సర్వేలు

ప్రింట్‌ మీడియా ఆదాయం రూ.27,000 కోట్లు!

2022 - 23 ఆర్థిక సంవత్సరంలో ప్రింట్‌ మీడియా ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.27,000 కోట్లకు చేరొచ్చని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయాల్లో పెరుగుదల ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. అయితే న్యూస్‌ప్రింట్‌ అధిక ధరల కారణంగా ఈ రంగ నిర్వహణ లాభం 300 - 350 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గొచ్చని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం, కార్యాలయాల పునఃప్రారంభం వల్ల ప్రింట్‌ మీడియాకు చందా ఆదాయం కూడా పెరగొచ్చని తెలిపింది. 2021 - 22లో ఈ రంగ ఆదాయం రూ.18,600 కోట్లన్నది క్రిసిల్‌ అంచనా. కొవిడ్‌ పరిణామాలకు ముందు ప్రింట్‌ మీడియా వార్షిక గరిష్ఠ ఆదాయమైన రూ.32,000 కోట్లకు చేరడానికి సమయం పడుతుందని తెలిపింది. ఈ రంగంలో 40 శాతం వాటా కలిగిన కంపెనీల పనితీరు ఆధారంగా క్రిసిల్‌ ఈ నివేదికను రూపొందించింది. ప్రింట్‌ మీడియా సంస్థల నిర్వహణ వ్యయంలో 30 - 35 శాతం న్యూస్‌ప్రింట్‌ వాటా ఉంటుంది.

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సర్వే

సంప్రదాయ పెట్రో ఉత్పత్తుల ధరలు బాగా పెరగడంతో, ఖర్చు పెట్టే శక్తిపై ప్రభావం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సర్వే పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో తమ దేశం సంప్రదాయ ఇంధన వినియోగం నుంచి మారాలని ప్రతి పది మందిలో ఎనిమిది మంది (80 శాతం) కోరుకుంటున్నారని వెల్లడించింది. భారత్‌ విషయానికొస్తే ఇది మరింత అధికంగా 90 శాతంగా (పదిలో 9 మంది) ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 మధ్య 30 దేశాల్లో 22,534 మంది నుంచి డబ్ల్యూఈఎఫ్‌ - ఇప్సోస్‌ ఈ సర్వే నిర్వహించాయి. ముఖ్యాంశాలు:- ‣ ఇంధన ధరలు పెరగడం వల్ల వినియోగ శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని సగటున 55 శాతం మంది వెల్లడించారు. దక్షిణ ఆఫ్రికాలో 77 శాతం మంది ఈ తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా జపాన్‌లో, టర్కీలో 69 శాతం మంది, భారత్‌లో 63 శాతం మంది ఇదే విషయాన్ని వెల్లడించారు. స్విట్జర్లాండ్‌ (37%), నెదర్లాండ్స్‌ (37%)లో తక్కువ మందే ఈ తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‣ భారత్‌ విషయానికొస్తే ఇంధన ధరలు పెరగడానికి సరఫరా కొరతే కారణమని ఎక్కువ మంది భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో మార్పులు, చమురు - గ్యాస్‌ మార్కెట్లలో ఒడుదొడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల లాంటివి తదుపరి అంచనాలుగా ఉన్నాయి.

ప్రపంచ 10 మంది మహిళా కుబేరుల్లో నైకా ఫాల్గుణి నాయర్‌

ప్రపంచంలోనే స్వయంకృషితో ఎదిగిన అగ్రగామి 10 మంది మహిళా బిలియనీర్లలో నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్‌ చోటు దక్కించుకున్నారు.ఈ జాబితాలో తొలిసారి అడుగు పెడుతూనే, 7.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.57,000 కోట్ల) సంపదతో ఫాల్గుణి ఈ ఘనత సాధించినట్లు హురున్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ప్రపంచ అగ్రగామి 10 మంది మహిళా కుబేరుల్లో మనదేశం నుంచి ఉన్న ఏకైక వ్యక్తి ఫాల్గుణి (58) కావడం విశేషం. ఇప్పటిదాకా 10వ ర్యాంకులో ఉన్న బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా స్థానాన్ని నాయర్‌ ఆక్రమించారు. సౌందర్య, ఫ్యాషన్‌ బ్రాండ్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్న నైకాను యూనికార్న్‌ (రూ.7500 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువ గల కంపెనీ)గా మార్చిన ఘనత ఈమె సొంతం. ‣ ప్రస్తుతం ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగిన మహిళా బిలియనీర్లు 124 మంది ఉన్నారు. వీరంతా 16 దేశాలకు చెందిన వారే. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాల నుంచి ఒక్కరూ జాబితాలో లేరు. ‣ జాబితాలో మూడింట ఒక వంతు మంది చైనా నుంచే ఉన్నారు. అగ్రగామి 10 మందిలో ఏడుగురు కూడా చైనా వారే. ‣ అయిదేళ్ల కిందటితో పోలిస్తే మహిళా బిలియనీర్ల సంఖ్య రెట్టింపైంది. పదేళ్లతో పోలిస్తే 100 మంది అదనంగా జత చేరారు. ‣ బీజింగ్‌కు చెందిన స్థిరాస్తి డెవలపర్‌ వు యాజున్‌ (58) 17 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే స్వయం కృషితో ఎదిగిన అగ్రగామి మహిళా బిలియనీర్‌గా మారారు. ‣ ఫాల్గుణి నాయర్, మజుందార్‌ షా కాకుండా భారత్‌లో మరో మహిళా బిలియనీర్‌ రాధా వెంబు (3.9 బి. డాలర్లు) ఉన్నారు. సోదరుడితో కలిసి ‘జోహో’ను ఏర్పాటు చేశారీమె. అత్యధిక సంపదను పెంచుకున్న వారిలో రెండో స్థానంలో నిలిచారు. ‣ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాన్‌ఫ్లూయెంట్‌ వ్యవస్థాపకురాలు నేహా నర్ఖేడే కూడా భారత సంతతికి చెందిన వారే కానీ అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 1.6 బిలియన్‌ డాలర్లతో కొత్త మహిళా బిలియనీర్లలో అగ్రగామి - 10లోఉన్నారు. ‣ ప్రపంచంలో మొత్తం 556 మంది మహిళా బిలియనీర్లు ఉండగా అందులో సొంతంగా ఎదిగిన వారు 124 మంది అని హురున్‌ తెలిపింది.

2021 సంవత్సరానికి భారత్‌లో అత్యధిక విలువ కలిగిన సెలబ్రెటీగా విరాట్‌ కోహ్లి

అంతర్జాతీయ క్రికెట్లోనే కాక ఐపీఎల్‌లోనూ కెప్టెన్సీకి దూరమైనా, ఫామ్‌తో తంటాలు పడుతున్నా విరాట్‌ కోహ్లి 2021 సంవత్సరానికి భారత్‌లో అత్యధిక విలువ కలిగిన సెలబ్రెటీగా తన తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అతడి బ్రాండ్‌ విలువ గత ఏడాదితో పోలిస్తే 22 శాతం తగ్గి 185.7 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.1400 కోట్లు) చేరుకున్నట్లు సెలబ్రెటీల బ్రాండ్‌ విలువను లెక్కించే డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో వరుసగా అయిదో ఏడాది కోహ్లి అగ్రస్థానంలో నిలవడం విశేషం. విరాట్‌ నుంచి టీమ్‌ఇండియా పగ్గాలందుకున్న రోహిత్‌ శర్మ రూ. 243 కోట్ల బ్రాండ్‌ విలువతో 13వ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఎనిమిదేళ్లు దాటినా సచిన్‌ ఈ జాబితాలో 11వ స్థానంలో (బ్రాండ్‌ విలువ రూ.358 కోట్లు) నిలవడం గమనార్హం. మరో మాజీ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని రూ.462 కోట్లతో అయిదో ర్యాంకు సాధించాడు. ఈ జాబితాలో బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.1196 కోట్లు), అక్షయ్‌ కుమార్‌ (రూ.1055 కోట్లు) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. రూ.166 కోట్లతో పి.వి. సింధు 20వ స్థానంలో నిలిచింది.

రికార్డు స్థాయికి డిజిటల్‌ చెల్లింపులు

డిజిటల్‌ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్లు ‘వరల్డ్‌లైన్‌ ఇండియా’ డిజిటల్‌ పేమెంట్స్‌ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది. ఇందులో డెబిట్‌ కార్డులు 93 కోట్లు, క్రెడిట్‌ కార్డులు దాదాపు 7 కోట్ల మేరకు ఉన్నాయి. క్రెడిట్‌ కార్డుల మార్కెట్లో ప్రైవేటు బ్యాంకుల వాటా 67 శాతం ఉంటే, ప్రభుత్వ బ్యాంకుల వాటా 24 శాతం కనిపిస్తోంది.

ముఖ్యాంశాలు:-
‣ గత ఏడాదిలో 457 కోట్ల యూపీఐ ఆధారిత లావాదేవీలు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 105 శాతం వృద్ధి కనిపించింది. ఈ లావాదేవీలు విలువ రూ.8.2 లక్షల కోట్లు.

‣ మొబైల్‌ యాప్‌ ఆధారిత లావాదేవీలు 106 శాతం పెరిగాయి.

‣ ఇంటర్నెట్‌ ఆధారిత చెల్లింపుల్లోనూ 12 శాతం వార్షిక వృద్ధి నమోదు కావటం గమనార్హం.

‣ క్రెడిట్‌ కార్డుల వినియోగానికి సంబంధించి సగటు లావాదేవీ విలువ రూ.4,122 ఉన్నట్లు వెల్లడైంది.


ఎగుమతుల సన్నద్ధత సూచిలో తెలంగాణకు 10వ స్థానం

నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధత సూచి (ఎక్స్‌పోర్ట్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇండెక్స్‌) - 2021 ర్యాంకుల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. గతంలో 6వ స్థానంలో ఉండగా తాజాగా 47.92 మార్కులతో 10కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది 20వ స్థానంలో ఉన్న ఏపీ ఈసారి 9కి ఎగబాకింది. బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగంలో తెలంగాణ 100 మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌లో 99.50% మార్కులు సాధించి ఆకుపచ్చ మార్క్‌తో మంచి పనితీరు కనబరిచింది. ల్యాండ్‌ లాక్డ్‌ స్టేట్స్‌ విభాగంలో తెలంగాణ 5వ ర్యాంకులో నిలిచింది. రాష్ట్రాల పనితీరుకు కొలమానాలుగా తీసుకున్న పాలసీ పిల్లర్‌లో 12, బిజినెస్‌ ఎకోసిస్టంలో 7, ఎక్స్‌పోర్ట్‌ ఎకోసిస్టంలో 12, ఎక్స్‌పోర్ట్‌ పెర్ఫార్మెన్స్‌లో 9వ ర్యాంకును పొందింది.

ఐటీ కేంద్రంగా హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ నివేదిక

హైదరాబాద్‌ ఐటీ, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమకు కేంద్రంగా మారినట్లు నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. పైగా డేటా సెంటర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఫార్మాస్యూటికల్స్, క్లౌడ్‌ సొల్యూషన్‌ కంపెనీలకు హాట్‌ స్పాట్‌గా ఉన్నట్లు తెలిపింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డేటా సెంటర్‌ కోసం 70 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. కానీ ఓవరాల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఎకోసిస్టం మెరుగుకు తనవద్ద ఉన్న మౌలిక వసతుల్లోని లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. తెలంగాణ నుంచి గతేడాది ఔషధాలు రూ.10,134 కోట్లు, ముడి గ్రానైట్‌ రూ.1,190 కోట్లు, పత్తి రూ.1,041 కోట్లు, యాంటీ బయాటిక్స్‌ రూ.993 కోట్లతో పాటు మిగిలిన అన్ని వస్తువులూ కలిపి రూ.21,989 కోట్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు తెలిపింది.

ఎగుమతుల సంసిద్ధత సూచీ - 2021

ఎగుమతుల సంసిద్ధత సూచీ - 2021 కోసం నీతి ఆయోగ్‌ విశ్లేషించిన మొత్తం 11 అంశాలకు గాను 9 అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వెనుకబడింది. ఇన్‌స్టిట్యూషనల్‌ ఫ్రేమ్‌వర్క్, మౌలిక సదుపాయాలు, పొరుగు రాష్ట్రాలతో రవాణా అనుసంధానత, బ్యాంకింగ్‌ సదుపాయాలు, ఎగుమతుల కోసం మౌలిక సదుపాయాలు, వ్యాపార మద్దతు, పరిశోధన, అభివృద్ధి కోసం మౌలిక వసతులు, గ్రోత్‌ అండ్‌ ఓరియంటేషన్, ఎక్స్‌పోర్ట్‌ డైవర్సిఫికేషన్‌ అంశాల్లో ఆశించిన స్థాయిలో పనితీరు చూపలేకపోయింది. వ్యాపార అనుకూల వాతావరణంలో మెరుగైన పనితీరు కనబరచగా.. ఎగుమతుల ప్రోత్సాహక విధానంలో ఆశించిన స్థాయిలో పనితీరు చూపించింది. నీతిఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక ఈ మేరకు వెల్లడించింది. ఎగుమతుల విధానం, వ్యాపార నిర్వహణ, ఎగుమతులకు అనువైన వాతావరణం, ఎగుమతులు పెంచుకోవడంలో చూపిన పనితీరు (ఎక్స్‌పోర్ట్‌ పెర్ఫార్మెన్స్‌) అనే నాలుగు విభాగాల్లోని 11 అంశాల్ని విశ్లేషించి నివేదికలో వివరాలు పొందుపరిచింది. విభాగాలపరంగా చూస్తే ఈ నాలుగింటిలోనూ.. పూర్తిగా వెనుకబడింది. దీంతో ఆయా విభాగాలన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ఎరుపు రంగు మార్కే లభించింది. ఎగుమతుల సంసిద్ధత సూచీ - 2020లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2021లో మాత్రం 50.39 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.

ముఖ్యాంశాలు:-
‣ ఎగుమతులు పెంచుకునే అవకాశం ఉన్నా.. రాష్ట్రం నుంచి విదేశీ ఎగుమతులను పెంచుకోవటానికి అవకాశం ఉన్నా.. దానికి అనుగుణంగా రాష్ట్రానికి చెప్పుకోదగిన రీతిలో విదేశీ పెట్టుబడులు రాలేదు. ఈ విషయంలో దేశంలో 12వ స్థానంలో నిలిచింది.

‣ 2020-21లో తీరప్రాంత రాష్ట్రాల్లో మొత్తం 291.80 మిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే.. రాష్ట్రంలో సరైన మౌలిక సదుపాయాలు, ఐటీ విధానం లేకపోవటంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించలేకపోయింది.

‣ తీరప్రాంత రాష్ట్రాలకు సంబంధించి ఎగుమతుల వృద్ధిలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు గణనీయమైన ప్రగతి సాధించాయి. 2020-21లో దేశంలోని మొత్తం ఎగుమతుల్లో 20.83 శాతం వాటాతో గుజరాత్‌ మొదటిస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 20.06 శాతంతో రెండో స్థానంలో ఉంది. మొత్తం 8 తీరప్రాంత రాష్ట్రాల్లో.. ఏపీ 5వ స్థానంలో నిలిచింది.


పనితీరులో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం

నీతి ఆయోగ్‌ ప్రకటించిన ‘ఎగుమతుల సంసిద్ధత సూచీ - 2021’లో పనితీరు విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ద్వితీయ స్థానం దక్కిందని పరిశ్రమల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గతం కంటే 11 స్థానాలను పెంచుకుందన్నారు. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10 శాతం రాష్ట్ర వాటా సాధించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య వాతావరణం, ఎగుమతుల్లో సానుకూలత, వాటి పనితీరు, పాలసీ వంటి నాలుగు విభాగాల్లో రాష్ట్ర ర్యాంకు మెరుగైందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ వెల్లడించారు. ఎగుమతుల వృద్ధి విభాగంలో 50.39 పాయింట్లతో రాష్ట్రం 9వ స్థానంలో నిలిచిందన్నారు.

ఏడాదిలో 103 రోజులు ఓడీలోనే ఆంధ్రప్రదేశ్‌: కాగ్‌ నివేదిక

రాష్ట్ర ప్రభుత్వం 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,10,509.12 కోట్లను చట్టసభల ఆమోదం లేకుండానే కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఖర్చు చేసిందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆక్షేపించింది. 2014 - 15 నుంచి 2019 - 20 మధ్య ఇలా చేసిన ఖర్చుకు ఇంకా శాసనసభ ఆమోదం పొందాల్సి ఉందనీ ప్రస్తావించింది. గత ఏడాదిలో 103 రోజుల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం వినియోగించుకుంటే తప్ప రాష్ట్రం రోజు గడవని పరిస్థితి ఏర్పడిందని ఎత్తిచూపింది. రాష్ట్ర ఖజానాలో ఇతరత్రా ఏ ఆసరా లేకుండా కనీస నిల్వ నిధులున్నది ఏడాదిలో 34 రోజులు మాత్రమేనని గుర్తు చేసింది. 2020 - 21లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ రూపొందించిన లెక్కలను ప్రభుత్వం శాసనసభ ముందుంచింది.

2022లో భారత వృద్ధి 4.6 శాతమే: యూఎన్‌సీటీఏడీ నివేదిక

భారత ఆర్థిక వృద్ధి వృద్ధి 2022లో 4.6 శాతానికి పరిమితం కావొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది గతంలో అంచనా వేసిన 6.7% కంటే 2.1% తక్కువ కావడం గమనార్హం. రష్యా - ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం వల్లే ఇది తగ్గొచ్చని పేర్కొంది. ఇంధన ధరలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన విధానాలు, ఆర్థిక అస్థిరత వంటివి వృద్ధిపై ప్రభావం చూపుతాయని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) పేరుతో రూపొందించిన ఈ నివేదికలో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం 3.6% నుంచి 2.6 శాతానికి కుదించింది.

భారతీయులకు రెండో అతిపెద్ద ముప్పు వాయు కాలుష్యం

భారతీయుల ఆరోగ్యాన్ని వాయు కాలుష్యం ఎంతగా దెబ్బతీస్తోందో తాజా నివేదిక ఒకటి కళ్లకు కట్టింది. దేశంలో మానవారోగ్యానికి ఈ కాలుష్యమే రెండో అతిపెద్ద ముప్పుగా ఉందని స్పష్టం చేసింది. దాని దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా దాదాపు రూ.11.47 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ సంస్థ ‘ప్రపంచ గాలి నాణ్యత నివేదిక - 2022’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాతావరణంలో ప్రమాదకర పీఎం 2.5 ధూళికణాల గాఢతను 2024 నాటికి 20 - 30% మేర తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2019లో ప్రవేశపెట్టిన ‘జాతీయ పరిశుభ్ర వాయు కార్యక్రమం’ (ఎన్‌సీఏపీ)తో పెద్దగా ఒరిగిందేమీ లేదని ఈ నివేదిక తెలిపింది.

అత్యంత కాలుష్యపూరిత రాజధాని దిల్లీ

దేశంలో వాయు కాలుష్యం తీవ్రతను తాజా నివేదిక ఒకటి కళ్లకు కట్టింది. ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత నగరాల్లో 63 భారత్‌లోనే ఉన్నట్లు తేల్చింది. మరోవైపు, ప్రపంచంలోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా దిల్లీ వరుసగా నాలుగోసారి నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ అనే సంస్థ ‘ప్రపంచ వాయు నాణ్యత నివేదిక - 2021’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు చేదు విషయాలను వెలుగులోకి తెచ్చింది. అందులోని వివరాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను గత ఏడాది భారత్‌లో ఏ ఒక్క నగరమూ అందుకోలేకపోయింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో భివాడీ (రాజస్థాన్‌) తొలి స్థానంలో నిలవగా, గాజియాబాద్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) 2వ, దిల్లీ 4వ స్థానంలో ఉన్నాయి.

గాలిలో ప్రమాదకర పీఎం 2.5 ధూళికణాల గాఢత ఆధారంగా తాజా నివేదికను ఐక్యూఎయిర్‌ రూపొందించింది. ఇందుకోసం 117 దేశాల్లోని 6,475 నగరాల్లో పరిస్థితులను విశ్లేషించింది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం గాలిలో పీఎం 2.5 ధూళికణాలు ఒక్కో క్యూబిక్‌ మీటరుకు 5 మైక్రోగ్రాములను మించకూడదు. కానీ దిల్లీలో ప్రతి క్యూబిక్‌ మీటరుకు వాటి పరిమాణం 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఆ విలువ 84 మైక్రోగ్రాములు మాత్రమే. ఏడాదిలో మన దేశ రాజధానిలో పీఎం 2.5 ధూళికణాల కాలుష్యం 14.6% మేర పెరిగింది. తాజా నివేదికలో ప్రపంచంలోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానుల జాబితాలో దిల్లీ తర్వాత వరుస స్థానాల్లో ఢాకా (బంగ్లాదేశ్‌), ఎన్‌జమీనా (చద్‌), దుశాంబే (తజికిస్థాన్‌), మస్కట్‌ (ఒమన్‌) నిలిచాయి. భారతీయ నగరాల్లో ప్రతి క్యూబిక్‌ మీటర్‌కు పీఎం 2.5 ధూళికణాల వార్షిక సగటు 2021లో 58.1 మైక్రోగ్రాములుగా ఉంది. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశిత ప్రమాణాలతో పోలిస్తే ఇది 10 రెట్లకు పైగా ఎక్కువ. వరుసగా మూడేళ్ల పాటు దేశంలో కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టినా మళ్లీ గత ఏడాది పెరుగుదల నమోదు కావడం ఆందోళనకరం. ప్రధానంగా వాహన ఉద్గారాలు, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు, పరిశ్రమల వ్యర్థాల వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.


ప్రపంచ హ్యాపీనెస్‌ సూచీలో ఫిన్లాండ్‌కు ప్రథమ స్థానం

ఐక్యరాజ్య సమితికి చెందిన ‘సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌’ విడుదల చేసిన ప్రపంచ సంతోష దేశాల సూచీలో వరుసగా ఐదో సంవత్సరం ఫిన్లాండ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 146 దేశాలకు ర్యాంకులు ఇస్తూ రూపొందించిన ఈ ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టు’లో.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ సంతోషానికి దూరంగా.. మళ్లీ చివరి స్థానంలో మిగిలింది. ఆయా దేశాల్లో వివిధ జీవన ప్రమాణాల ఆధారంగా సున్నా నుంచి పది వరకు స్కోరు ఇస్తూ ఏటా ఈ నివేదికను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇది పదో సంవత్సరం. తాజా నివేదికలో భారత్‌ స్కోరు 3.777 కాగా.. గత ఏడాది కంటే 3 స్థానాలను మెరుగు పరుచుకుని 136వ స్థానంలో నిలిచింది.

ఆయా దేశాల్లో ఆనందమయ జీవితం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు వంటివాటిపై ప్రజల స్వీయ మదింపును ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తారు. ఇలాంటి మూడేళ్ల డేటా సగటును పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి దేశంలోనూ వారి శ్రేయోదాయక జీవనంపై ప్రజలను సర్వే చేస్తారు. జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రథమ స్థానంలో నిలిచిన ఫిన్లాండ్‌ 7.821 స్కోరును సాధించింది. జాబితాలో తొలి 10 స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్వీడన్, నార్వే, ఇజ్రాయెల్, న్యూజిలాండ్‌లు ఉన్నాయి.


కాలుష్య నదిగా గోదావరి: డీపీఆర్‌ నివేదిక

గోదావరి, ఉప నదుల నీటి నాణ్యత ‘డి’ గ్రేడ్‌కి పడిపోయినట్లు కేంద్ర జలసంఘం గుర్తించింది. కొన్నిచోట్ల ఆక్రమణలతో నది కుచించుకుపోయింది. కేంద్రం రూపొందించిన డీపీఆర్‌లో ఇవి వెల్లడయ్యాయి. గోదావరి పునరుజ్జీవం కోసం రూ.1,700.84 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

గోదావరి తీరంలో నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్‌ (మహారాష్ట్ర), భద్రాచలం, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం (తెలంగాణ), రాజమహేంద్రవరం, నరసాపురం(ఆంధ్రప్రదేశ్‌) గోదావరి ఒడ్డునే ఉన్నాయి. నాసిక్, ఔరంగాబాద్‌లలో ఆటోమొబైల్‌ పరిశ్రమల రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్‌ ఘనవ్యర్థాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి. మొత్తంగా 125 పెద్ద, 350 మధ్యతరహా, 2,500 చిన్న పరిశ్రమలున్నాయి. వ్యవసాయ భూముల్లో ఎరువులు, పురుగుమందుల వాడకం అధికంగా ఉండటమూ కాలుష్యాన్ని పెంచుతోంది.

నీటిలో బీఓడీ (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌), డీఓ (నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌) ఆధారంగా లెక్కిస్తారు. వీటితో పాటు కొలిఫాం బ్యాక్టీరియా, అమ్మోనియో, పీహెచ్‌ని పరిగణనలోకి తీసుకుంటారు. డీఓ పరిమాణం లీటరుకు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. బీఓడీ 3 ఎంజీ దాటొద్దు. ఇది పలుచోట్ల 4-9 వరకు ఉంది.

దక్షిణాదిలో తగ్గిన కాలుష్యం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల వాసులకు కాస్త ఊరట. గత శీతాకాలంలో (2021 అక్టోబరు 15 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు) దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో వాయు కాలుష్యం (పీఎం 2.5 ధూళికణాలు) తక్కువగా నమోదైంది. దేశవ్యాప్తంగా అంతకుముందు శీతాకాలంతో (2020 - 21) పోలిస్తే, ఈసారి (2021 - 22) వాయుకాలుష్యం కాస్త తగ్గిందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) సంస్థ నివేదిక పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ఆధారంగా దేశంలోని 161 నగరాల్లో కాలుష్య తీవ్రతను విశ్లేషించింది. సీఎస్‌ఈ నివేదిక ప్రకారం గత శీతాకాలంలో అత్యధిక కాలుష్యం నమోదైన నగరాల్లో బిహార్‌లోని శివాన్, ముంగర్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. గాజియాబాద్, దిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలోని 35 నగరాల్లో గాలిలో 2.5 ధూళి కణాల సగటు తక్కువగా నమోదైందని సీఎస్‌ఈ తెలిపింది. వాయు కాలుష్యం తగ్గిన నగరాల్లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరం, అమరావతి, విశాఖపట్నం ఉన్నాయి.

భూ దస్తావేజుల ఆధునికీకరణ నిధులు పూర్తిగా ఖర్చు చేయని తెలుగు రాష్ట్రాలు

కేంద్ర ప్రభుత్వం భూ దస్తావేజుల ఆధునికీకరణ కింద ఇచ్చిన నిధుల్లో అత్యధిక మొత్తం ఖర్చుచేయని రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు తొలి రెండు స్థానాల్లో నిలిచినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. సాధారణ ప్రజల ప్రయోజనార్థం ప్రవేశపెట్టిన ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో అత్యధిక మొత్తం ఖర్చుకాలేదని పేర్కొంది. 2019 - 20లో రూ.398.54 కోట్లు, 2020 - 21లో రూ.492 కోట్లు, 2021 - 22లో రూ.536.57 కోట్లు మిగిలిపోయినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే నిధులకు రాష్ట్రాలు మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ సమకూర్చలేని స్థితిలో ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోందని స్థాయీ సంఘం పేర్కొంది. నిధులు ఖర్చు చేయని రాష్ట్రాల్లో తెలంగాణ (రూ.81.19 కోట్లు) ప్రథమ స్థానం, ఆంధ్రప్రదేశ్‌ (రూ.68.90 కోట్లు) రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది.

సభ ఆమోదం లేకుండానే ఖర్చులు!

రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన పారదర్శక బడ్జెట్‌ విధానాలను అనుసరించాలని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సూచించింది. శాసనసభ ఆమోదం లేకున్నా భారీ మొత్తంలో వ్యయం జరుగుతోందని పేర్కొంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వాస్తవికతలేదని, బడ్జెట్‌ అమలుపై నియంత్రణ, పర్యవేక్షణ తగినంతగాలేదని పేర్కొంది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఆడిట్‌ నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టారు.

ముఖ్యాంశాలు:-
బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే వ్యయం చేయడం శాసనసభ అధికారాన్ని తగ్గించినట్లవుతుంది. 2014-15 నుంచి ఆరేళ్లలో అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసిన రూ. 1,32,547 కోట్ల వ్యయాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉంది.

- కొన్ని కేటాయింపులకు మించి ఖర్చు చేయగా, అనుబంధ కేటాయింపులకు శాసనసభ ఆమోదం లేకున్నా ఖర్చు చేశారు.

- కేటాయింపులు, ఖర్చుల మధ్య తేడాలను స్పష్టంగా వివరించలేదు.

- చెల్లించాల్సిన రుణం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్లుగానే ఉన్నా, బడ్జెటేతర రుణాలను పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యానికి మించి అప్పులు ఉన్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది.

- 2019-20లో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా, 2020-21లో తీసుకున్న రుణాల్లో 76.53 శాతం వరకు గతంలో తీసుకున్న అప్పులు చెల్లించడానికే వినియోగించాల్సి రావడంతో ఆస్తుల కల్పన మీద దాని ప్రభావం పడిందని తెలిపింది.

- 2021 మార్చి 31 వరకు చెల్లించాల్సిన మొత్తం అప్పుల్లో రూ. 1,06,468 కోట్లు (45.86 శాతం) రానున్న ఏడేళ్లలో తీర్చాలని, దీన్ని తట్టుకోడానికి రాష్ట్రం వనరులను పెంచుకోవాలని వివరించింది. ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్‌ రుణాల ద్వారానే సమకూరిందని తెలిపింది.

- 2020, 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆడిట్‌ నివేదికను తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు.

- 2019 - 20 నాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ. 2,32,181 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు రూ. 85,380.96 కోట్ల రుణాలు తీసుకున్నాయి. 2020 - 21 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,71,018 కోట్లకు చేరగా, బడ్జెటేతర రుణాలు రూ. 97,940.45 కోట్లుగా ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న మాతృ మరణాలు

మాతృ మరణాలను తగ్గించేందుకు దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో మాతృ మరణాల తగ్గింపునకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు మిగతా వాటి కంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లు కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా విడుదల చేసిన 2019 శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) నివేదిక స్పష్టం చేసింది. దాని ప్రకారం.. మాతృ మరణాల నిష్పత్తి (ప్రతి లక్ష జననాలకు మాతృ మరణాలు) దేశంలో సగటు 103 మేర ఉండగా ఇది దక్షిణాదిలో 59కే పరిమితమైంది. మాతృ మరణాల రేటు (పునరుత్పాదక వయసులో ఉన్న మహిళల్లో మరణాలు) 6.5 మేర ఉండగా, ఇది దక్షిణాదిలో 3.1కే పరిమితమైంది. గుజరాత్‌లో మాతృ మరణాల నిష్పత్తి 70, మాతృమరణాల రేటు 5 మేర ఉంది.

‣ దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాల రేటు (క్రూడ్‌ బర్త్‌ రేటు) 2019 నాటికి 19.7కి చేరింది. 2018తో పోలిస్తే ఇది 0.3 పాయింట్ల మేర తగ్గింది. క్రూడ్‌ బర్త్‌ రేటు గరిష్ఠంగా బిహార్‌లో (25.8), కనిష్ఠంగా కేరళలో (13.5) నమోదైంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో క్రూడ్‌ బర్త్‌ రేటు 1.3 పాయింట్ల మేర తగ్గింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1.3 పాయింట్లు, పట్టణ ప్రాంతాల్లో 1.0 పాయింట్‌ తగ్గుదల కనిపించింది.

‣ ప్రతి వెయ్యి మందికి మరణాలు (క్రూడ్‌ డెత్‌ రేటు) 2019లో 6.0గా నమోదైంది. ఇది అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో (7.3), అత్యల్పంగా దిల్లీలో (3.2) నమోదైంది.

‣ శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి జననాలకు మరణాలు) 2018లో 32 ఉండగా, 2019కి అది 30కి తగ్గింది. 2014లో 39 మేర ఉన్న శిశు మరణాల రేటు 2019 నాటికి 30కి తగ్గింది.

‣ 5 ఏళ్ల లోపు పిల్లల మరణాల రేటు 2018 నుంచి 2019 మధ్యకాలంలో 36 నుంచి 35కి తగ్గింది. ఇది బాలురలో 1 పాయింటు, బాలికల్లో 2 పాయింట్ల మేర తగ్గింది.

‣ జీవితకాలంలో మహిళలకు జన్మించే సంతానం రేటు (టోటల్‌ ఫెర్టిలిటీ) 2019లో 2.1కి తగ్గింది. 2017, 2018ల్లో ఇది 2.2మేర ఉంది. 2019లో సంతానసాఫల్యత అత్యధికంగా బిహార్‌లో (3.1), అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్, దిల్లీ, జమ్మూ - కశ్మీర్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ (1.5)లో నమోదైంది.

‣ సంతాన సాఫల్య పునఃస్థాపక స్థాయి 2.1ని ఆంధ్రప్రదేశ్, దిల్లీ, జమ్మూ - కశ్మీర్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ (1.5), హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ (1.6), కర్ణాటక (1.7), ఒడిశా (1.8), ఉత్తరాఖండ్‌ (1.9), గుజరాత్‌ (2.1), హరియాణా (2.1)లు చేరుకున్నాయి.


సౌర విద్యుత్‌ సామర్థ్యంపై మెర్కామ్‌ ఇండియా నివేదిక

2021లో పైకప్పు(రూఫ్‌టాప్‌) సౌర విద్యుత్‌ సామర్థ్యం రికార్డు స్థాయిలో 1700 మెగావాట్లకు చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 136 శాతం వృద్ధి చెందిందని మెర్కామ్‌ ఇండియా తన నివేదికలో పేర్కొంది. 2020లో భారత్‌ 719 మెగావాట్ల పైకప్పు సౌర సామర్థ్యాన్ని జత చేసింది.

‣ 2021లో రూఫ్‌టాప్‌ సౌర సామర్థ్యం విషయంలో నివాస, వాణిజ్య విభాగాలు వరుసగా 35%; 33% చొప్పున వాటాను దక్కించుకున్నాయి. పారిశ్రామిక విభాగం 26%; ప్రభుత్వ విభాగం 6% చొప్పున నమోదు చేశాయి.

‣ మొత్తం రూఫ్‌టాప్‌ సోలార్‌ సామర్థ్యం విషయంలో గుజరాత్‌ 27% వాటాతో అగ్రస్థానంలో చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(14%), రాజస్థాన్‌(10%)లు ఉన్నాయి. 2021లో తొలి 10 రాష్ట్రాల మొత్తం సామర్థ్యం 85 శాతంగా ఉంది.


జాతీయ నమూనా సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) నివేదిక

తెలంగాణలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2016 - 18లో ప్రతి లక్ష ప్రసవాలకు కాన్పు మరణాలు 63 నమోదు కాగా 2017 - 19కి వచ్చే సరికి 56కు తగ్గాయి. దేశం మొత్తమ్మీద అన్ని రాష్ట్రాల్లో ప్రసూతి మరణాల తగ్గుదలను పరిశీలిస్తే కేరళ (30) మొదటి స్థానంలో, మహారాష్ట్ర (38) రెండో స్థానంలో ఉండగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. వైద్య రంగంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తారనే పేరున్న తమిళనాడు కూడా ఈసారి ఫలితాల్లో తెలంగాణ కంటే వెనుకబడి 58 మరణాలతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇదే స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ (58) కూడా నిలిచింది. ఝార్ఖండ్‌ (61), గుజరాత్‌ (70), కర్ణాటక (83), హరియాణా (96) రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గతేడాదితో పోల్చితే ప్రసూతి మరణాలు రాష్ట్రంలో 11.1 శాతం తగ్గినట్లుగా విడుదలైన జాతీయ నమూనా సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) వెల్లడించింది.

‣ దేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా ప్రతి లక్ష ప్రసవాలకు 205 మంది బాలింతలు కన్నుమూస్తున్నారు.

‣ జాతీయ సగటు 103 కాగా అంతకంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (167), మధ్యప్రదేశ్‌ (163), ఛత్తీస్‌గఢ్‌ (160), రాజస్థాన్‌ (141), ఒడిశా (136), బిహార్‌ (130), పంజాబ్‌ (114).

‣ తెలంగాణలో జిల్లాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా 101 మరణాలుండగా అత్యల్పంగా 12 నమోదయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే అత్యధిక ప్రసూతి మరణాలు 95, అతి తక్కువగా 21 నమోదయ్యాయి.


ఆంధ్రప్రదేశ్‌ రహదారి భద్రత కౌన్సిల్‌ 2021 నివేదిక

కరోనా కారణంగా 2020లో కొంతకాలం పూర్తిస్థాయి లాక్‌డౌన్, తర్వాత కర్ఫ్యూ అమలు చేయడంతో రాష్ట్రంలో ప్రమాదాలు తగ్గగా 2021లో మళ్లీ గణనీయంగా పెరిగాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారూ ఎక్కువే. గతేడాది రాష్ట్రంలో 19,729 రహదారి ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 8,053 మంది చనిపోగా 21,169 మంది గాయపడ్డారు. 2020తో పోలిస్తే 2021లో ప్రమాదాల్లో 10.16 శాతం, మరణాల్లో 14.08 శాతం, క్షతగాత్రుల్లో 7.94 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు ఏపీ రహదారి భద్రత కౌన్సిల్‌ 2021 సంవత్సరానికి సిద్ధం చేసిన నివేదికలో ఈ వివరాలు పేర్కొంది.

టీవీ ప్రకటనల్లో 22% వృద్ధి

2021లో మొత్తం టీవీ ప్రకటనలు 22 శాతం పెరిగి 1,824 మిలియన్‌ సెకన్లకు చేరాయని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ (బార్క్‌) గణాంకాలు వెల్లడించాయి. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా టీవీ ప్రకటనలు 2019లో 1542 మిలియన్‌ సెకన్లు, 2020లో 1,497 మిలియన్‌ సెకన్లకు పరిమితమయ్యాయి. 2021లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై ప్రకటనదారులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్‌ సమయంలో ప్రకటనలు 16.80 లక్షల సెకన్లుగా ఉన్నాయి. ప్రీమియం హెచ్‌డీ చానెళ్లలో ప్రకటనలు 11 శాతం, స్టాండర్డ్‌ డెఫినిషన్‌ (ఎస్‌డీ) విభాగంలో ప్రకటనలు 22 శాతం చొప్పున వృద్ధి నమోదుచేశాయి.

వ్యాపారవేత్తలుగా ఎదగాలని మహిళల ఆసక్తిపై టెక్‌హార్క్, షీట్‌వర్క్‌ సంయుక్త సర్వే

టెక్‌ (సాంకేతిక) వ్యాపారవేత్తలుగా మారాలన్న ఆసక్తి మెట్రో నగరాల వారితో పోలిస్తే, చిన్న నగరాల (మెట్రోయేతర) మహిళల్లో ఎక్కువగా ఉందని టెక్‌హార్క్, షీట్‌వర్క్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే సాంకేతిక వనరులు, మౌలిక వసతులు, మార్గదర్శకత్వ లేమి చిన్న నగరాల్లోని ఔత్సాహికులకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయని పేర్కొంది. ‘స్టేట్‌ ఆఫ్‌ ఉమెన్‌ టెక్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ఈ సర్వే చేసి నివేదికను రూపొందించారు. దేశ వ్యాప్తంగా 2,000 మంది వృత్తి నిపుణులు, విద్యార్థులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, వ్యాపార లీడర్ల నుంచి అభిప్రాయాలు సమీకరించి, ఈ నివేదిక తయారు చేశారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్‌కు 120వ స్థానం

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్‌ మూడు స్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 117వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 120కి పడిపోయినట్లు ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్విరాన్‌మెంట్‌ రిపోర్ట్‌-2022 పేర్కొంది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) రూపొందించిన ఈ నివేదికను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ విడుదల చేశారు. ‣ 2030 ఎజెండాలో భాగంగా 2015లో 192 ఐరాస సభ్యదేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్వీకరించారు. తాజా ర్యాంకింగ్‌ల ప్రకారం పాకిస్థాన్‌ (ర్యాంకు 129) తప్ప అన్ని దక్షిణాసియా దేశాల కంటే దిగువన భారత్‌ ఉంది. భూటాన్‌ (75), శ్రీలంక (87), నేపాల్‌ (96), బంగ్లాదేశ్‌ (109)లు మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. భారత్‌ మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్కోర్‌ 100కు గాను 66గా నమోదైందని నివేదిక తెలిపింది. లింగ సమానత్వం, ఆకలి కేకలు లేకపోవడం, మంచి ఆరోగ్యం-జీవనం, అనుసరణీయ నగరాలు సహా 11 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎదురైన ప్రధాన సవాళ్ల కారణంగా భారత్‌ ర్యాంకు పడిపోయింది. విద్య, భూమిపై జీవనం వంటి అంశాల్లో భారత్‌ ప్రదర్శన సంతృప్తికరంగా లేనట్లు నివేదిక తేటతెల్లం చేసింది.

2.5 రెట్లు పెరిగిన పీఎం 2.5 కాలుష్యం మరణాలు: సీఎస్‌ఈ నివేదిక

దేశంలో గత రెండు దశాబ్దాల్లో పీఎం (పార్టిక్యులేట్‌ మేటర్‌) 2.5 కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు 2.5 రెట్లు పెరిగాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నివేదిక పేర్కొంది. ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్విరాన్‌మెంట్‌ రిపోర్ట్‌’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ విడుదల చేశారు. 2019లో వాయు కాలుష్యం కారణంగా సంభవించిన ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి భారత్‌లో సంభవిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో 66,70,000 మంది మరణించారని నివేదిక వెల్లడించింది. ఇందులో 16,70,000 మరణాలు భారత్‌లో సంభవించాయని, చైనాలో ఈ సంఖ్య 18,50,000గా ఉందని తెలిపింది. వాయు కాలుష్యం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 4.76 లక్షల మంది శిశువులు పుట్టిన నెలలోపే మరణించారని, దాంట్లో భారత్‌ వాటా 1.16 లక్షలుగా ఉందని వివరించింది. వాయు నాణ్యత లేకపోవడం అనేది 2019లో సంభవించిన అకాల మరణాలకు సంబంధించి నాలుగో ప్రధాన కారణంగా ఉందని తెలిపింది. దీనికి ముందు బీపీ, పొగాకు వినియోగం, పౌష్టికాహార లేమి ఉన్నాయని వివరించింది.