తెలంగాణ యువ క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టీటీ) అర్జున అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులు బహూకరించారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’’ను టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ స్వీకరించారు. ఈ అవార్డుతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతి, ఓ పతకం, గౌరవ పత్రాన్ని ఆయన అందుకున్నారు. నిఖత్, శ్రీజ సహా ఈ ఏడాది 25 మంది అర్జున అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో షట్లర్లు హెచ్.ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్, అథ్లెట్లు ఎల్దోస్, అవినాశ్ తదితరులున్నారు. వీరు పురస్కారంతో పాటు రూ.15 లక్షల చొప్పున నగదు బహుమతి, జ్ఞాపిక, గౌరవ పత్రాలను స్వీకరించారు.
‣ ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో శరత్ మూడు స్వర్ణాలు, ఓ రజతం గెలిచిన విషయం విదితమే. మనిక బత్రా తర్వాత ఖేల్‌రత్న పురస్కారం స్వీకరించిన రెండో టీటీ ప్లేయర్‌గా శరత్ నిలిచారు. ద్రోణాచార్య సహా ఇతర క్రీడా పురస్కారాలనూ రాష్ట్రపతి ప్రదానం చేశారు. ద్రోణాచార్య జీవిత కాల పురస్కారానికి టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ దినేశ్ జవహర్, బిమల్ ప్రఫుల్లా (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ఎంపికైన సంగతి తెలిసిందే. ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డులను జీవన్‌జోత్ సింగ్ (ఆర్చరీ), మహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమ సిద్ధార్థ్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్) సొంతం చేసుకున్నారు. ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అశ్విని అక్కుంజి (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), బీసీ సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్) దక్కించుకున్నారు. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని ట్రాన్స్‌స్టేడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ), లద్దాఖ్ స్కీ అండ్ స్నోబోర్డు సంఘాలు అందుకున్నాయి.
అనంత సంస్థకు జాతీయ అవార్డు
పర్యావరణహిత సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు ఎక్సియన్ ఫ్రటెర్నా ఎకాలజీ సెంటర్‌కు (ఏఎఫ్) ఫిక్కీ అవార్డును ప్రకటించింది. కరవు పీడిత అనంతపురం జిల్లాలో సాగు రంగంలో సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహానికి ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ చేసిన కృషికి ఈ అవార్డు అందజేస్తున్నట్లు ఫిక్కీ ప్రకటించింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం ప్రాంతంలో వర్షాలు లేక వ్యవసాయం సంక్షోభంలో ఉన్నప్పుడు మారుతున్న సాగు పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు మార్చుకునేలా ప్రోత్సహించడం, బహుళ పంటల విధానం, రక్షక తడులు, ఫాంపాండ్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహించినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు.
చాగంటికి గురజాడ పురస్కార ప్రదానం
గురజాడ తన రచనలను సిరాతో రాయలేదని, లోకంలోని కష్టాలను చూసి ఆ కన్నీళ్లతో రాశారని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. మహాకవి 107వ వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమాఖ్య విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో చాగంటికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది.
హస్తకళల కళాకారులకు జాతీయ పురస్కారాలు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారులు దళవాయి శివమ్మ, ఆమె కుమారుడు కుళ్లాయప్ప జాతీయ అవార్డులు అందుకున్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పురస్కారాలను స్వీకరించారు. లెదర్ పప్పెట్ విభాగంలో జాతీయ స్థాయి అవార్డు 2017 సంవత్సరానికి దళవాయి కుళ్లాయప్ప, 2019కి దళవాయి శివమ్మ ఎంపికయ్యారు. తోలుపై మహావిష్ణువు చరితామృతం రూపొందించి కుళ్లాయప్ప అవార్డు పొందారు. దళవాయి శివమ్మ తోలుపై రూపొందించిన రామరావణ యుద్ధ ఘట్టం పురస్కారానికి ఎంపికైంది.
శ్రీకాళహస్తి కళాకారునికి ‘శిల్పగురు’ అవార్డు
శ్రీకాళహస్తి: కలంకారీలో అద్భుత ప్రతిభను చాటిన కళాకారులకు ఇచ్చే శిల్పగురు పురస్కారాన్ని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కళాకారుడు వేలాయుధం శ్రీనివాసులరెడ్డి అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌ఖడ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ప్రదానం
పదేళ్ల విరామం తీసుకుని తిరిగి చిత్ర పరిశ్రమలోకి వచ్చాకా కూడా అభిమానులు నాపై చూపించిన అభిమానం తగ్గలేదు సరికదా రెట్టింపు అయ్యింది. వాళ్లందరికీ రుణపడి ఉంటాను. ఇక ఎప్పటికీ సినిమాల్ని వదిలిపెట్టనని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సం (ఇఫి) ముగింపు వేడుకల్లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నారు చిరంజీవి. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ పురస్కారాన్ని చిరుకి అందజేశారు. ‘సినిమాబండి’ చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా ప్రత్యేక ప్రోత్సాహక సత్కారం అందుకున్నారు ప్రవీణ్ కాండ్రేగుల.
ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు ఉషారాణికి స్త్రీ అవార్డు
ప్రకృతి వ్యవసాయ సాగులో గుంటూరుకు చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించారు. నవంబరు 24 నుంచి 26వ తేదీ వరకు దిల్లీలో జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయుష్ సంయుక్త కార్యదర్శి ప్రమోద్ కుమార్ చేతుల మీదుగా ఆమె స్త్రీ (శాస్త్ర, సాంకేతిక పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకం) అవార్డును అందుకున్నారని రైతు సాధికార సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సదస్సుకు ఉషారాణి, అనంతపురం జిల్లాకు చెందిన వనూరమ్మ పేర్లను రైతు సాధికార సంస్థ ప్రతిపాదించింది. వీరిద్దరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రసాయన రహిత ఆహారాన్ని సమాజానికి అందించడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు పేర్కొంది.
జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం
ఎన్టీఆర్ భౌతికంగా లేకున్నా, అందరి హృదయాల్లో ఉన్నారని, ఆయన పేరుతో చలనచిత్ర పురస్కారం తీసుకోవడం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని ప్రముఖ సినీనటి జయప్రద పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని జయప్రదకు ప్రదానం చేశారు.
ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు డా.సామల సదాశివ రాష్ట్రస్థాయి పురస్కారం
ప్రముఖ కవి డా.సామల సదాశివ రాష్ట్రస్థాయి పురస్కారం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆదిలాబాద్‌లో ఆయనకు తెలంగాణ కళా వేదిక ఆధ్వర్యంలో ఆ పురస్కారాన్ని అందజేశారు.
128 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ అవార్డులు
ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులకు 128 మంది కళాకారులు ఎంపికయ్యారు. 2019, 2020, 2021 సంవత్సరాలకుగాను వీరిని ఎంపిక చేసినట్లు అకాడమీ వెల్లడించింది. 10 మంది ప్రముఖులకు ఫెలోషిప్ అందజేయనున్నట్లు కూడా తెలిపింది. మరోవైపు సంగీత నాటక అకాడమీ అమృత అవార్డులు 75 మందికి దక్కాయి. వారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారులు ఉన్నారు. వీరంతా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర పురపాలికలకు మరో 7 అవార్డులు
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ఇటీవల వివిధ కేటగిరీల్లో 16 అవార్డులను దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర పురపాలికలు తాజాగా మరో 7 అవార్డులు సొంతం చేసుకున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు కేంద్ర పురపాలక శాఖ పేర్కొంది. ఈ మేరకు ‘ఫాస్ట్ మూవర్ సిటీ’ కేటగిరీలో 3-10 లక్షల జనాభా విభాగంలో వరంగల్ నగరపాలక సంస్థ మూడో స్థానంలో నిలిచింది. 50 వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో కాగజ్‌నగర్ పురపాలక సంస్థ, జనగాం మున్సిపాలిటీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 25-50 వేల జనాభా విభాగంలో అమనగల్, 15-25 వేల జనాభా కేటగిరీలో గుండ్లపోచంపల్లి (రెండో స్థానం), కొత్తకోట (మూడో స్థానం), 15 వేలలోపు జనాభా విభాగంలో వర్దన్నపేట (రెండో స్థానం) అవార్డులను దక్కించుకున్నాయి.
‘స్వాతి’ బలరామ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం
లోక్‌నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాదికి ‘స్వాతి’ వ్యవస్థాపక సంపాదకుడు వేమూరి బలరామ్‌కు ప్రదానం చేయనున్నట్లు లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో తెలిపారు. జనవరి 18న ఈ పురస్కారం అందిస్తామన్నారు. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు హాజరవుతారన్నారు. జీవన సాఫల్య పురస్కారాలను సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ ఛైర్మన్ డాక్టర్ కూచిభట్ల ఆనంద్, కె.ఎల్.యూనివర్సిటీ (విజయవాడ) ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ, జీఎస్‌ఎల్ మెడికల్ హాస్పిటల్ (రాజమహేంద్రవరం) వ్యవస్థాపకుడు డాక్టర్ గన్ని భాస్కరరావు, సీనియర్ సినీ నటీమణులు జయప్రద, జయసుధకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ‘శ్రీసత్యసాయి అవార్డ్’
విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఏడుగురు మహిళలకు ‘శ్రీ సత్యసాయి అవార్డ్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ పురస్కారాలను అందజేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర సమీప ముద్దేనహళ్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు మధుసూదన్‌సాయి పురస్కారాలను అందించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ నీర్జా బిర్లా, దివ్యాంగ క్రీడాకారిణి మాలతి హొళ్లా, ఒడిశాకు చెందిన డాక్టర్ తులసీ ముండా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కౌశల్య బాయి, తమిళనాడుకు చెందిన ఆర్.రంగమ్మాళ్, న్యాయవాది గౌరీ కుమారి పురస్కారాలు అందుకున్నారు.
ఐఐటీహెచ్ పీఆర్వోకు పీఆర్‌సీఐ అవార్డు
ఐఐటీ హెచ్ పీఆర్వో మిథాలీ అగర్వాల్‌కు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు దక్కింది. డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి ఫ్యూచర్ రెడీ విభాగంలో ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. నవంబరు 11, 12 తేదీల్లో కోల్‌కతాలో నిర్వహించిన 16వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాన్‌క్లేవ్‌లో పశ్చిమబెంగాల్ వ్యవసాయ శాఖ మంత్రి సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ప్రజా సంబంధాల రంగంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఆద్విక’ మేగజీన్‌కు ఆమె సంయుక్త ఎడిటర్‌గానూ నియమితులయ్యారు.
ఏపీ రాష్ట్రానికి 5 స్కోచ్ అవార్డులు
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రానికి ఐదు స్కోచ్ అవార్డులు లభించాయి. పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలకు సంబంధించి రెండు బంగారు, మూడు రజత అవార్డులు దక్కాయి.
డా. పూర్ణిమాదేవికి ఐరాస పర్యావరణ అవార్డు
భారత వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డా. పూర్ణిమాదేవి బర్మన్‌ను ఈ ఏడాది ఐరాస ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ వ్యవస్థ క్షీణతను నిరోధించడానికి కృషి చేస్తున్న వారికి ఇది ఐరాస ఇచ్చే అత్యుత్తమ గౌరవ పురస్కారం. అస్సాంకు చెందిన పూర్ణిమాదేవి అవిఫౌనా రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నారు. 10 వేల మంది మహిళలతో ఈమె నిర్వహిస్తున్న ‘హర్గిలా ఆర్మీ’ గ్రేటర్ ఎడ్జుటెంట్ స్టార్క్ అనే ప్రత్యేక కొంగల జాతి అంతరించిపోకుండా వాటి సంరక్షణకు కృషి చేస్తోంది.
దక్షిణ డిస్కంకు రెండు ఐసీసీ అవార్డులు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు రెండు ఐసీసీ అవార్డులు దక్కాయని సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతికత వినియోగం కేటగిరీలో మొదటి ర్యాంకు, పనితీరు మెరుగు కేటగిరీలో మూడో ర్యాంకు సాధించిన క్రమంలో ఈ అవార్డులు లభించాయి. వాటిని ఇటీవల దిల్లీలో ‘ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్’ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ భారత ఇంధన సదస్సులో సంస్థ డైరెక్టర్ టి శ్రీనివాస్ నిర్వాహకుల నుంచి అందుకున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం సంస్థ వివిధ ఐటీ, మొబైల్ యాప్ ఆధారిత సేవలను అభివృద్ధి చేసింది. వీటి ద్వారా వినియోగదారులు సమస్యలపై ఫిర్యాదు, బిల్లింగ్, వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు, నూతన సర్వీసుల మంజూరు, పర్యవేక్షణ వంటి సేవలు చాలా సులువుగా పొందుతున్నందుకు ఈ అవార్డులు దక్కినట్లు సీఎండీ వివరించారు.
తెలంగాణ ఆగ్రోస్‌కు ‘స్కోచ్’ ఉత్తమ పురస్కారం
గ్రామాల్లో విద్యావంతులైన నిరుద్యోగులతో 1050 ‘ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించడమే కాక, సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాలను అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నందుకు తెలంగాణ ఆగ్రోస్ జాతీయస్థాయిలో స్కోచ్ ఉత్తమ పురస్కారాన్ని గెల్చుకుంది. ఈ అవార్డును స్కోచ్ సంస్థ నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా ఆగ్రోస్ ఎండీ కె.రాములుకు అందజేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సమక్షంలో ఈ పురస్కారాన్ని ఆన్‌లైన్ ద్వారా అందుకున్నట్లు రాములు తెలిపారు.
అమరరాజాకు 8 అత్యున్నత పురస్కారాలు
అమరరాజా సంస్థకు అంతర్జాతీయ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ పోటీల్లో ఎనిమిది అత్యున్నత పురస్కారాలు లభించాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్థన్ గౌరినేని తెలిపారు. ఇండోనేసియాలోని జకార్తాలో నవంబరు 15 నుంచి 18 వరకు జరిగిన 47వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ పోటీల్లో అమరరాజా నుంచి ఎనిమిది బృందాలు పాల్గొన్నాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల నుంచి 800 బృందాలకు చెందిన 5 వేల మందితో పోటీపడి ప్రతి విభాగంలోనూ అమరరాజా బృందాలు పసిడి పురస్కారాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు.
పీఆర్‌సీఐ హైదరాబాద్ చాప్టర్‌కు పురస్కారాలు
భారతీయ ప్రజా సంబంధాల మండలి (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా - పీఆర్‌సీఐ) ఇటీవల కోల్‌కతాలో నిర్వహించిన గ్లోబల్ సదస్సులో తెలంగాణకు చెందిన హైదరాబాద్ చాప్టర్, సభ్యులు ఆరు పురస్కారాలను పొందారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ చాప్టర్, ఉత్తమ ప్రచార రూపకల్పనతో పాటు ఫ్రెÆడ్రిక్ మైఖేల్, ప్రకాశ్ జైన్‌లకు రెండు హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాలు, జాతీయ స్థాయిలో ఉత్తమ మాడరేటర్‌గా సారా వరద, డిజిటల్ మార్కెటింగ్‌లో మతి మిటాలీ అగర్వాల్ పురస్కారాలు అందుకున్నారు.
ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150కిపైగా సినిమాలు చేసి ప్రజాదరణ పొందారని, ఆయనది విశిష్టమైన కెరీర్ అని చిరంజీవిని అభినందిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజనీకాంత్, ఇళయరాజా తదితర హేమాహేమీలు అందుకున్నారు.
దలైలామాకు గాంధీ - మండేలా అవార్డు
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గాంధీ - మండేలా అవార్డును టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు అందజేశారు. స్థానిక మైక్లోడ్‌గంజ్ ప్రాంతంలో గాంధీ - మండేలా ఫౌండేషన్ ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించింది. ఈ అవార్డుకు దలైలామాకన్నా అర్హుడు మరొకరు లేరని, ఆయన ప్రపంచ శాంతి దూత అంటూ గవర్నర్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.
కుటుంబ నియంత్రణలో భారత్‌కు ‘ఎక్సెల్ అవార్డ్ - 2022’
కుటుంబ నియంత్రణలో అత్యాధునిక విధానాల వినియోగం, నాయకత్వానికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘ఎక్సెల్ అవార్డ్ - 2022’ భారత్‌ను వరించింది. అత్యాధునిక, అత్యంత నాణ్యమైన కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తున్న దేశాల విభాగంలో ఒక్క భారత్ మాత్రమే ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సదస్సు (ఐసీఎఫ్‌పీ 2022) సమావేశంలో ఈ అవార్డును ప్రకటించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్‌లో వెల్లడించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం.. దేశంలో 2015 - 16లో 54% ఉన్న గర్భనిరోధక రేటు (కాంట్రాసెప్టివ్ ప్రివలెన్స్ రేట్) 2019 - 20 నాటికి 67 శాతానికి చేరింది.
‣ దేశంలో పునరుత్పత్తి సామర్థ్యమున్న 15-49 ఏళ్ల వయసు వివాహితుల్లో కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించినవారు (డిమాండ్ సాటిస్ఫైడ్) 2015 - 16లో 66% ఉండగా, 2019 - 20 నాటికి అది 76 శాతానికి చేరుకొంది.
‣ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఈ రేటు 75 శాతానికి చేరుకోవాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే భారత్ దీన్ని అధిగమించడం విశేషం.
అంతర్జాతీయ వ్యాస రచన పోటీలో భారత బాలికకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
ప్రపంచ ప్రఖ్యాత ‘క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటిషన్’లో భారత్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక సత్తా చాటింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మౌలికా పాండే, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన పద్మశ్రీ జాదవ్ మొలాయి పాయెంగ్ యథార్థ జీవితగాథను తన రచనా కౌశలంతో కళ్లకు కట్టింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీకి ‘ది మొలాయి ఫారెస్ట్’ శీర్షికతో కథ రాసి, జూనియర్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి కెమిల్లా నుంచి మౌలిక పురస్కారాన్ని అందుకొంది. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారిలో భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన 13-17 ఏళ్ల వయసు యువతీ యువకులు ఉన్నారు. పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా విజేతల వ్యాసాల్లోని పలు భాగాలను రాయల్ కామన్వెల్త్ సొసైటీ (ఆర్‌సీఎస్) రాయబారులు చదివి వినిపించారు. ఇందులో భారత సంతతికి చెందిన నటి ఆయేషా ధార్కర్ కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యువతలో అక్షరాస్యత, వ్యక్తీకరణ, సృజనాత్మకతను పెంచేందుకు ఆర్‌సీఎస్ 1883లో ‘క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటిషన్’ పేరున అంతర్జాతీయ పాఠశాల వ్యాస రచన పోటీని ప్రారంభించింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీకి మొత్తం 26,322 ఎంట్రీలు వచ్చినట్టు ఆర్‌సీఎస్ తెలిపింది.
బాలల సాహితీవేత్త పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
జాతిపిత మహాత్మా గాంధీపై రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ పత్తిపాక మోహన్‌కు దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబారా అందజేశారు. పురస్కారంతో పాటు రూ.50 వేల చెక్కు, తామ్రపత్రాన్ని మోహన్‌కు ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 22 భాషల్లోని రచయితలకు ఈ అవార్డులను అందించి సత్కరించారు.
రణ్‌వీర్‌సింగ్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్ ప్రతిష్ఠాత్మక మరకేష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఎటైల్ డియోర్ అవార్డు’ పురస్కారం అందుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణ పథకాలపై డాక్యుమెంటరీలకు పీఆర్‌సీఐ పురస్కారాలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై డీఎస్‌ఎన్ ఫిల్మ్స్ రూపొందించిన అయిదు డాక్యుమెంటరీలు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌సీఐ) జాతీయ వార్షిక పురస్కారాలను గెలుచుకున్నాయి. కోల్‌కతాలో జరిగిన ప్రపంచ సమాచార శిఖరాగ్ర సదస్సు - 2022లో డీఎస్‌ఎన్ అధినేత దూలం సత్యనారాయణ ఈ పురస్కారాలను అందుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల మార్గనిర్దేశంలో ఈ డాక్యుమెంటరీలను రూపొందించామని, పురస్కారాలకు వారి ప్రోత్సాహమే కారణమని దూలం సత్యనారాయణ తెలిపారు.
విభాగాల వారీగా..
కళలు, సంస్కృతి: బుద్ధవనం - క్రిస్టల్
విజనరీ లీడర్‌షిప్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్: సీఎం నేతృతంలో ప్రగతిశీల తెలంగాణ - స్వర్ణం
పర్యాటక, ఆతిథ్య ప్రచారం: సోమశిల పర్యాటక సర్క్యూట్ - స్వర్ణం
ఆరోగ్య సంరక్షణ, ప్రచార చిత్రం: రాష్ట్రంలో కరోనాపై అవగాహన - స్వర్ణం
ప్రభుత్వ సమాచార చిత్రం: రైతుబంధు - బీమా - కాంస్యం
సుద్దాల అశోక్ తేజకు ‘సామల’ పురస్కారం
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, బహుభాషా కోవిదుడు డా.సామల సదాశివ పురస్కారాన్ని 2022వ సంవత్సరానికి ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అందించనున్నట్లు తెలంగాణ కళావేదిక అధ్యక్షుడు అనుముల దయాకర్ పేర్కొన్నారు. తెలంగాణ భాషకు, యాసకు పట్టం కట్టిన సదాశివ పేరిట నాలుగేళ్లుగా ఆయన స్మారకార్థంగా పురస్కారం ప్రకటిస్తున్నామన్నారు. నవంబరు 26న ఆదిలాబాద్‌లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్‌కు ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారం
తమిళనాడులోని చిదంబరంలో పుట్టి లండన్‌లో స్థిరపడిన ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఇంగ్లండ్‌లో ప్రతిష్ఠాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ పురస్కారం పొందిన ఆరుగురిలో 70 ఏళ్ల వెంకీ రామకృష్ణన్ ఒకరు. సైన్యం, సైన్స్, కళలు, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజకుటుంబం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణానికి ముందు సెప్టెంబరులో వెంకీ సహా ఆరుగురిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ప్రస్తుత రాజు చార్లెస్-3 ఈ పురస్కారాలను ప్రకటించినట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ వెల్లడించింది. అమెరికాలో బయాలజీ చదివిన రామకృష్ణన్ తర్వాత బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ప్రముఖ పరిశోధన కేంద్రం ఎంఆర్‌సీ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీలో బృంద నాయకుడిగా సేవలందిస్తున్నారు. రైబొసోమల్ నిర్మాణంపై పరిశోధనలకు గానూ 2009లో ఆయనను నోబెల్ బహుమతి వరించింది. 2012లో బ్రిటన్ రాణి నుంచి ‘నైట్‌హుడ్’ పురస్కారం అందుకున్నారు. 2015 నుంచి 2020 వరకు ఆయన యూకే రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగానూ సేవలందించారు.
శ్రీశ్రీ రవిశంకర్‌కు గాంధీ పురస్కారం ప్రదానం
ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అట్లాంటాలో గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం అందుకున్నారు. మహాత్మాగాంధీ, డా.మార్టిన్ లూథర్ కింగ్‌లు ప్రబోధించిన శాంతి, అహింసా సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరుగని కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. మార్టిన్ లూథర్ కింగ్ అల్లుడు ఇసాక్ ఫెర్రీస్, అట్లాంటాలో భారత్ కాన్సుల్ జనరల్ డా.స్వాతి కులకర్ణి సమక్షంలో అమెరికాలోని గాంధీ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకర్‌కు అందజేసింది.
ఎన్‌ఎఫ్‌డీబీ సీఈఓ సువర్ణకు ఉత్తమ పురస్కారం
జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (ఎన్‌ఎఫ్‌డీబీ)కి జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. దిల్లీలో జరిగిన భారత, అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల చేతుల మీదుగా ఎన్‌ఎఫ్‌డీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ సీహెచ్ సువర్ణ ఈ అవార్డు అందుకున్నారు.
భారత శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
భారత వైద్య పరిశోధకుడు డాక్టర్ సుభాష్ బాబును ప్రతిష్ఠాత్మకమైన బెయిలీ కె ఆష్‌ఫర్డ్ పతకం వరించింది. ఉష్ణమండల వ్యాధులకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద శాస్త్రీయ సంస్థ ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్’ ఈ మేరకు ప్రకటించింది. అలాగే ఫెలో ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ అవార్డుకూ ఆయనను ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఒక భారతీయుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఉష్ణమండల ప్రాంత వ్యాధులపై పరిశోధనలకు గాను సుభాష్‌కు ఈ గౌరవం దక్కింది. చెన్నైలోని ఐసీఈఆర్ - ఇండియా సంస్థలో సైంటిఫిక్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.
అవార్డులు
పునీత్‌కు ‘కర్ణాటక రత్న’ అత్యున్నత పురస్కారం
దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని బెంగళూరులోని విధానసౌధ ప్రాంగణంలో ప్రదానం చేశారు. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధానారాయణమూర్తి, జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా పునీత్ సతీమణి అశ్వనీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ధవళేశ్వరం బ్యారేజీకి ఆస్ట్రేలియా హెరిటేజ్ పురస్కారం
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీకి ఆస్ట్రేలియా హెరిటేజ్ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని సీడబ్ల్యూసీ సభ్యుడు ఓరా చేతుల మీదుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీరు ఇన్ చీఫ్ (గోదావరి డెల్టా సిస్టమ్) ఆర్.సతీశ్‌కుమార్, డిప్యూటీ ఇంజినీరు ఇన్‌చీఫ్ శివప్రసాదరెడ్డి అందుకున్నారు. దిల్లీలో నిర్వహించిన ఏడో ‘ఇండియా వాటర్ వీక్’ కార్యక్రమంలో ఏపీ తరఫున వీరు పురస్కారాన్ని అందుకున్నారు.
రైతు సాధికార సంస్థకు ఫ్యూచర్ ఎకానమీ నాయకత్వ అవార్డు
ఆంధ్రప్రదేశ్‌లో ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థకు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ‘ఫ్యూచర్ ఎకానమీ నాయకత్వ’ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్టులో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-27 (కాప్-27) సదస్సులో ఈ అవార్డును ప్రకటించి అందించారని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న సంస్థలకు ఫ్యూచర్ ఎకానమీ ఫోరం ఆధ్వర్యంలో ఏటా అవార్డులు అందిస్తారు. అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతో పాటు వెబినార్లు, ఫోరం అనుబంధ సంస్థల వేదికల్లో పాల్గొని తమ కార్యక్రమాలను వివరించే అవకాశం కల్పిస్తారు. 2022 సంవత్సరానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయ విస్తరణ, రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో రైతు సాధికార సంస్థ కృషిని ఫోరం గుర్తించి అవార్డు అందించిందని రైతు సాధికార సంస్థ వివరించింది.
ఝాన్సీరాణికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు - 2021’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న మిర్యాల ఝాన్సీరాణి అందుకున్నారు. కరోనా కష్టకాలంలోనూ దేశవ్యాప్తంగా రోగులకు అనుపమానమైన సేవలందించిన 51 మంది నర్సులకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఝాన్సీరాణి ఒక్కరే నిలిచారు. సమాజం కోసం నర్సులు, నర్సింగ్ వృత్తిలో ఉన్న వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 1973లో ఈ అవార్డును ప్రారంభించింది. మిర్యాల ఝాన్సీరాణి గత 25 ఏళ్లుగా ఎయిడ్స్, బ్లడ్ బ్యాంకింగ్, బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్, మిడ్‌వైఫ్ సర్వీస్, మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్, నర్సింగ్ విద్యా బోధన రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.
వైద్యురాలు సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ పురస్కారం
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తె, ప్రముఖ వైద్యురాలు నర్రెడ్డి సునీత క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి ఈ ఫౌండేషన్ జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయ సేవల విభాగంతో కలిసి జాతీయ అవార్డులు అందజేస్తుంది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో సునీతకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్ అవార్డును అందజేశారు. మాజీ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌కు జీవన సాఫల్య పురస్కారం, హైదరాబాద్‌కు చెందిన పురాతన కార్ల సేకర్త (కళా రంగం) రామ్‌లాల్ అగర్వాల్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో పాటు పలు సంస్థల్లో సభ్యురాలిగా సునీత సేవలందిస్తున్నారు.
మన్ని కంటిపూడికి ‘సీఈఓ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన అరాజెన్ లైఫ్‌సైన్సెస్ సీఈఓ మన్ని కంటిపూడికి ప్రతిష్ఠాత్మక ‘సీఈఓ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిర్వహించిన ‘సీపీహెచ్‌ఐ ఫార్మా అవార్డ్స్ 2022’లో ఆరుగురితో పోటీపడి ఆయన ఈ అవార్డు సంపాదించుకున్నారు. చిన్న మూల కణాలు, బయోలాజిక్స్ విభాగంలో ప్రపంచ స్థాయి కాంట్రాక్టు సేవల సంస్థగా అరాజెన్ లైఫ్‌సైన్సెస్‌ను ఆయన తీర్చిదిద్దినట్లు సీపీహెచ్‌ఐ ఫార్మా అవార్డుల బృందం పేర్కొంది. ఫార్మా డ్రగ్ డెలివరీ, పరిశోధన, స్థిర వృద్ధి విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన వారిని గుర్తించి ఏటా ఈ అవార్డులు ఇస్తున్నారు. 20 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న అరాజెన్ లైఫ్‌సైన్సెస్‌లో నాలుగు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఫార్మా కంపెనీలకు ఈ సంస్థ కాంట్రాక్టు పరిశోధనా సేవలు అందిస్తోంది.