పుస్తకాలు

‘ది లాస్ట్‌ హీరోస్‌’ పేరుతో వీరుల జీవిత గాధల పుస్తకావిష్కరణ

దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం పోరాడిన అజ్ఞాత వీరుల జీవిత గాధలను నేటి తరానికి చాటి చెబుతూ ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ‘ది లాస్ట్‌ హీరోస్‌: ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం’ పేరుతో రాసిన పుస్తకాన్ని దిల్లీలో ఆవిష్కరించారు.
ఇందులో వీర వనిత మల్లు స్వరాజ్యంతో పాటు దేశంలో 15 మంది యోధుల జీవితాలను ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఉన్న పుస్తకాల్లో అట్టడుగు స్థాయిలో పోరాడిన అసలైన వీరుల గాధలు వినిపించలేదన్న అంశమే ఆయనను ఈ పుస్తక రచనకు ఉసిగొల్పింది. ఈ పుస్తకంలో దళితులు, ఆదివాసీలు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, రైతులు, కార్మికులు, వంటవాళ్లు, సాధారణ మహిళల గురించి వెలుగులోకి తీసుకొచ్చారు. స్వతంత్రతా సైనిక్‌ సమ్మాన్‌ యోజన పేరుతో ఉన్న పింఛను స్కీంలో స్వాతంత్య్ర సమరయోధుల గురించి చెప్పిన నిర్వచనం తప్పని, దానివల్ల నిజమైన సమరయోధులతో పాటు, మహిళలకు ఆ ప్రయోజనం దక్కలేదని సాయినాథ్‌ అంటారు. అందుకే ఈ పుస్తకంలో అయిదుగురు మహిళలకు పెద్దపీట వేశారు. మరో అయిదేళ్లలో మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో ఒక్కరూ జీవించి ఉండే పరిస్థితి లేదు. ఇప్పటివరకూ చరిత్రపుటలకు ఎక్కని వారి గురించి నేటితరం మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఆ లోపాన్ని ఈ పుస్తకం ద్వారా సరిదిద్దే ప్రయత్నం సాయినాథ్‌ చేస్తున్నారు. ప్రస్తుత పుస్తకాల్లో స్వాతంత్య్రోదమం మొత్తం ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనే జరిగినట్లు అనిపిస్తుంది. అది నిజం కాదని ఈ పుస్తకం ద్వారా చాటుతున్నారు. దక్షిణాదిలో తెలంగాణకు చెందిన మల్లు స్వరాజ్యం, తమిళనాడుకు చెందిన ఎన్‌.శంకరయ్య, ఆర్‌.నల్లకన్నుల గురించి ఇందులో చెప్పారు. భగత్‌సింగ్‌ జుగ్గియాన్, బాజీ మొహమ్మద్, లక్ష్మి పండా, గణపతి యాదవ్, భాబని మహతో, హెచ్‌ఎస్‌ దొరెస్వామి లాంటివారి చరిత్రలకు అక్షరరూపం కల్పించారు. ఎన్నో ఏళ్లపాటు బ్రిటిష్‌ జైళ్లలో మగ్గిన తాత వీవీ గిరిని చూడటానికి సామాన్యులు వచ్చినప్పుడు అసలు వీరులు వీరేనని ఆయన చిన్ననాడు చెప్పిన మాటలే సాయినాథ్‌ను ఈ పుస్తక రచనకు ఉసిగొల్పాయి. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎలా ఎదుర్కొన్నారు, కులమతాలకతీతంగా ఎలా ఎదిగారన్నది చెప్పడమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం.