పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో భారత్
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శిమ్లా వేదికగా రైతులు, పథకాల లబ్ధిదారులతో చర్చాగోష్ఠి నిర్వహించారు. హయత్‌నగర్‌లోని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడ)లో వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రభాగాన నిలిచినట్లు తెలిపారు.
వాయుసేన, నౌకా దళాలకు అస్త్ర ఎంకే 1 క్షిపణులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు రక్షణ శాఖ నుంచి రూ.2,971 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది. దీని ప్రకారం భారత వాయుసేన, నౌకాదళాలకు అస్త్ర ఎంకే-1 బీవీఆర్ (బియాండ్ విజువల్ రేంజ్) ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిలను బీడీఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది.
దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ కాంట్రాక్టు ఒప్పందంపై బీడీఎల్ డైరెక్టర్ (ఉత్పత్తి) పి.రాధాకృష్ణ, కేంద్ర రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ సింగ్ సంతకాలు చేశారు.
వచ్చే ఆరేళ్లలో ఈ కాంట్రాక్టును బీడీఎల్ పూర్తిచేయాల్సి ఉంటుంది. బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ మిశ్రా స్పందిస్తూ, అస్త్ర క్షిపణిలను దేశీయ అవసరాలకు మాత్రమే కాకుండా, కొన్ని ఇతర దేశాలకు సైతం అందిస్తున్నట్లు తెలిపారు.
గిరాకీకి అనుగుణంగా వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు వివరించారు. బీడీఎల్- డీఆర్‌డీఓ స్వతంత్రంగా ఆవిష్కరించిన అస్త్ర క్షిపణి 20 కిలోమీటర్ల ఎత్తులో 80 నుంచి 110 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఈ క్షిపణులతో వాయుసేన, నౌకాదశాల శక్తిసామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన అన్నారు.
దీన్ని స్వతంత్రంగా మనదేశంలో ఉత్పత్తి చేయడం వల్ల ఎన్నో చిన్న- మధ్య తరహా యూనిట్లకు మేలు జరుగుతుందని, 600 కంటే ఎక్కువగా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
పెద్దఎత్తున ఎగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చన్నారు. ఆకాశ్ వెపన్ సిస్టమ్, స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్, తేలిక పాటి టోర్పెడో.. వంటి ఎన్నో రకాలైన ఆయుధ సామగ్రిని బీడీఎల్ అందిస్తోందని వివరించారు.
2025 - 26 వరకూ ఉపాధి కల్పన కార్యక్రమం
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) 2025 - 26 ఆర్థిక సంవత్సరం వరకూ కొనసాగనుంది. ఇందుకు రూ.13,554.42 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమం కింద మొత్తం 40 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది.
2008 - 09లో ఆరంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ మొత్తం 64 లక్షల మందికి రూ.19,995 కోట్ల సబ్సిడీ అందించినట్టు సంబంధిత వర్గాలు వివరించాయి.
దేశంలో తొలిసారి డ్రోన్ ద్వారా పోస్టల్ డెలివరీ
దేశంలో ప్రప్రథమంగా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో పోస్టల్ శాఖ డ్రోన్ సాయంతో టపా పార్సిలు చేరవేసింది.
పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ప్రయోగంలో 46 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని 25 నిమిషాల్లో డ్రోన్ చేరుకొన్నట్లు అధికారులు వెల్లడించారు.
భుజ్ తాలూకాలోని హాబే గ్రామం నుంచి భచావూ తాలూకాలోని నేర్ గ్రామానికి ఈ టపా పంపారు.
కేంద్ర సమాచార శాఖ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో డ్రోన్ల సాయంతో పోస్టల్ టపా చేరవేతలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఐఎన్‌ఎస్ గోమతికి వీడ్కోలు
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ గోమతికి భారత నావికాదళం వీడ్కోలు పలికింది. ఈ నౌక సేవలను ఉపసంహరించింది.
1988లో నావికాదళంలో ప్రవేశించిన గోమతి 34 ఏళ్ల పాటు సేవలందించింది. కాక్టస్, పరాక్రమ్, రైన్‌బో తదితర ఆపరేషన్స్‌లో పాల్గొంది.
త్వరలో ఈ నౌకను మ్యూజియంగా మార్చి, లఖ్‌నవూలోని గోమతి నది తీరంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ మేరకు భారత నావికాదళం, యూపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్‌ఎన్ ఆర్య రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లవ్ దేవ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ‘త్రిపురలో శాంతి భద్రతలు కాపాడే అంశంపై దృష్టి పెడతా’ అని సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సాహా ప్రకటించారు.
‘స్టార్టప్ పాలసీ 2022’ ఆవిష్కరణ
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల వల్ల దేశంలో భారీ సంఖ్యలో ఏర్పడిన అంకుర సంస్థలు (స్టార్టప్స్) స్వల్ప సమయంలోనే యునికార్న్ కంపెనీలు (100 కోట్ల డాలర్ల విలువైనవి)గా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 2014లో మన దేశంలో 300 నుంచి 400 వరకు మాత్రమే అంకుర సంస్థలుండేవని ఇప్పుడు వాటి సంఖ్య 70 వేలకు పైనేనని వెల్లడించారు. ఇండోర్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ‘స్టార్టప్ పాలసీ 2022’ను ఆవిష్కరించారు.
దేశంలోనే ఎస్‌బీఐ తొలి హోమ్ లోన్ ప్రాసెస్ కేంద్రం
గృహ రుణాల జారీని మరింత సులభతరం చేసేందుకు వనపర్తి ఎస్‌బీఐలో మినీ రిటైల్ అసెట్స్ ప్రాసెసింగ్ సెంటర్ (ఆర్‌ఏపీసీ)ను ప్రారంభించామని, దేశంలో ఇదే మొదటిదని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టరు చల్లా శ్రీనివాసులుశెట్టి చెప్పారు.
దేశంలో గృహ రుణాలు అతి ఎక్కువ సంఖ్యలో జారీచేసిన బ్యాంకుగా ఎస్‌బీఐ నిలిచిందని, ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.5.62 లక్షల కోట్ల రుణాలిచ్చి మొదటి స్థానంలో నిలిచామని ఆయన పేర్కొన్నారు.
స్వదేశంలోనే ‘వందేభారత్’ చక్రాల ఉత్పత్తి
ప్రతిష్ఠాత్మక వందే భారత్ రైళ్ల నిర్మాణానికి అవసరమైన చక్రాల దిగుమతి ప్రణాళికలు ఉక్రెయిన్ సంక్షోభంతో దెబ్బతినడంతో స్వదేశంలోనే వాటిని తయారు చేసుకోవాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.
బెంగళూరులోని యలహంకలో ఉన్న రైల్వే వీల్ ఫ్యాక్టరీలో వాటిని ఉత్పత్తి చేయనుంది. వచ్చే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లను తయారు చేస్తామని 2022 - 23 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వాటిలో 75 రైళ్ల నిర్మాణాన్ని 2023 ఆగస్టు 15 కల్లా పూర్తిచేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 1.6 కోట్ల డాలర్ల వ్యయంతో 36 వేల చక్రాలను ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే యుద్ధం కారణంగా ప్రస్తుతం అక్కడ వాటి ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వందే భారత్ రైళ్ల నిర్మాణం ఆలస్యం కాకుండా చూసుకునేందుకుగాను బెంగళూరులోనే చక్రాలను తయారు చేయాలని రైల్వే నిర్ణయించింది. మరోవైపు ఉక్రెయిన్‌లో ఇప్పటికే తయారైన 128 చక్రాలను పొరుగున ఉన్న రొమేనియాకు చేర్చారు.
రాజద్రోహ చట్టం నిలిపివేత
అత్యంత వివాదాస్పదమైన రాజద్రోహ చట్టంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. రాజద్రోహ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపేస్తూ సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ కింద నమోదైన అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌నూ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఎప్పుడో బ్రిటిష్ పాలకుల హయాంలో అమల్లోకి తెచ్చిన ఈ సెక్షన్ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని, అందువల్ల దీన్ని పునఃపరిశీలించాలన్న కోర్టు సూచనను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసిన నేపథ్యంలో ధర్మాసనం నిర్ణయం వెలువడింది.
భారత శిక్షా స్మృతి 124ఎ అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో జాతీయ నేరాల నమోదు విభాగం (ఎన్‌సీఆర్‌బి) నివేదిక ప్రకారం.. ఈ నేరం కింద 2015 - 2020 మధ్య కాలంలో మొత్తం 356 కేసులు దాఖలయ్యాయి. 548 మంది వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో ఆరుగురిపైనే నేరాలు నిరూపితమై శిక్షలు పడ్డాయి. రాజద్రోహం కేసులు నమోదైన వారిలో, బెంగుళూరుకు చెందిన దిశారవి (టూల్ కిట్ కేసు), దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య, దివంగత పాత్రికేయుడు వినోద్ దువా, కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్, బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి అరుంధతి రాయ్, హార్దిక్ పటేల్ (గుజరాత్), అసీమ్ త్రివేది (కార్టూనిస్ట్, కాన్పుర్), వినాయక్ సేన్ (పిల్లల వైద్యుడు, ఛత్తీస్‌గఢ్), సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ (పంజాబ్) తదితరులు ఉన్నారు.
రైళ్లలో ఇక బేబీ బెర్తులు
రైళ్లలో ఇకపై పెద్ద బెర్తులకు అనుబంధంగా పిల్లల (బేబీ) బెర్తులూ కనిపించనున్నాయి. చిన్నారులతో కలిసి ప్రయాణించేవారికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా లఖ్‌నవూ - దిల్లీ మెయిల్‌లో ఇలాంటి రెండు బెర్తుల్ని అమర్చారు. దిగువ బెర్తుకు కిందన ఇది ఉంటుంది. పిల్లలను పడుకోబెట్టే సమయంలో బయటకు లాగితే, ప్రధాన బెర్తుకు అనుబంధంగా వస్తుంది. పిల్లలు నిద్రలో పడిపోకుండా తగిన రక్షణ కూడా ఉంటుంది. 77 సెం.మీ. పొడవు, 25.5 సెం.మీ. వెడల్పు, 7.62 సెం.మీ ఎత్తు ఉండే ఈ బెర్తుల్ని అవసరం లేనప్పుడు సురక్షితంగా మడత పెట్టేయవచ్చని రైల్వే అధికారి తెలిపారు.
హైదరాబాద్ అంకుర సంస్థ ‘హోమ్‌గ్రౌండ్’ అరుదైన ఘనత
‘హోమ్‌గ్రౌండ్’ అంకుర సంస్థ అరుదైన ఘనత సాధించింది. ‘స్టార్టప్ బూట్‌క్యాంప్’ (ఆస్ట్రేలియా) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో హైదరాబాద్‌కు చెందిన ‘హోమ్‌గ్రౌండ్’ అంకుర సంస్థ టాప్-10లో నిలిచింది. క్రికెట్‌లో బౌలింగ్, బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌ను స్మార్ట్‌ఫోన్ ద్వారా విశ్లేషించడం ఈ అంకుర సంస్థ ప్రత్యేకత. వర్ధమాన క్రికెటర్లు, కోచ్‌లు స్మార్ట్‌ఫోన్‌లోని ‘హోమ్‌గ్రౌండ్’ యాప్ సాంకేతికతను ఉపయోగించుకుని నైపుణ్యం పెంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను వికెట్ల వెనుక ఉంచి బౌలింగ్ వేగం, లైన్, లెంగ్త్, పిచ్ మ్యాప్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మూడు నెలల పాటు జరిగిన పోటీలో ప్రపంచవ్యాప్తంగా 25,000 అంకుర సంస్థలు పోటీపడ్డాయి. వాటిలో 1000 ముందంజ వేశాయి. అయిదు రౌండ్ల తర్వాత టాప్-10 అత్యుత్తమ అంకుర సంస్థలను ఎంపిక చేశారు. అందులో భారత్ నుంచి ‘హోమ్‌గ్రౌండ్’కు చోటు దక్కింది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుంచి ఒక్కోటి, ఆస్ట్రేలియా నుంచి ఏడు టాప్-10లో చోటు సంపాదించాయి. 2020 సెప్టెంబరులో సంతోష్ వుప్పల, సింధూర లక్క, క్లైడ్ బెయిలీ ‘హోమ్‌గ్రౌండ్’ అంకుర సంస్థను ప్రారంభించారు.
కొలీజియం సిఫార్సులకు ప్రభుత్వ ఆమోదం!
వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. న్యాయవాదులు అనిష్ దయాళ్, అమిత్ శర్మలను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని గత నవంబరులో కొలీజియం చేసిన సిఫార్సుకు ఆమోదం లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కోర్టుకు జడ్జీగా నియమించేందుకు సౌరభ్ క్రిపాల్ అనే న్యాయవాది పేరునూ కొలీజియం సిఫార్సు చేసినా ఆ అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ-కశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది వాసిం సాదిక్ నర్గల్‌ను నియమించాలని 2017లో వచ్చిన సిఫార్సుకు ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపిందని చెప్పాయి. 2021లోనూ ఆయన పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన న్యాయాధికారిణి ఒకరిని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే ప్రతిపాదననూ ప్రభుత్వం ఆమోదించింది. కొందరు న్యాయాధికారుల్ని పట్నా హైకోర్టు జడ్జీలుగా నియమించనున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణం
తెరాస తరుఫున పెద్దల సభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర దిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు ఆయనతో తెలుగులో ప్రమాణస్వీకారం చేయించారు.
రానున్న కాలం డ్రోన్లదే: ప్రధాని మోదీ
రానున్న కాలంలో ప్రజల జీవితాల్లో డ్రోన్లు కీలకపాత్ర పోషించనున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇవి దేశంలో ప్రతి రంగాన్ని ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ల సాంకేతికతలో భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. దిల్లీలో అతి పెద్ద డ్రోన్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
మౌలిక వసతుల ప్రాధాన్యంతోనే దేశ ప్రగతి
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన దేశాలే ప్రగతి సాధిస్తున్నాయని చరిత్ర చెబుతోందని, దేశంలో అత్యున్నత నాణ్యతతో వసతులను ప్రజలకు అందిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు రూ.31,530 కోట్ల విలువైన 11 అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
అలహాబాద్ హైకోర్టుకు 10 మంది శాశ్వత జడ్జీలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టుకు 10 మంది శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్‌లతో కూడిన కొలీజియం సిఫార్సు చేసింది. మే 21న సమావేశమైన కొలీజియం 10 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా ఎంపిక చేసింది. కొత్త న్యాయమూర్తుల్లో జస్టిస్ సంజయ్‌కుమార్ పచోరి, జస్టిస్ సుభాష్ చంద్ర శర్మ, జస్టిస్ సుభాష్ చాంద్, జస్టిస్ సరోజ్ యాదవ్, జస్టిస్ మహమ్మద్ అస్లాం, జస్టిస్ అనిల్‌కుమార్ ఓఝా, జస్టిస్ సాధనారాణి, జస్టిస్ సయ్యద్ ఆఫ్తాబ్ హుసేన్ రిజ్వీ, జస్టిస్ అజయ్ త్యాగి, జస్టిస్ అజయ్ కుమార్ శ్రీవాస్తవ ఉన్నారు.
దేశ కిరీటంలో అరుణాచల్ ప్రదేశ్ మణిరత్నం: అమిత్ షా
భారత్ కిరీటంలో అరుణాచల్ ప్రదేశ్ ఓ మణిరత్నం అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తూర్పు సియాంగ్ జిల్లాలోని పాసిఘాట్‌లో నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) క్యాంపస్ నెలకొల్పేందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. రూ.436 కోట్ల విలువైన 22 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. రూ.1000 కోట్ల విలువైన 40 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛైర్మన్‌గా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగస్టు 9న ఏర్పాటైన మండలి కాలం పూర్తికావడంతో కొత్తగా దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, హర్‌దీప్‌సింగ్ పూరీలను సభ్యులుగా నియమించారు. శాశ్వత ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జైశంకర్, అర్జున్‌ముండా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్ షెకావత్, కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్‌లకు అవకాశం కల్పించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత స్థాయీ సంఘం పదవీ కాలం ముగిసినట్లు పేర్కొంది. ఇందులో సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులకు అవకాశం కల్పించారు. కేంద్ర - రాష్ట్ర సంబంధాల అంశాలను అంతర్రాష్ట్ర మండలిలో చర్చించడానికి ముందు ఈ స్థాయీ సంఘంలో చర్చిస్తారు. కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాల అమలుతీరును ఇది పర్యవేక్షిస్తుంది.
తొలిసారిగా ‘వాట్సప్’లో మద్రాస్ హైకోర్టు వ్యాజ్యం విచారణ
ఓ కేసు విచారణను వాట్సప్ వీడియో కాల్‌లో మద్రాస్ హైకోర్టు తొలిసారిగా నిర్వహించి తీర్పునిచ్చింది. వినూత్న రీతిలో ఈ విచారణను జస్టిస్ జీఆర్ స్వామినాథన్ చేపట్టారు. ధర్మపురి జిల్లా పాపరపట్టి గ్రామంలో శ్రీ అభీష్ట వరదరాజస్వామి ఆలయ రథోత్సవం నిర్వహించకుండా ఆపేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులిచ్చింది. వాటిని నిలిపేయాలని ఆలయ ధర్మకర్త పీఆర్ శ్రీనివాసన్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు జస్టిస్ స్వామినాథన్ వాట్సప్‌లో విచారణకు సిద్ధమయ్యారు. న్యాయమూర్తితో పాటు పిటిషన్‌దారు, ఆయన తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఆర్.షణ్ముగ సుందరం వీడియోకాల్‌లోకి వచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఆలయ కమిటీ నిబంధనలు పాటిస్తూ రథోత్సవాన్ని నిర్వహించాలని జస్టిస్ స్వామినాథన్ ఆదేశించారు.
ఎన్‌సీఎఫ్‌ఎల్(ఈ) ప్రారంభోత్సవంలో హోంమంత్రి అమిత్ షా
భవిష్యత్తులో సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్‌గా మారబోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హైదరాబాద్ రామంతాపూర్‌లోని సెంట్రల్ సైబర్ ఫొరెన్సిక్ లాబోరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) ఆవరణలో నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ - ఎవిడెన్షియల్ పర్పస్ (ఎన్‌సీఎఫ్‌ఎల్-ఈ)ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సైబర్ నేరాల రూపంలో పెనుముప్పు ఎదురవుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైబర్ ల్యాబ్ వ్యవస్థను రూపొందించడంలో నిమగ్నమైందన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఎన్‌సీఎఫ్‌ఎల్‌ఈని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు దిక్సూచి
సీఎఫ్‌ఎస్‌ఎల్ దేశంలోని అన్ని సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. 2000లో ఏర్పాటైన ఈ ప్రయోగశాల దేశంలోని పలు చట్ట అమలు సంస్థలకు నాణ్యమైన సేవలందిస్తోంది. సైబర్ ఫొరెన్సిక్స్ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2016లో ఈ సంస్థను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79ఏ ప్రకారం ‘ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’గా గుర్తింపు పొందిన తొలి సంస్థగా ఆవిర్భవించింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని సైబర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (సీఐఎస్) విభాగం పరిధిలో మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నియంత్రణ పథకం కింద నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ(ఈ) ప్రాజెక్టును చేపట్టింది. అయిదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.35.51 కోట్లను మంజూరు చేసింది.
3 హైకోర్టులకు అయిదుగురు అదనపు న్యాయమూర్తుల నియామకం
దేశంలోని మూడు హైకోర్టులకు అయిదుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతో సంప్రదించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 224(1) ప్రకారం వీరి నియామకాలను చేపట్టినట్లు కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. న్యాయాధికారులుగా పనిచేసిన అనన్య బంధోపాధ్యాయ, రాయ్ చటోపాధ్యాయ, సుభేందు సమంతలను కోల్‌కతా హైకోర్టుకూ, న్యాయవాదులుగా సేవలు అందించిన సచిన్‌సింగ్ రాజ్‌పుత్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకూ, శోభా అన్నమ్మ ఏపెన్‌ను కేరళ హైకోర్టుకూ అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.
తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు
రాష్ట్రంలో అమలవుతోన్న తెలంగాణ డయాగ్నొస్టిక్స్ పథకానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నాలుగేళ్ల కిందట తొలిసారిగా హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) నారాయణగూడ ఆవరణలో ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్’ కేంద్రం, ‘నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబోరేటరీస్ (ఎన్‌ఏబీఎల్)’ గుర్తింపును సాధించింది. 2 వారాల్లోగా అధికారికంగా ఎన్‌ఏబీఎల్ గుర్తింపు ధ్రువపత్రం లభిస్తుందని, ఇక నుంచి ఆ గుర్తింపు ముద్రను కూడా నిర్ధారణ పరీక్షల ఫలితాలపై ముద్రించవచ్చని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ వైద్యంలో ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందడం తొలిసారని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 2018లో తొలిసారిగా ప్రవేశపెట్టిన తెలంగాణ డయాగ్నొస్టిక్స్ పథకాన్ని ప్రారంభించారు.
మాహి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్‌పీసీ) లిమిటెడ్ ప్రారంభం
చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపునకు రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవో) దోహదపడతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. దిల్లీలో మాహి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్‌పీసీ) లిమిటెడ్‌ను ఆన్‌లైన్ వేదికగా ఆయన ప్రారంభించారు. రైతు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజన్ 2024 డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.
కరోనా మరణాల అడ్డుకట్టలో వ్యాక్సిన్ విజయవంతం: ఐసీఎంఆర్
కరోనా మరణాలను అరికట్టడంలో వ్యాక్సిన్ పూర్తిగా విజయవంతమైనట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. తొలి డోసు తీసుకున్న వారిలో 99%, రెండు డోసులు తీసుకున్న వారిలో 99.4% ప్రభావవంతంగా వ్యాక్సిన్ పని చేసినట్లు ఒక విశ్లేషణ పత్రాన్ని వెల్లడించింది. గత ఏడాది కాలంలో కరోనా ఉద్ధృతులు పెరిగినప్పుడు అత్యధిక మంది వ్యాక్సిన్ తీసుకోని వారే మరణించినట్లు పేర్కొంది. గత జనవరి 30న ముగిసిన వారంలో వ్యాక్సిన్ తీసుకోని వారిలో ప్రతి పది లక్షల మందికి 19.67 మరణాలు, అదే ఒక డోసు తీసుకున్న వారిలో 0.1, రెండు డోసులు తీసుకున్న వారిలో 0.11 మరణాలు నమోదైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
కర్ణాటకలో ‘మత మార్పిడి నిషేధ’ ఆర్డినెన్స్!
ఉభయ సభల్లో ఆమోదం పొందకున్నా ఆర్డినెన్స్ ద్వారా మత మార్పిడి నిషేధ చట్టాన్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపేందుకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. అధికార పక్షానికి విధాన పరిషత్తులో సంఖ్యా బలం లేకపోవడంతో డిసెంబరు, మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు. వర్షాకాల సమావేశాలకు ఇంకా సమయం ఉండటంతో ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. మత మార్పిడి నిషేధ చట్టం అని కాకుండా మత స్వేచ్ఛ పరిరక్షణ చట్టం పేరిట ఆదేశాలు అమలు చేస్తామని తెలిపారు.
నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీలో ఏపీకి చోటు
తీరప్రాంత నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కొత్తగా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉండే ఈ అథారిటీలో మొత్తం 23 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు, ఒక నిపుణ సభ్యుడు ఉంటారు. ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో ఏపీ పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శికి స్థానం కల్పించారు. వీరి పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కోస్టల్ జోన్ ప్రాంతాల మార్పులు, చేర్పుల ప్రతిపాదనలను ఈ అథారిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.
సుప్రీంలో జడ్జీల నియామకం సంపూర్ణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలాలు ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది. వీరిద్దరి బాధ్యతల స్వీకారంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల పోస్టులను కేంద్రం భర్తీ చేసినట్లయింది.
ఇంటి యజమానికి ‘ఈ ప్రాపర్టీ’ కార్డు
దేశవ్యాప్తంగా 2025 నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి అతని ఇంటికి సంబంధించి హక్కుదారుడి హోదా కల్పించి ‘ఈ-ప్రాపర్టీ’ కార్డు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని స్వామిత్వ (సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) పేరిట కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలుత ప్రయోగాత్మకంగా అయిదు గ్రామాల్లో అమలు చేసి సాధ్యాసాధ్యాలు మదింపు చేయనున్నారు. ఇందులో భాగంగా అయిదు అంశాలను ప్రామాణికంగా తీసుకొని గ్రామాలను ఎంపిక చేశారు. అవి.. జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ (అధిక ఎస్సీ సామాజిక జనాభా), ఆదిలాబాద్ జిల్లా ఆర్లి (గిరిజన జనాభా), మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట (హెచ్‌ఎండీఏ పరిధి), రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సరస్వతి గూడ (అర్బన్ లోకల్ బాడీస్ సమీప గ్రామం), కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం (అధిక జనాభా).
ప్లాస్టిక్ కవర్లతో మ్యాట్‌ల తయారీ
సూర్యాపేట మున్సిపాలిటీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గృహాలు, దుకాణాల్లో సేకరించిన సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లతో ఆక్యుప్రెజర్ బోర్డులు, ఇటుకలు, మ్యాట్‌లను రూపొందిస్తోంది. ఈ తరహాలో ఒక మున్సిపాలిటీ తయారు చేయడం దేశంలో ఇదే ప్రథమం. ఇప్పటికే ఇళ్ల నుంచి సేకరించిన చెత్తతో ఎరువు తయారు చేసి రైతులకు, మిద్దె సాగు చేసేవారికి విక్రయిస్తోంది. తాజాగా ప్లాస్టిక్ కవర్లతో మ్యాట్‌లు రూపొందిస్తోంది. ఇటీవల చెత్త నుంచి బయోగ్యాస్ తయారు చేసే ప్లాంటు ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో తొలిసారి ఇక్కడ ఈ యూనిట్ నెలకొల్పడం గర్వకారణమని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి అన్నారు.
నేషనల్ డేటాబేస్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: అమిత్ షా
భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద కదలికలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసే జాతీయ డేటాబేస్ ద్వారా సులువుగా పర్యవేక్షించే వీలుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. బెంగళూరులో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (న్యాట్‌గ్రిడ్) కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వదేశీ సాంకేతికతతో సైనిక వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో అభివృద్ధి చేసే నేషనల్ డేటాబేస్ ద్వారా హవాలా లావాదేవీలు, ఉగ్రవాదులకు నిధులు, నార్కోటిక్స్, బాంబు దాడులు, స్మగ్లింగ్ వంటి ఉగ్రవాద చర్యలపై పర్యవేక్షణ సాధ్యపడుతుందని వివరించారు.
పంచాయతీ ఆడిటింగ్‌లో మార్గదర్శక రాష్ట్రంగా తెలంగాణ
గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆడిటింగ్‌తో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శక రాష్ట్రం (నేషనల్ లీడ్ స్టేట్)గా నిలిచింది. పంచాయతీ ఆడిటింగ్‌లో తెలంగాణ వరుసగా రెండో సారి మొదటి స్థానాన్ని దక్కించుకుని ఈ ఘనత సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘‘32 జిల్లా పరిషత్‌లు, 540 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్న తెలంగాణ నేషనల్ లీడ్ స్టేట్‌గా నిలవడం గర్వకారణం’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.