సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సమీర్ శర్మ
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సమీర్ శర్మ ముఖ్యమంత్రికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. ఆయనను ఈ పోస్టుతో పాటు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి పూర్తికాల ఛైర్మన్‌గానూ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా ఆయన మూడేళ్ల పాటు పని చేస్తారంది. నవంబరు 21న జరిగిన సెలక్షన్ కమిటీకి వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ అయ్యేందుకు అవసరమైన అర్హతలన్నీ సమీర్ శర్మకే ఉన్నాయని నిర్ధారించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక ముఖ్యమంత్రికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సమీర్ శర్మ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీ హోదాలో సీఎం కార్యాలయంలో పని చేస్తారని తెలిపింది.
ఆయన విధులివీ..
ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా అన్నిశాఖలు, సంబంధిత అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించి, కార్యక్రమాలను అమలు చేస్తారు. కాలానుగుణంగా ముఖ్యమంత్రికి నివేదికలు, ప్రజంటేషన్లు ఇస్తారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికల సాధనలో అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరును అంచనా వేయడంలో ముఖ్యమంత్రికి సహకారం అందిస్తారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెంచేందుకు అన్ని శాఖల అధికారులతో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు.
ప్రణాళిక శాఖ సీఈవోగా విజయ్ కుమార్
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ సీఈవో, ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్ కుమార్‌ను ప్రభుత్వం పునర్నియమించింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, అదే పదవిలో మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త సీఎస్ జవహర్‌రెడ్డి
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. 2024 జూన్ వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు. వైయస్‌ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలోని కసునూరు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక కీలక శాఖల్లో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా కెరీర్ మొదలైంది. మహబూబ్‌నగర్, నర్సాపురం అసిస్టెంట్ కలెక్టర్‌గా, భద్రాచలం ఐటీడీఏ పీవోగా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. హైదరాబాద్‌లో మెట్రో వాటర్ సర్వీసెస్ ఎండీగా, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వీసీగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 అక్టోబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖలకు ముఖ్య కార్యదర్శిగా, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తితిదే కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించారు. ఆ తర్వాత జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన, 2021 నవంబరు 20 నుంచి ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
సీఎంవోకి పూనం మాలకొండయ్య
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్‌రెడ్డిని కొత్త సీఎస్‌గా నియమించడంతో ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను సీఎంవోకు పంపింది. ఆమె ప్రస్తుతం వ్యవసాయ, సహకారశాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఆమె చూస్తున్న శాఖల్ని పూర్తి అదనపు బాధ్యతగా అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా పని చేస్తున్న మధుసూదన్‌రెడ్డికి అప్పగించింది. ఇప్పటివరకు పూనం పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న పశు సంవర్థక, మత్స్య, పరిశ్రమలు (చక్కెర) శాఖల బాధ్యతనూ మధుసూదన్‌రెడ్డికే అప్పగించింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను పాఠశాల విద్యా శాఖకు బదిలీ చేసింది. మ్రార్కెటింగ్ శాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్ ఎండీగా ఉన్న పి.ఎస్.ప్రద్యుమ్నను రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఐఎఫ్‌ఎస్ అధికారి రాహుల్ పాండేని మార్కెటింగ్ శాఖ కమిషనర్‌గా నియమించింది. మార్క్‌ఫెడ్ ఎండీ పోస్టును ఆయనకు పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. ఐఎఫ్‌ఎస్ అధికారి బి.మహ్మద్ దివాన్ మైదీన్‌ను గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది.
జపాన్ బ్యాంకుతో ఏపీఈడీబీ ఒప్పందం
ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే జపాన్, తూర్పు ఆసియా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు జపాన్‌కు చెందిన ఎంయూఎఫ్‌జీ బ్యాంకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో సృజన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఏపీఈడీబీ, బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఎంయూఎఫ్‌జీ బ్యాంకు సహకారంతో రాష్ట్రానికి పునరుత్పాదక ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికే సుమారు జపాన్‌కు చెందిన 25 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. విశాఖలో 2023 మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు - 2023ను పురస్కరించుకుని జపాన్‌లో రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నామని సీఈవో సృజన పేర్కొన్నారు.
పాతపట్నం జాతీయ రహదారి, ఓఎన్‌జీసీ ‘యు’ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచం నలుమూలలా వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. విశాఖలో రూ.10,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని రిమోట్ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, చేపల రేవు నిర్మాణం, రాయపూర్ - విశాఖపట్నం మధ్య 6 వరుసల ఆర్థిక కారిడార్, విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు రహదారి విస్తరణ, శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు పైపులైను ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పాతపట్నం నుంచి నర్సన్నపేట వరకు నిర్మించిన జాతీయ రహదారి, తూర్పు తీరంలో ఓఎన్‌జీసీ ‘యు’ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
ఏపీలోని 6 మండలాల్లో భూగర్భ జలాల అధిక తోడకం
రాష్ట్రంలోని 667 మండలాలకుగానూ ఆరు మండలాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడుతున్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా విడుదల చేసిన ‘డైనమిక్ గ్రౌండ్‌వాటర్ రీసోర్సెస్ ఆఫ్ ఇండియా 2022’ నివేదిక పేర్కొంది. ఇందులో పల్నాడు జిల్లా వెల్దుర్తి, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు, హిందూపురం, రోళ్ల, గాండ్లపెంట మండలాలున్నాయి. ఇవి కాకుండా మరో 5 మండలాలు క్రిటికల్, 19 మండలాలు సెమీ క్రిటికల్, 598 మండలాలు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 39 మండలాలను లవణ ప్రభావ ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలిపింది. ‘రాష్ట్రంలోని 667 మండలాల్లో ప్రధానంగా కఠిన శిలలు (హార్డ్‌రాక్స్) ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాలు, భూగర్భ జలాల నాణ్యత తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లోని భూగర్భ జల వనరులను వేర్వేరుగా అంచనా వేశాం. రాష్ట్రంలో విభిన్న రకాల రాళ్లున్నాయి. 80% ప్రాంతంలో కఠిన శిలలు ఉంటే, మిగిలిన 20% ప్రాంతంలో మెత్తని రాళ్లున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 27.23 శతకోటి ఘనపు మీటర్ల జలం భూగర్భంలోకి వెళ్తోంది. అందులో 25.86 శతకోటి ఘనపు మీటర్ల నీటిని తోడుకోవచ్చు. ప్రస్తుతం ఏటా 7.45 శతకోటి ఘనపు మీటర్లనే వాడుకుంటున్నారు. మొత్తం తోడుకోవడానికి సిద్ధంగా ఉన్న జలాల్లో ఇది 28.81 శాతానికి సమానం. 2020 నాటి అంచనాలతో పోలిస్తే వార్షిక భూగర్భ జలాల రీఛార్జి 24.1 శతకోటి ఘనపు మీటర్ల నుంచి 27.22 శతకోటి ఘనపు మీటర్లకు పెరిగింది. అందుకు కారణం అధిక వర్షపాతం, ఉపరితల భూగర్భ నిల్వలు పెరగడం, భూగర్భ జల వినియోగం తగ్గడం, నీటి సంరక్షణ, సూక్ష్మ సేద్యం వినియోగం పెరగడమే. దీనివల్ల నీటిని అధిక స్థాయిలో తోడే మండలాల సంఖ్య 23 నుంచి 6కి తగ్గిపోయింది’ అని ఈ నివేదిక పేర్కొంది. లవణీకరణ ప్రభావం బాపట్ల, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మండలాల్లో అధికంగా ఉంది.
ఆస్కితో ఏపీఎండీసీ ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పునర్‌వ్యవస్థీకరణకు అవసరమైన సహకారం కోసం ఆ సంస్థ హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)తో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఆస్కి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆస్కి రిజిస్ట్రార్ ఓపీ సింగ్, ఏపీఎండీసీ వీజీ వెంకట రెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఏపీఎండీసీ పనితీరును ఆస్కి అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి టి.విజయ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని
సాక్షి టీవీ ఛానల్‌లో పని చేస్తున్న సీనియరు పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాల రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు క్యాబినెట్ హోదా వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఛైర్మన్ శ్రీనాథ్‌రెడ్డి పదవీ కాలం నవంబరు 7తో ముగియనుందని, అదే రోజు నుంచి కొమ్మినేని నియామకం అమలులోకి వస్తుందని వివరించారు.
ఎస్‌ఈబీకి ప్రత్యేక లోగో
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు (సెబ్) రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లోగో ఖరారు చేసింది. 98 మిల్లీమీటర్ల పొడవు, 76 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ లోగో ఉంటుంది. దీని వెనుక భాగమంతా జెట్ బ్లాక్ రంగులో ఉంటుంది. శ్రద్ధ (డిలిజెన్స్), స్వచ్ఛత (కండొర్), శౌర్యం (వలోర్) పదాలతో పాటు సత్యమేవ జయతే నినాదాన్ని ఈ లోగోలో పొందుపరిచారు. ఈ మేరకు లోగోను ఖరారు చేస్తూ డీజీపీ, హోదా రీత్యా సెబ్ కార్యదర్శి కేవీ రాజేంద్రనాథరెడ్డి ఉత్తర్వులిచ్చారు.