పుస్తకాలు

అత్యంత ధనికులున్న నగరం.. ముంబయి

దేశంలో అత్యంత ధనికులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని ‘నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌- 2022’ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం అత్యంత ధనికులను కలిగిన నగరాల్లో ముంబయి ప్రథమస్థానంలో ఉంది. 2021 ఏడాదిలో నికర ఆస్తి విలువ 30 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.227 కోట్లు) కంటే ఎక్కువగా ఉన్న వారిని ‘అత్యంత ధనికులు’గా పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. వీరు ముంబయిలో 1,596 మంది ఉండగా, హైదరాబాద్‌లో 467 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 2026 నాటికి 728 కి పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత అయిదేళ్లలో హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 314 నుంచి 48.7 శాతం పెరిగి, 467కు చేరింది.

దేశవ్యాప్తంగా చూస్తే అత్యంత ధనికులు 2020లో 12,287 మంది ఉండగా, 2021లో ఆ సంఖ్య 13,637కు పెరిగింది. అంటే దాదాపు 11 శాతం వృద్ధి నమోదైంది. ఇక్కడి నుంచి 2026 నాటికి మనదేశంలో అత్యంత ధనికుల సంఖ్య 19,006 కు పెరిగే అవకాశం ఉందని నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2020 లో 5.58 లక్షల మంది అత్యంత ధనికులు ఉండగా, 2021 నాటికి ఈ సంఖ్య 6.10 లక్షలకు పెరిగింది.


యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షి వీరభద్రుడి ఆలయం

శిల్ప కళాకృతులకు నెలవైన అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆలయంగా లేపాక్షి చరిత్రకెక్కింది. దేశంలో 40 ప్రదేశాలకు తాత్కాలిక జాబితాలో చోటు లభించగా.. ఏపీ నుంచి తాజాగా లేపాక్షికి ఈ గౌరవం దక్కింది. త్వరలో యునెస్కో బృందం ఆలయాన్ని సందర్శించి శాశ్వత జాబితాలో చోటుకు పరిశీలిస్తుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యానికి.. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు సజీవ సాక్ష్యం లేపాక్షి ఆలయం. ఇక్కడి ఏకశిల నంది విగ్రహం అతి పెద్దది. ఈ విగ్రహం 27 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు ఉంది. గర్భాలయంలోని వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం ఆసియాలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో కోశాధికారిగా పని చేసిన విరూపణ్ణ క్రీ.శ.1522 నుంచి క్రీ.శ.1538 మధ్యలో ఏడు ప్రాకారాలతో ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం మూడు ప్రాకారాలే దర్శనమిస్తున్నాయి. ఆలయంలో 878 రాతి స్తంభాలున్నాయి. 246 స్తంభాలపై అబ్బురపరిచే శిల్ప కళాకృతులను తీర్చిదిద్దారు. ఆలయ గర్భగుడి ముందు భాగంలో 70 స్తంభాలపై నాట్య మండపాన్ని నిర్మించారు. ఇందులో రంభకు భృంగీశ్వరుడు నాట్య మెలకువలు చెబుతున్నట్లున్న శిల్పకళను అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైకప్పు మధ్యలో 12 రాళ్లతో శతపత్ర పద్మాన్ని తీర్చిదిద్దారు.

లేపాక్షి ఆలయం రెండో ప్రాకారంలో ఏడు శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. గర్భగుడి ఈశాన్యంలో 8 అడుగుల స్తంభం నేలను తాకకుండా పైకప్పు నుంచి నిలబడి ఉంది. దీన్నే వేలాడే స్తంభంగా (మూలాధార స్తంభం) పిలుస్తారు. ఈ స్తంభంపైనే నాట్య మండపంలోని 70 స్తంభాలు ఆధార పడినట్లు చెబుతారు. ప్రాకారం చుట్టూ మండపం పైకప్పులో రామాయణంలోని ప్రధాన ఘట్టాలను తైలవర్ణ చిత్రాల రూపంలో తీర్చిదిద్దారు. ఇందులో శ్రీకృష్ణుడి తైలవర్ణ చిత్రం ఎటువైపు నుంచి చూసినా మననే చూస్తున్నట్లే కనిపించడం అద్భుతమని చరిత్రకారులు అభివర్ణిస్తారు. లేపాక్షి ఆలయం రెండో ప్రాకారంలో కల్యాణ మండపానికి పశ్చిమ భాగంలో సీతమ్మ పాదం ఉంది. ఈ పాదంలో నుంచి నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాయల కాలంలో లేపాక్షి ఆలయంలో ఓ మండపాన్ని నిర్మించారు.


నందారంలో నిజాం కాలం నాటి రాగి నాణేలు లభ్యం

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం నందారంలో నిజాం కాలం నాటి రాగి నాణేలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన సభావట్‌ లక్ష్మికి చెందిన పొలంలో చదును చేస్తుండగా ఓ కుండలో ఉర్దూలో ముద్రించిన 228 రాగి నాణేలు దొరికాయి. సమాచారం అందుకున్న తహసీల్దారు శ్రీనివాసులు, సర్పంచి నిర్మల పొలానికి వెళ్లి పరిశీలించారు. లభించిన నాణేలు నిజాం కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని కలెక్టర్‌ కార్యాలయానికి పంపినట్లు తహసీల్దారు తెలిపారు.

తెలంగాణ, కర్ణాటక పీఠభూమిలో మూడు కొత్త రకం బల్లులు

తెలంగాణ, కర్ణాటక పీఠభూమిలోని నదీ పరీవాహక ప్రాంతంలో కొత్తగా మూడు రకాల బల్లులను ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుక్కున్నారు. గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతంలోని రాళ్లు, గుట్టలు, పురాతన కట్టడాల్లో వీటిని గుర్తించారు. ఓయూ జంతుశాస్త్రం ఆచార్యులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు డా.జి.చేతన్‌కుమార్, ఆదిత్య పరిశోధనలు సాగించారు. నల్గొండలోని ఉదయ సముద్రం వద్ద ఒక బల్లిని, కర్ణాటకలోని హంపి, రాయచూర్‌ ప్రాంతాల్లో మరో రెండు రకాలను గుర్తించినట్లు శ్రీనివాసులు తెలిపారు. వాటి రంగు, చారలను పరిశీలించి మిగతా వాటికంటే భిన్నంగా ఉన్నట్లు భావించి లోతుగా పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయి జన్యు విశ్లేషణ చేసిన తర్వాత మూడు నూతన జాతులుగా నిర్ధారించినట్లు వివరించారు. ఇవి దాదాపు 12 అంగుళాల వరకు పొడవు, 300 గ్రాముల వరకు బరువు పెరుగుతాయని తెలిపారు. ఆరేళ్లుగా సాగిన ఈ పరిశోధన ఫలితాలు గత వారం జూటాక్సా అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైనట్లు వివరించారు. ఇప్పటివరకు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎనిమిది నూతన జీవులను గుర్తించారు.

ఐరోపాలో దొరికిన నాగార్జునకొండ స్తూపం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్తూపాల సముదాయంలోని ఓ పురాతన శిల్పస్తూపం దాదాపు 30 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సొంత చోటుకు చేరుతోంది. 1995 ప్రాంతంలో భారత్‌లోని ఓ ప్రదర్శనశాల నుంచి అపహరణకు గురైన ఈ స్తూపం ఐరోపాలో బయటపడింది. అపహరణకు గురైన చారిత్రక కళాఖండాలను స్వదేశాలకు చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్న ఆర్ట్‌ రికవరీ ఇంటర్నేషనల్‌ (ఏఆర్‌ఐ) సంస్థ బ్రసెల్స్‌లోని హై కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత రాయబారి సంతోష్‌ ఝాకు ఈ స్తూపాన్ని అందజేసింది. సున్నపురాయితో కూడిన ఈ కళాఖండం ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునకొండలో దొరికిన శిథిల స్తూపాల్లో ఒకటి. అక్కడి నుంచి ప్రదర్శనశాలకు చేరింది. అపహరణకు గురయ్యేదాకా అక్కడే ఉండేది. ఈ స్తూపాలు బుద్ధ భగవానుడి జీవిత విశేషాలను వివరిస్తాయి. మూడు దశాబ్దాల తర్వాత రికవరీ అయిన స్తూపంపై రాజదర్బారు దృశ్యం ఉంది. రాజదంపతులు ఆశీనులై ఉండగా వెనుక సేవకులు ఉన్నారు. ముందుభాగంలో మహిళా సేవకురాలు, ఓ చిన్నారి పొట్టేలుతో ఆడుకొంటున్నారు.

3,500 ఏళ్ల నాటి స్మారక శిల!

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బీచురాజుపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఇనుప యుగపు స్మారక శిలను పురావస్తు పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. ఈ నిలువురాయిని ఇనుపయుగపు మెన్‌హిర్‌ (నిలువురాయి) అనే స్మారక శిలగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ నిర్ధారించారని తెలిపారు. ఈ తెలుపురంగు గ్రానైట్‌ స్మారక శిలను క్రీ.పూ.1,500 సమయంలో (3,500 ఏళ్ల క్రితం) నిలబెట్టారని చెప్పారు. ఆ కాలంలో మరణించిన వారి సమాధి దగ్గర, వారికి గుర్తుగా ఇలాంటి నిలువురాయిని పాతిపెట్టే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. ‘గతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఇనుపయుగపు సమాధులు కొన్ని ఉండేవి. వ్యవసాయ విస్తరణలో కనుమరుగయ్యాయి. పురావస్తు ప్రాధాన్యం కలిగిన ఈ స్మారక శిలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని శివనాగిరెడ్డి చెప్పారు.