పుస్తకాలు

డబ్ల్యూటీటీ స్టార్‌ కంటెండర్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ

డబ్ల్యూటీటీ స్టార్‌ కంటెండర్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో మనిక బత్ర, అర్చన కామత్‌ జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో మనిక - అర్చన జోడీ 8-11, 6-11, 7-11తో లి యు జున్, చెంగ్‌ ఐ చింగ్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. సింగిల్స్‌ విభాగంలోనూ మనికకు నిరాశ తప్పలేదు. ప్రీక్వార్టర్‌ ఫైనల్లో ఆమె 5-11, 2-11, 4-11తో యింగ్‌ హన్‌ (జర్మనీ) చేతిలో పరాజయంపాలైంది. పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సత్యన్‌ 11-5, 8-11, 7-11, 4-11తో క్రిస్టియన్‌ కార్లసన్‌ (స్వీడెన్‌) చేతిలో ఓడిపోయాడు.

భారత హాకీ జట్టు కెప్టెన్‌గా రొహిదాస్‌

ఇంగ్లండ్‌తో జరగనున్న ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ డబుల్‌ హెడర్‌కు భారత జట్టును ప్రకటించారు. 22 మంది సభ్యుల జట్టుకు అమిత్‌ రొహిదాస్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఇటీవల అర్జెంటీనాతో తలపడ్డ జట్టుకు కూడా అతడే నాయకత్వం వహించాడు. డిఫెండర్‌ నీలమ్‌ సంజీప్‌ పునరాగమనం చేశాడు. వరుణ్‌ కుమార్‌ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడు. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన భారత్‌ (16 పాయింట్లు) ఈ సీజన్‌ ప్రొ లీగ్‌లో జర్మనీ (17 పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉంది.

జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

‘లక్ష్య’ పారా అథ్లెట్లు సత్తాచాటారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌11 విభాగంలో నీలం పల్లవి రజతం గెలిచింది. పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌11 విభాగంలో నీలం సంజయ్‌రెడ్డి కాంస్యం సొంతం చేసుకున్నాడు. పురుషుల హైజంప్‌ (టీ44)లో ఇంజమూరి శ్యామ్‌ కంచు పతకం దక్కించుకున్నాడు. 1.65 మీటర్ల ఎత్తు దూకి అతడు మూడో స్థానంలో నిలిచాడు.

ఎంసీజీలో షేన్‌ వార్న్‌ పేరుతో ఏర్పాటు చేసిన స్టాండ్‌ ఆవిష్కరణ

ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో (ఎంసీజీ) నిర్వహించిన వార్న్‌ స్మారక సభలో ఎంసీజీలో షేన్‌ వార్న్‌ పేరుతో ఏర్పాటు చేసిన స్టాండ్‌ను అతడి పిల్లలు ఆవిష్కరించారు. మాజీ ఆటగాళ్లు నాసర్, మార్క్‌ టేలర్, అలన్‌ బోర్డర్, లారా, మెక్‌గ్రాత్, గిల్‌క్రిస్ట్, స్టీవ్‌ వా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

దిల్లీ ఇంటర్నేషనల్‌ చెస్‌ టైటిల్‌ విజేత అర్జున్‌

చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి దిల్లీ ఇంటర్నేషనల్‌ చెస్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టోర్నీలో ఆఖరిదైన పదో రౌండ్లో కార్తీక్‌ వెంకట్రామన్‌ను ఓడించిన అర్జున్‌ మొత్తం 8.5 పాయింట్లతో హర్ష భరతకోటి, గుకేశ్‌తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఉత్తమ ప్రొగ్రెసివ్‌ స్కోరు ఆధారంగా అర్జున్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు. గుకేశ్‌ రన్నరప్‌గా, హర్ష మూడో స్థానంలో నిలిచారు. చివరి రౌండ్లో అభిజిత్‌ గుప్తాపై గుకేశ్‌ నెగ్గగా.. సేతురామన్‌ను హర్ష ఓడించాడు. గ్రాండ్‌మాస్టర్‌ ఎంఆర్‌ లలిత్‌బాబు ఏడో స్థానంలో నిలిచాడు. చివరి రౌండ్లో లలిత్‌.. హిమల్‌తో డ్రా చేసుకున్నాడు. మార్చిలో అర్జున్‌కు ఇది రెండో టైటిల్‌. ఇటీవలే అతడు జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.

జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌లో శ్రీలక్ష్మికి స్వర్ణ పతకం

జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శ్రీలక్ష్మి మెరిసింది. జూనియర్‌ మహిళలు, యూత్‌ కేటగిరిలో ఆమె స్వర్ణ పతకాలు సాధించింది. మహిళల 81 కేజీల విభాగంలో శ్రీలక్ష్మి స్నాచ్‌లో 81 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 104 కేజీలతో పాటు మొత్తం మీద 185 కేజీలు ఎత్తి పసిడి కైవసం చేసుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (పంజాబ్, 183 కేజీలు) రజతం, హేమ (మహారాష్ట్ర, 169 కేజీలు) కాంస్యం సాధించారు. 81 కేజీల యూత్‌ విభాగంలోనూ శ్రీలక్ష్మి పసిడి కైవసం చేసుకుంది. ఇదే కేటగిరిలో మరో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చైతన్య కుమారి కాంస్యం నెగ్గింది. అమృత (కేరళ) రజతం సాధించింది.

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేత సింధు

డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పి.వి.సింధు ఈ సీజన్‌లో రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. తుదిపోరులో రెండో సీడ్‌ సింధు 21-16, 21-8 తేడాతో నాలుగో సీడ్‌ బుసానన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. 49 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగించిన ఆమె ప్రత్యర్థిపై విజయాల రికార్డును 16-1కు పెంచుకుంది. తొలి గేమ్‌ ఆరంభంలోనే 3-0తో సింధు దూకుడు ప్రదర్శించింది. కానీ ర్యాలీలతో పాయింట్లు సాధించిన ప్రత్యర్థి 7-7తో స్కోరు సమం చేసింది. విరామ సమయానికి 11-9తో నిలిచిన సింధుకు బుసానన్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ బలమైన స్మాష్‌లతో అదరగొట్టిన సింధు 16-15తో ఆధిక్యాన్ని కొనసాగించింది. ఆ తర్వాత చకచకా పాయింట్లు సాధించి తొలి గేమ్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు మరింత చెలరేగింది. ర్యాలీలను పాయింట్లుగా మారుస్తూ 11-2తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది జనవరిలో సయ్యద్‌ మోదీ టోర్నీలో సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గత స్విస్‌ ఓపెన్‌ ఫైనల్లో.. ఆమె కరోలినా మారీన్‌ చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌కు నిరాశ తప్పలేదు. 2017 తర్వాత ఓ టోర్నీ ఫైనల్‌ చేరిన అతడు.. టైటిల్‌ పోరులో 12-21, 18-21తో నాలుగో సీడ్‌ జొనాథన్‌ (ఇండోనేషియా) చేతిలో ఓడాడు.

జాతీయ ఛాంపియన్‌గా సురేఖ

ప్రపంచ వేదికలపై నిలకడగా రాణిస్తూ పతకాల పంట పండిస్తున్న తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖ (పీఎస్‌పీబీ) మరోసారి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ మహిళల టైటిల్‌ను ఆమె ఖాతాలో వేసుకుంది. జమ్మూలో జరిగిన ఫైనల్లో ఈ విజయవాడ అమ్మాయి 146-143 తేడాతో ప్రియ గుర్జార్‌ (రాజస్థాన్‌)పై విజయం సాధించింది. మరోవైపు ర్యాంకింగ్‌ రౌండ్లో 720కి గాను 699 స్కోరుతో ఆమె మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఆమె జాతీయ ఛాంపియన్‌గా నిలవడం ఇది ఆరోసారి.

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ: ఫైనల్లో సింధు, ప్రణయ్‌

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ సింధు 21-18, 15-21, 21-19 తేడాతో అన్‌సీడెడ్‌ సుపానిదా (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. తుదిపోరులో నాలుగో సీడ్‌ బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో ఆమె తలపడుతుంది. ‣ స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రణయ్‌ 21-19, 19-21, 21-18తో ప్రపంచ అయిదో ర్యాంకర్‌ ఆంథోని (ఇండోనేషియా)పై గెలిచాడు. కిదాంబి శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. సెమీస్‌లో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ 21-18, 7-21, 13-21తో నాలుగో సీడ్‌ జొనాథన్‌ (ఇండోనేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.

మహిళల టెన్నిస్‌లో అగ్రస్థానానికి స్వైటెక్‌

మహిళల టెన్నిస్‌లో కొత్త నంబర్‌వన్‌. ఇగా స్వైటెక్‌ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. తాజాగా ఆమె మియామి ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో స్వైటెక్‌ 6-2, 6-0తో గొలుబిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించింది. నంబర్‌వన్‌ అయిన తొలి పోలెండ్‌ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. ఇన్ని రోజులు నంబర్‌వన్‌గా ఉన్న ఆష్లే బార్టీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెన్నిస్‌ నుంచి రిటైరవుతున్నట్లు ఇటీవలె ప్రకటించింది.

ఒలింపిక్‌ వీరులకు సత్కారం

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను సీఎస్కే, కేకేఆర్‌ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సత్కరించింది. జావెలిన్‌ త్రోలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రాకు రూ.కోటి చెక్కును బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అందజేశాడు. కాంస్యం నెగ్గిన బాక్సర్‌ లవ్లీనాకు రూ.25 లక్షలు, చారిత్రక కంచు పతకం సొంతం చేసుకున్న పురుషుల హాకీ జట్టుకు రూ.కోటి ఇచ్చారు. హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ఈ చెక్కు స్వీకరించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు.

వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌: సత్తాచాటిన పల్లవి

సబ్‌ జూనియర్, జూనియర్, సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుమ్మాయి పల్లవి (64 కేజీలు) సత్తాచాటింది. విజయనగరానికి చెందిన ఈ వెయిట్‌లిఫ్టర్‌ ఓ స్వర్ణంతో పాటు రెండు రజతాలు సొంతం చేసుకుంది. మొత్తం 194 (స్నాచ్‌లో 86, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 108) కేజీల బరువెత్తిన ఆమె.. జూనియర్‌ బాలికల్లో పసిడి, సీనియర్‌ మహిళల్లో రజతం, అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ విభాగంలో వెండి పతకం దక్కించుకుంది.

బాయ్‌ ఉపాధ్యక్షుడిగా పుల్లెల గోపీచంద్‌

భారత బ్యాడ్మింటన్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బాయ్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంఘం సర్వసభ్య సమావేశంలో అతడిని ఈ పదవికి ఎన్నుకున్నారు. 2022 - 2026 వరకు గోపి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారు. హిమంత బిశ్వశర్మ మళ్లీ బాయ్‌ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత.. 2017లో తొలిసారి బాయ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడు ఆసియా బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడిగా, ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య సర్వసభ్య మండలి సభ్యుడిగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ మిశ్రా ఎన్నిక కాగా ఇప్పటిదాకా ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్‌కుమార్‌ సింఘానియా ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో దీపకు రజతం, గణేశ్‌కు కాంస్యం

జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్, సీనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు దీప రజతం, గణేశ్‌ కాంస్యం సాధించారు. జూనియర్‌ బాలికల 59 కేజీల విభాగంలో స్నాచ్‌లో 77 కిలోలు, జెర్క్‌లో 97 కిలోలు, మొత్తంగా 174 కేజీల బరువులెత్తిన దీప ద్వితీయ స్థానం సాధించింది. బాలుర 81 కేజీల విభాగంలో స్నాచ్‌లో 123 కిలోలు, జెర్క్‌లో 153 కిలోలు, మొత్తంగా 276 కేజీలు మోసిన గణేశ్‌ మూడో స్థానంలో నిలిచాడు.

వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌

వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెల్లడించాడు. తొట్టతొలి మహిళల ఐపీఎల్‌ను అయిదు లేదా ఆరు జట్లతో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. మహిళల టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్లో మహిళల కోసం నాలుగు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ‘‘ఐపీఎల్‌-15 ప్లేఆఫ్స్‌ సమయంలోనే మహిళల కోసం మూడు జట్లు తలపడే నాలుగు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తాం’’ అని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ చెప్పారు. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ రెండో దశను యూఏఈలో నిర్వహించడంతో మహిళలకు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లను రద్దు చేశారు. 2020లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో ట్రయల్‌ బ్లేజర్స్‌ విజేతగా నిలిచింది. ఈసారి మహిళల మ్యాచ్‌లకు పుణె వేదికగా నిలిచే అవకాశం ఉంది.

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రి ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిలో సోమేశ్వరరావు రాముద్రి లాంగ్‌జంప్‌లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 6.40 మీటర్ల దూరం దూకిన సోమేశ్వరరావు అగ్రస్థానంలో నిలిచాడు. సోమేశ్వరరావుతో పాటు ఈ టోర్నీలో మోహిత్‌ (జావెలిన్‌) స్వర్ణం గెలిచాడు. ఫైనల్లో అతడు జావెలిన్‌ను 54.71 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.

జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో వెంకటకృష్ణకు రజతం

జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ లిఫ్టర్లు వెంకటకృష్ణ, కోటేశ్వరరావు పతకాలతో సత్తాచాటారు. 73 కేజీల యూత్‌ బాలుర విభాగంలో వెంకటకృష్ణ స్నాచ్‌లో 115 కిలోలు, జెర్క్‌లో 147 కిలోలతో మొత్తం 262 కేజీలతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచాడు. 73 కేజీల జూనియర్‌ బాలుర విభాగంలో కోటేశ్వరరావు స్నాచ్‌లో 119 కిలోలు, జెర్క్‌లో 152 కిలోలతో మొత్తం 271 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.

ప్రపంచ నంబర్‌వన్‌ ఆష్లీ బార్టీ టెన్నిస్‌కు వీడ్కోలు

మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ ఆష్లీ బార్టీ (25) టెన్నిస్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. బార్టీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి రెండు నెలలు కూడా కాలేదు. ఇంకెన్నో టైటిళ్లు గెలిచే సత్తా ఉన్న ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం ఊహించనిదే. ‘‘ఇది నాకు చాలా కష్టమైన రోజు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తుంటే చాలా ఉద్వేగంగా ఉంది. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. టెన్నిస్‌ నాకెంతో ఇచ్చింది. నా కలలను నిజం చేసింది. కానీ రాకెట్‌ను పక్కన పెట్టి ఇతర కలలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని నాకు తెలుసు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచిన వీడియోలో పేర్కొంది. బార్టీ రెండేళ్లుగా నంబర్‌వన్‌గా ఉంటోంది. ఇప్పటివరకు ఆమె మూడు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లు గెలుచుకుంది. 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్, 2021లో వింబుల్డన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సాధించింది. ‘‘థాంక్యూ ఆష్‌. ఈ ఆటకు, ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు గొప్ప రాయబారిగా ఉన్నావు’’ అని డబ్ల్యూటీఏ ట్వీట్‌ చేసింది.

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి-2 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మహేశ్వరికి రజతం

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి-2 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి గోప మహేశ్వరి (తెలంగాణ) సత్తాచాటింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో రజత పతకంతో మెరిసింది. ఈ రేసును మహేశ్వరి 10 నిమిషాల 52.49 సెకన్లలో పూర్తిచేసి ద్వితీయ స్థానంలో నిలిచింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌

భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌ పురుషుల సింగిల్స్‌లో టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో సంచలన విజయాలతో ఫైనల్‌ చేరి రజతం దక్కించుకున్న సేన్‌ ర్యాంకింగ్‌లోనూ మెరుగుపడ్డాడు. అతను 74,786 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌లో కీన్‌ యీ (సింగపూర్‌)ని అతను వెనక్కినెట్టాడు. శ్రీకాంత్‌ 12వ స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 7వ ర్యాంకుని నిలబెట్టుకోగా సైనా 23వ ర్యాంకులో నిలిచింది. పుల్లెల గాయత్రి - త్రిసా జాలీ 12 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంకుకు చేరారు.

జాతీయ సెలక్షన్స్‌లో సత్తాచాటిన అథ్లెట్లు

తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి విద్యాసంస్థల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) అథ్లెట్లు మరోసారి సత్తాచాటారు. ప్రపంచ పాఠశాలల జిమ్నాసియాడ్‌ పోటీల కోసం నిర్వహించిన జాతీయ సెలక్షన్స్‌లో పతకాల పంట పండించారు. భారత పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఓపెన్‌ సెలక్షన్స్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 100 మీ. 200 మీ. పరుగులో మాయవతి పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. పారా అథ్లెట్‌ రవి కిరణ్‌ టీ-35 విభాగంలో 100 మీ. పరుగు, జావెలిన్‌ త్రో స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. ప్రణయ్‌ లాంగ్‌ జంప్‌లో కాంస్యం, ట్రిపుల్‌ జంప్‌లో రజతం సాధించాడు. 100మీ. పరుగులో వెండి పతకం గెలిచిన గణేష్‌.. 200 మీ. పరుగులో కంచు పతకాన్ని గెలిచాడు. 3000 మీ. పరుగులో మల్లిక కాంస్యం నెగ్గింది. ఈ ఏడాది మే 14న ఫ్రాన్స్‌లో ఈ ప్రపంచ పాఠశాలల జిమ్నాసియాడ్‌ ఆరంభం కానుంది.

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ విజేత అక్సెల్సెన్‌

భారత యువ ఆటగాడు లక్ష్య సేన్‌ ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రన్నర్‌గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అతడు 10-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్, ఒలింపిక్‌ ఛాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. టోర్నీ ఆసాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అక్సెల్సెన్‌ ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. అక్సెల్సెన్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలవడం ఇది రెండోసారి. ‣ జపాన్‌కు చెందిన అకానె యమగూచి మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 21-15, 21-15తో ఆన్‌ సియంగ్‌ (దక్షిణ కొరియా)ను ఓడించింది. మరోవైపు సంచలన ప్రదర్శనతో మహిళల డబుల్స్‌లో సెమీస్‌ చేరిన గాయత్రి గోపీచంద్‌ పుల్లెల - ట్రీసా జాలీ జోడీ ఫైనల్‌ చేరలేకపోయింది. సెమీస్‌లో ఈ జోడీ 17-21, 16-21తో జాంగ్‌ షియాన్‌-జాంగ్‌ యు (చైనా)ల చేతుల్లో ఓడింది.

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ హైదరాబాద్‌ సొంతం

హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఈసారి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో టైటిల్‌ గెలుపొందింది. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరి తుది పోరులో విజేతగా నిలిచింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌-8లో హోరాహోరీగా సాగిన ఆఖరి పోరులో హైదరాబాద్‌ పెనాల్టీ షూటౌట్లో 3-1తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. గత రెండు సీజన్లలో 10, 5 స్థానాల్లో నిలిచిన హైదరాబాద్‌కు ఈసారి కప్‌ గెలవడం పెద్ద ఘనతే.

ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌ పంకజ్‌ సొంతం

భారత క్యూ స్టార్‌ పంకజ్‌ అడ్వాణీ ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. సింగిల్స్‌ ఫైనల్లో పంకజ్‌ 6-2తో మరో భారత ఆటగాడు ధ్రువ్‌ సిత్‌వాలాపై గెలిచాడు. తుది సమరంలో తొలి మూడు ఫ్రేమ్‌లు గెలిచిన అడ్వాణీకి ఆ తర్వాత నాలుగో ఫ్రేమ్‌లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. నాలుగు, ఏడో ఫ్రేమ్‌లను ధ్రువ్‌ గెలిచాడు. అయితే ఎనిమిదో ఫ్రేమ్‌లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని పంకజ్‌.. ఫ్రేమ్‌తో పాటు టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. కెరీర్‌లో అడ్వాణీకి ఇది ఎనిమిదో ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌. మొత్తం మీద అతడికి ఇది 40వ అంతర్జాతీయ టైటిల్‌.

ఆల్‌ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో లక్ష్యసేన్‌

ఆల్‌ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో లక్ష్యసేన్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్య 21-13, 12-21, 21-19తో ఆరో సీడ్, మలేసియా స్టార్‌ లీ జి జియాపై విజయం సాధించాడు. ఆల్‌ఇంగ్లండ్‌ పురుషుల సింగిల్స్‌లో ఇప్పటిదాకా ముగ్గురు భారత షట్లర్లే ఫైనల్‌ చేరారు. 1980లో ప్రకాశ్‌ పదుకొనే, 2001లో పుల్లెల గోపీచంద్‌ టైటిళ్లు సాధించగా.. 1947లో ప్రకాశ్‌ నాథ్‌ రన్నరప్‌గా నిలిచాడు. మహిళల్లో సైనా మాత్రమే ఆల్‌ఇంగ్లండ్‌ ఫైనల్‌ ఆడింది. 2015లో ఆమె తుది పోరులో ఓటమి పాలెంౖది. టాప్‌ సీడ్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌), నాలుగో సీడ్‌ టియాన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) మధ్య రెండో సెమీస్‌ విజేతతో లక్ష్య మార్చి 20న ఫైనల్‌ ఆడతాడు.

ఆసియా ఆర్చరీ కప్‌: ధీరజ్‌ బృందానికి స్వర్ణం

ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ ఖాతాలో ఆసియా కప్‌ ఆర్చరీ స్వర్ణం చేరింది. వ్యక్తిగత విభాగంలో విఫలమైన ఈ కుర్రాడు జట్టు విభాగంలో మరో ఇద్దరితో కలిసి పసిడి గెలిచాడు. రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో ధీరజ్, పార్థ్‌ సాలుంకే, రాహుల్‌తో కూడిన భారత బృందం 6-2తో కజకిస్థాన్‌ను ఓడించి పసిడి గెలుచుకుంది. ఇద్దరూ భారత ఆర్చర్లే తలపడిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఆఖరి సమరంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఈ పోరులో సాక్షి-పర్ణీత్‌ కౌర్‌ చెరో 140 పాయింట్లు సాధించడంతో షూటాఫ్‌ నిర్వహించారు. అందులోనూ ఇద్దరూ 10 పాయింట్లు సాధించినా.. మధ్య స్థానానికి చేరువగా బాణాన్ని సంధించిన సాక్షి పసిడి కైవసం చేసుకుంది.

షాట్‌గన్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు తొమ్మిదో స్థానం

షాట్‌గన్‌ ప్రపంచకప్‌ను భారత్‌ తొమ్మిదో స్థానంతో ముగించింది. ఈ కప్‌లో భారత్‌ ఒక్క రజతం మాత్రమే సాధించగలిగింది. సైప్రస్‌లోని నికోసియాలో జరిగిన ఈ కప్‌లో పురుషుల టీమ్‌ ట్రాప్‌ ఫైనల్లో పృథ్వీరాజ్‌, జొరావర్‌ సింగ్‌, వివాన్‌ కపూర్‌లతో కూడిన బృందం 2-6తో కువైట్‌ చేతిలో ఓడింది. క్వాలిఫికేషన్‌లో 225 పాయింట్లకు 214 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు.. ఫైనల్లో స్వర్ణం గెలవలేకపోయింది. వ్యక్తిగత విభాగంలో మైరాజ్‌ (119) సెమీఫైనల్‌ చేరడంలో విఫలమయ్యాడు.

శ్రీలంకలో ఆసియాకప్‌

ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఆగస్ట్‌ 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. తన వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఈ విషయం తెలిపింది. ఉపఖండంలో ఉన్న అయిదు టెస్టు దేశాలు భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆసియాకప్‌లో పోటీపడతాయి. యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్‌ల మధ్య క్వాలిఫయింగ్‌ టోర్నీ నుంచి మరో జట్టును ఎంపిక చేస్తారు. క్వాలిఫయర్స్‌ ఆగస్టు 20 నుంచి జరుగుతాయని ఏసీసీ చెప్పింది.

బంగ్లాదేశ్‌ తొలిసారి

బంగ్లాదేశ్‌ జట్టు తొలిసారి దక్షిణాఫ్రికాలో ఓ వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదటి వన్డేలో 38 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. షకిబ్‌ (77), యాసిర్‌ అలీ (50), లిటన్‌ దాస్‌ (50) చెలరేగడంతో మొదట బంగ్లాదేశ్‌ 7 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. మెహదీ (4/61), తస్కిన్‌ అహ్మద్‌ (3/36) ధాటికి 48.5 ఓవర్లలో 276 పరుగులకే ఆలౌటైంది.

ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో గాయత్రి జోడీ

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ డబుల్స్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ సంచలనం సృష్టించింది. ప్రపంచ రెండో ర్యాంకు జోడీని ఓడించి టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గాయత్రి- ట్రీసా జోడీ 14-21, 22-20, 21-15తో రెండో సీడ్‌ లీ సోహీ- షిన్‌ సూంగ్‌చాన్‌ (కొరియా) జంటపై విజయం సాధించింది. సెమీస్‌లో జాంగ్‌ షియాన్‌- జాంగ్‌ యు (చైనా) జోడీతో 46వ ర్యాంకు జంట గాయత్రి- ట్రీసా తలపడనుంది. ‣ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ఫైనల్‌ ప్రత్యర్థి లు గువాంగ్‌ జు (చైనా) వాకోవర్‌ ఇవ్వడంతో లక్ష్యసేన్‌ సెమీస్‌ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టిల పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 22-24, 17-21తో ప్రపంచ నంబర్‌వన్‌ మార్కస్‌ గిడియాన్‌- కెవిన్‌ సుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది.

ప్రణీత్‌కు ఐఎం హోదా

చదరంగంలో 15 ఏళ్ల తెలంగాణ కుర్రాడు ప్రణీత్‌ ఉప్పల ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) హోదా సొంతం చేసుకోగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల సాహితి వర్షిణి మహిళల ఐఎంను ఖాతాలో వేసుకుంది. తాజాగా బుడాపెస్ట్‌ టోర్నీ చివరి రౌండ్లో రత్నవేల్‌తో గేమ్‌ను డ్రాగా ముగించిన ప్రణీత్‌ మూడో ఐఎం నార్మ్‌ సాధించాడు. ఈ టోర్నీలో ఆరు విజయాలు, రెండు డ్రాలు, ఒక ఓటమి నమోదు చేసిన ఈ నల్గొండ ఆటగాడు మొత్తం తొమ్మిది రౌండ్ల నుంచి 7 పాయింట్లు గెలుచుకున్నాడు. ప్రస్తుతం 2409 ఎలో రేటింగ్‌ పాయింట్లతో కొనసాగుతున్నాడు. దీంతో పాటు అతడు తొలి జీఎం నార్మ్‌ కూడా సొంతం చేసుకున్నాడు. మరో రెండు జీఎం నార్మ్‌లతో పాటు 2500కు పైగా ఎలో రేటింగ్‌ సాధిస్తే అతడు గ్రాండ్‌మాస్టర్‌గా నిలుస్తాడు. తొలి ఐఎం నార్మ్‌ను 2018లోనే సాధించిన ప్రణీత్‌ రెండో ఐఎం నార్మ్‌ను ఈ ఏడాది జనవరిలో గెలిచాడు. ‣ లాక్‌డౌన్‌ తర్వాత జోరు ప్రదర్శిస్తున్న సాహితి వర్షిణి మహిళల ఐఎం హోదా దక్కించుకుంది. తాజాగా బుడాపెస్ట్‌లో జరిగిన టోర్నీలో 9 రౌండ్ల నుంచి 4.5 పాయింట్లు సాధించిన ఆమె మూడో ఐఎం నార్మ్‌ ఖాతాలో వేసుకుంది. గతేడాది నవంబర్‌లో తొలి ఐఎం నార్మ్‌ సాధించిన తను.. ఫిబ్రవరిలో రెండో నార్మ్‌ అందుకుంది. తండ్రి లోకేశ్వర రావు శిక్షణలో సాగుతున్న సాహితి ఫిబ్రవరిలో అండర్‌-15 బాలికల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అయిదో ర్యాంకులో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 2218 ఎలో రేటింగ్‌ పాయింట్లున్నాయి. గతంలో ఆమె రెండు సార్లు ఆసియా చెస్‌ (అండర్‌ - 10, 12) ఛాంపియన్‌గా నిలిచింది. అండర్‌-10 విభాగంలో కామన్వెల్త్‌ పసిడి కూడా సొంతం చేసుకుంది.

ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో బుమ్రా

సొంతగడ్డపై శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో సత్తాచాటిన టీమ్‌ ఇండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లోకి దూసుకొచ్చాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా 6 స్థానాలు మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంకు సాధించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కమిన్స్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరింత కిందికి వెళ్లాడు. 4 ర్యాంకులు కోల్పోయి 9వ స్థానంలో నిలిచాడు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ 6, రిషబ్‌ పంత్‌ 10 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. లబుషేన్‌ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ద్వితీయ, ఆర్‌.అశ్విన్‌ తృతీయ స్థానాల్లో ఉన్నారు.

రష్యాపై ఫిడే నిషేధం

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) రష్యాను సస్పెండ్‌ చేసింది. ఇక ఫిడే నిర్వహించే ఏ టోర్నీలోనూ రష్యా ఆటగాళ్లు పాల్గొనలేరు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాకు సహకరిస్తున్న బెలారస్‌పై కూడా నిషేధం పడింది. అయితే ఆ రెండు దేశాల క్రీడాకారులు ఫిడే పతాకం కింద టోర్నీల్లో పోటీ పడొచ్చు. ఐఓసీ సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఫిడే.. రష్యా, బెలారస్‌ జాతీయ జట్లను తాము నిర్వహించే అన్ని టోర్నమెంట్ల నుంచి నిషేధించింది. ఐఓసీ సూచన మేరకు ఇప్పటికే అనేక క్రీడా సంఘాలు రష్యాపై నిషేధం విధించాయి.

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌

అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న భారత వర్ధమాన బ్యాడ్మింటన్‌ ఆటగాడు లక్ష్యసేన్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు. బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్‌ 11వ స్థానంలో నిలిచాడు. కిదాంబి శ్రీకాంత్‌ 12, సాయి ప్రణీత్‌ 19వ ర్యాంకులు సాధించారు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 7వ, సైనా నెహ్వాల్‌ 25వ ర్యాంకులతో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు - చిరాగ్‌ శెట్టి జోడీ 8వ స్థానంలో కొనసాగుతుంది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి - అశ్విని పొన్నప్ప జంట 19వ ర్యాంకుతో ఉంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి మిథాలీ

భారత మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు కోల్పోయి ఏడో ర్యాంకులో నిలిచింది. వెస్టిండీస్‌పై సెంచరీ కొట్టినప్పటికీ ఓపెన్‌ స్మృతి మంధాన టాప్‌-10లో చోటు కోల్పోయింది. ఆమె 10 నుంచి 11వ స్థానానికి చేరుకుంది. ఎలీస్‌ హీలీ (ఆస్ట్రేలియా) నంబర్‌వన్‌ బ్యాటర్‌. బౌలర్ల జాబితాలో వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి రెండు స్థానాలు నష్టపోయి ఆరో ర్యాంకులో నిలిచింది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇంగ్లండ్‌ ఒక్క మ్యాచ్‌ గెలవనప్పటికీ ఆ జట్టు బౌలర్‌ ఎకిల్‌స్టోన్‌ ర్యాంకింగ్స్‌లో ఎగబాకింది. ఆస్ట్రేలియా అమ్మాయి జొనాసెన్‌ను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఎలీస్‌ పెర్రీ (ఆస్ట్రేలియా) నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌.

ఆసియా జూనియర్, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 39 పతకాలు

ఆసియా జూనియర్, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. 15 స్వర్ణాలు సహా 39 పతకాలను కైవసం చేసుకున్నారు. యూత్‌ బాలుర 48 కేజీల విభాగం ఫైనల్లో విశ్వనాథ్‌ 5-0తో బెక్‌జాత్‌ (కిర్గిస్థాన్‌)ను చిత్తు చేయగా 63.5 కేజీల కేటగిరిలో వంశజ్‌ 4-1తో జావోఖీర్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించాడు. 92 కేజీల పైన విభాగం ఫైనల్లో అమన్‌ సింగ్‌ 1-4తో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. రమణ్‌ (51 కేజీలు), ఆనంద్‌ యాదవ్‌ (54 కేజీలు), దీపక్‌ (75 కేజీలు), కాంస్య పతకాలు సాధించారు. మహిళల యూత్‌ విభాగంలో నివేదిత (48 కేజీలు), తమన్నా (50 కేజీలు), షహీన్‌ గిల్‌ (60 కేజీలు), రవీనా (63 కేజీలు), ముస్కాన్‌ (75 కేజీలు) స్వర్ణాలు నెగ్గగా ప్రియాంక (66 కేజీలు), కృతి (81 కేజీల పైన) రజతాలు సాధించారు. రేణు (52 కేజీలు), తనీషా (54 కేజీలు), ప్రాచి (57 కేజీలు), ప్రాంజల్‌ (70 కేజీలు), స్నేహ (81 కేజీలు) కంచు పతకాలు నెగ్గారు. జూనియర్‌ విభాగంలో విని (50 కేజీలు), యషిక (52 కేజీలు), నిఖిత (60 కేజీలు), విధి (57 కేజీలు), సృష్టి (63 కేజీలు), రుద్రిక (75 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకోగా మహి (46 కేజీలు), పాలక్‌ (48 కేజీలు), సుప్రియ (54 కేజీలు), ఖుషి (89 కేజీలు), నిర్హార (80 కేజీల పైన) రజతాలు సాధించారు. కృష్ణవర్మ (70 కేజీలు) కాంస్యం గెలుచుకుంది. జూనియర్‌ బాలురలో క్రిష్‌పాల్‌ (46 కేజీలు), యశ్‌ వర్దన్‌ (60 కేజీలు) స్వర్ణాలు గెలవగా.. రవి సైని (48 కేజీలు), రిషబ్‌ (80 కేజీలు) రజతాలు సాధించారు. జయంత్‌ (54 కేజీలు), చేతన్‌ (57 కేజీలు), జాక్సన్‌ (70 కేజీలు), దేవ్‌ ప్రతాప్‌ (75 కేజీలు), గౌరవ్‌ (80 కేజీల పైన) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

దిల్లీ సహాయ కోచ్‌గా వాట్సన్‌

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ దిల్లీ క్యాపిటల్స్‌ శిక్షణ బృందంలో చేరాడు. దిల్లీ సహాయక కోచ్‌గా వాట్సన్‌ నియమితుడయ్యాడు. ప్రస్తుతం రికీ పాంటింగ్‌ (చీఫ్‌ కోచ్‌), ప్రవీణ్‌ ఆమ్రె (సహాయక కోచ్‌), అజిత్‌ అగార్కర్‌ (సహాయక కోచ్‌), జేమ్స్‌ హోప్స్‌ (బౌలింగ్‌ కోచ్‌) శిక్షణ బృందంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆసియా హ్యాండ్‌బాల్‌లో భారత్‌కు పసిడి

ఆసియా మహిళల జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. కజకిస్థాన్‌లో జరిగిన ఈ టోర్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో తొలిసారి పసిడి పతకం కైవసం చేసుకుంది. తన చివరి రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో 41-18తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసిన భారత్‌ (3 విజయాలు, ఒక ఓటమి) అయిదు జట్లు పోటీపడిన ఈ టోర్నీలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. ‣ ఈ టోర్నీలో థాయ్‌లాండ్‌తో పాటు ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్‌పై గెలిచిన భారత్‌.. ఇరాన్‌ చేతిలో ఓడింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలవడమే కాక స్లొవేనియాలో జూన్‌ 22న ఆరంభమయ్యే ప్రపంచ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీకి కూడా భారత్‌ అర్హత సాధించింది. ప్రపంచ టోర్నీ బెర్తు దక్కించుకోవడం కూడా మన జట్టుకు ఇదే మొదటి సారి.

అయిదుగురు బాక్సర్లకు స్వర్ణాలు

ఆసియా యూత్, జూనియర్‌ బాక్సింగ్‌లో అయిదుగురు భారత మహిళా బాక్సర్లు యూత్‌ విభాగంలో స్వర్ణాలు గెలుచుకున్నారు. తమన్నా (50కేజీ), నివేదిత కర్కి (48కేజీ), షహీన్‌ (60కేజీ), రవీనా (63కేజీ), ముస్కాన్‌ (75) ఫైనల్స్‌లో గెలిచి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ‣ ప్రియాంక (66కేజీ), కీర్తి (+81కేజీ) ఫైనల్స్‌ ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. రేణు (52కేజీ), తనీషా లాంబా (54కేజీ), ప్రాచి (57కేజీ), ప్రాంజల్‌ యాదవ్‌ (70కేజీ), స్నేహా (81కేజీ) కాంస్య పతకాలు సాధించారు.

శ్రేయస్‌కు ఐసీసీ అవార్డు

సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. వెస్టిండీస్, శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ల్లో శ్రేయస్‌ విశేషంగా రాణించాడు. మహిళల విభాగంలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికైంది.

ఎనిమిదో స్థానానికి పడిన విండీస్‌

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెస్టిండీస్‌ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టును డ్రా చేసుకున్నా స్లో ఓవర్‌ రేటు కారణంగా రెండు పాయింట్లు పెనాల్టీ పడడంతో పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్‌ (7వ స్థానం) కన్నా దిగువకు పడిపోయింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా విండీస్‌ మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత కూడా పడింది. ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా పెనాల్టీ పడడం విండీస్‌కు ఇదే తొలిసారి. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువ వేస్తే అన్ని ఓవర్లకు పెనాల్టీ పాయింట్లు పడతాయి. అంతేకాక ప్రతి పాయింట్‌కు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో..పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, భారత్‌ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌ ఖాతాలో 21 పతకాలు

స్పానిష్‌ పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత్‌ ఆరు స్వర్ణాలతో సహా 21 పతకాలు సాధించింది. సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ మాన్సి జోషి, నిత్య శ్రీ పసిడి పతకాలు నెగ్గగా.. రాజా-కృష్ణ (డబుల్స్‌ ఎస్‌హెచ్‌ 6), రాజ్‌-పారుల్‌ (మిక్స్‌డ్‌ డబుల్స్, ఎస్‌ఎల్‌-3), చిరాగ్‌-రాజ్‌ (డబుల్స్‌ ఎస్‌హెచ్‌ 5), నితీష్‌-తరుణ్‌ (ఎస్‌ఎల్‌-3) కూడా స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు.

పంత్‌ ధాటికి 40 ఏళ్ల రికార్డు బద్దలు

దొరికిన బంతిని దొరికినట్లు బాది.. టెస్టుల్లో టీ20 ఆట చూపించిన పంత్‌ దెబ్బకు 40 ఏళ్ల రికార్డు బద్దలైంది. టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధశతకం అందుకున్న భారత ఆటగాడిగా పంత్‌ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో డేనైట్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లోనే 50 పరుగులు చేసిన అతను, దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ (1982లో పాకిస్థాన్‌పై 30 బంతుల్లో అర్ధశతకం) రికార్డును తిరగరాశాడు. అంతే కాకుండా టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా పంత్‌ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. గత రికార్డు మాజీ కెప్టెన్‌ ధోని, ఇయాన్‌ స్మిత్‌ (చెరో 34 బంతుల్లో) పేర్ల మీద ఉమ్మడిగా ఉంది.

ఆసియా యూత్, జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

ఆసియా యూత్, జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు బంగారు పతకాలు నెగ్గారు. జోర్డాన్‌లో జరుగుతున్న పోటీల్లో ఒకే రోజు ఏకంగా ఆరు స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నారు. జూనియర్‌ బాక్సర్లు విని (50 కేజీలు), యక్షిక (52), విధి (57), నిఖిత (60), శ్రుష్టి (63), రుద్రిక (75) ఛాంపియన్లుగా నిలిచారు. ‣ ఫైనల్లో విని 5-0 తేడాతో కరీనా (కజకిస్థాన్‌)ను ఓడించింది. ‣ యక్షిక 4-1తో రఖీమా (ఉజ్బెకిస్థాన్‌)పై గెలిచింది. ‣ విధి 5-0తో సువిందె (జోర్డాన్‌)పై ఘన విజయం సాధించింది. ‣ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నిఖిత ఉల్దానా (కజికిస్థాన్‌)పై పంచ్‌లతో విరుచుకుపడింది. దీంతో మూడో రౌండ్‌ మధ్యలోనే పోరును ఆపిన రిఫరీ నిఖితను విజేతగా ప్రకటించాడు. ‣ సృష్టి ధాటికి నుర్సులు (కజకిస్థాన్‌) రెండో రౌండ్లోనే కుప్పకూలింది. ‣ రుద్రిక 5-0తో నలిబే (కజకిస్థాన్‌)పై నెగ్గింది. 81 కేజీల తుది పోరులో ఖుషి 1-4తో కురాలే (కజకిస్థాన్‌) చేతిలో పరాజయం పాలైంది.

జాతీయ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా ప్రియాంక

తెలుగు తేజం నూతక్కి ప్రియాంక జాతీయ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌ అయింది. దిల్లీలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రియాంక అండర్‌-20 బాలికల విభాగంలో విజేతగా నిలిచింది. 9 రౌండ్లలో ఆమె 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రియాంక ఇటీవలే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ హోదాను సాధించింది.

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి-1 సీనియర్‌ అథ్లెటిక్స్‌లో శ్రీనివాస్‌కు రజతం, జ్యోతికకు కాంస్యం

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి-1 సీనియర్‌ అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు షణ్ముగ శ్రీనివాస్, దండి జ్యోతికశ్రీ (సాయ్‌ - గోపీచంద్‌ - మైత్రా) సత్తాచాటారు. పురుషుల 200 మీటర్ల పరుగులో షణ్ముగ శ్రీనివాస్‌ రజత పతకం సాధించాడు. ఈ రేసును షణ్ముగ శ్రీనివాస్‌ 21.31 సెకన్లలో పూర్తిచేసి ద్వితీయ స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతికశ్రీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. 54.55 సెకన్లలో పరుగును ముగించి మూడో స్థానంలో నిలిచింది.

సుహాన జోడీకి స్వర్ణం

డబ్ల్యూటీటీ యూత్‌ స్టార్‌ కంటెండర్‌ టోర్నమెంట్లో భారత జంట సుహాన సైని-యశస్విని గోర్పాడే స్వర్ణం గెలిచింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో సుహాన-యశస్విని 11-9, 11-7, 11-6తో ఎలీనా జహారియా-లూసియానా మిత్రోఫాన్‌ (రొమేనియా)ను ఓడించారు. సెమీస్‌లో సుహాన జంట 11-9, 11-6, 6-11, 11-5తో సోఫహ-నికోలె (ఇటలీ)పై విజయం సాధించింది.

మహిళల ప్రొ లీగ్‌ హాకీ: షూటౌట్‌లో భారత్‌ ఓటమి

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌ హాకీ టోర్నమెంట్లో జర్మనీతో పోరులో భారత్‌కు ఓటమి ఎదురైంది. రెండు మ్యాచ్‌ల సమరంలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సవిత బృందం 1-2తో షూటౌట్‌లో జర్మనీ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి రెండు జట్లు చెరో గోల్‌ చేశాయి. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (4వ నిమిషం), జర్మనీ జట్టులో కార్లోటా (5వ ని) స్కోరు చేశారు. దీంతో మ్యాచ్‌ షూటౌట్‌కు మళ్లింది. షూటౌట్‌లో నవ్‌నీత్‌ మాత్రమే గోల్‌ కొట్టగా.. షర్మిల, నేహా, లాల్‌రెమ్‌సియామి, మోనిక గురి తప్పారు. జర్మనీ జట్టులో పౌలిన్, సారా గోల్స్‌ సాధించి జట్టును గెలిపించారు. మార్చి 13న జర్మనీతో భారత్‌ రెండో మ్యాచ్‌ ఆడనుంది.

సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌: ఫైనల్లో లక్ష్యసేన్‌

భారత యువ ఆటగాడు లక్ష్యసేన్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సెన్‌ను ఓడించి జర్మనీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో లక్ష్యసేన్‌ 21-13, 12-21, 22-20తో ఒలింపిక్‌ ఛాంపియన్, టాప్‌సీడ్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు.

బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్‌

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. చెన్నై తరఫున సుదీర్ఘకాలం నిలకడగా రాణించిన డుప్లెసిస్‌ను ఇటీవల వేలంలో బెంగళూరు రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. కోహ్లి రాజీనామాతో ఆ జట్టుకు కొత్త సారథి అవసరం ఏర్పడింది.

రాజస్థాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా మలింగ

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున సత్తా చాటిన శ్రీలంక మాజీ స్టార్‌ పేసర్‌ లసిత్‌ మలింగ లీగ్‌లో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. మార్చి 26న ఆరంభం కాబోతున్న ఈసారి సీజన్లో అతడు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా సేవలందించనున్నాడు. మలింగ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడని.. ప్యాడీ ఆప్టన్‌ను టీమ్‌ క్యాటలిస్ట్‌గా నియమించామని రాజస్థాన్‌ రాయల్స్‌ తెలిపింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్యాడీ ఆప్టన్‌ 2013 - 15 సీజన్లలో రాజస్థాన్‌కు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. అతడు కోచ్‌గా ఉన్న సమయంలో రాజస్థాన్, 2013, 15 సీజన్లలో టాప్‌-4లో నిలిచింది. 2013లో ఛాంపియన్స్‌ లీగ్‌కు కూడా అర్హత సాధించింది. గత సీజన్‌లో మాదిరే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రాజస్థాన్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఐసీసీ ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌

శ్రీలంకతో మొదటి టెస్టులో బ్యాటుతో, బంతితో అదిరే ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా ప్రపంచ నంబర్‌వన్‌గా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఐసీసీ ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. ‘‘శ్రీలంకతో తొలి టెస్టులో రవీంద్ర జడేజా ప్రదర్శన ఐసీసీ పురుషుల టెస్టు ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో అతడిని నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్లింది’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. లంకపై తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 175 పరుగులు చేసిన జడేజా, బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో 17 స్థానాలు ఎగబాకాడు. 54 నుంచి 37వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టడంతో బౌలర్ల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకాడు. ఈ ఆల్‌రౌండ్‌ జోరుతో జడేజా.. నిరుడు ఫిబ్రవరి నుంచి అగ్రస్థానంలో ఉంటున్న జేసన్‌ హోల్డర్‌ను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. అతడు గతంలో ఒకసారి 2017 ఆగస్టులో వారం రోజుల పాటు ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంకపై తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో నెగ్గగా జడేజా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే మరో భారత ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం నష్టపోయి మూడో ర్యాంకులో నిలిచాడు. అక్షర్‌ పటేల్‌ 14వ స్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా మొహాలి టెస్టులో ఆడని అతడు రెండు స్థానాలు కోల్పోయాడు. ఇక బాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండు స్థానాలు ఎగబాకి అయిదో స్థానంలో నిలిచాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు. మొహాలి టెస్టులో ధాటిగా 96 పరుగులు చేసిన వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ టాప్‌-10లో అడుగుపెట్టాడు. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని పదో స్థానంలో నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 38వ స్థానంలో ఉన్నాడు. మార్నస్‌ లబుషేన్‌ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. రూట్‌ రెండో స్థానంలో, స్మిత్‌ మూడో స్థానంలో ఉన్నాడు. విలియమ్సన్‌ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా ర్యాంకు (10వ)లో కూడా మార్పు లేదు. ప్యాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబాడ మూడో స్థానంలో ఉన్నాడు.

టీమ్‌ ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌ క్రికెట్‌కు వీడ్కోలు

టీమ్‌ ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల దేశవాళీ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. శ్రీశాంత్‌ భారత్‌ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణానికి సంబంధించి 2020లో నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్‌ ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. అతడు చివరిసారి గత నెలలో కేరళ, మేఘాలయ మధ్య రంజీ మ్యాచ్‌లో ఆడాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల శ్రీశాంత్‌ తన రిటైర్మెంట్‌ను ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. 2006లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో శ్రీశాంత్‌ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. 2011లో మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోనూ శ్రీశాంత్‌ ఉన్నాడు.

బీడబ్ల్యూఎఫ్‌ పారా బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌

ఏస్‌ షట్లర్, 2019 ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ మాన్సి జోషి మరో ఘనతను సొంతం చేసుకుంది. నంబర్‌వన్‌ పారా షట్లర్‌గా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్‌ తాజా పారా బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా మారిన మాన్సి పేరున్న పారా అథ్లెట్‌. ఇటీవల స్పానిష్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 3 విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజత పతకాలు సాధించింది. భారత్‌కే చెందిన పారా షట్లర్‌ పారుల్‌ పర్మార్‌ ఎస్‌ఎల్‌3 మహిళల సింగిల్స్‌లో రెండో ర్యాంకులో ఉంది.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో రిథమ్‌ సంగ్వాన్, అనీష్‌ భన్వాల్‌ జంట స్వర్ణ పతకం గెలుచుకుంది. పసిడి పోరులో భారత జోడీ 17-7తో థాయ్‌లాండ్‌ జోడీపై గెలిచింది. రెండో రౌండ్‌ క్వాలిఫికేషన్‌లో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన రిథమ్, అనీష్‌ ద్వయం టైటిల్‌ పోరులో పదుక చివిసా, రామ్‌ ఖాంహేంగ్‌లపై పైచేయి సాధించింది. ‣ ఇషా సింగ్, భవేశ్‌ షెకావత్‌ జంటకు అయిదో స్థానం దక్కింది. నంబర్‌వన్‌ జట్టుగా భారత్‌ ప్రపంచకప్‌ను ముగించింది. మొత్తం నాలుగు పసిడి పతకాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ‣ పోటీల చివరి రోజు భారత్‌కు మరో రజతం కూడా దక్కింది. పురుషుల 25మీ ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్లో గుర్‌ప్రీత్‌ సింగ్, అనీష్‌ భన్వాలా, భవేశ్‌ షెకావత్‌ త్రయం 7-17తో జర్మనీ జట్టుతో చేతిలో ఓడిపోయింది. ‣ నార్వే మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో భారత్‌ తర్వాత రెండో స్థానంతో టోర్నీని ముగించింది. మొత్తంగా 60 దేశాల నుంచి 500 మందికి పైగా షూటర్లు ప్రపంచకప్‌లో పోటీపడ్డారు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్లో రాహీ సర్నోబత్, ఇషా సింగ్, రిథమ్‌ సంగ్వాన్‌ త్రయం పసిడి పతకం గెలుచుకుంది. టైటిల్‌ పోరులో భారత జట్టు 17-13తో సింగపూర్‌ జట్టుపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇషాకు ఇది రెండో స్వర్ణం, మూడో పతకం. ఇంతకుముందు ఆమె మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్లో విజేతగా నిలిచింది. ఇషా మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్లో రజతం సాధించింది. మరోవైపు 50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో భారత షూటర్లు శ్రియాంక, అఖిల్‌ల జోడీ కాంస్యం గెలుచుకుంది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో ఈ జంట ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా కొయెక్, గెర్నోట్‌ రంప్లర్‌లపై విజయం సాధించింది. మూడు స్వర్ణాలు సహా ఇప్పటివరకు అయిదు పతకాలు గెలుచుకున్న భారత్‌ ఈ టోర్నమెంట్‌ పతకాల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

ఐపీఎల్‌ షెడ్యూల్‌ 2022

ఐపీఎల్‌ 2022 పూర్తి షెడ్యూలును బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో 10 జట్ల టోర్నీ మొదలవుతుంది. మే 29న ఫైనల్‌. ఐపీఎల్‌లో కొత్త రెండు జట్లు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్, గుజరాత్‌ టైటాన్స్‌ చేరిన సంగతి తెలిసిందే. ముంబయిలో మూడు వేదికల్లో, పుణెలో ఒక వేదికలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. లీగ్‌ దశలో: ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 74 మ్యాచ్‌లుంటాయి. లీగ్‌ దశలో 10 జట్లు మొత్తం 70 మ్యాచ్‌లు ఆడతాయి. ఫైనల్‌ సహా నాలుగు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఉంటాయి. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్‌ స్టేడియాలు 55 లీగ్‌ మ్యాచ్‌లకు, పుణె శివార్లలోని ఎంసీఏ స్టేడియం 15 లీగ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ (సన్‌రైజర్స్‌ × పంజాబ్‌ కింగ్స్‌) మే 22న వాంఖడేలో జరుగుతుంది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల షెడ్యూలును తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది. 12 డబుల్‌ హెడర్‌లు: ఈ సీజన్‌లో మొత్తం 12 డబుల్‌ హెడర్‌లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉన్నాయి. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30కు మొదలువుతుంది. రాత్రి మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30కు ఆరంభమవుతాయి. మొదటి డబుల్‌ హెడర్‌ ఈ నెల 27న ఉంది. పగలు జరిగే మ్యాచ్‌లో దిల్లీతో ముంబయి తలపడుతుంది. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్‌ను బెంగళూరు ఢీకొంటుంది. ఇదీ ఫార్మాట్‌: ఈసారి భిన్న ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. గతంలో మాదిరి ప్రతి జట్టూ అన్ని జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడవు. గెలిచిన టైటిళ్లు, ఆడిన ఫైనల్స్‌ ఆధారంగా జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ముంబయి, కోల్‌కతా, రాజస్థాన్, దిల్లీ, లఖ్‌నవూ గ్రూప్‌-ఏలో.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూపులోని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అంటే ప్రతి జట్టూ ఎప్పటిలాగే 14 మ్యాచ్‌లే ఆడుతుందన్నమాట. 2011లో 10 జట్లతో జరిగిన ఐపీఎల్‌లో కూడా దాదాపుగా ఇదే ఫార్మాట్‌.

డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌ వన్‌ విజేత భారత్‌

డేవిస్‌కప్‌ ప్రపంచ గ్రూప్‌-1లో భారత జట్టు తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్లేఆఫ్‌ పోరులో 4-0తో డెన్మార్క్‌ను ఓడించింది. తొలి రోజు సింగిల్స్‌లో యుకి బాంబ్రి, రామ్‌కుమార్‌ల గెలుపుతో భారత్‌కు 2-0 ఆధిక్యం లభించగా.. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడీ నెగ్గడంతో పోరులో జట్టు విజయం ఖాయమైంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత ద్వయం 6-7 (4-7), 6-4, 7-6 (7-4)తో డెన్మార్క్‌ జోడీ ఫ్రెడరిక్‌ నీల్సన్, మికైల్‌ తొర్పెగార్డ్‌లను ఓడించింది. ‣ 2019 నవంబరులో 4-0తో పాకిస్థాన్‌ను ఓడించాక.. డేవిస్‌కప్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం.ఆ తర్వాత భారత జట్టు ఫిన్లాండ్‌ (1-3), క్రొయేషియా (1-3) చేతిలో ఓడింది.

డబ్ల్యూటీటీ కంటెండర్‌ టోర్నమెంట్లో భారత్‌కు రజతాలు

డబ్ల్యూటీటీ కంటెండర్‌ టోర్నమెంట్లో మానవ్‌ ఠక్కర్, అర్చన కామత్‌ జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ రజతం గెలుచుకుంది. ఫైనల్లో భారత జంట 3-11, 3-11, 6-11తో వాంగ్‌ చుకిన్, చెన్‌ జింటాంగ్‌ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో సుతీర్థ, ఐహిక జోడీ కూడా రజతం సాధించింది. ఫైనల్లో ఈ జంట 6-11, 11-8, 10-12, 7-11తో జాంగ్‌ రుయ్‌- కుయ్‌ మాన్‌ (చైనా) జోడీ చేతిలో పరాజయం పొందింది.

రంజీ ట్రోఫీ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం

రంజీ ట్రోఫీలో తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌- బి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 43 పరుగుల తేడాతో బరోడాను ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 169/6తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 201 పరుగులకు ఆలౌటైంది. రవితేజ (56; 123 బంతుల్లో 8్ఠ4) అర్ధశతకం అందుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో బాబాషఫి (4/35) రాణించాడు. అనంతరం 236 పరుగుల లక్ష్య ఛేదనలో బరోడా 53.4 ఓవర్లలో 192 పరుగులకే కుప్పకూలింది. రవితేజ (4/70) బంతితోనూ విజృంభించాడు. తనయ్‌ త్యాగరాజన్‌ (3/37), పున్నయ్య (2/41) కూడా ఆకట్టుకున్నారు. గ్రూప్‌లో మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ ఓటమితో 12 పాయింట్లు సాధించి హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. బెంగాల్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తాజాగా చండీగఢ్‌తో మ్యాచ్‌లో బెంగాల్‌ గెలిచేలా కనిపిస్తోంది. ప్రతి గ్రూప్‌ నుంచి ఒక జట్టే నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.

వంద టెస్టులు ఆడిన 12వ భారత ఆటగాడిగా కోహ్లి

తీరిక లేని అంతర్జాతీయ క్రికెట్, ఓ వైపు ఐపీఎల్, మూడు ఫార్మాట్లోనూ ఆడడం అయినప్పటికీ వందో టెస్టు మైలురాయి చేరుకున్న తన ప్రయాణం నుంచి భవిష్యత్‌ తరం ఆటగాళ్లు స్ఫూర్తి పొందాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆకాంక్షించాడు. అన్ని ఫార్మాట్లలో ఆడుతూ టెస్టుల్లో ఈ ఘనత అందుకున్నాననే నిజం వాళ్లకు ప్రేరణగా నిలవాలని కోరుకున్నాడు. శ్రీలంకతో ఆరంభమైన తొలి మ్యాచ్‌తో వంద టెస్టులు ఆడిన 12వ భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోహ్లీకి ప్రత్యేకంగా రూపొందించిన వందో టెస్టు టోపీని, జ్ఞాపికను అందజేశాడు.

ప్రపంచ అథ్లెటిక్స్‌ రేస్‌ వాకింగ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌

భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో రేస్‌ వాకింగ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకం గెలిచారు. 20 కిలోమీటర్ల నడకలో భావనా, రవీనా, మునిత త్రయం మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. చైనా స్వర్ణం సాధించింది. గ్రీసు రజతం నెగ్గింది.

డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూపు-1 ప్లేఆఫ్‌

డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూపు-1 ప్లేఆఫ్‌ పోరులో డెన్మార్క్‌పై భారత్‌ పైచేయి సాధించింది. రెండు సింగిల్స్‌లోనూ భారత ఆటగాళ్లు రామ్‌కుమార్‌ రామనాథన్, యుకి బాంబ్రి సత్తాచాటి భారత్‌కు విజయాలు అందించారు. గ్రాస్‌కోర్టుపై డెన్మార్క్‌ ఆటగాళ్ల ఇబ్బందిని భారత్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-3, 6-2తో క్రిస్టియన్‌ సిగ్స్‌గార్డ్‌పై విజయం సాధించాడు. రెండో సింగిల్స్‌లో యుకి 6-4, 6-4తో మైకెల్‌ తోర్ప్‌గార్డ్‌పై గెలుపొందాడు. వరుసగా రెండు సింగిల్స్‌లో నెగ్గిన భారత్‌ 2-0తో డెన్మార్క్‌పై ఆధిక్యం సంపాదించింది.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో తెలంగాణ యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఖాతాలో మరో పతకం చేరింది. ఇప్పటికే మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గిన ఆమె తాజాగా టీమ్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శ్రీ నివేత, రుచితలతో కలిసి ఇషా పసిడి అందుకుంది. ఈ భారత త్రయం ఫైనల్లో 16 పాయింట్లతో సత్తాచాటింది. జర్మనీ (6 పాయింట్లు) రజతం సొంతం చేసుకుంది. రెండు అర్హత రౌండ్లలోనూ నివేత, రుచిత, ఇషా కలిసి అగ్రస్థానంలో నిలిచారు. మరోవైపు పురుషుల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో సౌరభ్, గౌరవ్, బాలకృష్ణతో కూడిన భారత జట్టు కాంస్య పతక పోరులో ఓడింది.

జాతీయ సీనియర్‌ చెస్‌ ఛాంప్‌గా అర్జున్‌

తెలంగాణ కుర్రాడు, గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 58వ జాతీయ సీనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. టైబ్రేకర్‌లో సహచర గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్‌ (తమిళనాడు), ఇనియన్‌ (తమిళనాడు)లను వెనక్కి నెడుతూ అతడు టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. 18 ఏళ్ల అర్జున్‌ టోర్నీలో అజేయంగా నిలిచాడు. మొత్తం 11 రౌండ్లలో ఒక్క పరాజయం కూడా చవిచూడని అతడు 8.5 పాయింట్లతో గుకేశ్, ఇనియన్‌తో సమంగా నిలిచాడు. చివరిదైన 11వ రౌండ్లో సేతురామన్‌తో గేమ్‌ను అర్జున్, ఆర్యన్‌ చోప్రాతో గేమ్‌ను గుకేశ్‌ డ్రాగా ముగించగా మిత్రభా గుహపై ఇనియన్‌ విజయం సాధించాడు. మెరుగైన టైబ్రేక్‌ స్కోర్‌ ఆధారంగా అర్జున్‌ విజేతగా నిలిచాడు. అతడికి రు.6 లక్షల నగదు బహుమతి దక్కింది.

జాతీయ మహిళా చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రియాంకకు కాంస్యం

తెలుగు తేజం నూతక్కి ప్రియాంక ‘డబ్ల్యూజీఎం’ (మహిళా గ్రాండ్‌మాస్టర్‌) టైటిల్‌ను కైవసం చేసుకుంది. భువనేశ్వర్‌లో ముగిసిన 47వ జాతీయ మహిళా చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన ప్రియాంక తొమ్మిది రౌండ్ల నుంచి ఏడు పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. డబ్ల్యూజీఎం మూడో నార్మ్‌నూ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు మహిళల గ్రాండ్‌మాస్టర్‌ హోదా ఖరారైంది. 2301 ఎలో రేటింగ్‌తో ఉన్న ప్రియాంక ఈ ఛాంపియన్‌షిప్‌ ద్వారా మరో 25 పాయింట్లు తన ఖాతాలో జమ చేసుకుంది.

షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఇషాకు రజతం

హైదరాబాద్‌ టీనేజ్‌ షూటర్‌ ఇషాసింగ్‌ కైరోలో జరుగుతున్న షూటింగ్‌ ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో రజతం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫయింగ్‌లో 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి సెమీస్‌ చేరిన ఇషా.. సెమీస్‌లో 41.5 పాయింట్లతో అగ్రస్థానం సాధించి ఫైనల్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌ అనా కొరాకాకి (గ్రీస్‌), టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత విటలీనా (రష్యా) లాంటి షూటర్ల కంటే ఇషా మెరుగైన ప్రదర్శన చేసింది. ‣ ఫైనల్లో సాండ్రా (జర్మనీ) ఎలిమినేట్‌ కాగా.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ కొసడినోవా (బల్గేరియా) కాంస్యంతో సరిపెట్టుకుంది. 35.5 పాయింట్లతో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించిన ఇషా.. పసిడి పోరులో ఆరంభంలో 4-6తో గట్టిపోటీనే ఇచ్చింది. కానీ అక్కడ నుంచి ఆమె తడబడగా స్థిరంగా రాణించిన కొరాకాకి 16-4తో స్వర్ణం సొంతం చేసుకుంది. ‣ పురుషుల విభాగంలో సౌరభ్‌ చౌదరి స్వర్ణం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం క్వాలిఫికేషన్‌లో 584 పాయింట్లతో మూడో స్థానంతో సెమీఫైనల్‌ చేరిన సౌరభ్‌.. సెమీస్‌లో 38 పాయింట్లతో అగ్రస్థానంతో పతక పోరుకు అర్హత సాధించాడు. సౌరభ్‌తో పాటు చెర్నోసోవ్‌ (రష్యా), స్వాల్డ్‌ (జర్మనీ), రుస్లాన్‌ లునెవ్‌ (అజర్‌బైజాన్‌) పోటీపడిన ఈ ఆఖరి సమరంలో లునెవ్‌ (21 పాయింట్లు) ఆరంభంలోనే ఎలిమినేట్‌ కాగా.. 40 పాయింట్లే సాధించిన చెర్న్‌సోవ్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. స్వాల్డ్‌తో స్వర్ణం పతకం కోసం పోటీపడిన సౌరభ్‌ వరుసగా 9.7, 9.9, 10.5, 10.8, 10, 10.6 స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. స్వాల్డ్‌ (9.3, 10.4, 9.7, 9.5, 10.6, 9.9) రజతంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో సౌరభ్‌కు ఇది మూడో వ్యక్తిగత పసిడి పతకం.

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ మిథాలీరాజ్‌ రెండో ర్యాంకులో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మిథాలీ 735 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంకుని నిలబెట్టుకుంది. ఈ జాబితాలో మరో భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన (666) ఎనిమిదో ర్యాంకులో ఉంది. కివీస్‌తో ఆఖరి వన్డేలో మిథాలీతో పాటు స్మృతి అర్ధసెంచరీ చేసింది. ‣ అలీసా హీలీ (ఆస్ట్రేలియా, 749) నంబర్‌వన్‌గా ఉంది. బౌలర్లలో దీప్తిశర్మ (580) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 12వ ర్యాంకులో నిలిచింది. కివీస్‌తో నాలుగో వన్డేలో ఒక వికెట్‌ తీసిన దీప్తి.. అయిదో వన్డేలో రెండు వికెట్లు పడగొట్టింది. వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి (695)కి మాత్రమే టాప్‌-10లో చోటు దక్కింది. ఆమె నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది. జెస్‌ జాన్సన్‌ (ఆస్ట్రేలియా, 762) టాప్‌ ర్యాంకు సాధించింది. ఆల్‌రౌండర్లలో దీప్తిశర్మ (309) అయిదో ర్యాంకులో నిలవగా.. ఎలిస్‌ పెర్రీ (438) అగ్రస్థానంలో ఉంది.

రష్యాపై క్రీడా సమాఖ్యల నిషేధం

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా పై అన్ని క్రీడా సమాఖ్యలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆ దేశ క్రీడాకారులు, అధికారులు ఏ టోర్నీలో పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో రష్యా, ఆ దేశానికి సహకరించిన బెలారస్‌ ఆటగాళ్లు, అధికారులు ప్రపంచ అథ్లెటిక్స్‌ సిరీస్‌ల్లో పోటీపడకుండా ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య నిషేధం విధించింది. ఇకపై ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్, ప్రపంచ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్, ప్రపంచ అథ్లెటిక్స్‌ రేసులో ఆ రెండు దేశాలు పోటీపడేందుకు కుదరదు. ‣ ఆగస్టు- సెప్టెంబరులో రష్యా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ఆ దేశం నుంచి తరలిస్తున్నట్లు అంతర్జాతీయ వాలీబాల్‌ సమాఖ్య ప్రకటించింది. ఇక 2014లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అందించిన ‘ఫినా ఆర్డర్‌’ గౌరవ పురస్కారాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్విమ్మింగ్‌ సమాఖ్య (ఫినా) ప్రకటించింది.

ఐటీఎఫ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నీ: క్వార్టర్స్‌లో శ్రీవల్లి, సాత్విక జోడీ

ఐటీఎఫ్‌ మహిళల 15000 డాలర్ల టెన్నిస్‌ టోర్నీలో తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక- సామ సాత్విక జోడీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి- సాత్విక జోడీ 7-6 (7-4), 6-2తో శర్మద- శ్రావ్య శివాని జంటపై విజయం సాధించింది.