ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు
కోన్ కార్పొరేషన్‌కు చెందిన కోన్ ఎలివేటర్స్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎలివేటర్ ఒకేసారి 200 మంది మోయగలదు. 5-స్టాప్, 16 టన్నుల ఎలివేటర్ 25.78 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. అత్యుత్తమ నాణ్యత, భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేసినట్లు కోన్ ఎలివేటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్సెయిన్ తెలిపారు.
అలంపూర్‌లో అమితాభ బుద్ధుడు
అలంపూర్ ఆలయాల పరిధిలో ప్రాచీన బుద్ధుడి విగ్రహాలున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బౌద్ధ అవశేషాల నమోదు కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లో మండపం పైకప్పుపై చెక్కిన బుద్ధుడి విగ్రహాలను పరిశీలించారు. ఇవి వెయ్యేళ్ల నాటి అమితాభ బుద్ధుడి రూపాలని గుర్తించారు. గతంలో ప్రముఖ చరిత్రకారుడు బీఎస్‌ఎల్ హనుమంతరావు ఈ విగ్రహాల ఉనికిని తెలియజేసినట్లు పేర్కొన్నారు. పద్మాసనం, ధ్యానముద్రలో, మహాపురుష లక్షణాలతో ఉన్న మూడడుగుల ఎత్తు, అంతే వెడల్పు, నాలుగు అంగుళాల మందంతో అర్ధశిల్ప రీతిలో చెక్కిన ఈ బుద్ధుడి శిల్పాలు చారిత్రక ప్రాధాన్యం సంచరించుకున్నట్లు వివరించారు.
అలంపూర్ సూర్యనారాయణ ఆలయ రంగమండపం పైకప్పు మీద విష్ణు దశావతారాల్లో ఒకరుగా చెక్కిన బుద్ధుడు బోధివృక్షం కింద పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండగా, పైన వింజామరతో విద్యాధరుడు, ఎడమ పక్కన నిలబడి ఉన్న బ్రహ్మ విగ్రహాలతో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. అలంపూర్ గ్రామం వెలుపల పునర్నిర్మించిన పాపనాశేశ్వరాలయ మహామండపం పైకప్పు మీద కూడా విష్ణుమూర్తి దశావతారాల్లో భాగంగా మధ్యలో కల్పవృక్షం, కింద బుద్ధుడు పద్మాసనంపై ధ్యానముద్రలో కూర్చొని ఉండగా కుడి వైపున బోధివృక్షం, ఎడమ వైపున ఒక స్త్రీ శిల్పం ఉన్నట్లు తెలిపారు. క్రీ.శ 10-11 శతాబ్దాల్లో వైష్ణవ మత ప్రచారంలో భాగంగా ఈ బుద్ధుడి విగ్రహాలను విష్ణుమూర్తి అవతారంగా చెక్కారని, వజ్రాయన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమ లక్షణం కలిగిన బుద్ధుడి విగ్రహాలను అమితాభ బుద్ధుడంటారన్నారు.
పెదకొండూరులో కాకతీయుల నాటి దానశాసనం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి దాన శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. శాసనంలో 112 పంక్తులు ఉన్నాయని, తెలుగు భాషలో ఉన్న ఈ శాసనం 13, 14 శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నామని బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు. ఈ శాసనం కాకతీయుల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని వివరించింది. గ్రామంలో గుడి నిర్మించినప్పుడు ఊరుమ్మడిగా ప్రజలు తమ ఆదాయం నుంచి దేవాలయ నిర్వహణకు ఇవ్వాల్సిన పన్నుల వివరాలను శాసనం పేర్కొంది. ఇక్కడి పురావస్తు సంపద, శిలా్పలు, దేవాలయాల ఆధారంగా పెదకొండూరు శాతవాహనుల నుంచి కాకతీయుల పాలన వరకూ చారిత్రకంగా విలసిల్లిన గ్రామమని వివరించారు.
కల్వరాల వీరుల ఆలయంలోని సతి శిలలు 14, 15వ శతాబ్దాల నాటివిగా గుర్తింపు
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామంలో వీరుల ఆలయంలోని సతి శిలలు 14, 15వ శతాబ్దాల నాటివి అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. బాసర తర్వాత రాష్ట్రంలో కొత్త శైలిలో కనిపిస్తున్న సతి శిలలు ఇవేనని పేర్కొంది. యుద్ధంలో మరణించిన వీర యోధులతో సహగమనం చేస్తున్న ముగ్గురు సతులను చెక్కిన మూడు శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. శైలి ప్రకారం.. ఇవి 7, 8 శతాబ్దాల కిందటివి’ అని బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ వీరుల ఆలయాన్ని స్థానిక ప్రజలు కాపాడి కొలుస్తున్నారు. గుడి ముందు ముగ్గురు దేవేరులతో ఒక రాజు కత్తి భుజాన పెట్టుకుని నిల్చుని కనిపిస్తున్నాడు. ఆ రాణుల చేతుల్లో వింజామరలు ఉన్నాయి. పెద్ద మీసాలతో నడినెత్తిన సిగతో రాజు, రాణులు నిండు వస్త్రాలతో, ఆభరణాలతో కనిపిస్తున్నారు. ఇది సహగమన సతుల శిల్పం. మరొక బయటి శిల్పంలో వీరుడు బల్ల వంటి ఆసనంపై కూర్చుని ఉన్నాడు. వీరుని అమరత్వాన్ని తెలిపే ఇది ఒక వీరగల్లు. వీరుల ఆలయం లోపల మూడు జంటల వీరశిలలు ఉన్నాయి. మూడింటిలోనూ వీరులు కత్తులు నేలకు దించి నిల్చున్నారు. వారి పక్కన భార్యలు వింజామరలు పట్టుకుని నిలబడ్డారని వివరించారు.
దుర్గిలో 2 వేల సంవత్సరాల నాటి బౌద్ధ స్తంభం
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దుర్గిలో క్రీ.శ.ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ శిలామండప స్తంభం బయట పడిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. దుర్గిలోని దుర్గాదేవి ఆలయ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలను ఆయన పరిశీలించగా ఈ స్తంభం వెలుగు చూసింది. శాతవాహన కాలం నాటి బౌద్ధ చిహ్నమైన అర్ధ పద్మ శిల్పం ఆ స్తంభంపై చెక్కి ఉందని, ఇది బౌద్ధారామంలోని సంభాషణ మండపానికి చెందిందని చెప్పారు. శాతవాహన కాలంలో దుర్గిలో బౌద్ధ స్థావరం ఉండేదని వివరించారు.
బొమ్మల రామారం మండలంలో కొత్త రాతి బొమ్మల తావు
యాదాద్రి - భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మధిర గ్రామంలో చిన్నరాతిగుట్ట మీద కొత్త రాతి చిత్రాల తావు వెలుగు చూసినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. బృంద సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, బీవీ భద్రగిరీశ్, రామోజు హరగోపాల్, అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్, మండల స్వామి, కొరివి గోపాల్, భాస్కర్‌తో పాటు భూ యజమాని శ్యాంసుందర్‌రెడ్డి కొత్త రాతి చిత్రాల తావు (పెయింటెడ్ రాక్ షెల్టర్)ని గుర్తించారు. 30 అడుగుల ఎత్తున్న చిన్న రాతిగుట్ట మీది పడిగెరాయి లోపలి వైపు వేసిన ఎరుపు రంగు రాతి చిత్రాలు ఉన్నాయి. అక్కడ గుహను వెంకటేశ్వరుడి గుడిగా స్థానికులు కొలుస్తున్నారు. వాళ్లు చేసిన జాజు, సున్నం అలంకరణతో చాలావరకు రాతి చిత్రాలు మరుగున పడిపోయాయి. నాలుగు అడవిదున్నలు, ఇద్దరు పురుషులు, మరొకచోట గుర్రాన్ని పోలిన ఓ జంతువు కనిపిస్తున్నాయి. దున్నల వెనుక నిలబడిన మనిషి బొమ్మ గీతలతో ఉంది. ఈ రాతి చిత్రాల తావున్న గుట్ట అంచుల్లో సూక్ష్మరాతి పరికరాలు లభించాయి. సమీపంలో సమాధులు, మెన్హర్ ఉన్నాయి. ఇక్కడ లభించిన పనిముట్లు, రాతి చిత్రాల శైలి, వాటిలోని వస్తువుల ఆధారంగా ఈ చిత్రాలు సూక్ష్మరాతి యుగానివని భావిస్తున్నాం అని బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు.
అరుణాచల్‌ప్రదేశ్ అడవుల్లో 13వ శతాబ్దపు కోట!
అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాపుంపారే జిల్లా అటవీ ప్రాంతంలో 13వ శతాబ్దపు కోట ఒకటి వెలుగు చూసింది. రామ్‌ఘాట్ ప్రాంతం పరిధిలోని ఇరవై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఇది బయటపడినట్టు పురాతత్వ శాఖ అధికారులు వెల్లడించారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్‌కు చెందిన పురావస్తు అధికారులు చేపట్టిన తవ్వకాల్లో దీన్ని కనుగొన్నారు. రాతి దిమ్మలు, బండరాళ్లు, కాల్చిన ఇటుకలతో కూడిన 226 మీటర్ల పొడవైన ప్రహరీ, గేటు అక్కడ ఉన్నాయి. విరిగిన శివలింగం, సీలింగ్ బాల్, కుండలు విల్లు, బాణం, త్రిశూలం వంటి బొమ్మలు అక్కడ బయటపడినట్టు ఆర్కియాలజిస్ట్ పురా కోజి చెప్పారు. కోట నిర్మాణానికి వివిధ పరిమాణాల్లోని ఆకృతులను ఉపయోగించినట్టు చెప్పారు. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లోనూ పాత రాతియుగపు మెట్ల మార్గం బయటపడింది.
డీఎన్‌ఏ విశ్లేషణకు హరప్పా యుగ అస్థిపంజరాలు
హరియాణాలోని హరప్పా యుగం నాటి ప్రాచీన మానవ ఆవాస స్థలమైన రాఖీగఢీలోని పురాతన శ్మశానవాటిక నుంచి వెలికితీసిన రెండు అస్థిపంజరాల డీఎన్‌ఏ నమూనాలను అధికారులు శాస్త్రీయ పరీక్షలకు పంపారు. ఈ విశ్లేషణ ద్వారా కొన్ని వేల సంవత్సరాల కిందట రాఖీగఢీ ప్రాంతంలో నివసించిన మన పూర్వీకుల గురించి, వారి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవచ్చు. దిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో భారత పురావస్తుశాఖ గుర్తించిన ఏడో నంబరు మట్టిదిబ్బ వద్ద వేర్వేరు సమాధుల్లో రెండు అస్థిపంజరాలను తవ్వకాల్లో బయటకు తీశారు. కటిభాగ నిర్మాణం ద్వారా వీరిని మహిళలుగా గుర్తించారు. చనిపోయే నాటికి వీరి వయసు 40 నుంచి 50 ఏళ్లు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇవి దాదాపు 5 వేల ఏళ్ల కిందటివిగా భావిస్తున్నారు. హరప్పా నాగరికత కాలం నాటి అంత్యక్రియల ఆచారాలకు అనుగుణంగా ఈ సమాధుల గుంతల్లో కుండ పెంకులు, ఇతర ప్రాచీన కళాకృతులు లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
‣ హిసార్ జిల్లా పరిధిలోకి వచ్చే రాఖీగఢీ ప్రాంతంలోని రాఖీ ఖాస్, రాఖీ షాపుర్ గ్రామాల్లో పురావస్తుశాఖ గుర్తించిన మట్టిదిబ్బలు దాదాపు 350 హెక్టార్ల విస్తీర్ణంలో మొత్తం ఏడు దాకా ఉన్నాయి. ప్రస్తుతం 1, 3, 7 మట్టిదిబ్బల వద్ద పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రాచీనకాలంలో ఈ ప్రాంతాన చక్కగా రూపుదిద్దుకొన్న పౌరజీవన వసతులకు ఇవి తార్కాణం. రెండు నెలల కిందట తమ బృందం వెలికితీసిన అస్థిపంజరాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను నిపుణుల ద్వారా ఇటీవలే సేకరించినట్లు తవ్వకాల బృందానికి సారథ్యం వహిస్తున్న భారత పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఎస్.కె.మంజుల్ తెలిపారు.