సదస్సులు/h1>



షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం

అఫ్గానిస్థాన్‌ తీవ్రవాదులకు అడ్డాగా మారకూడదని భారత్‌ స్పష్టం చేసింది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాలకు చెందిన తీవ్రవాద వ్యతిరేక చర్యల నిపుణులతో భారత్‌ అధ్యక్షతన దిల్లీలో సమావేశం నిర్వహించారు.
ప్రాంతీయంగా చెలరేగుతున్న కల్లోలాలను సమర్థంగా ఎదుర్కోవడం ఎలాగన్న అంశంపై జరిగిన సదస్సులో అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు.
తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్‌ ఇప్పటికీ గుర్తించలేదు. అక్కడ పౌర సమాజంతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని కోరుతోంది.
ఎస్‌సీవోలో రష్యా, చైనా, భారత్, పాకిస్థాన్, కిర్గిజ్‌ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉబ్జెకిస్థాన్‌లు సభ్యులుగా ఉండగా, అఫ్గానిస్థాన్‌ పరిశీలక దేశంగా వ్యవహరిస్తోంది.
పొరుగు దేశాల సహకారంతోనే అఫ్గాన్‌లో శాంతి, అభివృద్ధి సాధ్యం’ అని స్పష్టం చేశారు.

రెండో అంతర్జాతీయ కొవిడ్‌ శిఖరాగ్ర సదస్సు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను సంస్కరించాల్సి ఉందనీ, టీకాలకు, మందులకు అనుమతి ఇవ్వడానికి ఆ సంస్థ అనుసరించే పద్ధతిని క్రమబద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు.
అలాగే వాణిజ్య సంబంధ మేధా హక్కుల (ట్రిప్స్‌)కు సంబంధించిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలనూ సరళతరం చేయాలన్నారు.
కరోనా మహమ్మారిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్వహించిన రెండో అంతర్జాతీయ వర్చువల్‌ సదస్సులో మోదీ ప్రసంగించారు.
అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్మాణానికి డబ్ల్యూహెచ్‌వోను సంస్కరించాలని పిలుపు ఇచ్చారు.

ఇండియా - నార్డిక్‌ శిఖరాగ్ర సదస్సు

పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్‌ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతలు, శుద్ధ ఇంధనం, పెట్టుబడులు, ఆర్కిటిక్‌లో పరిశోధనలు తదితర అంశాల్లో బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని సూచించారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్‌ దేశాల ప్రధాన మంత్రులు పాల్గొన్నారు. కరోనా తదనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజం, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ నార్డిక్‌ దేశాల ప్రధాన మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత సంప్రదింపులు జరిగాయి.

ఐరోపా పర్యటనలో భాగంగా మూడో రోజున ప్రధాని మోదీ కోపెన్‌హాగెన్‌లో నార్డిక్‌ దేశాల నేతలతో చర్చలు జరిపారు. తొలుత నార్వే ప్రధాని జోనాస్‌ గార్‌ స్టారెతో భేటీ అయ్యారు. ‘‘సముద్ర వాతావరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, శుద్ధ ఇంధనం, అంతరిక్ష పరిశోధనలు, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్‌ విధానం అమలులో నార్వే కీలక భాగస్వామిగా ఉంద’’ని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

స్వీడన్‌ ప్రధాని మగ్దలెనా ఆండర్సోన్‌తో భేటీలో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార సాంకేతికతలు, నవోన్వేషణలు తదితర రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

ఐస్‌లాండ్‌ ప్రధాని కత్రిన్‌ జాకబ్స్‌దతిర్‌తో జియోథర్మల్‌ ఎనర్జీ, ఆర్థిక సహకారం, సముద్ర వాతావరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, మృత్స్య పరిశ్రమ, ఆహారశుద్ధి, విద్య, డిజిటల్‌ విశ్వవిద్యాలయాలపై మోదీ చర్చించారు. భారత్‌ - ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంస్థ (ఈఎఫ్‌టీఏ) సంప్రదింపులను వేగవంతం చేయడంపైనా నేతలిద్దరూ మాట్లాడుకున్నారు.

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారున్‌తో జరిగిన సంప్రదింపుల్లో డిజిటల్‌ భాగస్వామ్యం, పెట్టుబడుల అనుసంధానత, వాణిజ్య భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. టెలికం మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ రూపాంతరీకరణ తదితర రంగాల్లో భారత కంపెనీలతో జట్టు కట్టాల్సిందిగా ఫిన్లాండ్‌ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్‌ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షికమైన పలు అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాల గురించి వారు చర్చించుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగానూ మోదీ పర్యటనకు ప్రాధాన్యమేర్పడింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది అయిదోసారి. 2019 ఆగస్టు, 2017 జూన్, 2015 నవంబరు, 2015 ఏప్రిల్‌ నెలల్లో మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. రెండు దేశాలు 1998 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి.


ఇండియా - డెన్మార్క్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సు

భారత దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు హరిత సాంకేతికతలు, శీతల గిడ్డంగులు, షిప్పింగ్, పోర్టులు, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టకుంటే ఈ భారీ అవకాశాలను కోల్పోతారని డెన్మార్క్‌ వ్యాపారవేత్తలకు స్పష్టం చేశారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ఇండియా - డెన్మార్క్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు. డానిష్‌ పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన మరో సమావేశంలో మోదీతో పాటు డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్, యువరాజు ఫెడెరిక్‌ పాల్గొన్నారు.

ఆఫ్రికా దేశాలతో బంధానికి ప్రాధాన్యం

గబోన్‌ సహా ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలకు భారత్‌ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా గబోన్‌ రాజధాని లిబ్రెవిల్లేకి చేరుకున్న ఉప రాష్ట్రపతి ఆ దేశాధ్యక్షుడు అలీబొంగో ఒండింబాతో సమావేశమయ్యారు. అనంతరం ఆ దేశ ప్రధాని రోజ్‌ క్రిస్టైన్‌ ఒసౌకా రపోండాతోను అత్యున్నత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై మాట్లాడారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రతులను ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రికి అందజేశారు.

వైద్య పర్యాటకానికి కేంద్రంగా దేశం: రాష్ట్రపతి కోవింద్‌

వైద్య పర్యాటకానికి కీలక గమ్యస్థానంగా దేశం శరవేగంగా అవతరిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. ఆరెస్సెస్‌ మద్దతు ఉన్న ‘ఆరోగ్య భారతి’ ఆధ్వర్యంలో ‘ఒకే దేశం.. ఒకే ఆరోగ్య వ్యవస్థ’ సదస్సును దిల్లీలో ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దిల్లీ వంటి చోట్లయితే స్థానికుల కంటే ఇరుగుపొరుగు దేశాల నుంచే ఎక్కువ మంది రోగులు వైద్య సేవల్ని పొందుతున్నారని, ప్రపంచంలో అందుబాటు ధరలో వైద్య సదుపాయాలు మనవద్ద లభిస్తుండడం దీనికి కారణమని పేర్కొన్నారు.

క్వాడ్‌ సదస్సు 2022

భారత్‌ - అమెరికాల మధ్య విశ్వసనీయమైన భాగస్వామ్య బంధం ఉందనీ, ప్రపంచంలో శాంతి - సుస్థిరతలు పరిఢవిల్లేలా మానవాళికి మేలు చేసేలా ఈ మిత్రత్వం కొనసాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జపాన్‌లో క్వాడ్‌ సదస్సులో పాల్గొన్న ఇరువురు నేతలు విడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వర్థమాన, స్వేచ్ఛాయుత, అనుసంధానిత, సురక్షితమైన ప్రపంచం కోసం కలిసి పనిచేస్తామని నేతలిద్దరూ ప్రతినబూనారు.

సంక్లిష్టమైన, అధునాతనమైన సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల భద్రత సంస్థల మధ్య సహకారాన్ని (ఐసీఈటీ) పెంచేలా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చర్చల అనంతరం భారత్, అమెరికా ప్రకటించాయి. రెండు దేశాల జాతీయ భద్రత మండళ్లు దీనికి నేతృత్వం వహిస్తాయి. కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, 5జి, 6జి, బయోటెక్, అంతరిక్షం, సెమీ కండక్టర్లు వంటి రంగాల్లో ప్రభుత్వం - పరిశ్రమల మధ్య అనుసంధానతకు ఇదొక వేదికగా నిలుస్తుంది. టీకాలపై పరిశోధనలకు కార్యాచరణ కార్యక్రమాన్ని 2027 వరకు పొడిగించాలని కూడా రెండు దేశాలూ నిర్ణయించాయి. 34 దేశాల సంయుక్త సైనిక దళాల్లో భారతదేశం చేరబోతోందని శ్వేతసౌధం ప్రకటించింది. రక్షణ రంగంలో సంయుక్త భాగస్వామ్యాన్ని, ఇరు దేశాలకూ ప్రయోజనం కల్పించే ఆర్థిక ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు, ఆరోగ్య రంగంలో భాగస్వామ్యానికి కలిసి పనిచేయనున్నట్లు భారత్, అమెరికా తెలిపాయి. శుద్ధ ఇంధన రంగంలో, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వినియోగంలో, కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగస్వామ్యాన్ని పరిపుష్టం చేసుకోనున్నట్లు వెల్లడించాయి. భారత సాంకేతికత నవకల్పనల హబ్‌లలో 25 సంయుక్త పరిశోధన ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అమెరికా తెలిపింది.


ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సమావేశం

కొవిడ్‌ టీకా తయారీ, విశ్వవ్యాప్త పంపిణీ విషయంలో భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నేతలు ప్రశంసలు కురిపించారు. వ్యాక్సిన్‌ సమధర్మానికి, విస్తృత పంపిణీకి భారత్‌ నమూనా అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సమావేశంలో కొవిడ్‌ పరీక్షలు, చికిత్సలు, టీకాలు, పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మహమ్మారిని నియంత్రణలోకి తెచ్చేందుకు ఇప్పుడు అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని సక్రమంగా, న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సి ఉందని తెలిపారు.

రష్యాతో లావాదేవీలు ఆపేయండి: జెలెన్‌స్కీ

రష్యాపై గరిష్ఠ స్థాయిలో ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో మాట్లాడారు. రష్యాతో అన్ని రకాల వాణిజ్య లావాదేవీలను నిలిపివేయాలని, ఆ దేశానికి చెందిన బ్యాంకులను కూడా నిషేధించాలని కోరారు. రష్యాను వీడి ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా వల్ల మరో యుద్ధం సంభవించకుండా ప్రపంచం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రష్యాపై ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌కు చెందిన ఐదుగురు మహిళా ఎంపీలు కోరారు.

దావోస్‌ డబ్ల్యూఈఎఫ్‌లో పలు సంస్థలతో సీఎం జగన్‌ సమావేశాలు

దావోస్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్‌) భవిష్యత్తుకు సాక్ష్యంగా ఆరోగ్య వ్యవస్థలు (ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టం) అనే అంశంపై నిర్వహించిన పబ్లిక్‌ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మన దేశానికి చెందిన హీరో గ్రూపు ఛైర్మన్, ఎండీ పవన్‌ ముంజల్, టెక్‌ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీతో ఏపీ పెవిలియన్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఏపీ రాష్ట్రంలో రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్‌లో ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తరఫున ఆశిష్‌ రాజ్‌వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా కాలుష్యం లేని ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ సంస్థ అంగీకరించింది.


దావోస్‌లో తొలిరోజు నాలుగు సంస్థలతో కేటీఆర్‌ ఒప్పందాలు

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలి రోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన లులూ గ్రూపు రూ.500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. స్పెయిన్‌కు చెందిన కీమోఫార్మా రూ.100 కోట్లతో తమ రెండో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రకటించింది. స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్, బీమా సంస్థ స్వీస్‌రే హైదరాబాద్‌లో తమ కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ-కామర్స్‌ సంస్థ మీషో కూడా రాష్ట్ర రాజధానిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్‌ సంస్థ మీషో వ్యవస్థాపకుడు విదిత్‌ ఆత్రే మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం మేరకు హైదరాబాద్‌లో తమ కార్యాలయ ఏర్పాటుకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రిటైల్‌ వ్యాపారులకు సేవలందిస్తామని తెలిపారు.

దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జపాన్‌కు చెందిన ష్యుజిత్సు సంస్థ సీఈవో తకహితో తొకిట, బ్రిటిష్‌ మైక్రోబయాలజిస్టు పీటర్‌ పియోట్‌ తదితరులు పాల్గొన్నారు. పవర్‌ పాయింటు ప్రజెంటేషన్‌ ద్వారా తెలంగాణ విధానాలను కేటీఆర్‌ వారికి వివరించారు.


ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)

కాలుష్యం లేని ఇంధనం, పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్‌ తెలిపారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో మొదటి రోజు ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలపై డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ష్వాప్‌కు సీఎం వివరించారు. అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వైద్య రంగంలో వినూత్న ఆవిష్కరణలపై కలిసి పనిచేసే విషయమై డబ్ల్యూఈఎఫ్‌ ఆరోగ్యం - వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో చర్చించారు. రవాణా రంగంలో మార్పులపై డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టెయినబులిటీ విభాగాధిపతి ఫెడ్రో గోమెజ్‌తో చర్చించారు. ఈ రంగంలో సహకారానికి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఎస్‌వీజీ ప్రధాని రాల్ఫ్‌తో భారత రాష్ట్రపతి కోవింద్‌ సమావేశం

సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనడిన్స్‌ (ఎస్‌వీజీ)తో భారత్‌ భాగస్వామ్యానికి సార్వత్రిక సోదర స్ఫూర్తి ఆధారమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ కరీబియన్‌ ద్వీప దేశంతో భారత్‌కు బలమైన బంధముందని చెప్పారు. సెయింట్‌ విన్సెంట్‌ ప్రధాని రాల్ఫ్‌ గొన్సల్‌వేస్‌తో కలిసి కోవింద్‌ స్థానిక ‘కాల్డెర్‌ రోడ్‌’కు ‘ఇండియా డ్రైవ్‌’ అని పేరు పెట్టారు. కరీబియన్‌ ద్వీప సముదాయంలోని రెండు దేశాల పర్యటనలో భాగంగా కోవింద్‌ ఆ దేశ గవర్నర్‌ జనరల్‌ డేమ్‌ సుసాన్‌ డౌగన్, ప్రధాని గొన్సల్‌వేస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమాచార సాంకేతికత, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ఈ దేశాన్ని సందర్శించిన భారత తొలి రాష్ట్రపతి ఆయనే. ఈ సందర్భంగా భారత్, ఎస్‌వీజీల మధ్య పన్నుల వసూళ్ల సమాచార మార్పిడి, సహకారం, పాత కార్టర్‌ కమ్యూనిటీ సెంటర్‌ పునరుద్ధరణకు సంబంధించి రెండు ఒప్పందాలు జరిగాయి.

వేదాంత గ్రూపు ఛైర్మన్‌తో కేటీఆర్‌ సమావేశం

ప్రపంచ ప్రసిద్ధ వేదాంత గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌తో మంత్రి కేటీఆర్‌ లండన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు సంస్థను ఆహ్వానించారు. పవర్‌ పాయింటు ప్రజెంటేషన్‌ ద్వారా ఆయన తెలంగాణ పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్, భూబ్యాంకు, మానవ వనరుల లభ్యత, మౌలిక వసతుల గురించి వివరించారు. త్వరలోనే తమ బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పెట్టుబడుల అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని అనిల్‌ అగర్వాల్‌ హామీ ఇచ్చారు.

యూకేఐబీసీ రౌండ్‌ టేబుల్‌ సదస్సులో కేటీఆర్‌

ప్రపంచంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ)దే భవిష్యత్తు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ విప్లవంలో తెలంగాణ ముందుందని, అత్యుత్తమ ఈవీ విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇప్పటికే 24కి పైగా సంస్థలు తెలంగాణలో ఈవీ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయని చెప్పారు. బ్రిటన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు మంత్రి యూకే - ఇండియా వాణిజ్య మండలి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో మాట్లాడారు. ‣ అనంతరం మంత్రి లండన్‌లోని ప్రసిద్ధ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌)తో పనిచేసేందుకు లండన్‌కు చెందిన పియర్సన్‌ కంపెనీ అంగీకరించింది. హెచ్‌ఎస్‌బీసీ ప్రతినిధులు పాల్‌ మెక్‌ పియర్సన్, బ్రాడ్‌హిల్‌బర్న్, థామస్‌ లాయిడ్‌ గ్రూప్‌ ఎండీ నందిత సెహగల్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్‌ కళాశాలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఔషధ విశ్వవిద్యాలయం ఏర్పాటు, అందులో ఉన్నత విద్యా కోర్సులు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణతో కళాశాల కలిసి పనిచేస్తుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, కింగ్స్‌ కళాశాల ఆరోగ్య, జీవశాస్త్రాల విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షుడు రిచర్డ్‌ ట్రెంబాత్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.

ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న తెలంగాణ

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని, బ్రిటన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ తమ సంస్థలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ అనుకూల విధానాలు, అత్యున్నత మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లభ్యత తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నాయని, బ్రిటన్‌ పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున రాష్ట్రానికి తరలి రావాలని కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌ చేరుకున్న ఆయన బ్రిటన్, భారత్‌ వాణిజ్య మండలి (యూకేఐబీసీ) ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సదస్సులో ప్రసంగించారు. బ్రిటన్‌ వాణిజ్య మంత్రితో భేటీ బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రణిల్‌ జయవర్దనేతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యాలు, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.

నేపాల్‌ ప్రధాని దేవ్‌బాతో మోదీ సమావేశం

నేపాల్‌ ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఆహ్వానం మేరకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించారు. అంతర్జాతీయ బౌద్ధ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. దిల్లీలోని అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) సహకారంతో లుంబినీలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రానికి ఇరువురు నేతలు శంకుస్థాపన చేశారు. ‣ నేపాల్‌ ప్రధాని దేవ్‌బాతో మోదీ లుంబినీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య, అనుసంధాన, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై సమాలోచనలు జరిపారు. సాంస్కృతిక, విద్యా రంగంలో సహకారానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఆరు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. డాక్టర్‌ అంబేడ్కర్‌ బౌద్ధ అధ్యయనాల పీఠాన్ని స్థాపించేందుకు లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయంతో, ఐసీసీఆర్‌ భారత అధ్యయనాల పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు త్రిభువన్‌ విశ్వవిద్యాలయంతో భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్‌) ఎంవోయూలు కుదుర్చుకుంది. మాస్టర్స్‌ స్థాయిలో ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌ కోసం కాఠ్‌మాండూ విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్‌ లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాయి. 2014 నుంచి మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది ఐదోసారి.

5 వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ సదస్సు

దేశంలో 1920 నాటి తీవ్రమైన అసమానతలు వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు. అయిదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ సదస్సును దిల్లీలోని హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 30 ఏళ్లలో పెరగని శతకోటీశ్వరుల సంఖ్య కొవిడ్‌ నెలకొన్న రెండేళ్లలోనే ఎక్కువైందన్నారు. 1991లో దేశంలో బిలియన్‌ డాలర్లు ఉన్నవారు ఒక్కరు కూడా లేరనీ, ప్రస్తుతం అలాంటివారు 166 మంది ఉన్నారనీ, వీరి మొత్తం ఆస్తుల విలువ రూ.794 బిలియన్‌ డాలర్లని సాయినాథ్‌ విశ్లేషించారు. గ్రామాల్లో మూడింట రెండొంతుల కుటుంబాలు నెలకు రూ.5 వేల కంటే తక్కువ ఆదాయంతో నెట్టుకొస్తున్నాయని, 90% కుటుంబాల ఆదాయం రూ.10 వేలలోపే ఉందని వివరించారు.

వైద్య రంగంలో 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత ఎంతో కీలకం

వైద్య ఆరోగ్య రంగంలో 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత ఎంతో కీలకంగా మారిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2020 నాటికి ఈ మార్కెట్‌ విలువ 1.7 బిలియన్‌ డాలర్లు ఉండగా 2027 నాటికి 7.1 బిలియన్‌ డాలర్లకు చేరుతుందన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మెడికల్‌ డివైసెస్, ఇంప్లాంట్‌లో 3డీ ప్రింటింగ్‌పై మొదటి సారి జరిగిన జాతీయ సదస్సుకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఎన్‌సీఏఎం) ఈ సమావేశాన్ని నిర్వహించింది. వైద్య చికిత్సల్లో 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత ఆవిష్కరణలకు తెలంగాణ ప్రోత్సాహమిస్తున్నట్లు మంత్రి వివరించారు.

అంతర్జాతీయ విత్తన పరీక్షల ఏజెన్సీ (ఇస్టా) కాంగ్రెస్‌ సదస్సు

రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించనంతవరకు వ్యవసాయ పరిశోధనలు, రైతుల పంట పెట్టుబడి వృథా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన అంతర్జాతీయ విత్తన పరీక్షల ఏజెన్సీ (ఇస్టా) కాంగ్రెస్‌ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు ఐదు శాతమైతే భారతీయ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 12-15% శాతంతో 5వ స్థానంలో ఉంది. 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా కాంగ్రెస్‌ అంతర్జాతీయ సదస్సు రాష్ట్రంలో విత్తనరంగం బలోపేతానికి ఎంతో దోహదం చేసిందని తెలిపారు.

ద్వైపాక్షిక చర్చల్లో భారత్‌ ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడి కీలక నిర్ణయం

వివిధ రంగాల్లో కొనసాగుతున్న భారత్, ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవాలని, మార్గదర్శన పత్రాన్ని రూపొందించుకొని ముందుకు సాగాలని ఇరు దేశాల అగ్రనేతలు నిర్ణయించారు. రెండు దేశాల స్నేహ బంధం ప్రపంచ శాంతికి, సుసంపన్నత్వానికి బాటలు వేయాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆకాంక్షించారు. పారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో ఇద్దరు నేతలు ముఖాముఖీ భేటీతో పాటు విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆధునిక రక్షణ సాంకేతికతలతో పాటు అంతరిక్ష పరిశోధనలు, సముద్ర వాతావరణ ఆర్థిక వ్యవస్థ, పౌర అణు కార్యక్రమం, సౌర విద్యుత్తు, రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితరాలపై మోదీ, మెక్రాన్‌ల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.