యూఏఈ సంస్థతో బీడీఎల్ ఒప్పందం
రక్షణ రంగంలో నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), యూఏఈకి చెందిన తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్‌తో (టీఈసీ) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైన్యం, రక్షణ అవసరాలకు అవసరమైన ఆయుధ సామగ్రి, ఉపకరణాలను తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అక్కడకు అవసరమైన కొనుగోళ్లు ఈ సంస్థ ద్వారా జరుగుతాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం టీఈసీతో కలిసి బీడీఎల్ మిలటరీ ఉపకరణాలు, ఆయుధాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు వాటి నిర్వహణ - మరమ్మతు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు చేపడుతుంది. ఎగుమతులు నిర్వహించే అంశాన్నీ ఈ రెండు సంస్థలు పరిశీలిస్తాయి.
ఉక్రెయిన్, రష్యా చర్చల్లో కీలక ముందడుగు
దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో కీలక ముందడుగు పడింది. రాజీ దిశగా ఇరుదేశాలూ ఓ ముందడుగు వేశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరుదేశాలూ మొగ్గుచూపాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఉత్తర ప్రాంత నగరం చెర్నిహైవ్ సమీపంలో తమ సైనిక కార్యకలాపాలు తగ్గించుకునేందుకు రష్యా సంసిద్ధత ప్రకటించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలుగా విశ్వాసాన్ని పెంచి, తదుపరి ముందడుగు వేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రష్యా రక్షణ శాఖ ఉపమంత్రి అలెగ్జాండర్ ఫొమిన్ పేర్కొన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య మూడు గంటలపాటు కొనసాగిన చర్చలు చాలావరకు ఫలప్రదమయ్యాయి. ఈ నేపథ్యంలో కీవ్, చెర్నిహైవ్‌ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రష్యా సేనల ఉపసంహరణను గమనించినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అంతర్జాతీయ శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయమై ఉభయపక్షాలూ చర్చించుకున్నాయి. సేనల ఉపసంహరణతో పాటు ఉక్రెయిన్ భద్రతకు హామీ గురించి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. గతసారి చర్చల్లో కొలిక్కిరాని అంశాలపైనా ఉభయపక్షాలు మాట్లాడుకున్నాయి. రష్యా డిమాండ్‌కు తగినట్లుగా తమ దేశం (నాటోలో చేరకుండా) తటస్థంగా ఉంటుందని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ చర్చలకు ముందే వెల్లడించారు.
రష్యా దౌత్య సిబ్బందిపై ఈయూ దేశాల బహిష్కరణ
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నాలుగు యూరోపియన్ దేశాలు ‘గూఢచర్య’ ఆరోపణలతో డజన్ల కొద్దీ రష్యన్ దౌత్య కార్యాలయాల సిబ్బందిపై బహిష్కరణ వేటు వేశాయి. అవాంఛిత యుద్ధం కారణంగా రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యా రాయబారుల ముసుగులో ఉన్న 17 మంది ఇంటెలిజెన్స్ అధికారులపై తాము వేటు వేసినట్లు నెదర్లాండ్స్ ప్రకటించింది. ఇదేవిధంగా బెల్జియం కూడా 21 మంది రష్యన్ దౌత్య సిబ్బందిపై వేటు వేసింది. చెక్ రిపబ్లిక్ తమ దేశం విడిచి వెళ్లాలంటూ రష్యన్ రాయబారికి 72 గంటల గడువు విధించింది. ‘మీ కార్యకలాపాలు, దౌత్య ప్రవర్తన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. కాబట్టి, మా దేశం విడిచి వెళ్లండి’ అంటూ ఐర్లాండ్ నలుగురు సీనియర్ రష్యన్ అధికారులను కోరింది. ఈ పరిణామాలపై చెక్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ‘యూరోపియన్ యూనియన్‌లో రష్యా నిఘా తగ్గించాలన్నది మా ఉద్దేశం. మిత్రపక్షాలమైన మేమందరం ఓ సమన్వయంతో ఈ చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. ఈయూలో భాగమైన పోలండ్ గతవారమే రాయబారులుగా ఉంటూ నిఘా అధికారులుగా వ్యవహరిస్తున్నారంటూ ఏకంగా 45 మంది రష్యా అధికారులపై వేటు వేసింది. అమెరికా, బల్గేరియా, స్లొవేకియా, పోలండ్ తదితర దేశాల చర్యలను అనుసరించి తాము కూడా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు నెదర్లాండ్స్ ప్రకటించింది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడటంతో కేబినెట్ నిర్ణయం మేరకు తాము చర్య తీసుకొన్నట్లు డచ్ విదేశాంగ మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ దేశం 17 మంది రష్యన్ రాయబారులను వెనక్కు వెళ్లాలని కోరింది. ఈ పరిణామాలన్నింటిపై రష్యా స్పందిస్తూ.. ‘పూర్తిగా ఆధారం లేని, రెచ్చగొట్టే చర్యలు’ అని మండిపడింది.
రూబుల్స్‌పై రష్యా డిమాండ్‌కు ఒప్పుకోం
సహజవాయువు ఎగుమతులకు రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలన్న రష్యా డిమాండ్‌ను జి-7 దేశాల కూటమి తిరస్కరించింది. ఈ మేరకు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్ హేబెక్ తెలిపారు. జి-7 కూటమిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాల నేతలు తాజాగా బెర్లిన్‌లో సమావేశమయ్యారు. ఇందులో ఐరోపా సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ‘రూబుల్స్‌లో చెల్లింపులు మాకు ఆమోదయోగ్యం కాదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్‌లను ఆమోదించొద్దని సంబంధిత కంపెనీలకు విజ్ఞప్తి చేశాం’ అని హేబెక్ పేర్కొన్నారు. తాము సరఫరా చేసే సహజ వాయువుకు చెల్లింపులు రూబుల్స్‌లోనే చెల్లించాలని తమతో స్నేహపూర్వకంగా ఉండని దేశాలకు స్పష్టం చేస్తామని పుతిన్ గతవారం స్పష్టంచేశారు. దీంతో గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తదుపరి దశలో సహజవాయువు సరఫరాను పుతిన్ పూర్తిగా నిలిపివేయవచ్చన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. రూబుల్స్‌లో చెల్లింపులు చేయకుంటే ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తారా అనే ప్రశ్నకు.. ‘గ్యాస్‌ను ఉచితంగా ఇవ్వలేం’ అని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఇటీవల స్పష్టం చేశారు. దీనిపై జర్మనీ మంత్రి హేబెక్ తాజాగా స్పందిస్తూ.. యుద్ధానికి నిధులు సమకూర్చుకోవడానికే పుతిన్ రూబుల్స్ అడుగుతున్నారని చెప్పారు.
రష్యా యుద్ధనేరాల చిట్టా తయారు
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి నెల రోజులుగా ఆస్పత్రులు, అంబులెన్సులు, రోగులు, వైద్యులు, చివరకు పసికందుల పైనా రష్యన్ సేనలు దాడులు చేస్తున్నాయనీ.. అటువంటి 34 దాడుల చిట్టా తాము తయారు చేశామని అమెరికా వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ప్రకటించింది. ఏపీ, పీబీఎస్ న్యూస్ సర్వీసుకు చెందిన ఫ్రంట్‌లైన్ కలిసి ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పౌరులపై దాడి వెలుగులోకి వచ్చిన ప్రతిసారీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయన సేనానులు, సలహాదారులను యుద్ధ నేరస్థులుగా ప్రకటించి విచారించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇలా విచారించాలంటే ఆ దాడులు ఉద్దేశపూర్వకంగా చేసినవే.. యుద్ధంలో అనుకోకుండా జరిగే నష్టాలు కావని నిరూపించాల్సి ఉంటుంది. అందుకే రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లోని పౌర వైద్య వసతులను పనిగట్టుకొని ధ్వంసం చేస్తున్నాయని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని ఏపీ తెలిపింది. యుద్ధం ముగిసేవరకు ఈ వివరాలను సేకరిస్తూనే ఉంటామని ఏపీ, ఫ్రంట్‌లైన్ సంయుక్తంగా ప్రకటించాయి.
మగతోడు లేదని ఆడవాళ్లను విమానాలు ఎక్కనివ్వని తాలిబన్లు
మహిళలు మగతోడు లేకుండా పయనించకూడదనే మధ్యయుగాల నాటి నియమాన్ని ఆధునిక యుగానికి ప్రతీక అయిన విమానాల్లోనూ తాలిబన్లు అమలు చేశారు. వీరి దుందుడుకు చర్యల ఫలితంగా.. ముందే టికెట్లు బుక్ చేసుకొని కూడా అఫ్గాన్ స్త్రీలు విమానమెక్కడానికి నోచుకోలేకపోయారు. కెనడా తదితర దేశాల పౌరసత్వం ఉన్న అఫ్గాన్ మహిళలూ నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది. పాకిస్థాన్, దుబాయ్, టర్కీ దేశాలకు వెళ్లడానికి కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అనేకమంది మహిళలను తాలిబన్ ప్రభుత్వ ఆదేశాల వల్ల విమానాలు ఎక్కనివ్వలేదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఏ మహిళ అయినా 72 కిలోమీటర్ల దూరానికి మించి ప్రయాణించాలంటే మగతోడు తప్పనిసరి అని తాలిబన్ సర్కారు కొంతకాలం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
మృతి చెందిన రష్యా సైనికుల గుర్తింపునకు వినూత్న సాంకేతికత
ఉక్రెయిన్ గడ్డపై పోరాటంలో మరణించిన రష్యన్ సైనికుల వివరాలను ముఖ గుర్తింపు సాంకేతికత సాయంతో సేకరించి వారి కుటుంబాలకు తెలియజేస్తున్నామని ఉక్రెయిన్ ఉప ప్రధాని, డిజిటల్ సాంకేతిక శాఖ మంత్రి మైఖాయిలో ఫెదొరొవ్ వెల్లడించారు. మరణించిన రష్యన్ సైనికుల సామాజిక మాధ్యమ ఖాతాలను ‘క్లియర్ వ్యూ’ కృత్రిమ మేధ సాంకేతికత సాయంతో శోధించి వారి వివరాలను ఆరా తీస్తున్నామని వివరించారు. క్లియర్ వ్యూ ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఒక అమెరికన్ కంపెనీ ఉక్రెయిన్‌కు ఉచితంగా అందిస్తోంది. ప్రపంచమంతటా అసంఖ్యాక వ్యక్తులు ఇంటర్నెట్‌కు అప్‌లోడ్ చేసిన ఫోటోలను కృత్రిమ మేధ సాయంతో పరిశీలించి వారి వివరాలను ఆరా తీసే సాఫ్ట్‌వేర్ అది. వీకాంటాక్టె అనే రష్యన్ సామాజిక మాధ్యమ సర్వీసులోని 200 కోట్ల ఫోటోలను తమ సెర్చ్ ఇంజిన్ శోధించి వ్యక్తిగత వివరాలను ఆరా తీస్తోందని క్లియర్ వ్యూ తెలిపింది. ఫిబ్రవరి 24న రష్యా తమపై దండెత్తినప్పటి నుంచి పోరులో 15,000 మంది రష్యన్ సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ చెబుతోంది. అయితే, మృతుల సంఖ్య చాలా తక్కువేనని రష్యా పేర్కొంటోంది. క్లియర్ వ్యూ సాంకేతికత గురించి వ్యాఖ్యానించడానికి రష్యా నిరాకరించింది. ముఖ గుర్తింపు సాంకేతికతతో పాటు అమెజాన్ క్లౌడ్ సర్వీసులను కూడా ఉక్రెయిన్ ఉచితంగా ఉపయోగించుకుంటోంది.
యుద్ధ నేరాలపై విచారణకు బ్రిటన్ తోడ్పాటు
ఉక్రెయిన్‌పై అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) చేపట్టే విచారణకు తోడ్పాటు అందించనున్నట్టు బ్రిటన్ వెల్లడించింది. నిధులతో పాటు నిపుణులను కూడా సమకూర్చనున్నట్టు తెలిపింది. ద హేగ్‌లో వివిధ దేశాల మంత్రులతో బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. రష్యా యుద్ధ నేరాలపై విచారణకు కృషి చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకొంది. రష్యాపై విచారణకు మేజిస్ట్రేట్లు, విచారణాధికారులు, న్యాయ నిపుణులతో పాటు... సుమారు రూ.5.20 కోట్ల నిధులు (5 లక్షల యూరోలు) కూడా సమకూర్చుతామని ఫ్రాన్స్ కూడా వెల్లడించింది. ఐసీసీకి బడ్జెట్ సమకూర్చే మూడో అతిపెద్ద దేశం ఫ్రాన్సే.
ఐరాస భద్రతా మండలిలో మాస్కోకు ఎదురుదెబ్బ
ఐరాస భద్రతా మండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం చిత్తుగా వీగిపోయింది. రష్యా సైనిక చర్య క్రమంలోనే ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిందని అక్కడి ప్రజలు నిరాశ్రయులై, ఆకలి దప్పులతో బాధపడుతున్నారని అందులో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ సహా మొత్తం 13 దేశాలు దూరంగా ఉండిపోయాయి. ఒక్క చైనా మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. మరోవైపు... ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభానికి రష్యాయే కారణమని ఆరోపిస్తూ సర్వప్రతినిధి సభ తీర్మానించింది. ఉక్రెయిన్ తదితర దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని 140 దేశాల బలపరచగా, 5 దేశాలు వ్యతిరేకించాయి.
సర్వప్రతినిధి సభలోనూ భారత్ దూరం..
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐరాస సర్వప్రతినిధి సభ ప్రత్యేకంగా అత్యవసర సమావేశం నిర్వహించింది. మానవతా సంక్షోభానికి రష్యాయే కారణమంటూ ఉక్రెయిన్, మరో 24 దేశాలు కలిసి తీర్మానం ప్రవేశపెట్టాయి. ఓటింగ్ సందర్భంగా 140 దేశాలు బలపరచడంతో ఈ తీర్మానం నెగ్గింది. భారత్ సహా 38 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. బెలారస్, సిరియా, ఉత్తర కొరియా, ఎరిత్రియా, రష్యాలు దీన్ని వ్యతిరేకించాయి.
‣ మరోవైపు దక్షిణాఫ్రికా కూడా సర్వప్రతినిధి సభలో మరో తీర్మానం ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభం నెలకొందని, రాజకీయ సంప్రదింపులు, మధ్యవర్తిత్వం ద్వారా అక్కడ శాంతి సాపనకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందులో ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
గూడు చెదిరిన ఉక్రెయిన్ చిన్నారులు
రష్యా దండయాత్ర కారణంగా ఉక్రెయిన్‌లోని సగం మంది పిల్లలు చెదిరిపోయారు. దేశంలో మొత్తం 75 లక్షల మంది చిన్నారులు ఉండగా, వారిలో 43 లక్షల మంది తమ ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్టు ఐరాస బాలల విభాగం అధికారులు పేర్కొన్నారు. వీరిలో 18 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయినట్టు వివరించారు. మానవతా శిబిరాలు, తరలింపు కేంద్రాలు, రైళ్లు తదితర చోట్ల ఉక్రెయిన్ బాలలే ఎక్కువగా కనిపిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ చిన్నారులు సమస్తం కోల్పోయారని ఇజ్రాయెల్‌కు చెందిన వైద్య నిపుణుడు డా.మైకేల్ సెగల్ చెప్పారు. ఉక్రెయిన్‌ను వీడుతున్న చిన్నారుల గాథలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయన్నారు.
రష్యాపై అమెరికా మరిన్ని కఠిన ఆంక్షలు
ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. ఆ దేశ చట్టసభ్యులపైనా, సెంట్రల్ బ్యాంకుపైనా తాజాగా ఆంక్షలను విధించనున్నట్టు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. శరణార్థులకు ఆహారం, ఔషధాలు, మంచినీరు అందించేందుకు అదనంగా రూ.7600 కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపింది. రష్యా దండయాత్ర క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు నేతలు బ్రసెల్స్‌లో కీలక చర్చలు జరుపుతున్న తరుణంలో శ్వేతసౌధం వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
65 సంస్థలు, వ్యక్తులపై బ్రిటన్ చర్యలు
రష్యాకు చెందిన మరో 65 ప్రముఖ సంస్థలు, వ్యక్తులపై బ్రిటన్ తాజాగా ఆర్థిక ఆంక్షలు విధించింది. పరిశ్రమలు, బ్యాంకులు, బడా వ్యాపార సంస్థలే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకున్నట్టు బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ తెలిపారు. ‘‘రష్యాలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఆల్ఫా బ్యాంకు, ప్రపంచంలోనే అత్యంత భారీ వజ్రపు గనుల తవ్వకాల సంస్థ అల్‌రోసాలపై ఆంక్షలు విధిస్తున్నాం. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌కు వరుసకు కుమార్తె అయ్యే పొలినా కొవలెనా కూడా ఈ సెగను ఎదుర్కోక తప్పదు. రష్యా దండయాత్రతో సంబంధమున్న వ్యక్తులపైనా చర్యలు తప్పవు’’ అని లిజ్ ట్రస్ పేర్కొన్నారు.
కెనడాలో 2025 వరకూ ట్రూడోదే అధికారం
కెనడాలో 2025 వరకు తమ పార్టీ అధికారంలో ఉండేలా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రతిపక్షంతో ఓ ఒప్పందానికి వచ్చారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మరోసారి గెలుపొందినప్పటికీ పార్లమెంటులో మెజారిటీకి అవసరమైనన్ని స్థానాలను సాధించలేకపోయింది. దీంతో శాసనాలు చేయడానికి ప్రతిపక్ష న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ)పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత అనిశ్చితి సమయంలో కెనడా ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు, బడ్జెట్ల అమలుకు, సుస్థిర ప్రభుత్వాన్ని నడిపేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదిరినట్లు ట్రూడో తెలిపారు. ఈ మేరకు కలిసి పనిచేయడానికి తాము ఒక అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. తాజా ఒప్పందం మేరకు ఎన్‌డీపీ.. ట్రూడో ప్రభుత్వానికి వివిధ అంశాల్లో మద్దతిస్తుంది. అయితే ఆ పార్టీకి చెందినవారెవరూ ట్రూడో మంత్రివర్గంలో చేరరు. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికలు జరిగే 2025 వరకు ట్రూడో ప్రభుత్వం అధికారంలో ఉండటానికి మార్గం సుగమమైంది.
రష్యాతో ఒప్పందానికి సిద్ధమని ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
రష్యాతో ఒప్పందంపై చర్చించడానికి తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. యుద్ధాన్ని రష్యా విరమించేటట్లయితే నాటోలో సభ్యత్వ ప్రయత్నాలను తాము వదులుకునే అంశంపై చర్చకు తయారుగా ఉన్నట్లు ఉక్రెయిన్ టీవీ ఛానళ్లకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా చర్చలు జరగాలన్న డిమాండును పునరుద్ఘాటించారు. అది జరగనిదే ఈ యుద్ధాన్ని రష్యా ఆపాలనుకుంటున్నదీ లేనిదీ అర్థం చేసుకోవడం అసాధ్యమని తేల్చిచెప్పారు. క్రిమియా స్థితిపైనా, రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల నియంత్రణలోని తూర్పు డాన్‌బాస్ ప్రాంతంపైనా చర్చకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమపై దాడిని విరమించడంతో పాటు భద్రతపరమైన హామీలను ఇచ్చినట్లయితే ఇవన్నీ జరుగుతాయని స్పష్టంచేశారు. వివిధ దేశాల చట్టసభ సభ్యులతో మాట్లాడుతున్న జెలెన్‌స్కీ ఆ క్రమంలో ఇటలీ ఎంపీలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు. మనుగడ కోసం తాము యుద్ధం చేస్తున్నామనీ, తమను జయించడం ద్వారా ఐరోపాకు ప్రవేశమార్గాన్ని ఏర్పరచుకోవాలనేది రష్యా ప్రయత్నమని చెప్పారు. రెండు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను కోరారు. సహాయ కారిడార్లను సయితం రష్యా అడ్డుకుంటోందని, సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని పోప్‌నకు వివరించినట్లు ఆయన ట్వీట్ చేశారు.
పట్టు కోసం పోరాటం
కీవ్ శివార్లలోని వ్యూహాత్మక ప్రాంతాలను రష్యా నియంత్రణ నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. గట్టి ప్రతిఘటన తర్వాత ఇది సాధ్యమైందని వివరించింది. ఈ ప్రాంతం తమ వశం కావడంతో కీలకమైన జాతీయ రహదారి మీదుగా రష్యా సేనల పయనాన్ని అడ్డుకునేందుకు, తద్వారా వాయవ్య దిశ నుంచి కీవ్‌ను అవి చుట్టుముట్టకుండానిలువరించడానికి ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. మేరియుపొల్‌పై పట్టు కోసం రష్యా సేనలు ముమ్మరంగా ప్రయత్నించాయి. ఆ క్రమంలో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. రాజధాని కీవ్‌లోనూ ఇదే పరిస్థితి.
దుబాయ్ ఎక్స్‌పోలో పెవిలియన్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వీక్ ప్రారంభం
దుబాయ్ ఎక్స్‌పోలోని ఇండియా పెవిలియన్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వీక్‌ను భారత సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) కార్యదర్శి అపూర్వ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత మీడియా, వినోద పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.5 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 12 శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న మీడియా పరిశ్రమల్లో భారత్ ఒకటని అన్నారు. ప్రస్తుతం భారత మీడియా, వినోద పరిశ్రమ విలువ 28 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.10 లక్షల కోట్లు)గా ఉందని, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం, వినూత్నతలు దేశంలో ఉన్నాయన్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) కంటెంట్ సృష్టికి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్లు చంద్ర వెల్లడించారు. ఈ నెలాఖరుకు ఏవీజీసీ టాస్క్‌ఫోర్స్‌ను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుందని, ఈ రంగంలో మరిన్ని కంపెనీలు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక ఏవీజీసీ విధానాన్ని రూపొందించడమే దీని లక్ష్యమని వివరించారు.
ఉక్రెయిన్‌లో కోటి మంది నిరాశ్రయులు: ఐరాస
రష్యా దండయాత్ర వల్ల ఉక్రెయిన్‌లో దాదాపు కోటి మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం వెల్లడించింది. వీరిలో 32 లక్షల మందికి పైగా దేశాన్ని వీడి వలస పోయారని, మరో 65 లక్షల మందికి పైగా నివాస వసతిని కోల్పోయి గూడు చెదిరిన పక్షుల్లా ఉన్నారని తెలిపింది. రహదారులు, వంతెనలు ధ్వంసం, భద్రతా కారణాల వల్ల ఆయా ప్రాంతాల్లో మరో కోటి 20 లక్షల మంది చిక్కుకుపోయారని వివరించింది. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభం కాకముందు ఆ దేశ జనాభా 4.40 కోట్లని తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు సగం మంది దేశ ప్రజలు యుద్ధం ప్రభావానికి గురయ్యారని పేర్కొంది. పెను విధ్వంసం సృష్టించిన సిరియా యుద్ధంలో కోటి 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, అయితే, ఉక్రెయిన్‌లో 21 రోజుల వ్యవధిలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు వలసపోయారని వివరించింది.
ఇకపైనా చైనాలో ‘శూన్య కొవిడ్’ విధానం
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మహమ్మారి కట్టడికి ఇంతవరకు అనుసరిస్తున్న ‘శూన్య కొవిడ్’ (కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకూడదన్న) విధానాన్నే కొనసాగించడానికి చైనా నిర్ణయించింది. ఈ విధానాన్ని నెమ్మదిగా సడలించాలని శాస్త్రజ్ఞులు సూచించినా సాధ్యం కాదని చైనా ప్రభుత్వం చెప్పింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించడానికే కట్టుబడి ఉన్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ ఉప మంత్రి వాంగ్ హెషెంగ్ స్పష్టం చేశారు. శూన్య కొవిడ్ విధానం వల్ల ప్రజల జీవితం, వృత్తి వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడినా వారి ఆరోగ్యాలను, భద్రతను కాపాడటానికి ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. చైనా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో 23,000 మంది భారతీయ విద్యార్థులతో సహా లక్షలాది మంది విదేశీ విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడింది.
భారత ఆర్కిటిక్ విధానం ఆవిష్కరణ
భారత్ తన ఆర్కిటిక్ విధానాన్ని ఆవిష్కరించింది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్కిటిక్ ప్రాంతంతో కలిసి అక్కడ శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో భారత్ ముందడుగు వేసేందుకు కొత్త విధానం దోహదపడుతుందని ఆయన తెలిపారు. ‘భారత్ - ఆర్కిటిక్: సుస్థిరాభివృద్ధి భాగస్వామ్య నిర్మాణం’ పేరుతో ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. 1. ఆర్కిటిక్ ప్రాంతంలో శాస్త్రీయ పరిశోధన-సహకారం, 2. వాతావరణం - పర్యావరణ పరిరక్షణ, 3.ఆర్థిక - మానవ అభివృద్ధి, 4. రవాణా - అనుసంధానత, పాలన, 5. అంతర్జాతీయ సహకారం, 6. జాతీయ సామర్థ్యం పెంపు - ఈ ఆరు అంశాలకు ఇందులో ప్రాధాన్యం కల్పించారు. ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి అంతర్ ప్రభుత్వ మండలి (ఆర్కిటిక్ కౌన్సిల్) పనిచేస్తోంది. ఇందులో పరిశీలక హోదా ఉన్న 13 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఆర్కిటిక్ ప్రాంతం 2050 నాటికి మంచు రహితంగా మారుతుందన్న అంచనాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న అపారమైన సహజ వనరులపై పలు ధనిక దేశాలు దృష్టి సారించాయి. ఇక్కడ విలువైన లోహాలు, ఖనిజాలతో పాటు చమురు నిల్వలు భారీగా నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఆర్కిటిక్ ప్రాంతంలో మానవ కార్యకలాపాలన్నీ అంతర్జాతీయ చట్టాలకు లోబడి, అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా జరగాలని భారత్ కోరుతోంది.
రష్యాలో క్రెడిట్ కార్డుల సేవలు రద్దు
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలయిన తర్వాత రష్యాయేతర దేశాల కంపెనీలన్నీ రష్యాలో కార్యకలాపాలను నిలిపివేశాయి. యుద్ధంతో దిగ్గజ సంస్థల వ్యాపార ప్రణాళికలన్నీ కుదేలయ్యాయి. యాపిల్, మెర్సిడెజ్ బెంజ్ వంటి కంపెనీలన్నీ రష్యా నుంచి బయటకు వచ్చేయాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యతను పాటించాలని భావిస్తున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్, టిక్‌టాక్, శాంసంగ్‌లతో పాటు క్రెడిట్ కార్డు కంపెనీలూ ఆ జాబితాలో చేరాయి. రష్యా రూబుల్ విలువ 10 శాతానికి పైగా క్షీణించింది. ఫలితంగా 1.7 లక్షల కోట్ల రూబుళ్ల విలువైన ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. ఇప్పటికే రష్యా కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. దీని వల్ల జనజీవన ప్రమాణాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. రాజకీయ ఆంక్షల ఒత్తిడికి లొంగిపోవడానికి బదులు ‘ఒక పరిశీలనాత్మక నిర్ణయం’ తీసుకోవడంలో పెట్టుబడిదారులకు సహాయం చేస్తామని రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ ఇప్పటికే ప్రకటించారు.
రష్యా, భారత్ ముడిచమురు ఒప్పందం ఆంక్షల పరిధిలోకి రాదని అమెరికా ప్రకటన
ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు వరుస ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి దాదాపు 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్ చౌకధరకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఒక ట్రేడర్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఈ చమురును భారత్ తీరానికి తీసుకొచ్చే బాధ్యత విక్రయదారుడిదే. ఇందుకు అనుగుణంగా ఒప్పందంలో ఐఓసీ షరతులు విధించింది. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే బ్యారెల్ బ్రెంట్ ధరలో 20 - 25 డాలర్ల తక్కువకే ఉరాల్ క్రూడ్‌ను రష్యా నుంచి ఐఓసీ కొనుగోలు చేసిందని ఈ పరిణామంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు కొనుగోలుకు సంబంధించి ఇదే మొదటి లావాదేవీ. గత కొన్ని నెలలుగా భారత్ తన చమురు దిగుమతి బిల్లు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో రష్యా.. భారత్‌కు ధర తగ్గించి సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చౌకధరకే ముడి చమురు కొనుగోలు చేయనుందన్న వార్తలపై అమెరికా స్పందించింది. భారత్ ఒప్పందం ఆంక్షల పరిధిలోకి రాదని పేర్కొంది.
రష్యా బహిష్కరణ
ఐరోపా అత్యున్నత మానవ హక్కుల సంఘం ది కౌన్సిల్ ఆఫ్ ఐరోపా నుంచి రష్యా బహిష్కరణకు గురైంది. 47 ఐరోపా దేశాలతో ఏర్పాటైన ఈ సంఘంలో రష్యాతో పాటు, ఉక్రెయిన్ కూడా సభ్యదేశం.
ఉక్రెయిన్ నుంచి 30 లక్షల మంది వలస
రష్యా సైనిక చర్య చేపట్టినప్పటిన తర్వాత ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకూ సుమారు 30 లక్షల మంది తరలిపోయారని అంతర్జాతీయ వలస సంస్థ (ఐవోఎం) వెల్లడించింది. ఉక్రెయినేతర దేశాలకు చెందిన మరో 1,57,000 మంది కూడా ఐరోపాకే వలస వెళ్లడంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ మరో భారీ శరణార్థుల సంక్షోభం తలెత్తిందని పేర్కొంది. ఈ మేరకు ఐవోఎం ప్రతినిధి పాల్ డిలియన్ ఈ వివరాలను వెల్లడించారు. కాగా, ఉక్రెయిన్ నుంచి సుమారు 3 లక్షల మంది పశ్చిమ ఐరోపాకు తరలి వెళ్లినట్టు యూఎన్‌హెచ్‌సీఆర్ తెలిపింది. శరణార్థుల్లో ఏకంగా 18 లక్షల మంది పోలండ్‌కే తరలివెళ్లారని పేర్కొంది.
ఉక్రెయిన్‌పై ఐరాస తీర్మానానికి రష్యా ముసాయిదా!
ఉక్రెయిన్‌లో దుర్బల పరిస్థితుల్లో ఉన్న పౌరులకు రక్షణ కల్పించాలంటూ ఐరాస భద్రత మండలిలో తీర్మానించడానికి రష్యా ఒక ముసాయిదా రూపొందించింది. మానవతా సాయం అందించడానికి సురక్షిత మార్గాన్ని కల్పించాలనీ, ఆ దేశాన్ని వదిలి వెళ్లాలనుకుంటున్నవారికి తగిన అవకాశం కల్పించాలని దీనిలో పేర్కొంది. యుద్ధంలో తన పాత్ర గురించి మాత్రం దీనిలో ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా ఉక్రెయిన్‌లో క్షీణిస్తున్న పరిస్థితులు, సాధారణ ప్రజల ప్రాణనష్టంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఐరోపా మానవ హక్కుల మండలికి రష్యా దూరం
ఐరోపా మానవ హక్కుల మండలి నుంచి వైదొలగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు లాంఛనంగా నోటీసును మండలికి అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
విలాస వస్తువుల ఎగుమతులపై బ్రిటన్ ఆంక్షలు
రష్యాకు అత్యంత విలాసవంతమైన వాహనాలు, కళాఖండాలు తదితర వస్తువుల ఎగుమతులపై బ్రిటన్ నిషేధం విధించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వోడ్కా, ఇతర వస్తువులపై పన్నులను పెంచింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే 370 మంది రష్యా, బెలారస్ పారిశ్రామికవేత్తలపై ఆంక్షలు విధించిన బ్రిటన్ తాజాగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ వాణిజ్యం నుంచి రష్యాను మరింత ఏకాకిని చేయడానికి తాజా నిర్ణయాలు దోహదపడతాయని బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునక్ వ్యాఖ్యానించారు.
పుతిన్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు లక్ష్యంగా అమెరికా ఆంక్షలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అమెరికా మరోసారి ఆంక్షలు విధించింది. వీరిలో రక్షణ శాఖ ఉప మంత్రులు, సీనియర్ సైనికాధికారులు ఉన్నారు. రష్యా ప్రభుత్వం విమర్శకులపై మోపిన అవినీతి, హక్కుల ఉల్లంఘన కేసుల్లోని జడ్జి, ప్రాసిక్యూషన్ అధికారిపైనా వీటిని ప్రయోగించింది. మానవ హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలకు ఉద్దేశించిన మ్యాగ్నిటిస్కీ చట్టం కింద కొన్ని ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా పుతిన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా వరుసగా ఆంక్షలు విధిస్తుంది. తాజాగా బెలారస్ నాయకుడు అలెగ్జాండర్ లుకాషెంకో, ఆయన భార్య హలీనా పైనా కొరడా ఝళిపించింది. ఉక్రెయిన్‌పై దాడికి తన భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు బెలారస్ అనుమతిచ్చిన నేపథ్యంలో ఈ చర్యను చేపట్టింది.
రష్యాపై అంతర్జాతీయ కూటమి ఆర్థిక యుద్ధం: అమెరికా
రష్యాకు వ్యతిరేకంగా విశాల అంతర్జాతీయ కూటమిని నిర్మిస్తున్నామని అమెరికా అధ్యక్ష భవన పత్రికా కార్యదర్శి జెన్ పి. సాకీ తెలిపారు. జీ 7, నాటోలతో పాటు ప్రపంచంలో అనేకానేక దేశాలను కలుపుకొని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నామన్నారు. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) ఆర్థిక ఆంక్షల వల్ల రష్యన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందని చెప్పారు. తమ ఆంక్షల్ని ధిక్కరించి చైనా మాస్కోకు సాయపడే అవకాశం లేదన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా, రష్యాల వాటా 25 శాతమైతే అమెరికాతో సహా జీ 7, ఈయూ, ఇండో పసిఫిక్ దేశాల వాటా 50 శాతానికి పైనేనని సాకీ వివరించారు.
నార్వేలో మొదలైన నాటో విన్యాసాలు
ఐరోపా, ఉత్తర అమెరికాకు చెందిన 25కి పైగా దేశాలు పాల్గొన్న విన్యాసాలు ఉత్తర నార్వేలో మొదలయ్యాయి. సుమారు 30,000 మంది సైనిక బలగాలు పాలుపంచుకుంటున్నాయి. 200 విమానాలు, 50 యుద్ధనౌకలు పాల్గొంటున్న ఈ విన్యాసాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని నాటో స్పష్టంచేసింది. రష్యా ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి చాలాముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్ణయించినట్లు వివరించింది. విన్యాసాలకు పరిశీలక దేశం హోదాలో వచ్చేందుకు రష్యా నిరాకరించింది.
చైనాను భయపెడుతున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’
చైనాలో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ ఉప వేరియంట్‌గా పరిగణిస్తున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ డ్రాగన్ దేశాన్ని వణికిస్తోంది. బి.ఎ.2 గా పిలిచే ఈ కొత్త వేరియంట్‌తో నగరాలకు నగరాలు లాక్‌డౌన్ గుప్పిట్లోకి వెళుతున్నాయి.
చిలీ అధ్యక్షుడిగా మాజీ విద్యార్థి నేత
వామపక్ష భావజాల విద్యార్థి నేత గాబ్రియేల్ బోరిక్ చిలీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 36 ఏళ్ల వయసులో దేశ అత్యున్నత పదవిని అలంకరించిన చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. తన కేబినెట్‌లో మహిళలకు పెద్దపీట వేశారు. మంత్రులుగా నియమితులైన వారిలో 14 మంది మహిళలు కాగా 10 మంది పురుషులు. చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని యువ నేత ప్రకటించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో మొత్తం 155 స్థానాలకు గాను గాబ్రియేల్ నేతృత్వంలోని వామపక్ష కూటమికి 37 స్థానాలు మాత్రమే లభించాయి. మరికొన్ని పార్టీల మద్దతు సంపాదించగలిగినప్పటికీ పూర్తి మెజారిటీకి ఇంకా స్వల్ప దూరంలోనే ఉంది.
సౌదీలో ఒకేరోజు 81 మందికి మరణశిక్ష
హత్యలు, ఉగ్రవాదం వంటి నేరాలకు పాల్పడిన 81 మందికి (సౌదీలు 73 మంది, యెమన్లు ఏడుగురు, సిరియన్ ఒకరు) సౌదీ అరేబియాలో సామూహికంగా మరణశిక్ష అమలు చేశారు. గల్ఫ్ రాజ్య ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా చెప్పవచ్చు. 1979లో మక్కాలోని దివ్య మసీదును స్వాధీనం చేసుకున్నందుకు దోషులుగా తేలిన 63 మంది ఉగ్రవాదులకు 1980 జనవరిలో సామూహిక మరణశిక్ష అమలు చేశారు. ఇస్లాం మతానికి చెందిన పవిత్ర ప్రదేశంపై జరిగిన ఘోరమైన దాడిగా ఉగ్రవాదుల చర్య గుర్తుండిపోయింది. తాజాగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో సామూహిక మరణశిక్షలను అమలు చేయడం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సౌదీ ప్రెస్ ఏజెన్సీ తాజా మరణశిక్షల గురించి ప్రకటించింది. నిందితుల్లో కొందరు అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులతోపాటు యెమన్‌లోని హౌతి తిరుగుబాటు దళాల మద్దతుదారులు ఉన్నట్లు వెల్లడించింది.
స్థానిక కరెన్సీల్లోనే రష్యాతో వాణిజ్యం: భారత్ ప్రణాళికలు
రష్యాతో భారత వాణిజ్యంపై అంతర్జాతీయ రాజకీయాల ఆటుపోట్ల ప్రభావం పడకుండా భారత్ యత్నిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా మూడు రంగాల్లో స్థానిక కరెన్సీల్లో భారత్-రష్యా వాణిజ్యానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. వ్యవసాయం, ఔషధ, ఇంధన రంగాలు. చెల్లింపుల సదుపాయం కోసం థర్డ్‌పార్టీని ఏర్పాటు చేయడంపై కేంద్రం పనిచేస్తోంది. ఇందులో భాగంగా యూకో బ్యాంక్, ఎస్‌బీఐలతో చర్చలు జరుపుతోంది. ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో యూకో బ్యాంక్ చెల్లింపులను సమన్వయం చేయడం గమనార్హం.
‣ చెల్లింపుల విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రష్యా నుంచి వస్తువుల దిగుమతి; రష్యాకు వస్తువుల ఎగుమతి చేసే భారత ట్రేడర్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లడంతో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. సొసైట్ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్సియల్ టెలికమ్యూనికేషన్(స్విఫ్ట్)ను రష్యా బ్యాంకులు వినియోగించకుండా అమెరికా, మిత్ర దేశాలు నిషేధం విధించిన తర్వాత భారత ట్రేడర్లకు ఈ సవాళ్లు ఎదురయ్యాయి. రూపాయి-రూబుల్ వ్యవస్థలో వాణిజ్యానికి అనుమతిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు అంటున్నారు.
భారత అంకురాల కోసం మిత్సుబిషి రూ.2250 కోట్ల నిధి
భారత అంకురాల కోసం జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల గ్రూప్ మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్(ఎమ్‌యూఎఫ్‌జీ) 300 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.2,250 కోట్లు) నిధిని ఏర్పాటు చేస్తోంది. ఎమ్‌యూఎఫ్‌జీ బోర్డు డైరెక్టర్లలో సభ్యుడు, ప్రెసిడెంట్, గ్రూప్ సీఈఓ హిరోనోరి కమెజవ ఈ విషయాన్ని తెలిపారు. దీనివల్ల భారత ఆర్థిక వృద్ధికి ఆర్థిక మద్దతు లభించడమే కాకుండా.. ఐటీ రంగంలోని కంపెనీలతో ఎమ్‌యూఎఫ్‌జీ భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని తెలిపారు.
రష్యా నుంచి విదేశీ కంపెనీల నిష్క్రమణ
రష్యా రాజధాని మాస్కోలోని ఏడంతస్తుల ఎవ్రోపైస్కై మాల్ ఒకప్పుడు విదేశీ వస్తు దుకాణాలతో కళకళలాడేది. లండన్, పారిస్, రోమ్ పేర్లతో ఇక్కడున్న విభాగాలు ఖరీదైన వస్తువులను విక్రయించేవి. ఉక్రెయిన్‌పై పుతిన్ సేనల యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల కారణంగా... ఈ దుకాణాలన్నీ రెండు వారాలుగా ఖాళీ అవుతున్నాయి. మరెన్నో విదేశీ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. దీంతో వేల మంది రష్యన్లు ఉపాధి కోల్పోనున్నారు. ఇలాంటి కంపెనీలను వేలం వేయడం ద్వారా ఇతర సంస్థలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు పుతిన్ సర్కారు కొత్త చట్టం తీసుకురానుంది. దీన్ని ఉపయోగించి... విదేశీ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలను పూర్తిగా, లేదంటే 25% వాటాతో స్వాధీనం చేసుకోనుంది.
నల్లసముద్రంలో నౌకలకు అడ్డంకులు కల్పించొద్దన్న ఐఎంవో
జెనీవా, మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో... అక్కడి నల్లసముద్రం, అజోవ్ సాగర తీరాల్లో చిక్కుకున్న వాణిజ్య నౌకలు తరలిపోయేందుకు సేఫ్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (ఐఎంవో) పిలుపునిచ్చింది. ఐరాసకు చెందిన ఈ విభాగం... అంతర్జాతీయ సముద్రయానం, సముద్ర చట్టాలను పర్యవేక్షిస్తుంది. నల్లసముద్ర తీరంలో పేలుళ్లు రెండు రవాణా నౌకలను తాకడంతో సమావేశమైంది. వాణిజ్య నౌకలపై రష్యా దాడులను ఖండించింది. నావికుల భద్రత, సంక్షేమంతో పాటు సముద్ర పర్యావరణానికీ ఇవి హాని చేస్తాయని హెచ్చరించింది. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 579 మంది పౌరులు మృతిచెందగా, మరో 982 మంది తీవ్రంగా గాయపడినట్టు... ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వెల్లడించింది. మృతుల్లో 42 మంది చిన్నారులు ఉన్నట్టు వివరించింది.
‣ ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేలా రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు ఇటలీ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ట్రియెస్టే నౌకాశ్రయంలో ఉన్న రష్యా సూపర్‌యాచ్‌ను ఇటలీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన ఈ నౌక విలువ సుమారు రూ.4,437 కోట్లు (578 మిలియన్ డాలర్లు).
పశ్చిమ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
ప్రపంచ దేశాలు ఎంత నచ్చజెప్పినా నెమ్మదించని రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేపట్టాయి. యుద్ధ ఆరంభంలో ఉక్రెయిన్‌లోని ప్రభావిత ప్రాంతాల నుంచి వేలమంది పౌరులు పొట్టచేతపట్టుకుని ఎల్వివ్‌కు చేరుకున్నారు. అక్కడి మానవతా శిబిరాల్లో, స్నేహితుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు రష్యా తాజాగా దాడులు చేపట్టిన వైమానిక స్థావరాలు ఈ శిబిరాలకు కేవలం 130, 150 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
‣ ఎంతకూ చేజిక్కని కీవ్‌ను కొల్లగొట్టేందుకు పుతిన్ సరికొత్త వ్యూహానికి తెరతీశారు. విదేశాలకు చెందిన 16,000 మంది ఫైటర్లను ఉక్రెయిన్‌లో దించేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వీరంతా మధ్య ఆసియాకు చెందినవారని, వీరిలో చాలామంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై పోరాడినవారేనని రష్యా రక్షణమంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. ఐరోపాలోనే అతిపెద్ద అణు రియాక్టర్ ‘జాపోరిజియా’ భవనంపై దాడిచేసిన పుతిన్ బలగాలు తాజాగా ఖర్కివ్‌లోని అణు పరిశోధన కేంద్రంపై విరుచుకుపడ్డాయి. దీంతో ఈ యూనిట్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
రష్యాపై ‘ఎంఎఫ్‌ఎన్’ హోదా రద్దు దిశగా అమెరికా
ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్న అమెరికా మళ్లీ కొరడా ఝళిపించింది. రష్యా వాణిజ్య స్థాయిను తగ్గించాలని నిర్ణయించింది. ఆ దేశానికి వాణిజ్యపరంగా ఇస్తున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) హోదాను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో ఐరోపా సమాఖ్య (ఈయూ), జి-7 దేశాల కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై నిషేధం విధించింది. అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేస్తే.. రష్యా దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించే వెసులుబాటు అమెరికాకు కలుగుతుంది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం ఉంది. ఎంఎఫ్‌ఎన్ హోదా పోతే.. క్యూబా, నార్త్ కొరియా దేశాల సరసన రష్యా చేరుతుంది. ఇప్పటికే రష్యా ఎంఎఫ్‌ఎన్ హోదాను కెనడా రద్దు చేసింది.
ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్ డాలర్ల అమెరికా సాయం
యుద్ధంలో నేరుగా పాల్గొనడం తప్ప ఉక్రెయిన్ ప్రజలకు అన్ని రకాలుగా సాయం చేస్తామని ప్రతిన బూనిన అమెరికా అందుకు తగ్గట్టే వ్యవహరిస్తోంది. ఆ దేశానికి సైనిక, మానవతా సాయం కింద 13.6 బిలియన్ డాలర్లను అందివ్వనుంది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం రూపొందించిన ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది. ప్యాకేజీలో సగభాగం సైనిక అవసరాలకు ఖర్చు చేశారు. మిగిలిన భాగాన్ని మానవతా, ఆర్థిక సాయంగా ఉక్రెయిన్‌కు అందిస్తారు.
రష్యా పార్లమెంట్ సభ్యులపై బ్రిటన్ ఆంక్షలు
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతిచ్చిన రష్యా పార్లమెంటులోని దిగువసభ అయిన డ్యూమాలోని 386 సభ్యులపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. దీంతో ఇక ఈ సభ్యులెవరూ యూకేలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేరు. వీరికి ఉన్న ఆస్తులను కూడా అధికారులు జప్తు చేస్తారు.
చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన లీ పదవీ విరమణ
దశాబ్దకాలంగా ప్రధానమంత్రి హోదాలో చైనా ఆర్థికవ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేర్చిన లీ కెకియాంగ్ (66) ఈ ఏడాది పదవీ విరమణ చేయబోతున్నారు. దేశాధ్యక్షుడు, చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్, సైన్యాధ్యక్షుడు అయిన షీ జిన్‌పింగ్ తప్ప చైనాలో పార్టీ, ప్రభుత్వ నాయకత్వమంతా ఈ ఏడాది చివరకు మారిపోనుంది.
‣ ఆర్థిక, న్యాయశాస్త్ర పట్టభద్రుడైన లీ 1976లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నిరాడంబరంగా జీవితం గడిపే ఈయన ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలపైనే దృష్టి పెట్టేవారు. 2012లో ప్రధాని పగ్గాలు చేపట్టినప్పుడు 8.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న చైనా ఆర్థికవ్యవస్థ పరిమాణం 2021 నాటికి 17.7 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. చైనా పూర్వ అధ్యక్షుడు హు జింటావో శిష్యరికంలో లీ పలు బాధ్యతలు నిర్వహించారు. 2012 చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో ప్రధానమంత్రి పదవి చేపట్టారు. జింటావో ప్రభుత్వంలో షీ జిన్‌పింగ్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించగా లీ ఉప ప్రధానిగా ఉండేవారు. 2012 పార్టీ మహాసభల్లో జింటావో పదవీ విరమణ చేయగా జిన్‌పింగ్ అధినాయకుడిగా ఆవిర్భవించారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరవాత మళ్లీ అంత శక్తిమంతుడైన నాయకుడిగా జిన్‌పింగ్ ఎదిగారు. ఈయనకు నంబర్-2గా లీ కెకియాన్ నిలిచారు. జిన్‌పింగ్ అవినీతి నిర్మూలన ఉద్యమంలో భాగంగా 10 లక్షలమంది పౌర, సైనిక అధికారుల పనిపట్టగా.. లీ కెకియాంగ్ దేశ ఆర్థికరథాన్ని పరుగులు తీయించే బాధ్యతను తీసుకున్నారు. ప్రతి అయిదేళ్లకు ఒకసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలను ఈ ఏడాది చివర్లో నిర్వహించనున్నారు. ఆ సభల్లో జిన్‌పింగ్ తప్ప మిగతా నాయకులంతా పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తతరం పగ్గాలు చేపడుతుంది.
ఉక్రెయిన్ - రష్యా చర్చల్లో ప్రతిష్టంభన
యుద్ధం నుంచి ఉపశమనం కోసం రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు చర్చలు జరిపినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఆమోదయోగ్య పరిష్కారానికి రావడంలో ఉభయ పక్షాలు విఫలమయ్యాయి. ప్రతిష్టంభన తొలగించడానికి మంత్రులిద్దరూ టర్కీలోని ఆంటల్యాలో భేటీ అయ్యారు. యుద్ధం మొదలయ్యాక ఈ స్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి. ప్రజల సురక్షిత తరలింపులకు నడవాల ఏర్పాటు, దాడుల విరమణ ప్రధాన చర్చనీయాంశాలుగా దీనిని నిర్వహించారు.
రష్యాతో సంబంధాలకు డబ్ల్యూఈఎఫ్ దూరం
రష్యాకు చెందిన అన్ని సంస్థలతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలతో ఎలాంటి కార్యకలాపాలు ఉండబోవని పేర్కొంది. రష్యా, బెలారస్‌లతో సంబంధాలు నిలిపివేస్తున్నట్లు మరో అంతర్జాతీయ వేదిక ‘నార్తర్న్ డైమెన్షన్’ కూడా ప్రకటించింది.
జెలెన్‌స్కీని పదవి నుంచి దించాల్సిందే!
‘‘పట్టు విడువరాదు. ఎత్తిన కత్తి దించరాదు. ఆరు నూరైనా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కొట్టి తీరాల్సిందే. జెలెన్‌స్కీని పదవీచ్యుతిడిని చేయాల్సిందే’’ - ఇదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంతమని అమెరికా రక్షణ, గూఢచారి సంస్థలు పేర్కొంటున్నాయి. తన సైనిక చర్యకు ఆటంకాలు ఎదురవుతున్నా పుతిన్ మాత్రం వెనక్కు తగ్గరని విస్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా దళాలను ఆహారం, ఇంధన కొరత, సరఫరా సమస్యలు పీడిస్తున్నాయనీ, వారిలో నైతిక స్థైర్యమూ తగ్గిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ ప్రధాన ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. అయినప్పటికీ కీవ్‌ను స్వాధీనం చేసుకుని, పాశ్చాత్య అనుకూల అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీని అధికారం నుంచి దింపి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ప్రతిష్టించే వరకూ పుతిన్ పోరాటం ఆపరని నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రస్తుతం రష్యా సేనలు వెనుకబడినా, కీవ్‌ను స్వాధీనం చేసుకునే సత్తా వారికి ఉందని అమెరికా వాయుసేన విశ్రాంత అధికారి ఫిలిప్ బ్రీడ్ లవ్ ఉద్ఘాటించారు. 2013 - 16 మధ్య ఐరోపాలో నాటో సేనల కమాండర్‌గా ఆయన పనిచేశారు.
తిష్ఠ వేస్తే గెరిల్లా యుద్ధమే?
రష్యన్లు ఉక్రెయిన్‌లోనే తిష్ఠ వేస్తే స్థానికుల నుంచి దీర్ఘకాల గెరిల్లా యుద్ధం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు కావాల్సిన ఆయుధాలను, శిక్షణను అమెరికా, నాటోలు ఇప్పటికే ఉక్రెయిన్ దళాలకు అందించాయి. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించిన తర్వాత ఉక్రెయిన్ సేనలకు తామిచ్చిన శిక్షణ వల్లనే రష్యన్లను గట్టిగా ప్రతిఘటించగలుగుతున్నారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్ బర్గ్ వివరించారు. ఈ ప్రతిఘటన వల్ల రష్యన్లు ఆశించినంత వేగంగా ముందడుగు వేయలేకపోతున్నారు. ఫలితంగా వారు రాకెట్లను, క్షిపణులను, ఇతర దూరశ్రేణి ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై రాకెట్లు వచ్చిపడి విధ్వంసం సృష్టిస్తున్నందున... ఇక్కడి నుంచి శరణార్థులు పోలండ్, రొమేనియా తదితర పొరుగు దేశాలకు తరలిపోతున్నారు. 2 వారాలుగా నడుస్తున్న యుద్ధం కారణంగా సుమారు 20 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడచిపోయారనీ, ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
రష్యా విమానాలపై బ్రిటన్ కొత్త చట్టం
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ప్రతిగా రష్యా విమానాలు తమ గగనతలంపై ఎగరకుండా ఇప్పటికే ఆంక్షలు విధించిన బ్రిటన్ మరో కొత్త చట్టాన్ని ప్రకటించింది. వైమానిక ఆంక్షల పరిధిని మరింత పెంచింది. తాజా చట్టం ప్రకారం.. రష్యాతో సంబంధం ఉన్న ఏ విమానమూ.. బ్రిటన్ గగనతలంలో ఎగరడానికి, దిగడానికి వీల్లేదు. దీన్ని ఉల్లంఘిస్తే నేరపూరిత చర్యగా బ్రిటన్ పరిగణిస్తుంది. ఇక నుంచి విమాన, అంతరిక్ష రంగంలో సాంకేతికతను రష్యాకు ఎగుమతి చేయకూడదని కూడా నిర్ణయించింది.
ఐరోపా కమిషన్ కఠిన ఆంక్షలు
రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయనున్నట్లు ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్ పేర్కొన్నారు. బెలారస్ బ్యాంకింగ్ వ్యవస్థపైనా ఆంక్షలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. మెరుగైన నైపుణ్యం కలిగిన సైనిక పరికరాలను ఉక్రెయిన్‌కు పంపించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
‘చెర్నోబిల్’తో తెగిపోయిన సంబంధాలు
ఉక్రెయిన్‌లో రష్యన్ దళాల అధీనంలోకి వెళ్లిపోయిన చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం (ఎన్‌పీపీ)తో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కి సంబంధాలు తెగిపోయాయి. ఈ మేరకు ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ‘సేఫ్‌గార్డ్స్ మానిటరింగ్ సిస్టమ్స్’ నుంచి రిమోట్ డేటా ట్రాన్స్‌మిషన్ ఆగిపోయినట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ఐఏఈఏ తెలిపింది. రష్యన్ దళాల నియంత్రణలో ఉన్న చెర్నోబిల్ ఎన్‌పీపీ సిబ్బంది పరిస్థితి పట్ల ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. చెర్నోబిల్ ప్లాంట్ ‘సురక్షిత యాజమాన్య నిర్వహణ’కు గాను సిబ్బందిని క్రమానుగతంగా మారుస్తుండటం (రొటేషన్) అత్యవసరమని ఉక్రెయిన్ అధికారులు ఇప్పటికే తమకు తెలిపినట్లు ఐఏఈఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం 210 మంది సిబ్బంది దాదాపు రెండు వారాలుగా అక్కడే పనిచేస్తున్నారు. కొంతమేర వారికి ఆహారం, నీళ్లు, మందులు అందుతున్నప్పటికీ వారి పరిస్థితి అధ్వానంగా మారినట్లు ఐఏఈఏ తెలిపింది. అణు విద్యుత్తు కేంద్రాల్లో సిబ్బందికి విశ్రాంతి అవసరమని, రెగ్యులర్ షిఫ్టుల్లో వారు పని చేస్తుండాలని గ్రోసీ పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ఎన్‌పీపీల పరిరక్షణకు సాయం అందించేందుకు, చెర్నోబిల్‌కు వెళ్లేందుకు కూడా డైరెక్టర్ జనరల్ సంసిద్ధతను తెలిపినట్లు ఐఏఈఏ పేర్కొంది. ‘‘ఉక్రెయిన్‌లో మొత్తం 15 ఎన్‌పీపీలుండగా వాటిలో 8 (జపోరిజియాలోని రెండింటితో సహా) ప్రస్తుతం నడుస్తున్నాయి. అక్కడి సిబ్బంది షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయి’’ అని ఉక్రెయిన్‌లో పనిచేస్తున్న ఎన్‌పీపీలకు సంబంధించిన స్థాయి సమాచారాన్ని ఐఏఈఏ వెల్లడించింది.
ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు: బ్రిటన్
రష్యా దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు సాయంగా మరిన్ని ఆయుధాలను పంపించనున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ప్రత్యేకించి ట్యాంకు విధ్వంసక క్షిపణులను అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలేస్ దిగువసభకు వివరాలు అందించారు. ఇప్పటికే 2,000 తేలికపాటి ట్యాంకు విధ్వంసక క్షిపణులను పంపించగా అదనంగా మరో 1,615 అందజేయనున్నట్లు చెప్పారు. లాంగర్ - రేంజి జావెలిన్ క్షిపణులు, భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను కూడా పంపించనున్నట్లు వెల్లడించారు. నిత్యావసరాలు, వైద్య, సైనిక సామగ్రి సరఫరాను కూడా మరింతగా పెంచనున్నట్లు తెలిపారు. ఇంతవరకు స్వీడన్, ఫిన్లాండ్ సహా మొత్తం 14 దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపించాయి.
రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పిలుపు
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్యాపై కడవరకూ పోరాడతామని, ఈ విషయంలో ఇసుమంతైనా వెనక్కు తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. తాము విడిచిపెట్టబోమని, యుద్ధంలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. రష్యాను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని, ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి వీడియో ద్వారా ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి విదేశీ నేత ప్రసంగించడం ఇదే తొలిసారి.
ఉక్రెయిన్‌కు మిగ్-29 యుద్ధ విమానాలను ఇస్తాం: పోలండ్
తమకు యుద్ధ విమానాలు ఇవ్వాలని ఉక్రెయిన్ అభ్యర్థిస్తున్న తరుణంలో.. అమెరికా సూచన మేరకు తమ వద్దనున్న మిగ్-29 యుద్ధ విమానాలన్నింటినీ జర్మనీలోని అమెరికా వాయుసేన స్థావరానికి తరలించడానికి సంసిద్ధమని పోలండ్ ప్రకటించింది.
రష్యా పరిశీలక హోదా తాత్కాలికంగా నిలిపివేత: సెర్న్
రష్యాకు సంబంధించి ఐరోపా అణు పరిశోధన సంస్థ ‘సెర్న్’ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి ఉన్న పరిశీలక హోదా (అబ్జర్వర్ స్టేటస్)ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు తదుపరి నోటీసు వచ్చేవరకు రష్యాతో లేదా ఆ దేశ సంస్థలతో కొత్తగా ఎలాంటి భాగస్వామ్యాలూ ఉండబోవని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఈ సందర్భంగా ‘సెర్న్’ ఖండించింది. ‘సెర్న్’లో 23 ఐరోపా దేశాలు, ఇజ్రాయెల్‌లకు సభ్యత్వం ఉండగా 7 అసోసియేట్ సభ్య దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఉంది. అలాగే అమెరికా, జపాన్, ఈయూల మాదిరిగా రష్యాకు ఇందులో పరిశీలక హోదా ఉంది. ఈమేరకు సెర్న్ మండలి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రష్యాకు ఆ హోదాను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయించింది.
రష్యా దిగుమతులపై నిషేధం ప్రకటించిన అమెరికా, బ్రిటన్
ఉక్రెయిన్‌పై విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా, బ్రిటన్ భారీ ఆర్థిక అస్త్రాన్ని సంధించాయి. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశానికి వస్తున్న ఆదాయానికి గండికొట్టే కీలక నిర్ణయం తీసుకున్నాయి.
‣ రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోరాదని అమెరికా నిర్ణయించింది. రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు ఇది అదనం. ఇతర ఆంక్షల ప్రభావం రష్యాపై ఉన్నా, ఇంధన అమ్మకాల ద్వారా నిరంతరం ఆర్థిక వనరులు పొందగలుగుతోంది. అందుకే అమెరికా ఈ అడుగు వేసింది.
డెనిపర్ నదిపై నిర్మించిన డ్యామ్‌ను కూల్చివేసిన రష్యా సైన్యం
మంటలను ఆర్పేందుకు ఉపయోగపడే నీరే అక్కడ అగ్గి రాజేసింది. రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఉక్రెయిన్ - రష్యా మధ్య చిచ్చుపెట్టిన అంశాల్లో అత్యంత కీలకమైనది డెనిపర్ నదిపై నిర్మించిన ఆనకట్ట. ఈ నిర్మాణం తర్వాతే క్రిమియా దీవికి నీటి సరఫరా తగ్గిపోయింది. ప్రజలకు తాగు, సాగు అవసరాలను తీర్చేలేకపోవడంతో పాటు తమ నౌకాస్థావరాలకు నీటి సరఫరా చేయడానికి అష్టకష్టాలు పడాల్సి రావడం రష్యాను ఆగ్రహానికి గురిచేసింది. వివాదానికి కేంద్ర బిందువైన ఆనకట్టను రష్యా సైనికులు బాంబులతో పేల్చివేశారు.
షరతులకు అంగీకరిస్తే సైనిక చర్య నిలిపివేత
తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరిస్తే మరుక్షణం సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా ప్రకటించింది. ఏ కూటమిలోనూ చేరే ఉద్దేశం లేదని ఆ దేశ రాజ్యాంగంలో సవరణ చేయాలని పట్టుపట్టింది. ఈ విషయాన్ని పుతిన్ పత్రికా వ్యవహారాల కార్యదర్శి దిమిత్రి పెస్‌కోవ్ వెల్లడించారు.
పొరుగు దేశాలకు ఉక్రెయిన్‌వాసుల వలస
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్ర మానవ సంక్షోభానికి దారితీస్తోంది. భీకర క్షిపణి, బాంబు దాడులతో దిక్కుతోచని స్థితిలోకి జారిపోయిన నిస్సహాయ పౌరులు పొట్టచేతబట్టుకొని పరాయి దేశాలకు వలసపోతున్నారు. రక్తపాతం, విధ్వంసానికి దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. యుద్ధం ఆరంభమైన 11 రోజుల్లోనే ఈ శరణార్థుల సంఖ్య 15 లక్షలు దాటిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఇంత భారీ స్థాయిలో వలసపోవడం ఇదే మొదటిసారని ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) తెలిపింది. ఈ సంఖ్య 70 లక్షలకు చేరొచ్చని ఐరోపా సంక్షోభ నిర్వహణ విభాగం కమిషనర్ పేర్కొన్నారు. 1.8 కోట్ల మంది ఉక్రెయిన్‌వాసులపై ఈ యుద్ధ ప్రభావం పడొచ్చని తెలిపారు. ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద శరణార్థి సంక్షోభంగా మారొచ్చని ఐరాస హెచ్చరించింది.
ఏయే దేశాలకు వెళుతున్నారు?
ఉక్రెయిన్ వీడేవారిలో ఎక్కువ మంది పశ్చిమాన ఉన్న పోలండ్, మాల్దోవా, స్లొవేకియా, రొమేనియా, హంగరీలకు వెళుతున్నారు. ఈ దేశాలు వీరి కోసం సరిహద్దులను తెరిచాయి. కొద్దిసంఖ్యలో రష్యా, బెలారస్‌కూ తరలిపోతున్నారు. వీరిలో దాదాపు లక్ష మంది ఈ దేశాల నుంచి ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి బ్రిటన్ ప్రధాని ఆరు సూత్రాల ప్రణాళిక
ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విఫలమయ్యేలా చూడాలని.. ఇందుకోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంతర్జాతీయ సమాజం ముందు ఆరు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. సైనిక చర్యతో ప్రపంచ ప్రస్తుత క్రమాన్ని (ఆర్డర్) మార్చాలని పుతిన్ పన్నుతున్న కుట్రలను ప్రపంచ నేతలు సంఘటితంగా ఎదుర్కోవాలని జాన్సన్ పిలుపునిచ్చారు.
ప్రతిపాదిత సూత్రాలు:
1. ప్రపంచ నేతలంతా ఉక్రెయిన్ కోసం అంతర్జాతీయ మానవతా కూటమిగా ఏర్పాటు కావాలి.
2. ఉక్రెయిన్ తనను తాను కాపాడుకోవటానికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాన్ని అందించాలి.
3. ఆర్థిక ఆంక్షలతో రష్యాపై మరింత ఒత్తిడి పెంచాలి.
4. ఉక్రెయిన్‌లో తాను చేస్తున్న దుశ్చర్యలను సాధారణ చర్యలుగా చూపించే రష్యా ప్రయత్నాలను నిలువరించాలి.
5. యుద్ధాన్ని ఆపేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి. ఈ ప్రక్రియలో ఉక్రెయిన్‌లోని చట్టబద్ధ ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండేలా చూడాలి.
6. నాటో కూటమిలోని దేశాల మధ్య భద్రతను మరింత పటిష్ఠం చేయాలి.
వీటిని కెనడా, డచ్ ప్రధానుల ముందు జాన్సన్ ప్రస్తావించనున్నారు. తర్వాత చెక్ రిపబ్లిక్, హంగరి, పోలండ్, స్లొవేకియా నాయకులతోనూ చర్చించనున్నారు.
ఉక్రెయిన్‌లో ‘నో-ఫ్లై జోన్’ అమలుకు నాటో తిరస్కృతి
ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్’గా అమలు చేయడానికి నాటో తిరస్కరించింది. రష్యా అణుశక్తితో.ఐరోపాలో విస్తృతస్థాయి యుద్ధానికి ఈ చర్య ప్రేరేపించే అవకాశం ఉందని హెచ్చరించింది. అమెరికా సహా ఇతర సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి నేతృత్వం వహించిన నాటో సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ అనంతరం మాట్లాడారు. రష్యా దాడులకు తెగబడుతుండటంతో ఉక్రెయిన్ ప్రజలు పడుతున్న బాధలను గుర్తించామన్నారు. ‘‘ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఎన్నడూ లేనంత విధ్వంసం కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. తాము ఉక్రెయిన్ భూభాగం లేదా గగనతలం జోలికి వెళ్లబోమన్నారు. ‘‘నో-ఫ్లై జోన్ అమలుకు ఉన్న ఏకైక మార్గం నాటో యుద్ధవిమానాలను ఉక్రెయిన్ గగనతలంలోకి పంపించడం. అనంతరం రష్యా విమానాలను కూల్చివేయడం.. అదే చేస్తే ఐరోపాలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని’’ పేర్కొన్నారు.
50 మందికి పైగా రష్యా సంపన్నులపై అమెరికా ఆర్థిక ఆంక్షలు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఉద్ధృతం చేస్తోన్న వేళ అమెరికా ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు వేసింది. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే పలురకాల నిర్ణయాలు తీసుకున్న అధ్యక్షుడు బైడెన్ తాజాగా 50 మంది రష్యా సంపన్నులు, వారి కుటుంబాలపై ఆంక్షలు విధించారు. ఇందులో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఆస్తులూ ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఈ సంపన్నులిక అమెరికాతో లావాదేవీలు జరపలేరు. ఆ దేశానికి రాకపోకలూ సాగించలేరు. ఆంక్షల జాబితాలో పుతిన్ సన్నిహితులుగా భావిస్తున్న అలిషర్ ఉస్మనోవ్, బోరిస్ అర్కాడీ, ఇగోర్ రాటెబన్‌బర్గ్ ఉన్నారు. అంతేకాదు.. పుతిన్ వంటగాడిగా పేరొందిన రష్యా కుబేరుడు యెవెగిన్ ప్రెగాజిన్‌ను ఈ జాబితాలో అమెరికా చేర్చింది. ప్రెగాజిన్‌కు హోటల్ వ్యాపారాలు ఉన్నాయి. మరోవైపు రష్యా సంపన్నుల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొనే కార్యక్రమాన్ని చాలా దేశాలు ప్రారంభించాయి. 600 మిలియన్ డాలర్ల విలువైన ఉస్మనోవ్ విహార నౌక ‘దిల్‌బర్’ను జర్మనీ జప్తు చేసినట్లు వార్తలు వచ్చాయి.
రష్యాలో కొత్త చట్టం
ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్ని వ్యాప్తి చేసేవారు ఇక జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రష్యా ‘బోగస్’ కథనాలుగా గుర్తించిన వాటిని రాసిన, ప్రసారం చేసినవారికి గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలుశిక్ష విధించేలా ఓ ముసాయిదా చట్టాన్ని రష్యా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రభుత్వ వార్తాసంస్థలు తెలిపాయి. దీన్ని అధ్యక్షుడు పుతిన్ ఆమోదిస్తే చట్టమవుతుంది. ఈ ప్రక్రియ ఒక్కరోజులోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు దిగువసభ స్పీకర్ తెలిపారు. దేశ సైనికులను, అధికారులను, విశ్వసనీయతను కాపాడేందుకే ఈ చట్టం తెస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా స్వతంత్ర మీడియాను, రష్యాపై వస్తున్న విమర్శలను అడ్డుకోవడానికే ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో బీబీసీ రష్యాలో తన మీడియా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. రష్యా ప్రభుత్వ వార్తాసంస్థలు ఉక్రెయిన్‌లో దాడులను ‘ప్రత్యేక సైనిక చర్య’గా మాత్రమే పేర్కొంటున్నాయి. ‘యుద్ధం’ లేదా ‘దురాక్రమణ’ వంటి పదాలను వాడటం లేదు.
భారత్‌పే ఎండీ అష్నీర్ రాజీనామా
ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేశారు. అడ్వైజరీ సంస్థ పీడబ్ల్యూసీ సమర్పించిన నివేదిక ఆధారంగా అతనిపై చర్యలు తీసుకోవడానికి బోర్డు సిద్ధం కావడంతో ఆయనే స్వచ్ఛందంగా వైదొలిగారు. బోర్డు సమావేశం అజెండాలో ఈ అంశం ఉందని తెలిసిన నిముషాల వ్యవధిలోనే అష్నీర్ రాజీనామా చేశారని భారత్‌పే వెల్లడించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అష్నీర్‌పై పీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. దీంతో ఆయన రాజీనామా లేఖ సమర్పించారు.
రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన అమెరికా
ఐక్యరాజ్య సమితి రష్యా మిషన్‌కు చెందిన 12 మంది దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది. వారంతా ‘గూఢచర్య కార్యకలాపాలకు’ పాల్పడుతూ.. అమెరికాలో తమ నివాస హక్కులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఐరాసకు, సంబంధిత రష్యా శాశ్వత మిషన్‌కు తెలియజేసినట్లు ఐరాస అమెరికా మిషన్ అధికార ప్రతినిధి ఒలివియా డాల్టన్ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యాలయ ఒప్పందం మేరకే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.