విజయవంతంగా మరో రెండు ఎంఆర్ శామ్ క్షిపణుల ప్రయోగం
గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మరో రెండు మధ్యశ్రేణి క్షిపణులను (ఎంఆర్ శామ్‌ల) భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్ సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్) నుంచి వీటిని పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వర్గాలు తెలిపాయి. ఇవి గగన తలంలో వేగంగా కదులుతున్న లక్ష్యాలను నేరుగా ఢీకొట్టినట్లు వెల్లడించాయి. వీటిని భారత సైన్యం కోసం తీర్చిదిద్దారు. డీఆర్‌డీవో, భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో ఈ పరీక్షలు జరిపారు.
భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ రూ.36,794 కోట్లు
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అది 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి రూ.36,794 కోట్లకు చేరుకున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని తెలుసుకునేందుకు తొలిసారిగా తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (సీడీఎస్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) సంస్థలు పరిశోధన చేశాయి. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ప్రగతి కనిపిస్తున్నా 2011-12 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 0.26 శాతం ఉన్న భాగస్వామ్యం 2020-21 నాటికి 0.19 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. మొత్తంగా చూస్తే జీడీపీలో సగటున 0.23 శాతం (2011-12 నుంచి 2020-21 వరకు) ఉంది. గత రెండేళ్లలో బడ్జెట్ కేటాయింపులు తగ్గడం పరిమాణం క్షీణించడానికి కారణమైంది. 2020 - 21లో బడ్జెట్ వ్యయం రూ.9,500 కోట్లు ఉండగా అంతకుముందు ఏడాది రూ.13,033.2 కోట్లు కావడం గమనార్హం. మొత్తానికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2018 - 19లో రూ.43,397 కోట్ల నుంచి 2019 - 20కి రూ.39,802 కోట్లకు, 2020 - 21కి రూ.36,794 కోట్లకు తగ్గిపోయింది. అంతరిక్ష కార్యకలాపాలపై జీడీపీ పరంగా చూస్తే మనదేశ వ్యయం చైనా, జర్మనీ, ఇటలీ, జపాన్‌ల కంటే ఎక్కువ. అమెరికా, రష్యాల కంటే తక్కువగా ఉన్నట్లు తెలిపారు.
సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు సరికొత్త మార్గం
మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల బెడదను గణనీయంగా తగ్గించే దిశగా అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. నదులు, మహాసముద్రాల్లో ఎక్కువగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ సీసాల లాంటి వ్యర్థాలను (వాణిజ్య భాషలో వీటిని పీఈటీగా పిలుస్తుంటారు) తొలగించే మెరుగైన సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు బాటలు పరిచారు. సాధారణంగా ప్లాస్టిక్ సీసాల తయారీలో పాలీఎస్టర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ పాలీఎస్టర్‌ను ప్రాథమిక అణువులుగా విడగొట్టగల ఎంజైమ్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో గతంలోనే అభివృద్ధి చేశారు. దాన్ని బ్యాక్టీరియాలో ప్రవేశపెట్టి ప్లాస్టిక్ వ్యర్థాల పీడ విరగ్గొట్టాలన్నది వారి ప్రణాళిక. అయితే నిర్దిష్ట ఉష్ణోగ్రత దాటితే ఈ ఎంజైమ్ విచ్ఛిన్నమవుతుండటం ప్రతికూలాంశంగా మారింది. ఇందుకు పరిష్కారమార్గంగా సదరు ఎంజైమ్‌కు రక్షణ పొరగా పాలీమర్లను ఉపయోగించుకునే విధానాన్ని నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రతిపాదించారు. తద్వారా అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా పీఈటీని విచ్ఛిన్నం చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గ్యాస్ లీకేజీని పసిగట్టే ‘స్మార్ట్ నాబ్’
స్టవ్ బర్నర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాద పరిస్థితుల్ని గుర్తించి ఆటోమేటిక్‌గా గ్యాస్‌ను ఆఫ్ చేసుకునే సాంకేతికత వచ్చింది. దీనికోసం ‘స్మార్ట్ నాబ్’ను స్టవ్‌కు అమర్చారు ఐఐటీ మద్రాస్‌కు చెందిన స్టార్టప్ డిగ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హెచ్‌పీసీఎల్‌తో కలిసి స్టవ్‌లకు ఈ సాంకేతికతను అనుసంధానించి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ ప్రకటించింది. బర్నర్‌ల దగ్గర గ్యాస్ లీకేజీని పసిగట్టే ‘బ్యాటరీ ఫ్రీ నాన్-ఇన్వాజివ్ ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైజ్’ను అమర్చారు. ఇది సెన్సర్‌లా పని చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ తరహా పరికరాన్ని ప్రపంచంలోనే తొలిసారి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.
ఎంఆర్ శామ్ క్షిపణి పరీక్షలు విజయవంతం
గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే రెండు మధ్యశ్రేణి క్షిపణులను (ఎంఆర్ శామ్) భారత్ విజయవంతంగా పరీక్షించింది. లక్ష్యంగా నిర్దేశించిన మానవరహిత విమానాలను ఆ అస్త్రాలు నేరుగా ఢీ కొట్టాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తెలిపింది. లక్ష్యాలు వేగంగా కదులుతున్నప్పటికీ క్షిపణులు గురితప్పకుండా వాటిని నేలకూల్చాయి. మొదటి ప్రయోగంలో ఈ క్షిపణి.. చాలా దూరంలో, ఒక మోస్తరు ఎత్తులో విహరిస్తున్న విహంగాన్ని నేలకూల్చింది. రెండో ప్రయత్నంలో తక్కువ ఎత్తులో, తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఈ క్షిపణికి రెండు రకాల సామర్థ్యాలు ఉన్నట్లు వెల్లడైంది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్) నుంచి ఈ పరీక్షలు జరిగాయి. ఎంఆర్ శామ్‌ను డీఆర్‌డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అనుబంధ ల్యాబ్ రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) ఇందులో కీలక పాత్ర పోషించింది. ఈ క్షిపణిని భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
‣ ఎంఆర్ శామ్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. దీని పొడవు 4.5 మీటర్లు కాగా బరువు 2.7 టన్నులు. ఇది 60 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. వేగంగా ప్రతిస్పందించే లక్షణం దీని సొంతం. ధ్వని కంటే రెట్టింపు వేగంతో (మ్యాక్ 2) దూసుకెళ్లగలదు. ఇది యుద్ధవిమానాలు, సబ్‌సోనిక్, సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ట్యాంకు విధ్వంసక వ్యవస్థలు, రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేయగలదు. ఇప్పటికే ఈ క్షిపణి వ్యవస్థ వాయుసేన అమ్ములపొదిలో చేరింది.
నోటి క్యాన్సర్ రోగుల ఆయుష్షును నిర్ధారించే సీటీసీలు
నోటి క్యాన్సర్‌కు సంబంధించి భారత శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని గుర్తించారు. ఈ రుగ్మత బారినపడిన వారి ఆయుర్దాయం వారి రక్తంలోని సర్క్యులేటింగ్ ట్యూమర్ కణాల (సీటీసీ) సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుందని తేల్చారు. సీటీసీలు ఎక్కువగా కలిగినవారితో పోలిస్తే తక్కువగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవించడానికి ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ముంబయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన పంకజ్ చతుర్వేది నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా 152 మంది రోగులను నాలుగేళ్ల పాటు పరిశీలించారు. ఒక్కొక్కరి నుంచి రక్తం నమూనాలు సేకరించి, సీటీసీల సంఖ్యను పరిశీలించారు. 1.5 మిల్లీలీటర్ల రక్తంలో 20కిపైగా సీటీసీలు ఉన్న రోగుల్లో వ్యాధి ముదిరిపోయి ఉంటుందని తేల్చారు. అలాగే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. వీరితో పోలిస్తే 12 కంటే తక్కువ సీటీసీలు కలిగిన రోగులు ఎక్కువ కాలం జీవిస్తారని తెలిపారు.
సైన్స్ లీడర్స్ కాన్‌క్లేవ్-2022
భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల ‘సైన్స్ లీడర్స్’ తొలి కాన్‌క్లేవ్‌ను హైదరాబాద్‌లోని ఐఐసీటీలో సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే ప్రారంభించారు. రాబోయే 15 ఏళ్లలో శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ ప్రపంచంలోనే మూడో అగ్రదేశంగా ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్‌టీ) కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్ అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ గత 75 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించిందని.. రాబోయే 15 ఏళ్లలో మరింతగా రాణిస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు. పరిశోధనల వేగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఉడాన్‌కు ‘సారస్’ విమానాలు అనుకూలం
నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్‌ఏఎల్) అభివృద్ధి చేసిన 19 సీట్ల తేలికపాటి రవాణా విమానం సారస్-ఎంకే 2 హైదరాబాద్‌లో నిర్వహించిన వింగ్స్ ఇండియా 2022 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విమానాన్ని ప్రయాణాల అవసరాలకు, సైన్యాన్ని తీసుకువెళ్లటానికి, ప్రముఖుల ప్రయాణాలకు, ఎయిర్ అంబులెన్స్‌గా వినియోగించవచ్చని ఎన్‌ఏఎల్ డైరెక్టర్ జితేంద్ర జాదవ్ వివరించారు.
‣ ముఖ్యంగా దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, ఉడాన్ పథకం కింద ప్రయాణికులకు సేవలు అందించటానికి సారస్- ఎంకే 2 విమానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
‣ చిన్నవి, ఎత్తైన ప్రదేశాల్లో ఉండే రన్‌వేల నుంచి సులువుగా ఎగిరే సత్తా ఉంది.
‣ గ్లాస్ కాక్‌పిట్, ప్రెజరైజ్డ్ కేబిన్, డిజిటల్ యాంటీ స్కిడ్ బ్రేకింగ్, ఆటోపైలెట్, క్యాట్- 2 ల్యాండింగ్, టూ లీవర్ ఇంజన్ ఆపరేషన్ లాంటి అధునాతన సదుపాయాలు ఈ విమానంలో ఉన్నట్లు, తేలికపాటి పదార్థాలతో దీన్ని రూపుదిద్దారు.
‣ దాదాపు 29,000 అడుగుల ఎత్తులో గంటకు 500 కి.మీ. వేగంతో నిరంతరాయంగా 778 కి.మీ. ప్రయాణించగలదు.
రక్తంలోనూ ప్లాస్టిక్ రేణువులు
కొండలు.. కోనలు.. సాగరాలు.. ఇలా పుడమి అంతటా విషవాయువులా వ్యాపిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు చివరికి మన రక్తంలోకీ చేరాయి. తొలిసారిగా వీటి ఆనవాళ్లను మానవ నెత్తురులో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆందోళనకర పరిణామమని, తక్షణం మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
‣ పుడమిపై భారీ కాలుష్యకారకాల్లో ప్లాస్టిక్ ముఖ్యమైంది. ఈ వ్యర్థాలు భారీ పరిమాణంలో నేల నుంచి సముద్రంలోకి చేరుతున్నాయి. వీటిలో చిన్నపాటి రేణువులను సూక్ష్మ ప్లాస్టిక్‌లుగా పేర్కొంటారు. ఇవి 5 మిల్లీమీటర్ల కన్నా చిన్నగా ఉంటాయి. ఇవి ప్రమాదకరంగా పరిణమించాయి. గతంలో ఇవి పేగుల వంటి అవయవాల్లో కనిపించాయి. చేపలు, ఇతర మత్స్య సంపదలోనూ వెలుగు చూస్తున్నాయి. మానవ రక్తంలో వీటికి సంబంధించిన సూక్ష్మ రేణువులు కనిపించడం ఇదే మొదటిసారి. పరిశీలించిన శాంపిళ్లలో.. మిల్లీలీటరు రక్తంలో 1.6 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు ఉన్నాయి. ఇది ఆందోళనకర పరిమాణమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎక్కడ.. ఎన్ని?
‣ నెదర్లాండ్స్‌లోని పరిశోధక బృందం 22 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించింది. 17 శాంపిళ్లలో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి.
‣ సగం శాంపిళ్లలో పాలీఇథలీన్ టెరెప్టథలేట్ (పీఈటీ) రేణువులు ఉన్నాయి. వీటిని పానీయాల బాటిళ్ల తయారీలో వాడుతుంటారు.
‣ ఆహార ప్యాకేజింగ్‌లో వాడే పాలీస్టరిన్ రేణువులు 36 శాతం శాంపిళ్లలో కనిపించాయి.
‣ ప్లాస్టిక్ సంచుల తయారీకి ఉపయోగించే పాలీఇథలీన్ రేణువులు 23 శాతం నమూనాల్లో వెలుగు చూశాయి.
మనిషిలోకి ఎలా చేరుతున్నాయి?
గాలి, ఆహారం, పానీయాల ద్వారా ఈ ప్లాస్టిక్‌లు మానవ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.
ఊపిరితిత్తుల్లో రోబో ‘మ్యాగ్నెటిక్ టెంటకిల్’ను అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
ఊపిరితిత్తుల్లో మొక్క వేళ్ల తరహాలో భిన్న దిశల్లో ఉండే సన్నటి శ్వాసనాళాల్లోకి సులువుగా ప్రవేశించే ఒక బుల్లి రోబోను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇరుకైన ఆ భాగాల నుంచి కణజాల నమూనాలు తీసుకోవడానికి ఇది సాయపడుతుంది. ఔషధాలనూ చేరవేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆ అవయవానికి సంబంధించిన ఇతర వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఇది అద్భుతంగా సాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఏమిటీ సాధనం?
‣ ఈ సాధనానికి ‘మ్యాగ్నెటిక్ టెంటకిల్ రోబో’ అని పేరు పెట్టారు. దీని వ్యాసం 2 మిల్లీమీటర్లు. అంటే.. బాల్‌పాయింట్ పెన్ను మొనకు రెట్టింపు పరిమాణంలో ఇది ఉంటుంది. బ్రిటన్‌లోని లీడ్స్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్‌కి అనుబంధంగా ఉన్న స్టార్మ్ ల్యాబ్ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు.
ప్రయోగం సక్సెస్
‣ శ్వాసకోశ వ్యవస్థ త్రీడీ నమూనాపై ఈ విధానాన్ని విజయవంతంగా పరీక్షించారు. తదుపరి దశలో.. మృతదేహం నుంచి సేకరించిన ఊపిరితిత్తుల్లోకి ఈ సాధనాన్ని ప్రయోగాత్మకంగా పంపి, దాని సమర్థతను పరిశీలిస్తారు.
‣ ప్రస్తుతం ఉపయోగిస్తున్న బ్రాంకోస్కోపుతో ఎదురవుతున్న ఇబ్బందులను మ్యాగ్నెటిక్ టెంటకిల్ రోబో అధిగమిస్తుంది. దీన్ని సులువుగా ఎక్కడికైనా పంపొచ్చు.
‣ 80 మిల్లీమీటర్ల పొడవు, 2 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన గొట్టాలను గుదిగుచ్చి ఈ సాధనాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇందుకోసం మృదువైన ఎలాస్టోమెట్రిక్ పదార్థాన్ని వాడారు. ఫలితంగా ఇది సులువుగా ఎటుపడితే అటు వంగుతుంది. ఇందులో చిన్నపాటి అయస్కాంత రేణువులను ఉంచారు. దీని దర్వారా ఇది దిశను మార్చుకుంటూ శ్వాసనాళాల్లోని మెలికల గుండా సులువుగా ముందుకు సాగుతుంది.
సీసీఎంబీలో అందుబాటులోకి వచ్చిన అధునాతన క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ
అత్యాధునిక క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. సీసీఎంబీలో ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే ప్రారంభించారు. జీవ కణాల నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి, ఔషధాల ఆవిష్కరణలో అణువులను నిశితంగా పరిశీలించడానికి, పదార్థాన్ని, దాని పరమాణు వివరాలను సూక్ష్మస్థాయిలో చూసేందుకు ఈ విధానం సహకరిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఔషధ పరిశ్రమలు కరోనా వైరస్‌ను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, ఔషధాల పనితీరును అంచనా వేసేందుకు ఉపకరిస్తుందన్నారు. క్రయోజనిక్ ఉష్ణోగ్రతలు మైనస్ 173 సెంటీగ్రేడ్ వద్ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని ఉపయోగించి అణువులను ఫొటో తీయవచ్చన్నారు. సీసీఎంబీలో ఇప్పటికే ఉన్న కాన్ఫోకల్ మైక్రోస్కోపీ, ఎన్‌ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎక్స్‌రే డిఫ్రాక్షన్ సదుపాయాలతో పాటు జీవకణాల వివరాల పరిశీలనకు కొత్త సదుపాయం దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ.. జీవశాస్త్రానికి చెందిన కొన్ని ప్రాథమిక సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తుంది’ అని సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే అన్నారు.
హైదరాబాద్‌లో ‘వింగ్స్ ఇండియా 2022’ ప్రారంభం
ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఏవియేషన్ షో ‘వింగ్స్ ఇండియా 2022’ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి చిన్న, పెద్ద విమానాలు, హెలికాప్టర్లు వచ్చాయి. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ (ఎన్‌ఏఎల్) పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన చిన్న విమానం ‘సారస్ మ్యాక్ 2’, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసిన చిన్న విమానం డార్నియర్, రక్షణ, పౌర అవసరాల కోసం రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు ధ్రువ్, లైట్ యుటిలిటీలను ప్రదర్శించారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈసారి ప్రదర్శనలో ఎయిర్‌బస్ ఏ350, ఎంబ్రాయర్‌కు చెందిన ప్రాఫిట్ హంటర్ మినహాయిస్తే చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లే దర్శనమిచ్చాయి.
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ పరీక్షను నిర్వహించింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేధించిందని అధికారులు తెలిపారు.
క్యాన్సర్ మందుల తయారీకి మరింత ఊతం
క్యాన్సర్ నిరోధక ఔషధాల తయారీకి అవసరమైన రసాయనాల ఉత్పత్తికి మార్గం సులభం చేసేలా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) పరిశోధకులు పరిశోధన చేశారు. ఇందుకోసం ప్రత్యేక రసాయన సమ్మేళనాన్ని తయారు చేశారు. హెచ్‌సీయూ రసాయనశాస్త్ర ప్రొఫెసర్ అఖిల.కె.సాహో నేతృత్వంలో పరిశోధక విద్యార్థి శుభం దత్తాతో పాటు శశాంక్, మానస్, షేంగ్వాన్, విన్సెంట్ భాగస్వామ్యంతో పరిశోధన చేపట్టారు. వీరి పరిశోధన ప్రముఖ నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. క్యాన్సర్ నిరోధానికి టామోక్సిఫెన్ మందు కీలకం. దీని తయారీకి అవసరమైన రసాయనిక చర్య ఎంతో ముఖ్యమైంది. ఔషధం తయారీలో వినియోగించేందుకు వీలుగా కార్బన్ మూలకాల స్థానంలో ఒలెఫిన్స్‌తో నిర్మితమైన మందును హెచ్‌సీయూ పరిశోధకులు తయారు చేశారు. దీనివల్ల ఔషధం సమర్థంగా పనిచేయడంతో పాటు మనిషి శరీరానికి ఎలాంటి హాని చేయదని వారు చెబుతున్నారు.
పెన్ - పంప్‌తో పార్కిన్సన్ రోగులకు తక్షణ ఉపశమనం
అరవై ఏళ్లు దాటిన ప్రతి వంద మందిలో ఇద్దరు పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధి బారిన పడుతున్నారని ‘కింగ్స్ కాలేజ్ హాస్పిటల్’ (లండన్, దుబాయ్) వైద్యులు వినోద్ మెట్ట తెలిపారు. భారత్‌లో చిన్నారులు సైతం ఈ వ్యాధికి గురవుతున్నారన్నారు. మందులతో ఈ వ్యాధి అదుపులోకి రాని వారి కోసం సాంకేతికత ఆధారంగా పనిచేసే ‘పెన్ - పంప్’ (ఇంజెక్షన్) పరికరం అందుబాటులోకి వచ్చిందన్నారు. ‘అడ్వాన్స్‌డ్ పార్కిన్సన్’పై నిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డా.రూపమ్, ప్రొఫెసర్ రుక్మిణిలతో కలిసి ‘పెన్ - పంప్’ని ఆవిష్కరించారు. దీని ద్వారా ఇంజెక్షన్ తీసుకుంటే రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే రోగి సాధారణ స్థితికి చేరుకుంటాడని వివరించారు. పార్కిన్సన్ రోగులకు అవసరాన్ని బట్టి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్స చేస్తున్నామని, దీని ద్వారా రోగులు సాధారణ స్థితికి వస్తారని ప్రొఫెసర్ రుక్మిణి చెప్పారు.
45 రోజుల్లోనే ఏడంతస్తుల మేడ నిర్మాణం
రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధికి అవసరమైన ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ (ఎఫ్‌సీఎస్) కేంద్రం కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఏడంతస్తుల్లో రూపుదిద్దుకుంది. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) ప్రాంగణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) విమాన నియంత్రణ, మానవరహిత విమాన వ్యవస్థలకు అవసరమైన పరిశోధన సదుపాయాలున్నాయి. 1.3 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రం పనులు ఫిబ్రవరి 1న ప్రారంభమై మార్చి 17న ముగిశాయి. ఈ నిర్మాణానికి హైబ్రిడ్ కన్‌స్ట్రక్షన్ సాంకేతికతను వాడారు. ప్రీఇంజినీరింగ్, ప్రీకాస్టింగ్, ప్రీఫ్యాబ్రికేట్ విధానాలతో శాశ్వత సదుపాయాలను కల్పించారు. స్టాండర్డ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనల ప్రకారం వీఆర్‌ఎఫ్ ఎయిర్ కండీషనింగ్, అగ్నిప్రమాద నియంత్రణ, విద్యుత్తు వ్యవస్థలను సమకూర్చారు. ఎల్‌అండ్‌టీ, ఐఐటీ-మద్రాస్, రూర్కీ బృందాలు సాంకేతిక సాయాన్ని అందించాయి.
వ్యాక్సిన్ల సమర్థతను గుర్తించే ‘న్యూరోసేఫ్’ కిట్
వ్యాక్సిన్ల తయారీలో న్యూరో వైరలెన్స్ పరీక్ష నిర్వహణకు ప్రత్యేక కిట్ అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌సెల్ అంకొలాజిక్స్ అంకుర సంస్థ. ‘న్యూరోసేఫ్’ పేరిట రూపొందించిన ఈ కిట్ సాయంతో జంతువులపై ప్రయోగాలు అవసరం లేకుండా వ్యాక్సిన్ల సమర్థతను పరీక్షించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అస్పైర్ - టెక్నాలజీ బిజినెస్ ఇంకుబేటర్‌లో కొనసాగుతోంది. ఇటీవల కిట్‌ను భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్ల, కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ కార్యదర్శి ఎ.చంద్రశేఖర్ విడుదల చేశారు. కిట్ తయారీకి విప్రో భాగస్వామిగా వ్యవహరించింది. వ్యాక్సిన్ల సమర్థత నిర్ధారణలో న్యూరో వైరలెన్స్ పరీక్ష కీలకమైనది. నరాలపై వ్యాక్సిన్ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేస్తుంటారు. క్లినికల్ ట్రయల్స్ దశలో కోతులపై నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో వందలాది కోతులు చనిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా ట్రాన్స్‌సెల్ అంకోలాజిక్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సుభద్ర ద్రవిడ నేతృత్వంలోని బృందం న్యూరోసేఫ్ కిట్‌ను రూపొందించింది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను దీనికి జోడించారు.
15 నిమిషాల్లోనే ఫలితాలు
ఈ కిట్ ద్వారా వ్యాక్సిన్‌ను నేరుగా మనిషి కణజాలంపై పరీక్షించేందుకు వీలవుతుంది. కోతులపై చేసే ప్రయోగాల్లో ఫలితాలు రావడానికి 28 రోజుల నుంచి 5 నెలల సమయం పడుతుంది. కొత్త విధానంతో 15 నిమిషాల్లోనే న్యూరో వైరలెన్స్ పరీక్ష ఫలితాలు వస్తాయి. ‘న్యూరోసేఫ్ కిట్‌లో బొడ్డుతాడు నుంచి సేకరించి తయారు చేసిన కణజాలం ఉపయోగించడంతో మనిషిపై వ్యాక్సిన్ల దుష్ప్రభావాలను ముందుగానే గుర్తించవచ్చు.
బాహ్య చర్మం గుట్టు విప్పేస్తారు!
గర్భస్థ పిండం దశలో ఓ చిన్న కణజాలం నుంచి పెద్ద పరిమాణంలో ఉండే చర్మం ఎలా ఏర్పడుతుందనే కీలక పరిశోధనను హైదరాబాద్‌కు చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) పరిశోధకులు చేపట్టారు. దీనికి ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక హ్యుమన్ ఫ్రాంటియర్ సైన్స్ ప్రోగ్రామ్ (హెచ్‌ఎఫ్‌ఎస్‌పీ) నుంచి రూ.9 కోట్ల పరిశోధన నిధి మంజూరైంది. ఈ ప్రాజెక్టుకు టీఐఎఫ్‌ఆర్ బయో ఫిజిక్స్ ఆచార్యుడు తమల్‌దాస్ ప్రధాన పరిశోధకుడిగా వ్యవహరించనున్నారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా 716 దరఖాస్తులు రాగా 32 బృందాలకు హెచ్‌ఎఫ్‌ఎస్‌పీ పరిశోధన నిధి అందించింది. వీటిలో తమల్‌దాస్ బృందం ఒకటి.
కృత్రిమ చర్మం తయారు చేసి..
సాధారణంగా బాహ్య చర్మానికి ఏదైనా దెబ్బ తగిలితే దానంతట అదే పునర్నిర్మితమవుతుంది. ఈ ప్రక్రియపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు ఎన్నో అధ్యయనాలు చేపట్టారు. చర్మం లోపలి పొరలు బయటకు వచ్చి బాహ్య చర్మాన్ని ఎలా మరమ్మతు చేస్తాయనేది మాత్రం పరిశోధకులు గుర్తించలేకపోతున్నారు. ఈ విషయంపై తమల్‌దాస్ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేయనుంది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఎపిడెర్మల్ ఆర్గనాయిడ్’ పేరిట కృత్రిమ చర్మాన్ని రూపొందించనున్నారు. ఇది పూర్తిగా మనిషి శరీరంపై ఉన్న చర్మం తరహా స్వభావం కలిగి ఉంటుంది. దీని సాయంతో జన్యు మ్యుటేషన్లు, కణాల కదలిక, ఒక పొరపై మరొక పొర అమరికపై అధ్యయనం చేస్తారు. ఈ ప్రాజెక్టుతో చర్మ సంబంధిత వ్యాధులు, బొబ్బలు ఏర్పడటం, చర్మ క్యాన్సర్ వంటి అంశాలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని తమల్‌దాస్ చెప్పారు.
ఫేస్ మాస్కు ఉన్నా ఐఫోన్ అన్‌లాక్
ఫేస్ మాస్కు తీయకుండానే ముఖం గుర్తింపుతో ఐఫోన్‌ను అన్‌లాక్ చేసే అప్‌డేట్‌ను ఆపిల్ విడుదల చేసింది. ఐఓఎస్ 15.4 పేరిట ఉన్న ఈ అప్‌డేట్‌తో ‘ఫేస్ ఐడీ విత్ ఎ మాస్క్’ అన్న ఆఫ్షన్ వెల్‌కమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎయిర్‌ట్యాగ్ సెటప్, సిరి వాయిస్ వంటి పలు అదనపు ఫీచర్లు కూడా ఇదే అప్‌డేట్‌తో ఇన్‌స్టాల్ అవుతాయని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మాక్స్, ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మాక్స్ మోడళ్లకు మాత్రమే ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది.
ఐఓటీ సాయంతో వినూత్న సాంకేతికత
స్వల్ప వ్యయంతో గాలి నాణ్యతను పక్కాగా లెక్కించే సరికొత్త సాంకేతికతను గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో విజయవంతంగాఉపయోగించి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు రియల్‌టైమ్ విధానంలో లెక్కిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ) భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తున్నట్లు ఆచార్యులు వివరించారు.
‣ మూడేళ్ల కిందట స్మార్ట్‌సిటీస్ ప్రాజెక్టులో భాగంగా ట్రిపుల్‌ఐటీలో స్మార్ట్‌సిటీ లివింగ్ ల్యాబ్ ఏర్పాటుచేశారు. ‘ఐవోటీ ఎనేబుల్డ్ స్మార్ట్‌సిటీస్: పొల్యూషన్, హెల్త్ అండ్ గవర్నెన్స్’ పేరిట ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అంశంపై వర్సిటీ పరిశోధకులు దృష్టిపెట్టారు. దీనికి నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రామ్(ఎన్‌జీపీ), కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ(డీఎస్‌టీ), పీఆర్‌ఐఎఫ్ పోషల్ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ సహకారం అందిస్తున్నాయి.
విద్యుద్దీపాల్లేకుండానే సహజకాంతులు
పగటిపూట విద్యుత్తుతో పని లేకుండా భవనాల్లోని సెల్లార్లు, చీకటి గదుల్లో సహజ వెలుగులు ప్రసరిస్తే? ఏసీ మాదిరి గొట్టాల ద్వారా సూర్యరశ్మిని గదుల్లోకి తీసుకురాగలిగితే? కరెంటు ఖర్చు ఎంతో ఆదా. ఆరోగ్యమూ బాగుంటుంది. ఇదే ఆలోచనతో డే లైట్ హార్వెస్టింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది హైదరాబాద్‌లోని స్కైషేడ్ డే లైట్స్ అంకుర సంస్థ. 2014 నుంచి పరిశోధనలు చేస్తున్న ఈ సంస్థ సెంట్రల్లీ ఇంటిగ్రేటెడ్ డేలైట్‌తోపాటు మరో రెండు సాంకేతికతలను అభివృద్ధి చేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) దృష్టిని ఆకర్షించింది. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి తాజాగా రూ.5 కోట్లు అందుకుంది.
‣ నగరంలోని భవనాల్లో పగలూ రాత్రీ తేడా లేకుండా విద్యుద్దీపాలు వెలుగుతుంటాయి. సెల్లార్లలోనూ అదే పరిస్థితి. మొత్తం విద్యుత్తు వినియోగంలో దీపాల వెలుతురు కోసం 35 శాతం వాడుతున్నట్లు డిస్కం లెక్కలు చెబుతున్నాయి. పగటిపూట వాటి వాడకం తగ్గించగలిగితే ఇందులో 80 శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
రోజులో సగటున 9 నుంచి 11 గంటలపాటు సహజ సూర్యకాంతి ఉంటుంది. దీన్ని ఇంట్లో చీకటి ఉన్న ప్రాంతాలకు పెద్దగా ఖర్చు లేకుండా చేర్చగలిగితే... గది అంతా వెలుతురే. డేలైట్ హార్వెస్టింగ్ సాంకేతికతతో సూర్యకాంతిని మొదట సన్‌లైట్ కలెక్టర్స్ ద్వారా ఒకచోట చేరుస్తారు. దీన్ని చీకటి ఉండే సెల్లార్లలోకి పైపు ద్వారా పంపిస్తారు. 2 చదరపు అడుగుల వ్యాసార్ధంలో ఉండే సన్‌లైట్ కలెక్టర్ నుంచి వచ్చే వెలుగు 1500-2000 చ.అ. విస్తీర్ణం వరకు సరిపోతుంది. ఇది 250 వోల్టుల ఎల్‌ఈడీ బల్బు ఇచ్చేంత వెలుతురును ప్రసరిస్తుంది. విస్తీర్ణాన్ని బట్టి వీటిని బిగించుకోవచ్చు. పాత, కొత్త భవనాలకూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
అధిక రిజల్యూషన్‌తో అల్ట్రాసౌండ్ చిత్రాలు
అధిక రిజల్యూషన్‌తో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చిత్రాలను చూడగలిగే కొత్త సాంకేతికతను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వ్యాధుల నిర్ధారణలో కచ్చితత్వం, చికిత్స పర్యవేక్షణల్ని మెరుగుపరిచేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందని చెప్పారు. మానవ శరీరం లోపలి చిత్రాలను చూపే సాంకేతికతే అల్ట్రాసౌండ్. వివిధ వ్యాధుల నిర్ధారణ, చికిత్స విధానాల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. గర్భిణులలో పిండాన్ని పరీక్షించడం సహా అంతర్గత అవయవాల్లో నొప్పి, వాపు, ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ప్రధానంగా అల్ట్రాసౌండ్‌పైనే ఆధారపడుతున్నారు. అల్ట్రాసౌండ్ యంత్రంలో ఉండే ‘భీమ్‌ఫార్మర్’ అనే ప్రధాన భాగం.. స్కానింగ్ చిత్రం నాణ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. భీమ్‌ఫార్మర్ పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పటికే అనేక సాంకేతికలు వచ్చాయి. అయితే తాము అభివృద్ధి చేసిన సాంకేతికత వీటన్నింటికి మించి అత్యుత్తమ నాణ్యతతో చిత్రాలను అందిస్తున్నట్టు ఐఐటీ పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణంగా అల్ట్రాసౌండ్ తీసే సమయంలో అంతర్గత అవయవాల్లో పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు చిత్రాల నాణ్యత తగ్గిపోతోందని, తాము ఆ సమస్యను అధిగమించినట్టు వివరించారు. ఈ వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వ్యాధులను ముందుగానే గుర్తించడం, మెరుగైన రోగ నిర్ధారణ, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటాన్ని ప్రాధమిక దశలోనే పసిగట్టడం, ఇమేజ్ గైడెడ్ బయాప్సీ విశ్లేషణ వంటి అనేక ప్రక్రియలను తాజా పరిశోధన సులభతరం చేస్తుందని ఐఐటీలోని అఫ్లైడ్ మెకానిక్స్ విభాగ ప్రొఫెసర్ అరున్ కె తిట్టై చెప్పారు.
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 అధ్యయనం
‘చంద్రయాన్-2 ఆన్‌బోర్డ్‌లోని చేస్-2 పరికరం చంద్రుని ఉపరితంలోని ఆర్గాన్ ఉద్గారాలను పరిశీలిస్తోంది. చేస్-2 స్వతంత్రంగా చేపట్టిన తొలి ప్రక్రియ ఇదే’ అని ఇస్రో బెంగళూరులో ప్రకటించింది. చంద్రుని ఉపరితలంలోని జీవరాశులు, రేడియోధార్మిక ప్రక్రియలను అధ్యయనం చేసేందుకు ఈ పరిశీలనలు ఉపయోగపడతాయని ఇస్రో భావిస్తోంది. భూమి, చంద్రుని ఉపరితలాల్లో సంచరించే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులు, పరమాణవులు సూర్య కిరణాల ఒత్తిడి నుంచి తప్పించుకు తిరుగుతూ కొన్నిసార్లు ఢీకొట్టుకుంటాయి. ఈ రాపిడితో వెల్లడయ్యే ఉద్గారాలను చేస్-2 ద్వారా స్పష్టంగా గుర్తించే వీలుంది.
అమెరికాలో నాట్కో ఫార్మా క్యాన్సర్ ఔషధం
అమెరికాలో క్యాన్సర్ ఔషధాల్లో అధికంగా విక్రయమయ్యే రెవ్లిమిడ్‌కు తొలి జనరిక్ ఔషధాన్ని నాట్కో ఫార్మా ఆవిష్కరించింది. రక్త కేన్సర్ చికిత్సలో ఉపయోగించే లెనలిడోమైడ్ క్యాప్సూళ్లయిన రెవ్లిమిడ్‌కు తొలి జనరిక్ ఔషధాన్ని అమెరికా విపణిలోకి 5 ఎంజీ, 10 ఎంజీ, 15 ఎంజీ, 25 ఎంజీ మోతాదుల్లో విడుదల చేసినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఈ డోసుల్లోని లెనలిడోమైడ్ క్యాప్సూళ్లను డెక్సామెథసోన్‌తో కలిపి, పెద్దలకు మల్టిపుల్ మైలోమా చికిత్స నిమిత్తం వైద్యులు సిఫారసు చేస్తుంటారు. కొన్ని నిర్దిష్ట మైలోడైస్పాలిస్టిక్ వ్యాధుల్లో, మాంటిల్ సెల్ లింఫోమా చికిత్సలో ఈ ఔషధాన్ని ఒక ముందస్తు చికిత్స అనంతరం పెద్దలకు వినియోగిస్తారని నాట్కో ఫార్మా తెలిపింది. తమ మార్కెటింగ్ భాగస్వామి అయిన యారో ఇంటర్నేషనల్ (తెవా ఫార్మా అనుబంధ కంపెనీ)తో కలిసి ఈ ఔషధాన్ని ఆవిష్కరించినట్లు కంపెనీ తెలిపింది.
‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్’ ప్రయోగం విజయవంతం
భారత నౌకాదళం మరో చరిత్రాత్మక మైలురాయి దాటింది. సముద్రం నుంచి భూమిపైకి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొట్టే మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. అరేబియా సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్’ సఫలీకృతమైనట్లు నేవీ ప్రకటించింది. దేశ రక్షణాయుధాల్లో ఇది కీలకంగా మారనుందని పేర్కొంది. దూరంగా ఉన్న భూ ఉపరితలంలోని లక్ష్యాన్ని ఎలాంటి శబ్దం లేకుండా దూసుకెళ్లి ఛేదించిందని అధికారులు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దీన్ని తయారు చేసినట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి.
ఇ-కోలి బ్యాక్టీరియా గుర్తింపుకు కొత్త విధానాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్ బిట్స్ పరిశోధకులు
ప్రమాదకర ఇ-కోలి బ్యాక్టీరియాను సులువుగా గుర్తించే పద్ధతిని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ (బిట్స్) - హైదరాబాద్ పరిశోధకులు ఆవిష్కరించారు. బిట్స్ ఈఈఈ విభాగాధిపతి సంకేత్ గోయెల్ ఆధ్వర్యంలో మెకానికల్ ఇంజినీరింగ్ ఆచార్యులు అర్షద్ జావేద్, సతీష్‌కుమార్ దూబే, పోస్ట్ డాక్టోరల్ విద్యార్థిని ఖైరున్నీసా అమ్రీన్, పీహెచ్‌డీ విద్యార్థులు మనీష్ రిషి, జాలిగం మురళీమోహన్ ఆధ్వర్యంలో దీనిపై పరిశోధన చేపట్టారు. ఆహారం, నీరు నుంచి శరీరంలోకి ప్రవేశించే ఇ-కోలి బ్యాక్టీరియా మనిషికి ఎన్నో వ్యాధులను కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణాలకూ కారణమవుతుంది.
‣ ప్రస్తుతం ఇ-కోలి బ్యాక్టీరియాను గుర్తించేందుకు ఆప్టికల్ (కాంతి) పద్ధతులను వినియోగిస్తున్నారు. ఈ పద్ధతిలో కచ్చితమైన ఫలితాలు రావడం లేదు. దీంతో ఎలక్ట్రో కెమికల్ పద్ధతిలో ఇ-కోలి బ్యాక్టీరియాను గుర్తించే సరికొత్త విధానాన్ని బిట్స్ పరిశోధకులు ఆవిష్కరించారు. ఇందులోభాగంగా గ్లాస్ కార్బన్‌ను రసాయన చర్యతో గ్రాఫిటైజడ్ మీసోపొరస్ కార్బన్ (జీఎంసీ)గా మార్చి ఎలక్ట్రోడ్‌ను తయారు చేశారు. న్యూట్రల్ ఎలక్ట్రోడ్ కోసం ప్లాటినం లేదా సిల్వర్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్‌ను వాడారు. వీటిని నమూనాల్లో ఉంచినప్పుడు ఎలక్ట్రోడ్‌ల సాయంతో బ్యాక్టీరియాను గుర్తించి గ్రాఫ్ రూపంలో ఫలితాన్ని అందిస్తుందని సంకేత్ గోయెల్ తెలిపారు.