ప్రపంచ కిడ్నీ దినోత్సవం
మూత్రపిండాల వైఫల్య బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు మూత్రపిండాల పనితీరు నెమ్మదించేలా చేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు, ఇతర అవయవాల పనితీరు దెబ్బతినడమూ కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతోంది. తాగేనీరు, ఆహార అలవాట్లు కిడ్నీ వ్యాధులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. ఈ వ్యాధుల బారినపడుతున్న వారిలో యువత సంఖ్యా క్రమంగా పెరుగుతుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా మార్చిలో రెండో గురువారాన్ని ‘ఇంటర్నేషనల్ కిడ్నీ డే’గా గురిస్తున్నారు.
కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ
రాష్ట్రంలో మూత్రపిండాల వైఫల్యం కేసులు ఎక్కువగా కృష్ణా, శ్రీకాకుళం, ఇతర జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రస్తుతం సుమారు 11 వేల మంది రక్తశుద్ధి చేయించుకుంటున్నారు.
‣ దేశవ్యాప్తంగా మూత్రపిండ సంబంధిత వ్యాధిగ్రస్తులు: 10 కోట్ల మంది
‣ ఏటా కొత్తగా వీటి బారినపడుతున్నవారు సుమారుగా: 2 లక్షలు
‣ దేశంలో 2001 - 03 మధ్య కిడ్నీ వ్యాధులతో మరణించినవారి సంఖ్య ఆ తర్వాత పదేళ్లలో (2010 - 13 నాటికి) 38% పెరిగినట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రకటించింది.
సీఐఎస్‌ఎఫ్ 53వ వ్యవస్థాపక దినోత్సవం
దేశంలో హైబ్రిడ్ భద్రతా విధానం ఉండాలని, ఈ విధానంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) ప్రైవేటు భద్రతా సంస్థలకు శిక్షణ, గుర్తింపు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు. ఫలితంగా ఆయా ప్రైవేటు సంస్థలు వివిధ రకాల పారిశ్రామిక, తయారీ కేంద్రాలకు సమర్థంగా రక్షణ కల్పించగలవని అభిప్రాయపడ్డారు. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు 1969లో ఏర్పడిన సీఐఎస్‌ఎఫ్ మౌన ‘కర్మయోగి’లా పనిచేస్తోందని, ప్రైవేటు తయారీ సంస్థలకు భద్రత కల్పిస్తోందని చెప్పారు. ఫలితంగా భారత్ 2.5 ట్రిలియన్ డాలర్ల బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. 2.5 ట్రిలియన్ డాలర్ల నుంచి దేశం 5 ట్రిలియన్ డాలర్లకు ప్రయాణించాలంటే.. దేశంలో తయారీ రంగంలో అనేక కేంద్రాలను ఏర్పాటుచేయాలని, ఫలితంగా సీఐఎస్‌ఎఫ్ కొత్త సవాళ్లను ఎదుర్కోనుందని తెలిపారు. 1.64 లక్షల మందితో బలమైన దళంగా ఉన్న సీఐఎస్‌ఎఫ్ త్వరలో తన పాత్రను మరింత విస్తరించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయన సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడారు. ప్రైవేటు భద్రతా సంస్థల పని వేగంగా పెరుగుతోంది. మేం వాటి పనితీరుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించాం అని షా పేర్కొన్నారు.