వార్తల్లో వ్యక్తులు



సీఐఏ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా నంద్‌ మూల్‌చందానీ

అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. ఆ దేశ గూఢచర్య సంస్థ ‘సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)’ తొలి ‘చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)’గా నంద్‌ మూల్‌చందానీ నియమితులయ్యారు. సాంకేతిక రంగంలో ఆయనకు పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మూల్‌చందానీ ఇంతకుముందు అమెరికా రక్షణ శాఖ జాయింట్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌కు సీటీవోగా, తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేశారు. ఆబ్లిక్స్, డిటెర్మినా తదితర విజయవంతమైన అంకుర సంస్థల స్థాపనలో పాలుపంచుకున్నారు. దిల్లీలోని ఓ పాఠశాలలో ఆయన చదువుకున్నారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

‘కాంచన్‌గంగ’ను అధిరోహించిన తొలి మహిళగా ప్రియాంకా మొహితే

మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంకా మొహితే (30) అరుదైన రికార్డు నమోదు చేశారు. దేశంలో 8 వేల మీటర్ల ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 8,586 మీటర్ల ఎత్తయిన కాంచన్‌గంగ పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మూడో పర్వతం ఇదే కావడం విశేషం.

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ డైరెక్టర్ల బోర్డులోకి ఐబీఎం ఛైర్మన్‌

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ డైరెక్టర్ల బోర్డులోకి ఐబీఎం ఛైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అరవింద్‌ కృష్ణ (60) ఎన్నికయ్యారు. క్లాస్‌ బి డైరెక్టర్‌గా ఆయన బోర్డులోకి ఎన్నికయ్యారని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 2023 డిసెంబరు 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. అరవింద్‌ కాన్పూర్‌ ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. గతంలో క్లౌడ్, కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌కు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఐబీఎం రీసెర్చ్‌కు అధిపతిగా వ్యవహరించారు. ఐబీఎం సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీ జనరల్‌ మేనేజర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.

26వ సారి ఎవరెస్టు శిఖరానికి కామీ రీటా

తన రికార్డును తానే బద్దలుగొడుతూ 52 ఏళ్ల నేపాలీ షెర్పా కామీ రీటా 26వ సారి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇంతవరకు అత్యధిక సార్లు ఈ శిఖరం పైకి చేరుకున్న రికార్డు ఆయనదే కాగా దాన్ని మళ్లీ అధిగమించడం విశేషం. ఈ మేరకు కామీ రీటా నేతృత్వంలోని 11 మంది షెర్పా గైడ్ల బృందం 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరానికి చేరుకున్నట్లు నేపాల్‌ పర్యాటక విభాగం ఉన్నతాధికారి తెలిపారు. శిఖరాలను అధిరోహించే సీజన్‌ మే నెలతో ప్రారంభమవుతుండగా యాత్రికులకు సహాయ పడేందుకు షెర్పాలు ట్రెక్కింగ్‌ మార్గంలో తాళ్లు కట్టి పైకి వెళుతుంటారు. 1953లో తొలిసారి ఎవరెస్టును అధిరోహించినవారుగా న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్‌ హిల్లరీ, నేపాలీ షెర్పా టెన్జింగ్‌ నార్గేలు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వారు ఏర్పరిచిన సంప్రదాయ మార్గంలోనే తాజాగా కామీ రీటా బృందం కూడా శిఖరం పైకి చేరుకుంది. ఈ ఏడాది నేపాల్‌ పర్యాటక శాఖ ఎవరెస్టును అధిరోహించడానికి 316 పర్మిట్లు జారీ చేసింది. కామీ రీటా 1994 మే 13న తొలిసారిగా ఈ శిఖరం పైకి చేరుకున్నారు.

భూమికి తిరిగొచ్చిన రాజాచారి

తెలుగు మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి రోదసిలో ఆరు నెలలు గడిపిన అనంతరం క్షేమంగా భూమికి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన డ్రాగన్‌ ఎండ్యూరెన్స్‌ వ్యోమనౌక ద్వారా ఆయన మెక్సికో అగాథంలోని సముద్ర జలాల్లో దిగారు. చారితో పాటు అమెరికాకు చెందిన కైలా బ్యారన్, టామ్‌ మార్ష్‌బర్న్, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) వ్యోమగామి మాథియాస్‌ మారర్‌లు కూడా పుడమికి తిరిగొచ్చారు. అంతకుముందు వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి పయనమయ్యారు.

సముద్ర జలాలకు చేరువయ్యాక డ్రాగన్‌ వ్యోమనౌక పారాచూట్‌లు విచ్చుకున్నాయి. దీంతో అది మెల్లగా సాగరంపై దిగింది. నౌకలో అక్కడికి చేరుకున్న సహాయ బృందాలు వ్యోమగాములను వెలుపలికి తీసుకొచ్చి, వైద్య పరీక్షలకు తరలించాయి. యాత్ర అద్భుతంగా సాగిందని చారి పేర్కొన్నారు. అయితే గురుత్వాకర్షణ శక్తికి తిరిగి లోను కావడం వల్ల వాటర్‌ బాటిళ్ల బరువు పెరిగిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ నలుగురు వ్యోమగాములు గత ఏడాది నవంబర్‌ 10న ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా రోదసిలోకి పయనమయ్యారు. ఈ యాత్రలో వీరు 2,832 సార్లు భూమిని చుట్టారు. సైన్స్‌ సంబంధ ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్‌ఎస్‌ నిర్వహణ పనులను చేపట్టారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌ చారి హైదరాబాద్‌ నుంచి అమెరికా వలస వెళ్లారు. రాజాచారి విస్కాన్సిన్‌ రాష్ట్రంలో జన్మించారు. ఆయన అమెరికా వైమానిక దళంలో పైలట్‌గా పనిచేస్తున్నారు.


బ్రిటన్‌లో మేయర్‌గా తొలి దళిత మహిళ

బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత, కౌన్సిలర్‌ మొహీందర్‌ కె. మిధా ఘనతను దక్కించుకున్నారు. ఆమె పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాదికి (2022 - 23)కిగాను ఆ పదవికి ఆమెను కౌన్సిల్‌ సమావేశంలో ఎన్నుకున్నారు. లండన్‌లో మే 5న నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో ఈలింగ్‌ కౌన్సిల్‌లోని డార్మెర్‌ వెల్స్‌ వార్డుకు లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌గా మేధ మరోసారి ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఆమె డిప్యూటీ మేయర్‌గా కూడా పనిచేశారు.

ప్రపంచంలో అత్యంత పొట్టి టీనేజర్‌గా ఖపాంగీ

డోర్‌ బహదూర్‌ ఖపాంగీ వయసు 18 సంవత్సరాలు. ఎత్తు మాత్రం 73.43 సెంటీమీటర్లే (2 అడుగుల 4.9 అంగుళాలు). ప్రపంచంలో అత్యంత పొట్టిగా ఉన్న టీనేజర్‌గా గిన్నిస్‌ సంస్థ ఖపాంగీని గుర్తించింది. ఈ మేరకు నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో అతనికి గిన్నిస్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.

‘సండే టైమ్స్‌’ కుబేరుల జాబితాలో తొలిసారిగా సునాక్‌ దంపతులకు చోటు

భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషీ సునాక్, భారత పౌరసత్వమున్న ఆయన భార్య అక్షతా మూర్తి ‘సండే టైమ్స్‌’ పత్రిక ప్రచురించిన వార్షిక బ్రిటిష్‌ కుబేరుల జాబితాలో మొదటిసారిగా చోటు సంపాదించారు. 34 ఏళ్ల నుంచి ప్రచురితమవుతున్న ఈ జాబితాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ నాయకుడి పేరు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం.

సునాక్‌ దంపతులు 73 కోట్ల పౌండ్ల ఆస్తిపాస్తులతో జాబితాలో 222వ స్థానంలో నిలిచారు. 2847 కోట్ల పౌండ్ల సంపదతో హిందుజా సోదరులు అగ్ర స్థానంలో నిలిచారు. వీరు కూడా భారత సంతతికి చెందినవారే. వీరి సంపదలో అత్యధిక భాగం భారతీయ స్టాక్‌ ఎక్స్ఛేÄంజీల్లో లిస్టయిన కంపెనీల నుంచే లభించింది. ముంబయిలోని ఇందస్‌ ఇండ్‌ బ్యాంకు, చెన్నైలోని అశోక్‌ లేలాండ్, ఐటీ సంస్థ హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ వంటి కంపెనీలతో పాటు ఇతర కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులు హిందుజా సోదరులను సండే టైమ్స్‌ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. బ్రిటన్‌కు చెందిన సర్‌ జేమ్స్‌ డైసన్‌ కుటుంబం 2300 కోట్ల పౌండ్లతో రెండో స్థానంలో నిలవగా, మూడో స్థానాన్ని తిరిగి భారత సంతతికి చెందిన రూబెన్‌ సోదరులు కైవసం చేసుకున్నారు. వారి ఆస్తిపాస్తులు 2226 కోట్ల పౌండ్లు. 1700 కోట్ల పౌండ్లతో ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్‌ ఆరో స్థానంలో నిలిచారు. సండే టైమ్స్‌ ప్రచురించిన 177 మంది శతకోటీశ్వరుల జాబితాలో ఇంకా పలువురు భారత సంతతివారు ఉన్నారు. 16వ స్థానంలో లోహాల వ్యాపారి అనిల్‌ అగర్వాల్, 39వ స్థానంలో చిల్లర వర్తక దిగ్గజాలు మొహసిన్, జుబేర్‌ ఇస్సా ఉన్నారు.

టాప్‌ 100లో చోటు సంపాదించిన భారత సంతతివారిలో లార్డ్‌ స్వరాజ్‌ పాల్, బయోకాన్‌ వ్యవస్థాపకులు కిరణ్‌ మజుందార్‌ షా, ఆమె భర్త జాన్‌ షా (75వ ర్యాంకు) ప్రభృతులు ఉన్నారు. ఈ ఏడాది సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో కొత్తగా ఆరుగురు వచ్చి చేరారు. జాబితాలోని వారి మొత్తం సంపద 65,300 కోట్ల పౌండ్లు. ఇది గత ఏడాదికన్నా 5,500 కోట్ల పౌండ్లు ఎక్కువ.


తొలి 5జీ కాల్‌ చేసిన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఐఐటీ మద్రాసు వద్ద ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక నెట్‌వర్క్‌పై తొలి 5జీ కాల్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికాం గేర్‌లను ఉపయోగించి ఈ కాల్‌ చేశారు. ‘ఆత్మనిర్భర్‌ 5జీ. ఐఐటీ మద్రాస్‌ వద్ద విజయవంతంగా 5జీ కాల్‌ను పరీక్షించాను. పూర్తిగా ఈ నెట్‌వర్క్‌ దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసింద’ని వైష్ణవ్‌ తెలిపారు.

యూనిసెఫ్‌ సుహృద్భావ రాయబారిగా సచిన్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ యూనిసెఫ్‌ సుహృద్భావ రాయబారిగా రికార్డు స్థాయిలో 20వ సంవత్సరం కొనసాగనున్నారు. ఈ హోదాలో ఆయన రెండు దశాబ్దాలుగా పేద పిల్లల సంక్షేమానికి అవిరళ కృషి చేస్తున్నారని యూనిసెఫ్‌ పేర్కొంది.

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి

ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చారు పడమటి అన్వితారెడ్డి (24). ఈ సాహసికురాలి స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లి. సముద్ర మట్టానికి 8,848.86 మీ. ఎత్తున ఉన్న ఎవరెస్టును అన్విత ఎక్కినట్లు ఆమె శిక్షకుడు హైదరాబాద్‌లోని ట్రాన్సెన్డ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ అధినేత శేఖర్‌బాబు బాచినేపల్లి తెలిపారు. బేస్‌ క్యాంపు నుంచి అయిదు రోజుల్లో ఆమె ఈ సాహసయాత్రను పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం భువనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో శిక్షకురాలిగా పనిచేస్తున్న అన్విత హైదరాబాద్‌ నుంచి ఏప్రిల్‌ 2న బయలుదేరి 4వ తేదీన నేపాల్‌కు చేరుకున్నారు. ఏప్రిల్‌ 17న మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపునకు చేరారు. మే 12న సాహస యాత్రను ప్రారంభించి అడ్డంకులను అధిగమిస్తూ విజయవంతంగా ఎవరెస్టును ఎక్కారు. అన్విత ఇప్పటికే సిక్కింలోని రీనాక్, బీసీ రాయ్‌ శిఖరాలు, లద్దాఖ్‌లోని కడే, ఎల్బ్రూస్‌ పర్వతాలు అధిరోహించారు.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పారాచూటిస్ట్‌గా ఆర్‌.లార్సన్‌

స్వీడన్‌కు చెందిన 103 ఏళ్ల ఈ వృద్ధురాలు ఆర్‌.లార్సన్‌ మోటలాలో పారాచూట్‌ జంప్‌ చేశారు. ఈ విన్యాసానికి గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. నిపుణుడి సహాయంతో పారాచూట్‌ జంప్‌ చేసిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పారాచూటిస్ట్‌గా ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేసింది.

కార్డినల్‌గా హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ పూల ఆంథోని

హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ పూల ఆంథోని కార్డినల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వాటికన్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌ నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చినట్లు హైదరాబాద్‌ ఆర్చ్‌ డయోసెస్‌ వికార్‌ జనరల్‌ యెరువా బాలశౌరి తెలిపారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రపంచవ్యాప్తంగా 21 మందికి కార్డినల్‌ హోదా కల్పించగా అందులో భారత్‌ నుంచి ఇద్దరు ఉన్నారు. వీరిలో ఆంథోనితో పాటు గోవా నుంచి ఆర్చ్‌ బిషప్‌ ఫిలిప్‌ నెరిలకు అవకాశం దక్కింది. ఆంథోని 1961లో కర్నూలు జిల్లా చిందుకూరులో జన్మించారు. 1992లో కడప చర్చిలో నియమితులయ్యారు. 2008లో కర్నూలు బిషప్‌గా, 2021లో హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌గా వచ్చారు.

‘ఎలుకల బోను’ తయారీలో సూక్ష్మ కళాకారుడి గిన్నిస్‌ రికార్డు

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌కు గిన్నిస్‌ బుక్‌లో చోటుదక్కింది. అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించిన దయాకర్‌ కృషిని గిన్నిస్‌ సంస్థ గుర్తించింది. 5 మిల్లీమీటర్ల పొడవు, 2.5 మిల్లీమీటర్ల వెడల్పుతో 29 నిమిషాల్లోనే ఈ బోనును రూపొందించారు. అయిదేళ్ల క్రితం ఓ భారతీయుడు గంటలో సూక్ష్మ బోనును తయారు చేయగా దయాకర్‌ ఆ రికార్డును అధిగమించారు. గత డిసెంబరు 2న అధికారుల సమక్షంలో నిబంధనల మేరకు బోనును తయారు చేసి పంపగా తాజాగా గిన్నిస్‌ రికార్డు వరించింది.

‘30 అండర్‌ 30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022’లో జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌

ఆసియా - పసిఫిక్‌ యువత కొత్త ఆలోచనలతో పరుగులు తీసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే సొంత వ్యాపారాలను పెట్టి, సవాళ్లను ఎదుర్కొని మరీ గెలిచి చూపించారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘30 అండర్‌ 30 ఏషియా క్లాస్‌ ఆఫ్‌ 2022’ జాబితా ఆ విషయాన్నే వెల్లడిస్తోంది. ఆసియాలోని వ్యాపార, సమాజ భవిష్యత్‌ను ఈ యువత పునర్‌ నిర్వచిస్తున్నట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది. ‘ఈ జాబితా కోసం 4,000కు పైగా నామినేషన్లు ఈ ఏడాది వచ్చాయి. చివరకు ఒక్కో విభాగం నుంచి 30 మంది చొప్పున, 10 విభాగాల్లో కలిపి 300 మందిని ఎంపిక చేశాం. ఒలింపిక్స్‌లో విజేతల నుంచి అంకురాల వ్యవస్థాపకుల వరకు ఇందులో చోటు చేసుకున్నార’ని ఫోర్బ్స్‌ తెలిపింది. భారతే నంబర్‌ వన్‌.. తుది జాబితాలో మొత్తం 22 దేశాల వారు చోటు దక్కించుకోగా అందులో 61 మందితో భారత్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న సింగపూర్‌ (34), జపాన్‌ (33), ఆస్ట్రేలియా (32), ఇండోనేషియా (30), చైనా (28)లకు, భారత్‌ మధ్య అంతరం చాలా కనిపించింది. ఆగ్నేయాసియా నుంచి 90 మంది చోటు దక్కించుకున్నారు. ‣ హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల గణిత మేధావి జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రకాశ్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో భాన్జు అనే కమర్షియల్‌ ఎడ్‌టెక్‌ అంకురాన్ని ఈ యువకుడు ప్రారంభించారు. లెక్కలపై వివిధ దేశాల విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ‘భాన్జు’ పద్ధతిలో అభ్యసిస్తే, విద్యార్థులు వేగంగా, మెరుగ్గా లెక్కలు చేయగలరని భాను తెలిపారు. 17 ఏళ్ల వయసులో ‘ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌’గా జొన్నలగడ్డ పేరు పొందారు. 4 ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను తిరగరాశారు.

ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా తొలి భారతీయురాలిగా ఎవరెస్టు అధిరోహణ

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్‌ (31) అరుదైన రికార్డు సృష్టించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమే. పియాలీ స్వస్థలం బెంగాల్‌లోని చందన్‌నగర్‌. ఆమె ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్నారు.

11 కి.మీ. పొడవైన చున్నీతో రికార్డు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 11 కి.మీ. పొడవైన చున్నీతో యాత్ర నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దానెక్స్‌ నవా దుస్తుల తయారీ కర్మాగారానికి చెందిన 300 మంది మహిళలు ఇంత పొడవైన చున్నీని తయారు చేశారు. ఇది ప్రపంచంలో అతి పొడవైనదని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌ దీనిని దంతేశ్వరి మాతకు సమర్పించనున్నారు.

దైవదూతగా దేవసహాయం పిళ్లై

పద్దెనిమిదో శతాబ్దంలో భారతదేశంలో పుట్టి, క్రైస్తవం స్వీకరించిన దేవసహాయం పిళ్లై ఇక నుంచీ దైవదూతగా గుర్తింపు పొందనున్నారు. ప్రపంచ క్రైస్తవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్‌ సిటీలో జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అరుదైన ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ సామాన్యుడిగా దేవసహాయం చరిత్రలో నిలిచిపోతారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన బిషప్‌ల కౌన్సిలుతో పాటు ‘కేథలిక్‌ బిషప్స్‌ ఆఫ్‌ ఇండియా’ సదస్సు కోరిన మీదట పరమ ప్రాప్తి (బీటిఫికేషన్‌) వేడుకకు దేవసహాయం పేరును 2004లో వాటికన్‌ సిఫార్సు చేసింది. ఇదే సందర్భంగా దేవసహాయంతో పాటు మరో తొమ్మిదిమంది పేర్లను మత గురువుల జాబితాలో చేర్చారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కన్యాకుమారి జిల్లా గతంలో ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ జిల్లాలోని నట్టాళం గ్రామంలో హిందూ నాయర్ల కుటుంబంలో 1712 ఏప్రిల్‌ 23న పుట్టిన నీలకంఠ పిళ్లై 1745లో క్రైస్తవం స్వీకరించి దేవసహాయం పిళ్లైగా మారారు. ట్రావెన్‌కోర్‌ మహారాజు మార్తాండ వర్మ కొలువులో అధికారిగా ఉన్న ఈయన మత మార్పిడి కారణంగా ఉన్నత వర్గాల ఆగ్రహానికి గురై పలు కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు. 1752 జనవరి 14న మరణశిక్షను సైతం ఎదుర్కొని అమరుడయ్యారు.


పదోసారి ఎవరెస్ట్‌ను అధిరోహించిన షెర్పా

నేపాల్‌లోని షెర్పా తెగకు చెందిన పర్వతారోహకురాలు తన రికార్డును తానే అధిగమించింది. పదోసారి ఎవరెస్టును అధిరోహించడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో 48 ఏళ్ల లక్పా షెర్పాతో పాటు మరికొందరు కలిసి 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టును ఎక్కినట్టు ఆమె సోదరుడు, యాత్ర నిర్వాహకుడు మింగ్మా గెలు తెలిపాడు. షెర్పాకు బడికి వెళ్లి చదువుకునే అవకాశం ఏనాడూ లేకపోయింది. పర్వతారోహకులకు క్లైంబింగ్‌ గేర్లు, సామగ్రి అందించడం ద్వారా జీవనోపాధి పొందేది. అయితే, వివాహం అయిన తర్వాత ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికాలోని వెస్ట్‌ హార్ట్‌ఫోర్డ్‌లో నివసిస్తోంది.

‘ఇస్టా’ అధ్యక్షుడిగా కేశవులు

ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెస్టింగ్‌ అసోసియేషన్‌ (ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ కె.కేశవులు ఎన్నికయ్యారు. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్‌ సదస్సుల్లో 2022 - 25 సంవత్సర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నిక జరిగింది. ఇస్టాకు ఆసియా నుంచి ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా కేశవులు రికార్డుకెక్కారు.

డిస్కంలో తొలి లైన్‌ ఉమన్‌గా శిరీష

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో తొలిసారిగా లైన్‌ ఉమన్‌గా ఉద్యోగం పొందిన శిరీషకు నియామక పత్రాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మొత్తం 38 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా 32 మంది పరీక్ష రాశారు. వీరిలో 11 మంది ఉత్తీర్ణులైనా ఇద్దరు మాత్రమే కరెంటు స్తంభం ఎక్కే పరీక్షలో నెగ్గారు. వీరిద్దరిలో ఒకరికి ఇటీవల ట్రాన్స్‌కోలో ఉద్యోగం రాగా శిరీష డిస్కంలో చేరారు.

‘హైసియా’ అధ్యక్షురాలిగా మనీష సాబు

హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) నూతన అధ్యక్షురాలిగా మనీష సాబు బాధ్యతలు చేపట్టారు. హైసియా 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఒక మహిళ హైసియాకు సారథ్యం వహించటం ఇదే తొలిసారి. రెండేళ్ల పాటు (2022 - 24) ఆమె ఈ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు ఇన్ఫోపీర్స్‌ సీఈఓ భరణి కె.అరోల్‌ హైసియా అధ్యక్షుడిగా వ్యవహరించారు. నూతన కార్యవర్గం: హైసియా నూతన కార్యవర్గం కొలువుతీరింది. ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్‌ నాదెళ్ల (ఫస్ట్‌సోర్స్‌ ప్రెసిడెంట్‌ - సీఓఓ), ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ లింగిరెడ్డి (అరొప్రో సాఫ్ట్‌ సిస్టమ్స్‌ ప్రెసిడెంట్‌), కోశాధికారిగా డాక్టర్‌ శంతనుపాల్‌ (టాలెంట్‌స్ప్రింట్‌ ఎండీ - సీఈఓ) వ్యవహరిస్తారు. మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా వేదం సాయిరామ్‌ ప్రభు (సీఎంఓ, సిగ్నిటీ), సందీప్‌ శర్మ (ఎండీ, రియల్‌ పేజ్‌), జీఆర్‌ రెడ్డి (సీఎండీ, హుసిస్‌ కన్సల్టింగ్‌), కిషోర్‌ బొర్రా (ఎండీ, ఎనర్జిటెక్‌ గ్లోబల్‌), టీఎస్‌వీ రమణ (సీఈఓ, కోడ్‌ తంత్ర) ఎన్నికయ్యారు.