రాష్ట్రీయం -తెలంగాణ



అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ‌

ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది. పారిశ్రామిక రంగం రాష్ట్రానికి జీవగర్రగా మారింది. విద్య, వైద్యరంగాల్లోనూ ముందంజ వేస్తోంది అంటూ రాష్ట్ర సర్కారు తన ఎనిమిదేళ్ల ప్రస్థానాన్ని కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రగతి నివేదికను విడుదల చేసింది.

ఆసరా పథకం కింద 38 లక్షల మందికి పింఛన్లు అందిస్తోంది. 11.44 లక్షల మంది పేద వధువులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సాయం చేస్తోంది. ఆత్మగౌరవంతో జీవించేందుకు 2.81 లక్షల రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తోంది. తెల్లరేషన్‌ కార్డుపై ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ, 7.3 లక్షల మంది గొల్ల, కురుమలకు యూనిట్ల పంపిణీ, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారులు, గీత, చేనేత, రజక, నాయీ బ్రాహ్మణులు, అర్చకులు, ఇమాం, మౌజన్‌లకు ప్రభుత్వ వేతనాలు, కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ, ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పథకాలు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా నిరంతర ఉచిత విద్యుత్‌, రైతుబంధు, బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించడంతో పాటు గోదాముల నిర్మాణం చేపట్టింది. పంట దిగుబడుల పెంపు దిశగా అన్నదాతలను ప్రోత్సహిస్తోంది. కరోనా సమయంలో రైతులు పండించిన పలు ఉత్పత్తులను కొనుగోలు చేసింది. మొదటి దఫా రూ. లక్ష లోపు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేసిన ప్రభుత్వం రెండో దఫాలో రూ. 50 వేలను మాఫీ చేసింది.

ఎనిమిదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాలు పరుగులు తీశాయి. ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా నిలిచింది. అంకుర సంస్థల వేదికలైన టీహబ్‌, వీహబ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పేరెన్నికగన్న కంపెనీలైన యాపిల్‌, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తృతపరిచాయి. సేల్స్‌ఫోర్స్‌, ఉబర్‌, మైక్రాన్‌, స్టేట్‌ స్ట్రీట్‌, ఫియట్‌ క్రిజ్లర్‌, మాస్‌, ఇంటెల్‌, ప్రావిడెన్స్‌, యూబీఎస్‌, ఎంఫసిస్‌, పెప్సీ, లిగాటో, ఎఫ్‌5లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం- నాస్కామ్‌ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌హబ్‌గా హైదరాబాద్‌ నిలిచింది. నాస్కామ్‌ అంచనాల ప్రకారం జాతీయస్థాయిలో 2020-21 సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య 1.38 లక్షలు. దీని ప్రకారం.. ఐటీ రంగంలో జాతీయస్థాయిలో 33 శాతం ఉపాధి కల్పనకు తెలంగాణ భాగస్వామ్యాన్ని అందించింది. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులను సమీకరిస్తున్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం.. ఎస్సీల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుంది. ఉద్యమంలా సాగుతున్న ఈ పథకం రాబోయే రోజుల్లో దేశానికి దారి చూపుతుంది. ఎస్సీలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది.

ఉద్యోగుల సంక్షేమంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కంటే మెరుగైన వేతనాలు అందుతున్నాయి.

హైదరాబాద్‌ విశ్వసనీయ నగరంగా రూపుదిద్దుకుంది. ఎన్నో ప్రామాణికాల్లో అత్యుత్తమ స్థానంలో ఉంది. నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. మురుగునీటి పారుదల మెరుగైంది. అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలను గణనీయంగా తగ్గించాయి.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించింది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, గృహ వినియోగ రంగాలకు నిరంతర విద్యుత్‌ అందుతోంది. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా వాటి రూపురేఖలు మారాయి. రహదారి వ్యవస్థ మెరుగుపడింది. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయి. పర్యాటక రంగంలోనూ తెలంగాణ పురోగమిస్తోంది.

వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రభుత్వం ఐటీ పరిశ్రమను విస్తరింపజేస్తోంది. తెలంగాణ ఐటీ ఎగుమతుల మొత్తం విలువ రూ. 1,45,522 కోట్లు. 2020-21 గణాంకాల మేరకు కొత్తగా 46 వేల పై చిలుకు ఉద్యోగాలను ఏటేటా పెంచుతూ దాదాపు 6,28,615 మంది ఈ రంగంలో పనిచేసేందుకు దోహదపడింది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ రంగంలో 1.33 లక్షల పోస్టులు భర్తీ అయ్యాయి. పరిశ్రమలు, సేవలు, ఇతర రంగాల ద్వారా ప్రైవేటు రంగంలో ఆ సంఖ్య 25 లక్షలకు పైనే ఉంది. తాజాగా ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది.

నీటిపారుదల రంగంలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతి పెద్దదైన కాళేశ్వరం బహుళ దశల భారీ ఎత్తిపోతలను ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, దేవాదుల తదితర పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. ఒకప్పటి కరవు జిల్లా పాలమూరు పచ్చలహారంగా మారింది. నాగార్జున సాగర్‌, శ్రీరామ సాగర్‌, నిజాం సాగర్‌ తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. మిషన్‌ కాకతీయతో 46,531 చెరువులను పునరుద్ధరించగా 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. తద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. చేపల పెంపకం ఊపందుకుంది. జీవవైవిధ్యం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు, వంకల పునరుజ్జీవం కోసం రూ. 3,825 కోట్ల వ్యయంతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతోంది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తిపోతల, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం రూ.1.52 లక్షల కోట్లు వెచ్చించి.. సాగునీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచింది.

వైద్య, ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం మరింత అందుబాటులోకి తెచ్చింది. రాజధాని నలుమూలలా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానాలను ప్రారంభించి.. వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగనిర్ధారణ, ఆక్సిజన్‌ పడకలతో పాటు నలభై ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో గుండె శస్త్రచికిత్సల కోసం క్యాథ్‌ ల్యాబ్‌ సేవలు ప్రారంభించింది. జిల్లా ఆసుపత్రుల్లోనూ మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం గరిష్ఠ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు, ప్రసవానంతరం ఇంటికి చేర్చేందుకు 300 అమ్మఒడి వాహనాలు సేవలందిస్తున్నాయి. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, శిశువులకు ప్రతిరోజూ పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారం అందుతోంది. మాతా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 12 వేలు, ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 13 వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు, సమీక్ష సమావేశాల ద్వారా వైద్యసిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.


సింగరేణి చరిత్రలోనే 6.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి ‌

సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో 6.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌ రికార్డును కూడా సాధించినట్లు ప్రకటించింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 2021 - 22లో 9,353 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో అత్యుత్తమ ఉత్పత్తి శాతం (పి.ఎల్‌.ఎఫ్‌.)తో అగ్రస్థానంలో నిలిచిందని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ వివరించారు.

విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ‌

విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014 జూన్‌ 2 నుంచి 2022 ఏప్రిల్‌ 1 వరకు 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెరిగిందని పేర్కొంది. ప్రజలకు నాణ్యమైన కరెంటును 24 గంటలూ అందిస్తున్న ఏకైక రాష్ట్రమని తెలిపింది. తలసరి కరెంటు వినియోగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 23,667 మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఆర్టిజన్‌ పేరుతో నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రానికి రూ.4,200 కోట్ల పెట్టుబడులతో కుదిరిన ఒప్పందాలు‌

పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. దీని ద్వారా రూ.4200 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించినట్లు ఆయన వెల్లడించారు. 45 ప్రసిద్ధ సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. దావోస్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు దానిని సందర్శించి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. కొన్ని సంస్థలు పెట్టుబడులు ప్రకటించగా, మరికొన్ని విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. ఇంకొన్ని పరస్పర సహకారానికి అంగీకరించాయి.

కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు గూగుల్‌తో ఒప్పందం‌

అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకూ కృషి చేస్తున్నారు. ఇందుకోసం దేశంలోనే తొలి కాలుష్య రహిత కూడలి (గ్రీన్‌ ట్రాఫిక్‌ జంక్షన్‌)ని రూపొందించనున్నారు. తర్వాత క్రమంగా మొత్తం 150 ట్రాఫిక్‌ జంక్షన్లను పర్యావరణమిత్ర కూడళ్లుగా మార్చనున్నారు. ఇందుకోసం గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కూడళ్ల వద్ద సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విషవాయువులను తగ్గించనున్నారు.

ఇజ్రాయెల్‌లోని హైఫాలో గూగుల్‌ 2021 అక్టోబరులో నాలుగు చోట్ల గ్రీన్‌ ట్రాఫిక్‌ జంక్షన్లను ఏర్పాటు చేసింది. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను ఉపయోగించింది. సిగ్నలింగ్‌లో మార్పులు చేశారు. వారం రోజుల్లోనే ఆ నాలుగు కూడళ్లలో 2 శాతం ట్రాఫిక్‌ నిలచిపోవడాలు తగ్గాయని గుర్తించారు. రియోడిజెనిరోలోనూ ఈ తరహాలో ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దేశంలో తొలిసారిగా గ్రీన్‌ ట్రాఫిక్‌ జంక్షన్‌ ప్రారంభించేందుకు గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. పర్యావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌ నిలచిపోవడాలు గణనీయంగా తగ్గనున్నాయని వివరించారు.


తెలంగాణలో రూ.1400 కోట్లతో భారీ పరిశ్రమ స్థాపనకు హ్యుందాయ్‌ ఒప్పందం‌

తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు హ్యుందాయ్‌ రూ.1400 కోట్లతో, జీఎంఎం ఫాడ్యులర్‌ రూ.50 కోట్లతో, ఈఎంపీఈ రూ.50 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు కోసం, విఖ్యాత ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్‌ రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఆర్థిక సేవల కోసం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గతిశక్తి సమూహం (మొబిలిటీ క్లస్టర్‌) వ్యాలీలో రూ.1400 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమను స్థాపించాలని ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో హ్యుందాయ్‌ సీఐవో యంగ్‌చోచి తమ ప్రతినిధి బృందంతో రాష్ట్ర మంత్రి కేటీ రామారావును కలిశారు.

అమెరికా అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్‌ తెలంగాణలో డిజిటల్‌ భాగస్వామ్యంపై మంత్రి కేటీఆర్‌ సమక్షంలో దావోస్‌లో జరిగిన ఒప్పందంపై సంస్థ వైస్‌ ఛైర్మన్, వృద్ధి విభాగం అధ్యక్షుడు మైఖేల్‌ ఫ్రోమ్యాన్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు సంతకాలు చేశారు.

జర్మనీకి చెందిన డీఎఫ్‌ఈ సంస్థ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ప్రతిభా కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందంపై సంస్థ సీఈవో మార్టి హెడ్‌మ్యాన్‌ తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు సంతకాలు చేశారు.


రూ.1000 కోట్లతో తెలంగాణలో ‘స్టాడ్లర్‌’ రైల్వేకోచ్‌ల తయారీ పరిశ్రమ‌

స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ తెలంగాణలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ రైల్వేకోచ్‌ల కర్మాగారం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతున్న ఫెర్రింగ్‌ ఫార్మా, విద్యుత్‌ వాహనాల సంస్థ ష్నైడర్‌లు తమ కొత్త యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు చేసుకున్నాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో దావోస్‌లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఎంవోయూలపై సంతకాలు చేశారు.

ప్రముఖ బయోటెక్‌ ఔషధ సంస్థ ‘రోచ్‌’ ఛైర్మన్‌ క్రిస్టోఫ్‌ ఫ్రాంజ్‌ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోటెక్‌ పార్కు, వైద్యపరికరాల పార్కుతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి ఔషధనగరిని ప్రశంసించారు. హిటాచి భారత్‌ విభాగం ఎండీ భరత్‌కౌశల్‌తో భేటీ సందర్భంగా సంస్థ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కోరారు. ప్రముఖ విద్యా సాంకేతిక సంస్థ బైజుస్‌ సహ వ్యవస్థాపకులు రవీంద్రన్, గోకుల్‌నాథ్‌ దివ్యలు తెలంగాణలో తమ కేంద్రాలను స్థాపిస్తామని కేటీఆర్‌కు చెప్పారు. ప్రసిద్ధ టీకాల తయారీ సంస్థ, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీదారైన సీరమ్‌ ఇండియా కంపెనీ సీఈవో అదర్‌ పూనావాలా దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టీకాల ఆధారిత పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, పరిశ్రమల ఏర్పాటుపై ఈ సందర్భంగా చర్చించారు.


రూ.500 కోట్లతో తెలంగాణలో పైపుల పరిశ్రమకు ఒప్పందం‌

బెల్జియంకు చెందిన అలియాక్సిస్‌ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్లతో పైపులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తుల భారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, అలియాక్సిస్‌ కంపెనీ సీఈవో కోయిన్‌ స్టికర్‌ దీనిపై సంతకాలు చేశారు. ‘ఆశీర్వాద్‌’ పేరుతో పైపులను ఉత్పత్తి చేయనున్న ఈ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

కార్యాలయ స్థల వినియోగంలో తెలంగాణకు అగ్రస్థానం ‌

కార్యాలయ స్థల వినియోగంలో బెంగళూరును అధిగమించి హైదరాబాద్‌ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఇది తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తక్కువ అద్దెలు, స్థిరమైన వ్యాపార అవకాశాలు, హైదరాబాద్‌ను కార్యాలయ స్థల వినియోగ మార్కెట్‌ చార్టులో అగ్రస్థానాన నిలబెట్టాయని వెల్లడించారు.

టీహబ్‌తో ఫాల్కన్‌ ఎక్స్‌ ఒప్పందం ‌

సిలికాన్‌ వ్యాలీలో జరిగే ‘గ్లోబల్‌ స్టార్టప్‌ ఎమర్షన్‌ ప్రోగ్రాం’ కోసం అమెరికాకు చెందిన ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థతో టీహబ్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌లోని స్టార్టప్‌ వ్యవస్థాపకులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించేందుకు, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వీలు కలగనుంది. ఐదు వారాల ప్రాజెక్టులో భాగంగా కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఉంటాయని టీహబ్‌ సీఈవో ఎం.ఎస్‌.ఆర్‌. తెలిపారు.తొలి మూడు స్థానాల్లో నిలిచిన స్టార్టప్‌లకు ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థ నుంచి లక్ష అమెరికా డాలర్ల వ్యూహాత్మక నిధులు అందుతాయన్నారు.

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం దేశంలోని వివిధ హైకోర్టుల్లో సేవలందిస్తున్న అయిదుగురు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని, ఒక ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. ‣ గువాహటి మాతృహైకోర్టుగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తెలంగాణ హైకోర్టులో 2021 అక్టోబరు 22 నుంచి సేవలందిస్తున్నారు. 1964 ఆగస్టు 2న గువాహటిలో జన్మించిన ఆయన అక్కడే ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. 1991 మార్చి 20న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2010 సెప్టెంబరు 6న సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా పొందారు. 2011 జులై 21న అస్సాం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2011 అక్టోబరు 17న గువాహటి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2013 మార్చి 20న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 అక్టోబరు 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. తర్వాత 2021 అక్టోబరు 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ ఉన్నారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్‌ భూయాన్‌ అస్సాం అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు.

హైదరాబాద్‌లో కొలియర్స్, శూరిఫై సంస్థల కార్యాలయాల ప్రారంభోత్సవంలో కేటీఆర్‌‌

రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాలూ వ్యాపారానికి ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అక్కడా పెట్టుబడులకు ముందుకు రావాలని పలు వ్యాపార సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మైహోం ట్విట్జా ఐటీ భవనంలో స్థిరాస్తి, పెట్టుబడుల సలహాల సంస్థ కొలియర్స్, బీమా సేవల సంస్థ శూరిఫై ల్యాబ్, టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల కార్యాలయాలను విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. తాము పోటీపడేది బెంగళూరుతో కాదని హాంకాంగ్, సింగపూర్, ఇతర ప్రపంచ స్థాయి నగరాలతోనేనని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సాంకేతిక సంస్థలకు హైదరాబాద్‌ కేంద్రం‌

సాంకేతిక సంస్థలకు దేశంలోనే అత్యంత అనుకూల నగరం హైదరాబాద్‌ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజధానిలోని రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ప్రముఖ గోల్ఫ్‌ క్రీడల కంపెనీ కాల్‌ అవే డిజిటల్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన క్వాల్‌కం, నోవార్టిస్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు తమ రెండో అతిపెద్ద కేంద్రాలను, అమెజాన్‌ 3.1 మిలియన్‌ చదరపు అడుగుల్లో అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలో ఆరంభించాయన్నారు. కాల్‌ అవే కూడా వాటి సరసన చేరిందని తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్‌‌

తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ అమలులో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునే విధంగా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ వ్యక్తిగత ఆరోగ్య రిపోర్ట్‌ యాప్‌ను ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో పాటు టి-డయోగ్నోస్టిక్స్‌ మినీ హబ్‌ను హైదరాబాద్‌లోని నార్సింగిలో జరిగిన ఓ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.

నూకల శాతం నిర్ధారణకు పది జిల్లాల్లో టెస్ట్‌ మిల్లింగ్‌ కోసం సీఎఫ్‌టీఆర్‌ఐకు బాధ్యతలు‌

యాసంగి ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మార్చటం ద్వారా వచ్చే నూకల శాతాన్ని నిర్ధరించేందుకు టెస్ట్‌ మిల్లింగ్‌ చేసే బాధ్యతను తమిళనాడులోని తంజావూరులో ఉన్న సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ)కి అప్పగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన సీఎఫ్‌టీఆర్‌ఐకి టెస్ట్‌మిల్లింగ్‌ బాధ్యత అప్పగించాలన్న యోచనతో ఇటీవల ఆ సంస్థకు లేఖ రాసింది. అక్కడి నుంచి అధికారుల బృందం హైదరాబాద్‌ వచ్చి కమిటీ ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించింది. ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లా నుంచి ఒకటి లేదా రెండు మిల్లుల్లో టెస్ట్‌ మిల్లింగ్‌ చేయించనున్నారు.

డ్రాగన్‌ ఫలాలతో ఉప ఉత్పత్తుల తయారీ ‌

సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఏర్పాటు చేసిన ఉద్యాన ప్రదర్శనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త (అగ్రానమిస్ట్‌) మనస్వినిరెడ్డి డ్రాగన్‌ ఫలాలతో తయారు చేసిన వైన్, స్క్వాష్, జామ్, సబ్బులు, బామ్‌ ప్రదర్శనకు పెట్టారు. మనస్విని తమ పొలంలో పండుతున్న వాటిలో కేవలం 10 శాతం మాత్రమే ఇలా ఉప ఉత్పత్తులుగా తయారు చేస్తున్నానని ఆమె తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నామని, అవి వచ్చిన తర్వాత పంటలో 50 శాతాన్ని ఉత్పత్తులుగా తయారు చేస్తామన్నారు. వైన్‌ తయారీపై కర్ణాటక, మహారాష్ట్రలో 20 శాతం పన్ను ఉండగా, తెలంగాణలో మాత్రం 150 శాతం ఉందన్నారు.

దేశంలో మొదటి ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమ ప్రారంభం‌

తెలంగాణ విఖ్యాత సంస్థలకు నిలయంగా మారిందని, అన్ని రంగాల్లోని ప్రసిద్ధ బ్రాండ్లన్నీ ఇక్కడే తయారవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కొత్తూరులో నిర్మించిన రూ.200 కోట్ల లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. దేశంలో ఇది మొదటి లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమ. దీని ద్వారా లిక్విడ్‌ అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ తెలంగాణను కేంద్రస్థానంగా చేసుకొని రూ.1700 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించింది. కొత్తూరులోని 170 ఎకరాల స్థలంలో ఏరియల్, టైడ్, బేబీకేర్, విష్పర్, ఓలే, జిలెట్‌ వంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. దేశంలోని మొదటి లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమ ఏర్పాటు కావడం రాష్ట్రానికి గర్వకారణం. 2014లో సీఎం కేసీఆర్‌ సంస్థకు శంకుస్థాపన చేయగా ఎనిమిదేళ్లలో అది పెద్దఎత్తున అభివృద్ధిని సాధించిందని తెలిపారు.

తెలంగాణలో తొలి ఎల్‌ఈడీ టీవీల పరిశ్రమ ప్రారంభం‌

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ రంగంలో రాబోయే పదేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఉత్పత్తుల సమూహాలు (క్లస్టర్లు) ఉన్నాయని, మరో రెండు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల విస్తరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఎలక్ట్రానిక్స్‌ - సిటీలో రేడియంట్‌ అప్లయెన్సెస్‌ సంస్థ ఏర్పాటు చేసిన తొలి ఎల్‌ఈడీ టీవీల తయారీ పరిశ్రమను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తయారీ (మేకిన్‌ తెలంగాణ) నినాదంతో ఎల్‌ఈడీ టీవీలు తయారు చేస్తున్న రేడియంట్‌ సంస్థ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోంది.