మస్క్ సంపద రోజుకు రూ.2,500 కోట్ల నష్టం
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎలాన్ మస్క్ సంపద విలువ సగటున రోజుకు రూ.2,500 కోట్ల మేర ఆవిరవుతోంది. బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ జాబితాలోని ఇతర కుబేరుల కంటే మస్క్ సంపదే అధికంగా హరించుకుపోతోంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వారి జాబితాలో మస్క్‌దే ఇప్పటికీ అగ్రస్థానం. రెండేళ్లుగా ఆయన విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా షేరు విలువ తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా ఈ ఏడాదిలోనే నవంబరు 22 వరకు చూస్తే మస్క్ సంపద విలువ 101 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,25,000 కోట్లు) తగ్గింది. ఒక దశలో ఆయన సంపద విలువ 340 బి.డాలర్ల గరిష్ఠస్థాయికి చేరింది. అంటే ఇప్పటికి దాదాపు సగం మేర ఆవిరైంది.
ఐఐటీ - మద్రాస్‌తో లోకేశ్ మెషీన్స్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ అధునాతన యంత్రాలు, ఉపకరణాలను ఆవిష్కరించడం కోసం ఐఐటీ - మద్రాస్‌లోని అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఏఎంటీడీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. మిల్లింగ్ హెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ మిల్లింగ్ స్పిండిల్ కోసం రోటరీ డ్రైవ్ యూనిట్, ఇతర హై-ప్రిసిషన్ మెషీన్లను ఆవిష్కరించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు లోకేశ్ మెషీన్ టూల్స్ వెల్లడించింది. ఇప్పటి వరకూ ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర ఉపకరణాల కోసం దిగుమతులపై ఆధారపడవలసి వస్తోందని, దీనికి బదులుగా సొంతంగా ఇటువంటి అధునాతన యంత్రాలను ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. ఏఎంటీడీసీకి ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ మెషీన్ టూల్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ’ గుర్తింపు ఉన్నట్లు వివరించింది.
మెటా భారత అధిపతిగా సంధ్యా దేవనాథన్
మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమిస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా వెల్లడించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ల మాతృ సంస్థ అయిన మెటా నుంచి ఇటీవల అజిత్ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలోకి సంధ్యను ఎంపిక చేశారు. సంధ్యా దేవనాథన్ 2016లో మెటాలో చేరారు. సింగపూర్, వియత్నాం వ్యాపారాలు, బృందాలతో పాటు ఆగ్నేయాసియాలో మెటా ఇ-కామర్స్ కార్యక్రమాల బాధ్యతలు చేపట్టారు. 2020లో ఇండోనేసియాకు వెళ్లి ఏపీఏసీ కోసం గేమింగ్ లీడ్‌గా పని చేస్తున్నారు. 2023 జనవరి 1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. మెటా ఏపీఏసీ వైస్ ప్రెసిడెంట్ డ్యాన్ నియరీ ఆధ్వర్యంలో ఆమె పనిచేయాల్సి ఉంటుంది.
సీఐఐ దక్షిణ ప్రాంత సదస్సులో కేటీఆర్
వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవటంపై వ్యాపార సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. నాణ్యత, వ్యయాల పరంగా గట్టి పోటీ ఇవ్వగలగాలన్నారు. సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ ప్రాంత విభాగం సమావేశం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. దాదాపు 19,000 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా క్లస్టర్, అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రమైన టీ-హబ్, ప్రొటోటైప్ కేంద్రమైన టీ-వర్క్స్ వంటి వినూత్నమైన సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు తెలిపారు. అటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇటు బయోటెక్నాలజీ రంగాలు విస్తరించిన ప్రత్యేకతా హైదరాబాద్‌కు దక్కుతుందని అన్నారు. దీనికి అదనంగా పటాన్‌చెరులో అతిపెద్ద మెడ్‌టెక్ పార్కు సిద్ధం అవుతోందని తెలిపారు. శ్వేత విప్లవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, మాంస ఉత్పత్తులు, వంట నూనెల విభాగంలోనూ క్రియాశీలకమైన పాత్ర పోషించటానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. ‘చైనా + 1’ మనకు గొప్ప అవకాశమని, దీన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించాలని వ్యాపార సంస్థలకు కేటీఆర్ సూచించారు.
2022లో భారత వృద్ధి 7 శాతమే: మూడీస్
ప్రస్తుత సంవత్సరం (2022)లో భారత వృద్ధి 7 శాతానికి పరిమితం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఈ సంస్థ గత మేలో వేసిన అంచనాల్లో వృద్ధి రేటు 8.8 శాతం కాగా, సెప్టెంబరులో 7.7 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరింత సవరించి 7 శాతానికి పరిమితం చేసింది అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడం వల్ల భారత ఆర్థిక కార్యకలాపాలు కూడా నెమ్మదిస్తాయనే అంచనాను గ్లోబల్ మ్యాక్రో అవుట్‌లుక్ 2023 - 24లో మూడీస్ వ్యక్తం చేసింది. 2023లో భారత వృద్ధి మరింత నెమ్మదించి 4.8 శాతానికి చేరుతుందని, 2024లో మళ్లీ పెరిగి 6.4 శాతం అవుతుందని పేర్కొంది. మూడీస్ ప్రకారం 2021లో భారత జీడీపీ వృద్ధి 8.5 శాతం.
కంట్రోల్‌ఎస్ సీటీఓగా ఆశిష్ అహుజా
డేటా కేంద్రాలను నిర్వహించే హైదరాబాద్ సంస్థ కంట్రోల్‌ఎస్ కొత్త చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా ఆశిష్ అహుజాను నియమించింది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు, ఫ్రాన్స్ టెలికాం, టాటా కమ్యూనికేషన్లలోనూ ఆయన పనిచేశారు. ఇంటర్‌కనెక్ట్, డేటా కేంద్రాలు, సముద్ర కేబుళ్ల నిర్వహణ విభాగాల్లో అనుభవం కలిగిన అహుజా సేవలు, అంతర్జాతీయంగా తమ విస్తరణకు ఉపయోగపడతాయని కంట్రోల్‌ఎస్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు.
ఫోర్బ్స్ మహిళా పారిశ్రామికవేత్తల్లో భారత్ నుంచి ముగ్గురు
ఫోర్బ్స్ ఆసియా నవంబరు మ్యాగజైన్‌లో ముగ్గురు భారత మహిళా వ్యాపారవేత్తలకు చోటు దక్కింది. మూడేళ్ల పాటు కరోనా పరిణామాలు ఇబ్బంది పెట్టినా, వ్యాపారాలను తమదైన వ్యూహాలతో ముందుకు నడిపించిన 20 మంది ఆసియా మహిళలతో ఓ జాబితాను ఫోర్బ్స్ ప్రచురించింది. భారత్ నుంచి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ సోమా మండల్; ఎమ్‌క్యూర్ ఫార్మా భారత వ్యాపార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్; హొనాసా కన్జూమర్ సహ-వ్యవస్థాపకులు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఘజల్ అలఘ్ ఈ జాబితాలో నిలిచారు. ఆస్ట్రేలియా, చైనా, దక్షిణ కొరియా, ఇండొనేషియా, జపాన్, సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్ దేశాల మహిళలూ ఈ జాబితాలో ఉన్నారు.
ఎంసీఎక్స్ ఛైర్మన్‌గా హర్ష్ కుమార్ భన్వాలా
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) ఛైర్మన్‌గా నాబార్డ్ మాజీ అధిపతి హర్ష్ కుమార్ భన్వాలాను నియమించారు. హర్ష్ కుమార్ 2013 డిసెంబరు 18 నుంచి 2020 మే 27 వరకు నాబార్డ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఎంసీఎక్స్ ట్రేడింగ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.55 గంటల వరకు జరగనుంది. ఈ సమయాలు 2023 మార్చి 10 వరకు అమలవుతాయి.
అత్యుత్తమ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్
భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం.. దేశీయంగా తొలి స్థానంలో ఉన్న రిలయన్స్, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. 800 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితా అగ్రస్థానంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ నిలిచింది. తర్వాతి స్థానాలను మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ దక్కించుకున్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్ 13వ స్థానంలో, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 14, డెకాథ్లాన్ 15వ స్థానాల్లో నిలిచాయి.
‣ మెర్సిడెస్ బెంజ్, కోక-కోలా, హోండా, యమహా, అరామ్‌కో వంటి సంస్థల కన్నా రిలయన్స్ మెరుగైన స్థానం పొందింది.
‣ ఈ జాబితాలో మన దేశం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (137వ స్థానం), బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూప్ (240), హీరో మోటో (333), ఎల్ అండ్ టీ (354), ఐసీఐసీఐ బ్యాంక్ (365), హెచ్‌సీఎల్ టెక్ (455), ఎస్‌బీఐ (499), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ఉన్నాయి.
రిలయన్స్ స్వతంత్ర డైరెక్టర్‌గా కేవీ కామత్
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దిగ్గజ బ్యాంకర్ కేవీ కామత్ (74) నియమితులయ్యారు. అయిదేళ్ల పాటు ఆయన స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఆర్‌ఐఎల్ పేర్కొంది.
‣ ఐఐఎం అహ్మదాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కామత్, 1971లో ఐసీఐసీఐలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1988లో ఆసియా అభివృద్ధి బ్యాంక్‌లో చేరి పలు ఏళ్ల పాటు పనిచేశారు. 1996లో తిరిగి ఐసీఐసీఐలో ఎండీ, సీఈఓగా చేరారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనం తర్వాత బ్యాంక్ ఎండీ, సీఈఓగా వ్యవహరించారు. 2009లో ఎండీ, సీఈఓగా పదవీ విరమణ చేసినప్పటికీ.. 2015 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్‌గా కొనసాగారు. 2002లో ధీరుభాయ్ అంబానీ హఠాన్మరణం తరవాత ముకేశ్, అనిల్ అంబానీల మధ్య ఆస్తుల పంపకంలో కామత్ కీలక పాత్ర పోషించారు. రిలయన్స్ ఆర్థిక సేవల విభాగం రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు.
ట్విటర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా శ్రీరామ్ కృష్ణన్
భారతీయ అమెరికన్ అయిన శ్రీరామ్ కృష్ణన్‌ను ట్విటర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ నూతన యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు. చెన్నైకు చెందిన కృష్ణన్ ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన యాండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ16జడ్)లో సాధారణ భాగస్వామి. ఆయన అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. బిట్‌స్కి, హాప్కిన్, పాలీవర్క్ బోర్డుల్లోనూ ఉన్నారు. తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎమ్ ఇంజినీరింగ్ కళాశాల, అన్నా యూనివర్సిటీ (బీటెక్)లలో చదివిన కృష్ణన్ తన వృత్తి జీవితాన్ని మైక్రోసాఫ్ట్‌లో మొదలుపెట్టారు.