ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ హఠాన్మరణం
ఫాస్ట్‌బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న సమయంలో పేసర్లకు స్వర్గధామం లాంటి ఆస్ట్రేలియా పిచ్‌లపై తన లెగ్‌స్పిన్‌తో సరికొత్త చరిత్ర లిఖించిన దిగ్గజం 52 ఏళ్ల షేన్‌వార్న్ థాయ్‌లాండ్‌లోని రెండో అతి పెద్ద ద్వీపమైన కోహ్ సమూయిలోని తన విల్లాలో మరణించారు. 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800) తర్వాత వార్న్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 194 వన్డేల్లో 293 వికెట్లు సాధించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్న్ 2013లో అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 1999 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా విభిన్న పాత్రలు పోషించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు 2007లో వీడ్కోలు పలికిన వార్న్ 2008లో ఆరంభమైన ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. తొలి సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేని రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలిపాడు. కెప్టెన్‌గా తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టాడు. బౌలింగ్‌లోనూ రాణించి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. 2011 వరకూ ఆ జట్టుతోనే ఉన్నాడు. కెప్టెన్‌గానే కాక కోచ్‌గానూ పని చేశాడు.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రోడ్రిగ్స్ మరణం
భారత సైన్యానికి 1990 నుంచి ‘93 వరకు సారథ్యం వహించిన జనరల్ (రిటైర్డ్) సునీథ్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ (88) మరణించారు. ఈయన 2004 నుంచి 2010 వరకు పంజాబ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. సైన్యంలో 40 ఏళ్లకు పైగా విశిష్టమైన సేవలందించిన రోడ్రిగ్స్ రెండు పర్యాయాలు జాతీయ భద్రతా సలహా మండలిలోనూ పనిచేశారు. పదవీ విరమణ తర్వాత సామాజిక, సాహిత్య కార్యకలాపాల్లో ఎక్కువ సమయం గడిపారు. వ్యూహ రచనలపై పలు ప్రసంగాలు చేశారు.
ఆంధ్ర నాట్య కళాకారిణి డా. సువర్చలాదేవి మరణం
సుప్రసిద్ధ నాట్య కళాకారిణి, గురువు డా.కాశీ సువర్చలాదేవి (53) మరణించారు. తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించిన సువర్చలాదేవి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆంధ్రనాట్యం అధ్యాపకురాలిగా పని చేస్తున్న ఆమె నృత్య శిక్షణాలయం కూడా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మరణం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) న్యుమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో మరణించారు. ఆమె సూర్యాపేట పాత తాలూకా కరివిరాల కొత్తగూడెంలో 500 ఎకరాల భూస్వామి భీమ్‌రెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు మూడో సంతానంగా 1930లో జన్మించారు. 1945-46 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం గడగడలాడించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు ప్రజా ఉద్యమాల్లో, రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆమె రెండుసార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్‌బెన్ జోషీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కుముద్‌బెన్ మణిశంకర్ జోషీ (88) దీర్ఘకాల అనారోగ్యంతో మరణించారు. తన స్వస్థలమైన గుజరాత్‌లోని నవ్సారీ జిల్లా ధరోరి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. గుజరాత్ నుంచి గవర్నర్ అయిన తొలి మహిళగా కుముద్‌బెన్ రికార్డులకెక్కారు. 1973 నుంచి 1985 వరకు మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ; సమాచార శాఖల మంత్రిగా సేవలందించారు. 1985-1990 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీతో ఆమెకు పొసిగేది కాదు. కాంగ్రెస్ ఏజెంటుగా పనిచేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గవర్నర్‌గా మొత్తం 23 జిల్లాల్లో 108 సార్లు పర్యటించి రికార్డు సృష్టించారు.
గుర్జర్ల నేత కిరోడీ సింగ్ భైంస్లా మరణం
గుర్జర్ సామాజిక వర్గంలోని ప్రముఖ నేత కిరోడీ సింగ్ భైంస్లా (84) మరణించారు. కర్నల్ హోదాలో సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత కిరోడీ సింగ్ గుర్జర్ల రిజర్వేషన్ల కోసం 2007లో తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు. ఆ ఆందోళనలో దాదాపు 72 మంది చనిపోయారు. కిరోడీ ఒక్క పిలుపుతో రాజస్థాన్ స్తంభించేది. బస్సులు, రైళ్లు ఆగిపోయేవి. ఆయన పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం గుర్జర్లకు 5% రిజర్వేషన్ కల్పించింది. ఆ తర్వాత భాజపాలో చేరిన భైంస్లా ఆ పార్టీ టికెట్ మీద 2009లో లోక్‌సభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు.
అమెరికా విదేశీ వ్యవహారాల తొలి మహిళా మంత్రి ఆల్‌బ్రైట్ మరణం
అమెరికా విదేశీ వ్యవహారాల తొలి మహిళా మంత్రి మెడెలీన్ ఆల్‌బ్రైట్ (85) మృతి చెందారు. ఆమె కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో (1996) ఆల్‌బ్రైట్‌కు కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను కేటాయించారు.
సోలార్ ఎనర్జీతో పాతికేళ్లు బతికిన హీరా రతన్ మానెక్ మరణం
ఆహారం తీసుకోకుండా ఏళ్ల పాటు జీవనం సాగించిన హీరా రతన్ మానెక్ (84) మరణించారు. కేరళలోని కోజికోడ్ జిల్లా చకోరతుకులంలోని తన ఫ్లాట్‌లో ఆయన మృతిచెందారు.
1995 నుంచి మానెక్ ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. నీరు, సోలార్ ఎనర్జీతో గడిపేస్తున్నారు. శరీరంపై పడే సూర్యరశ్మిని గ్రహించి బతికేవాడినని ఆయన చెప్పేవారు.
మానెక్ కుటుంబానిది గుజరాత్‌లోని కచ్. పడవల వ్యాపారం చేసే ఆయనకు సోలార్ హీలింగ్ గురించి 1962లో తెలిసింది.
పుదుచ్చేరిలోని అరబిందో ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత సూర్యుడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.
1992 నుంచి సూర్యుడిని దైవంలా కొలవడం ప్రారంభించారు. తొలుత సెకన్ల పాటే సూర్యుడిని నేరుగా చూడటం అలవాటు చేసుకున్న ఆయన.. క్రమంగా ఆ సమయాన్ని గంట వరకు పెంచుకోగలిగారు.
ఇలా చేయడం ద్వారా శరీరంలో శక్తి పెరుగుతుందని చెప్పేవారు. ఫలితంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతుండేవారు.
1995లో కోజికోడ్‌లో డాక్టర్ సీకే రామచంద్రన్ పర్యవేక్షణలో 213 రోజుల పాటు ఉపవాసం చేశారు మానెక్. సూర్యరశ్మిలోనే గడుపుతూ దాహమైనప్పుడు నీరు తాగి ఈ ఉపవాసంలో పాల్గొన్నారు.
2000 జనవరి 1 నుంచి 2002 ఫిబ్రవరి 15 వరకు 411 రోజుల పాటు అహ్మదాబాద్‌లో ఉపవాసం చేశారు. దీంతో మానెక్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.
ప్రముఖ గేయ రచయిత కందికొండ మరణం
బతుకమ్మ పాటలతో జానపదాన్ని జనాలకు మరింత చేరువ చేసిన, తెలంగాణ సాహిత్య పరిపుష్టికి కృషిచేసి 1200లకు పైగా పాటలకు అక్షరాలు కూర్చిన పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆయన అసలు పేరు కందికొండ యాదగిరి. పదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్ మోతీ నగర్ సమీపంలోని కల్యాణ్‌నగర్‌లో మరణించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపలికి చెందిన కందికొండ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. కందికొండకు ఇంటర్ చదువుతున్నప్పుడు సినీ సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరీ జగన్నాథ్ తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో ‘మళ్లీ కూయవే గువ్వా’ ఆయన తొలి గీతం. అక్కడి నుంచి వరుస అవకాశాలు వరించాయి. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘సత్యం’, ‘పోకిరి’, ‘టెంపర్’ తదితర చిత్రాల్లో పాటలు రాశారు. 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. ఇటీవల ‘కోతలరాయుడు’చిత్రానికి రాసిన పాట ఆఖరిది.
పంది గుండె అమర్చిన వ్యక్తి మరణం
ప్రపంచ వైద్య చరిత్రలోనే మొదటి సారిగా పంది గుండెను శస్త్రచికిత్స ద్వారా అమర్చిన వ్యక్తి మరణించారు. డేవిడ్ బెన్నెట్ (57)కు జనవరి 7న అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండె మార్పిడి జరిగింది. అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా ఈ శస్త్రచికిత్సను భావించారు. కొద్ది రోజులుగా అతడి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని, అయితే, మరణానికి కచ్చితమైన కారణాన్ని వివరించలేదు.గతంలో జంతువుల అవయవాలను అమర్చిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీంతో మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రి వైద్యులు జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను డేవిడ్ బెన్నెట్‌కు అమర్చారు. 1984లో ఒక రకం కోతి గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా 21 రోజులు మాత్రమే జీవించారు. ఆ శస్త్ర చికిత్సతో పోల్చితే డేవిడ్ బెన్నెట్‌పై జరిగిన ప్రయోగం మెరుగైన ఫలితాలనే సాధించిందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
పాక్ మాజీ అధ్యక్షుడు రఫిక్ తరార్ మరణం
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయవేత్త రఫిక్ తరార్ (92) మరణించారు. 1997 - 2001 మధ్య పాకిస్థాన్‌కు అధ్యక్షుడిగా సేవలు అందించారు. పీఎంఎల్-ఎన్ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేయక ముందు ఆయన 1991 - 94 మధ్య ఆ దేశ సుప్రీంకోర్టు జడ్జిగా విధులు నిర్వహించారు.
పాలస్తీనాలో భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మరణం
పాలస్తీనాలోని రమల్లా నగరంలో భారత ప్రతినిధి ముకుల్ ఆర్య (38) మరణించారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. 2008 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ అధికారి అయిన ఆర్య మృతికి కారణం ఏమిటన్నది తెలియరాలేద]ు. పాలస్తీనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రియాద్ అల్ మాలికి సహా ఆ దేశ నాయకులు పలువురు ముకుల్ మృతికి సంతాపం ప్రకటించారు.