రాష్ట్రీయం -తెలంగాణ

జీసీసీ ఛైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌ తెలంగాణ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఛైర్మన్‌గా మహబూబ్‌నగర్‌కు చెందిన తెరాస సీనియర్‌ నేత రమావత్‌ వాల్యానాయక్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాయక్‌ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన జీతభత్యాలు, సిబ్బంది, వాహనం, వసతి సౌకర్యాలను గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుంచి వెచ్చించాలని ప్రభుత్వం ఆదేశించింది.

నీటిపై సౌరవిద్యుత్కేంద్రం ప్రారంభం

నీటిపై తేలియాడే సౌరవిద్యుత్కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత కార్యనిర్వాహక సంచాలకుడు (ఈడీ) నరేశ్‌ ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం 42.50 మెగావాట్లు. రామగుండం రిజర్వాయర్‌ నీటిపై మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. గతంలో తొలి విడతలో 17.5, రెండో విడతలో 20 మెగావాట్ల కేంద్రాలు ప్రారంభించగా ఇప్పుడు మూడో విడత 42.50తో ప్రారంభించారు. దేశంలోకెల్లా అతిపెద్దదైన నీటిపై తేలియాడే సౌరవిద్యుత్కేంద్రాన్ని 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటుచేయడానికి రామగుండంలో 450 ఎకరాల రిజర్వాయర్‌లో రూ.423 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు ఈడీ ఆనంద్‌తో పాటు కరీంనగర్‌ ఎన్టీపీసీ పరిపాలన భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీజీఎం సునీల్‌కుమార్‌ వెల్లడించారు.

10 మంది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం

హైకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన 10 మంది మొదటి కోర్టు హాలులో ప్రమాణస్వీకారం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ వీరితో ప్రమాణం చేయించారు. న్యాయవాదుల కోటా నుంచి నియమితులైన కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్,జువ్వాడి శ్రీదేవి, ఎన్‌.వెంకట శ్రావణ్‌కుమార్‌లు, న్యాయాధికారుల విభాగం నుంచి నియమితులైన గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ దేవరాజు నాగార్జున్‌లు వరుసగా దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. అంతకుముందు రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజన రాష్ట్రపతి జారీచేసిన నియామక ఉత్తర్వులు చదివి వినిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం న్యాయమూర్తులు కేసుల విచారణ చేపట్టారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో జస్టిస్‌ ఎస్‌.నంద, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డితో జస్టిస్‌ సాంబశివరావునాయుడు, జస్టిస్‌ పి.నవీన్‌రావుతో జస్టిస్‌ ఎం.జి.ప్రియదర్శిని, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో జస్టిస్‌ జె.శ్రీదేవిలు ధర్మాసనాల్లో విధులు నిర్వర్తించారు. జస్టిస్‌ కె.సురేందర్, జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌కుమార్, జస్టిస్‌ అనుపమా చక్రవర్తి, జస్టిస్‌ ఎ.సంతోష్‌రెడ్డి, జస్టిస్‌ డి.నాగార్జున్‌లు సింగిల్‌ బెంచ్‌లలో విధులు నిర్వర్తించారు.

2022 - 23 బడ్జెట్‌పై ఆర్థిక శాఖ ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్‌ వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ ఆయా శాఖలకు పంపించింది. ఈ మేరకు ద్రవ్య వినిమయ చట్టం - 2022 ప్రతులను శాఖలకు సమాచారం నిమిత్తం అందజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి ఏడో తేదీన శాసససభలో ప్రవేశపెట్టిన రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్‌ అంచనాలు ఎలాంటి కోతలు లేకుండా ఆమోదం పొందిన నేపథ్యంలో దీన్నే తుదిగా పరిగణించాలని శాఖలకు సూచిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు వ్యయం కోసం శాసనసభ ఆమోదించిన చట్టం మేరకు మార్చి 22న జారీ చేసిన గెజిట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హైకోర్టుకు 10 మంది న్యాయమూర్తుల నియామకం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పది మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏడుగురు, న్యాయాధికారుల కేటగిరీ నుంచి అయిదుగురు కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేయగా, వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వీరిలో న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్‌.శ్రావణ్‌ కుమార్‌ వెంకట్‌ ఉన్నారు. న్యాయాధికారుల విభాగం నుంచి గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, దేవరాజ్‌ నాగార్జున్‌లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 217(1)కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి వీరి నియామకాలకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న క్రమంలో వారి సీనియారిటీ వర్తిస్తుందని, బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వారి నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. వీరి నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి.

తెలంగాణకు మరో మూడు ప్రముఖ సంస్థలు

తెలంగాణకు మరో మూడు సంస్థలు రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమక్షంలో సంస్థల ప్రతినిధులు తమ కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ గోల్ఫ్‌ క్రీడా పరికరాల తయారీ సంస్థ ‘కాల్‌అవే గోల్ఫ్‌’ అమెరికా తర్వాత అతి పెద్దదైన డిజిటల్‌ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం క్వాల్కమ్‌ సంస్థ రూ.3,904.55 కోట్లతో ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో వచ్చే అక్టోబరులో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రముఖ విద్యుత్‌ వాహనాల సంస్థ ఫిస్కర్‌ ఐఎన్‌సీ రూ.100 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‣ కాల్‌అవే సంస్థ గోల్ఫ్‌ బంతులు, స్టిక్, దుస్తులు, ఇతర సామగ్రిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఈ సంస్థ భారత్‌లో డిజిటెక్‌ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. కేటీఆర్‌ కాలిఫోర్నియా సమీపంలోని కార్ల్స్‌బాద్‌లో ఉన్న కాల్‌అవే ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ముఖ్య ఆర్థికాధికారి బ్రయన్‌ లించ్, సీఐవో సాయి కూరపాటిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ‣ ఫిస్కర్‌ ఆటోమోటివ్‌ సంస్థ అధునాతన విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. తమ కార్యకలాపాలను భారత్‌లోనూ విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణను ఎంచుకుంది. ఫిస్కర్‌ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ సందర్శించి సంస్థ ఛైర్మన్, సీఈవో హెన్రిక్‌ ఫిస్కర్, సీఎఫ్‌ఓ గీతాగుప్తా ఫిస్కర్‌లతో సమావేశమయ్యారు.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

రహదారుల హారన్ల మోత కారణంగా వాహనదారులు, ప్రజలు, పాదచారుల ఆరోగ్యం దెబ్బతింటుందన్న సర్వేల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు శబ్ద కాలుష్యంపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఏ వాహనం ఎంతస్థాయిలో శబ్దం చేసిందో తెలుసుకునేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాలను తెప్పిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వేగంగా వెళ్తుండడం, కిక్కిరిసిన రద్దీలో నాలుగైదు వాహనాలు ఒకేసారి హారన్‌ మోగిస్తే ఏ వాహనం నుంచి శబ్దం వస్తుందో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కనిపెట్టడం చాలా కష్టం. అందుకే శబ్ద పరిమితికి మించి ఏ వాహనమైనా హారన్‌ మోగిస్తే చాలు. కూడలి వద్ద ఏర్పాటు చేసిన పరికరం పట్టేస్తుంది. దీనికి శబ్దాలను గుర్తించేలా లోకల్‌ సెన్సర్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకంగా అమర్చి ఉంటుంది. ఇలా పట్టేయడంతో పాటు ఆ వాహనాలను నంబరుతో సహా ఫొటోలు తీసి వాటిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ రూంకు పంపుతుంది. అక్కడి నుంచి ఆయా వాహనాల యజమానులకు ఈ-చలాన్‌లు వెళ్తాయి.

తెలంగాణలో కెమ్‌వేద లైఫ్‌సైన్సెస్‌ పరిశోధన కేంద్రం

అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ పరిశోధన సంస్థ ‘కెమ్‌వేద లైఫ్‌ సైన్సెస్‌’ రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 500 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంది. తెలంగాణకు పెట్టుబడుల సాధన కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌తో శాన్‌ డియాగోలో కెమ్‌వేద లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ ఛైర్మన్, సీఈవో బీమారావు పారసెల్లి తమ ప్రతినిధి బృందంతో సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఔషధ, బయోటెక్, వ్యవసాయ రసాయన రంగాల్లో పరిశోధనలకు పేరొందిన తమ సంస్థ అమెరికాలో 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ 450 మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ఔషధనగరిలో స్క్రిప్స్‌ సంస్థ మరో విఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ఔషధనగరిలో ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయంలో భాగస్వాములవ్వాలని కోరారు. తమ సంస్థ వివిధ దేశాల్లో 50 పరిశోధన సంస్థలు, 200 ప్రయోగశాలలు, 2400 మంది శాస్త్రవేత్తలతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందన్నారు.

కొవిడ్‌ పరిస్థితుల నుంచి బయటపడిన రాష్ట్రం

కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడింది. కొవిడ్‌-19 నేపథ్యంలో దారుణంగా దెబ్బతిన్న పలు రంగాలు వృద్ధి బాటపడ్డాయి. రాష్ట్ర అర్థ గణాంక శాఖ 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో రంగాల వారీ భాగస్వామ్యాన్ని విశ్లేషించింది. గత ఆర్థిక సంవత్సరం (2020 - 21) మొదట సవరించిన అంచనాలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రంగాలవారీగా వృద్ధి రేట్లను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ)కు అందించింది. కొవిడ్‌ మహమ్మారితో తయారీ రంగం; వాణిజ్యం; మరమ్మతులు; హోటళ్లు, రెస్టారెంట్లు; రైల్వేలు, విమాన రవాణాలు 2020 - 21లో దారుణంగా దెబ్బతినగా ఈసారి కుదుటపడ్డాయి. విశ్లేషణ వివరాలు:- ‣ ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, పశు సంవర్ధకం, అటవీ, మత్స్య పరిశ్రమ, మైనింగ్, క్వారీయింగ్‌లో 9 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదైంది. ఈ రంగాల్లో అంతకుముందు ఏడాది వృద్ధిరేటు 8.8 శాతం. ‣ తయారీ, నిర్మాణం కీలకంగా ఉన్న ద్వితీయ రంగాల్లో 2020 - 21లో వృద్ధిరేటు 0.3 శాతం తగ్గగా ఈసారి 21.5 శాతం పెరిగింది. అనుబంధ రంగాల్లో గత ఏడాది 0.9 శాతం వృద్ధిరేటు ఉండగా ఈసారి 18.3 శాతం నమోదైంది. ‣ తయారీ రంగంలో గత అభివృద్ధి ఐదేళ్లలోనే అత్యధికంగా 28.8 శాతంగా ఉంది. ‣ రాష్ట్రంలో అన్ని రకాల రవాణాలు గత ఏడాది కంటే కోలుకున్నా పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. రైల్వే రవాణాలో కొవిడ్‌ వల్ల 2020 - 21లో 6.6%, రోడ్డు రవాణాలో 3.1%, విమాన రవాణాలో ఏకంగా 21.3% వృద్ధి రేటు తగ్గింది. కొవిడ్‌ కంటే ముందు 2019 - 20లో రైల్వేల వృద్ధి రేటు 27.3% ఉండగా ప్రస్తుత ఏడాది 10.3%గా అంచనా వేశారు. రోడ్డు రవాణా 5.4%, విమాన రవాణా 13.3%గా ఉంది.

మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన

తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా పదిరోజుల అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించేలా పటిష్ఠ కార్యాచరణతో పర్యటిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఈ పర్యటనలో అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐటీ, ఎలక్ట్రానిక్స్, జీవశాస్త్రాలు, ఔషధ, ఆహారశుద్ధి పరిశ్రమల అధిపతులు, సీఈవోలతో సమావేశమవుతారు. మంత్రి వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎలక్ట్రానిక్స్, జీవశాస్త్రాలు, ఆహారశుద్ధి, డిజిటల్‌ మీడియా ప్రోత్సాహక విభాగం సంచాలకులు సుజయ్‌ కారంపురి, శక్తినాగప్పన్, అఖిల్‌ గవాన్, విజయ్‌ రంగినేని, కొణతం దిలీప్, ప్రధాన సంబంధాల అధికారి అమర్‌నాథ్‌రెడ్డిలున్నారు.

రెండేళ్లలో 28.5 లక్షల ఆయకట్టు లక్ష్యం

2022 చివరినాటికి భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు 2022-23వ నీటి సంవత్సరంలో 13.54 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2023-24వ నీటి సంవత్సరంలో మరో 14.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. అంటే వచ్చే రెండేళ్లలో 28.5 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, నీటి వనరుల బడ్జెట్‌ ఫలితాల నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. గత రెండేళ్లలో (2021 డిసెంబరు వరకు) సాగునీటి రంగంపై రూ. 39,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఆఖరులోగా భారీ ప్రాజెక్టులను పూర్తి చేసి 4.33 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతోపాటు మొత్తం నీటి సంవత్సరంలో 13.54 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని తాజా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

రెండోసారి మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి

రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండలి ప్రొటెం ఛైర్మన్‌ జాఫ్రీ తెలిపారు.

హైదరాబాద్‌లో గ్రామినర్‌ కార్యాలయం

న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న డేటా సైన్స్, స్టోరీ టెల్లింగ్‌ సంస్థ గ్రామినరీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు దీన్ని ప్రారంభించారు. అనేక క్లిష్ట సమస్యలకు డేటాసైన్స్‌ పరిష్కార మార్గాన్ని చూపుతోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో మున్సిపల్‌ శాఖ చేపట్టే పలు ప్రాజెక్టులకు గ్రామినర్‌తో కలిసి పనిచేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో తొలి డేటా సైన్స్, స్టోరీ టెల్లింగ్‌ కంపెనీ గ్రామినర్‌ అని కంపెనీ సహ వ్యవస్థాపకుడు నవీన్‌ గట్టు తెలిపారు.

దేశానికే ఆదర్శం తెలంగాణ బడ్జెట్‌

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని, ఇది దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి అయిదో స్థానంలో ఉంది అని తెలిపారు.

దేశంలోనే అగ్రగామి తెలంగాణ

ఏడున్నరేళ్ల కాలంలోనే రాష్ట్రం దేశంలో అనేక అంశాల్లో అగ్రగామిగా ఎదిగిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ 2021 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ 11.2 శాతానికి చేరిందని, ఇది దేశంలోనే అత్యధికమన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలోనూ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని, రాష్ట్రం మొత్తం సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడమే కాదు విద్య, వైద్యం లాంటి అనేక అంశాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని, త్వరలోనే మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రంగా అవతరించబోతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు కడితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన సొమ్ము రూ.1,93,340 కోట్లు మాత్రమేనన్నారు. పంటలను మద్దతు ధరకు కొనడంలో రూ.11 వేల కోట్ల నష్టాలొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భరించిందని గుర్తు చేశారు. ప్యానల్‌ స్పీకర్లుగా నలుగురు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలకు నలుగురు ఎమ్మెల్యేలను ప్యానల్‌ స్పీకర్లుగా సభలో ప్రకటించారు. ఎమ్మెల్యేలు ధరంసోత్‌ రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), మహ్మద్‌ మౌజం ఖాన్‌ (యాకత్‌పురా), హనుమంత్‌ షిండే (జుక్కల్‌), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం) పేర్లను ప్రకటించారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ తమ శాఖలకు చెందిన వార్షిక నివేదికలను సభలో ప్రవేశ పెట్టారు.

తెలంగాణ రాష్ట్ర చట్టాలపై పుస్తకం

తెలంగాణలో అమల్లో ఉన్న చట్టాలపై 15 సంకలనాలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆవిష్కరించారు. వాటిని రూపొందించిన సచివాలయ న్యాయ విభాగ అధికారులను అభినందించారు. సమగ్ర సమాచారం కలిగిన ఈ గ్రంథాలు భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 287 చట్టాలు, 17 రెగ్యులేషన్లతో కూడిన సమగ్ర సమాచారాన్ని దాదాపు 9,000 పేజీలలో ముద్రించారు.

మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలను, అదనంగా 10 శాతం పెట్టుబడి రాయితీనీ వారికి అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని గొప్పగా ఆలోచించాలని.. అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంతో పోటీపడాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామిక పార్కును ఆయన ప్రారంభించారు. ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలు ఉజ్వలా సింఘానియా, హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షురాలు ఉమా చిగురుపాటి, ఎఫ్‌ఎల్‌ఓ ప్రతినిధులతో కలిసి పార్కు ప్రాంగణంలోని పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే నాలుగో అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 18 వేల అనుమతులు ఇచ్చామన్నారు. తద్వారా 32 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.6 మిలియన్‌ ఉద్యోగాలను సృష్టించామని చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరో 100 ఎకరాలైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బల్క్‌డ్రగ్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ దేశానికే రాజధానిగా మారిందని చెప్పారు. వ్యాక్సిన్ల విషయంలో మన నగరం ప్రపంచ రాజధాని అని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా పారిశ్రామికవేత్తలు ఆహారశుద్ధి, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్‌కేర్‌ రంగాల్లో సరికొత్త ఉత్పత్తులను రూపొందించేలా చొరవ చూపాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఉండేలా దేశంలోనే తొలిసారిగా ‘ఉద్యామిక’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టనున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. కార్పస్‌ ఫండ్‌ను అందుబాటులోకి తేవడం, వారి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామన్నారు. 2018లో ప్రారంభించిన వి-హబ్‌ ద్వారా 2,194 మంది మహిళలు అంకుర సంస్థలను నెలకొల్పారని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూ.66.3 కోట్ల నిధులు సమకూర్చినట్లు ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద డేటా కేంద్రం

ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ దేశంలో తన నాలుగో డేటా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. దీని కోసం దశల వారీగా 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు ఈ వివరాలను తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక, వస్తున్న అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదొకటని వివరించారు. మైక్రోసాఫ్ట్‌ దేశంలో అతి పెద్ద డేటా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందున, స్థానికంగా ఎన్నో వ్యాపారాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు వీలవుతుందన్నారు. డేటా, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ ఇంజినీరింగ్‌ నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. హైదరాబాద్‌ డేటా కేంద్రం తొలిదశ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ‣ ఐడీసీ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్‌కు దేశంలో ఉన్న 3 డేటా కేంద్రాల ద్వారా 2016-20 మధ్య 9.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం (సుమారు రూ.71,000 కోట్లకు పైగా) ఆర్థిక వ్యవస్థకు చేరిందని, 1.50 లక్షల ఉద్యోగాలు, 1.69 లక్షల మంది నిపుణుల తయారీకి ఇవి తోడ్పాటునందించినట్లు పేర్కొన్నారు.

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రత్యేక కార్పొరేషన్‌

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన నిధులను బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.కోటి మూలధనంతో ‘తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్‌)’ పేరిట దీన్ని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు విడుదల చేశారు. వరంగల్‌లో నిర్మించనున్న అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, అన్ని జిల్లాల్లోనూ కొత్తగా నెలకొల్పనున్న వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సంస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హెల్త్‌ ప్రొఫైల్‌ పైౖలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ‘హెల్త్‌ ప్రొఫైల్‌’కు సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్‌ ప్రొఫైల్‌) సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, ములుగులో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆసుపత్రి ఆవరణలో ఈ ప్రాజెక్టును కేటీఆర్‌ ప్రారంభించారు.

బీసీ, దివ్యాంగుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర, సబార్డినేట్‌ నిబంధనల్లో సవరణ

తెలంగాణలోని వెనకబడిన తరగతులకు, దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల కాలపరిమితి, వయోపరిమితి గడువు పెంపునకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్ర, సబార్డినేట్‌ నిబంధనలను సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2031 మే 31 వరకు బీసీలకు, దివ్యాంగులకు రిజర్వేషన్ల గడువు, వయోపరిమితి సడలింపుల పొడిగింపు అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ గత ఏడాది మే 28న, దివ్యాంగుల శాఖ నవంబరు 11న ఉత్తర్వులు ఇచ్చాయి. దీని అమలుకు విధిగా రాష్ట్ర, సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు మార్చాలని ఆయా శాఖలు కోరాయి. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.

సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో మొదలైన ఆరోగ్య సర్వే

రాష్ట్రంలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించడంలో భాగంగా ఒక్కొక్కరికి గరిష్ఠంగా 30 ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 18 ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య వివరాల్ని సేకరిస్తారు. ఫలితాల్ని ‘ఈ-హెల్త్‌’ మొబైల్‌ యాప్‌లో పొందుపరుస్తారు. ఈ యాప్‌లో వివరాల్ని చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఏకీకృత నంబరు కేటాయిస్తారు.

సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో 33% వృద్ధి

బొగ్గు ఉత్పత్తిలో ఏడాది కాలంలో 33 శాతం వృద్ధి సాధించినట్లు సింగరేణి సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఫిబ్రవరి నాటికి 442 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా.. ఈ ఏడాది (2021-22) అదే కాలానికి 586 లక్షల టన్నులు ఉత్పత్తి చేసినట్లు పేర్కొంది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ అమ్మకాల టర్నోవర్‌లోనూ 19 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.2,964 కోట్ల విద్యుత్‌ను విక్రయించగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.3,523 కోట్లకు పెరిగింది.