నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా సుమన్ బేరీ
నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవి నుంచి రాజీవ్ కుమార్ వైదొలగిన నేపథ్యంలో ఆయన స్థానంలో సుమన్ బేరీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్‌కు డైరెక్టర్‌గా ఆయన సేవలు అందించారు.
డబ్ల్యూహెచ్‌వో అధినేతగా మరోసారి టెడ్రోస్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ పదవికి టెడ్రోస్ అథనోమ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. కరోనా పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవికి ఇతరులెవరూ పోటీపడలేదు. టెడ్రోస్ మరో ఐదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా
దేశ రాజధాని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్‌కుమార్ సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో గతవారం రాజీనామా చేసిన అనిల్ బైజల్ స్థానంలో సక్సేనాను నియమించారు.
ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజేశ్ భూషణ్
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ డబ్ల్యూహెచ్‌వోకు చెందిన కీలమైన కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 194 దేశాలు సభ్యులుగా ఉన్న డబ్ల్యూహెచ్‌వో 75వ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మే 22న ప్రారంభమయ్యాయి. 28 వరకు కొనసాగుతాయి. ఆరోగ్య రంగానికి సంబంధించిన సవాళ్లను ప్రతి ఏడాది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్‌ఏ) సమీక్షిస్తుంటుంది. రెండు కమిటీ (ఏ,బి)ల ద్వారా డబ్ల్యూహెచ్‌ఏ పనిచేస్తుంటుంది. వీటిలో రెండో కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజేశ్ భూషణ్ నియమితులయ్యారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. రాజేశ్ భూషణ్ నేతృత్వంలోని కమిటీ (బి) ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన పరిపాలన, ఆర్థిక వ్యవహారాలను చర్చించి నివేదిక రూపొందిస్తుంది.
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా మీనా నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా నియామకంపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయన నియామకం అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
సీఈసీగా రాజీవ్ బాధ్యతల స్వీకరణ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్‌లో ఆయన సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర మే 14న పదవీ విరమణ చేశారు. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్ సీఈసీగా ఉంటారు. రాష్ట్రపతి, ఉí రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు ఆయన సారథ్యంలోనే జరగనున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈసీలో కమిషనర్‌గా ఉన్నారు. సీఈసీగా మే 15న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈసీలోని కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను సీఈసీగా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.
1960 ఫిబ్రవరి 19న జన్మించిన ఆయన బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, పీజీడీఎం, ఎంఏ (పబ్లిక్ పాలసీ) చేశారు. బిహార్/ఝార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి (1984 బ్యాచ్) అయిన రాజీవ్ 2020 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 2020 సెప్టెంబరు ఒకటో తేదీన ఎన్నికల కమిషనర్ కావడానికి ముందు ‘ప్రభుత్వరంగ సంస్థల ఎంపిక మండలి’ (పీఈఎస్‌బీ) ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు.
సీఐఐ అధ్యక్షుడిగా సంజీవ్ బజాజ్
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా బజాజ్ ఫిన్‌సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ బాధ్యతలు స్వీకరించారు. 2022 - 23 సంవత్సరానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. తదుపరి సీఐఐ అధ్యక్ష అభ్యర్థిగా హీరో మోటోకార్ప్ ఛైర్మన్, సీఈఓ పవన్ ముంజాల్ ఉంటారు. సీఐఐ ఉపాధ్యక్షుడిగా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఆర్.దినేశ్ అధికారం చేపట్టారు.
ఎయిరిండియా సీఈఓ, ఎండీగా క్యాంప్‌బెల్ విల్సన్
ఎయిరిండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా క్యాంప్‌బెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ఎయిరిండియా బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ నియామకానికి నియంత్రణ సంబంధిత అనుమతులు పొందాల్సి ఉందని కంపెనీ తెలిపింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ స్కూట్ ఎయిర్ సీఈఓగా విల్సన్ (50) పనిచేస్తున్నారు. ఆయనకు విమానయాన సంస్థల్లో 26 ఏళ్ల అనుభవం ఉంది.
విల్సన్ ప్రస్థానం ఇలా: 1996లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (న్యూజిలాండ్‌లో)గా విల్సన్ చేరారు. ఆ తర్వాత కెనడా, హాంకాంగ్, జపాన్‌లలో పని చేశారు. 2011లో సింగపూర్‌కు తిరిగి వచ్చి సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ ఎయిర్‌కు వ్యవస్థాపక సీఈఓగా చేరారు. 2016 వరకు పనిచేసి ఆ తర్వాత సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)గా బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో మళ్లీ స్కూట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
ఐడీబీఐ బ్యాంక్ ఛైర్మన్‌గా టీఎన్ మనోహరన్
ఐడీబీఐ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా మూడేళ్ల కాలానికి టీఎన్ మనోహరన్‌ను నియమించేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదించిన మూడేళ్ల కాల పరిమితి మే 8తో పూర్తి కావడంతో, నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ - హోల్‌టైమ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి ఎంఆర్ కుమార్‌ను తప్పిస్తున్నట్లు తెలిపింది. మే 9 నుంచి స్వతంత్ర డైరెక్టర్ మనోహరన్ మూడేళ్ల పాటు పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా కొనసాగేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేసిందనీ, దీనికి ఆర్‌బీఐ నుంచి మే 6నే అనుమతి కూడా లభించిందని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది
హెచ్‌పీసీఎల్ సీఎండీగా పుష్ప్ కుమార్ జోషి
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (సీఎండీ) పుష్ప్ కుమార్ జోషి (58)బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌పీసీఎల్ బోర్డులో అత్యంత సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న జోషిని గత జనవరిలో ప్రభుత్వం తరఫున పీఈఎస్‌బీ సీఎండీ పదవికి ఎంపిక చేసింది. తాజాగా జోషి నియామకాన్ని ఏసీసీ అధికారికంగా ఖరారు చేయడంతో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. మార్కెటింగ్ డైరెక్టర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఇండిగో ఛైర్మన్‌గా వెంకటరమణి సుమంత్రన్
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఛైర్మన్‌గా వెంకటరమణి సుమంత్రన్‌ను డైరెక్టర్ల బోర్డు నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ మెలెవీటిల్ దామోదరన్‌కు 75 ఏళ్లు నిండినందున, ఆయన పదవి నుంచి తప్పుకోగా ఆ స్థానాన్ని వెంకటరమణి భర్తీ చేశారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన వ్యూహాత్మక సలహాదారు సంస్థ సెలెరిస్ టెక్నాలజీస్‌కు ఛైర్మన్, ఎండీగా కొనసాగుతున్నారు. అలాగే రాణే హోల్డింగ్స్ లిమిటెడ్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బోర్డుల్లోనూ సేవలు అందిస్తున్నారు. 2014 వరకు హిందుజా ఆటోమోటివ్ (యూకే) ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛైర్మన్, అశోక్ లేలాండ్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు.
ప్రధాని మోదీ సలహాదారుగా తరుణ్ కపూర్
ప్రధాని మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1987 ఐఏఎస్ బ్యాచ్ (హిమాచల్‌ప్రదేశ్ కేడర్) అధికారి అయిన కపూర్, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా గతేడాది నవంబరు 30న పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయనను ప్రధాని సలహాదారుగా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
సీబీడీటీ ఛైర్‌పర్సన్‌గా సంగీతా సింగ్‌కు అదనపు బాధ్యతలు
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్‌పర్సన్‌గా ఐఆర్‌ఎస్ అధికారిణి సంగీతా సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత ఛైర్మన్ జె.బి.మహాపాత్ర ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1986 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారిణి సంగీతా సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
బ్యాడ్ బ్యాంక్ సీఈఓగా నటరాజన్ సుందర్
బ్యాడ్ బ్యాంక్‌గా పరిగణించే నేషనల్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్) ఎండీ, సీఈఓగా నటరాజన్ సుందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సుందర్ ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ, చీఫ్ క్రెడిట్ ఆఫీసర్‌గా పనిచేసి 2022 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఎన్‌ఏఆర్‌సీఎల్ పదవి కోసం బహిరంగ ప్రకటన తర్వాత జరిగిన పోటీ ప్రక్రియలో భాగంగా సుందర్ ఎంపికయ్యారు. ఆయన పేరును సూచించిన తర్వాత మే 24న ఆర్‌బీఐ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం తాత్కాలిక ఎండీగా ఉన్న పద్మకుమార్ నాయర్ మాతృ బ్యాంక్ అయిన ఎస్‌బీఐకు వెళ్లారు.
స్లొవేకియాలో అమెరికా రాయబారిగా గౌతమ్ రాణా
అమెరికాకు సంబంధించి మరో కీలక పదవిలో ఓ భారతీయ - అమెరికన్ నియమితులయ్యారు. ఈ మేరకు స్లొవేకియాలో రాయబారిగా భారతీయ - అమెరికన్ గౌతమ్ రాణాను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. రాణా ప్రస్తుతం అల్జీరియాలోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేస్తున్నారు.
జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్‌కు ఐదుగురు సభ్యుల నియామకం
జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)కు ముగ్గురు జ్యుడిషియల్, ఇద్దరు టెక్నికల్ సభ్యులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేసిన ప్రతిపాదన మేరకు నియామకాల క్యాబినెట్ కమిటీ ఈ పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యుల నియామకానికి సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్, హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ జైన్, పట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ (ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా గతంలో పనిచేసి పదవీ విరమణ చేశారు), ప్రస్తుత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఎన్‌సీఎల్‌ఏటీ జ్యుడిషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ విశ్రాంత కార్యదర్శి, ఐఏఎస్ అధికారి బరుణ్ మిత్ర, రైల్వేబోర్డు సభ్యులు (ఫైనాన్స్), ఐఆర్‌ఏఎస్ అధికారి నరేశ్ సలేచ టెక్నికల్ సభ్యులుగా నియమితులయ్యారు.
విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా బాధ్యతల స్వీకరణ
నూతన విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్యదర్శిగా ఉన్న హర్ష్ వర్ధన్ శృంగ్లా స్థానంలో వినయ్ క్వాత్రను నియమించిన విషయం తెలిసిందే. 1998 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ అధికారి అయిన క్వాత్రా ఇప్పటివరకు నేపాల్‌లో భారత రాయబారిగా సేవలు అందించారు.