ప్రముఖ సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ మరణం
→జానపద వాయిద్య పరికరం సంతూర్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన ప్రముఖ విద్వాంసుడు పండిత్ శివకుమార్ శర్మ (83) మరణించారు.
→దేశంలో ప్రసిద్ధి గాంచిన సంగీత కళాకారుల్లో శర్మ ఒకరు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన శర్మ 1938లో జమ్మూలో జన్మించారు.
→పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు. జమ్మూ - కశ్మీర్‌లో ఓ జానపద వాయిద్య పరికరమైన సంతూర్‌పై భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన తొలి సంగీతకారుడుగా గుర్తింపు పొందారు.
→ప్రముఖ ఫ్లూట్ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘శివ-హరి’ స్వరకల్పన ద్వయంగా ప్రఖ్యాతి గాంచారు.
→వీరిద్దరూ సిల్‌సిలా, లమ్హే, చాందిని, డర్ వంటి హిందీ చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు.
ప్రముఖ సినీ గాయకుడు కేకే హఠాన్మరణం
→కేకే పేరిట ప్రసిద్ధుడైన ప్రముఖ సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ (53) ఆకస్మికంగా మరణించారు.
→దక్షిణ కోల్‌కతాలోని నజరుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇస్తూ ఉన్నపళంగా కుప్పకూలిపోయారు.
→‘దిల్ ఇబాదత్’ గాయకుడిగా ప్రసిద్ధుడు. తెలుగులో ఆర్య-2 చిత్రంలో ‘ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత ఈ గుండె ఏమిటో’, టక్కరి దొంగలో ‘అలేబా అలేబా’, ఇంద్రలో ‘దాయి దాయి దామ్మా’ నువ్వే నువ్వేలో ‘అయామ్ వెరీ సారీ’ వంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఆయన ఎక్కువ గీతాలు ఆలపించారు.
→తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ భాషల్లో సైతం పాటలు పాడి అలరించారు.
→దేవదాసు, హ్యాపీ న్యూ ఇయర్, బజరంగీ భాయీజాన్ వంటి సినిమాల్లో గీతాలు ఆలపించి తనదైన ముద్ర వేశారు.
సైమండ్స్ దుర్మరణం
→పరిమిత ఓవర్ల క్రికెట్లో మేటి ఆల్‌రౌండర్లలో ఒకడైన ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం చెందారు.
→ఈ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు క్వీన్స్‌లాండ్‌లోని తన నివాస ప్రాంతానికి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.
→46 ఏళ్ల సైమండ్స్ 1999 - 2008 మధ్య ఆస్ట్రేలియా తరఫున 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
→ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
→ఆస్ట్రేలియా ఆటగాళ్లలో సైమండ్స్‌ది ప్రత్యేక శైలి. పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలోనే అతను అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు.
→1998 నుంచి 2009 వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన సైమండ్స్ 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
→మూడు ఫార్మాట్లలో కలిపి 6,887 పరుగులు రాబట్టి 165 వికెట్లు తీశాడు.
→2003 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో ఆసీస్ 86/4తో ఉన్నప్పుడు క్రీజులో అడుగుపెట్టిన సైమండ్స్ అజేయ ఇన్నింగ్స్ (143 నాటౌట్)తో అదరగొట్టాడు.
→1998లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సైమండ్స్ 198 మ్యాచ్‌ల్లో 39.75 సగటుతో 5088 పరుగులు చేశాడు. అందులో 6 శతకాలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
→2008 ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఆడుతూ రాజస్థాన్‌పై 53 బంతుల్లో 117 చేసి అజేయంగా నిలిచాడు.
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా మరణం
→యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు, అబుదాభీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ (73) మరణించారు.
→1948లో జన్మించిన షేక్ ఖలీఫా యూఏఈకి రెండో ప్రధానిగా 2004 నవంబర్ 3న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అబుదాభీ పాలకుడిగానూ కొనసాగుతున్నారు.
→అంతకుముందు ఆయన తండ్రి షేక్ జయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ 1971 నుంచీ యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండేవారు.
→2004 నవంబర్‌లో బిన్ సుల్తాన్ మరణించగా షేక్ ఖలీఫా బాధ్యతలు స్వీకరించారు.
కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్ మరణం
→కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిత్ సుఖ్‌రామ్ (94) మరణించారు.
→1927, జూలై 27న జన్మించిన సుఖ్‌రామ్, మండీ లోక్‌సభ స్థానం నుంచి మూడు సార్లు, అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సార్లు గెలుపొందారు.
→1993 - 1996 మధ్య కాలంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ (స్వతంత్ర) మంత్రిగా పని చేశారు. 1984లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగానూ సేవలు అందించారు.
→కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్న కాలంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2011లో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారు.
→ఆ కుంభకోణం తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించారు. మళ్లీ 2019లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీంసింగ్ మరణం
→జమ్మూ-కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీంసింగ్ (81) అనారోగ్యంతో మరణించారు.
→జమ్ము ప్రాంతంలో కీలక రాజకీయ నేతగా గుర్తింపు పొందిన భీంసింగ్ స్వస్థలం ఉధంపూర్ జిల్లా భుగ్టేరియన్ గ్రామం.
→లండన్ యూనివర్సిటీలో లా చదివిన ఆయన 1971లో ఆ విశ్వవిద్యాలయం యూనియన్‌కు సెక్రెటరీగా ఎన్నికైన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు.
→తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న భీంసింగ్, ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
→1982లో పాంథర్స్ పార్టీని స్థాపించారు. 1988లో ఉధంపూర్ ఎంపీ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.
→ఆ ఎన్నికల్లో కుట్ర జరిగిందని ఆయన న్యాయపోరాటం చేయగా నాలుగేళ్ల తర్వాత అక్కడి విజేత భీంసింగేనని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.
→కాగా అప్పటికే ఆ దఫా లోక్‌సభ రద్దయింది. 1985లో ఆ రాష్ట్ర ప్రభుత్వం భీంసింగ్‌ను అక్రమంగా జైల్లో పెట్టగా ఆయన శాసనసభ సభ్యత్వం రద్దయింది.
→అకారణంగా ఖైదు చేసినందుకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని అనంతరం సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
→2002లో ఆయన పార్టీ రాష్ట్రంలో 4 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది.
→ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో భీంసింగ్ మోటార్ సైకిల్‌పై ప్రయాణించారు.
→పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రో, నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీ తదితరులతో ఆయనకు స్నేహం ఉంది.
→రాజకీయాలతో పాటు మానవ హక్కుల ఉద్యమకారుడిగా, రచయితగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఆయన సేవలందించారు.
ప్రముఖ చరిత్రకారుడు వైఎస్ నరసింహారావు మరణం
→ప్రముఖ చరిత్రకారుడు, సాహితీవేత్త, ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు యాతగిరి శ్రీరామ నరసింహారావు (86) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరణించారు.
→1936 అక్టోబరు 18న పెద్దాపురంలో జన్మించిన నరసింహారావు విద్యాభ్యాసమంతా రాజమహేంద్రవరంలో సాగింది. ఇక్కడే రామదాసు సహకార శిక్షణ సంస్థలో ఆచార్యుడిగా పని చేశారు.
→యువకుడిగా ఉండగా టంగుటూరి ప్రకాశం పంతులు ఆశీస్సులతో ఆంధ్రకేసరి యువజన సమితిని ప్రారంభించి అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేశారు.
→కోటిపల్లి బస్టాండులో స్వాతంత్య్ర సమరయోధుల పార్కు నిర్మించి అందులో 12 మంది మహిళా సమరయోధురాళ్ల విగ్రహాలను నెలకొల్పారు.
→పలువురి చిత్రపటాలు, వారి చరిత్రతో స్వాతంత్య్ర సమరయోధుల స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
→ఆంధ్ర కేసరి జూనియర్, డిగ్రీ కళాశాలలను స్థాపించి వేల మందికి విద్యాదానం చేశారు.
→గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం, రాళ్లబండి మ్యూజియం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ వంటి సంస్థలు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం కాకుండా ఉద్యమాన్ని నడిపించి పురావస్తు సంపద, కళల పరిరక్షణకు కృషి చేశారు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సి.నరసింహారావు మరణం
→ప్రముఖ వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత, సామాజిక, మానసిక, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయుడు సి.నరసింహారావు (73) మరణించారు.
→ఖాజాగూడలోని గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న ఆయన స్వస్థలం ఏపీలోని ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెద్దపాలపర్రు (పూర్వం కృష్ణా జిల్లా) గ్రామం.
→40 ఏళ్ల కిందటే ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1948 డిసెంబరు 28న నరసింహారావు జన్మించారు.
→చదువుకునే రోజుల నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి, ప్రశ్నించేతత్వం ఉన్న ఆయన తొలినాళ్లలో విజయవాడలో ‘రేపు’ అనే మనో వైజ్ఞానిక మాస పత్రికను స్థాపించారు.
→అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఆ తరువాత ‘నూతన ప్రపంచం’, ‘చెలిమి’, ‘ఇండియన్’ (ఆంగ్లం) అనే వార పత్రికలను నిర్వహించారు.
→వ్యక్తిత్వ వికాసంపై ఆయన రాసిన పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి. ‘వ్యక్తిత్వ వికాసం’ పుస్తకం ఇప్పటివరకు 58 ముద్రణలు పొందింది.
→విజయీభవ, విజయపథం, అన్యోన్యదాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపక శక్తి.. వంటి పుస్తకాలూ పాఠకాదరణ చూరగొన్నాయి.
→నరసింహారావు అనేక డాక్యుమెంటరీలతో పాటు ‘హరిజన్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. గత 15 ఏళ్లుగా వివిధ టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.