పుస్తకాలు

‘పోలియో’ పుస్తకావిష్కరణ

భారత వైరాలజీ పితామహుడిగా పేరొందిన డాక్టర్‌ టి.జాకబ్‌ జాన్, ముంబయికి చెందిన పీడియాట్రీషియన్‌ డాక్టర్‌ ధన్య ధర్మపాలన్‌లు సంయుక్తంగా రాసిన ‘పోలియో’ పుస్తకావిష్కరణ జరిగింది. పోలియో గురించి ప్రజలకు అవగాహన పెంచడానికే తాను పుస్తకం రాసినట్లు శాస్త్రవేత్త జాకబ్‌ జాన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల కూడా పాల్గొన్నారు.

విశ్వనాథ్‌ ఆత్మకథ ‘రిస్ట్‌ అష్యూర్డ్‌’ ఆవిష్కరణ

మాజీ కెప్టెన్, భారత క్రికెట్లో గొప్ప బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరున్న గుండప్ప విశ్వనాథ్‌ ఆత్మకథ ‘రిస్ట్‌ అష్యూర్డ్‌’ను బెంగళూరులో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సీనియర్‌ పాత్రికేయుడు కౌశిక్‌ సహ రచయిత. దిగ్గజ ఆటగాళ్లు కపిల్‌దేవ్, సునీల్‌ గావస్కర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. క్రికెట్‌ అభిమానిగా తాను తీసుకున్న మొదటి అటోగ్రాఫ్‌ విశ్వనాథ్‌దేనని కపిల్‌ అన్నాడు. 71 ఏళ్ల విశ్వనాథ్‌ భారత్‌ తరఫున 91 టెస్టుల్లో 6080 పరుగులు చేశాడు.

‘ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకావిష్కరణ

దర్శనమ్‌ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో జరిగిన మరుమాముల దత్తాత్రేయ శర్మ రచించిన ‘ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ముట్నూరి సామాజిక స్పృహ, దేశభక్తి కలిగిన వ్యక్తి అని, ఆయన సంపాదకీయాలు అగ్నికీలల్లాంటివని అని ఉపరాష్ట్రపతి కొనియాడారు.

‘భారతదేశం పక్షాన’ పుస్తకావిష్కరణ

అమెరికా యాత్రికుడు విల్‌ డ్యురంట్‌ రాసిన ‘ద కేస్‌ ఫర్‌ ఇండియా’ పుస్తకాన్ని అలకనంద ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో ‘భారతదేశం పక్షాన’ పేరిట నాదెళ్ల అనూరాధ తెలుగులోకి అనువదించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విష్కరించారు. ప్రచురణకర్త అశోక్‌కుమార్‌.