సర్వేలు



ప్రపంచ ఆహార సంక్షోభం: ఐక్యరాజ్య సమితి నివేదిక ‌

ప్రపంచంలో ఆహార కొరతను ఎదుర్కొనే ప్రజల సంఖ్య మరింత పెరగనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా నిరుడు పెరిగిపోయిందని తెలిపింది. సాయుధ సంఘర్షణలు, వాతావరణ వైపరీత్యాలు, కరోనా వైరస్‌ తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభం వల్ల 2021లో 53 దేశాల్లో 19.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతకు లోనయ్యారని ఐరాస నివేదిక పేర్కొంది. వీరిలో 4 కోట్ల మంది గత ఏడాదే అన్నార్తుల జాబితాలో కొత్తగా చేరారని వివరించింది. అంతర్జాతీయ ఆహార సంక్షోభంపై ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ, ఐరోపా సమాఖ్య (ఈయూ) సంయుక్తంగా వెలువరించిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. అఫ్గానిస్థాన్, కాంగో, ఇథియోపియా, నైజీరియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్‌ దేశాల ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారని నివేదిక తెలిపింది. సోమాలియాలో తీవ్ర అనావృష్టి, ద్రవ్యోల్బణం, సాయుధ సంఘర్షణలు కొనసాగుతున్నందున ఈ ఏడాది 60 లక్షల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవచ్చని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు గోధుమలు, వంట నూనెలు, ఎరువుల కోసం ఉక్రెయిన్, రష్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలూ యుద్ధంలో మునిగిపోయినందున సోమాలియాతో పాటు అనేక ఆఫ్రికా దేశాలను ఆహార సంక్షోభం చుట్టుముట్టనుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టాలనీ, రాబోయే పంట సీజనులో సంక్షుభిత ప్రాంతాల్లోని రైతులను ఆదుకోవడానికి సుమారు రూ.11,450 కోట్లు (అమెరికన్‌ డాలర్లలో 150 కోట్లు) కేటాయించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చింది.

ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో దిల్లీ ఎయిర్‌పోర్టుకి రెండో స్థానం‌

దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. సీట్ల సామర్థ్యం (బుకింగ్‌ జరిగినవి), దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పరంగా ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో రెండోదిగా అవతరించింది. యూకేకు చెందిన అఫీషియల్‌ ఎయిర్‌లైన్‌ గైడ్‌ (ఓఏజీ) సంస్థ ఈ రెండు అంశాలపై ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే పది విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 44,22,436 సీట్ల బుకింగ్‌తో అమెరికాలోని అట్లాంటా హార్ట్స్‌ఫీల్డ్‌ - జాక్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది. దుబాయి విమానాశ్రయాన్ని (33,54,527 సీట్లు) వెనక్కి నెట్టి 36,11,181 సీట్ల బుకింగ్‌ సామర్థ్యంతో దిల్లీ విమానాశ్రయం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మార్చిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అట్లాంటా, దుబాయి విమానాశ్రయాలు వరుసగా రెండు స్థానాల్లో ఉండగా, దిల్లీ విమానాశ్రయం మూడో స్థానంలో ఉంది. అలాగే కరోనాకు ముందు 2019 ఏప్రిల్‌లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 23వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5 నివేదిక‌

గత అయిదేళ్లలో దేశ సౌకర్యాల ముఖ చిత్రం మారిపోయింది. విలాసవంత వస్తువుల వినియోగం పెరిగి పోగా, ఇదే సమయంలో దారిద్య్రరేఖకు దిగువన ఉండే కార్డుల సంఖ్యలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5 గణాంకాలను 2015 - 16నాటి ఆరోగ్య సర్వే - 4తో పోల్చి చూస్తే దేశంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అయిదేళ్లలో ఫోన్లు, కంప్యూటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులేకపోయినా ఇంటర్నెట్‌ వినియోగం మాత్రం భారీగా పెరిగింది. అలాగే ఏసీ/కూలర్లు, ప్రెజర్‌కుక్కర్ల వాడకంతో పాటు ఫ్రిజ్, వాషింగ్‌ మిషన్ల వినియోగంలోనూ పెరుగుదల కనిపించింది. పట్టణ ప్రాంతాల్లో కలర్‌ టీవీ వాడకం గత అయిదేళ్లలో 86% దగ్గరే నిలిచిపోగా, అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 51.5% నుంచి 57.1%కి పెరిగిపోయింది. కాల క్రమంలో రేడియో, బ్లాక్‌ అండ్‌వైట్‌ టీవీ, ల్యాండ్‌లైన్లు, సైకిల్, ఎద్దుల బండ్ల వినియోగం తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్‌ ఉండటం వల్ల గడియారం వాడకం కూడా తగ్గిపోయింది. కంప్యూటర్‌ వాడకం కూడా అయిదేళ్లలో కేవలం 0.3% పెరిగింది. ఇళ్లలో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సౌకర్య, విలాసవంతమైన వస్తువులు లేని వారి నిష్పత్తి అయిదేళ్ల క్రితం 0.8% మేర ఉండగా ఇప్పుడు అది సగానికి సగం పడిపోయి 0.4%కి తగ్గిపోయింది. గత అయిదేళ్లలో ద్విచక్ర మోటారు వాహన వినియోగం 37.7 నుంచి 49.7%కి పెరిగింది. ఇదే సమయంలో కార్లు వినియోగించే వారి నిష్పత్తి 1.5% మాత్రమే పెరిగింది. గత అయిదేళ్లలో ఎలాంటి వాహన సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య 5.3%మేర తగ్గింది. దేశంలో బీపీఎల్‌ కార్డులున్న కుటుంబాల సంఖ్య 2015 - 16లో 38.6% మేర ఉండగా, 2019 - 21నాటికి అది 45.1%కి చేరింది. దీన్ని బట్టి దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

జాతీయ కుటుంబ ఆరోగ్య (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) - 5 సర్వే‌

దేశంలో స్త్రీ పురుషులు చట్టబద్ధ వయసు రాకముందే పెళ్లి చేసుకోవడం ఇంకా కొనసాగుతూనే ఉందని 2019 - 21 మధ్య చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) - 5 నిగ్గుతేల్చింది. 18-29 ఏళ్ల వయోవర్గంలోని యువతుల్లో 25 శాతం మంది, 21-29 ఏళ్ల వారిలో 15 శాతం పురుషులు కనీస చట్టబద్ధ వయసు రాకముందే పెళ్లాడినట్లు సర్వేలో వెల్లడైంది. భారత్‌లో ప్రస్తుతం కనీస వివాహ వయసు యువతులకు 18 ఏళ్లుగాను, యువకులకు 21 ఏళ్లుగాను ఉంది. దీన్ని ఇకపై ఉభయులకూ 21 ఏళ్లుగా నిర్ణయించాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. గర్భనిరోధక విధానాలను పాటించాల్సిన బాధ్యత మహిళలదేనని దేశంలో 35.1% మంది పురుషులు భావిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5 వెల్లడించింది. ఈ విధానాలను పాటించే స్త్రీలలో విచ్చలవిడితనం పెరగడానికి అవకాశం ఉంటుందని 19.6% పురుషులు అభిప్రాయపడినట్లు తెలిపింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌ - 5 సర్వే జరిగింది. 6.37 లక్షల కుటుంబాలకు చెందిన 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులను సర్వే చేశారు.

సీసీపీఐ సూచికల్లో 10వ స్థానంలో భారత్‌‌

వాతావరణ మార్పులపై పనితీరు సూచిక (క్లైమేట్‌ చేంజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ - సీసీపీఐ)లో భారత్‌ 10వ స్థానంలో నిలిచింది. మెరుగైన పనితీరు కనబర్చకపోవడంతో 1, 2, 3 ర్యాంకులు ఏ దేశానికీ రాలేదని నీతి ఆయోగ్‌ తెలిపింది. డెన్మార్క్‌ 4, స్వీడన్‌ 5, నార్వే 6, బ్రిటన్‌ 7, మొరాకో 8, చిలీ 9వ స్థానంలో నిలిచాయి. వాతావరణ పరిరక్షణకు 63 దేశాలు తీసుకుంటున్న చర్యలను విశ్లేషించి ‘నూతన వాతావరణ సంస్థ, వాతావరణ కార్యాచరణ నెట్‌వర్క్‌ ఇంటర్నేషనల్‌’, జర్మన్‌వాచ్‌ అనే సంస్థలు సీసీపీఐని ప్రకటించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, ఇంధన వినియోగం, వాతావరణ విధానం, కర్బన ఉద్గారాలు తదితర అంశాల్లో పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులిచ్చారు.

ఇంధన సామర్థ్య సూచికలో తొలి రెండు స్థానాల్లో కర్ణాటక, రాజస్థాన్‌

రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక (స్టేట్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ ఇండెక్స్‌)లో కర్ణాటక, రాజస్థాన్‌ వరసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయని నీతి ఆయోగ్‌ ప్రకటించింది. ‘ఇంధనం - వాతావరణ సూచిక - రౌండ్‌ 1’ పేరుతో వెలువరించిన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ 13, తెలంగాణ 15వ స్థానంలో నిలిచాయి. పనితీరు ఆధారంగా రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా నీతి ఆయోగ్‌ విభజించింది. పనితీరు బాగున్న తొలి 10 రాష్ట్రాలున్న మొదటి గ్రూప్‌లో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. తొలి గ్రూప్‌లో ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలున్నాయి. పరిశ్రమలు, మున్సిపాలిటీలు, సంస్థాగత ఇంధన వినియోగ సామర్థ్యంపై రాష్ట్రాల విధానాలను విశ్లేషించి ఈ ర్యాంకులను ప్రకటించింది.

సీసీ కెమెరాల్లో తెలంగాణదే అగ్రస్థానం‌

పోలీసు శాఖ ఆధునికీకరణలో తెలంగాణ ప్రశంసనీయమైన స్థానంలో ఉంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా సిబ్బంది సంఖ్యతో పోల్చుకున్నప్పుడు పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా వాహనాలు ఉన్నది కూడా ఇక్కడే. ఇక స్నేహపూర్వక పోలీసింగ్‌లో తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలో పోలీసు సిబ్బంది సంఖ్య, ఖాళీలు, మౌలిక వసతులు, అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి బోర్డ్‌ ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్డీ) ‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌’, ‘స్మార్ట్‌ పోలీసింగ్‌’ల పేరుతో తాజాగా రెండు నివేదికలను విడుదల చేసింది. 2021 జనవరి 1 నాటికి దేశంలోని పోలీసు బలగాల స్థితిగతులను ఇందులో వివరించింది.

‣ దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 12 కమిషనరేట్లు ఉండగా తొమ్మిదింటితో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

‣ రాష్ట్రంలో మంజూరైన పోలీసు సిబ్బంది సంఖ్య 82,613 కాగా ప్రస్తుతం 59,073 మంది పనిచేస్తున్నారు.

‣ మహిళా పోలీసుల సంఖ్య 4,742. మొత్తం పోలీసు సిబ్బందిలో వీరి వాటా 8.03. (జాతీయ సగటు 10.49.)

‣ రాష్ట్రంలో ప్రతి 636.96 మంది జనాభాకు ఒక పోలీసు చొప్పున ఉన్నారు. అలాగే ప్రతి 3940.11 మంది మహిళలకు ఒక మహిళా పోలీసు ఉన్నారు.


తెలంగాణలోని 14 జిల్లాల్లో తగ్గిన భూగర్భ జలమట్టం ‌

తెలంగాణ రాష్ట్రంలో 2021 ఏప్రిల్‌లో భూగర్భ జల మట్టంతో పోల్చితే 2022 ఏప్రిల్‌లో 14 జిల్లాల్లో తగ్గుదల నమోదైంది. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ నివేదిక ప్రకారం.. 2021 ఏప్రిల్‌తో పోల్చినప్పుడు గరిష్ఠంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 1.90 మీటర్ల మట్టం, కనిష్ఠంగా వరంగల్‌ జిల్లాలో 0.03 మీటర్ల తగ్గుదల నమోదైంది. జోగులాంబ గద్వాల 1.43 మీటర్లు, వనపర్తి 1.09 మీటర్లు మట్టం తగ్గిన జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర సగటును పరిశీలిస్తే గతేడాది భూ ఉపరితలం నుంచి మట్టం 9.02 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది 8.73 మీటర్లు నమోదైంది. 0.29 మీటర్ల పెరుగుదల నమోదైంది. గరిష్ఠంగా జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 3.97 మీటర్లు, కనిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0.06 మీటర్లు మట్టం పెరిగింది. మొత్తం 19 జిల్లాల్లో మట్టం పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్‌లో రాష్ట్ర సాధారణ వర్షపాతం 878 మి.మీటర్లకు 1145 మి.మీటర్లు నమోదైంది. సాధారణం కన్నా 30 శాతం అధికంగా నమోదైనట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో మాత్రం -1 శాతం తక్కువ నమోదయింది. అంటే ఈ జిల్లా సాధారణ వర్షపాతం 1128 మి.మీటర్లకు గాను 1112 మీటర్లు కురిసింది.

వైద్య సాయం అందుకోకుండానే 2020లో 45% మరణాలు ‌

దేశంలో 2020లో మరణించిన 82 లక్షల మందిలో 45% మందికి అంతిమ ఘడియల్లో ఎలాంటి వైద్యసాయం అందలేదని ‘రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఆర్‌జీఐ) నివేదిక స్పష్టం చేసింది. నిపుణులైన వైద్య నిపుణుల సాయాన్ని పొందుతూ మరణించిన వారు కేవలం 1.3% మందే ఉన్నారని తెలిపింది. కరోనా వల్ల ఎందరు చనిపోయారనే వివరాలను మాత్రం ప్రస్తావించలేదు. వైద్య సాయం పొందకుండా చనిపోయినవారు 2019లో 34.5% ఉన్నారు. 2020లో శిశు మరణాల్లో 23.4% పట్టణ ప్రాంతాల్లో, 76.6% గ్రామాల్లో చోటు చేసుకున్నాయి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5

రాష్ట్రంలో ప్రసవ కోతలు (సిజేరియన్లు) పెరిగిపోతున్నాయి. దేశం మొత్తమ్మీద తెలంగాణ ప్రైవేటు దవాఖానాల్లో అత్యధికంగా శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. మరోవైపు సర్కారు ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5 ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలుపుకొని సగటున 60.7 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో అధికంగా 82.4 శాతం, తక్కువగా కుమురం భీం జిల్లాలో 27.2 శాతం నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు కోతల రాష్ట్ర సగటు 44.5 శాతం కాగా, అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతున్నాయి. ప్రభుత్వ సగటు కన్నా ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం 48.6 శాతం, జగిత్యాలలో 64.9 శాతం, కరీంనగర్‌లో 66.8 శాతం నమోదయ్యాయి. అదే కర్ణాటకలో 28 శాతం, మహారాష్ట్రలో 31 శాతం మాత్రమే సిజేరియన్లు జరుగుతున్నాయి.

భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా‌

భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. గతంలో ఈ స్థానంలో ఉన్న చైనాను 2021 - 22లో అమెరికా అధిమించింది. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతం అయిందనడాన్ని ఇది సూచిస్తోందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారత్‌ - అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

2013 - 14 నుంచి 2017 - 18 వరకు భారత్‌తో చైనా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా కొనసాగింది. దీనికంటే ముందు యూఏఈ ఆ స్థానంలో ఉండేది. ఇప్పుడు అమెరికా ఆ స్థానానికి చేరింది. 2021 - 22లో 72.9 బి.డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య విలువతో యూఏఈ మూడో అతి పెద్ద భాగస్వామిగా నిలిచింది. సౌదీ అరేబియా (42.85 బి.డాలర్లు), ఇరాక్‌ (34.33 బి.డాలర్లు), సింగపూర్‌ (30 బి.డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


రూ.149.95 కోట్ల ఆదాయంతో డీఎంకేకు తొలి స్థానం‌

వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా అట్టే పెట్టుకున్న పార్టీల్లో వైకాపా దేశంలో మొదటి స్థానంలో నిలవగా, వచ్చిన ఆదాయం కంటే 1,584.16% ఎక్కువగా ఖర్చు చేసి తెదేపా తొలి స్థానంలో నిలిచింది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయవ్యయ లెక్కల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వైకాపాకు రూ.107.89 కోట్ల విరాళాలు రాగా, ఆ పార్టీ కేవలం రూ.80 లక్షలే ఖర్చు చేసింది. ఇదే సంవత్సరం తెదేపాకు రూ.3.25 కోట్ల విరాళాలు రాగా రూ.54.76 కోట్లు వెచ్చించింది. తెరాసకు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా రూ.22.34 కోట్లు వెచ్చించింది.

2020 - 21లో మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు రూ.529.41 కోట్ల ఆదాయం వచ్చింది. 2019 - 20లో వచ్చిన రూ.800.26 కోట్లతో పోల్చితే ఇది 34.96% తక్కువ.

ఇందులో రూ.149.95 కోట్లతో డీఎంకే తొలి స్థానంలో నిలిచింది. వైకాపా (రూ.107.99 కోట్లు), బీజేడీ (రూ.73.34 కోట్లు), జేడీయూ (రూ.65.31 కోట్లు), తెరాస (రూ.37.65 కోట్లు) వరుస స్థానాల్లో నిలిచాయి. తెదేపా 11వ స్థానానికి పరిమితమైంది.


తెలంగాణలో తగ్గిన శిశు మరణాల రేటు ‌

ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు (ఇన్‌ఫాంట్‌ మోర్టాలిటీ రేట్‌ - ఐఎంఆర్‌) రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వేయి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా 2020 గణాంకాల్లో 21కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నమూనా నమోదు విధానం (శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ - ఎస్‌ఆర్‌ఎస్‌)’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారాన్ని పొందుపర్చింది. శిశు మరణాల రేటుతో పాటు జనన, మరణాల రేటు, సహజ వృద్ధి రేటు తదితర సమాచారాలనూ అందించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 121, పట్టణాల్లో 103 చొప్పున మొత్తంగా 224 కేంద్రాల్లో నమూనాలను సేకరించారు. వీటిలో గ్రామీణ తెలంగాణలో 1.58 లక్షల జనాభాను, పట్టణాల్లో 0.56 లక్షల జనాభా కలుపుకొని మొత్తం 2.14 లక్షల జనాభా నుంచి ఈ నమూనాలను నమోదు చేశారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (28) కంటే తెలంగాణ (21)లో తక్కువగా నమోదైంది.

2020లో ప్రమాదాలు 18.46%, మరణాలు 12.83% తగ్గుదల‌

కరోనా కారణంగా 2020లో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఆ ఏడాది దేశంలో ప్రమాదాల్లో 18.46%, మరణాల్లో 12.83% తగ్గుదల కనిపించింది. గాయపడ్డవారిలోనూ 22.8%మేర క్షీణత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తగ్గుదల కనిపించింది. కేంద్ర రవాణా, రహదారుల శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక - 2020 ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 1,003 ప్రమాదాలు చోటు చేసుకోగా, 360 మంది చనిపోయారు. 954 మంది గాయపడ్డారు. అంటే ప్రతి గంటకు జరిగే 42 ప్రమాదాల్లో 15 మంది ప్రాణాలు కోల్పోతుండగా, 40 మంది క్షతగాత్రులుగా మిగులుతున్నట్లు తేలింది.

2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 1,31,714 మంది చనిపోగా, 3,48,279 మంది గాయపడ్డారు.

మొత్తం ప్రమాదాల్లో 31.8% జాతీయ రహదారుల్లో, 24.8% రాష్ట్ర రహదారుల్లో, 43.4% ఇతర రహదారుల్లో జరిగాయి.

మరణాలు సంభవించిన ప్రమాదాల్లో 35.9% జాతీయ రహదారులు, 25% రాష్ట్ర రహదారులు, 39.1% ఇతర రహదారుల్లో చోటు చేసుకున్నాయి.

అత్యధిక ప్రమాదాలు తమిళనాడులో, అత్యధిక మరణాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి.

అత్యధిక ప్రమాదాల జాబితాలో ఏపీ 7, తెలంగాణ 8వ స్థానంలో నిలిచాయి.

2019తో పోలిస్తే 2020లో ఏపీలో 11.3%, తెలంగాణలో 11.1% ప్రమాదాలు తగ్గాయి.


తెలంగాణకు రూ.11,965 కోట్ల ఎఫ్‌డీఐలు‌

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) ఆకర్షించడంలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. దేశంలోకి గత ఆర్థిక సంవత్సరం (2021 - 22)లో రూ.4,37,188 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అందులో అత్యధికంగా 37.46% వాటాతో కర్ణాటక తొలి స్థానంలో నిలవగా 26.78% పెట్టుబడులు సాధించి మహారాష్ట్ర రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ ఏడాది మొత్తం ఎఫ్‌డీఐల్లో ఈ రెండు రాష్ట్రాల వాటానే 64.24% ఉండడం విశేషం. అదే సమయంలో తెలంగాణకు రూ.11,965 కోట్ల (2.73%) పెట్టుబడులు వచ్చాయి. దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు తర్వాత స్థానాన్ని, దేశవ్యాప్తంగా 7వ స్థానాన్ని తెలంగాణ దక్కించుకొంది. మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 92.74% ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల వాటా కలిపి 7.25%కి పరిమితమైనట్లు కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తెలిపింది.

గృహ పరిశుభ్రత విషయంలో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో భారతీయులదే ముందంజ ‌

గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు ఇటీవలి కాలంలో బాగా మెరుగయ్యారని తాజా సర్వే ఒకటి తేల్చింది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు దాదాపుగా ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులదే ముందంజ అని వెల్లడించింది. డైసన్‌ అనే ఓ టెక్నాలజీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 32,282 మందిపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 1,019 మంది భారతీయులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలివీ.. ‣ కరోనా మహమ్మారి భయంతో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లను తరచుగా శుభ్రం చేసుకున్నారు. 95% మంది ఇప్పటికీ అదే తీరుతో సాగుతున్నారు. ‣ భారత్‌లో 46% మంది గృహ పరిశుభ్రత విషయంలో మెరుగయ్యారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వారానికి 5-7 సార్లు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ‣ ప్రపంచవ్యాప్తంగా 40% మంది ఇంట్లో దుమ్ము కనిపించిన వెంటనే దాన్ని తొలగిస్తుండగా, భారత్‌లో అలాంటి వారి శాతం దాదాపు 33%గా మాత్రమే ఉంది. ‣ ఇళ్లలోని ధూళి వైరస్‌లను కూడా కలిగి ఉంటుందన్న సంగతి 22% మంది భారతీయులకు తెలియదు. ‣ ఇంట్లోని దుమ్ము అంటే మట్టి, ఇసుక మాత్రమే అని భారత్‌లో 35% మంది భ్రమపడుతున్నారు. ‣ భారతీయుల్లో 54% మంది తమ పరుపులను, 72% మంది కర్టెన్లను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి 90 లక్షల మరణాలు‌

కాలుష్యం కోరల్లో చిక్కి భారత్‌లో ఒక ఏడాది (2019)లోనే 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ‘లాన్సెట్‌’అధ్యయనం వెల్లడించింది. అన్ని రకాల కాలుష్యాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మరణాలు సంభవించినట్లు పేర్కొంది. జెనీవాలోని అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ సంస్థకు చెందిన రిచర్డ్‌ ఫుల్లర్‌ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. అధ్యయన బృందంలో చెన్నైకి చెందిన శ్రీరామచంద్ర యూనివర్సిటీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం డైరెక్టర్‌ కె.బాలకృష్ణన్‌ కూడా ఉన్నారు. ఈ మేరకు ‘ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ పత్రికలో వివరాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యాంశాలివీ.. ‣ 2019లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించిన మరణాల వల్ల 4.6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది. అది ప్రపంచ జీడీపీలో 6.2 శాతానికి సమానం. భారత్‌లో ఈ ఆర్థిక నష్టం జీడీపీలో 1 శాతానికి సమానం. ‣ 2019లో సంభవించిన కాలుష్య మరణాల్లో భారత్, చైనాలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.

2019 ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయం రూ.3,046 కోట్లు‌

రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం చేస్తున్న ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. 17వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు 2019లో ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి రూ.3,046 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేసింది. ఆ ప్రకారం.. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు జాతీయ పార్టీలు కలిసి రూ.2,378 కోట్లు, అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.668 కోట్లు ఖర్చు చేశాయి. భాజపా అన్ని పార్టీల కంటే అత్యధికంగా రూ.1,264 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం ఎన్నికల వ్యయంలో దీని వాటా 41.49%. కాంగ్రెస్‌ రూ.820 కోట్లు (26.92%) ఖర్చు చేసి రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిపి చేసిన వ్యయం రూ.227 కోట్లు. ఇందులో రూ.131 కోట్లతో తెదేపా తొలి స్థానంలో నిలవగా, రూ.86 కోట్ల వ్యయంతో వైకాపా రెండో స్థానాన్ని ఆక్రమించింది. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కేవలం రూ.71,961 ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) రూ.228 కోట్లు ఖర్చు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఒక్కో అభ్యర్థి సగటున రూ.50.85 లక్షలు ఖర్చు చేశారు. ఏపీలో సగటున ఒక్కో అభ్యర్థి రూ.30.50 లక్షలు, తెలంగాణలో రూ.48.61 లక్షలు ఖర్చు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది.

భారత్‌లో అసమానతల స్థితిగతులపై (ది స్టేట్‌ ఆఫ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా రిపోర్టు) నివేదిక‌

దేశంలోని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద పురోగతి కనిపించలేదు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ డెబ్రాయ్‌ విడుదల చేసిన ‘భారత్‌లో అసమానతల స్థితిగతులపై నివేదిక (ది స్టేట్‌ ఆఫ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా రిపోర్టు) ప్రకారం.. 15 ఏళ్లలో దేశంలో వైద్య ఆరోగ్య కేంద్రాల సంఖ్య 7.47% మాత్రమే పెరిగింది. 2005లో 1,72,608 మేర ఉన్న ఈ ఆరోగ్య కేంద్రాల సంఖ్య 2020 నాటికి 1,85,505కి చేరినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ 15 ఏళ్లలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, చండీగఢ్‌లలో ఆరోగ్య కేంద్రాల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 5,085 మేర తగ్గినట్లు పేర్కొంది. ‣ తొలి త్రైమాసికంలో గర్భిణులకు అందించే వైద్య సేవలు 2015 - 16 నుంచి 2019 - 21 మధ్యకాలంలో 58.6% నుంచి 70%కి చేరాయి. కాన్పు అయిన రెండు రోజుల్లోపు సగటున 79.1% మంది పిల్లలకు డాక్టర్లు, నర్సుల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 5, తెలంగాణ 10వ స్థానంలో ఉన్నాయి. ఇదే సమయంలో కాన్పు తర్వాత రెండు రోజుల్లోపు 78% మహిళలకు వైద్యసేవలు అందుతున్నాయి. ఈ విషయంలో ఏపీ 8, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి 90 లక్షల మరణాలు‌

కాలుష్యం కోరల్లో చిక్కి భారత్‌లో ఒక ఏడాది (2019)లోనే 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ‘లాన్సెట్‌’అధ్యయనం వెల్లడించింది. అన్ని రకాల కాలుష్యాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మరణాలు సంభవించినట్లు పేర్కొంది. జెనీవాలోని అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ సంస్థకు చెందిన రిచర్డ్‌ ఫుల్లర్‌ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. అధ్యయన బృందంలో చెన్నైకి చెందిన శ్రీరామచంద్ర యూనివర్సిటీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం డైరెక్టర్‌ కె.బాలకృష్ణన్‌ కూడా ఉన్నారు. ఈ మేరకు ‘ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ పత్రికలో వివరాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యాంశాలివీ.. ‣ 2019లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించిన మరణాల వల్ల 4.6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది. అది ప్రపంచ జీడీపీలో 6.2 శాతానికి సమానం. భారత్‌లో ఈ ఆర్థిక నష్టం జీడీపీలో 1 శాతానికి సమానం. ‣ 2019లో సంభవించిన కాలుష్య మరణాల్లో భారత్, చైనాలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.

2019 ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయం రూ.3,046 కోట్లు‌

రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం చేస్తున్న ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. 17వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు 2019లో ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి రూ.3,046 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేసింది. ఆ ప్రకారం.. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు జాతీయ పార్టీలు కలిసి రూ.2,378 కోట్లు, అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.668 కోట్లు ఖర్చు చేశాయి. భాజపా అన్ని పార్టీల కంటే అత్యధికంగా రూ.1,264 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం ఎన్నికల వ్యయంలో దీని వాటా 41.49%. కాంగ్రెస్‌ రూ.820 కోట్లు (26.92%) ఖర్చు చేసి రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిపి చేసిన వ్యయం రూ.227 కోట్లు. ఇందులో రూ.131 కోట్లతో తెదేపా తొలి స్థానంలో నిలవగా, రూ.86 కోట్ల వ్యయంతో వైకాపా రెండో స్థానాన్ని ఆక్రమించింది. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కేవలం రూ.71,961 ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) రూ.228 కోట్లు ఖర్చు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఒక్కో అభ్యర్థి సగటున రూ.50.85 లక్షలు ఖర్చు చేశారు. ఏపీలో సగటున ఒక్కో అభ్యర్థి రూ.30.50 లక్షలు, తెలంగాణలో రూ.48.61 లక్షలు ఖర్చు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది.

భారత్‌లో అసమానతల స్థితిగతులపై (ది స్టేట్‌ ఆఫ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా రిపోర్టు) నివేదిక‌

దేశంలోని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద పురోగతి కనిపించలేదు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ డెబ్రాయ్‌ విడుదల చేసిన ‘భారత్‌లో అసమానతల స్థితిగతులపై నివేదిక (ది స్టేట్‌ ఆఫ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా రిపోర్టు) ప్రకారం.. 15 ఏళ్లలో దేశంలో వైద్య ఆరోగ్య కేంద్రాల సంఖ్య 7.47% మాత్రమే పెరిగింది. 2005లో 1,72,608 మేర ఉన్న ఈ ఆరోగ్య కేంద్రాల సంఖ్య 2020 నాటికి 1,85,505కి చేరినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ 15 ఏళ్లలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, చండీగఢ్‌లలో ఆరోగ్య కేంద్రాల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 5,085 మేర తగ్గినట్లు పేర్కొంది. ‣ తొలి త్రైమాసికంలో గర్భిణులకు అందించే వైద్య సేవలు 2015 - 16 నుంచి 2019 - 21 మధ్యకాలంలో 58.6% నుంచి 70%కి చేరాయి. కాన్పు అయిన రెండు రోజుల్లోపు సగటున 79.1% మంది పిల్లలకు డాక్టర్లు, నర్సుల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 5, తెలంగాణ 10వ స్థానంలో ఉన్నాయి. ఇదే సమయంలో కాన్పు తర్వాత రెండు రోజుల్లోపు 78% మహిళలకు వైద్యసేవలు అందుతున్నాయి. ఈ విషయంలో ఏపీ 8, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.

రెండున్నర ఏళ్లలో 2,112 మంది రైతుల ఆత్మహత్య‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నిర్ధారణ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం గాలికొదిలేసిందని మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. 2019 జూన్‌ నుంచి 2021 చివరి వరకు (ఎస్‌సీఆర్‌బీ, డీసీఆర్‌బీ, వేదిక వాలంటీర్ల నుంచి అందిన వివరాలు) ఆంధ్రప్రదేశ్‌లో 2,112 మంది రైతులు (అత్యధికులు కౌలురైతులే) ఆత్మహత్య చేసుకోగా 718 కుటుంబాలకే జీవో 43 ప్రకారం ఆర్థిక సాయం అందిందని వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం అందించేందుకు జీవో 43 సరిగా అమలు కావడం లేదని తెలిపారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, బాధిత కుటుంబాల పరిస్థితిపై ఉభయ వేదికల ప్రతినిధి బృందాలు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

పర్యాటక సూచీలో భారత్‌కు 54వ స్థానం‌

అంతర్జాతీయ ప్రయాణాలు, పర్యాటక సూచీలో 2019 నాటికి 46వ స్థానంలో ఉన్న భారతదేశం 2021లో 54వ స్థానానికి పడిపోయింది. దక్షిణాసియాలో మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ భారతదేశమే అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రయాణాలు, పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రపంచ ఆర్థిక వేదిక 117 దేశాల్లో ద్వైవార్షిక అధ్యయనం జరుపుతోంది. 2021లో ఈ దేశాలన్నింటిలోకీ జపాన్‌దే అగ్రస్థానం. జాబితాలో 10 అగ్రగామి దేశాలుగా జపాన్‌తో పాటు అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్, ఇటలీ నిలిచాయి. ఇవన్నీ సంపన్న దేశాలు. కరోనా మహమ్మారి వల్ల కుదేలైన ప్రయాణాలు, పర్యాటక రంగం టీకాల కార్యక్రమం వేగం పుంజుకోవడంతో నెమ్మదిగా కోలుకొంటున్నట్లు అధ్యయనం తేల్చింది.

ప్రతి 30 గంటలకు ఓ బిలియనీర్‌: ఆక్స్‌ఫామ్‌ నివేదిక‌

కొవిడ్‌ పరిణామాల కాలంలో ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్‌ ఆవిర్భవించారని, ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడుపేదరికంలోకి వెళ్లారని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)లో విడుదలైన ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక అంచనా వేసింది. కరోనా సమయంలో 573 మంది (ప్రతి 30 గంటలకు ఒకరు) కొత్త కుబేరులు ఆవిర్భవించారు. గత 23 ఏళ్లతో పోలిస్తే కరోనా సంభవించిన తొలి 24 నెలల్లో బిలియనీర్ల సంపద ఎక్కువగా పెరిగింది. 2000లో అంతర్జాతీయ జీడీపీలో ప్రపంచ బిలియనీర్ల సంపద వాటా 4.4% కాగా ఇపుడు 13.9%. ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది చొప్పున, 26.3 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లారు.

ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో రిలయన్స్‌కు 53వ స్థానం‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమోదిత కంపెనీల్లోని అగ్రగామి సంస్థలతో ఫోర్బ్స్‌ వెలువరచిన తాజా ‘గ్లోబల్‌ 2000’ జాబితాలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెండు ర్యాంకులు అధిగమించి 53వ స్థానానికి చేరింది. కంపెనీ విక్రయాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. ఈ జాబితాలోని దేశీయ అగ్రగామి 10 సంస్థల్లో రిలయన్స్‌దే అగ్రస్థానం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (105వ స్థానం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (153), ఐసీఐసీఐ బ్యాంక్‌ (204), ఓఎన్‌జీసీ (228), హెచ్‌డీఎఫ్‌సీ (268), ఐఓసీ (357), టీసీఎస్‌ (384), టాటా స్టీల్‌ (407), యాక్సిస్‌ బ్యాంక్‌ (431) ఉన్నాయి. జాబితాలోకి కొత్తగా అదానీ కంపెనీలు: గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్సిమిషన్, అదానీ టోటల్‌ గ్యాస్‌ ఈ జాబితాలోకి కొత్తగా చేరాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1453; అదానీ పోర్ట్స్‌ 1568, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1570, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 1705, అదానీ టోటల్‌ గ్యాస్‌ 1746 స్థానాల్లో నిలిచాయి.

‘రక్తహీనత నుంచి విముక్తి’లో ఏపీకి తొలి స్థానం‌

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘రక్తహీనత నుంచి విముక్తి’ కార్యక్రమం అమల్లో ఏపీకి తొలి స్థానం లభించింది. ఈ కార్యక్రమం కింద శిశువులు, చిన్నపిల్లలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నిర్దేశించిన కాలంలో ఐరన్‌ సిరప్, మాత్రలను పంపిణీ చేయడంలో ఏపీ ముందున్నట్లు కేంద్రం జాబితా విడుదల చేసింది. 6-59 నెలల మధ్య ఉన్న పిల్లలకు ఐరన్‌ సిరప్, 5-9, 10-19 ఏళ్ల పిల్లలకు ఐరన్‌ మాత్రలు ఇస్తున్నారు. వీటిని పంపిణీ చేయడంలో ఏపీ 83.6% పురోగతి సాధించింది. ఆ తరువాత స్థానంలో తమిళనాడు (70.8%), మహారాష్ట్ర (67.4%), మధ్యప్రదేశ్‌ (66.3%) ఉన్నాయి. తెలంగాణ 32.4 శాతంతో 19వ స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 46.2% పంపిణీ జరిగింది.

పశుసంపదలో 14వ స్థానంలో ఒంగోలు‌

దేశంలోని పశుపక్ష్యాదుల వివరాలను కేంద్రం వెల్లడించింది. కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తాజాగా పశుగణన - 2020 నివేదికను విడుదల చేశారు. 2018 అక్టోబరు 1 నుంచి 2019 సెప్టెంబరు వరకు ఈ గణన జరిగింది. దేశంలో మొత్తం దేశీయ రకం ఆవులు, ఎద్దులు 14,21,06,466 ఉన్నాయి. వాటిలో గుర్తింపు పొందిన జాతులవి 4,18,79,907 ఉన్నాయి. పేరెన్నికగన్న పశు సంపదలో సంఖ్యాపరంగా గుజరాత్‌ ప్రాంతానికి చెందిన గిర్‌ జాతి పశువులు మొదటి స్థానంలో ఉన్న హరియాణా రకం పశువులను తోసిరాజని తొలి స్థానానికి చేరాయి. తెలుగు నాట ప్రత్యేకంగా కనిపించే ఒంగోలు జాతి 14, పుంగనూరు జాతి 40వ స్థానాల్లో నిలిచాయి. సంఖ్యాపరంగా చూస్తే సింహభాగం గిర్‌ (4.8%) జాతిది కాగా, తర్వాతి స్థానంలో లఖిమి (4.8%), సాహివాల్‌ (4.2%) జాతి పశువులు నిలిచాయి. ఈ వరుసలో ఒంగోలు జాతి పశువులు (0.5%) 14వ స్థానంలో నిలిచాయి. ‣ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒంగోలు జాతి పశువులు 7,03,142 మేర ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇందులో మేలిమి రకం 3,03,817 ఉండగా, గ్రేడెడ్‌వి 3,99,325 ఉన్నాయి. మేలిమి జాతి ఒంగోలు పశువుల్లో ఆంధ్రప్రదేశ్‌ 1,84,924లో, తెలంగాణలో 1,14,769, కర్ణాటకలో 3,967 ఉన్నాయి. ‣ పుంగనూరు జాతి సంఖ్య కేవలం 13,275 (0.03%)కే పరిమితమైంది. పుంగనూరులో మేలిమి జాతి సంఖ్య 9,876, గ్రేడెడ్‌ సంఖ్య 3,399 ఉంది. ఇవి చాలావరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయి. మొత్తం పుంగనూరు జాతిలో మేలిమి (ప్యూర్‌) రకం పశువుల సంఖ్య 9,876 మాత్రమే ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 8,806, తెలంగాణలో 977 ఉన్నాయి. ‣ నివేదిక ప్రకారం దేశీయ రకం పశువులు 73.5% ఉండగా, విదేశీ రకం 26.5% ఉన్నాయి. ‣ గేదెల్లో 42.8% ముర్రాజాతివే ఉన్నాయి. ఇవి అత్యధికం రాజస్థాన్, యూపీల్లోనే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ‣ దేశంలో కుక్కల సంఖ్య 94 లక్షలు ‣ పశువులతో పాటు, నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనెటిక్‌ రీసోర్స్‌ (ఎన్‌బీఏజీఆర్‌) గుర్తించిన పక్షుల రకాలనూ లెక్కించారు.

‘2004 - 2020 సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ నివేదిక ‌

రసాయన ఎరువులు వాడి పండించే పంటల కన్నా సేంద్రియ, సహజ వ్యవసాయంతో రైతులతో పాటు పుడమికి కూడా మేలు జరుగుతుంది. తత్ఫలితంగా నాణ్యమైన పంటతో పాటు అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయి. సేంద్రియ సేద్యంతో నత్రజని, భాస్వరం వంటి పోషకాలు అధికమై భూమికి బలం చేకూరుతుంది. ఈ తరహా సాగు జరిగినచోట నీటిలో స్వచ్ఛత పెరిగి పైర్లకు మరింత మేలు జరుగుతోందని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన సేంద్రియ పంటల్లో దిగుబడి, రైతుల ఆదాయం పెరిగినట్లు తేలింది. ‘2004 - 2020 మధ్య దేశవ్యాప్తంగా సేంద్రియ, సహజ వ్యవసాయంపై లాభాలు’ పేరిట ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ‣ సేంద్రియ సేద్యంపై కేంద్ర ప్రభుత్వం తరఫున ‘దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 19 చోట్ల ప్రయోగాల కోసం ‘భారత వ్యవసాయ వ్యవస్థల పరిశోధన సంస్థ’ (ఐఐఎఫ్‌ఎస్‌ఆర్‌) ప్రత్యేకంగా ఓ పైలెట్‌ ప్రాజెక్టును ‘అఖిల భారత సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్ట్‌ నెట్‌వర్క్‌’ (ఏఐఎన్‌పీఓఎఫ్‌) పేరుతో అమలు చేసింది. ఈ ప్రయోగాల వివరాల ఆధారంగా నివేదిక తయారు చేసింది. సేంద్రియ సేద్యంపై 2005లో తొలిసారి కేంద్రం ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. 2015 - 16లో ఈ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన’ (పీకేవీవై) పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 38 లక్షల హెక్టార్ల భూముల్లో సేంద్రియ, సహజ వ్యవసాయం చేస్తున్నారు. మొత్తం 16 రాష్ట్రాల్లో 19 చోట్ల 74 రకాల పంటల సాగుపై సేంద్రియ, సహజ పద్ధతుల్లో శాస్త్రీయంగా ప్రయోగాలు చేశారు. ఆ 16 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లేవు. కానీ మన రాష్ట్రంలో కొందరు రైతులు ఆసక్తితో సేంద్రియ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, వరి, పప్పుధాన్యాలు సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. నాలుగు రకాల ప్రయోగాలు సేంద్రియ సేద్యంలో భాగంగా పూర్తిగా 100 శాతం సేంద్రియ పదార్థాలను ప్రకృతి వనరుల నుంచి తీసుకుని తొలి ప్రయోగం చేశారు. రెండో ప్రయోగంలో 75 శాతం సేంద్రియ పదార్థాలతో సాగు చేసి వాటికి గోమూత్రం, పంచగవ్యం, రైజో బ్యాక్టీరీయా, వానపాముల ఎరువు మరో 25 శాతం కలిపారు. మూడో రకం ప్రయోగంలో 25 శాతం రసాయన సూక్ష్మ పోషకాలు కలిపి వాడారు. నాలుగో రకం ప్రయోగంలో సగం సేంద్రియం, మిగిలిన సగం రసాయనాలతో ప్రయోగాలు చేశారు. మొత్తం 31 రకాల పంటలు సాగు చేయగా వీటిలో 5 రకాలు ఆహార పంటలున్నాయి.