అవార్డులు

బ్రిటిష్‌ పురస్కారం అందుకున్న డాక్టర్‌ రఘురాం

బ్రిటిష్‌ ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)’ను తెలంగాణకు చెందిన ప్రముఖ రొమ్ము వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ రఘురాం అందుకున్నారు. బ్రిటిష్‌ రాజ కుటుంబం నివసించే విండ్సర్‌ క్యాజిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్స్‌ ఛార్లెస్‌ ఈ అవార్డును డాక్టర్‌ రఘురాంకు అందజేశారు. యూకేలో అత్యున్నత పురస్కారం ‘నైట్‌ హుడ్‌’ కాగా దాని తర్వాత రెండో అత్యున్నత పురస్కారం ఓబీఈ. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దీన్ని అందజేస్తారు. భారత్‌లో రొమ్ము క్యాన్సర్‌ నివారణ, చికిత్స, అవగాహనలో డాక్టర్‌ రఘురాం అందిస్తున్న విశేష సేవలకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు గత ఏడాది బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించింది.

జాతీయ జల అవార్డుల ప్రదానం

ప్రభుత్వ జల సంరక్షణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాలని జిల్లా అధికార యంత్రాంగాలు, సర్పంచులకు సూచించారు. పలు రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలు, పాఠశాలలు లాంటివాటికి జాతీయ జల అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ‘జల్‌శక్తి అభియాన్‌ : వర్షపునీటిని ఒడిసిపట్టే ఉద్యమం 2022’ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇదే రీతిలో జల సంరక్షణను కూడా అత్యంత పెద్ద ఉద్యమంగా చేయాలి అని పిలుపునిచ్చారు. నీటి సంక్షోభం వాతావరణ మార్పుల కంటే కూడా పెద్ద సమస్యగా మారిందన్నారు. అవార్డు గ్రహీతలను అభినందించిన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌.. ఈ అవార్డులు జల వనరుల సంరక్షణకు కొత్త శక్తినిస్తాయన్నారు.

జాతీయ జల అవార్డులు:-
ఉత్తమ రాష్ట్రాలుగా ఉత్తర్‌ప్రదేశ్‌ (ప్రథమ), రాజస్థాన్‌ (ద్వితీయ), తమిళనాడు (తృతీయ) నిలిచాయి. జిల్లాల విభాగంలో దక్షిణ జోన్‌లో కడప (ఆంధ్రప్రదేశ్‌) ద్వితీయ స్థానం దక్కించుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు జల సంరక్షణలో ఉత్తమ సంస్థ అవార్డు సాధించింది.


అవాన్‌ సైకిల్స్‌కు ప్రెస్టీజియస్‌ బ్రాండ్స్‌ ఆఫ్‌ ఆసియా అవార్డు

అవాన్‌ సైకిల్స్‌కు ప్రెస్టీజియస్‌ బ్రాండ్స్‌ ఆఫ్‌ ఆసియా అవార్డు లభించింది. 70 వసంతోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో ఈ గుర్తింపు లభించడం పట్ల సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ఏళ్ల పాటు శ్రమ, విశ్వాసం, అంకితభావానికి ఫలితమే ‘ప్రెస్టీజియస్‌ బ్రాండ్స్‌ ఆఫ్‌ ఆసియా అవార్డ్స్‌ 2022’ లభించిందని అవాన్‌ సైకిల్స్‌ సీఎండీ ఓంకార్‌ సింగ్‌ పహ్వ పేర్కొన్నారు.

ఆరు అవార్డులు సొంతం చేసుకున్న ఫిక్షన్‌ సినిమా ‘డ్యూన్‌’

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. 10 విభాగాల్లో నామినేట్‌ అయిన ఫిక్షన్‌ చిత్రం ‘డ్యూన్‌’ ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. భిన్నమైన కామెడీ డ్రామాగా రూపొందిన ‘కోడా’ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ నటీగా జెస్సీకా చాస్టెయిన్‌(ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ), ఉత్తమ నటుడిగా విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌) గుర్తింపు పొందారు.

65 మందికి పద్మ పురస్కారాల ప్రదానం

వివిధ రంగాల్లో సేవలందించిన 65 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు.

దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌కు మరణాంతరం ప్రకటించగా.. ఆయన తనయుడు, ఎంపీ రాజీవ్‌ సింగ్‌ స్వీకరించారు.

శాస్త్రీయ సంగీత గాయని ప్రభ ఆత్రే కూడా పద్మవిభూషణ్‌ అందుకున్నారు. కరోనా వైరస్‌కు దేశీయ టీకా ‘కొవాగ్జిన్‌’ను తయారుచేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులిద్దరికీ సంయుక్తంగా పద్మభూషణ్‌ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు.

బెంగాలీ నటుడు విక్టర్‌ బెనర్జీ కూడా పద్మభూషణ్‌ అందుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌లకు పద్మభూషణ్‌ ప్రకటించగా.. వారు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

ఒలింపిక్స్‌లో దేశానికి తొలి వ్యక్తిగత బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా పద్మశ్రీ అందుకున్నారు.

పద్మశ్రీ అందుకున్న తెలుగువారిలో ప్రముఖ సినీనటి షావుకారు జానకి, కూచిపూడి నృత్యకారిణి పద్మజారెడ్డి, కోయ గిరిజనగాయకుడు రామచంద్రయ్య ఉన్నారు.


జెట్‌సెట్‌గో ఏవియేషన్‌కు వింగ్స్‌ ఇండియా 2022 అవార్డు

ప్రైవేట్‌ జెట్‌ విమాన సేవలు అందించే సంస్థ జెట్‌సెట్‌గో ఏవియేషన్‌కు వింగ్స్‌ ఇండియా 2022 అవార్డు లభించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ సీఈఓ కనికా టేక్రివాల్‌ స్వీకరించారు. పౌర విమానయాన సేవల్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్న సంస్థలు, కంపెనీలను గుర్తించి ఈ అవార్డులు బహూకరించారు. వింగ్స్‌ ఇండియా 2022 సదస్సులో జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ పాల్గొని తన లెగసీ 600 వీటీ-ఎస్‌ఎఫ్‌యూ, హాకర్‌ ఎక్స్‌పీ 800 వీటీ-పీఓపీ విమానాలను ప్రదర్శించింది.

కేబుల్‌ బ్రిడ్జి అవుట్‌ స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌కు గుర్తింపు

తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్‌ జిల్లాలో నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి అవుట్‌ స్టాండింగ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్‌-2021 అవార్డును దక్కించుకుంది. దీన్ని ఇండియన్‌ కాంక్రీట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవల రహదారుల భవనాలశాఖకు అందజేసింది. ఆ శాఖ ఈఎన్సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డిలు రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఈ అవార్డును అందుకున్నారు.

భారజల ప్లాంటుకు పురస్కారం

భారజల ప్లాంటు మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బెస్ట్‌ ప్లాంట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఫర్‌ డైవర్శిఫైడ్‌ యాక్టివిటీస్‌ అవార్డును సొంతం చేసుకుంది. డీఏఈ క్రీడా సాంస్కృతిక ముగింపు పోటీల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన భారజల బోర్డు ఛైర్మన్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జితేంద్ర శ్రీవాత్సవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం భారజల ప్లాంటు కార్యాలయంలో ఈ అవార్డును జీఎం జి.సతీశ్‌కు, ఉద్యోగసంఘాల నాయకులకు అందజేశారు.

క్షయ నిర్మూలనలో తెలంగాణకు 3 పురస్కారాలు

క్షయ (టీబీ) నిర్మూలనకు చేస్తున్న కృషికి గుర్తింపుగా నిజామాబాద్‌ జిల్లాకు వెండి పతకం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కాంస్య పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు వాటిని అందుకున్నారు.

ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ పురస్కారాల ప్రదానం

దేశవ్యాప్తంగా విభిన్న రంగాల్లో విశేష విజయాలు సాధించిన 75 మంది మహిళలకు నీతి ఆయోగ్‌ ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్డులను ప్రదానం చేసింది. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్‌కు చెందిన విజయ స్విత (చేతివృత్తుల వారికి అందించిన సేవలకు గుర్తింపు), అను ఆచార్య (ఆరోగ్య రంగం), రూప మాగంటి (గ్రీన్‌ తత్వ), తనూజా అబ్బూరి (పారిశ్రామికవేత్త) ఉన్నారు.

దక్షిణ డిస్కంకు రెండు అవార్డులు

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)కు రెండు గ్రీన్‌ ఎనర్జీ అవార్డులు లభించాయి. సంప్రదాయేతర ఇంధనం (రెన్యూవబుల్‌ ఎనర్జీ) విభాగంలో ప్రథమ బహమతి, వినూత్న ప్రాజెక్టులు, జ్యూరీ ఛాయిస్‌ (డీసెంట్రలైజ్డ్‌ సోలార్‌ జనరేషన్‌) కేటగిరీలో ద్వితీయ బహమతి లభించింది. ఈ రెండు అవార్డులను ఆన్‌లైన్‌ వేదిక ద్వారా జరిగిన పదో ఐసీసీ గ్రీన్‌ ఎనర్జీ సదస్సు, రెండో గ్రీన్‌ ఊర్జా, ఎనర్జీ ఎఫీషియన్సీ సమావేశంలో సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి అందుకున్నారు.

2022 పద్మ పురస్కారాల ప్రదానం

-రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విడతలవారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు మరణానంతరం పద్మ విభూషణ్‌ ప్రకటించగా ఆయన కుమార్తెలు క్రితిక, తరణి అవార్డును అందుకున్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పద్మ భూషణ్‌ అవార్డును స్వీకరించారు.

- 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు పురస్కారాలను స్వీకరించారు. భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్‌ హుస్సేన్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన మనవడు షేక్‌ హిలమ్‌ షా ఉద్దీన్‌ అందుకున్నారు.


పద్మ అవార్డులు-2022 పీడీఎఫ్‌

75 మంది మహిళలకు నీతి ఆయోగ్‌ అవార్డుల ప్రదానం దృఢమైన, సమర్థమైన దేశనిర్మాణంలో భాగస్వాములైన 75 మంది మహిళలకు నీతి ఆయోగ్‌ ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా-21 (డబ్ల్యూటీఐ) అవార్డులు అందజేసింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సంఘసేవ, తయారీ రంగం, కళలు, డిజిటల్‌ ఇన్నొవేషన్, పర్యావరణ పరిరక్షణ తదితర ఏడు విభాగాల్లో విజయవంతమైన వారిని ఇందుకు ఎంపిక చేసింది. అవార్డు గ్రహీతల్లో కిరణ్‌ బేడీ, అరుంధతీ భట్టాచార్య, దేవయానీ ఘోష్, షైనీ విల్సన్, లవ్లీనా, రంజితా కాంత్, సిమ్రంజిత్‌ కౌర్, పరిణీతి నాయక్, రోహిణి (మైక్రోసాఫ్ట్‌), హర్దికా షా (కినరా క్యాపిటల్స్‌), జో అగర్వాల్‌ (టచ్‌కిన్‌), కుష్బూ అవతి (మంత్ర), క్రితి పూనియా (ఓకాహి), మాలినీ పారిహర్‌ (స్టోన్‌ షూ), మెహా లాహిరి (రెసిటీ నెట్‌వర్క్‌), నీలం చియిబర్‌ (ఇండస్ట్రీ క్రాప్ట్‌), నీతూ యాదవ్‌ (అనిమోల్‌ టెక్నాలజీస్‌), నేహా సాతక్‌ (అస్ట్రాన్‌ టెక్నాలజీస్‌), నిమిశా వర్మ (అలోయ్‌ ఎసెల్‌), ప్రీతి రావ్‌ (వీజీ), నిషా జైన్‌ గ్రోవర్‌ (వాత్సల్య ఎడ్యుకేషన్‌ సొసైటీ), సుప్రియా పాల్‌ (జోస్‌ టాక్స్‌), సుమిత మహంతి (ఎర్త్‌ టు ఆర్బిట్‌), రాధికా బాత్రా (ఎవ్రీ ఇన్‌ఫాంట్‌ మేటర్స్‌), రిచా సింగ్‌ (యువర్‌ దోస్త్‌ హెల్త్‌) తదితరులున్నారు.

75 మంది అసాధారణ మహిళలకు అవార్డులు

-‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశంలోని 75 మంది అసాధారణ మహిళలకు అవార్డులు అందజేయనున్నట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది. ‘సశక్తి ఔర్‌ సమర్థ్‌ భారత్‌’ నిర్మాణంలో వీరి భాగస్వామ్యానికిగాను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ‘ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా - 21’ (డబ్ల్యూటీఐ-21) పేరిట అందించే ఈ అవార్డుల 5వ ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 21న దిల్లీ వేదికగా జరగనుంది.

- సంఘ సేవ, తయారీ రంగం, ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఉత్పత్తులు, కళలు, సాంస్కృతిక రంగం, హస్తకళలకు చేయూత, డిజిటల్‌ ఇన్నోవేషన్‌ వంటి ఏడు కేటగిరీల్లో చూపిన ప్రతిభ ప్రాతిపదికగా ఓ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. అవార్డు గ్రహీతల్లో అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టరు డాక్టర్‌ సంగీతారెడ్డి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి, ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య, దూరదర్శన్‌ మాజీ న్యూస్‌ యాంకర్‌ సల్మా సుల్తాన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు.


డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ఏజీఏ పురస్కారం

-ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌(ఏజీఏ) అందించే విశిష్ట విద్యావేత్త పురస్కారానికి ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రుల ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి ఎంపికయ్యారు. తొలిసారిగా ఓ భారతీయ వైద్యుడికి ఈ అవార్డు దక్కింది. మే 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే ‘డైజెస్టివ్‌ డిసీజ్‌ వీక్‌ కాన్ఫరెన్స్‌’లో డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

- ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఏజీఏ.. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే శాస్త్రవేత్తలు, వైద్యులకు పురస్కారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత వైద్య విభాగంలో విశిష్ట విద్యావేత్త పురస్కారం కోసం డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డిని ఎంపిక చేసింది. ఎండోస్కోపిక్‌ వైద్య విధానంలో డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి పలు సేవలు అందించారు.


సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న గోరటి

ప్రజాగాయకుడు, కవి, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అకాడమీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార ఈ అవార్డును వెంకన్నకు ప్రదానం చేశారు. ఆయన రాసిన వల్లంకి తాళం కవితా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. ‘‘వల్లంకి తాళం గేయగాఢతకు నెలవైన కవితల సంపుటి. అందులోని కవితలు మానవునికి తన పరిసరాలతో ఉన్న బహుముఖ సంబంధాలను వర్ణిస్తాయి. ఆ కవితలు మానవానుభూతులను వెదజల్లుతూ, అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని ఇముడ్చుకున్నాయి. అవి పాఠకులను వినూత్న, శక్తిమంతమైన ప్రపంచానుభవంలోకి తీసుకుపోతాయి. భారతీయ కవిత్వానికి తెలుగు నుంచి గొప్ప బహుమతి ఈ కవితా సంపుటి’’ అని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రశంసించింది.

స్కోచ్‌ అవార్డుల్లో ఏపీ పోలీస్‌కు జాతీయ స్థాయిలో మొదటి స్థానం

పోలీసు, రక్షణ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. స్కోచ్‌ జాతీయ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన 56 అవార్డుల్లో పోలీసు శాఖ 23 అవార్డుల్ని సొంతం చేసుకుంది. స్వర్ణంతో పాటు 8 రజత పతకాలు సాధించింది. మహిళలకు భద్రత, నిర్ణీత సమయంలో ఛార్జిషీట్ల దాఖలు, పోలీసు శాఖ పరిపాలనలో పూర్తి స్థాయి డిజిటలైజ్‌ విధానం, క్లిష్టమైన కేసులను ఛేదించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

ప్రసన్నశ్రీకి నారీశక్తి పురస్కారం ప్రదానం

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సత్తుపాటి ప్రసన్నశ్రీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా నారీశక్తి - 2021 పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2020, 2021 సంవత్సరాలకు కలిపి మొత్తం 28 మందికి రాష్ట్రపతి పురస్కారాలు అందించగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రసన్నశ్రీ ఒక్కరే ఉన్నారు. ఏయూలో ప్రొఫెసర్, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఈమె అల్పసంఖ్యాక గిరిజన భాషల సంరక్షణకు కృషిచేస్తూ వాటికి లిఖిత రూపాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆమె భగత, గడభా, కోలమి, కొండ, దొరలాంటి 19 గిరిజన భాషలకు అక్షరాలు, సంఖ్యలను రూపొందించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. మహిళలపై పలు పుస్తకాలు రాశారు. ‘వరల్డ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఎండేజర్డ్‌ ఆల్ఫాబెట్స్, యూఎస్‌ఏ (2019)’ గుర్తింపు పొందిన తొలి భారతీయ, ఆసియా మహిళగా పేరొందారు.

నర్సంపేట మహిళా సమాఖ్యకు జాతీయ అవార్డు

మహిళా సంఘాల బలోపేతంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వరంగల్‌ జిల్లా నర్సంపేట మండల సమాఖ్యకు జాతీయస్థాయి ‘ఆత్మనిర్భర్‌ సంఘటన్‌’ అవార్డు దక్కింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌Ä శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేతుల మీదుగా సమాఖ్య ప్రతినిధులు రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. సమాఖ్య పరిధిలోని 39 వీవోలు, 976 ఎస్‌హెచ్‌జీలు వంద శాతం రుణరికవరీ చేయడంతో పాటు అన్ని పొదుపు సంఘాలు ఏ, బీ గ్రేడులు సాధించడం, ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి రుణాల పంపిణీకి గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వైద్య సిబ్బందికి ఉత్తమ వ్యాక్సినేటర్‌ అవార్డులు

తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వైద్య సిబ్బంది ఉత్తమ వ్యాక్సినేటర్‌ అవార్డులు అందుకున్నారు. దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక మందికి అత్యధికులకు కొవిడ్‌ వ్యాక్సిన్లు అందించిన 72 మంది వైద్య సిబ్బందికి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు అందజేశారు. ఇందులో తెలంగాణ నుంచి ఎన్‌.ప్రశాంతి, టి.హేమలత, ఏపీకి చెందిన చిల్లా ఉమామహేశ్వరి, కుమ్మరి మోహనమ్మ ఉన్నారు.

తెలంగాణలో హరిత పురస్కారాలు

హరితహారంలో భాగంగా మెుక్కలు నాటిన పలు సంస్థల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ హరిత పురస్కారాలు అందించారు. ఐటీసీ పేపర్‌ బోర్డ్స్, హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం, కన్హా శాంతివనం, ప్రగతి రిసార్ట్స్, సైయెంట్, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ నాచారం, ఐఐటీ హైదరాబాద్, బోయినపల్లి కేంద్రీయ విద్యాలయ, గీతం విశ్వవిద్యాలయం, పార్శిజొరాస్ట్రియన్, ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూలు తదితర సంస్థలు పురస్కారాలు పొందాయి.