అంతర్జాతీయం



ఆస్ట్రేలియా ప్రధానిగా అల్బనీస్‌

ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ విజయ పథాన పయనిస్తోంది. ఇంకా లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఫలితాల సరళిని గమనించిన ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ ఓటమిని అంగీకరించారు. అమెరికా, జపాన్, భారత నేతలతో జరిగే శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాల్సిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2007 తర్వాత లేబర్‌ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటులోని ప్రతినిధుల సభలో మొత్తం 151 స్థానాలు ఉన్నాయి.

ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న అల్బనీస్‌ పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు తండ్రి అండలేదు. తల్లే ఆయనను పెంచి పెద్ద చేశారు. అంగవైకల్యం కింద వచ్చే కొద్దిపాటి పెన్షనే ఆమెకు ఆధారం. ప్రభుత్వం కల్పించిన గృహ వసతిలోనే తల్లి, కుమారుల జీవనం సాగింది.


తొలిసారి శ్రీలంక రుణ ఎగవేత!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కారణంగా దేశచరిత్రలో తొలిసారి శ్రీలంక రుణం చెల్లించడంలో విఫలమైంది. ఈ శతాబ్దంలోనే ఓ ఆసియా - పసిఫిక్‌ దేశం రుణాన్ని ఎగవేయడం ఇదే తొలిసారి అని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. శ్రీలంక 78 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 605 కోట్లు) రుణ వడ్డీ చెల్లింపులకు సంబంధించి 30 రోజుల అదనపు గడువు (గ్రేస్‌ పీరియడ్‌) కూడా తీరిపోయింది. దీంతో ఈ దేశం రుణాన్ని ఎగవేసినట్లు ప్రపంచంలో రెండు అతిపెద్ద క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ప్రకటించాయి.

శ్రీలంకలో 9 మంది కొత్త మంత్రులతో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘేను గొటబాయ ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రుల్లో ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ (ఎస్‌జేబీ) నుంచి ఇద్దరిని తీసుకున్నారు. మిగతావారంతా రాజపక్స సొంతపార్టీ ఎస్‌ఎల్‌పీపీకి చెందినవారే.


ఎవరెస్టుపై ప్రపంచంలో ఎత్తయిన వాతావారణ కేంద్రం

ప్రపంచంలో ఎత్తయిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాన్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ నిపుణులు ఎవరెస్టు శిఖరంపై 8,830 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. వివిధ వాతావరణ మార్పులను స్వయంచాలకంగా ఈ కేంద్రం గుర్తిస్తుంది. ఎవరెస్టు శిఖరాగ్రానికి (8,848.86 మీటర్లు) కొద్ది మీటర్ల దిగువన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నేపాల్‌కు చెందిన జల, వాతావరణ విభాగం (డీహెచ్‌ఎం) తెలిపింది. సౌరశక్తి సాయంతో ఇది పనిచేస్తుంది.

జమైకాలోని వీధికి అంబేడ్కర్‌ పేరు

జమైకా రాజధానిలోని డౌన్‌టౌన్‌ కింగ్‌స్టన్‌లో ఒక వీధికి భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టారు. దీంతో పాటు రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కృషికి గుర్తింపుగా అక్కడే ఒక స్మారకాన్ని నిర్మించారు. వీటిని జమైకా మంత్రి డెస్మెండ్‌ మెకెంజేతో కలిసి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్‌నెస్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, రైల్వే, రవాణా, క్రీడలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మెరుగుపరుచుకునే విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల్లో శిక్షణ కోసం సుష్మా స్వరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ సర్వీసెస్, జమైకా విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు.

ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా ఎలిసబెత్‌ బోర్న్‌

ఫ్రాన్స్‌ నూతన ప్రధానమంత్రిగా ఎలిసబెత్‌ బోర్న్‌ (61) నియమితులయ్యారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ బోర్న్‌. అధ్యక్షునిగా ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌ ఇటీవల రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన మెక్రాన్, ఆయన స్థానంలో బోర్న్‌ను ప్రధానిగా నియమించారు. 2017లో మెక్రాన్‌కు చెందిన ‘ఎన్‌ మార్చ్‌’ పార్టీ తీర్థం పుచ్చుకున్న బోర్న్‌ 2018లో రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి కార్మికశాఖ మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. 1991 - 92లో ఎడిత్‌ క్రెస్సన్‌ ఫ్రాన్స్‌ తొలి మహిళా ప్రధానిగా పనిచేశారు.

యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్‌ మహమ్మద్‌ బిన్‌

అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మృతి చెందిన మరుసటి రోజే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తన నూతన పాలకుడిని ప్రకటించింది. అబుదాబిలో ఏడు ఎమిరేట్స్‌ పాలకులు సమావేశమై దేశ నూతన అధ్యక్షుడిగా షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇప్పుడు వారసుడిగా ఎంపికైన మహమ్మద్, దివంగత అధ్యక్షుడి సోదరుడే.

ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన వంతెన ప్రారంభం

చెక్‌ రిపబ్లిక్‌లోని డోల్నీ మొరావాలో ఏర్పాటు చేసిన ఊయల వంతెన ఇది. 2,365 అడుగుల (721 మీటర్లు) పొడవైన ఈ వంతెనను సముద్ర మట్టానికి 1,100 మీటర్లకుపైగా ఎత్తున నిర్మించారు. లోయలో నుంచి 95 మీటర్ల ఎత్తున రెండు పర్వత శిఖరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను ప్రారంభించారు. పాదచారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊయల వంతెనల్లోకెల్లా ఇదే పొడవైంది.

శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘె

శ్రీలంకలో నూతన ప్రధాన మంత్రిగా ప్రతిపక్ష నేత రణిల్‌ విక్రమసింఘె (73) బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేశారు. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా దేశమంతటా పెల్లుబికిన నిరసనలకు తలొగ్గి ప్రధాని పదవికి మహీంద రాజపక్స రాజీనామా చేశారు. అనంతరం నూతన ప్రధానమంత్రి నియామక ప్రక్రియకు ఉపక్రమించిన దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) అగ్రనేత విక్రమసింఘెతో భేటీ అయ్యారు. ఆయన్ను దేశ 26వ ప్రధానిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే విక్రమసింఘె ప్రమాణస్వీకార కార్యక్రమమూ పూర్తయింది.

విక్రమసింఘె 1948లో జన్మించారు. 28 ఏళ్ల వయసులో తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 45 ఏళ్లుగా పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తొలిసారి 1993 - 94 మధ్య, తర్వాత 2001 - 04, 2015 - 18 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశారు. 2018 అక్టోబరులో అప్పటి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రధాని పీఠం నుంచి విక్రమసింఘెను తప్పించారు. ఫలితంగా దేశంలో రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తింది. సుప్రీంకోర్టు జోక్యంతో రెండు నెలల తర్వాత మళ్లీ విక్రమసింఘె ప్రధాని పీఠమెక్కారు. ప్రధానిగా ఉన్నప్పుడు లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈళం (ఎల్‌టీటీఈ)తో విక్రమసింఘె శాంతి చర్చలు జరిపారు.


దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్‌ సుక్‌ యూల్‌ బాధ్యతల స్వీకరణ దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్‌ సుక్‌ యూల్‌ (61) బాధ్యతలు చేపట్టారు. దక్షిణ కొరియా పలు సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో యూన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలో పదో ఆర్థిక శక్తిగా ఎదిగిన ఈ దేశానికి భద్రత, ఆర్థిక, సామాజికపరంగా పలు సమస్యలు ముందున్నాయి. ఉత్తర కొరియా విషయంలో దృఢమైన వైఖరి అవలంబిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన యూన్‌ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంలో సౌమ్యంగానే వ్యవహరించారు.
బ్రిటన్‌ పార్లమెంటు వార్షిక సమావేశాలు బ్రిటన్‌ పార్లమెంటు చరిత్రలో దాదాపు గత ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా వార్షిక సమావేశాల ప్రారంభానికి ఎలిజబెత్‌ రాణి-2 గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాణి ప్రతినిధిగా ఆమె కుమారుడు, వారసుడైన ప్రిన్స్‌ ఛార్లెస్‌ (73) తొలి ఉపన్యాసం చేశారు. బ్రిటన్‌ రాచరిక వ్యవస్థలో రాజ్యాంగపరంగా కీలకపాత్ర పోషించే రాణి తన ప్రసంగాన్ని చదివి వినిపించటం ఏటా సంప్రదాయంగా వస్తోంది. ప్రభుత్వం చేపట్టే పనుల వార్షిక ఎజెండాపై ఈ ప్రసంగ పాఠాన్ని అధికార పార్టీయే సమకూరుస్తుంది. 96 ఏళ్ల రాణి ఆ బాధ్యతను ప్రిన్స్‌ ఛార్లెస్‌కు అప్పగించటం అధికార మార్పిడి దిశగా పడుతున్న అడుగులకు సంకేతమని భావిస్తున్నారు. ‘హర్‌ మెజెస్టీ’ అంటూ ఛార్లెస్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గతంలో తాను గర్భవతిగా ఉన్నపుడు 1959, 1963 వార్షిక పార్లమెంటు సమావేశాలకు మాత్రమే రాణి గైర్హాజరయ్యారు.
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసన జ్వాలలకు ప్రధానమంత్రి మహీంద రాజపక్స ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. నిట్టంబువ పట్టణంలో చోటు చేసుకున్న ఘర్షణలు అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అథూకోరలా ఆత్మహత్యకు దారి తీయడం సంచలనం సృష్టించింది. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. రాజధాని కొలంబోలో సైనిక బలగాలను మోహరించాయి. మహీంద రాజీనామాతో కేబినెట్‌ కూడా రద్దయింది.

హాంకాంగ్‌ నూతన అధిపతిగా జాన్‌ లీ

చైనా అనుకూల నేత జాన్‌ లీ హాంకాంగ్‌ నగర నూతన అధిపతిగా ఎన్నికయ్యారు. దీంతో హాంకాంగ్‌ పరిపాలన వ్యవహారాలపై బీజింగ్‌ పట్టు మరింత బిగిసింది. ఎన్నికల ఫలితాల్లో జాన్‌ లీకి 99 శాతం ఓట్లు లభించాయి. సుమారు 1500 మంది కమిటీ సభ్యుల్లో చాలా మంది గతంలో హాంకాంగ్‌లో ప్రజాసామ్య ఉద్యమాన్ని భద్రతా ముఖ్య అధికారిగా కఠినంగా అణిచి వేసిన లీ వైపే మొగ్గు చూపారు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఎన్నికల్లో లీ ఒక్కరే పోటీ చేయడం. జులై ఒకటిన లీ, ప్రస్తుత నేత కారీ లామ్‌ నుంచి అధికారం చేపట్టనున్నారు.

రెండోసారి ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మెక్రాన్‌ ప్రమాణస్వీకారం

ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (44) ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా రెండో సారి ప్రమాణస్వీకారం చేశారు. కార్మిక సంఘాలు, ఇతర సంస్థలు, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులతో తన ప్రభుత్వం, పార్లమెంటు కలసి పనిచేస్తాయనీ తద్వారా దేశానికి న్యాయమైన పాలన అందించి, సామాజిక ఉద్రిక్తతలను ఉపశమింపజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈసారి తన మొదటి ప్రాధాన్యం ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మరింత ప్రజ్వరిల్లకుండా నిరోధించడమేనని, తదుపరి ప్రాధాన్యం ప్రపంచ వేదికపై ఫ్రాన్స్, ఐరోపాలు ప్రముఖ పాత్ర వహించేట్లు చూడటమని మెక్రాన్‌ ప్రకటించారు. పారిస్‌లో నిర్వహించిన మెక్రాన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 500 మంది అతిథులు పాల్గొన్నారు. రెండోసారి దేశాధ్యక్షుడిగా మెక్రాన్‌ అయిదేళ్ల పదవీ కాలం మే 14న ప్రారంభమవుతుంది.

శ్రీలంకలో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధించారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నట్లు అధికార మీడియా విభాగం వెల్లడించింది. ప్రజల భద్రతకు, నిత్యావసర సేవలను నిరాటంకంగా అందించేందుకు ప్రభుత్వ చర్య తోడ్పడుతుందని పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని మహింద రాజీనామా చేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు, సమ్మెలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఆత్యయిక పరిస్థితి విధించడం వల్ల ప్రజలను కారణం చెప్పకుండానే అరెస్టు చేసే అధికారం పోలీసులకు, భద్రత బలగాలకు లభిస్తుంది. ఎమర్జెన్సీ విధించడం నెల వ్యవధిలో ఇది రెండోసారి.

బైడెన్‌ సలహా మండలిలోకి రిచర్డ్‌ వర్మ

భారతీయ - అమెరికన్‌ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్‌ వర్మ (53)ను తన ఇంటెలిజెన్స్‌ సలహా మండలిలో చేర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈయన 2014 - 17లో భారతదేశానికి అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. బైడెన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన వర్మ ప్రస్తుతం ‘మాస్టర్‌కార్డ్‌’కు గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ఎవరెస్ట్‌పై ఏర్పాటు చేసిన చైనా

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసింది. ఎవరెస్ట్‌ శిఖరంపై సముద్ర మట్టానికి 8,830 కిలోమీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ వాతావరణ కేంద్రంలో ఉపగ్రహ వ్యవస్థతో పాటు డేటా ట్రాన్స్‌మిషన్‌ కేంద్రం కూడా ఉంది. గతంలో అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు 8,430 కిలోమీటర్ల ఎత్తులో ఎవరెస్ట్‌ దక్షిణ భాగాన నిర్మించిన వాతావరణ కేంద్రమే.. అత్యంత ఎత్తైనది. ఆ రికార్డును ఇప్పుడు చైనా అధిగమించింది.

కెనడాలోని సనాతన్‌ మందిర్‌ కల్చరల్‌ సెంటర్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ

భారత్‌ ఇతరులను నష్టపరిచి ఎదగాలనుకోదని, వసుధైక కుటుంబ భావనతోనే నిరంతరం పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన కెనడాలోని మార్గామ్‌లో సనాతన్‌ మందిర్‌ కల్చరల్‌ సెంటర్‌ ప్రాంగణంలో భారతదేశం అమృత్‌ మహోత్సవాల జరుపుకొంటున్న వేళ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవ భారత సంకల్పానికి ప్రజలందరూ పూనుకోవాలని పేర్కొన్నారు.

2100 నాటికి సగం తగ్గనున్న చైనా జనాభా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో పరిస్థితులు మారిపోతున్నాయి. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆ దేశ జనాభా తగ్గుముఖం పడుతోంది. 2021 నుంచి ఏటా సగటున 1.1 శాతం చొప్పున తగ్గుతున్న చైనా జనాభా 2100 సంవత్సరం నాటికి కేవలం 58.7 కోట్లకు పడిపోతుందని షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ అంచనా వేసింది. అంటే ఇప్పుడున్న జనాభాలో సగం కంటే తక్కువ. గడచిన నాలుగు దశాబ్దాలలోనే చైనా జనాభా 66 కోట్ల నుంచి 140 కోట్లకు పెరిగింది. కానీ, ఈ ఏడాది మొదటిసారి జనాభా వృద్ధి రేటు మందగించింది. 2020లో 141 కోట్ల 21 లక్షల 20 వేలుగా ఉన్న చైనా జనాభా 2021లో కేవలం 4.80 లక్షలు మాత్రమే పెరిగి 141 కోట్ల 26 లక్షలైందని చైనా జాతీయ గణాంక సంస్థ వెల్లడించింది.

చైనాలో స్త్రీ జనాభా 1980లలో 2.6 శాతంగా ఉన్న ఈ రేటు క్రమంగా తగ్గిపోతూ 2021లో కేవలం 1.15కి చేరింది. ఇది మున్ముందు 1.1కి పడిపోతుందని అంచనా. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియాలలో ఈ రేటు 1.6 శాతంగా ఉంటే, జపాన్‌లోనూ ఇది 1.3 శాతంగా ఉంది. చాలా దేశాల్లో ప్రతి 100 మంది బాలికలకు 106 మంది బాలురు జన్మిస్తుంటే చైనాలో 120 మంది బాలురు జన్మిస్తున్నారు. చైనాలో 2014లో గరిష్ఠ స్థాయికి చేరిన పని చేసే వయసులోని జనాభా 2100నాటికి అందులో మూడో వంతుకు పడిపోనుంది.


2035 తర్వాత విద్యుత్‌ కోసం బొగ్గు వాడం

విద్యుత్‌ రంగం నుంచి గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తరిమివేస్తామని జి-7 దేశాలు ప్రతిన చేశాయి. బొగ్గు ఆధారిత విద్యుత్‌ను 2035 తర్వాత ఉత్పత్తి చేయమని పేర్కొన్నాయి. ఈ మేరకు బెర్లిన్‌లో జి-7 దేశాల వాతావరణ, ఇంధన మంత్రులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2030కల్లా విద్యుత్‌ రంగాన్ని కర్బన రహిత రంగంగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. జి-7లో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, కెనడా, జపాన్, ఇటలీ సభ్య దేశాలు.

శ్రీలంకలో 21వ రాజ్యాంగ సవరణకు నిర్ణయం

తీవ్ర సంక్షుభిత సమయంలో కీలక రాజ్యాంగ సవరణకు శ్రీలంక రాజకీయ అగ్ర నేతలు అంగీకరించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను నియంత్రించే 21వ రాజ్యాంగ సవరణకు వీలయినంత త్వరలో ఆమోదం తెలపాలని నిర్ణయించారు. వారంతా ప్రధాని రణిల్‌ విక్రమసింఘేను కలిశారు. ఈ సందర్భంగా కీలక రాజ్యాంగ సవరణలపై చర్చించారు. 20వ రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టగా, మరో సవరణతో వాటికి ముగింపు పలకాలని నేతలు యోచిస్తున్నారు. శ్రీలంకలో అధ్యక్షుడి కంటే పార్లమెంటును శక్తిమంతమైనదిగా చేస్తూ 19వ సవరణ చేయగా, దాన్ని 20వ సవరణ ద్వారా రద్దు చేశారు. కాగా 21వ సవరణకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని విక్రమసింఘే తెలిపారు.

‘బ్రిక్స్‌’ విస్తరణ మాకు సమ్మతమే: చైనా

‘బ్రిక్స్‌’ కూటమి విస్తరణకు తాము మద్దతిస్తామని చైనా పేర్కొంది. ఇందులో సౌదీ అరేబియా, అర్జెంటీనాలు పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చేరాలనుకుంటున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్‌ ఈ వ్యాఖ్య చేసింది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కూటమి అధ్యక్ష స్థానంలో చైనా ఉంది. ఆ హోదాలో తాము బ్రిక్స్‌ విస్తరణ ప్రక్రియకు తోడ్పాటు ఇస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు. ఇటీవల ముగిసిన కూటమి విదేశాంగ మంత్రుల సదస్సులో ఈ అంశంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు పేర్కొన్నారు. తొలిసారిగా ‘బ్రిక్స్‌ ప్లస్‌’ విదేశాంగ మంత్రుల భేటీని నిర్వహించామన్నారు. అందులో కజకస్థాన్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఈజిప్ట్, నైజీరియా, సెనెగల్, యూఏఈ, థాయ్‌లాండ్‌లు పాలుపంచుకున్నాయని తెలిపారు.

కొవాగ్జిన్‌కు జర్మనీ గుర్తింపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) రూపొందించిన జాబితాలో ఉన్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ప్రయాణ అవసరాల కోసం గుర్తించనున్నట్లు జర్మనీ ప్రకటించింది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ఈ టీకాను తీసుకున్నవారు తమ దేశానికి రావచ్చని భారత్‌లోని జర్మనీ రాయబారి వాల్టెర్‌ జె లిండ్నెర్‌ తెలిపారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న ప్రయాణికుల్ని ఆస్ట్రేలియా, జపాన్, కెనడా వంటి అనేక దేశాలు ఇప్పటికే అనుమతిస్తున్నాయి.

శ్రీలంకలో ప్రధానికే ఆర్థిక శాఖ బాధ్యతలు

సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో కీలక ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రధాని రణిల్‌ విక్రమసింఘే చేపట్టారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘే మే 12న మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు శ్రీలంక తగిన విస్తృత ఆర్థిక విధానానికి రూపకల్పన చేస్తే తప్ప కొత్త లేదా స్వల్పకాలిక రుణాలు వంటివేమీ మంజూరు చేసేది లేదని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది.

వాణిజ్యానికి ఇండో - పసిఫిక్‌ ఆర్థిక చట్రం (ఐపీఈఎఫ్‌) ప్రతిన

సుస్థిర ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం లక్ష్యంతో స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాతావరణంలో వాణిజ్యాన్ని కొనసాగించాలని 13 సభ్య దేశాలతో కొత్తగా ఏర్పాటైన ఇండో - పసిఫిక్‌ ఆర్థిక చట్రం (ఐపీఈఎఫ్‌) ప్రతిన బూనింది. పరస్పర సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకునే అవకాశాలను సభ్య దేశాలు చర్చల ద్వారా గుర్తించాలని నిర్ణయించింది. ఈ మేరకు టోక్యోలో ఒక సంయుక్త ప్రకటనను వెలువరించింది. భారత్, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేసియా, జపాన్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాం దేశాల భాగస్వామ్యంతో ఐపీఈఎఫ్‌ ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో సుస్థిరమైన, సమ్మిళితమైన ఆర్థికాభివృద్ధిని సమష్టిగా సాధించేందుకు నిబద్ధతతో వ్యవహరించనున్నట్లు సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని ఇతర దేశాలూ ఈ కృషిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాయి.

మేరియుపొల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా

దాదాపు మూడు నెలలుగా కొనసాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారానికి పూర్తిస్థాయిలో విముక్తి కల్పించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు రక్షణ మంత్రి సెర్గే షొయిగు నివేదించారు. 11 చ.కి.మీ. విస్తీర్ణంలోని కర్మాగారంతో కలిపి యావత్తు నగరం తమ చేతికి వచ్చిందని తెలిపారు. దీనిని ఉక్రెయిన్‌ ధ్రువీకరించలేదు. రష్యా నుంచి క్రిమియాకు భూమార్గాన్ని ఏర్పాటు చేయడంలో ఈ నగరం కీలకమన్న విషయం తెలిసిందే. డాన్‌బాస్‌లో పోరుకు మరిన్ని బలగాలను తరలించడానికి ఈ మార్గం ఉపకరిస్తుందని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్‌ మాత్రం కీలకమైన ఓడరేవును కోల్పోయినట్లయింది.

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో రెండు వారాల క్రితం విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రభుత్వం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో మే 6వ తేదీ నుంచి శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రెండోసారి ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు అధ్యక్ష సచివాలయం తాజాగా ప్రకటన చేసింది. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పోలీసులు, భద్రత దళాలకు విశేష అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలెవరినైనా కారణం చెప్పకుండా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి వారికి అధికారం ఉంటుంది.

నాటోకు ఫిన్లాండ్, స్వీడన్‌ దరఖాస్తుల సమర్పణ

రష్యా తమపైనా దురాక్రమణకు దిగవచ్చనే ఉద్దేశంతో నాటోలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్‌ దానికి సంబంధించిన దరఖాస్తులను బ్రసెల్స్‌లోని కూటమి ప్రధాన కార్యాలయానికి పంపించాయి. నాటో సభ్య దేశాల్లో ఒకటైన టర్కీ వీటి చేరికపై అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఈ రెండు దేశాలు అధికారిక ప్రక్రియతో ముందుకు సాగుతున్నాయి. కొత్త దేశం నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి. దీనికి రెండు వారాల సమయం పడుతుంది. అమెరికా సహా నాటోలోని చాలా దేశాలు ఫిన్లాండ్, స్వీడన్‌ను స్వాగతిస్తున్నాయి.

నాటోలో చేరేందుకు 188-8 ఓట్ల తేడాతో ఫిన్లాండ్‌ పార్లమెంటు ఆమోదం

ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో చేరడానికి ఫిన్లాండ్, స్వీడన్‌ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ ప్రతిపాదనపై ఫిన్లాండ్‌ పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 188 మంది, వ్యతిరేకంగా ఎనిమిది మంది స్పందించారు. ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించిన ఫిన్లాండ్‌ అధ్యక్షుడు, ప్రధాని, దానికి చట్టసభలోనూ ఆమోదం పొందారు. లాంఛనప్రాయమైన దరఖాస్తుపై సంతకం చేసి, కొద్దిరోజుల్లో దానిని నాటో ప్రధాన కార్యాలయానికి పంపించనున్నారు. మరోవైపు ఇద్దరు ఫిన్లాండ్‌ దౌత్యవేత్తల్ని బహిష్కరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ‘బాల్టిక్‌ సముద్ర దేశాల మండలి’ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపింది.

గొటబాయపై వీగిన అవిశ్వాసం

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రతిపక్ష తమిళ్‌ జాతీయ కూటమి (టీఎన్‌ఏ) ఎంపీ ఎం.ఏ.సుమంతిరన్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేయగా 68 మంది మాత్రమే మద్దతు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం సమాగీ జన బలవేగయ (ఎస్‌జేబీ)కి చెందిన ఎంపీ లక్ష్మణ్‌ కిరియెల్లా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘె నియామకం తర్వాత పార్లమెంటు తొలిసారి సమావేశమైంది.

శ్రీలంక పార్లమెంటు ఉప సభాపతిగా అధికార పార్టీ (శ్రీలంక పోదుజన పెరామునా)కి చెందిన 48 ఏళ్ల అజిత్‌ రాజపక్స ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్లమెంటులో చేపట్టిన రహస్య బ్యాలెట్‌ విధానంలో ఓటింగ్‌ నిర్వహించారు. ఆయనకు 109 ఓట్లు రాగా, ప్రధాన ప్రతిపక్ష (ఎస్‌జేబీ) అభ్యర్థి రోహిణి కవిరత్నకు 78 ఓట్లు వచ్చాయి. 23 ఓట్లను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ మహింద యపా అబేయవర్దనే ప్రకటించారు.


ఫిరాయింపుదారుల ఓట్లు చెల్లవంటూ పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

సొంత పార్లమెంటరీ పార్టీల మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వేసే ఓట్లు పరిగణనలోకి తీసుకోవద్దంటూ పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని 63-ఎ అధికరణం ప్రకారం.. ఆయా పార్టీల సభ్యులు పార్టీ సూచనలకు విరుద్ధంగా ఓటు వేసేందుకు అనుమతించరాదంటూ చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 3-2 తేడాతో ఆదేశాలు జారీ చేసింది.

నాటోలో చేరుతాం: స్వీడన్‌

తటస్థ వైఖరిని విడనాడి నాటోలో చేరబోతున్నట్లు స్వీడన్‌ ప్రధాని మగ్దలీనా ఆండర్సన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇది ఉత్తమ చర్యగా పేర్కొన్నారు.

నాటోలో చేరుతాం

‘ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి’ (నాటో)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు రష్యా సరిహద్దు దేశమైన ఫిన్లాండ్‌ అధికారికంగా ప్రకటించింది. ‘ఇదొక చరిత్రాత్మక దినం. కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నాం’ అని ఆ దేశాధ్యక్షుడు సౌలీ నీనిస్తో, ప్రధాని సనా మారిన్‌ హెల్సీంకీలోని అధ్యక్ష భవనంలో సంయుక్తంగా పేర్కొన్నారు. ఫిన్లాండ్‌ పార్లమెంటు కొద్దిరోజుల్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించనుంది. సభ్యత్వం కోసం లాంఛనంగా దరఖాస్తును నాటోకు సమర్పించనున్నారు. ఉక్రెయిన్‌కు తదుపరి మద్దతు అందించడంతో పాటు ఫిన్లాండ్, స్వీడన్‌లను నాటోలో చేర్చుకునే విషయమై చర్చించడానికి 30 సభ్య దేశాలకు చెందిన దౌత్య వేత్తలు బెర్లిన్‌లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌ ప్రకటన వెలువడింది. కొత్త దేశాలకు సభ్యత్వం ఇచ్చే విషయం సత్వరం కొలిక్కి తెస్తామని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బెర్గ్‌ ప్రకటించారు.

ఆసియా ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్ష పీఠంపై భారత్‌

ఆసియా ఎన్నికల ప్రాధికార సంస్థల సంఘం (ఏఏఈఏ) అధ్యక్ష పీఠానికి భారత్‌ ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2024 వరకు మన దేశం ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో మే 7న జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు, జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఈ పీఠాన్ని దక్కించుకున్నట్లు తెలిపింది. కొత్త ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో రష్యా, ఉజ్బెకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, తైవాన్, ఫిలిప్పీన్స్‌ సభ్య దేశాలుగా ఉన్నట్లు పేర్కొంది.

ఐరాస మానవ హక్కుల మండలిలో రష్యా బదులు చెక్‌ రిపబ్లిక్‌

ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలిలో రష్యా బదులు చెక్‌ రిపబ్లిక్‌ను తీసుకునేందుకు ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానించింది.

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక రష్యాను ఈ స్థానం నుంచి తొలగించారు. 193 సభ్య దేశాల్లో 180 దేశాలు రహస్య బ్యాలెట్‌లో పాల్గొనగా, చెక్‌కు అనుకూలంగా 157 ఓట్లు వచ్చాయి.

ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్ల సాయం అందించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు.