ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓగా సలీల్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓగా మరో అయిదేళ్ల పాటు సలీల్ పరేఖ్ కొనసాగనున్నారు. 2027 మార్చి 31 వరకు సలీల్ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. 2018 జనవరి నుంచి ఆయన సంస్థ ఎండీ, సీఈఓగా ఉన్నారు. ఐటీ సేవల పరిశ్రమలో 30 ఏళ్లకు పైగా అంతర్జాతీయ స్థాయి అనుభవం ఆయన సొంతం.
గుజరాత్ ప్రభుత్వం, ఫోర్డ్‌తో టాటా మోటార్స్ ఒప్పందం
గుజరాత్‌లోని సనంద్‌లో ఫోర్డ్ తయారీ సంస్థకు ఉన్న ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం, ఫోర్డ్ ఇండియాతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎంఎల్), ఫోర్డ్ ఇండియా (ఎఫ్‌ఐపీఎల్), గుజరాత్ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టీపీఈఎంఎల్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు.
2021 - 22లో ద్రవ్యలోటు 6.71%
గత ఆర్థిక సంవత్సరంలో (2021 - 22) కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీడీపీలో 6.71 శాతంగా నమోదైంది. సవరించిన బడ్జెట్ అంచనా అయిన 6.9 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ.15,86,537 కోట్లుగా ఉండొచ్చని తాజా తాత్కాలిక అంచనాల్లో పేర్కొంది. రూ.15,91,089 కోట్లుగా (జీడీపీలో 6.9%) ఉండొచ్చని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ అంచనా వేసిన దాని కంటే ఇది తక్కువ. 2021 - 22లో మొత్తంగా పన్నుల రూపేణా రూ.18.20 లక్షల కోట్ల ఆదాయం (బడ్జెట్ అంచనా రూ.17.65 లక్షల కోట్లు) వచ్చింది. మొత్తం వ్యయాలు రూ.37.94 లక్షల కోట్లుగా (బడ్జెట్ అంచనా రూ.37.70 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022 - 23) తొలి నెల (ఏప్రిల్)లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 4.5 శాతంగా నమోదైంది. 2021 - 22 ఇదే నెలలో ద్రవ్యలోటు 5.2 శాతంగా ఉంది.
భారత్‌లో రెండో అత్యధిక లాభాల కంపెనీగా ఓఎన్‌జీసీ అవతరణ
మార్చి 31, 2022తో ముగిసిన ఏడాదిలో ఓఎన్‌జీసీ రికార్డు స్థాయిలో రూ.40,305.74 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతక్రితం ఏడాదిలో నమోదైన లాభం రూ.11,246.44 కోట్లతో పోలిస్తే 258 శాతం అధికమైంది. దీంతో రిలయన్స్ తర్వాత దేశంలో అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న కంపెనీగా నిలిచింది.
హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ విదేశ్ వంటి అనుబంధ సంస్థల లాభాలనూ జత చేస్తే 2021 - 22లో ఓఎన్‌జీసీ ఏకీకృత నికర లాభం రూ.49,294.06 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.21,360.25 కోట్లుగానే లాభం నమోదైంది. కాగా, అటు స్టాండలోన్ పద్ధతిలో, ఇటు ఏకీకృత పద్ధతిలోనూ ఓఎన్‌జీసీ దేశంలో అత్యధిక లాభాలను పొందిన రెండో సంస్థగా నిలిచింది.
సీసీఐ 13వ వార్షికోత్సవం
మార్కెట్లో వ్యక్తులు ‘కుమ్మక్కు కాకుండా చూడడం పెద్ద సవాలు’గా మారిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కరోనా, రష్యా యుద్ధ ప్రభావం వల్ల తూర్పు ఐరోపాలో సరఫరా వ్యవస్థలకు అవాంతరం ఏర్పడడంతో కమొడిటీలు, ముడి పదార్థాలకు అంతర్జాతీయంగా కొరత ఏర్పడిందని సీతారామన్ సీసీఐ 13వ వార్షికోత్సవంలో పేర్కొన్నారు. ఈ సమయంలో సీసీఐ అసలేం జరుగుతోందో అర్థం చేసుకుని నడవాల’ని మంత్రి పిలుపునిచ్చారు.
జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. 2022 ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మార్చిలో వసూళ్లయిన రూ.1,42,095 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం రూ.25 వేల కోట్లు అధికం. 2021 ఏప్రిల్ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లతో పోల్చినా దాదాపు 20 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రెండు నెలలు మినహాయించి అన్ని నెలల్లో వసూళ్లు రూ.లక్ష కోట్లను మించాయి. ఒక నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లను దాటడం ఇదే తొలిసారి. మార్చిలో 97 లక్షల మంది వ్యాపారులు జీఎస్‌టీఆర్-3బి రిటర్నులు దాఖలు చేస్తే, ఏప్రిల్‌లో ఆ సంఖ్య 1.06 కోట్లకు పెరిగింది. అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి తోడు వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.