షికంగా సమావేశమయ్యారు. బైడెన్ అమెరికా పాలనా పగ్గాలు చేపట్టాక వీరిద్దరూ నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని, చిరునవ్వుతో పలకరించుకున్నారు. తైవాన్ వివాదం, ఇండో - పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం సహా అనేక అంశాలపై వారిద్దరు దాదాపు మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించుకున్నారు. అణు యుద్ధం ఎన్నటికీ జరగకూడదని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ఆ తరహా సమరంలో విజేతలెవరూ ఉండబోరని పేర్కొన్నారు. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో అణ్వస్త్రాల వినియోగానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
రష్యా చర్యల్ని తప్పుపట్టిన ఐక్యరాజ్య సమితి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లడం ద్వారా అంతర్జాతీయ చట్టాన్ని రష్యా ఉల్లంఘించిందని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ తప్పుపట్టింది. ఈ మేరకు తీర్మానాన్ని 94-14 ఓట్ల తేడాతో ఆమోదించింది. 73 దేశాలు ఓటింగుకు దూరంగా నిల్చొన్నాయి. యుద్ధానికిగానూ రష్యాను జవాబుదారీని చేయాలని ఐరాస పేర్కొంది. ఉక్రెయిన్‌పై ఇంతవరకు ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఇంత తక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి.