వార్తల్లో వ్యక్తులు

నాగాలాండ్‌ నుంచి రాజ్యసభకు మొదటిసారిగా మహిళ ఎన్నిక

నాగాలాండ్‌ నుంచి తొలిసారిగా ఫన్‌గ్నాన్‌ కొన్యాక్‌ ఒక మహిళ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. గడువు ముగిసే సమయానికి ఆమె ఒక్కరి నుంచి మాత్రమే సంబంధిత నామపత్రం అందిందని వెల్లడించారు. అందువల్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడలేదన్నారు. భాజపా నాగాలాండ్‌ మహిళా మోర్చ అధ్యక్షురాలైన ఫన్‌గ్యాన్‌ కొన్యాక్‌ ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఏ) ఉమ్మడి అభ్యర్థినిగా నామినేషన్‌ వేశారు.

బుకర్‌ ప్రైజ్‌ పోటీలో తొలి హిందీ నవల

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ పోటీ కోసం ఎంపిక చేసిన 13 రచనల్లో రచయిత్రి గీతాంజలి శ్రీ హిందీ నవల అనువాదం ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ చోటు దక్కించుకొంది. లండన్‌లో ఈ జాబితాను ప్రకటించారు. సాహితీ పురస్కారాల్లో ఎంతో విశిష్టమైనదిగా భావించే బుకర్‌ ప్రైజ్‌కు పోటీ పడుతున్న తొలి హిందీ కాల్పనిక రచన ఇదే. గీతాంజలి శ్రీ రచన తొలుత ‘రేత్‌ సమాధి’ పేరిట ప్రచురితమైంది. డైసీ రాక్‌వెల్‌ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు. బుకర్‌ ప్రైజుకు ఎంపికైతే రూ.50 లక్షలు (జీబీపీ 50,000) నగదు బహుమానం అందజేస్తారు. దీన్ని రచయిత, అనువాదకుడికి సమానంగా పంచుతారు.

ఫెడెక్స్‌ సీఈఓగా రాజ్‌ సుబ్రమణియమ్‌

అమెరికాకు చెందిన బహుళ జాతి కొరియర్‌ సంస్థ ఫెడెక్స్‌కు తదుపరి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) భారత సంతతికి చెందిన రాజ్‌ సుబ్రమణియమ్‌ నియమితులయ్యారు. ఆ కంపెనీకి ప్రస్తుత ఛైర్మన్, సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్‌ డబ్ల్యూ స్మిత్‌ జూన్‌ 1న పదవీ విరమణ చేస్తారు. అప్పుడు సీఈఓగా రాజ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదాలో స్మిత్‌ కొనసాగుతారు. ‘ఫెడెక్స్‌ను విజయవంతంగా నడిపించే నాయకత్వ సామర్థ్యాలు రాజ్‌ సుబ్రమణియమ్‌కు ఉన్నాయని నాకు అపార విశ్వాసం ఉంద’ని స్మిత్‌ పేర్కొన్నారు. బోర్డు పాలనతో పాటు అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలపైనా దృష్టి సారిస్తానని స్మిత్‌ వివరించారు. స్మిత్‌ 1971లో ఫెడెక్స్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా 6,00,000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు.

2020 నుంచి ఫెడెక్స్‌ బోర్డులో సుబ్రమణియమ్‌ కొనసాగుతున్నారు. అంతక్రితం ఆ సంస్థకు ప్రెసిడెంట్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ), ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కెనడాలో ఫెడెక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రెసిడెంట్‌గానూ చేశారు. 1991లో ఫెడెక్స్‌లో చేరిన అనంతరం ఆసియా నుంచి అమెరికా వరకు యాజమాన్య, మార్కెటింగ్‌ హోదాల్లో పనిచేశారు.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన సుబ్రమణియమ్, ఫెడెక్స్‌ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఉన్న మెంఫిస్‌లో (టెనసీ) నివసిస్తున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్‌ పట్టా పొందిన ఈయన సిరక్యూజ్‌ యూనివర్సిటీలో ఇదే విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నుంచి ఎంబీఏ చేశారు.


ఆన్‌లైన్‌లో మోదీ స్ఫూర్తిదాయక కథలు

ప్రధాని మోదీ రాజకీయ వ్యూహాలెలా ఉండేవి? చిన్నప్పుడు ఆయనెలాంటి విషయాలపై ఆసక్తి చూపేవారు? సైనిక దళాలంటే ఆయనకు ఎందుకు అంత ప్రేమ.. ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనుకునేవారి కోసం పోర్టల్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రధాని జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలను ఆయన చిన్ననాటి స్నేహితులు, పాఠాలు నేర్పిన గురువులు, కలిసిన పనిచేసిన నేతలు పంచుకున్నారు. ‘‘ఎన్నికల ప్రచారానికి వెళ్లేటప్పుడు పిల్లల కోసం చాక్లెట్లు తీసుకొని వెళ్లమనేవారు.. ఆయనో గొప్ప ఎన్నికల వ్యూహకర్త’’ అని పంజాబ్‌కు చెందిన మనోరంజన్‌ కలియా తెలిపారు. మోదీ రాజకీయ జీవిత ప్రారంభ దశలో కలియా.. మోదీతో కలిసి పంజాబ్‌లో పనిచేశారు. ఇలా వివిధ వ్యక్తులు ప్రధానితో తమ అనుభవాలను, స్ఫూర్తిదాయక కథలను ఈ పోర్టల్‌లో వివరించారు. ఈ వెబ్‌సైట్‌ను మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ఆవిష్కరించారు.

రూ.100 కోట్ల ఎయిర్‌బస్‌ హెచ్‌145 హెలికాప్టర్‌

రూ.100 కోట్ల విలువైన ఎయిర్‌బస్‌ హెచ్‌145 హెలికాప్టర్‌ను ఆసియా ఖండంలోనే తొలిసారిగా నిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఆర్‌పీ గ్రూపు ఛైర్మన్‌ బి.రవి పిళ్లయ్‌ (68) సొంతం చేసుకున్నారు. కేరళలోని కోవలంలో ఆయనకు ఈ హెలికాప్టర్‌ అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 5 బ్లేడ్ల హెలికాప్టర్లు 1500 మాత్రమే ఉన్నాయి. సుమారు రూ.19,000 కోట్ల ఆస్తులు కలిగిన రవి పిళ్లయ్‌ గ్రూపులో 70,000 మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.

నుదుటిపై తిలకం.. అమెరికా వాయుసేన యూనిఫాంతో దర్శన్‌ షా ఘనత

అమెరికా వాయుసేనలో ఎయిర్‌మ్యాన్‌గా చేస్తున్న భారత సంతతి వ్యక్తి దర్శన్‌ షా అరుదైన ఘనత సాధించారు.

యూనిఫాంలో ఉన్న సమయంలోనూ నుదుటికి తిలకం పెట్టుకునేందుకు వాయుసేన నుంచి ప్రత్యేక అనుమతి పొందారు.

ఇందుకోసం అనేక ఏళ్లు శ్రమించిన ఆయన ఇప్పుడు తిలకంతో విధులకు హాజరవుతూ అందరి మన్ననలు పొందుతున్నారు.

ప్రస్తుతం వ్యోమింగ్‌లోని ఎఫ్‌ఈ వారెన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో దర్శన్‌ పనిచేస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22న తొలిసారి ఆయన తిలకం పెట్టుకుని విధులకు హాజరయ్యారు.


ఐరాస సలహామండలిలో జయతీ ఘోష్‌

భారతీయ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘సమర్థవంతమైన బహుపాక్షికత’పై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సలహామండలికి ఆమెను ఎంపిక చేసినట్లు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించారు.

లిబియా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ గ్రహీత ఎల్లెన్‌ జాన్సన్‌ సర్టీఫ్, స్వీడన్‌ మాజీ ప్రధాని స్టీఫన్‌ లోఫ్వెన్‌ సహా మొత్తం 12 మంది అంతర్జాతీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు ఈ సలహామండలిలో ఉన్నారు.

ప్రపంచం ఆందోళన చెందుతున్న కీలక సమస్యలను పాలనాపరంగా ఎలా పరిష్కరించాలో వీరు పరిశోధించి 2023లో నివేదిక ఇస్తారు.

జయతీ ఘోష్‌ ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్‌ అమ్హెర్ట్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఆర్థిక, సామాజిక వ్యవహారాలపై ఐరాస ఏర్పాటు చేసిన మరో ఉన్నతస్థాయి సలహామండలిలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు.


14 ఏళ్లకే 13 పుస్తకాల రచయిత

పుస్తకాలు, పద్యాలు, సినిమా రివ్యూలు రాస్తూ చిన్న వయసులోనే రచయితగా మారింది కేరళలోని కాసరగోడ్‌కు చెందిన 14 ఏళ్ల సనీషా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సనీషా ఇంగ్లిష్, మలయాళంలో పుస్తకాలు రాస్తూ రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. 6వ తరగతిలో ఉండగా రచనలపై పుట్టిన ఇష్టం ఆమెను ఇప్పటివరకు 13 పుస్తకాలు రాసేలా చేసింది. వివిధ నవలలు, చిన్నచిన్న కథలు, పద్యాలు రాసింది. అంతేకాదు రెండు వందల క్లాసికల్‌ చిత్రాలకు రివ్యూలు కూడా రాసింది. సనీషా ప్రతిభను గుర్తించిన కేరళ ప్రభుత్వం ‘ఉజ్వల బాల్యం’ పురస్కారాన్ని అందజేసింది. ఎన్‌ఎన్‌ కాక్కడ్‌ అవార్డు, రాయల్‌ కామన్‌వెల్త్‌ సొసైటీ అవార్డులనూ ఆ బాలిక అందుకుంది.

ఈ-వ్యర్థాలతో అద్భుత ఆవిష్కరణలు

వ్యర్థాలకు అర్థాన్నిచ్చేలా అస్సాంలోని ధురి జిల్లాలో డిగ్రీ చదువుతున్న రాహుల్‌ అనే యువకుడు పాడైపోయిన సెల్‌ఫోన్, కంప్యూటర్‌ భాగాలతో పలువురు ప్రముఖుల చిత్రాలను రూపొందిస్తున్నాడు.

మొదట్లో భారతీయ సంగీత కళాకారులైన నేహా కక్కర్, అర్మాన్‌ మాలిక్, హర్షదీప్‌ కౌర్‌ చిత్రాలను వేశాడు.

సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఆ చిత్రాలకు స్పందన రావడంతో కొత్త ఆలోచనలతో బొమ్మలు వేసే ప్రయత్నాల్లో విజయం సాధించాడు.

రాహుల్‌ తయారు చేసిన కొన్ని చిత్రాలు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకున్నాయి.


ప్రతిభావంతులైన ఇండో - అమెరికన్‌ మహిళలకు సత్కారం

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ విశేషమైన ప్రతిభ చూపిన ఇండియన్‌ - అమెరికన్‌ మహిళలను వాషింగ్టన్‌లో సత్కరించారు.

పదో వార్షిక కాంగ్రెస్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికన్‌ బహుళజాతి కూటమి, బహుళజాతి సలహా టాస్క్‌ఫోర్స్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

నిర్మాత - నటి రచనా షా, ఇండికా న్యూస్‌ వ్యవస్థాపకురాలు, జర్నలిస్ట్‌ రీతు ఝా.. డాక్టర్‌ కలాయ్‌ సి.పార్తీబన్, సామాజిక సేవా కార్యకర్తలు మధు రోహత్గి.. చందాని దువ్వూరి, నటి ఇంద్రాణి దవలూరి.. ప్రముఖ యాంకర్, హోస్ట్‌ నీలిమా మెహ్రా, సంఘసేవా కార్యకర్త సుహాగ్‌ మెహ్తా సత్కారం అందుకొన్నారు.


ప్రపంచ సుందరిగా కరోలినా

ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పోలండ్‌ యువతి కరోలినా బియలావ్‌స్కా (23) విజేతగా నిలిచింది. 2021 ఏడాదికిగానూ 96 దేశాల అందాల రాణులను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం కైవసం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత పోలండ్‌కు ఈ గౌరవాన్ని తెచ్చిన ఘనతను సాధించింది. ప్యూర్టోరికో రాజధాని సాన్‌ జ్వాన్‌లో నిర్వహించిన 70వ మిస్‌ వరల్డ్‌ తుది పోటీల కార్యక్రమంలో ఆమెను విజేతగా ప్రకటించారు. భారతీయ అమెరికన్‌ యువతి, మిస్‌ అమెరికా శ్రీ సైని తొలి రన్నరప్‌గా నిలిచింది. కోట్‌ డివార్‌ దేశానికి చెందిన సుందరి ఒలీవియా యేస్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది. మిస్‌ ఇండియా విజేత, తెలంగాణ యువతి మానస వారణాసికి నిరాశే మిగిలింది. ఆమె 13వ స్థానానికి పరిమితమైంది. ఈ పోటీలు గతేడాది డిసెంబరు 16న జరగాల్సి ఉండగా మానస వారణాసి సహా 17 మంది పోటీదారులు కరోనా బారినపడడంతో వాయిదా వేశారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో 2019 ప్రపంచ సుందరి, జమైకాకు చెందిన టోనీ-యాన్‌ సింగ్, కరోలినాకు కిరీటం అలంకరించింది.

శ్రీ సైని చిన్నతనంలోనే ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. ఆమెకు 12 ఏళ్ల వయసులోనే గుండె సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కారు ప్రమాదంలో ముఖంపై గాయాలయ్యాయి. 26 ఏళ్ల వయసుకే జీవితంలో ఇలా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నిటినీ మనో నిబ్బరంతో అధిగమించి అందాల పోటీలకు సిద్ధం కావడం, తొలి రన్నరప్‌గా నిలవడం విశేషం.


సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం ఛైర్‌పర్సన్‌గా సుచిత్ర ఎల్ల

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత విభాగానికి ఛైర్‌పర్సన్‌గా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల ఎన్నికయ్యారు. 2022 - 23 సంవత్సరానికి ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో ఆమె సీఐఐ - ఆంధ్రప్రదేశ్‌ ఛైర్‌పర్సన్, సీఐఐ - దక్షిణ ప్రాంత డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. సీఐఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలిగా కూడా ఉన్నారు. సీఐఐ - దక్షిణ ప్రాంత విభాగానికి 2022 - 23 సంవత్సరానికి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బాలి ఎన్నికయ్యారు. ఆయన వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌ - ఎండీగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సీఐఐ - కర్ణాటక ఛైర్మన్‌గా వ్యవహరించారు.

దేశీయంగా మైక్రోచిప్‌ల తయారీకి ప్రొఫెసర్‌ శాంతి పవన్‌ కృషి

5జీ వేగంతో కూడిన ఇంటర్‌నెట్‌ను అందించేందుకు అవసరమైన ఉపకరణాలను దేశీయంగా తయారు చేయడంలో తెలుగు శాస్త్రవేత్త సాగిస్తున్న కృషికి గుర్తింపు లభిôచింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ 50ఏళ్ల లోపు వయసున్న 75 మంది ఉత్తమ శాస్త్రవేత్తల జాబితాను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కాఫీటేబుల్‌ బుక్‌ రూపంలో ఇటీవల విడుదల చేసింది. ఈ పుస్తకంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ప్రొఫెసర్‌ యండ్లూరి శాంతి పవన్‌కు స్థానం దక్కింది. ఐఐటీ మద్రాస్‌లో అకడమిక్‌ రీసెర్చి డీన్‌గా ఉన్న ఆయన 5జీ స్పీడ్‌కు ఉరకలేస్తున్న భారత్‌ దిశను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేలా మొబైల్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, రూటర్, కెమెరా.. ఇలా విభిన్న ఉపకరణాల్లో సామర్థ్యం పెంచే మైక్రోచిప్‌ల పరిశోధనల్లో పాలుపంచుకుంటున్నారు. విదేశాల నుంచి మైక్రోచిప్, అనుబంధ సామగ్రిని దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే వాటిని తయారు చేసుకునేలా యువతను ప్రోత్సహిస్తున్నారు.

ప్రొఫెసర్‌ శాంతి పవన్‌ ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ చదివారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్లారు. ఆ అర్హతతో అక్కడి ప్రఖ్యాత ‘టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’లో శాస్త్రవేత్తగా చేరారు. 2012లో చిన్న వయసులోనే ప్రఖ్యాత శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు వచ్చింది. మరెన్నో పురస్కారాలు పొందారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో దేశ ప్రగతిని వివరించారు.


పంజాబ్‌ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి

పంజాబ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్‌మాన్‌ బృందంలో తెలుగు వ్యక్తికి కీలక స్థానం లభించింది. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి అరిబండి వేణుప్రసాద్‌ను నియమించారు. వేణుప్రసాద్‌ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న వాసి. ఆయన 1991లో ఐఏఎస్‌గా ఎంపికై పంజాబ్‌ క్యాడర్‌లో పనిచేస్తున్నారు. ఫరీద్‌కోట్, జలంధర్‌ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర విద్యుత్తు సంస్థ సీఎండీగా పనిచేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో ఇంటర్, బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ, రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ ఎంఎస్సీ పూర్తి చేశారు.

చల్లని ఇటుకలకు భారత ప్రభుత్వ పేటెంటు

వేసవిలో ఇంట్లో నాలుగ్గోడల మధ్య ఉండాలంటే భరించలేనంత వేడితో అల్లాడిపోతుంటాం. ఈ నేపథ్యంలో వేసవి పూట ఇళ్లు చల్లగా ఉండటానికి వరంగల్‌ ఎన్‌ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శశిరాం ప్రత్యేక ఇటుకలను రూపొందించి భారత ప్రభుత్వం నుంచి పేటెంటు పొందారు. బొగ్గు నుంచి తయారైన బూడిదను తక్కువగా వినియోగించి, వ్యవసాయ వ్యర్థాలు, కలప మిశ్రమం కలిపి తక్కువ ఖర్చుతో వీటిని రూపొందించారు. వీటిని ‘కో ఫైర్డ్‌ బ్లెండెడ్‌ యాష్‌ బ్రిక్స్‌’ అని పిలుస్తారు. సాధారణంగా మట్టితో చేసిన ఎరుపు ఇటుకల్లో ఉష్ణవాహకం మెట్రిక్‌ కెల్విన్‌లో 1.2 వాట్ వరకు ఉంటే వీటిలో 0.5 ఉష్ణవాహకం మాత్రమే ఉంటుందని, దీని వల్ల వేడి తగ్గి గది చల్లగా ఉంటుందని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తెలిపారు. ఈ పరిశోధనను నాగ్‌పుర్‌లోని వీఎన్‌ఐటీలో తన పీహెచ్‌డీలో భాగంగా చేశానని, 2017లో దరఖాస్తు చేసుకుంటే ఇటీవలే పేటెంటు వచ్చిందని డా. శశిరాం వివరించారు.

174 ఏళ్ల హైదరాబాద్‌ పోలీసు చరిత్రలో తొలి మహిళా ఇన్‌స్పెక్టర్‌

హైదరాబాద్‌ నగర పోలీస్‌ విభాగం చరిత్రలో తొలిసారిగా శాంతి భద్రతల ఠాణాకు ఇన్‌స్పెక్టర్‌గా ఓ మహిళ బాధ్యతలు చేపట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా లాలాగూడ స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌గా మధులతను నియమించారు. ఇంతవరకు ట్రాఫిక్, సీసీఎస్, మహిళా పోలీస్‌ స్టేషన్లలోనే మహిళా ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తుండగా తొలిసారి శాంతిభద్రతల ఠాణాకు మహిళను నియమించారు.

100 కిలోల కేక్‌తో అద్భుత కళాఖండం

మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దేవ్‌ అనే యువతి కేక్‌ పీస్‌లతో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించారు. దాదాపు 1500 పీస్‌లతో ఇటలీలోని ప్రసిద్ధ స్మారకం మిలన్‌ కేథడ్రల్‌ (క్రైస్తవుల ప్రార్థనాలయం)ను అచ్చుగుద్దినట్లుగా రూపొందించారు. ఈ 100 కేజీల కళాకృతి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది.