పుస్తకాలు

మోదీ 8 ఏళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రం

→ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఎనిమిదేళ్లలో దేశానికి సుపరిపాలన అందించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపింది. మోదీ ప్రధాని పీఠమెక్కాక చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కేంద్రం వంద పేజీల కర పుస్తకాన్ని విడుదల చేసింది.
→‘8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం’ అనే పేరుతో రూపొందించిన ఈ పుస్తకంలో వివిధ అంశాల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను వివరించింది.
→‘‘సులభతర జీవనం ప్రతి పౌరుడి హక్కు. అందుకే దానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.
→దేశ ఆర్థిక పరిస్థితులను మార్చడానికి, ప్రజల జీవన ప్రమాణాల నాణ్యతను పెంచి వారి సామాజిక జీవితాన్ని మెరుగుపరచడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ ఈ ప్రభుత్వం వదులుకోదు’’ అంటూ పుస్తకానికి ప్రధాని ముందుమాట రాశారు.
→సులభతర జీవనం, వైద్యం-ఆరోగ్యం, మౌలికవసతుల కల్పన సహా మొత్తం 14 విభాగాల్లో మోదీ సర్కారు సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు.

‘డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్, సో ఆర్‌ మోరల్స్‌’ పుస్తకావిష్కరణ

→‘ఈ రోజు రూ.వందల కోట్ల కంపెనీకి యజమానిగా ఉన్న నేను ఒకప్పుడు నా వ్యాపారం ప్రారంభించేందుకు 920 రూపాయల కోసం కష్టాలు పడ్డాను’ అని ప్రముఖ వజ్రాల వ్యాపారి గోవింద్‌ ఢోలకియా తన ఆత్మకథలో గతాన్ని గుర్తు చేసుకొన్నారు.
→‘డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్, సో ఆర్‌ మోరల్స్‌’ పేరిట వెలువడిన ఈ ఆత్మకథకు సహ రచయితలుగా అరుణ్‌ తివారి, ఢోలకియా సహాయకుడైన కమలేశ్‌ యాజ్ఞిక్‌ వ్యవహరించారు. వజ్రాల తయారీ, ఎగుమతుల కంపెనీ ‘శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ అయిన గోవింద్‌ ఢోలకియా ‘నా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోడానికి ఉన్నతమైన విలువలే సాయం చేశాయి’ అని వివరించారు.
→1970 ప్రాంతంలో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించిన రోజులను ఆయన గుర్తు చేసుకొన్నారు. వజ్రాలు నాకు దేవుడితో సమానం’ అంటారు ఢోలకియా.

రాఘవేంద్రరావు రాసిన ‘‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’’ పుస్తకావిష్కరణ

దర్శక నిర్మాతలకు డబ్బే సర్వస్వం కాకూడదని, సామాజిక బాధ్యతను వారసత్వంగా తీసుకొని నేటి తరం సినిమా ద్వారా భాషకు, సమాజానికి సేవ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న ఆయన శ్రీనగర్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాసిన ‘‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం యాభై ఏళ్ల తెలుగు సినీరంగ ప్రస్థానానికి నిలువుటద్దం అని ఆయన పేర్కొన్నారు.

‘మోదీ జీ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ పుస్తకావిష్కరణ

→పాలనానుభవపరంగా సమకాలీన రాజకీయాల్లో నరేంద్ర మోదీతో సరితూగేవారెవ్వరూ దేశంలో లేరని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
→మోదీ యాత్ర అనంతమైనదని, అనుభవాలే ఆయనకు అన్నీ నేర్పాయని అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా కోణాలు, ఆయన పనిచేసే విధానాల్లోని విశిష్టతను విశ్లేషిస్తూ దేశంలోని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనంతో ‘మోదీ జీ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ అనే పుస్తకాన్ని రూపొందించారు.
→విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జై శంకర్‌లతో కలిసి ఆ పుస్తకాన్ని విడుదల చేశారు.

‘‘ద స్ట్రగుల్‌ ఫర్‌ పోలీస్‌ రీఫామ్స్‌ ఇన్‌ ఇండియా’’ పుస్తకావిష్కరణ

→‘‘దేశంలో 1857 నాటి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిషర్లు వారి రాచరిక ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
→ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్‌ రాసిన ‘‘ద స్ట్రగుల్‌ ఫర్‌ పోలీస్‌ రీఫామ్స్‌ ఇన్‌ ఇండియా’’ పుస్తకాన్ని విడుదల చేశారు.