నియామకాలు

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ గౌరవ అధ్యక్షుడిగా అజయ్‌మిశ్రా బాధ్యతల స్వీకరణ

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజయ్‌మిశ్రా హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

జీనోమ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా కేవీ చౌదరి

జీనోమ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మాజీ కమిషనర్‌ కేవీ చౌదరి ఎన్నికయ్యారు. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ డాక్టర్‌ సి.రంగరాజన్‌ ప్రస్తుతం జీనోమ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కొత్త ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో రంగరాజన్‌ను గౌరవ ఛైర్మన్‌గా కొనసాగాలని కోరారు. కేవీ చౌదరి ఏప్రిల్‌ 2న జీనోమ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

అసోచామ్‌ అధ్యక్షుడిగా సుమంత్‌ బాధ్యతల స్వీకరణ

రెన్యూ పవర్‌ వ్యవస్థాపక ఛైర్మన్, సీఈఓ సుమంత్‌ సిన్హా అసోచామ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. స్పైస్‌జెట్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ అసోచామ్‌ నూతన సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ‘అధ్యక్షుడిగా నా పదవీ కాలంలో అసోచామ్‌ సహచరులతో కలిసి పని చేసి ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆకాంక్షల మేరకు స్వావలంబన భారత్‌ దిశగా దేశాన్ని నడిపించేందుకు కృషి చేస్తాన’ని సుమంత్‌ వెల్లడించారు. ‘రంగాల వారీ ధోరణులపై అసోచామ్‌ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తుంది. ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, పరిశ్రమ వృద్ధికి సహకరిస్తామ’ని అజయ్‌సింగ్‌ పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా కె.సుజన

తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా అడ్మినిస్ట్రేటివ్‌ రిజిస్ట్రార్‌ కె.సుజన నియమితులయ్యారు. గతంలో ఉన్న రిజిస్ట్రార్‌ జనరల్‌ నాగార్జున్‌ న్యాయమూర్తిగా నియమితులుకావడంతో ఆయన స్థానంలో కె.సుజన బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ బాధ్యతలతో పాటు అడ్మినిస్ట్రేషన్, రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టుల ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఐడబ్ల్యూఎన్‌ దక్షిణప్రాంత ఛైర్‌ఉమన్‌గా శోభా దీక్షిత్‌

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అనుబంధ సంస్థ ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ (ఐడబ్ల్యూఎన్‌) దక్షిణ ప్రాంత ఛైర్‌ఉమన్‌గా అల్‌ప్లా ఇండియా డైరెక్టర్‌ శోభా దీక్షిత్‌ బాధ్యతలు స్వీకరించారు. 2022 - 23 సంవత్సరానికి ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో తెలంగాణ ఐడబ్ల్యూఎన్‌కు ఛైర్‌ఉమన్‌గా రెండేళ్ల పాటు ఆమె పనిచేశారు. దక్షిణ ప్రాంత డిప్యూటీ ఛైర్‌ఉమన్‌గా విశాఖపట్నంలోని పాత్రా ఇండియా బీపీఓ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ ముక్కవిల్లి ఎంపికయ్యారు. గతంలో ఐడబ్ల్యూఎన్‌ ఆంధ్రప్రదేశ్‌ విభాగానికి ఛైర్‌ఉమన్‌గా ఆమె వ్యవహరించారు.

అమెరికా కొవిడ్‌ రెస్పాన్స్‌ కోఆర్డినేటర్‌గా ఆశిష్‌ ఝా

శ్వేతసౌధం ‘కొవిడ్‌-19 రెస్పాన్స్‌ కోఆర్డినేటర్‌’గా భారతీయ - అమెరికన్‌ ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్‌ ఆశిష్‌ ఝాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న జెఫ్‌ జియెంట్స్‌ ఏప్రిల్‌లో దాన్ని వీడనున్నారు. ఆశిష్‌ ఝా బ్రౌన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డీన్‌గా పనిచేస్తున్నారు. 51 ఏళ్ల ఝా బిహార్‌లో జన్మించారు.

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్‌రాజ్‌

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వికాస్‌రాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో గత కొన్ని రోజులుగా మరో ఐఏఎస్‌ అధికారి బుద్ధ ప్రకాశ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

ఆయిల్‌ ఇండియా ఛైర్మన్‌గా రంజిత్‌ రథ్‌

ప్రభుత్వ రంగ ఆయిల్‌ ఇండియా ఛైర్మన్‌గా రంజిత్‌ రథ్‌ను (50) ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక బోర్డు (పీఈఎస్‌బీ) ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఈసీఎల్‌) సీఎండీగా ఉన్నారు. మొత్తం అయిదుగురిని ఇంటర్వ్యూ చేసిన బోర్డు రథ్‌ వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం సంస్థ ఛైర్మన్, ఎండీగా ఉన్న సుశీల్‌ చంద్ర జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అవినీతి నిరోధక సంస్థలు సీవీసీ, సీబీఐల నుంచి క్లియరెన్స్‌ లభించాక రథ్‌ పేరును ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీకి పంపనున్నారు. రథ్‌ ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పుర్‌ పూర్వ విద్యార్థి. ఎంఈసీఎల్‌లో పని చేయడానికి ముందు ఇంజినీర్స్‌ ఇండియాలో జనరల్‌ మేనేజర్‌గా, అంతకుముందు ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌ లిమిటెడ్‌లోనూ పని చేశారు. రథ్‌ను 2021 జూన్‌ 28న భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ సీఎండీగా పీఈఎస్‌బీ ఎంపిక చేసింది. కానీ తర్వాత ఆ పదవీ బాధ్యతల్ని అదే సంస్థలో ఫైనాన్స్‌ విభాగానికి సంచాలకుడిగా ఉన్న సమీరన్‌ దత్తా స్వీకరించారు. రథ్‌ నియామకాన్ని గతేడాది ఏ కారణంతో నిలిపివేశారో వెల్లడించలేదు.

ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌గా దేవాశిష్‌ పాండా

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నూతన ఛైర్మన్‌గా ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి దేవాశిష్‌ పాండాను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉండేందుకు మంత్రివర్గ నియామకాల సంఘం అనుమతినిచ్చింది. ఈయన 1987 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్ర ఆర్థిక సేవల విభాగానికి రెండేళ్లపాటు కార్యదర్శిగా పనిచేసి జనవరిలో పదవీ విరమణ చేశారు.

ఆకాంక్షిత జిల్లా కేంద్ర పర్యవేక్షక అధికారిగా యువరాజ్‌

కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత (యాస్పిరేషనల్‌) జిల్లాగా గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెంకు కేంద్ర పర్యవేక్షక అధికారి (సీపీవో)గా ఐఏఎస్‌ అధికారి, కేంద్ర ఔషధాల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని వంద జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు వీలుగా 2018లో కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్‌ ద్వారా ఆకాంక్షిత జిల్లాల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో రాష్ట్రం నుంచి కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంను కేంద్రం గుర్తించింది.

సెబీ పూర్తి కాల సభ్యుడిగా ఎస్‌బీఐ ఎండీ అశ్వినీ భాటియా

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టరు అశ్వినీ భాటియాను సెబీలో పూర్తి కాల సభ్యుడిగా (డబ్ల్యూటీఎం) ప్రభుత్వం నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్ల పాటు భాటియా ఆ పదవిలో కొనసాగుతారు. భాటియా నియామక ప్రతిపాదనకు నియామకాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (ఏసీసీ) ఆమోదం తెలిపినట్లు వెల్లడించాయి. సెబీలో ఇంకా ఒకరికి మాత్రమే డబ్ల్యూటీఎంగా నియమితులయ్యే అవకాశముంది. 2020, ఆగస్టులో ఎస్‌బీఐ ఎండీగా భాటియా నియమితులయ్యారు. ఈ ఏడాది మేలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి

తెరాస ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి శాసనమండలి ఛైర్మన్‌ పదవి ఖరారైంది. ఛైర్మన్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్‌ అనుమతి కోసం పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాజ్‌భవన్‌ నుంచి అనుమతి వచ్చాక నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. మరుసటి రోజు నామినేషన్ల దాఖలుకు గడువిచ్చి, ఎన్నిక నిర్వహిస్తారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓగా సంజీవ్‌ కపూర్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ)గా సంజీవ్‌ కపూర్‌ నియమితులయ్యారు. ఏప్రిల్‌ 4న ఆయన బాధ్యతలు చేపడతారని సంస్థ తెలిపింది. కంపెనీ సీఎఫ్‌ఓగా శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ పూర్వ సీఈఓ విపులా గుణతిలెకాను నియమించిన కొన్ని రోజుల్లోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ కీలక నియామకం చేపట్టింది. ప్రస్తుతం ఒబెరాయ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ అధ్యక్షుడిగా సంజీవ్‌ కపూర్‌ వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు స్పైస్‌జెట్, గో ఎయిర్, విస్తారా వంటి దేశీయ విమానయాన సంస్థల్లో ఆయన పలు పదవులు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు 2019న నిలిచిపోయాయి. కొత్త ప్రమోటర్లు జలాన్‌-కల్‌రాక్‌ కన్సార్షియం నేతృత్వంలో సంస్థ కార్యకలాపాల పునరుద్ధరణ ప్రక్రియ నడుస్తోంది.

ఎల్‌ఐసీ సీఎఫ్‌ఓగా సునీల్‌ అగర్వాల్‌

పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఎల్‌ఐసీ తమ ముఖ్య ఆర్థిక అధికారిగా (సీఎఫ్‌ఓ) సునీల్‌ అగర్వాల్‌ను నియమించుకుంది. ఆయన బాధ్యతలు స్వీకరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎఫ్‌ఓను బయటి నుంచి నియమించుకోవడం ఎల్‌ఐసీ కి ఇదే తొలిసారి. ఈయనకు ముందు ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శుభాంగి సంజయ్‌ సోమన్‌ సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. అగర్వాల్‌ ఎల్‌ఐసీలోకి రావడానికి ముందు రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 12 ఏళ్లపాటు పని చేశారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లోనూ 5 ఏళ్లు పని చేశారు.

కేబినెట్‌ సెక్రటేరియట్‌ భద్రతా విభాగం కార్యదర్శిగా వీఎస్‌కే కౌముది

కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ భద్రతా విభాగం కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి వీఎస్‌కే కౌముదికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం హోంశాఖ అంతర్గత భద్రతా విభాగం ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయనకు కేబినెట్‌ సెక్రటేరియట్‌ బాధ్యతలు అప్పగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఆయన ఈ రెండు బాధ్యతలూ నిర్వర్తిస్తారు. ఇప్పటివరకూ కేబినెట్‌ సెక్రటేరియట్‌ భద్రతా విభాగం కార్యదర్శిగా ఉన్న మధ్యప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి సుధీర్‌కుమార్‌ సక్సేనాను ఆ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయడంతో ఇప్పుడు ఆ బాధ్యతలను కౌముదికి అప్పగించారు.

సీఐఐ తెలంగాణ విభాగం ఛైర్మన్‌గా వాగిశ్‌ దీక్షిత్‌

2022 - 23 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగ ఛైర్మన్‌గా వాగిశ్‌ దీక్షిత్‌ ఎన్నికయ్యారు. అల్ల్పా వరల్డ్‌వైడ్‌లో చీఫ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఆఫీసర్‌గానూ, భారత్‌లోని అల్ల్పా గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ దీక్షిత్‌ ఉన్నారు. 2021 - 22లో ఈయన సీఐఐ తెలంగాణకు వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. సీఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శేఖర్‌ రెడ్డి వైస్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఈయన సీఐఐ తెలంగాణ రియల్‌ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్యానెల్‌లో కన్వీనర్‌గా కొనసాగారు.