రాష్ట్రీయం -ఆంధ్ర ప్రదేశ్

ప్రపంచంలో అతిపెద్ద ఐఆర్‌ఈఎస్‌ ప్రాజెక్టు పైలాన్‌ ఆవిష్కరణ

రాష్ట్రంలో చేపడుతున్న సమీకృత పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ - ఐఆర్‌ఈఎస్‌పీ) భవిష్యత్తులో యావత్‌ దేశానికి మార్గదర్శకం కానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలోని గుమ్మటం తండా వద్ద గ్రీన్‌కో సంస్థ 5,230 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి రూ.30,000 కోట్లతో చేపడుతున్న ఐఆర్‌ఈఎస్‌ ప్రాజెక్టు పైలాన్‌ను ఆయన ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
మిత్తల్‌ కంపెనీ ఒప్పందం:-
ఈ ప్రాజెక్టు వల్ల ఒకేచోట జల, పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. మిత్తల్‌ కంపెనీ ఈ ప్రాజెక్టుతో వ్యాపార ఒప్పందం చేసుకుందని వివరించారు. ఆ సంస్థ ఇక్కడ 250 మెగావాట్ల విద్యుత్‌ ఉపయోగించి 1,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, తద్వారా నిర్దేశించిన ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు లోటు లేకుండా కచ్చితంగా 250 మెగావాట్ల విద్యుత్‌ను కర్నూలు నుంచి సరఫరా చేస్తారని చెప్పారు.

తిరుపతి చీని, నిమ్మ నర్సరీకి త్రీస్టార్‌ రేటింగ్‌

తిరుపతిలోని చీని, నిమ్మ పరిశోధనా స్థానంలోని నర్సరీకి జాతీయ ఉద్యాన మండలి ఇటీవల త్రీస్టార్‌ రేటింగ్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ నర్సరీల్లో జాతీయ ఉద్యాన మండలి నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న వాటిని నిపుణుల బృందం మార్చిలో పరిశీలించి ర్యాంకులు ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో త్రీస్టార్‌ రేటింగ్‌ దక్కించుకున్నది తిరుపతి చీని, నిమ్మ మొక్కల నర్సరీ ఒక్కటే కావడం విశేషం. దీనిని 1964లో ఏర్పాటు చేశారు. ఏటా 15 లక్షల మొక్కల వరకు డిమాండు ఉండగా రెండున్నర లక్షలు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. వైరస్‌ రహిత మొక్కల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నాగరాజు తెలిపారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా మీనా బాధ్యతల స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ - సీఈవో)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకూ సీఈవోగా కొనసాగిన కె.విజయానంద్‌ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మీనా ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులవటం విశేషం.

అసాంక్రమిక, సాంక్రమిక వ్యాధుల సర్వే (ఎన్‌సీడీ, సీడీ)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా 1.81 లక్షల కేసులు నమోదుకాగా, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారు వేలల్లో ఉంటారని అంచనా. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసాంక్రమిక, సాంక్రమిక వ్యాధుల సర్వే (ఎన్‌సీడీ, సీడీ)లో 32 వేల మందిలో వివిధ రకాల క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఇందులో సర్వైకల్‌ 17 వేలు, ఓరల్‌ 10 వేలు, రొమ్ము క్యాన్సర్ల లక్షణాలు ఐదు వేల మందిలో గుర్తించారు. గతేడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏపీలో మూడున్నరేళ్లలో 2.06 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 2018 - 19 నాటికి 1,25,848 క్యాన్సర్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంఖ్య 2019 - 20లో 1,23,273కు, 2020 - 21లో 1,46,806కు, 2021 - 22 నాటికి 1,81,957కు చేరింది. ఈ 1.81 లక్షల కేసుల్లో 26% రొమ్ము, 23% సర్వైకల్‌ కావడం తీవ్రతను చాటుతోంది. గ్లోబకాన్‌ - 2020 (డబ్ల్యూహెచ్‌వో సంస్థ) లెక్కల ప్రకారం.. 2020లో దేశవ్యాప్తంగా 13.24 లక్షల కేసులు బయటపడ్డాయి. వీరిలో 6.78 లక్షలు పురుషులు, 6.46 లక్షల మంది మహిళలున్నారు. 8.51 లక్షల మంది మరణించారు.

విశాఖ పోర్టు అథారిటీ సభ్యులుగా ఇద్దరి నియామకం

విశాఖపట్నం పోర్టు అథారిటీ సభ్యులుగా హార్బర్, పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌కు చెందిన ఎస్‌.రమణబాబు, పోర్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌కు చెందిన పి.రవిశంకర్‌ శ్రీనివాస్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నౌకాయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.