సదస్సులు

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ 38వ వార్షిక సదస్సు

దేశీయంగా 5.85 కోట్ల మంది వాణిజ్య వేత్తలు ఉంటే, వీరిలో మహిళలు 14 శాతం మందేనని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఉపాధి కోసం ఎదురుచూడక, తామే కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి మరింత మంది మహిళలు ఎదిగేలా ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) ప్రోత్సహించాలని సూచించారు. దిల్లీలో జరిగిన ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ 38వ వార్షిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

బిమ్‌స్టెక్‌ (బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్, టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌) కూటమి ఐదో శిఖరాగ్ర సదస్సు

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు అస్థిరంగా తయారయ్యాయని, ఈ దశలో ప్రాంతీయ భద్రతకు పెద్ద పీట వేయాలని ‘బిమ్‌స్టెక్‌’ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూటమిలోని దేశాలకు పిలుపునిచ్చారు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన బిమ్‌స్టెక్‌ (బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్, టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌) కూటమి ఐదో శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌ అనుసంధానతకు ప్రాధాన్యమివ్వాలని, విపత్తులను ఎదుర్కోవడంలో సమైక్యంగా ముందుకు కదలాలని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యాపార లావాదేవీలు జరిగేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సదస్సులో కూటమి దేశాలైన భారత్, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, శ్రీలంక, భూటాన్‌లు బిమ్‌స్టెక్‌ ఛార్టర్‌ను ఆమోదించాయి. ప్రధాని తన ప్రసంగంలో బిమ్‌స్టెక్‌ సచివాలయానికి భారత్‌ తరఫున 10 లక్షల డాలర్లు సాయం ప్రకటించారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి మరో 30 లక్షల డాలర్ల సాయం అందించడానికి భారత్‌ సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆర్థిక భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను బిమ్‌స్టెక్‌ దేశాలు సమైక్యంగా, సహకరించుకుంటూ అధిగమించాలని సూచించారు.

‘విజన్‌ ఇండియా - 2047’ దార్శనిక పత్రాన్ని రూపొందించిన సైన్స్‌ లీడర్స్‌ కాన్‌క్లేవ్‌

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ రాబోయే 25 ఏళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాలపై దేశంలోని అత్యున్నత శాస్త్రవేత్తలు రోడ్‌మ్యాప్‌ని ప్రతిపాదించారు. ఈ మేరకు విజన్‌ ఇండియా - 2047 పేరుతో దార్శనిక పత్రాన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని ఐఐసీటీలో సైన్స్‌ లీడర్స్‌ కాన్‌క్లేవ్‌ ముగిసింది. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించారు. వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఇంధన భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి శాస్త్ర, సాంకేతికత వినియోగం; నీరు, వ్యవసాయం, పర్యావరణ నిర్వహణకు కృత్రిమమేధ అనువర్తనాలపై భారత్‌కు గల సవాళ్లు, అవకాశాలపై శాస్త్రవేత్తలు సమాలోచనలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్, డీబీటీ, డీఆర్‌డీవో, ఇతర విభాగాలకు చెందిన 160 పరిశోధన సంస్థల డైరెక్టర్లు, ప్రధాన శాస్త్రవేత్తలు బృందాలవారీగా మేధోమథనం అనంతరం శాస్త్ర, సాంకేతికత దార్శనిక పత్రం - 2047ని కాన్‌క్లేవ్‌ ప్రతిపాదించింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం, విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.

బిమ్స్‌టెక్‌ వర్చువల్‌ సదస్సులో మోదీ

శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న ఐదో బిమ్స్‌టెక్‌ (బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌) వర్చువల్‌ సదస్సులో (మార్చి 30) ప్రధాని మోదీ పాల్గొంటారు. సభ్యదేశాల మధ్య ఆర్థిక లావాదేవీల పెంపొందించడంపైనే ప్రధానంగా ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. ఈ ప్రాంతీయ కూటమిలో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్, నేపాల్, భూటాన్‌ సభ్యదేశాలు. ఈ సదస్సు మార్చి 28న బిమ్స్‌టెక్‌ సీనియర్‌ అధికారులు సమావేశంతో ప్రారంభమవుతుంది. మార్చి 29న విదేశాంగ మంత్రులు భేటీ అవుతారు.

చైనా - భారత్‌ విదేశాంగ మంత్రుల సమావేశం

భారత పర్యటనకు విచ్చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ దిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపారు. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌తోనూ ఆయన సమావేశమయ్యారు. రెండు భేటీల్లోనూ పలు అంశాలపై చర్చలు జరిగినా సరిహద్దుల్లో ఉద్రిక్తతల గురించే భారత్‌ ప్రధానంగా ప్రస్తావించింది. దాదాపు రెండేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లో భారత్‌ - చైనా బలగాల మధ్య తీవ్రస్థాయి ప్రతిష్టంభన తలెత్తిన తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న తొలి ఉన్నత స్థాయి పర్యటన వాంగ్‌దే కావడం గమనార్హం. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారితేనే ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి చక్కబడతాయని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఆ దేశానికి సూచించింది.

నాటో అత్యవసర శిఖరాగ్ర సమావేశం

బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నాటో అత్యవసర శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు, ఐరోపాలో తలెత్తిన పరిస్థితిపై స్పందించేందుకు సభ్య దేశాలన్నీ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని ‘ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి’ (నాటో) పిలుపునిచ్చింది. దురాక్రమణకుగానూ రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాలని నాటో స్పష్టంచేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా కీలకనేతలు దీనికి హాజరయ్యారు. అకారణంగా విరుచుకుపడిన రష్యా తీరును ఖండించి, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి నాటో దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయని సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌ చెప్పారు. రష్యాపై ఆంక్షల్ని కొనసాగించి, ‘‘దుర్మార్గ యుద్ధానికి’’ ముగింపు పలకాలనేది తమ నిర్ణయమని చెప్పారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రక్షణ రంగంలో పెట్టుబడులను పెంచాలన్నారు. కూటమిలో సభ్య దేశంపై ఎలాంటి దాడి జరిగినా స్పందించి, పరిరక్షించేందుకు నాటో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. రష్యా మీద విధించాల్సిన కొత్త ఆంక్షలు, ఉక్రెయిన్‌కు అదనపు సాయంపై నాటో సభ్య దేశాలతో బైడెన్‌ చర్చించారు.

ముఖ్యాంశాలు :-
‣ జి-7 కూటమి శిఖరాగ్ర సదస్సు, ఈయూ సదస్సు కూడా బ్రసెల్స్‌ వేదికగా నిర్వహించారు. జీవ, రసాయన, అణ్వాయుధాలను వాడవద్దంటూ రష్యాకు జి-7 విజ్ఞప్తి చేసింది. ప్రపంచ మార్కెట్లకు సరఫరాలు పెంచాలని చమురు ఉత్పత్తి దేశాలను కోరింది. రష్యా కేంద్ర బ్యాంకు ఏ లావాదేవీల్లోనూ బంగారాన్ని వినియోగించకుండా నియంత్రణ విధిస్తున్నట్లు ప్రకటించింది.

‣ ఉక్రెయిన్‌కు మరింత సాయాన్ని పంపిస్తున్నామని పశ్చిమ దేశాలు ప్రకటించాయి. కొన్ని వేల క్షిపణుల్ని ఉక్రెయిన్‌కు పంపిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది. ఈయూ నేతలు కూడా మరో 55 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించడానికి సంతకాలు చేశారు. ఆంక్షలు తమపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పే ప్రయత్నంలో భాగంగా పరిమిత ట్రేడింగ్‌తో స్టాక్‌మార్కెట్‌ కార్యకలాపాలను రష్యా నిర్వహించింది.

‣ రష్యాకు చెందిన 400 మంది ప్రముఖులపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది.

‣ రష్యాపై నాలుగు విడతలుగా విధించిన ఆంక్షలకు ఈయూ ఆమోదం తెలిపింది. ఇంధన సరఫరా విషయంలో సభ్యదేశాలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాయి.

‣ ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌ పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని నాటో కూటమి నిర్ణయించింది. 2023 సెప్టెంబరు 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.


శాంతితోనే సంబంధాలు: ప్రధాని మోదీ

భారత్‌ - ఆస్ట్రేలియా సంబంధాలు కొన్నేళ్లుగా గణనీయంగా మెరుగుపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, విద్య తదితర రంగాల్లో ఉభయ దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయన్నారు. తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సద్భావన నెలకొంటేనే భారత్, చైనాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోగలవని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పలు కీలక అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. వాణిజ్యం, ఖనిజ సంపద, విద్య, వలసలు తదితర విషయాల్లో క్షేత్రస్థాయిలో సహకరించుకోవాలని నిర్ణయించారు.

భారత్‌కు పురాతన వస్తువులు:-
ప్రభుత్వాధినేతల భేటీని దృష్టిలో పెట్టుకుని భారత్‌కు చెందిన 29 పురాతన వస్తువులను ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చేసింది. శివుడు, విష్ణుమూర్తి అవతారాలు, జైన విగ్రహాలతో పాటు అలంకార వస్తువులు వీటిలో ఉన్నాయి. క్రీస్తుశకం 9, 10 శతాబ్దాలకు చెందిన ఈ ప్రాచీన విగ్రహాలు, చిత్రాలు తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి అక్రమంగా తరలివెళ్లినట్టు అధికారులు వివరించారు.

‣ 1976 - 2013 మధ్య 13 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగి రాగా, 2014 నుంచి ఇప్పటివరకూ మొత్తం 228 ప్రాచీన వస్తువులు స్వదేశానికి చేరుకున్నట్టు భారత పురావస్తు విభాగం తెలిపింది.


భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సు

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సునుద్దేశించి కేంద్ర మత్స్య సంపద, పశు పోషణ, పాడి పరిశ్రమ సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌ మాట్లాడారు. పౌల్ట్రీకి సంబంధించి అన్ని వర్గాలను అనుసంధానం చేసేందుకు పౌల్ట్రీ సలహా సంఘాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని సిఫారసు చేశారు.

‣ 2022 - 23 బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.6,407 కోట్లు కేటాయించారు. 2021 - 22తో పోలిస్తే ఇది 44 శాతం అధికం. దేశంలో పోషకాల అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రపంచానికి ఎగుమతి చేసేలా మన ఉత్పత్తులు పోటీ పడేలా పరిష్కారాలను కనుగొనాలని శాఖ కార్యదర్శి అతుల్‌ చతుర్వేది పేర్కొన్నారు.

‣ భారత్‌లో ఇపుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవసాయ విభాగాల్లో పౌల్ట్రీ ఒకటని సీఐఐ తెలిపింది. ఏటా 8-10 శాతం మేర గుడ్లు, బ్రాయిలర్ల ఉత్పత్తి పెరుగుతున్నందున ప్రపంచంలోనే గుడ్ల ఉత్పత్తిలో అయిదో స్థానం, బ్రాయిలర్ల విభాగంలో 18వ స్థానం మన దేశానికి లభించిందని సీఐఐ వివరించింది.


భారత్‌-జపాన్‌ 14వ వార్షిక శిఖరాగ్ర సమావేశం

భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల యెన్‌ల (సుమారు రూ.3.20 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్టు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద ప్రకటించారు. రక్షణ, ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించనున్నట్టు వెల్లడించారు. జపాన్‌ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో భారత్‌కు విచ్చేసిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ‘భారత్‌-జపాన్‌ 14వ వార్షిక శిఖరాగ్ర సమావేశం’లో ప్రధానులిద్దరూ పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతంచేసే దిశగా ‘ఫలప్రద చర్చలు’ జరిగినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. శుద్ధ ఇంధన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు... పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేలా ఉభయ దేశాల మధ్య మొత్తం ఆరు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.


దుబాయ్‌ సదస్సులో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఫిక్కీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆధ్వర్యంలో దుబాయ్‌లో ‘ఆర్బిట్రేషన్‌ ఇన్‌ ద ఎరా ఆఫ్‌ గ్లోబలైజేషన్‌’ అంశంపై నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత న్యాయవ్యవస్థ ఆర్బిట్రేషన్‌కు పూర్తి అనుకూలమని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే సమర్థవంతమైన వివాద పరిష్కార వ్యవస్థ ఉండాలన్నారు. భారత్‌లో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం ఒక ప్రత్యామ్నాయ వేదిక ఉండాలన్న భావన సర్వత్రా ఏర్పడింది. అందులో భాగంగానే 1996లో ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సీలియేషన్‌ చట్టం రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు.

భద్రత యంత్రాంగంలో ఆధునిక సాంకేతికత

రక్షణ రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇది మన భద్రతను బలోపేతం చేయడంతో పాటు, ఆర్థిక రంగానికీ అండగా నిలుస్తుందన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ పరిస్థితులు, భారత పోరాట సన్నద్ధత, తదితర అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) సమావేశం జరిగింది. భద్రత యంత్రాంగానికి ఆధునిక సాంకేతికతను జోడించాలని ఈ సందర్భంగా సూచించారు. రక్షణ రంగంలో ప్రపంచ సాంకేతిక వినియోగం, ఈ విషయంలో భారత్‌ ముందంజ తదితర అంశాలను సమావేశంలో ప్రధానికి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూతల సరిహద్దు ప్రాంతాలతో పాటు.. సముద్ర, గగనతలాల్లోనూ భారత పోరాట సన్నద్ధతకు సంబంధించిన వివిధ అంశాలను, తాజా అభివృద్ధి పరిణామాలనూ ప్రధానికి తెలిపినట్లు ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

9వ హిందీ సలహాకార్‌ సమితి సమావేశం

రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాలు, చదువులు అక్కడి మాతృ భాషల్లోనే సాగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాజ్యసభ సచివాలయం నిర్వహించిన 9వ హిందీ సలహాకార్‌ సమితి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుతం సాంకేతిక ఎంతో ముందుకెళ్లింది. అందువల్ల ఇంగ్లిష్‌ను పలు స్థానిక భాషల్లోకి ఏకకాలంలో తర్జుమా చేయడం చాలా సులభం. రాష్ట్రాల్లో పరిపాలనా వ్యవహారాలు పూర్తిగా స్థానిక భాషల్లోనే సాగాలి. విద్యాబోధన మాతృభాషలో ఉండాలి. ఇంగ్లిష్‌ అంటే ఎవ్వరికీ వ్యతిరేకత ఉండకూడదు. అయితే దాన్ని ఎవరిపైనా బలవంతంగా రుద్ద కూడదు. అన్ని భాషలూ గొప్పవే. హిందీని దేశంలో అత్యధికమంది మాట్లాడతారు కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మాతృభాషల్లో చదువుకున్న వ్యక్తులే ఈ రోజు అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న విషయాన్ని గుర్తించాలి. అందువల్ల ఈ దిశగా పిల్లలను సానుకూల దృక్పథంతో ప్రోత్సహించాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు.

ఈటీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌

ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ (ఒకటి కంటే ఎక్కువ ఇంధన వనరులతో నడిచే) వాహనాలను వచ్చే 6 నెలల్లో తయారు చేస్తామని వాహన తయారీ సంస్థల ఉన్నతాధికార్లు తనకు హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ‘ఈటీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌’ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణాలో 100 శాతం స్వచ్ఛ ఇంధన వనరులతో నడిచే వాహనాలనే వినియోగించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని పేర్కొన్నారు.

భారతీయ ఎగుమతుల రంగానికి ఊతమిచ్చేందుకు, అంతర్జాతీయ విపణిలో మరింత పోటీని ఇచ్చేందుకు వీలుగా 35 మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లను (ఎంఎంఎల్‌పీలు) ఏర్పాటు చేసే ప్రక్రియలో కేంద్రం ఉందని గడ్కరీ వెల్లడించారు.

డిజిటల్‌ మార్పునకు సైబర్‌ నేరాలు అతిపెద్ద ప్రమాదంగా మారనున్నాయని ఈ సదస్సులో పాల్గొన్న మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి పేర్కొన్నారు. 2025 కల్లా వీటి వల్ల ఆర్థిక వ్యవస్థలకు 10 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.750 లక్షల కోట్లు) నష్టం వాటిల్లవచ్చని అంచనా వేశారు. ‘ప్రతీ కంపెనీ వృద్ధి ఆ కంపెనీ అందిపుచ్చుకునే సాంకేతికతపైనే ఆధారపడి ఉంటుంది. ఇది అన్ని రంగాల్లోనూ జరుగుతోంద’ని తెలిపారు.


భారత్‌ - చైనాల మధ్య 15వ విడత సైనిక చర్చలు

తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్‌ - చైనాల మధ్య 15వ విడత సైనిక చర్చలు జరిగాయి. ఈ మేరకు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్‌ వైపున ఉన్న చుషుల్‌ - మోల్దో సరిహద్దు శిబిరం వద్ద కోర్‌ - కమాండర్‌ స్థాయిలో చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా చర్చల్లో భారత్‌ తరఫున కొత్తగా నియమితులైన లేహ్‌కు చెందిన 14 కోర్‌ కమాండర్, లెఫ్టినెంట్‌ జనరల్‌ అనింద్య సేన్‌గుప్త నేతృత్వం వహించారు. ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా భారత్‌ చైనాపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గత (14వ) విడత చర్చలు జరిగి రెండు నెలలు కాగా వాటిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. 2020 మే 5న తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు వద్ద భారత్, చైనా సైనికుల మధ్య పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఉభయ దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది.

సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ పురోగమనం

సౌరవిద్యుత్‌ రంగంలో తెలంగాణ వేగంగా పురోగమిస్తోందని, దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5 శాతం ఉన్న రాష్ట్రం 4.2 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 10.30 శాతం ఉత్పత్తి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. మరో ఏడాదిలో రాష్ట్రం సుమారు ఆరు గిగావాట్ల స్థాయికి చేరుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) తొమ్మిదో ప్రాంతీయ కార్యాచరణ బృందం దృశ్య మాధ్యమంలో నిర్వహించిన సదస్సులో ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నారు. లక్ష్యసాధనకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలి. తెలంగాణ కొత్త విధానాలతో కర్బన ఇంధనాలను తగ్గించడంతో పాటు హరితహారం చేపట్టి ఫలితాలను సాధిస్తోంది. డ్రోన్ల ద్వారా విత్తనాలను చల్లుతూ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. సంప్రదాయేతర ఇంధన వనరుల విస్తరణకు ఆవిష్కరణలు, అంకురాలకు చేయూతనివ్వాలి. హరిత పరిష్కారాల కోసం విద్యారంగంలో మార్పులు చేయాలి’’ అని వివరించారు.

సంక్షోభాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలి

ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి మోదీ నొక్కిచెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ ఆయుధాలను వీడి చర్చల బాట పట్టాలని సూచించారు. క్వాడ్‌ దేశాధినేతల వర్చువల్‌ సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద ఇందులో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో పరిణామాలపై వారంతా చర్చించారు. సెప్టెంబరులో జరిగిన శిఖరాగ్ర చర్చల తర్వాత క్వాడ్‌ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

ఉక్రెయిన్‌ సంక్షోభంతో భారత్, అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయని ఇకపై క్వాడ్‌ ఐక్యంగా ఉండబోదని ఇన్నాళ్లూ వచ్చిన ఊహాగానాలకు ఈ కూటమి దేశాధినేతల తాజా సమావేశంతో తెరపడినట్లయింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భవిష్యత్తులో తలెత్తే పెను సవాళ్లను ఎదుర్కొనేందుకుగాను మానవీయ సహాయం అందించడంతో పాటు విపత్తుల వేళ తోడ్పాటునందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని మోదీ, బైడెన్, మోరిసన్, కిషిద అంగీకరించారు. ప్రాథమికంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల కోసం ఏర్పాటైన ఈ కూటమి.. తాజాగా ఐరోపాలో నెలకొన్న పరిస్థితులపై (రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం) చర్చించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.


సీఐఐ తెలంగాణ వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్‌

‘‘పారిశ్రామిక రంగంలో కేంద్ర విధానాలు సరిగా లేవు. కేంద్రం, భాజపా పాలిత రాష్ట్రాలకే పరిశ్రమలు వచ్చేలా చూస్తోంది. ఇతర రాష్ట్రాలను విస్మరిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి. రాజకీయ కోణంలో వివక్ష తగదు’’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశం సందర్భంగా నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తెలంగాణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్డీపీలో 15 శాతం ఉన్న వ్యవసాయ రంగం వాటా ప్రస్తుతం 21 శాతానికి పెరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సింధూ జలాలపై భారత్, పాక్‌ చర్చలు

సింధూ జలాల శాశ్వత కమిషన్‌ వార్షిక సమావేశంలో భాగంగా భారత్, పాకిస్థాన్‌ అధికారులు ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యారు. వరద సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, భవిష్యత్తు కార్యక్రమాలపై ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. సింధూ జలాల భారత కమిషనర్‌ పి.కె.సక్సేనా నేతృత్వంలోని 10 మంది భారతీయ అధికారులు ఫిబ్రవరి 28న వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌లో ప్రవేశించారు. అక్కడి నుంచి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. మార్చి 2న కూడా చర్చలు కొనసాగనున్నాయి. 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల్లో ప్రవహించే నదుల నుంచి నీటి వినియోగం, వరద ప్రవాహం గురించి పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందంపై రెండు దేశాల మధ్య కొన్ని అభ్యంతరాలు, విభేదాలు ఉన్నాయి.