దానిశ్ సిద్దీఖికి పులిట్జర్ అవార్డు
→అఫ్గానిస్థాన్‌లో విధి నిర్వహణలో ఉండగా తాలిబన్ల కాల్పుల్లో మరణించిన భారత ఫొటోగ్రాఫర్ దానిశ్ సిద్దీఖికి ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డు లభించింది. భారత్‌లో కొవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో చోటు చేసుకున్న మరణాలకు సంబంధించి తీసిన చిత్రాలకుగాను సిద్దీఖితో పాటు రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన ఆయన సహచరులు అద్నాన్ అబిద్, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ దవేలకూ ఈ పురస్కారం దక్కింది. పులిట్జర్ ప్రైజ్ కమిటీ మొత్తం 16 విభాగాల్లో ఈ ఏడాది విజేతలను ప్రకటించింది. కరోనా విలయం, మరణాలకు సంబంధించి సిద్దీఖి తదితరులు తీసిన చిత్రాలు హృదయాలను ఎంతగానో కదిలించాయని పేర్కొంది. సిద్దీఖికి ఈ అవార్డు లభించడం ఇది రెండోసారి. మయన్మార్‌లో రోహింగ్యా శరణార్థుల అగచాట్లకు సంబంధించిన ఫొటోలకుగాను తొలిసారి 2018లోనూ ఆయన్ను ‘పులిట్జర్’ వరించింది.
→ ఆర్థికశాస్త్రం, మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీలు సంపాదించిన సిద్దీఖి, ఓ టీవీ ఛానల్‌లో న్యూస్ కరస్పాండెంట్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. తర్వాత రాయిటర్స్‌లో ఫొటో జర్నలిస్టుగా చేరారు. దేశ విదేశాల్లో ఎన్నో సంచలన పరిణామాలను కవర్ చేశారు. ముఖ్యంగా అఫ్గాన్ సంక్షోభం, హాంకాంగ్ నిరసనలతో పాటు ఆసియా, పశ్చిమ ఆసియా, ఐరోపాల్లో జరిగిన పలు ఘటనలను ఆయన తన కెమెరాలో అద్భుతంగా బంధించారు.
→ అమెరికా పార్లమెంటు భవనం (యూఎస్ క్యాపిటల్)పై 2021 జనవరి 6న జరిగిన దాడిని కవర్ చేసినందుకు పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ‘వాషింగ్టన్ పోస్ట్’కు పులిట్జర్ లభించింది. రష్యా దండయాత్రను ఉక్రెయిన్ జర్నలిస్టులు అత్యంత ధైర్యం, ఓర్పు, నిజాయతీ, నిబద్ధతతో కవర్ చేస్తున్నారని ప్రశంసిస్తూ పలువురు జర్నలిస్టులకు పులిట్జర్ ప్రైజ్ కమిటీ అవార్డులు ప్రకటించింది. కొలంబియా విశ్వవిద్యాలయం ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. విజేతలకు ధ్రువపత్రంతో పాటు సుమారు రూ.11.58 లక్షల (15 వేల డాలర్ల) నగదును ప్రదానం చేస్తుంది.
సీమా పుజానీకి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు
భారత్‌కు చెందిన 10 లక్షల మంది ఆశా వర్కర్లు కొవిడ్-19 విజృంభణ సమయంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్భుతమైన వైద్య సేవలను అందించినందుకు గాను గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును డబ్లూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. జెనీవాలో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సీమా పుజానీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ద.మ.రైల్వేకి అయిదు జాతీయ పురస్కారాలు
రైల్వే 67వ వారోత్సవాల్లో ఇతర జోన్ల కంటే అధికంగా దక్షిణ మధ్య రైల్వే ఐదు ‘అఖిల భారత పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్’లను కైవసం చేసుకుంది. రైల్వే భద్రత, సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ, సివిల్ ఇంజినీరింగ్, స్టోర్స్, సివిల్ ఇంజినీరింగ్ (కన్‌స్ట్రక్షన్) విభాగాల్లో గతేడాది ఉత్తమ పనితీరుకు ఈ గుర్తింపు లభించింది. భువనేశ్వర్‌లోని రైల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ద.మ.రైల్వే జీఎం (ఇన్‌ఛార్జి) అరుణ్‌కుమార్ జైన్‌తో పాటు జోన్‌లోని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు రైల్వే శాఖ మంత్రి నుంచి ఈ పురస్కారాలను అందుకున్నారు. వ్యక్తిగత విభాగంలో ద.మ.రైల్వే జోన్ నుంచి పలువురు అధికారులు, ఉద్యోగులు అవార్డులు స్వీకరించారు.
సింగరేణికి 3 ఉత్తమ పురస్కారాలు
సింగరేణికి జియోమైన్ టెక్ విబ్జియార్ గోల్డెన్ రెయిన్ బో పురస్కారంతో పాటు సంస్థ సంచాలకులు చంద్రశేఖర్‌కు ఇన్నోవేటివ్ లీడర్ షిప్, బలరామ్‌కు ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌లెన్స్ పురస్కారం లభించాయి. భువనేశ్వర్‌లో జరిగిన 22వ అంతర్జాతీయ జియోమైన్ టెక్ సదస్సులో వీటిని ప్రదానం చేశారు. సింగరేణి ఏడు విభాగాల్లో సాధించిన ప్రగతికి గుర్తింపుగా ఇంద్రధనస్సులోని ఏడు రంగులతో పోల్చుతూ విబ్జియార్ అవార్డును అందజేశారు. మానవ వనరుల అభివృద్ధి, కార్మిక సంక్షేమం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలు, యంత్రాల సమర్థ వినియోగం, పర్యావరణ హిత చర్యలు, ఉత్పత్తిలో వృద్ధి, రక్షణ, గనుల్లో కార్మికుల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలు, కరోనా కట్టడికి యాజమాన్యం తీసుకున్న చర్యలకు విబ్జియార్ అవార్డు లభించింది.
పండిట్ మిట్టా జనార్దన్‌కు ఘంటశాల జీవన సాఫల్య పురస్కారం
ప్రముఖ సితార్ విద్యాంసుడు పండిట్ మిట్టా జనార్దన్‌ను ఘంటశాల జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించినట్లు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు తెలిపారు. ఘంటశాల శత జయంతి అంతర్జాతీయ ఉత్సవాల సందర్భంగా సంగీత ప్రపంచానికి జనార్దన్ చేసిన సేవలకుగాను ఈ పురస్కారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
సింగరేణికి ఐఐఐఈ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు
సింగరేణి సంస్థకు 2021 - 22 సంవత్సరానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. గోవాలో జరిగిన ఐఐఐఈ ముఖ్యకార్యనిర్వహణాధికారు (సీఈఓ)ల సదస్సులో గోవాకు చెందిన ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లారెంకో చేతుల మీదుగా సింగరేణి పరిపాలనా అధికారి, డీజీఎం (ఐఈ) ఎన్.భాస్కర్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 65 మిలియన్ టన్నుల ఉత్పత్తి, రూ.26 వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలోని ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ ఫొటో జర్నలిస్టుకు ఆమ్నెస్టీ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన స్వతంత్ర ఫొటో జర్నలిస్టు వడ్లమాని హర్ష ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు పొందారు. మే 4న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. మానవ హక్కులకు సంబంధించి పరిశోధనలు, ప్రసార వార్తలు, డాక్యుమెంటరీలు, ఫొటో జర్నలిజం, విద్యార్థి మీడియా, రేడియో తదితర విభాగాల్లో ఈ అవార్డులు అందించారు. దేశంలో కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న సమయంలో ప్రజలపై చూపిన ప్రభావాన్ని కళ్లకు కట్టేలా ఆయన తీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఫొటో జర్నలిజం విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో 40 రోజులు పర్యటించి అక్కడి దయనీయ పరిస్థితులను చిత్రీకరించారు.
ఇద్దరు ఎన్నారైలకు సాంకేతిక పురస్కారాలు
అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించడానికి తోడ్పడిన సాంకేతిక నిపుణులకు ఇచ్చే స్టేట్ స్కూప్ అవార్డులలో రెండింటిని భారత సంతతివారు చేజిక్కించుకున్నారు. 2022 సంవత్సరానికి ప్రకటించిన 50 స్టేట్ స్కూప్ అవార్డులలో రెండు కృష్ణ ఎడత్తిల్, నిఖిల్ దేశ్ పాండేలను వరించాయి. కృష్ణ, టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్ సర్వీసెస్ విభాగ డైరెక్టర్ కాగా, నిఖిల్, జార్జియా రాష్ట్ర ప్రధాన డిజిటల్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయడానికి తోడ్పడే 50 మంది సాంకేతిక అధికారులకు ఏటా స్కూప్ న్యూస్ గ్రూప్ అవార్డులిస్తుంది.
కరూర్ వైశ్యా బ్యాంక్‌కు రెండు ఎంఎస్‌ఎంఈ అవార్డులు
ఎంఎస్‌ఎంఈ రుణాలు అందించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు కరూర్ వైశ్యా బ్యాంక్ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ ఎంఎస్‌ఎంఈ ఫ్రెండ్లీ బ్యాంక్ (ప్రైవేట్ రంగం) రన్నరప్, 2021 సంవత్సరానికి బెస్ట్ ఇన్నోవేషన్ బ్యాంక్ (ప్రైవేట్ రంగం) రన్నరప్ అవార్డులను దక్కించుకుంది. దిల్లీలోని చాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఈ అవార్డులు అందించింది. కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్ రాణే చేతుల మీదుగా కరూర్ వైశ్యా బ్యాంక్ జనరల్ మేనేజర్ (వాణిజ్య బ్యాంకింగ్) అన్బురాజ్ ఈ అవార్డులు అందుకున్నారు.
అతి విశిష్ట సేవా పురస్కారాల ప్రదానం
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ రెడ్డి వెంకటేశకు, విశ్రాంత ఎయిర్ వైస్ మార్షల్ కల్వకుంట్ల శేఖర్‌రెడ్డికి, ఎయిర్ మార్షల్ చలపతి జొన్నలగెడ్డకు అతి విశిష్ట సేవా పతకాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు.
ఫంక్షనల్ వర్టికల్స్‌లో ప్రతిభావంతులైన 256 మంది పోలీసులకు పతకాలు
పోలీస్‌స్టేషన్ల వారీగా పోలీసుల పనితీరు తెలుసుకోవడానికి ‘17 ఫంక్షనల్ వర్టికల్స్’ విధానం దోహదపడుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానంతో శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతోందన్నారు. ‘ఫంక్షనల్ వర్టికల్స్’ అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 256 మంది పోలీసులకు తన కార్యాలయంలో మహేందర్‌రెడ్డి పురస్కారాలు అందజేశారు.
కరోనా కష్ట కాలంలో సేవలకు జీడబ్ల్యూటీఎస్‌కు అవార్డు
గడిచిన రెండేళ్ల కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో టెస్టింగ్ కిట్లు అందించినందుకు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘానికి (జీడబ్ల్యూటీఎస్) సినీ నటుడు జగపతిబాబు అవార్డును ప్రదానం చేశారు. జీడబ్ల్యూటీఎస్ సహకారంతో చేతన ఫౌండేషన్ ఈ కిట్లను అందించింది. అమెరికాలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సంస్థ ప్రతినిధులు సాయిసుధా పాలడుగు, ఉప్పటూరి రామ్ చౌదరి, గోపాలకృష్ణ, రవి, ప్రసాద్‌లకు అవార్డును జగపతిబాబు అందించారు.
వీరజవాను జశ్వంత్‌రెడ్డికి శౌర్యచక్ర పురస్కారం
దేశ రక్షణ కోసం కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అశువులు బాసిన బాపట్లకు చెందిన వీర జవాను మరుప్రోలు జశ్వంత్‌రెడ్డికి మరణానంతరం శౌర్యచక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జవాను తల్లిదండ్రులు మరుప్రోలు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డికి శౌర్యచక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు.