జాతీయం

అస్సాం, మణిపుర్, నాగాలాండ్‌లో ప్రత్యేక చట్ట పరిధి కుదింపు

దశాబ్దాలుగా ఈశాన్య భారతంలో కొనసాగుతున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగాలాండ్, అస్సాం, మణిపుర్‌ రాష్ట్రాల్లో ఈ చట్ట పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడంలేదని, ఈ మూడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుందని హోంశాఖ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో నాగాలాండ్‌లోని మోన్‌లో కూలీలను ఉగ్రవాదులుగా పొరబడి భారత గస్తీ దళం కాల్పులు జరపడంతో 14 మంది మృతి చెందారు. అప్పటి నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏను ఉపసంహరించాలని డిమాండ్‌ ఊపందుకుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం తాజా నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వరుస ట్వీట్లలో వెల్లడించారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణాయక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల తర్వాత నాగాలాండ్, అస్సాం, మణిపుర్‌లోని ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిని కుదిస్తున్నాం’’ అని తెలిపారు.

హాఫ్కిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కొవాగ్జిన్‌ ఉత్పత్తి కోసం ఆర్థిక సాయానికి మహారాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ప్రభుత్వ రంగ హాఫ్కిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కొవాగ్జిన్‌ టీకా డోసులను ఉత్పత్తి చేయడం కోసం ఆర్థిక సహాయం అందజేయాలని మహారాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన ఉత్పత్తి సాంకేతికతకు అనుగుణంగా హాఫ్కిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. అక్కడి సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. పరిశోధన, ప్రయోగ పరీక్షల కోసం బీఎస్‌ఎల్‌-3 లేబొరేటరీ అప్‌గ్రెడేషన్‌కూ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచడం కోసం హాఫ్కిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఉపయోగించుకోవాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించడం గమనార్హం.

చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

చార్టర్డ్‌ అకౌంటెంట్స్, కాస్ట్‌ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రెటరీస్‌ సంస్థల్లో సంస్కరణలకు ఉద్దేశించిన సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆయా సంస్థల స్వయంప్రతిపత్తిపై ఈ బిల్లు ప్రభావం చూపదని, వాటి పనితీరు, జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. ఈ మూడు సంస్థలు.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (గతంలో ఐసీడబ్ల్యూఏఐ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియాలోని (ఐసీఎస్‌ఐ) క్రమశిక్షణ సంఘాలకు ఆయా వృత్త్యేతర నిపుణులను నియమించడానికి అనువుగా ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. ఈ మూడు సంస్థల్లోని భాగస్వాములు తప్పిదానికి పాల్పడితే విధించే జరిమానాల మొత్తాన్ని పెంచేందుకు బిల్లు ప్రతిపాదించింది. విపక్ష సభ్యుల వ్యతిరేకత మధ్య లోక్‌సభ బిల్లును ఆమోదించింది.

రక్షణ బలగాలకు 15 పోరాట హెలికాప్టర్లకు భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం

దేశీయంగా అభివృద్ధి చేసే 15 తేలికపాటి పోరాట హెలికాప్టర్లను (ఎల్‌సీహెచ్‌) రూ.3,887 కోట్లతో సముపార్జించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) నిర్ణయించింది. ఇందులో 10 హెలికాప్టర్లు వాయుసేనకు, మిగిలిన 5 సైన్యానికి అందనున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) పరిమిత సిరీస్‌ ఉత్పత్తి (ఎల్‌ఎస్‌పీ) విధానం ప్రాతిపదికన ఈ హెలికాప్టర్లను ఉత్పత్తి చేయనుంది. 10 మెగా పవర్‌ ప్రాజెక్టులకు ఊరట ధ్రువీకృత ‘మెగా’ ప్రాజెక్టులుగా అవతరించేందుకుగాను అవసరమైన ధ్రువపత్రాలను పన్ను అధీకృత సంస్థలకు సమర్పించడానికి నిర్దేశించిన కాలపరిమితిపై 10 ప్రొవిజనల్‌ మెగా పవర్‌ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఊరట కల్పించింది. సంబంధిత గడువును 36 నెలల పాటు పొడిగించింది. దీంతో ఆయా మెగా పవర్‌ ప్రాజెక్టులు భవిష్యత్తులో జరిగే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు బిడ్లు దాఖలు చేసి, పాలసీ ప్రకారం పన్ను రాయితీలు పొందడానికి వీలవుతుందని కేంద్రం పేర్కొంది. పూర్తిగా, లేదంటే పాక్షికంగా ప్రారంభమైన 10 ప్రొవిజినల్‌ మెగా పవర్‌ ప్రాజెక్టులు తుది మెగా ధ్రువీకరణ పత్రాలను సమర్పించడానికి ఇప్పటివరకు 120 నెలల సమయం ఉండగా తాజా పెంపుతో అది 156 నెలలకు చేరనుంది.

ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు రూ.6,062 కోట్ల పథకానికి ఆమోదించిన కేంద్ర మంత్రిమండలి

సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు మార్కెట్, రుణాలు అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రపంచ బ్యాంకు సాయం కలిగిన రూ.6,062 కోట్ల పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల కోసం 808 మిలియన్‌ డాలర్లు లేదా రూ.6062.45 కోట్ల ‘రైజింగ్‌ అండ్‌ యాక్సిలరేటింగ్‌ ఎమ్‌ఎస్‌ఎమ్‌ ఫెర్ఫామెన్స్‌’కు (ఆర్‌ఏఎమ్‌పీ) ఆమోదం తెలిపినట్లు అధికారికంగా ప్రకటించింది. 2022 - 23 నుంచి ఆర్‌ఏఎమ్‌పీ ప్రారంభమవుతుంది. ఈ పథకం కింద కేటాయించిన మొత్తంలో రూ.3750 కోట్లు (500 మిలియన్‌ డాలర్లు) ప్రపంచ బ్యాంకు రుణం ద్వారా మిగతా రూ.2312.45 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అందజేస్తారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ మంత్రిత్వ శాఖ కింద ఆర్‌ఏఎమ్‌పీ పనిచేస్తుంది. కరోనా పరిణామాల నుంచి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల రివకరీకి, వాటిని బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.

అసోం - మేఘాలయ రాష్ట్రాల చరిత్రాత్మక ఒప్పందం

అసోం, మేఘాలయ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు సృష్టిస్తున్న సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం జరిగిన చరిత్రాత్మక ఒప్పందంపై అసోం, మేఘాలయ ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, కాన్రాడ్‌ సంగ్మాలు సంతకాలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో దిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. అసోం, మేఘాలయ 884 కి.మీ. మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య 12 వివాదాస్పద ప్రాంతాల్లో తొలుత ఆరు సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఇటీవల ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాయి. దీని ప్రకారం.. వివాదంగా ఉన్న 36.79 చ.కి.మీ. భూభాగంలో 18.51 చ.కి.మీ. అసోం వద్ద ఉండనుండగా మిగతా 18.28 చ.కి.మీ. మేఘాలయకు చెందేలా అంగీకారం కుదిరింది. 1972లో అసోం నుంచి మేఘాలయ విడిపోయిన సమయంలో తొలిసారి ఈ వివాదం ఉత్పన్నమైంది. తాజా ఒప్పందంతో ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

బడ్జెట్‌కు పార్లమెంట్‌ ఆమోదం

కేంద్ర బడ్జెట్‌ 2022 - 23కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ, ఆర్థిక బిల్లులను (2022) రాజ్యసభ ఎలాంటి మార్పులు లేకుండా తిప్పి పంపింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2022 - 23 బడ్జెట్‌ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తుందని రాజ్యసభలో ఆమె చెప్పారు. ఈ రెండు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. పీఎంఏవై ఇళ్లపై యాజమాన్య హక్కులతో మహిళా సాధికారత: ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద నిర్మిస్తున్న గృహాలపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పిస్తుండటంతో కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో వారి గళానికి బలం చేకూరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళా సాధికారతకు అది దోహదపడుతోందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో పీఎంఏవై - గ్రామీణ్‌ కింద నిర్మించిన 5.21 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 కోట్ల ఇళ్లను పీఎంఏవై కింద నిర్మించాం. వాటిలో దాదాపు 2 కోట్ల గృహాలకు మహిళలు సహ యజమానులుగా ఉన్నారు అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా.. వచ్చే 12 నెలల్లో ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు (సరస్సులు) నిర్మించేలా ప్రతినబూనుదామని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. దీనికోసం అవసరమైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

గోవా సీఎంగా రెండోసారి సావంత్‌ ప్రమాణం

గోవాలో భాజపా నేతృత్వంలో కొత్త సర్కారు కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్‌ నేత ప్రమోద్‌ సావంత్‌ రెండోసారి ప్రమాణం చేశారు. పనాజీ సమీపంలోని బాంబోలిమ్‌ వద్ద డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 48 ఏళ్ల సావంత్‌తో పాటు మరో 8 మంది భాజపా ఎమ్మెల్యేలతో గోవా గవర్నర్‌ పి.ఎస్‌.శ్రీధరన్‌ పిళ్లై కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు.

ముగిసిన వింగ్స్‌ ఇండియా - 2022 ప్రదర్శన

నాలుగు రోజులుగా సందర్శకులను అలరించిన వింగ్స్‌ ఇండియా - 2022 ప్రదర్శన ముగిసింది. పౌరవిమానయాన శాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహించారు. 125 మంది ఎగ్జిబిటర్లు, 5 వేల మంది బిజినెస్‌ డెలిగేట్లు, 60 వేల మంది సాధారణ సందర్శకులు పాల్గొన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సారంగ్‌ బృందం ఆధ్వర్యంలో అద్భుతమైన హెలికాప్టర్‌ ఏరోబాటిక్స్‌ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. తదుపరి వింగ్స్‌ ఇండియా షో బేగంపేట విమానాశ్రయంలో 2024 మార్చి 14 - 17 మధ్య నిర్వహించనున్నారు. పలు ఒప్పందాలు.. నాలుగు రోజుల ప్రదర్శనలో భాగంగా పలు ఒప్పందాలు కుదిరాయి. ఔషధ పంపిణీ, వ్యవసాయం, ఎర్త్‌ సర్వైలెన్స్‌ లాంటి అనువర్తనాల కోసం మల్టీకాప్టర్‌ డ్రోన్‌లపై సాంకేతికత బదిలీ కోసం నేషనల్‌ ఎయిరోస్పేస్‌ లేబొరేటరీస్, సైంటెక్‌ టెక్నాలజీస్‌ మధ్య ఒప్పందం కుదిరింది.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రైల్వే ఫుట్‌ఓవర్‌ వంతెన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడా జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద దేశంలోనే మొదటి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫుట్‌ఓవర్‌ వంతెన ఏర్పాటైందని వాల్తేర్‌ రైల్వే డీఆర్‌ఎం అనూప్‌ శత్పథి తెలిపారు. జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ తరుణ్‌ఖుల్బే, సేల్స్‌హెడ్‌ రాజీవ్‌గార్గ్‌లతో కలసి దీన్ని ప్రారంభించారు. తుప్పు ముప్పును ఎదుర్కొనేలా జిందాల్‌ సంస్థ అభివృద్ధి చేసిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో దీన్ని రూపొందించినట్లు తెలిపారు. వంతెన నిర్మాణానికి రూ.3.75కోట్లు ఖర్చయిందని..వందేళ్లకు పైగా సేవలందిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

టీడీబీతో సేపిజెన్‌ బయోలాజిక్స్‌ ఒప్పందం

భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించిన చుక్కల మందు కొవిడ్‌ టీకా, ఎస్‌ మలేరియా టీకాలను వాణిజ్య ప్రాతిపదికన మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు (టీడీబీ)తో సేపిజెన్‌ బయోలాజిక్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల సారథ్యంలో సేపిజెన్‌ బయోలాజిక్స్‌ సంస్థ ముందుకు సాగుతోంది. ఈ టీకాలను విస్తృత స్థాయిలో అందించేందుకు రూ.400 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందులో రూ.200 కోట్లు టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు అందిస్తుంది. మిగిలిన సొమ్మును భారత్‌ బయోటెక్‌ సమకూర్చుతుంది.

ఆహార నాణ్యత పరిశీలనకు ‘యాప్‌’

ఆహార ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి సూపర్‌జాప్‌ అనే అంకుర సంస్థ ‘సూపర్‌ బిడ్‌’ పేరుతో ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించిందని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి వి.ప్రవీణ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులతో తన కార్యాలయంలో చర్చించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తేవడానికి ఈ యాప్‌ దోహదపడుతుందని వెల్లడించార. దీన్ని తెలుగులోనూ రూపొందించాలని సంస్థకు సూచించామన్నారు.

గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన.. మరో ఆర్నెల్లు

కరోనా కాలంలో ఉపాధి దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోడానికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ప్రారంభించిన ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబరు వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఈ పథకం కింద ప్రతి వ్యక్తికి నెలకు అయిదు కేజీల బియ్యం/గోధుమలు ఉచితంగా లభిస్తాయి. దీనిద్వారా దేశంలోని 80 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. ‣ 2020 మార్చి నుంచి అమలుచేస్తున్న ఈ పథకం కాల పరిమితి ఈ ఏడాది మార్చితో ముగియనుండగా.. మళ్లీ పొడిగించారు. పథకానికి ఇప్పటివరకు రూ.2.60 లక్షల కోట్లు ఖర్చుచేసిన కేంద్ర ప్రభుత్వం ఈ ఆరునెలల్లో మరో రూ.80 కోట్లు వ్యయం చేయనుంది. కొవిడ్‌ మహమ్మారి తగ్గిపోయి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నప్పటికీ ఏ నిరుపేదా ఆకలితో నిద్ర పోకూడదన్న ఉద్దేశంతో పథకాన్ని పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

యూపీలో ఉచిత రేషన్‌ పథకం మరో 3 నెలలు పొడిగింపు

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత రేషన్‌ పంపిణీ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. యోగి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం మార్చి నెలాఖరు వరకే అమలు కావాల్సి ఉంది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యోగి దీని అమలును మరో మూడు నెలలు పొడిగించారు. కరోనా సమయంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం ఉచిత రేషన్‌ పథకాన్ని ప్రారంభించింది.

దివాలా కేసుల పరిష్కారంలో కృత్రిమ మేధ వాడొచ్చు: జస్టిస్‌ రామలింగమ్‌ సుధాకర్‌

కృత్రిమ మేధ(ఏఐ) వంటి కొత్త తరం సాంకేతికతలను దివాలా కేసులతో పాటు సమస్యల ముందస్తు పరిష్కారానికి వినియోగించుకోవచ్చని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ప్రెసిడెంట్‌ జస్టిస్‌ రామలింగం సుధాకర్‌ సూచించారు. ఎన్‌సీఎల్‌టీ జాతీయస్థాయి చర్చాకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘కృత్రిమ మేధను వినియోగించుకోవడం వల్ల ఆలస్యాన్ని తగ్గించవచ్చు.అత్యుత్తమ ధోరణులకు ఒక ముసాయిదాను తీసుకురావడంపైనా మేం దృష్టి సారించాం. దీని వల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువవుతుంద’ని పేర్కొన్నారు. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్‌ వర్మ మాట్లాడుతూ ‘ఎన్‌సీఎల్‌టీ పనితీరు భేషుగ్గా ఉంది. ఎన్‌సీఎల్‌టీ ఏర్పడినప్పటి నుంచీ 83,838 కేసులు వస్తే ఫిబ్రవరి 2022 నాటికి 62,506 కేసులను పరిష్కరించింద’నిఅన్నారు. దేశవ్యాప్తంగా 15 ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనాలకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యూపీ సీఎంగా వరుసగా రెండోసారి ఆదిత్యనాథ్‌ ప్రమాణం

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సహా భాజపాకు చెందిన పలువురు అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రంలో యోగి సర్కారు 2.0 కొలువుదీరింది. లఖ్‌నవూలో జరిగిన ఈ కార్యక్రమంలో 52 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ కమలదళం సీనియర్‌ నేత కేశవ్‌ప్రసాద్‌ మౌర్య డిప్యూటీ సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్‌ నాయకుడు బ్రజేశ్‌ పాఠక్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎం యోగితో పాటు 18 మంది కేబినెట్‌ మంత్రులు (వీరిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు), 14 మంది స్వతంత్ర హోదా మంత్రులు, 20 మంది సహాయ మంత్రులతో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ప్రమాణం చేయించారు. ‣ యోగి నేతృత్వంలోని గత కేబినెట్‌లో కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈ దఫా దినేశ్‌ స్థానాన్ని బ్రజేశ్‌ భర్తీ చేశారు. ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ బేబీరాణి మౌర్య, యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎ.కె.శర్మ, కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన జితిన్‌ ప్రసాద, అప్నాదళ్‌ (ఎస్‌) నేత అశిష్‌ పటేల్, నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌లకు కేబినెట్‌ బెర్తు దక్కింది. దానిష్‌ ఆజాద్‌ అన్సారీకి సహాయ మంత్రి పదవి దక్కింది. కొత్త కేబినెట్‌లో ఏకైక ముస్లిం ఆయనే. దానిష్‌ ప్రస్తుతానికి శాసనసభలోగానీ, మండలిలోగానీ సభ్యుడిగా లేరు. మాజీ ఐపీఎస్‌ అసీమ్‌ అరుణ్, కల్యాణ్‌సింగ్‌ మనవడు సందీప్‌ సింగ్‌ కూడా మంత్రి పదవులు (స్వతంత్ర హోదా) దక్కించుకున్నారు.

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో 2022 - 23 బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు పూర్తయింది. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 39 అధికారిక సవరణలను సభ ఆమోదించగా.. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురయ్యాయి.

మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జిగా శ్రీశ్రీ కుమార్తె మాలా

ప్రముఖ రచయిత శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), సరోజ దంపతుల కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. శ్రీశ్రీ కుమార్తెగా తెలుగువారికి సుపరిచితురాలైన మాలా పాఠశాల విద్యను చెన్నైలోని సెయింట్‌ జాన్, కేసరి పాఠశాలలో పూర్తిచేశారు. న్యాయవాద వృత్తిపై ఆసక్తితో చెన్నైలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో కోర్సు అభ్యసించారు. 1989లో న్యాయవాద వృత్తిని చేపట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో కీలక కేసులను వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2020లో పుదుచ్చేరిలో ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులై ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. మద్రాస్‌ హైకోర్టులోనూ సేవలందించారు.

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఆమోదం

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్, వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఈ అంశంపై రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

కొప్పర్తిలో రూ.748 కోట్లతో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు

కడప జిల్లాలోని కొప్పర్తి గ్రామంలో 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ప్రకటించారు. రాజ్యసభలో డీఎంకే సభ్యురాలు కనిమొళి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. మోడిఫైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్స్‌ (ఈఎంసీ 2.0) కింద అనుమతిచ్చిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.748.76 కోట్లని, అందులో రూ.350 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ఇస్తామని వివరించారు. కొప్పర్తితోపాటు హరియాణాకు రూ.662 కోట్లతో ఒక ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు.

దేశంలో పెరుగుతున్న మహిళా ప్రాతినిధ్యం

పార్లమెంటులో మహిళా ప్రతినిధుల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 1999లో లోక్‌సభలో వీరి ప్రాతినిధ్యం 9% ఉండగా 2019 నాటికి 14.4 శాతానికి పెరిగింది. రాజ్యసభలో 2012లో మహిళల ప్రాతినిధ్యం 9.8% ఉండగా 2021 నాటికి 12.24%కి చేరింది. రాజ్యసభలో న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అమలవుతున్న మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో మహిళా ప్రాతినిధ్యం ఎంత ఉందని చెప్పే గణాంకాలను (డేటా) తాము నిర్వహించడంలేదని పేర్కొన్నారు. 2019 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో 9.96%, గెలిచిన వారిలో 8% మహిళలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థుల్లో 7.69%, గెలిచిన వారిలో 5.04% మహిళలు ఉన్నారని వెల్లడించారు. శాసనసభల్లో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాల్లో... ఛత్తీస్‌గఢ్‌ (14.44%), పశ్చిమబెంగాల్‌ (13.70%), ఝార్ఖండ్‌ (12.35%), రాజస్థాన్‌ (12%), ఉత్తర్‌ప్రదేశ్‌ (11.66%), ఉత్తరాఖంఢ్‌ (11.43%), దిల్లీ (11.43%), పంజాబ్‌ (11.11%), బిహార్‌ (10.70%), హరియాణా (10%) వరుస స్థానాలను ఆక్రమించాయి. మిజోరం, నాగాలాండ్‌ అసెంబ్లీలలో ఒక్క మహిళా లేకపోవడం గమనార్హం. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌ (8%), కేరళ (7.86%), తమిళనాడు (5.13%), తెలంగాణ (5.04%), పుదుచ్చేరి (3.33%) కర్ణాటక (3.14%)లు వరుస స్థానాల్లో నిలిచాయి.

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై నిపుణుల కమిటీ

ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్‌ తన తొలి భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యూసీసీకి సంబంధించి ఇచ్చిన హామీ అమలుకు ధామీ రంగం సిద్ధం చేస్తున్నారు. మన దేశంలో యూసీసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా. 1963లో మన దేశంలో విలీనం అయిన తర్వాత అప్పటి వరకూ అమలులో ఉన్న పోర్చుగీసు పౌరస్మృతి - 1867ను ఆ రాష్ట్రం కొనసాగిస్తోంది. ఇది ఆ రాష్ట్రంలోని అన్ని మతాలు, వర్గాల వారికీ వర్తిస్తోంది. ఉత్తరాఖండ్‌ ప్రత్యేక సంస్కృతిని, మత వారసత్వాన్ని కలిగి ఉందని, దానిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ధామీ పేర్కొన్నారు.

ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభ 2022 - 23 ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. తద్వారా సంచిత నిధి నుంచి నిధుల విత్‌డ్రాకు ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సవత్సరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వ నిర్వహణకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు సవరణలను తిరస్కరించాక, మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. అంతకుముందు వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్లను సభ చర్చించింది. ఇక.. ముఖ్యంగా పన్ను ప్రతిపాదనలున్న ఆర్థిక బిల్లుపై చర్చ జరగనుంది. ఈ బిల్లు కూడా ఆమోదం పొందితే బడ్జెట్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

బెంగళూరులో ఆర్‌బీఐ ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించిన శక్తికాంత దాస్‌

ఆర్థిక అంశాల్లో వినూత్నతను ప్రోత్సహించడం కోసం బెంగళూరులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌(ఆర్‌బీఐహెచ్‌)ను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆవిష్కరించారు. రూ.100 కోట్ల ప్రాథమిక మూలధనంతో దీని కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ హబ్‌కు ఒక స్వతంత్ర బోర్డు ఉంటుంది. సేనాపతి(క్రిష్‌) గోపాలకృష్ణన్‌ ఛైర్మన్‌గా ఉండే ఈ బోర్డులో పరిశ్రమ, యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉంటారని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీల చట్టం-2013లోని సెక్షన్‌ 8 కింద ఆర్‌బీఐహెచ్‌ను ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది. దేశంలో అల్పాదాయ వర్గాలు సైతం ఆర్థిక సేవలు, ఉత్పత్తులు అందుకునేలా ఒక వ్యవస్థను తీసుకురావడంపై ఆర్‌బీఐహెచ్‌ దృష్టి సారిస్తుందని ఆర్‌బీఐ చెబుతోంది.

107 ఉప వ్యవస్థలు, విడిభాగాల దిగుమతిపై నిషేధం

స్వావలంబన సాధనే లక్ష్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా 107 ఉప వ్యవస్థలు, విడిభాగాల దిగుమతులను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న వేర్వేరు సామగ్రిని దిగుమతి చేసుకోవడంపై నిషేధం ఈ ఏడాది డిసెంబరు నుంచి ఆరేళ్ల వరకు వేర్వేరు సమయాల్లో అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించేందుకే ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. హెలికాప్టర్లు, జలాంతర్గాములు, యుద్ధనౌకలు, క్షిపణులు, రాడార్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల ఉత్పత్తిలో ఉపయోగించే పలు విడిభాగాలు.. తాజాగా దిగుమతి నిషేధిత జాబితాలో చేరాయి. వీటిలో ఎక్కువ సామగ్రిని ప్రస్తుతం మన దేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది డిసెంబరులో రక్షణ శాఖ 2,851 ఉప వ్యవస్థలు, విడిభాగాలతో ఇలాంటి నిషేధ జాబితానే విడుదల చేసిన సంగతి గమనార్హం.

ఉత్తరాఖండ్‌ సీఎంగా పుష్కర్‌సింగ్‌ ధామి ప్రమాణం

ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్‌ ధామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 46 ఏళ్ల ధామితో పాటు 8 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) గుర్మీత్‌సింగ్‌ ప్రమాణం చేయించారు.

నిర్బంధ మతమార్పిడి నిరోధక బిల్లుకు హరియాణా ఆమోదం

ప్రతిపక్ష కాంగ్రెస్‌ నిరసనలు, వాకౌట్‌ మధ్య నిర్బంధ మతమార్పిడిని నిరోధించే బిల్లుకు హరియాణా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 4న ‘చట్టవ్యతిరేక మతమార్పిడి నిరోధక బిల్లు, 2022’ను భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. నిర్బంధంగాను, ప్రలోభాలకు గురిచేయడం, ఒత్తిడి తేవడం ద్వారా.. లేదా మోసపూరిత విధానాల్లో మతమార్పిడికి పాల్పడితే వివిధ రకాల జైలుశిక్షలు, జరిమానాలను విధిస్తారు. కాగా ఈ బిల్లును కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించి, వాకౌట్‌ చేయడంతో వారు సభలో లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.

హిందూ మహాసముద్రంలో పరిశోధనలకు ఇన్‌కాయిస్‌ సేవలు

హిందూ మహాసముద్రంలో భారత వాతావరణ శాఖ ఆధ్వర్యంలో జరిగే పరిశోధనలకు తోడ్పాటు అందించే అంశాలపై హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం)తో వేర్వేరు సంస్థలు దిల్లీలో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ అదనపు డీజీ డాక్టర్‌ ఆనంద్‌గుప్తా, ఇన్‌కాయిస్‌ సీనియర్‌ శాస్త్రవేత్త బాలకృష్ణనాయర్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఓఎన్‌జీసీ, ఇతర సంస్థలు చేపట్టే పరిశోధనల్లో పాల్గొనే యంత్రాంగం సముద్రంలో అకస్మాత్తుగా చోటు చేసుకునే మార్పుల వల్ల తీవ్రంగా నష్టపోతోంది. ప్రాణ నష్టం జరుగుతోంది. ఎప్పటికప్పుడు హిందూ మహా సముద్ర నీటి మట్టాన్ని, అలల ఎత్తును, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులను రకరకాల పరికరాల సాయంతో ఇన్‌కాయిస్‌ లెక్కిస్తుంటుంది. ఆయా వివరాలను వాతావరణ శాఖతో పంచుకునేందుకు ఎంఓయూ జరిగిందని ఇన్‌కాయిస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

జియో వరల్డ్‌ సెంటర్‌కు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత

రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ముంబయిలో నెలకొల్పిన వ్యాపార, వినోద కేంద్రం ‘జియో వరల్డ్‌ సెంటర్‌’కు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్‌ఎఫ్‌) చెందిన 230 మంది సాయుధ సిబ్బంది భద్రత కల్పించనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టోనీ బంద్రా కుంద్రా కాంప్లెక్స్‌లోని 18.5 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ కేంద్రం ఫిఫా పుట్‌బాల్‌ మైదానం కంటే 12 రెట్లు, న్యూయార్క్‌లోని ఎంఫైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ కంటే 10.3 రెట్లు పెద్దది.

మణిపుర్‌ సీఎంగా బీరేన్‌ సింగ్‌ ప్రమాణం

మణిపుర్‌ ముఖ్యమంత్రిగా ఎన్‌.బీరేన్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ గణేశన్, బీరేన్‌తో సీఎంగా, అయిదుగురు ఎమ్యెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.

2026 వరకు ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం

దేశంలో ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్‌ఏసీపీ) 2026 మార్చి 31 వరకు పొడిగించాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం నాలుగో దశ గత ఏడాది మార్చి 31తోనే ముగిసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదో దశ 2021 ఏప్రిల్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని ఇందుకోసం రూ.15,471.94 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని వెల్లడించింది.

రాజ్యసభకు ఐదుగురి పేర్లను ప్రకటించిన ఆప్‌

పంజాబ్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తమ రాజ్యసభ అభ్యర్థులుగా ఐదుగురు పేర్లను ప్రకటించింది. ఇందులో భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, పంజాబ్‌ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన దిల్లీ ఎమ్మెల్యే రాఘవ్‌ చడ్ఢా, ఆప్‌ ఎన్నికల వ్యూహకర్త, ఐఐటీ ప్రొఫెసర్‌ సందీప్‌ పాఠక్, లూథియానా వ్యాపారవేత్త సంజీవ్‌ అరోడా, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్‌ మిత్తల్‌ ఉన్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో 117 సీట్లలో ఆప్‌ 92 నెగ్గడంతో ఈ ఐదు రాజ్యసభ సీట్లు ఆప్‌నకే దక్కనున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంగా మార్చి 25న యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త సర్కారు ఏర్పాటుకు ప్రమాణస్వీకార కార్యక్రమం లఖ్‌నవూలోని అటల్‌ బిహారీ వాజపేయీ ఏకనా స్టేడియంలో మార్చి 25న జరగనున్నట్లు ప్రభుత్వ సీనియర్‌ అధికారి వెల్లడించారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి భాజపా సర్కారు ఏర్పాటయ్యేలా పార్టీని గెలుపుబాటలో నడిపించిన యోగి ఆదిత్యనాథ్‌ ఈ వేడుకకు ముందు హాస్‌ లీడర్‌గా ఎంపికవుతారని తెలిపారు.

కశ్మీర్‌ ఫైల్స్‌ దర్శకుడికి ‘వై’ కేటగిరి భద్రత

‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా దర్శకుడు వివేక్‌ అగ్ని హోత్రికి 'వై' కేటగిరి భద్రతను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1990ల్లో జమ్ముకశ్మీర్‌ నుంచి కశ్మీరీ పండితుల వలసలపై అగ్రిహోత్రి తీసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు ముప్పువాటిల్లే అవకాశాలు ఉన్నాయని భావించిన కేంద్ర హోంశాఖ అధికారులు.. అగ్నిహోత్రికి ‘వె’ౖ భద్రత కల్పించింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా.. దర్శకుడి వెంట సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది కమాండోలు ఉంటారు.

హైదరాబాద్‌లో బంగారం ఏటీఎంలు

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో బంగారం ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు గోల్డ్‌ సిక్కా సంస్థ ప్రకటించింది. బేగంపేటలోని సంస్థ కార్యాలయంలో సీఈవో సయ్యద్‌ తరుజ్‌ ఈ విషయం వెల్లడించారు. కార్డుల ద్వారా బంగారం డ్రా చేసుకునే ఏటీఎంలు ఇప్పటివరకు దుబాయ్‌లో రెండు, యూకేలో అయిదు చోట్ల మాత్రమే ఉన్నాయని తెలిపారు. రానున్న 45 రోజుల్లోపు నగరంలోని గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్‌ ప్రాంతాల్లో తాము మూడు గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డులనుపయోగించి 99.99 శాతం స్వచ్ఛత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణాలు డ్రా చేసుకోవచ్చని వివరించారు. తాము ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ కార్డులు కూడా జారీ చేస్తామన్నారు. అంతర్జాతీయంగా మార్పు చెందే బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం తెరపై కనిపిస్తాయని తెలిపారు. నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మూడువేల ఏటీఎంల ఏర్పాటు తమ లక్ష్యమన్నారు.

అవినీతి అంతానికి పంజాబ్‌లో హెల్ప్‌లైన్‌

పంజాబ్‌లో అవినీతిరహిత పాలన అందిస్తానంటూ ప్రతినబూనిన ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఓ హెల్ప్‌లైన్‌ నంబరును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకొని మార్చి 23 నుంచి సంబంధిత సేవలు మొదలుపెడతామని తెలిపారు. ఆ హెల్ప్‌లైన్‌ తన వ్యక్తిగత వాట్సాప్‌ నంబరుగా ఉంటుందని చెప్పారు.

అస్సామీ టీకి జెలెన్‌స్కీ పేరు

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరిట అస్సాంకు చెందిన అరోమికా టీ అనే స్టార్టప్‌ సంస్థ సరికొత్త ‘సీటీసీ టీ’ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. జెలెన్‌స్కీ ధైర్య శౌర్యాలను గౌరవిస్తూ ఆయన పేరును తమ ఉత్పత్తికి పెట్టామని అరోమికా టీ డైరెక్టర్‌ రంజిత్‌ బారువా చెప్పారు. రష్యాతో పోరులో విజయం తన దరిదాపుల్లో లేదని తెలిసినా జెలెన్‌స్కీ పోరాడుతున్నారని, యుద్ధంలో ఆయన పాత్ర, పరాక్రమాలకు అస్సాం టీకి ఉన్న సారూప్యతను హైలెట్‌ చేస్తూ మార్కెటింగ్‌ చేస్తామని చెప్పారు.

రష్యా నుంచి హెచ్‌పీసీఎల్‌ ముడిచమురు ఒప్పందం

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) బాటలోనే హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) కూడా రష్యా నుంచి తక్కువ ధరకే 20 లక్షల బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకొంది. ఐరోపా ట్రేడర్‌ విటోల్‌ ద్వారా రష్యా ఉరాల్‌ క్రూడ్‌ను హెచ్‌పీసీఎల్‌ సమకూర్చుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ కూడా రష్యా నుంచి 10 లక్షల బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి చేసుకోనుంది.

ఎస్‌హెచ్‌సీఐఎల్‌తో ఒప్పందం

కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌) ద్వారా కూడా ఈ-స్టాంప్‌ పేపర్లను పొందే అవకాశం రాబోతుంది. ఇందుకోసం ఆ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌హెచ్‌సీఐఎల్‌ కేంద్రాలు పెట్టనున్నారు. ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, పోస్టాఫీసులు, స్టాంప్‌ వెండర్ల వద్ద స్టాంపు పేపర్లు లభిస్తున్నాయి. వీటితో పాటు ఎస్‌హెచ్‌సీఐఎల్‌ ద్వారా ఈ-స్టాంప్‌ పేపర్లను స్టాంపు డ్యూటీకి తగ్గట్లు పొందే అవకాశం వస్తుంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర రుసుములు కూడా ఎస్‌హెచ్‌సీఐఎల్‌ ద్వారా చేయొచ్చు.

కొచ్చి షిప్‌యార్డ్‌తో డీసీఐ భారీ ఒప్పందం

భారత్‌లో తయారీ కింద కొచ్చి షిప్‌యార్డ్‌లో అత్యధిక సామర్థ్యమున్న డ్రెడ్జర్‌ నిర్మాణానికి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) చారిత్రక ఒప్పందం కుదుర్చుకొంది. తొలి బీగిల్‌ సీరీస్‌ 12 ట్రైలింగ్‌ సక్షన్‌ హోపర్‌ డ్రెడ్జర్‌ను నిర్మించనున్నట్టు డీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

దేశంలోనే తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎఫ్‌సీఈవీ టయోటా మిరాయ్‌ ఆవిష్కరణ

దేశంలో తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత అడ్వాన్స్‌డ్‌ ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ వాహనం (ఎఫ్‌సీఈవీ) టయోటా మిరాయ్‌ను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆవిష్కరించారు. ఉద్గారాలు వెదజల్లని, పూర్తి పర్యావరణ హితంగా ఈ హైడ్రోజన్‌ విద్యుత్‌ వాహనాన్ని టయోటా రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం 5 నిమిషాల్లో రీఫ్యూయలింగ్‌ చేసుకోవచ్చని, ఒకసారి ఛార్జింగ్‌తో 650 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ను పునరుత్పాదక ఇంధనం నుంచి తయారు చేయవచ్చని, దీనికి అవసరమైన బయోమాస్‌ సమృద్ధిగా అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. టయోటా కిర్లోస్కర్‌ మోటార్, ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీలు (ఐసీఏటీ) సంయుక్తంగా ఎఫ్‌సీఈవీ సాంకేతికతను మిరాయ్‌పై పరీక్షిస్తున్నాయి. 2014లో ఆవిష్కరించిన టయోటా మిరాయ్‌లో రెండో తరానికి చెందిన వాహనం ఇది.

పంజాబ్‌ సీఎంగా భగవంత్‌ మాన్‌ ప్రమాణం

పంజాబ్‌ చరిత్రలో నవశకం ఆరంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత భగవంత్‌ మాన్‌ బాధ్యతలు చేపట్టారు. షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్‌కడ్‌ కలాంలో మాన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం, అవినీతి లాంటి సమస్యలపై పోరాడతానని ప్రకటించారు. ఈ పోరాటంలో ఒక్కరోజూ వృథా కానివ్వబోనని ఉద్ఘాటించారు. పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ 48 ఏళ్ల మాన్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు.

తొలి వాణిజ్య యూఏవీని ఆవిష్కరించిన ‘మాగ్నమ్‌ వింగ్స్‌’

హైదరాబాదీ అంకుర సంస్థ మాగ్నమ్‌ వింగ్స్‌ తన తొలి వాణిజ్య యూఏవీ (మానవ రహిత విమాన వాహనం) - ఎండబ్ల్యూ వైపర్‌ను విడుదల చేసింది. పూర్తిగా దేశీయ అవసరాల కోసం రూపొందించిన దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు తమ అవసరాలకు వినియోగించవచ్చని వివరించింది. క్షేత్ర పరిశీలన, సరకు రవాణా/డెలివరీ, నిఘా అవసరాలకు యూఏవీ ఎంతో అనువైనదని సంస్థ పేర్కొంది. నిట్ట నిలువుగా పైకి ఎగరడంతో పాటు 5 నుంచి 60 కిలోల బరువు గల సరకులు తీసుకెళ్లగలదని, గంటకు 30 - 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని వివరించింది. ఏకధాటిగా 2 గంటల పాటు 100 - 2000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదని పేర్కొంది. వైద్య అవసరాలు, త్వరగా పాడయ్యే వస్తువుల సత్వర రవాణాకు అనువైన ఈ యూఏవీ ని పూర్తిగా మనదేశంలోనే డిజైన్‌ చేసి ఉత్పత్తి చేశామని మాగ్నమ్‌ వింగ్స్‌ సీఈఓ అభిరామ్‌ చావ అన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసిన విడిభాగాలనే దీన్లో అధికంగా వినియోగించినట్లు తెలిపారు.

ఇండియన్‌ అంటార్కిటికా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అంటార్కిటికాలో భారత పరిశోధన కార్యకలాపాలు, అక్కడి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర భూ విజ్ఞానశాస్త్రాల శాఖ ఆధ్వర్యంలో ‘ది ఇండియన్‌ అంటార్కిటికా బిల్లు’ ముసాయిదాను రూపొందించారు. 1959, 1998 అంటార్కిటిక్‌ ఒప్పందాలు, అంటార్కిటిక్‌ సముద్రజీవ వనరుల సంరక్షణ ఒడంబడిక (1982)లకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కింద భారత్‌ లక్ష్యాల సాధనకు కూడా ఈ బిల్లు దోహదపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

‘ఖైదీల గుర్తింపు బిల్లు’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

వివిధ నేరాల్లో అరెస్టయినవారు, దోషులకు సంబంధించి రికార్డుల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు ప్రతిపాదించిన ‘ఖైదీల గుర్తింపు బిల్లు’ను 1920 ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ నేరాల్లో దోషులు, అరెస్టయినవారికి సంబంధించిన అనేక వివరాలను సేకరించేందుకు తాజా ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులను ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

తపాలా కవర్‌పై ‘మిరపకాయ టపా’

సమాచార బట్వాడా కోసం అల్లూరి ఉపయోగించిన ‘మిరపకాయ టపా’కు తపాలాశాఖ అరుదైన గౌరవం ఇచ్చింది. ఈ టపా చిహ్నంతో రూపొందించిన తపాలా కవరును తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ సింహాచలం, పోస్టుమాస్టర్‌ జనరల్‌ వెంకటేశ్వర్లు, మిత్ర గ్రూపు ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఆర్‌ఆర్‌కే రాజు రంపచోడవరంలో ఆవిష్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బాణం ద్వారా మిరపకాయ టపాను పంపి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ గుర్తుతో పోస్టల్‌ శాఖ కవరును విడుదల చేసింది.

భారత్‌ బయోటెక్‌ టీబీ టీకా కోసం స్పానిష్‌ సంస్థ ‘బయోఫాబ్రి’తో భాగస్వామ్యం

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ టీబీ (క్షయవ్యాధి) టీకా ఆవిష్కరించే యత్నాల్లో నిమగ్నమైంది. ఇందుకోసం స్పానిష్‌ సంస్థ బయోఫ్యాబ్రితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు కలిసి టీబీ టీకాను ఆగ్నేయాసియా, సబ్‌ - సహారన్‌ ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేస్తాయి. ఈ టీకాను (ఎంటీబీ వ్యాక్‌) యూనివర్సిటీ ఆఫ్‌ జరగోజా, ఐఏవీఐ (ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌), ట్యుబర్‌ క్యులోసిస్‌ వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌ (టీబీవీఐ) సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. భారత్‌ బయోటెక్, బయోఫ్యాబ్రి భాగస్వామ్యంతో టీబీ టీకాను ఆ వ్యాధి అధికంగా కనిపిస్తున్న దేశాలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతానికి పైగా ప్రజలు టీబీ బారిన పడుతున్నారు. ఎంతో వేగంగా వ్యాపించే ఈ వ్యాధికి టీకా సరైన పరిష్కారం. తద్వారా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. ఎంటీబీ వ్యాక్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఎంతో ఆసక్తికర ఫలితాలు సాధించినందున, దీన్ని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటు ధరలో టీబీ టీకా తీసుకురావాలని భావిస్తున్నామని, టీబీ అధికంగా కనిపిస్తున్న భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాఫ్రికా దేశాలకు భారత్‌ బయోటెక్‌ భాగస్వామ్యంతో టీకా అందించే అవకాశం కలుగుతుందని బయోఫ్యాబ్రి సీఈవో ఎస్తెబన్‌ రోడ్రిగూజ్‌ వివరించారు.

బ్రహ్మపుత్రపై అతి పొడవైన ఓడ

బెంగాల్‌- అస్సాం రాష్ట్రాల మధ్య జలరవాణాకు వీలుగా బ్రహ్మపుత్ర నదిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన అతిపొడవైన ఓడ ప్రయాణం విజయవంతమైంది. బెంగాల్‌లోని హల్దియాలో ఫిబ్రవరి 15న బయలుదేరిన 90 మీటర్ల పొడవున్న ఎంవీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ (ఓడ పేరు) గువాహటిలోని పాండు ఓడరేవుకు చేరింది. 2.1 మీటర్ల నీటిమట్టంలో ప్రయాణించగల ఈ ఓడ డీబీ కల్పనా చావ్లా, డీబీ అబ్దుల్‌ కలాం పేర్లతో ఉన్న మరో రెండు పెద్ద పడవ (బార్జ్‌)లను కలుపుకుని వచ్చింది. ఈ రెండు బార్జ్‌లు జంషెడ్‌పుర్‌లోని టాటా స్టీల్‌ కంపెనీకి చెందిన 1,793 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ రాడ్లను మోసుకొచ్చాయి. ప్రస్తుతం బ్రహ్మపుత్రలో పలుచోట్ల ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలోనే ఇవన్నీ ప్రయాణించగలిగాయని కేంద్ర ఓడరేవులు, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ చెప్పారు. త్వరలోనే నదిలో రాకపోకలకు అనువైన మార్గాన్ని శాశ్వత ప్రాతిపదికన గుర్తించి, బంగ్లాదేశ్‌తో కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పారు.

బ్యాంకు మోసాల్లో దేశంలో తెలంగాణకు తృతీయ స్థానం

బ్యాంకు మోసాల్లో దక్షిణాదిన తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడేళ్లలో రాష్ట్రంలో రూ.13,520.38 కోట్ల విలువైన మోసాలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో వెల్లడించారు. రాష్ట్రంలో 2015 - 16లో రూ.4,145.73 కోట్లు, 2016 - 17లో రూ.2,744.23 కోట్లు, 2017 - 18లో రూ.2,735.07 కోట్లు, 2018 - 19లో రూ.2,709.14 కోట్లు, 2019 - 20లో రూ.795.67 కోట్లు, 2020 - 21లో రూ.301.94 కోట్లు, 2021 - 22లో తొలి తొమ్మిది నెలల్లో రూ.88.60 కోట్ల మోసం జరిగినట్లు వివరించారు. ఏడేళ్లలో దేశంలో మహారాష్ట్ర (రూ.1,25,512.52 కోట్లు), దిల్లీ (రూ.51,031 కోట్లు) తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,373.72 కోట్ల మోసం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.

బిపిన్‌ రావత్‌ పేరిట ‘ఛైర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ఏర్పాటు

భారత తొలి త్రివిధ దళాధిపతి, దివంగత బిపిన్‌ రావత్‌ స్మారకార్థం మిలటరీ మేథో కార్యాలయమైన యునైటెడ్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (యూఎస్‌ఐ)లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సైనిక దళాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె తెలిపారు. ‘జనరల్‌ బిపిన్‌ రావత్‌ మెమోరియల్‌ ఛైర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’గా పిలిచే ఈ విభాగం త్రివిధ దళాల మధ్య సమన్వయం, సమగ్రతలపై దృష్టి సారిస్తుందన్నారు. తివిధ దళాల మాజీ సైనికులతో పాటు సైనిక వ్యవహారాలు, జాతీయ భద్రత అంశాల్లో నిపుణులైన పౌరులకు ఇందులో ప్రవేశం కల్పించి ఏడాది పాటు పరిశోధనకు అవకాశం ఇస్తామన్నారు. ఏటా జులై 1న ఈ ప్రవేశాలు ఉంటాయని వివరించారు. రావత్‌ 65వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో నరవణె ఈ విషయాలు వెల్లడించారు.

సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌కు బీఐఎస్‌ ప్రత్యేక గుర్తింపు

ఆభరణాల కొనుగోలుదారులకు హాల్‌ మార్కు ప్రాముఖ్యత, విశిష్టత పట్ల ఎంతో అవగాహన కల్పించినందుకు సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌కు భారత నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) ప్రత్యేక గుర్తింపు లభించింది. బీఐఎస్‌ విశాఖ రీజియన్‌ చేపట్టిన కొనుగోలు సాధికారత వారోత్సవంలో భాగంగా రీజియన్‌ హెడ్, సైంటిస్టు ఎం.ఎ.జె.వినోద్‌ తమ కార్యాలయంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మావూరి వెంకటరమణకు జ్ఞాపికను అందించారు.

13 నదుల పునరుజ్జీవం

దేశంలోని 13 ప్రధాన నదులను రూ.19,342 కోట్లతో పునరుజ్జీవింపచేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రులు భూపేందర్‌యాదవ్, గజేంద్రసింగ్‌ షెకావత్‌లు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ నదుల పరీవాహక ప్రాంతం చుట్టూ మొక్కలను పెంచి భూగర్భజలాలను పరిరక్షించాలని, నదుల కోతను అరికట్టాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ‣ ఇందులో గోదావరి నది పునరుజ్జీవానికి రూ.1,700.84 కోట్లు, కృష్ణా పునరుజ్జీవానికి రూ.2,327.47 కోట్లు ఖర్చు చేయనున్నారు. గోదావరికి కేటాయించిన నిధుల్లోంచి తెలంగాణలో రూ.677.28 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.39.05 కోట్లు, కృష్ణా నదికి ప్రకటించిన నిధుల్లోంచి తెలంగాణలో రూ.130.83 కోట్లు, ఏపీలో రూ.204.98 కోట్లు ఖర్చు పెడతారు.

జమ్మూ-కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన

జమ్మూ-కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కమిషన్‌ తన ముసాయిదా నివేదికను బహిర్గతం చేసింది. కశ్మీర్‌ డివిజన్‌లో హబ్బా కదల్, జమ్మూలోని సుచేత్‌గఢ్‌ అసెంబ్లీ సీట్లను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ- తన నివేదికను పత్రికల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీనిపై ఈనెల 21 వరకూ సూచనలు, సలహాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని తెలిపింది. కమిషన్‌ తొలుత హబ్బా కదల్, సుచేత్‌గఢ్‌ స్థానాల రద్దుకు ప్రతిపాదించగా, భాజపా జమ్మూ-కశ్మీర్‌ విభాగం అభ్యంతరం తెలిపింది. దీంతో వీటిని తాజా నివేదికలో పునరుద్ధరించారు. జమ్మూ-కశ్మీర్‌లో 5 లోక్‌సభ స్థానాలను కొనసాగిస్తూ... అసెంబ్లీ స్థానాలను 83 నుంచి 90కి పెంచుతున్నట్టు కమిషన్‌ పేర్కొంది. వీటిలో జమ్ము పరిధిలోకి 43, కశ్మీర్‌ పరిధిలోకి 47 స్థానాలు వస్తాయని వివరించింది. పెంచిన సీట్లలో ఆరు జమ్మూలో, ఒకటి కశ్మీర్‌లో ఉన్నాయి. మొత్తం స్థానాల్లో ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 కేటాయించినట్టు కమిషన్‌ తెలిపింది. ‣ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ అధ్యక్షతన 2020, మార్చి 6న ఏర్పాటైన ఈ కమిషన్‌లో మొత్తం ఐదుగురు సభ్యులున్నారు. ముసాయిదా ప్రతిపాదనలకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీలు ఫరూక్‌ అబ్దుల్లా, మసూది, మహమ్మద్‌ అక్బర్‌ లోన్‌లతో పాటు.. మరో సభ్యుడైన భాజపా ఎంపీ జుగల్‌ కిషోర్‌ కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ కమిషన్‌లో ఐదో సభ్యునిగా ఉన్నారు.

అప్పర్‌భద్రకు జాతీయహోదా

కర్ణాటక చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించింది. ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2018-19 ధరల ప్రకారం రూ.16,125.48 కోట్లు కాగా, ఇందులో రూ.4,868.31 కోట్లను కర్ణాటక ప్రభుత్వం ఖర్చుచేసింది. మిగిలిన నిధులను జాతీయ హోదా కింద కేంద్రం భరించనుంది. దక్షిణాదిలో పోలవరం తర్వాత జాతీయ హోదా లభించిన ప్రాజెక్టు ఇదే. 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడంతోపాటు 367 చెరువులను నింపేందుకు అప్పర్‌భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. దీనివల్ల తుంగభద్రలోకి వచ్చే ప్రవాహం తగ్గిపోతుందని, ఈ ప్రభావం శ్రీశైలం ప్రాజెక్టు మీద, తెలుగు రాష్ట్రాలపైన పడుతుందని ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని తోసిపుచ్చిన కేంద్రం, కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1 కేటాయింపుల మేరకే నీటి కేటాయింపులున్నట్లు పేర్కొంది.

ఒక్కో కొవిడ్‌ మరణానికి రూ.50వేలు పరిహారం

కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రక్తసంబంధీకులకు చెల్లించాల్సిన పరిహారంపై గత ఉత్తర్వులోనే స్పష్టమైన ఆదేశాలిచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కో మరణానికి రూ.50వేల చొప్పున బాధిత కుటుంబానికి అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అస్సాం నుంచి దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది.

జమ్మూ-కశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం

‘జమ్మూ-కశ్మీర్‌ బడ్జెట్‌ 2022-23’ ప్రతిపాదనలను లోక్‌సభ ఆమోదించింది. ఈ పద్దుల విలువ సుమారు రూ.1.42 లక్షల కోట్లు. వలసల ఆధారంగా రూపొందించిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంతో కశ్మీర్‌ పండిట్ల అంశం మరోమారు చర్చనీయాంశమైంది. కశ్మీర్‌ పండిట్లు తమ సొంత ఇష్టంతోనే లోయ ప్రాంతాన్ని వీడి వెళ్లారని, వారి వలసలకు ఎలాంటి ఒత్తిడి కారణంకాదని కేరళ కాంగ్రెస్‌ చేసిన ట్వీట్లను మంత్రి సభ దృష్టికి తెచ్చారు. వలసల సమయంలో నాటి జమ్మూ-కశ్మీర్‌ సర్కారుతో కాంగ్రెస్‌కు మంచి సంబంధాలే ఉండేవన్నారు. జమ్మూ-కశ్మీర్‌ బడ్జెట్‌తో పాటు... అక్కడ అదనపు గ్రాంటు కింద వెచ్చించ దలచిన రూ.18,860.32 కోట్ల విలువైన సప్లిమెంటరీ డిమాండ్లకూ సభ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రయోగశాల

తెలంగాణలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రయోగశాల ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ దీన్ని తాజాగా ప్రారంభించింది. ఇక్కడ పండించే విత్తనాలతో పాటు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో పండే వాటికీ పరీక్షలు నిర్వహించి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యత ధ్రువీకరణ పత్రం జారీ చేయవచ్చు. ఇది దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ విత్తన పరీక్షల ప్రయోగశాల. మొదటిది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఉంది. కానీ అత్యాధునిక, సాంకేతిక సౌకర్యాలతో అతి పెద్ద విస్తీర్ణంలో ఏర్పాటైన ప్రయోగశాల తెలంగాణది కావడం గమనార్హం. ‣ రాష్ట్రం నుంచి విత్తన ఎగుమతులను ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్ధిని, వాణిజ్యాన్ని విస్తరించడం ద్వారా మనరాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రయోగశాల ఉపయోగపడుతుందని విత్తన ధ్రువీకరణ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించింది. అనంతరం రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, జాతీయ వ్యవసాయ విస్తరణ, సాంకేతిక మిషన్‌ పథకాల కింద కేంద్రం రూ.6 కోట్లను మంజూరు చేసింది. వీటిలో రూ.3 కోట్లతో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటుచేసి విత్తన నాణ్యత, జన్యు పరీక్షలు చేస్తున్నారు. తద్వారా విత్తన మొలకశాతం, తేమ, భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత వంటి నాణ్యత సంబంధ వివరాలను ప్రకటిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే ‘ఇష్టా నారింజ రంగు ధ్రువీకరణ పత్రం (ఇష్టా ఆరెంజ్‌ సర్టిఫికెట్‌) జారీచేస్తుంది. ఈ పత్రం పొందితే 50కి పైగా దేశాలకు విత్తనాలను ఎగుమతి చేయవచ్చు. ఈ ప్రయోగశాలలో ఇతర రాష్ట్రాల వ్యవసాయాధికారులకు, విత్తన పరీక్షలు చేసేవారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇచ్చేందుకు సదుపాయాలను కల్పించారు. దేశంలో 8 మాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు నాణ్యమైన విత్తనాలను ఎగుమతి చేయడానికి స్విట్జర్లాండ్‌లో ‘అంతర్జాతీయ విత్తన పరీక్షల ప్రమాణాల సంస్థ’ (ఇష్టా) ఉంది. అంతర్జాతీయ విత్తన పరీక్షల ప్రయోగశాల గుర్తింపునివ్వాలని గతంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ దీనికి దరఖాస్తు చేసింది. అనంతరం ఇష్టా నిపుణులు అనేక తనిఖీలు చేసి, ఫిబ్రవరి 9న ఇష్టా గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు. ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చే ప్రయోగశాలలు తెలంగాణతో కలిపి దేశంలో 8 మాత్రమే ఉన్నాయి. ఇందులో 2 మాత్రమే (తమిళనాడు, తెలంగాణ)ప్రభుత్వ యాజమాన్యంలో నడిచేవి. దేశంలో 26 ప్రయోగశాలలు ఇష్టాతో భాగస్వామ్యం కలిగి ఉన్నప్పటికీ కేవలం ఎనిమిదింటికి మాత్రమే అంతర్జాతీయ గుర్తింపు పత్రం జారీ చేశారని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులు చెప్పారు.

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌(ఐకియా వెనుక భాగంలో)లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) భవనానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, తెలంగాణ మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ వచ్చే ఏడాదికల్లా భవన నిర్మాణం పూర్తవుతుందని, దుబాయ్, సింగపూర్, లండన్‌ కేంద్రాల సరసన హైదరాబాద్‌ కేంద్రం నిలబడుతుందన్నారు. దీని నిర్మాణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది.

నీటి రంగంలో అంకురాలకు నిధులు

దేశంలో నీటి రంగంపై పనిచేసే అంకురాలకు కేంద్రం మద్దతు ప్రకటించింది. ‘ఇండియా వాటర్‌పిచ్‌-పైలట్‌-స్కేల్‌ స్టార్టప్‌ ఛాలెంజ్‌’ కింద ప్రభుత్వం 100 అంకురాలను ఎంపిక చేయనుంది. ఒక్కో సంస్థకు రూ.20 లక్షల సహాయంతో పాటు మెంటార్‌షిప్‌నూ అందిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త పథకం వల్ల ఆర్థిక వృద్ధిలో స్థిరత్వంతో పాటు; ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖకు చెందిన ‘అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువినేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’(అమృత్‌) 2.0 కింద తీసుకొచ్చిన ఈ పథకాన్ని మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆవిష్కరించారు.

స్టేషన్లలో ఫుడ్‌ ప్లాజాల ఏర్పాటు బాధ్యత రైల్వేలకు

రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో ఫుడ్‌ ప్లాజా, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, రెస్టారెంట్లను ఏర్పాటు చేసే బాధ్యతను ఇకపై రైల్వేలు నిర్వహించనున్నాయి. ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే టూరిజం అండ్‌ కేటరింగ్‌ కార్పొరేషన్‌) నుంచి ఈ బాధ్యతను తీసుకోనున్నాయి. ఛార్జీలేతర ఆదాయాన్ని ఆర్జించాలన్నదే ఈ నిర్ణయం వెనక ఉద్దేశమని రైల్వేబోర్డుజారీ చేసిన ప్రకటన ఆధారంగా తెలుస్తోంది. ప్రస్తుతం రైళ్లల్లో భోజన సరఫరా, ఆహార పదార్థాల కేంద్రాల (స్టాటిక్‌ యూనిట్స్‌) ఏర్పాటు బాధ్యతలను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది.

అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానానికి 12న ఉపఎన్నిక

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. భాజపా తరఫున ఎంపీగా గెలుపొందిన బాబుల్‌ సుప్రియో ఆ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అవసరమయ్యింది. బాబుల్‌ సుప్రియో ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమ బెంగాల్‌లోని బాలిగంజ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్, బిహార్‌లోని బోచహా, మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానాలకూ అదే రోజున పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటికీ ఓట్ల లెక్కింపు ఏప్రిల్‌ 16న చేపడతారు.

62,198 ఎకరాల అటవీ ప్రాంతం బుగ్గి

ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. అప్పుడే అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. నవంబరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు నాలుగు నెలల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలోని 23,347 అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 62,198.6 ఎకరాల అటవీ ప్రాంతం బుగ్గయ్యింది. నల్లమల్ల అడవులున్న నాగర్‌కర్నూల్, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. నాలుగింట మూడొంతులకుపైగా ప్రమాదాలు ఒక్క ఫిబ్రవరిలోనే జరిగాయి. ‣ రెండేళ్ల క్రితం తొలి నాలుగు నెలల్లో దాదాపు 10 వేల పైచిలుకు ప్రమాదాలు జరగగా.. ఈసారి ఆ సంఖ్య రెట్టింపునకు పైగా ఉంది. మొత్తం 23,347 ప్రమాదాల్లో 257 మాత్రమే అడవుల బయట జరగ్గా మిగతావన్నీ అటవీ ప్రాంతంలోపలే. 2020లో ఏడాది అంతా కలిపి 12,442 ప్రమాదాలు జరగగా ఈసారి నాలుగు నెలల్లోనే దాదాపు దానికి రెట్టింపు సంఖ్యలో చోటుచేసుకున్నాయి. నాలుగైదేళ్లుగా ప్రమాదాల సంఖ్య ఏటేటా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సగానికి పైగా నాలుగు జిల్లాల్లోనే.. మొత్తం అటవీ అగ్ని ప్రమాదాల్లో సగానికిపైగా నాలుగు జిల్లాల్లోనే జరిగాయి. భద్రాద్రి - కొత్తగూడెంలో 3,500, ములుగులో 3,383, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 2,636, నాగర్‌కర్నూల్‌లో 2,015 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సున్నా నుంచి పదిలోపు ప్రమాదాలు జరిగిన జిల్లాల్లో హైదరాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్, హనుమకొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి ఉన్నాయి. ఎక్కువ విస్తీర్ణంలో అడవి దగ్ధమైన జిల్ల్లాల్లో నాగర్‌కర్నూల్‌ తొలి స్థానంలో ఉంది. అక్కడ అత్యధికంగా 11,375.96 ఎకరాల అడవి కాలిపోయింది.

16న పంజాబ్‌ సీఎంగా భగవంత్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత భగవంత్‌ మాన్‌ మార్చి 16న ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముందుగానే ప్రకటించినట్లుగా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ స్వగ్రామమైన ఖట్‌కడ్‌ కలా (నవాంశహర్‌ జిల్లా)లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపాయి. పంజాబ్‌లో తమ పార్టీ ఘన విజయం అనంతరం కేజ్రీవాల్‌తో మాన్‌ తొలిసారి భేటీ అయ్యారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలుండగా ఆప్‌ ఏకంగా 92 చోట్ల విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే.

సీఎం పదవుల‌కు యోగి ఆదిత్యనాథ్, చన్నీ, ధామీ, బీరేన్‌సింగ్‌ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. నూతన ప్రభుత్వాల ఏర్పాటుకు వీలుగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ, మణిపుర్‌ సీఎం బీరేన్‌సింగ్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యేంతవరకు వీరంతా ఆపద్ధర్మ సీఎంలుగా కొనసాగనున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల కేబినెట్‌లు తమ తమ శాసనసభలను రద్దు చేయాలని గవర్నర్లకు సిఫార్సు చేశాయి. మరోవైపు గోవాలో సీఎం ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్‌ కూడా శాసనసభను రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫార్సు చేయాలని తీర్మానించింది. తాజా ఎన్నికల్లో అద్భుత విజయాలతో యూపీ, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాల్లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోగా.. పంజాబ్‌లో ఆప్‌ అపూర్వ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

3వ నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌

శాసనాలు చేసే చట్టసభల సభ్యుల్లో గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట సభలు ఉన్నది సంభాషణ, చర్చల కోసమేనని, అవరోధాలు సృష్టించడానికి కాదని హితవు పలికారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ వేదికగా జరిగిన 3వ నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను యువత అందిపుచ్చుకొని పరిస్థితులకు తగ్గట్టు తయారుకావాలి. దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి తమ వంతు చేయూతనందించాలి. ప్రతి ప్రయత్నంలో దేశమే ముందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చట్ట సభల్లో బిల్లులపై విస్తృత స్థాయిలో చర్చించాలి. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాల ఆశలు, ఆకాంక్షలను సమ్మిళితంచేయడానికి వీలవుతుంది. రాష్ట్రపతి, గవర్నర్‌ ప్రసంగాల సమయంలో అడ్డంకులు సృష్టించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు మంచిదికాదు’’ అని ఓం బిర్లా పేర్కొన్నారు.

ఐవోసీ పెట్రోలు బంకుల్లో ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) అంగీకరించింది. ఈ మేరకు ఐవోసీ, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐవోసీ తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రావణ్‌ ఎస్‌ రావు, నెడ్‌క్యాప్‌ వైస్‌ ఛైర్మన్, ఎండీ రమణారెడ్డి ఎంవోయూపై తాడేపల్లిలోని నెడ్‌క్యాప్‌ కార్యాలయంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నెడ్‌క్యాప్‌ ఎండీ రమణారెడ్డి మాట్లాడుతూ.. ‘2024 నాటికి రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో విద్యుత్‌తో నడిచే సరకు రవాణా వాహనాల వినియోగాన్ని తీసుకొస్తాం. 2030 నాటికి అన్ని జిల్లాల్లో ప్రవేశపెడతాం. దీనికోసం ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు, జాతీయ రహదారులపై 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసేలా ప్రతిపాదన రూపొందించాం. ఐవోసీ పెట్రోలు బంకుల్లో ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని పేర్కొన్నారు. 2024 నాటికి దేశంలో 10వేల ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని శ్రావణ్‌ పేర్కొన్నారు. పలు రిఫైనరీల దగ్గర హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్‌లలో భాజపా గెలుపు

ఐదు రాష్ట్రాలకు జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల అధికారాన్ని భాజ‌పా ద‌క్కించుకుంది.. అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాల్లో అధికార పీఠాన్ని నిలబెట్టుకుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు వివిధ విడతల్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

‣ ఉత్తరాఖండ్‌లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారే సంప్రదాయానికి తెరదించుతూ భాజపా అధికార పీఠాన్ని నిలబెట్టుకుంది.

‣ ఈశాన్య మణిపుర్‌లో ఈసారి సొంతంగానే భాజపా మెజార్టీ మార్కును దాటింది.

‣ గోవాలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి భాజపా హ్యాట్రిక్‌ ప్రభుత్వ స్థాపనకు సిద్ధమైంది.


ఉత్తర్‌ప్రదేశ్‌: భాజపా:-
‣ యూపీలో భాజపా 254 స్థానాల్లో విజయం సాధించింది. మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది.

‣ దేశంలోకెల్లా అత్యధిక లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌.

‣ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని సర్కారు వరుసగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టనుంది.

‣ ఈ విజయంతో గత మూడు దశాబ్దాల కాలంలో యూపీలో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి పార్టీగా భాజపా రికార్డు సృష్టించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గత 37 ఏళ్లలో ఓ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించడం ఇదే ప్రథమం.

యోగి ఆదిత్యనాథ్‌ గురించి:-
యోగి ఆదిత్యనాథ్‌గా దేశ ప్రజలందరికీ సుపరిచుతులైన ఆయన అసలు పేరు అజయ్‌ మోహన్‌ సింగ్‌ బిష్త్‌. 1972 జూన్‌ 5వ తేదీన అవిభాజ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని పౌడి గఢ్వాల్‌ (ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉంది)లో అటవీ అధికారి ఆనంద్‌ సింగ్‌ బిష్త్, సావిత్రి దేవి దంపతులకు జన్మించారు. విద్యార్థి దశలో కొన్నాళ్లు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ)తో ఉన్నప్పటికీ ఆ రాజకీయాలతో పొసగని అజయ్‌ హిందుత్వ సిద్థాంతానికి ఆకర్షితులయ్యారు. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ఏబీవీపీలో చేరారు. 1990లో 18ఏళ్ల వయసులో అయోధ్య ఆలయ ఉద్యమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి వచ్చేశారు. 1992లో బీఎస్సీ (గణితం) డిగ్రీలో ఉత్తీర్ణులయ్యారు. 1994లో గోరఖ్‌నాథ్‌ ఆలయ ప్రధాన పూజారి మహంత్‌ అవైద్యనాథ్‌ శిష్యుడిగా దీక్ష స్వీకరించారు. అప్పటి వరకూ అజయ్‌ మోహన్‌ సింగ్‌ బిష్త్‌గా ఉన్న ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్‌గా మారింది.


పంజాబ్‌లో ఆప్ జ‌య‌కేత‌నం:-
‣ పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ను ఓడించి కేజ్రీవాల్ నాయ‌క‌త్వంలోని ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది.

‣ రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలుండగా ఆప్‌ ఏకంగా 92 సీట్లు గెల్చుకుంది.

‣ అధికార కాంగ్రెస్‌ సహా శిరోమణి అకాలీదళ్, భాజపా తదితర పార్టీలను నామమాత్రంగా మార్చేసింది. కాంగ్రెస్‌ కేవలం 18 స్థానాలతో సరిపెట్టుకుంది.

‣ ప్రస్తుతం దేశంలో హస్తం పార్టీ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు - రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే. కాంగ్రెస్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యల్పం.

పంజాబ్‌ కాబోయే సీఎం భగవంత్‌ మాన్‌ ప్రస్థానం:-
‣ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం 11 ఏళ్లలో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు భగవంత్‌ మాన్‌.

‣ హాస్యనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన 48 ఏళ్ల మాన్‌ 1973లో సంగ్రూర్‌లోని సతోజ్‌ గ్రామంలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. కళాశాల దశలోనే సామాజిక, రాజకీయ అంశాలపై వ్యంగాస్త్రాలను సంధిస్తూ.. మంచి హాస్యకళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత జుగ్ను కెహెందా హై.. జగ్ను మస్త్‌ మస్త్‌ లాంటి టీవీ సీరియళ్లతో పంజాబ్‌ ప్రజలకు చేరువయ్యారు. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ న్యాయనిర్ణేతగా ఉన్న ‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ షో’లో పాల్గొనడంతో హాస్య కళాకారుడిగా పంజాబ్‌లో మాన్‌ పేరు మార్మోగిపోయింది.

‣ హాస్యకళాకారుడిగా కెరీర్‌ ఉచ్ఛస్థితిలో ఉండగా 2011లో మాన్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున 2012లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు పీపుల్స్‌ పార్టీ.. కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయం మాన్‌ రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పింది. సంగ్రూర్‌ నుంచి ఆప్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షలకుపైగా ఓట్లతో మాన్‌ విజయం సాధించారు. 2017 ఆసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి ఎదురైంది. అయితే 20 సీట్లు నెగ్గి ఆప్‌ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో ఆ సమయంలో పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలను కేజ్రీవాల్, మాన్‌కే అప్పగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ సంగ్రూర్‌ నుంచి లక్షకుపైగా ఓట్లతో విజేతగా నిలిచి రెండోసారి ఎంపీగా పార్లమెంటులో మాన్‌ అడుగుపెట్టారు.


గోవా: భాజపా:-
గోవాలో ఇన్నాళ్లూ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న భాజపా.. తాజా ఎన్నికల్లో ఇతర పార్టీలపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 20 సీట్లు గెల్చుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కమలదళానికి గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్‌ 11 స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ ఆప్‌ 2 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) 2 సీట్లలో, గోవా ఫార్వర్డ్‌ పార్టీ ఓ చోట గెలుపొందాయి.

ప్రమోద్‌ సావంత్‌ ఓ ఆయుర్వేద వైద్యుడు

మళ్లీ గోవా సీఎం పదవి చేపట్టే అవకాశాలున్న ప్రమోద్‌సావంత్‌ ఆయుర్వేద వైద్యుడు. ఈయన ఆరెస్సెస్‌ నుంచి ఎదిగారు. ఉత్తర గోవాలోని సంక్వెలిమ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మూడుసార్లు గెలిచారు. 2017 నాటి మనోహర్‌ పారికర్‌ (భాజపా) ప్రభుత్వంలో స్పీకరుగా పనిచేశారు. పారికర్‌ మరణానంతరం 2019 మార్చిలో సీఎం బాధ్యతలు చేపట్టారు.


ఉత్తరాఖండ్‌: భాజపా
దేవభూమి ఉత్తరాఖండ్‌లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారే సంప్రదాయానికి ఎట్టకేలకు తెరపడింది. అభివృద్ధి నినాదంతో బరిలో దిగిన భాజపా 70 స్థానాల శాసనసభలో 47 సీట్లు గెల్చుకుంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్‌ 19 స్థానాల్లో గెలిచింది. మరోవైపు రాష్ట్ర చరిత్రలో సిట్టింగ్‌ సీఎంలెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించని సంప్రదాయం మాత్రం యథాతథంగా కొనసాగింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఖటీమా స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.

‣ 21 ఏళ్ల ఉత్తరాఖండ్‌ రాష్ట్ర చరిత్రలో అధికార పార్టీ మళ్లీ పీఠం దక్కించుకోవడం ఇదే తొలిసారి. దేవభూమిగా పరిగణించే ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్‌ సీఎంలు గెలిచిన చరిత్ర లేదు.


మణిపుర్‌: భాజపా :-
కొన్నేళ్లుగా ఈశాన్య భారత్‌పై పట్టు పెంచుకుంటున్న భాజపాకి మణిపుర్‌లో మధురమైన విజయం దక్కింది. ఐదేళ్లుగా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆ పార్టీ ఈ దఫా సొంతంగా మెజార్టీ మార్కును దాటింది. 32 సీట్లను ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 7, జనతాదళ్‌ యునైటెడ్‌ 6, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 5 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి.

మణిపుర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 1992లో ‘నహరోల్జి తౌడాంగ్‌’ అనే వార్తా పత్రికను ప్రారంభించి 2001 వరకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆ గుర్తింపుతోనే 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్‌ రెవల్యూషనరీ పీపుల్స్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కాంగ్రెస్‌లోకి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్‌ ఇబోబి సింగ్‌ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. స్వల్ఫకాలంలోనే ఇబోబి సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్‌ హయాంలో పలు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2016లో కాంగ్రెస్‌తో విబేధించి భాజపాలో చేరారు. 2017 ఎన్నికల్లో ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, ఎల్‌జేపీ, టీఎంసీల భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత బహిర్గతమైనప్పటికీ రాజకీయ చతురతతో సద్దుమణిగేలా చేశారు.


యూపీలో మూడో అతిపెద్ద పార్టీగా అప్నాదళ్‌ (ఎస్‌)

ఉత్తరప్రదేశ్‌లో భాజపా రెండోసారి సొంత బలంతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. అదే సమయంలో దాని మిత్రపక్షాలూ లాభపడ్డాయి. రాష్ట్రంలో 2014 నుంచి భాజపాలో కలిసి ఉంటున్న అప్నాదళ్‌ (ఎస్‌) మంచి ఫలితాలు సాధించి మరింత బలపడింది. ఏకంగా 12 స్థానాలు గెలుచుకుని భాజపా, ఎసీˆ్ప తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీ, కాంగ్రెస్‌లను పక్కకునెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్‌ (ఎస్‌) 11 స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది చోట్ల గెలిచింది.

యూపీలో ‘నోటా’కు ఎక్కువ ఓట్లు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల్లో పలు ప్రముఖ పార్టీల కంటే ‘నోటా’కే అధిక శాతం ఓట్లు పడటం గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చూపిన ప్రకారం.. నోటా 0.69% ఓట్లను పొందింది. ఇక్కడ ఎంఐఎం 0.47%, ఆప్‌ 0.35%, జేడీ-యూ 0.11%, సీపీఐ 0.07%, ఎన్‌సీపీ 0.05%, శివసేన 0.03%, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌), ఎల్‌జేపీ(ఆర్‌వీ)లు 0.01% చొప్పున ఓట్లు తెచ్చుకున్నాయి. కాగా విజయం సాధించిన భాజపా 41.6%, రెండో స్థానంలో నిలిచిన సమాజ్‌వాదీపార్టీ 32% ఓట్లు దక్కించుకున్నాయి. వీటి తర్వాత బీఎస్పీకి 12.8%, ఆర్‌ఎల్‌డీకి 3.02%, కాంగ్రెస్‌కు 3.02% ఓట్లు వచ్చాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అరుదైన రికార్డు

42 ఏళ్లుగా ఒకే కుటుంబం.. ఒక్కటే పార్టీతో ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఓ అరుదైన రికార్డు దక్కింది. అక్కడ రాంపుర్‌ఖాస్‌ నియోజకవర్గం నుంచి ఒకే కుటుంబానికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు 1980 నుంచి వరుసగా గెలుస్తుండటమే అందుకు కారణం. గత 42 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్ని గాలులు వీచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా రాంపుర్‌ఖాస్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్‌తివారీ కుటుంబమే గెలుస్తోంది. 1980లో తొలిసారి అక్కడి నుంచి ప్రమోద్‌తివారీ కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు. తర్వాత 1985, 89, 91, 93, 96, 2002, 2007, 2012 ఎన్నికల్లో ఆయనే వరుసగా గెలిచారు. 2013లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె ఆరాధనా మిశ్ర పోటీలోకి దిగి ఘన విజయం సాధించారు. 2017 ఎన్నికల్లోనూ ఆమే గెలిచారు. మళ్లీ ఇప్పుడు భాజపా అభ్యర్థిపైనా గెలిచి, తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

తెలంగాణకు దక్కాల్సిన ప్రతిష్ఠాత్మక సంస్థ కేంద్రం నిర్ణయంతో చేజారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నెలకొల్పాలని సంకల్పించిన అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం (గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌) గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వైద్యసంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న కేంద్ర ఆయుష్‌ శాఖ లేఖపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుండగానే కేంద్రం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఆవు పేడ సూట్‌కేస్‌లో బడ్జెట్‌

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఆవుపేడతో చేసిన సూట్‌కేస్‌తో అసెంబ్లీకి వచ్చారు. పర్యావరణ హిత వస్తువులపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ సూట్‌కేస్‌లో బడ్జెట్‌ పత్రాలను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రయాణికుల రైలుకు మహిళల సారథ్యం

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాల్తేరు డివిజన్‌ ప్రత్యేకత చాటుకుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ చరిత్రలో మొదటిసారి ఓ ప్రయాణికుల రైలును మహిళా బృందంతో నడిపి, ఘనత సాధించింది. వీరిలో లోకోపైలెట్ల నుంచి టికెట్‌ తనిఖీ అధికారుల వరకు అందరూ మహిళలే కావడం విశేషం. విశాఖ నుంచి రాయగడ (సుమారు 180 కి.మీ.)కు బయలుదేరిన ఈ ప్రత్యేక పాసింజర్‌ రైలును డీఆర్‌ఎం అనూప్‌ సత్పతి సతీమణి, తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పారిజాత సత్పతి ప్రారంభించారు. ‣ సరకు రవాణా రైళ్లను నడపడంలో అనుభవం కలిగిన ముగ్గురు మహిళా లోకోపైలెట్లు దీనికి సారథ్యం వహించారు. లోకోపైలెట్‌ సాధనకుమారి, సహాయ లోకోపైలెట్‌ ఎన్‌.మాధురి, గూడ్స్‌ గార్డ్‌ రమ్య బృందం ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చింది. ముగ్గురు అధికారులు మంగేశ్వరి, కిల్లార్, రాధ టికెట్లు తనిఖీ చేశారు. మహిళల సంరక్షణను చూసే రైల్వే పోలీసు అధికారి మేరి సహేలి భాగస్వామ్యం అయ్యారు.

తెలంగాణ రహదారుల్లో జీహెచ్‌ఎంసీ టాప్‌

ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు తెలంగాణ రాష్ట్రంలో రహదారుల సగటు 69.24 కిలోమీటర్లు. జిల్లాల పరంగా చూస్తే హైదరాబాద్‌ జిల్లాలో ఇది 4,154 కిలోమీటర్లు కాగా వరంగల్, కరీంనగర్‌ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 38 కిలోమీటర్లతో ములుగు జిల్లా అట్టడుగున ఉండగా 53 కిలోమీటర్లతో భద్రాద్రి కొత్తగూడెం, 61 కిలోమీటర్లతో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. ‣ తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రహదారులు - భవనాల శాఖ, పంచాయతీరాజ్, జీహెచ్‌ఎంసీ పలు రకాల రహదారులను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో 1,07,871 కిలోమీటర్ల పొడవైన నెట్‌వర్క్‌ ఉంది. ఇందులో 62.37 శాతం గ్రామీణ ప్రాంత రహదారులు, 25.65 శాతం రాష్ట్ర రహదారులు, 3.62 శాతం జాతీయ రహదారులు ఉన్నాయి. నెట్‌వర్క్‌ పరంగా చూస్తే జీహెచ్‌ఎంసీ 9,013 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ కలిగి ఉండగా 6,187 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, 2,846 కిలోమీటర్ల తారు రోడ్లు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 7,511 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ ఉంది. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. గోవా, హరియాణా, అండమాన్‌ నికోబార్, పుదుచ్చేరి, డామన్‌-డయ్యూలు కూడా 100 శాతం జాబితాలో ఉన్నాయి. పంజాబ్‌ 97.8, హిమాచల్‌ ప్రదేశ్‌ 91.9, గుజరాత్‌ 90.2, ఆంధ్రప్రదేశ్‌ 51.8 శాతం కల్పించాయి. 13.2 శాతంతో ఉత్తర్‌ప్రదేశ్‌ చివరి స్థానంలో ఉండగా ఛత్తీస్‌గఢ్‌ 16.1 శాతం, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ 17.7 శాతం కల్పించాయి.

‘సమర్థ్‌’ ప్రారంభం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ ‘సమర్థ్‌’ను ప్రారంభించింది. ఎంఎస్‌ఎంఈ రంగం మహిళలకు అనేక అవకాశాలను అందిస్తోందని ఆ శాఖ మంత్రి నారాయణ్‌ రాణే వెల్లడించారు. పలు రకాల అదనపు ప్రయోజనాలు కల్పించడం ద్వారా వ్యాపార సంస్థల ఏర్పాటు సంస్కృతిని మహిళల్లో పెంపొందిస్తున్నామన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం ద్వారా వారు స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. 2022 - 23లో సమర్థ్‌ కార్యక్రమం ద్వారా సుమారు 7,500 మహిళలు లబ్ధి పొందుతారని వివరించారు. ఈ పథకం కింద మంత్రిత్వ శాఖ నిర్వహించే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు 20 శాతం సీట్లు రిజర్వ్‌ చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఐసీ) అందించే పలు వాణిజ్య పథకాల వార్షిక ప్రాసెసింగ్‌ రుసుములోనూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం రాయితీ అందిస్తున్నట్లు వివరించారు.

‘స్వతంత్రత సైనిక్‌ సమ్మాన్‌ యోజన’కు రూ.3,274 కోట్లు

స్వాతంత్య్ర సమరయోధులు, వారిపై ఆధారపడిన అర్హులైన వారికి పింఛన్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందించే ‘స్వతంత్రత సైనిక్‌ సమ్మాన్‌ యోజన (ఎస్‌ఎస్‌ఎస్‌వై) పథకం అమలు కోసం 2021 - 22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 - 26 వరకు రూ.3,274 కోట్ల కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని కింద దేశవ్యాప్తంగా 23,566 మంది లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్‌ఎస్‌ఎస్‌వై పథకం కేటాయింపులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

పుణె మెట్రో ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉక్రెయిన్‌ సంక్షోభంలో పెద్ద పెద్ద దేశాలే తమ పౌరులను స్వదేశానికి రప్పించుకొనే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, భారత్‌కు మాత్రం ఎలాంటి సమస్య ఎదురుకాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయంగా భారత్‌ పలుకుబడి పెరగడమే దీనికి కారణమని తెలిపారు. మన దేశ సత్తాను ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. పుణెలోని సింబయోసిస్‌ విశ్వవిద్యాలయం స్వర్ణజయంతి వేడుకల్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్‌ గంగ’ విజయవంతమైందని ప్రకటించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న వేలాది మంది భారత విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చామని చెప్పారు. కరోనా టీకా విషయంలోనూ భారత్‌ సత్తాను ప్రపంచదేశాలు గుర్తించాయని అన్నారు. అంతకుముందు ప్రధాని పుణె మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. పుణెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవరణలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజారవాణా కోసం హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ తయారు చేసిన 150 ఈ-బస్సులను ప్రజలకు అంకితం చేశారు. ఎలక్ట్రిక్‌ బస్‌ డిపోను కూడా ప్రారంభించారు.

భవన నిర్మాణ పర్యావరణ నిర్వహణ మార్గదర్శకాలు-2022

నివాస, వాణిజ్య నిర్మాణ స్థలాల మొత్తం భూమిలో (ప్లాట్‌ ఏరియా) కనీసం 10 శాతం పచ్చదనం ఉండేలా చూసేందుకు గాను ప్రతి 80 చదరపు మీటర్ల విస్తీర్ణానికి కనీసం ఒక చెట్టు పెంచాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు భవన నిర్మాణ నిర్వహణ మార్గదర్శకాలు-2022కు సంబంధించి ముసాయిదా ప్రకటనను గత నెల 28న జారీచేసింది. కొత్త నిబంధనలు 5,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపడుతున్న నూతన భవన నిర్మాణ ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న పాత భవనాల ఆధునికీకరణ, పునర్నిర్మాణం, విస్తరణ, మరమ్మతులకు వర్తిస్తాయని తెలిపింది.

తెలంగాణకు రూ.2,063 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో తెలంగాణకు రూ.2,063 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.558 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఈ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.90,048 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) గణాంకాలు వెల్లడించాయి.

దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారంభం

దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ను ముంబయి (బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌)లో 18.5 ఎకరాలలో విస్తరించిన జియో వరల్డ్‌ సెంటర్‌లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రారంభించింది. ఇందులో 1.61 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో మూడు ఎగ్జిబిషన్‌ హాళ్లు, 1.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు కన్వెన్షన్‌ హాళ్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్‌ కేంద్రం 5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుందని రిలయన్స్‌ వెల్లడించింది. ముంబయి నగరానికి ధీరూభాయ్‌ అంబానీ స్క్వేర్, ఫౌంటెయిన్‌ ఆఫ్‌ జాయ్‌లను అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫౌంటెయిన్‌లో 8 ఫైర్‌ షూటర్లు, 392 వాటర్‌ జెట్‌లు, 600కు పైగా ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్‌ కేంద్రంలోని వంటశాల ద్వారా రోజుకు 18,000 మందికి పైగా ఆహారం అందించే సౌలభ్యం ఉంది.

సుస్థిరాభివృద్ధికి ఇంధనంపై బడ్జెట్‌ వెబినార్‌

హరిత హైడ్రోజన్‌కు భారత్‌ అంతర్జాతీయ కేంద్రం కావాలని ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించారు. ఆయన ‘సుస్థిరాభివృద్ధికి ఇంధనం’ అనే అంశంపై జరిగిన బడ్జెట్‌ వెబినార్‌లో ప్రసంగించారు. పునరుత్పాదక ఇంధనంతో దేశానికి ఎంతో లబ్ధి చేకూరనుందని అన్నారు. సుస్థిర ఇంధనంతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గత ఏడాది జరిగిన గ్లాస్గో సదస్సులో 2070కల్లా నెట్‌జీరో సాధిస్తామని తాను హమీ ఇచ్చిన సంగతిని మోదీ గుర్తు చేశారు. ఇందుకోసం సౌర ఇంధనంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 2030కల్లా 500 గిగావాట్ల శిలాజేతర ఇంధనం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.

మొబైల్‌ డేటా లేకుండానే ఇంటర్‌నెట్‌

మొబైల్‌ డేటా లేకుండానే ప్రజలకు ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా పబ్లిక్‌ డేటా ఆఫీసుల (పీడీవో)ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) ఏర్పాటు చేస్తోంది. ‘పీఎం వాణి (పబ్లిక్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ ఫేజ్‌) ప్రాజెక్ట్‌’ కింద దేశంలో లక్షలాది వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటులో భాగంగా పీడీవోలను నెలకొల్పుతున్నారు. గ్రామీణ ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లోని డీవోటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎం వాణి బిజినెస్‌ ప్రమోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టెలికం సలహాదారుడు అశోక్‌కుమార్‌ ప్రారంభించారు. పీడీవోలను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు వైఫై సెట్‌ టాప్‌ బాక్స్‌లను రూ.3 వేల నుంచి రూ.12 వేలకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (టెక్నికల్‌) కె.రాజశేఖర్‌ తెలిపారు.

ఎండను ఒడిసిపట్టి భవనాల బేస్‌మెంట్లకు కాంతి

సూర్యకాంతిని నిక్షిప్తం చేసే సరికొత్త సాంకేతికను అభివృద్ధి చేసిన అంకుర సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన సాంకేతికాభివృద్ధి మండలి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే స్కైషేడ్‌ డేలైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అవగాహన చేసుకొంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ఆధ్వర్యంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సూర్యకాంతిని గ్రహించి భవనాల బేస్‌మెంట్లలో 24 గంటల పాటు కాంతులను వెదజల్లేలా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకు కేంద్రం రూ.5 కోట్లు ఇవ్వనుంది. హ్యూమన్‌ సెంట్రిక్‌ క్లైమేట్‌ అడాప్టివ్‌ బిల్డింగ్‌ ఫకేడ్స్, సెంట్రల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేలైట్‌ సిస్టమ్స్‌ అనే మరో రెండు సాంకేతికతలను కూడా స్కైషేడ్‌ సంస్థ అభివృద్ధి చేసినట్టు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆర్థిక వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణకు మొదటి స్థానం

ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా ట్విటర్‌లో ‘ట్రయంఫెంట్‌ (సాఫల్య) తెలంగాణ థ్యాంక్యూ కేసీఆర్‌’ పేరిట పెట్టిన హ్యాష్‌ట్యాగ్‌కు భారీ స్పందన లభించింది. 50 వేలకు పైగా ట్వీట్లతో ట్రెండింగ్‌లో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదికను పేర్కొంటూ మంత్రి కేటీఆర్‌ హ్యాష్‌ట్యాగ్‌ చేయగా ట్వీట్లు వెల్లువెత్తాయి.

భారత్‌లో 10-30% తగ్గనున్న వరి ఉత్పత్తి

వాతావరణంలో వస్తున్న మార్పులు, నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు ఐపీసీసీ (ది ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ఛేంజ్‌) 6వ వార్షిక నివేదిక పేర్కొంది. ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే భారత్‌లో వరి దిగుబడి 10 నుంచి 30% మేర, మొక్కజొన్న దిగుబడి 25 నుంచి 70% మేర పడిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. పర్యావరణ పరమైన ముప్పు ప్రభావం ఆసియాలో వ్యవసాయం, ఆహార వ్యవస్థపై నానాటికీ పెరుగుతూ పోతోందని తెలిపింది.